"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

20 మార్చి, 2009

దళిత సాహిత్య విమర్శ

--డా//దార్ల వెంకటేశ్వరరావు
అసిస్టెంట్ ప్రొఫెసర్, తెలుగు శాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయం,
గచ్చిబౌలి, హైదరాబాదు-46, 09989628049, vrdarla@gmail.com


1.6 దళిత సాహిత్య విమర్శ:

’‘ "చిక్కనవుతున్న పాట'‘‘ (1985)కి జి. లక్ష్మీనరసయ్య దేశీయ మార్క్సిజమే ‘‘"దళిత కవిత్వ ఎజెండా' ‘‘పేరుతో రాసిన ముందు మాటతో తెలుగులో దళిత సాహిత్య విమర్శ శాస్త్రీయ పద్ధతిలో ప్రారంభమయింది. అంతకుముందు గుర్రం జాషువా, బోయి భీమన్న, కొలకలూరి ఇనాక్, కత్తి పద్మారావు, బొజ్జా తారకం మొదలైనవారు ఆయా గ్రంథాలకు రాసిన/రాసుకున్న ముందుమాటల్లోనూ దళిత సాహిత్య విమర్శ కనిపిస్తున్నా, అది అస్పృశ్యతా నివారణను ప్రధానంగా చేసుకొని అనేకాంశాలను విశ్లేషించినదే అవుతుంది. వివిధ విశ్వవిద్యాలయాల్లో గుర్రం జాషువా, బోయి భీమన్న, కొలకలూరి ఇనాక్రచనలపై కొన్ని పరిశోధనలు జరిగాయి. వాటిలో కొంత విమర్శ ఉన్నా, జి.లక్ష్మీనరసయ్య రాసిన వ్యాసాలలోనే దళిత సాహిత్య విమర్శ స్పష్టంగా కనిపిస్తుది.

ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి గారు దళిత కవిత్వంలో ధ్వని సూత్రాలను అన్వయించి, దళితసాహిత్య విమర్శకు దేశీయ భూమిక ను ఏర్పరిచే ప్రయత్నం చేశారు. కొలకలూరి ఇనాక్ఆధునిక విమర్శ సూత్రాలలో దళిత సాహిత్య విమర్శకు శాస్త్రీయ విశ్లేషణను అందించారు. దళిత కథపై ననుమాస స్వామి, దళిత ఉద్యమం పై ఎస్వీ సత్యనారాయణ, చారిత్రక, భౌతిక దృక్పథాన్ని కత్తి పద్మారావు, కె.కె. రంగనాథాచార్యులు, దళిత సాహిత్యం లో బిసివాదాన్ని బి.ఎస్‌. రాములు, పోస్టుమోడరన్ దృక్పథాన్ని బి. తిరుపతిరావు, పోస్టుమోడరన్ దృక్పథ వ్యతిరేకతను సతీష్చందర్, జాషువాసాహిత్యంపై ఎండ్లూరి సుధాకర్, అనువర్తిత దళిత సాహిత్య విమర్శను శిఖామణి మొద లైనవారు విశేషమైన కృషి చేశారు. ఇంకా సమన్వయ దృక్పథాన్ని అఫ్సర్, చందు సుబ్బారావు, అద్దేపల్లి రామమోహనరావు, ద్వా.నా. శాస్త్రి, ప్రసేన్, బొజ్జా తారకం, కలేకూరి ప్రసాద్, కోయి కోటేశ్వరరావు, కె. సత్యనారాయణ, కొప్పర్తి, దార్ల వెంకటేశ్వరరావు, మేడేపల్లి రవికుమార్, పి.సి.

రాములు, హెచ్చార్కే, మో, కోవెల సంపత్కుమారాచార్య, ఆర్‌.ఎస్‌. సుదర్శనం, కొడపల్లి సుదర్శనం రాజు, కె. లక్ష్మీనారాయణ, గద్దల భాను, కాసుల ప్రతాపరెడ్డి, కొల్లూరి చిరంజీవి, జ్వాలాముఖి, నగ్నముని, తుమ్మల భారతి, కొలకలూరి మధుజ్యోతి తదితతరులు అందించారు. వీరే కాకుండా, గోగు శ్యామల, ఎస్జీడీ చంద్రశేఖర్, బూదాటి వెంకటేశ్వర్లు, దేవరపల్లి మస్తాన్రావు, వెలమల సిమ్మన్న, కాలువ మల్లయ్య, ఆర్‌.చంద్రశేఖర్రెడ్డి మొదలైనవారంతా దళిత సాహిత్య విమర్శను పరిపుష్టం చేస్తున్నారు.

ప్రధానంగా దళిత సాహిత్య విమర్శ జాషువాపై ఎక్కువగా వచ్చింది. తరువాత వచన కవిత్వం, భాష, అశ్లీల పదాలు, భారతీయ ఆలంకారిక దృక్పథం మొదలైన అంశాలపై ఎక్కువగా వచ్చింది. అయినప్పటికీ, దళిత సాహిత్య విమర్శ సంప్రదాయ సాహిత్యాన్ని విమర్శించటమే పనిగా పెట్టుకున్నట్టు ఉందనే అభిప్రాయాలున్నాయి. మరింత మౌలికంగా శాస్త్రీయంగా దళిత సాహిత్య విమర్శ రావలసిన అవసరం ఉంది. ప్రస్తుతం దళిత సాహిత్య విమర్శలో కనిపిస్తున్న ధోరణులను గమనిస్తే సాహిత్య విమర్శ పయనించవలసిన మార్గం స్పష్టమవుతుంది.

1.6.1 దళిత విమర్శ ధోరణులు:

1. ప్రాచీన కావ్యాలలో సామాన్య పాత్రలకు కనీస అవకాశం కల్పించలేదు. సమాజంలో కేవలం కొన్ని వర్ణాలవారి ఆలోచనలతో కూడినదే సాహిత్యంగా ప్రచారం పొందింది.

2. అలంకార శాస్త్రాలు, లక్షణ గ్రంథాలు చాలా వరకు నిమ్న వర్ణాల గురించి రాయటాన్ని అంగీకరించలేదు. తప్పనిసరి పరిస్థితులలో కొన్ని పాత్రలను ప్రవేశపెట్టినా వాటిని నీచ పాత్రలుగానే చిత్రించాయి. సమాజంలో కొన్ని వర్ణాలవారే సుగుణ స్వభావం కలిగి ఉంటారనే దృక్పథం వాస్తవానికి దూరంగా ఉంది.

3.కొన్ని వందల యేండ్ల సాహిత్యమంతా అసత్యాలతో నిండి పాలకవర్గాల ఆధిపత్యంలో కొనసాగింది. దళితులను అణచివేసే దిశగా ప్రజల భాషకేమాత్రం సంబంధంలేని సంస్కృత భాషలో, భాషానువాదాలతో దాని మనుగడ కొనసాగింది.

4. ఆధ్యాత్మిక భావాల పేరుతో భావవాదాన్ని ప్రచారం చేసి సాహిత్యం ద్వారా శాస్త్రీయమైన ఆలోచనకు అవకాశం కలగనివ్వలేదు. విదేశీ పాలకుల ప్రవేశంతో హిందూ మత పరిరక్షణకు వివిధ పేర్లతో సంస్కరణ విధానాలను పాటించినా, దళిత సాహితీ వేత్తలు నేపథ్యాన్ని గుర్తెరిగి సాహిత్యాన్ని పునర్మూల్యాంకనం జరగాలి. మౌఖిక సాహిత్యంలో ఉన్న దళితుల మూలాలు బహిర్గతపరిచే ప్రయత్నం జరగాలి.

5. దళితులను అణచివేసిన భావజాలమే బ్రాహ్మణవాదం.బ్రాహ్మణులను లేదా ప్రత్యేకంగా కొన్ని కులాలను నిందించటం దళిత సాహిత్య విమర్శ ధోరణి కాదు.

6. తెలుగులో దళిత సాహిత్యాన్ని తెలంగాణ ప్రాంతపరంగానూ, ఆంధ్ర ప్రాంతపరంగానూ ప్రత్యేక పరిశీలనలు అవసరం. కారంచేడు సంఘటనతోనే తెలుగు దళిత సాహిత్య చరిత్ర అంబేడ్కర్దృక్పథంతో ప్రారంభమయింది అనటంలో ఆంధ్ర ప్రాంత దళిత రచయితల ఆధిపత్యం కనిపిస్తుంది. ఆంధ్ర ప్రాంత రచయితల రచనలలో క్రైస్తవ మతం, తెలంగాణ ప్రాంత రచయితల రచనలలో హిందూ, ముస్లిం మత విప్లవ సాహిత్య భావాలలో స్పష్టమైన విభజన రేఖను విస్మరిస్తున్నారు.

7. ఎవరి కులం గురించి వాళ్ళు మాత్రమే కుల సంఘాలకు పరిమితమైన దృష్టితో పరిమిత ప్రయోజనంతో సాహిత్యం కుదించుకుపోతుంది. అందువల్ల, దళిత సాహిత్య చరిత్ర పునర్మూల్యాంకనం చేసేటప్పుడు కులంలో పుట్టాలనేదానితో పాటు రచయితలు దళీతుల గురించి రాశారో లేదో పరిగణలోకి తీసుకోవాలి.

8. దళిత సాహిత్య చరిత్రను అంటరానితనం, కులవ్యవస్థ మొదలైనప్పటినుండి పరిశీలించాలి. దీనిలో భాగంగానే చిందు భాగవతం, జాంబపురాణాలను చూడాలి.

9. దళిత సాహిత్యంతో విడదీయరాని బంధాన్ని పెనవేసుకున్న క్రైస్తవ సాహిత్యాన్ని అధ్యయనం చేసేటప్పుడు మత దృక్పథం పట్ల ప్రత్యేక సూత్రాలతో విశ్లేషించాలి.

10. కుల నిర్మూలనతోనే దళితుల విముక్తి సాధ్యమవుతుందా? వర్గ దృక్పథం కూడా అవసరమా? అయితే అది ఎంతవరకు అవసరమనేది స్పష్టం చేయవలసిన అవసరముంది. దేశీయ మార్స్కిజం పేరుతో జరిగిన చర్చ కొంతవరకు విషయాన్ని ముందుకు తీసుకెళ్ళింది.

11. దళిత సాహిత్యం ఏర్పర్చుకొనే పరిధి వల్ల దళితులంటే ఎవరనేది స్పష్టమవుతుంది. షెడ్యూల్డు తెగలు, వెనకబడిన తరగతులు, ముస్లిములు దళితులవుతారా? విషయంలో ఇంకా స్పష్టత అవసరం. దళితులు, దళిత బహుజనులు వంటి పారిభాషిక పదాలను దళిత సాహిత్యం రాజకీయపరంగా కాకుండా సాంఘిక పీడన, కుల ప్రభావాన్ని అనుసరించి అన్ని వేళలా ఒకే అవగాహనతో ప్రయోగించవలసి ఉంది.

12. సాహిత్యంలో నాయకత్వ పాత్రలను సృజించేటప్పుడు అధికారం, భూమి సమస్య సాంఘిక హోదాల విషయంలో దళిత రచయితలకు స్పష్టత అవసరం.

13 దళితులలో ప్రధానంగా మాల, మాదిగల మధ్యే రిజర్వేషన్ల కోసం జరుగుతున్న అంత:సంఘర్షణ వల్ల వస్తున్న సాహిత్యం దళిత సాహిత్య వికాసమా? వైఫల్యమా?

14. స్త్రీవాద సాహిత్యలో దళిత స్త్రీ సమస్యలను సమర్థవంతంగా చిత్రణ జరగక పోవడానికి జీవితం తెలియక పోవడమా? విస్మరించడమా?

15. దళిత సాహిత్యాభివ్యక్తిని శక్తివంతంగా వ్యక్తీకరించడానికి ప్రత్యేక భాషను ప్రయోగించడం, అశ్లీల పదాలను గ్రహించటం, భారతీయ ఆలంకారిక శాస్త్రాంశాలను నిరసించటం, పాశ్చాత్య సాహిత్య సంప్రదాయాలను పాటించటలో గల పరిధులను స్పష్టంగా గుర్తించాలి.

16. దళిత సాహిత్యల ప్రక్రియాపరంగా గేయం (పాట), పద్యం, కథ, నవల, నాటకం, వ్యాసం వంటి వాటిలో దళితులకు దగ్గరైనవేమిటో, అవసరమైనవేమిటో, ఇంకా రావలిసినవేమిటో గమనిస్తుండాలి.

1.7 ముగింపు:

మొత్తం మీద దళిత వచన కవిత్వమే దళిత సాహిత్యంగా కూడా భావింపబడింది. కానీ, అనతి కాలంలోనే వివిధ ప్రక్రియలను పరిశీలించిన తరువాత సాహితీవేత్తల అభిప్రాయంలో మార్పు కలిగింది. భారతీయ సాహిత్యలో వివిధ భాషల్లో కూడా దళిత సాహిత్యం విస్తృతంగానే వచ్చి, ప్రభావం తెలుగు దళిత కవిత్వంపై చూపింది.

ఇంత వస్తు వైవిధ్యాలను ప్రదర్శించినా, దళితులకు అందుబాటులో ఉండే సాహిత్య ప్రక్రియ పాటగానే (గేయం) కొంతమంది విమర్శకులు భావిస్తున్నారు. వచన కవిత్వం మధ్య తరగతి విద్యావంతులకు మాత్రమే బాగా అందుబాటులోకి వచ్చిన సాహిత్య ప్రక్రియ అనే విమర్శ కుడా ఉంది.

కామెంట్‌లు లేవు: