తెలుగు పాశస్త్యంపై జరిగిన సాహితీ గోష్ఠి విశేషాలు

శనివారం (28-3-2009 న) హైదరాబాదు సాలార్ జంగ్ మ్యూజియమ్ లో తెలుగు పాశస్త్యంపై సాహితీ గోష్ఠి జరిగింది. కేంద్ర పభుత్వం తెలుగుకి ప్రాచీన హోదా ప్రకటించిన సందర్భంగా, విరోధి నామ సంవత్సర వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని సాలార్ జంగ్ మ్యూజియం వారు ఏర్పాటు చేశారు. వివిధ విశ్వవిద్యాలయాల, కళాశాలల, సంస్థల నుండి కవులను, సాహితీ వేత్తలను సమావేశానికి ఆహ్వానించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం లో సుదీర్ఘ కాలం పాటు తెలుగు శాఖలో అధ్యక్షులుగా పనిచేసిన ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారి అధ్యక్షతన రెండు విభాగాలుగా ఈ కార్యక్రమం జరిగింది. ఆయన అధ్యక్షతనే జరిగిన మొదటి సమావేశంలో సమాచార చట్టం కమీషనర్ ఆర్.దిలీప్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని తెలుగు భాషా పరిణామాన్ని వివరించారు. సామాన్యుడికి కూడా భాష అందుబాటులోకి రాగలిగినప్పుడే ఆ భాషకు నిజమైన సార్థకత అన్నారు. సభకు అధ్యక్షత వహించిన ఆచార్య ఎల్లూరి శివారెడ్డి తెలుగు భాష, సాహిత్య వికాసాలను సోదాహరణంగా వివరించి, పద్యం,గద్యం, ప్రాచీన, ఆధునిక భాషాసాహిత్యాలను ఆదరించుకోవలసిన ఆవశ్యకతను తెలిపారు.సాలార్ జంగ్ మ్యూజియమ్ డైరెక్టర్ డా//.నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ మ్యూజియమ్ గైడ్ ని తెలుగులో అనువదిస్తున్నామని, తెలుగు అనువాదం లో గల సమస్యలను చర్చించారు. సమావేశంలో NITHM, డైరెక్టర్ జనరల్ డా//ఎకెవిఎస్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ మాజీ సభ్యులు డా.టి.వి. నారాయణ, Dr. VV Krishna Sastry, Former Director, Dept. of Archaeology & Museums, Govt of AP తదితరులు పాల్గొన్నారు. సమావేశాన్ని సాలార్ జంగ్ మ్యూజియమ్ ఉద్యోగి శ్రీ మల్లం వీరేందర్ చక్కని సమన్వయంతో నిర్వహించారు. అతిశయోక్తులకు, పొగడ్తలకు పోకుండా విషయంపైనే దృష్టి కేంద్రీకరించడం ఈ సమావేశం ప్రత్యేకతల్లో ఒకటి.
.

సాహితీ గోష్ఠిలో పాల్గొన్న కొంతమంది సాహితీవేత్తలు ఎడమ వైపు నుండి వరసగావీరేందర్, వడ్లూరి ఆంజనేయరాజు, పగడాల చంద్రశేఖర్, జయరాములు తదితరులు అలాగే కుడి వైపు నుండి ఎడమ వైపుకి వరసగా ఆచార్య ఫణీంద్ర, దార్ల వెంకటేశ్వరరావు తదితరులు.



రెండవ సమావేశం గా జరిగినతెలుగు పాశస్త్యంపై సాహితీ గోష్ఠి కి కూడా ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారే అధ్యక్షత వహించారు. మొదట ఉస్మానియా విశ్వ విద్యాలయం తెలుగు ఆచార్యులు ననుమాస స్వామి వచన కవితతో సాహితీ గోష్ఠి ప్రారంభమైంది. ఎన్నికలను, ఉగాదినీ, తెలుగు ప్రాచీన హోదాని కలిపి ముప్పేటలా రాసిన ఓ విరోధీ నిన్నెప్పుడూ చూడలే! పేరుతో రాసిన వచన కవితను వినిపించారు.అంతర్జాతీయ సర్వేలు మాతృభాషలు నశించిపోతాయని చెప్పేవాటిని నమ్మొద్దనీ, జాతి బతికున్నంత కాలం మాతృభాష బతుకుంటుందనే ఆశా భావాన్ని వ్యక్తం చేశారు. ( పూర్తి కవితను త్వరలోనే అందిస్తాను)

తర్వాత సెంట్రల్ యూనివర్సిటి తెలుగు అధ్యాపకుడు, కవి డా//దార్ల వెంకటేశ్వరరావు తెలుగు గుండెల్లో క్లాసికల్ గుబులు వచన కవితను చదివారు. ప్రజల భాషగ తెలుగు భాష ఉండాలని, కృతకమైన గ్రాంథిక భాష కంటే, నేటి అవసరాలకు అనుగుణమైన తెలుగు విస్మరించవద్దని సూచించారు.( పూర్తి కవిత త్వరలోనే అందిస్తాను)

డా//ఆచార్య ఫణీంద్ర తెలుగు ప్రాశస్త్యాన్ని వివరిస్తూ చెప్పిన పద్యాలు ఆకట్టుకున్నాయి. వీరితో పాటు డా// ఆంజనేయ రాజు, డా. రాధశ్రీ ల పద్యాలు కూడా బాగున్నాయి.



కవిత చదువుతున్న డా//దార్ల వెంకటేశ్వరరావు వేదికపై సమాచార చట్టం కమీషనర్ ఆర్.దిలీప్ రెడ్డి, ఉస్మానియా విశ్వవిద్యాలయం, తెలుగు శాఖ మాజీ అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, సాలార్ జంగ్ మ్యూజియం ఉద్యోగి శ్రీ ఎం. వీరేందర్ తదితరులు



డా//దార్ల వెంకటేశ్వరరావు ని సన్మానిస్తున్న సమాచార చట్టం కమీషనర్ ఆర్.దిలీప్ రెడ్డి, ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, శ్రీ వీరేందర్ తదితరులు

తెలుగు భాషకు ఎక్కడైనా ఉపయోగించుకొనే అనుకూలమైన సాఫ్ట్ వేర్ ఆవశ్యకత కోసం ప్రయత్నించవలసిన అవసరాన్ని తన ప్రసంగంలో వివరిస్తున్న పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అధ్యాపకుడు డా//పగడాల చంద్రశేఖర్

కవిత చదివిన తర్వాత Former Director, Dept. of Archaeology & Museums, Govt of AP, డా// వి.వి.కృష్ణశాస్త్రి తో ముచ్చటిస్తున్న డా// దార్ల వెంకటేశ్వరరావు



కవిత చదవడానికి ముందు ఆచార్య ననుమాస స్వామి తో ముచ్చటిస్తున్న దార్ల




సమావేశంలో మాట్లాడుతున్న డా//టి.వి. నారాయణ


కవిత చదువుతున్న డా//ఆచార్య ఫణీంద్ర

సమావేశానికి హాజరైన కొంతమంది ప్రేక్షకులు








అందరికీ ఉగాది శుభాకాంక్షలు- ఈ నెల 28 న సాహితీ గోష్ఠి

తెలుగును ప్రాచీన భాషగా గుర్తించిన సందర్భంగా హైదరాబాదు సాలార్ జంగ్ మ్యూజియం, లెక్చర్ హాల్ లో 28-3-2009 తేదీ సాయంత్రం 5 గంటలకు తెలుగు పాశస్త్యం పై సాహితీ గోష్టి నిర్వహైస్తున్నారు. విరోధి నామ సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో కింది ఆహ్వాన పత్రంలో పేర్కొన్న వాళ్ళు పాల్గొంటున్నారు.



తెలుగు కథానిక, నవల : సామాజిక జీవిత చిత్రణ జాతీయ సదస్సు ,ఫోటోలు

హైదరాబాదు విశ్వవిద్యాలయం, తెలుగు శాఖ వారు మార్చి 13 నుండి 14 వతేదీ వరకూ జాతీయ సదస్సుని నిర్వహించారు. దీనిలో ప్రముఖ కథారచయిత ఆచార్య కేతు విశ్వనాథ రెడ్డి, ఆచార్య బేతవోలు రామబ్రహ్మం, ఆచార్య తుమ్మల రామకృష్ణ, డా//రామకృష్ణ శాస్త్రి, డా// పి. రాములు, డా//దార్ల వెంకటేశ్వరరావు, ఆచార్య మోహన్ జి.రమణన్, ఆచార్య పరిమి రామ నరసింహం, ఆచార్య కాత్యాయినీ విద్మహే, డా// గోనానాయిక్, డా// మృణాలిని తదితరులు పాల్గొని వివిధ అంశాలపై పత్రాలను సమర్పించారు.

పంచమం నవలలో దళిత ఉద్యమం గురించి మాట్లాడుతున్న డా//దార్ల వెంకటేశ్వరరావు


పంచమం నవలలో దళిత ఉద్యమం గురించి డా//దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడిన తర్వాత చర్చలో పాల్గొన్న ద్రావిడ విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్య పి.సుబ్బాచారి, కూర్చున్న వారిలో ఆచార్య ఉమామహేశ్వరరావు తదితరులు

పంచమం నవలలో దళిత ఉద్యమం గురించి డా//దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతున్నప్పుడు సదస్సు సమావేశంలో ఉన్న ఆచార్య తుమ్మల రామకృష్ణ, ఆచార్య రమణ (అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం)ఆచార్య ఉమామహేశ్వరరావు,డా//భీమయ్య తదితరులు
జాతీయ సదస్సులో ఒక సమావేశానికి ఆహ్వానం పలుకుతున్న డా// దార్ల , వేదిక పై సింగమనేని నారాయణ, ఆచార్య ముదిగంటి సుజాతా రెడ్డి తదితరులు
సదస్సులో పాల్గొన్న డా// సునీతారాణి( ఇంగ్లీషు డిపార్ట్ మెంట్,), డా//మధురాంతకం నరేంద్ర, డా//సర్రాజు తదితరులు
సదస్సులో పత్రసమర్పణ చేస్తున్న ఆచార్య పరిమి రామ నరసింహం

సదస్సులో పత్రసమర్పణ చేస్తున్న డా//మృణాలిని
సదస్సులో అధ్యక్ష్యోపన్యాసం చేస్తున్న ఆచార్య బేతవోలు రామబ్రహ్మం



సదస్సులో పత్రసమర్పణ చేస్తున్న పరిశోధక విద్యార్థి జరుపుల రమేష్
ఒక సమావేశానికి సభాధ్యక్షత వహించిన డా//రామకృష్ణ శాస్త్రి


సదస్సు అనంతరం ఆచార్య కేతు విశ్వనాథ రెడ్డి గారితో డా//సునీతారాణి, ఆచార్య ఉమ, డా//దార్ల తదితరులు
సదస్సు అనంతరం ఆచార్య కేతు విశ్వనాథ రెడ్డి గారితో చర్చిస్తున్న డా//దార్ల
సదస్సు లో కీలకోపన్యాసం చేస్తున్న ఆచార్య కేతు విశ్వనాథ రెడ్డి
పంచమం నవల లో గల దళిత ఉద్యమం గురించి జరిగిన చర్చలో పాల్గొన్న డా//దార్ల
పరిశోధక విద్యార్థి మద్దిరాల సిద్దార్థ
సదస్సు ప్రారంభానికి ముందు సమావేశంలో కూర్చున్న వారు వరసగా ఆచార్య కేతు, ఆచార్య మోహన్.జి.రమణన్, ఆచార్య బేతవోలు తదితరులు
పరిశోధక విద్యార్థి మద్దిరాల సిద్దార్థ, పి.జి.విద్యార్థి రత్నాకర్

మహీ బ్లాగ్ ఫోరమ్ కి అభినందనలు!

ఇంతకు ముందు కంప్యూటర్ ఎరా లో నల్లమోతు శ్రీధర్ గారు కంప్యూటర్ కి సంబంధించిన సాంకేతికాలను సులభంగా వివరించేవారు. అలాగే ఇప్పుడు Boreddy Mahesh Reddy గారు మహీగ్రాఫిక్స్ పేరుతో మరింత సులువుగా బ్లాగ్ టెక్నిక్స్ వివరిస్తున్నారు. ఆయనే ఇప్పుడు సాంకేతిక సలహాదారులను అందరినీ ఒక చోటకు తీసుకొచ్చే పనిలో భాగం అన్నట్లు మహిబ్లాగ్ ఫోరమ్ ఏర్పాటు చేశారు. దానిలో చాలా మంచి సౌకర్యాలున్నాయి. మీరు కూడా ఒక సారి చూడండి. మహేశ్ గారికి అభినందనలతో...దార్ల



మహీగ్రాఫిక్స్ బ్లాగ్ ఫోరమ్ ముఖచిత్రం కూడా చాలా ఆకర్శణీయంగా ఉంది చూడండి!

బ్రాహ్మణత్వం అనే పారిభాషిక పదం సరైనదేనా?

చిలుకూరి దేవపుత్ర రాసిన పంచమం నవలను హైదరాబాదు బుక్ ట్రస్టువాళ్ళు ప్రచురిస్తూ ఆ నవల ముఖ చిత్రం పై ఏమని ప్రకటించారు? అలాప్రకటించిన దానికి ఆధారం ఏమిటి? దళిత సాహిత్యం లో ప్రయోగంలో ఉన్న బ్రాహ్మణత్వం అనే పారిభాషిక పదం సరైనదేనా? ఇలాంటి అంశాలను చర్చిస్తూ రాసిన ఒక వ్యాసం చదవాలని ఉందా? త్వరలోనే ఈ బ్లాగులో చూడండి.

దళిత-ముస్లిం అనుసంధాన సాహిత్యం రావాలి! - అఫ్సర్

(దళిత సాహిత్యం --మౌలిక భావనలు పేరుతో ఒక సుదీర్ఘమైన వ్యాసాన్ని రాశాను. దాన్ని విద్యార్థుల ప్రయోజనం నిమిత్తం నా బ్లాగులో ప్రచురించాను. ఇంత పెద్ద వ్యాసాన్ని చదవడానికి చాలా సమయం పడుతుంది. అయినా దాన్ని ప్రముఖకవి, విమర్శకుడు అఫ్సర్ గారు చదివి విలువైన అభిప్రాయాన్ని రాశారు. దాన్ని ఇక్కడ ప్రచురిస్తున్నాను.-దార్ల )


ఈ వ్యాసం బాగుంది. చివరలో అన్న మాట -ప్రదర్శనానుగుణ సాహిత్యం - రావాలన్న మాట ఇప్పటి దళిత సాహిత్యానికి వొక డైరెక్షన్ ని సూచిస్తోంది. అది మంచి/అవసరమయిన డైరెక్షన్.

ఇక- దళిత-ముస్లిం (అంధ్ర,తెలంగాణ, రాయల సీమ అన్న తేడా లేకుండా) అనుసంధాన సాహిత్యం కూడా మరింత రావాలని నా కోరిక. దార్ల లాంటి విమర్శకులు ఆ దశ వైపు ఆలోచనల్ని తీసుకు వెళ్ళాలి.

అఫ్సర్

ప్రజారాజ్యం పార్టీకి ఉమ్మడి గుర్తు రాకుండా ఎవరైనా అడ్డుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏమిటి?

ప్రజారాజ్యం పార్టీకి ఉమ్మడి గుర్తు రాకుండా ఎవరైనా అడ్డుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏమిటి?
ప్రజాభిప్రాయ సేకరణ లో పాల్గొనండి.

దళిత సాహిత్య విమర్శ

--డా//దార్ల వెంకటేశ్వరరావు
అసిస్టెంట్ ప్రొఫెసర్, తెలుగు శాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయం,
గచ్చిబౌలి, హైదరాబాదు-46, 09989628049, vrdarla@gmail.com


1.6 దళిత సాహిత్య విమర్శ:

’‘ "చిక్కనవుతున్న పాట'‘‘ (1985)కి జి. లక్ష్మీనరసయ్య దేశీయ మార్క్సిజమే ‘‘"దళిత కవిత్వ ఎజెండా' ‘‘పేరుతో రాసిన ముందు మాటతో తెలుగులో దళిత సాహిత్య విమర్శ శాస్త్రీయ పద్ధతిలో ప్రారంభమయింది. అంతకుముందు గుర్రం జాషువా, బోయి భీమన్న, కొలకలూరి ఇనాక్, కత్తి పద్మారావు, బొజ్జా తారకం మొదలైనవారు ఆయా గ్రంథాలకు రాసిన/రాసుకున్న ముందుమాటల్లోనూ దళిత సాహిత్య విమర్శ కనిపిస్తున్నా, అది అస్పృశ్యతా నివారణను ప్రధానంగా చేసుకొని అనేకాంశాలను విశ్లేషించినదే అవుతుంది. వివిధ విశ్వవిద్యాలయాల్లో గుర్రం జాషువా, బోయి భీమన్న, కొలకలూరి ఇనాక్రచనలపై కొన్ని పరిశోధనలు జరిగాయి. వాటిలో కొంత విమర్శ ఉన్నా, జి.లక్ష్మీనరసయ్య రాసిన వ్యాసాలలోనే దళిత సాహిత్య విమర్శ స్పష్టంగా కనిపిస్తుది.

ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి గారు దళిత కవిత్వంలో ధ్వని సూత్రాలను అన్వయించి, దళితసాహిత్య విమర్శకు దేశీయ భూమిక ను ఏర్పరిచే ప్రయత్నం చేశారు. కొలకలూరి ఇనాక్ఆధునిక విమర్శ సూత్రాలలో దళిత సాహిత్య విమర్శకు శాస్త్రీయ విశ్లేషణను అందించారు. దళిత కథపై ననుమాస స్వామి, దళిత ఉద్యమం పై ఎస్వీ సత్యనారాయణ, చారిత్రక, భౌతిక దృక్పథాన్ని కత్తి పద్మారావు, కె.కె. రంగనాథాచార్యులు, దళిత సాహిత్యం లో బిసివాదాన్ని బి.ఎస్‌. రాములు, పోస్టుమోడరన్ దృక్పథాన్ని బి. తిరుపతిరావు, పోస్టుమోడరన్ దృక్పథ వ్యతిరేకతను సతీష్చందర్, జాషువాసాహిత్యంపై ఎండ్లూరి సుధాకర్, అనువర్తిత దళిత సాహిత్య విమర్శను శిఖామణి మొద లైనవారు విశేషమైన కృషి చేశారు. ఇంకా సమన్వయ దృక్పథాన్ని అఫ్సర్, చందు సుబ్బారావు, అద్దేపల్లి రామమోహనరావు, ద్వా.నా. శాస్త్రి, ప్రసేన్, బొజ్జా తారకం, కలేకూరి ప్రసాద్, కోయి కోటేశ్వరరావు, కె. సత్యనారాయణ, కొప్పర్తి, దార్ల వెంకటేశ్వరరావు, మేడేపల్లి రవికుమార్, పి.సి.

రాములు, హెచ్చార్కే, మో, కోవెల సంపత్కుమారాచార్య, ఆర్‌.ఎస్‌. సుదర్శనం, కొడపల్లి సుదర్శనం రాజు, కె. లక్ష్మీనారాయణ, గద్దల భాను, కాసుల ప్రతాపరెడ్డి, కొల్లూరి చిరంజీవి, జ్వాలాముఖి, నగ్నముని, తుమ్మల భారతి, కొలకలూరి మధుజ్యోతి తదితతరులు అందించారు. వీరే కాకుండా, గోగు శ్యామల, ఎస్జీడీ చంద్రశేఖర్, బూదాటి వెంకటేశ్వర్లు, దేవరపల్లి మస్తాన్రావు, వెలమల సిమ్మన్న, కాలువ మల్లయ్య, ఆర్‌.చంద్రశేఖర్రెడ్డి మొదలైనవారంతా దళిత సాహిత్య విమర్శను పరిపుష్టం చేస్తున్నారు.

ప్రధానంగా దళిత సాహిత్య విమర్శ జాషువాపై ఎక్కువగా వచ్చింది. తరువాత వచన కవిత్వం, భాష, అశ్లీల పదాలు, భారతీయ ఆలంకారిక దృక్పథం మొదలైన అంశాలపై ఎక్కువగా వచ్చింది. అయినప్పటికీ, దళిత సాహిత్య విమర్శ సంప్రదాయ సాహిత్యాన్ని విమర్శించటమే పనిగా పెట్టుకున్నట్టు ఉందనే అభిప్రాయాలున్నాయి. మరింత మౌలికంగా శాస్త్రీయంగా దళిత సాహిత్య విమర్శ రావలసిన అవసరం ఉంది. ప్రస్తుతం దళిత సాహిత్య విమర్శలో కనిపిస్తున్న ధోరణులను గమనిస్తే సాహిత్య విమర్శ పయనించవలసిన మార్గం స్పష్టమవుతుంది.

1.6.1 దళిత విమర్శ ధోరణులు:

1. ప్రాచీన కావ్యాలలో సామాన్య పాత్రలకు కనీస అవకాశం కల్పించలేదు. సమాజంలో కేవలం కొన్ని వర్ణాలవారి ఆలోచనలతో కూడినదే సాహిత్యంగా ప్రచారం పొందింది.

2. అలంకార శాస్త్రాలు, లక్షణ గ్రంథాలు చాలా వరకు నిమ్న వర్ణాల గురించి రాయటాన్ని అంగీకరించలేదు. తప్పనిసరి పరిస్థితులలో కొన్ని పాత్రలను ప్రవేశపెట్టినా వాటిని నీచ పాత్రలుగానే చిత్రించాయి. సమాజంలో కొన్ని వర్ణాలవారే సుగుణ స్వభావం కలిగి ఉంటారనే దృక్పథం వాస్తవానికి దూరంగా ఉంది.

3.కొన్ని వందల యేండ్ల సాహిత్యమంతా అసత్యాలతో నిండి పాలకవర్గాల ఆధిపత్యంలో కొనసాగింది. దళితులను అణచివేసే దిశగా ప్రజల భాషకేమాత్రం సంబంధంలేని సంస్కృత భాషలో, భాషానువాదాలతో దాని మనుగడ కొనసాగింది.

4. ఆధ్యాత్మిక భావాల పేరుతో భావవాదాన్ని ప్రచారం చేసి సాహిత్యం ద్వారా శాస్త్రీయమైన ఆలోచనకు అవకాశం కలగనివ్వలేదు. విదేశీ పాలకుల ప్రవేశంతో హిందూ మత పరిరక్షణకు వివిధ పేర్లతో సంస్కరణ విధానాలను పాటించినా, దళిత సాహితీ వేత్తలు నేపథ్యాన్ని గుర్తెరిగి సాహిత్యాన్ని పునర్మూల్యాంకనం జరగాలి. మౌఖిక సాహిత్యంలో ఉన్న దళితుల మూలాలు బహిర్గతపరిచే ప్రయత్నం జరగాలి.

5. దళితులను అణచివేసిన భావజాలమే బ్రాహ్మణవాదం.బ్రాహ్మణులను లేదా ప్రత్యేకంగా కొన్ని కులాలను నిందించటం దళిత సాహిత్య విమర్శ ధోరణి కాదు.

6. తెలుగులో దళిత సాహిత్యాన్ని తెలంగాణ ప్రాంతపరంగానూ, ఆంధ్ర ప్రాంతపరంగానూ ప్రత్యేక పరిశీలనలు అవసరం. కారంచేడు సంఘటనతోనే తెలుగు దళిత సాహిత్య చరిత్ర అంబేడ్కర్దృక్పథంతో ప్రారంభమయింది అనటంలో ఆంధ్ర ప్రాంత దళిత రచయితల ఆధిపత్యం కనిపిస్తుంది. ఆంధ్ర ప్రాంత రచయితల రచనలలో క్రైస్తవ మతం, తెలంగాణ ప్రాంత రచయితల రచనలలో హిందూ, ముస్లిం మత విప్లవ సాహిత్య భావాలలో స్పష్టమైన విభజన రేఖను విస్మరిస్తున్నారు.

7. ఎవరి కులం గురించి వాళ్ళు మాత్రమే కుల సంఘాలకు పరిమితమైన దృష్టితో పరిమిత ప్రయోజనంతో సాహిత్యం కుదించుకుపోతుంది. అందువల్ల, దళిత సాహిత్య చరిత్ర పునర్మూల్యాంకనం చేసేటప్పుడు కులంలో పుట్టాలనేదానితో పాటు రచయితలు దళీతుల గురించి రాశారో లేదో పరిగణలోకి తీసుకోవాలి.

8. దళిత సాహిత్య చరిత్రను అంటరానితనం, కులవ్యవస్థ మొదలైనప్పటినుండి పరిశీలించాలి. దీనిలో భాగంగానే చిందు భాగవతం, జాంబపురాణాలను చూడాలి.

9. దళిత సాహిత్యంతో విడదీయరాని బంధాన్ని పెనవేసుకున్న క్రైస్తవ సాహిత్యాన్ని అధ్యయనం చేసేటప్పుడు మత దృక్పథం పట్ల ప్రత్యేక సూత్రాలతో విశ్లేషించాలి.

10. కుల నిర్మూలనతోనే దళితుల విముక్తి సాధ్యమవుతుందా? వర్గ దృక్పథం కూడా అవసరమా? అయితే అది ఎంతవరకు అవసరమనేది స్పష్టం చేయవలసిన అవసరముంది. దేశీయ మార్స్కిజం పేరుతో జరిగిన చర్చ కొంతవరకు విషయాన్ని ముందుకు తీసుకెళ్ళింది.

11. దళిత సాహిత్యం ఏర్పర్చుకొనే పరిధి వల్ల దళితులంటే ఎవరనేది స్పష్టమవుతుంది. షెడ్యూల్డు తెగలు, వెనకబడిన తరగతులు, ముస్లిములు దళితులవుతారా? విషయంలో ఇంకా స్పష్టత అవసరం. దళితులు, దళిత బహుజనులు వంటి పారిభాషిక పదాలను దళిత సాహిత్యం రాజకీయపరంగా కాకుండా సాంఘిక పీడన, కుల ప్రభావాన్ని అనుసరించి అన్ని వేళలా ఒకే అవగాహనతో ప్రయోగించవలసి ఉంది.

12. సాహిత్యంలో నాయకత్వ పాత్రలను సృజించేటప్పుడు అధికారం, భూమి సమస్య సాంఘిక హోదాల విషయంలో దళిత రచయితలకు స్పష్టత అవసరం.

13 దళితులలో ప్రధానంగా మాల, మాదిగల మధ్యే రిజర్వేషన్ల కోసం జరుగుతున్న అంత:సంఘర్షణ వల్ల వస్తున్న సాహిత్యం దళిత సాహిత్య వికాసమా? వైఫల్యమా?

14. స్త్రీవాద సాహిత్యలో దళిత స్త్రీ సమస్యలను సమర్థవంతంగా చిత్రణ జరగక పోవడానికి జీవితం తెలియక పోవడమా? విస్మరించడమా?

15. దళిత సాహిత్యాభివ్యక్తిని శక్తివంతంగా వ్యక్తీకరించడానికి ప్రత్యేక భాషను ప్రయోగించడం, అశ్లీల పదాలను గ్రహించటం, భారతీయ ఆలంకారిక శాస్త్రాంశాలను నిరసించటం, పాశ్చాత్య సాహిత్య సంప్రదాయాలను పాటించటలో గల పరిధులను స్పష్టంగా గుర్తించాలి.

16. దళిత సాహిత్యల ప్రక్రియాపరంగా గేయం (పాట), పద్యం, కథ, నవల, నాటకం, వ్యాసం వంటి వాటిలో దళితులకు దగ్గరైనవేమిటో, అవసరమైనవేమిటో, ఇంకా రావలిసినవేమిటో గమనిస్తుండాలి.

1.7 ముగింపు:

మొత్తం మీద దళిత వచన కవిత్వమే దళిత సాహిత్యంగా కూడా భావింపబడింది. కానీ, అనతి కాలంలోనే వివిధ ప్రక్రియలను పరిశీలించిన తరువాత సాహితీవేత్తల అభిప్రాయంలో మార్పు కలిగింది. భారతీయ సాహిత్యలో వివిధ భాషల్లో కూడా దళిత సాహిత్యం విస్తృతంగానే వచ్చి, ప్రభావం తెలుగు దళిత కవిత్వంపై చూపింది.

ఇంత వస్తు వైవిధ్యాలను ప్రదర్శించినా, దళితులకు అందుబాటులో ఉండే సాహిత్య ప్రక్రియ పాటగానే (గేయం) కొంతమంది విమర్శకులు భావిస్తున్నారు. వచన కవిత్వం మధ్య తరగతి విద్యావంతులకు మాత్రమే బాగా అందుబాటులోకి వచ్చిన సాహిత్య ప్రక్రియ అనే విమర్శ కుడా ఉంది.