ప్రసిద్ధ పంజాబీ రచయిత నిందర్ ఘుగైణ్వి, ఉర్దూ జాతీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ పఠాన్ ఖాన్ గార్లతో డా.దార్ల వెంకటేశ్వరరావు
నిందర్ ఘుగైణ్వి రాసిన ఆత్మకథను తెలుగులోకి ప్రొఫెసర్ పఠాన్ ఖాన్ అనువదించారు. దీనికి నేను ముందుమాట రాశాను.
ఆ ముందుమాటను ఇక్కడ చదవవచ్చు.
పంజాబ్ లో
ప్రసిద్ధ పాత్రికేయుడు, ఆకాశవాణి న్యూస్ రీడర్, రచయిత నిందర్ ఘుగైణ్వి (Ninder
Ghugianvi) తన 20 వ యేట ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసినప్పుడు పొందిన అనుభవాలను గుదిగుచ్చి మాత
భాషలో రాసిన ఆత్మకథ పేరు ‘‘మై సాన్ జడ్జి ద ఆర్డర్లి’’. ఆంగ్లంలో ఇది ‘‘I was a servant to a Judgeµµ పేరుతో అనువాదం అయ్యింది. ఉర్దూ, హిందీ భాషల్లో కూడా వెలువడి అనేక ప్రచురణలు పొందిన ఈ ఆత్మకథ
పంజాబ్ విశ్వవిద్యాలయం, పాటియాలలో పాఠ్యాంశంగా కూడా ఉంది.
పంజాబ్ లోని ప్రసిద్ధ వారపత్రికల్లో ధారావాహికంగా ప్రచురితమైన ఈ ఆత్మకథ ఆకాశవాణి, లండన్ లో కూడా ప్రసారమైంది. న్యాయమూర్తి దగ్గర పనిచేసే ఒక
సేవకుడు సమాజంలో గొప్ప రచయితగా, ఏక్ తార (తంబూరా)
వాయిస్తూ వాగ్గేయకారుడిగా పేరు ప్రఖ్యాతులు పొందడాన్ని సహించలేని 'గొప్ప' వ్యక్తుల మానవ
స్వభావాన్ని, సమాజానికి కనిపించని హింసా స్వరూపాన్ని
ఈ ఆత్మకథ మన ముందుంచుతుంది. తన పై అధికారులెంతగా అణచిపెట్టాలనుకున్నా నిందర్ ఘుగైణ్విని భారత ప్రభుత్వం
గుర్తించడంతో పాటు, కెనడా ప్రధానమంత్రి 2001లో సాహిత్య పురస్కారంతో కూడా సత్కరించారు. సుమారు 35 పుస్తకాలను రాసిన నిందర్ ఘుగైణ్వి అమెరికా, లండన్ మొదలైన దేశాల్లో పర్యటించి తన కళా ప్రదర్శనలతో
అంతర్జాతీయ కళాకారుడిగా గుర్తింపుపొందాడు. 2005లో లండన్ పార్లమెంటు సభ్యుల ముందు తన
తంబూరాతో పాడి శభాష్ అనిపించుకున్నాడు. అణచేకొద్దే పైకొచ్చే చైతన్యవంతమైన ఆ కళాతృష్ణ
పొందిన మానసిక స్థితిని తెలుసుకోవడానికి మనమంతా ఈ ఆత్మకథను చదవాలి. అంత స్ఫూర్తిదాయకమైన ఈ ఆత్మకథను ఇప్పుడు ప్రముఖ
రచయిత,
అనువాదకుడు, మౌలానా ఆజాద్
జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలో హిందీ
అసిస్టెంట్ ప్రొఫెసర్ డా॥పఠాన్ రహీమ్ ఖాన్ గారు ''నేను
జడ్జిగారి సేవకుడ్ని'' పేరుతో తెలుగులోకి
అనువదించారు.
''నేను జడ్జిగారి సేవకుడ్ని'' అనే ఈ ఆత్మకథ చదువుతుంటే తెలుగులో పోలీసు ఉన్నతాధికారుల ఇళ్ళల్లో పనిచేసే చిరు
పోలీసు ఉద్యోగుల జీవితంలోని చీకటికోణాలను చిత్రించిన 'ఖాకీబతుకులు' నవల
గుర్తొస్తుంది. జి.మోహనరావు అనే ఒక కానిస్టేబుల్ ('స్ఫార్టకస్' కలం పేరుతో )1980-82లో ఆత్మకథాత్మక నవల
''ఖాకీబతుకులు'' ను రాశారు.
పోలీసు కుటుంబాల్లో ఆర్డర్లీ వ్యవస్థ ఎలా ఉంటుందో తెలుగు సమాజానికి ఈ నవల ద్వారా
చాలా వరకు స్ఫష్టమైయ్యింది. ఆ రచన వెలువడిన
తర్వాత ఆ రచయిత అనేక ఇబ్బందులకు గురయ్యాడని వార్తలు వచ్చాయి. ఆత్మకథ రచన కత్తిమీద సాములాంటిది. పేర్లు, సంవత్సరాలు రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
వాస్తవాన్ని మాత్రమే రాసినప్పటికీ, ఆ వాస్తవం
సమాజంలో తీవ్రమైన శాంతిభద్రతల భంగానికి కారణం కాకూడదు. దాన్ని కళాత్మకం చేసి
ప్రతీకాత్మకంగానో, వ్యంగ్యంగానో చెప్తూనే దాన్ని
పాఠకులకు స్ఫురింపజేయాలి. వైయక్తికమైన రాగద్వేషాలకు ఆత్మకథలు వాహికలుగా మారకూడదు.
వైయక్తిక సమస్యల్ని వ్యవస్థీకృత త సమస్యగా సాధారణీకరించి చూపగలిగినప్పుడు దానికి
విలువ ఏర్పడుతుంది. ఈ పనే నిందర్ ఘుగైణ్వి రచనలో కనిపిస్తుంది. ఆర్డర్లీ
వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న
కొంతమంది భారతీయ న్యాయమూర్తుల భౌతిక, మానసిక స్వరూప
స్వభావాల్ని రచయిత వర్ణించే ప్రయత్నం చేశాడు. ఇది కేవలం న్యాయమూర్తుల ఇళ్ళల్లోనే
కాదు,
కింది ఉద్యోగులను పనిచేయించుకోవడానికి అవకాశం ఉన్న అనేకమంది
ఉన్నతాధికారుల ఇళ్ళల్లోనూ కనిపిస్తుంది. వివక్ష ఏరూపంలో ఉన్నా, దానికి అనేక కోణాలుంటాయి.
దీన్ని వాస్తవికంగా వర్ణిస్తూనే, తాత్త్వికంగా
కథాకథన శైలిలో చక్కగా చెప్పాడు నిందర్ ఘుగైణ్వి.
ప్రతివ్యక్తి తన ప్రమేయం లేకుండానే తానెదొక వర్గం, కులం, మతంలో పుడతాడు. తాను
పుట్టక ముందే తన అస్తిత్వం నిర్ణయమవుతున్న సమాజంలో తన ప్రత్యేక అస్తిత్వం
నిలుపుకోవడానికి నిరంతరం ఘర్షణకు గురికావాల్సిందే. అదే పరిస్థితి నిందర్ ఘుగైణ్వి
కీ ఎదురైంది. తానొక నిరుపేద కుటుంబంలో పుట్టాడు. తనకు చిన్ననాటి నుండే కళల పట్ల
ఆసక్తి. మరొక వైపు తన కుటుంబంలో ఎవ్వరూ ప్రభుత్వోద్యోగిగా లేరు. తన కుటుంబం
ఆర్ధికంగా నిలబడాలంటే, తన కుటుంబంలోను ఒక
ప్రభుత్వోద్యోగి ఉన్నాడనే తన తల్లిదండ్రుల కల నెరవేరాలంటే మార్గాల్ని
అన్వేషించకతప్పదు. నిందర్ ఘుగైణ్వి కూడా అలాగే ప్రయత్నించాడు. ఒక జడ్జిగారి
గుమస్తా దగ్గర చేరాడు. నెమ్మదిగా జడ్జిగారికి దగ్గరయ్యాడు. ముద్దాయిల్ని కోర్టు
కేసులు విచారించేటప్పుడు వారిని పిలిచే ఉద్యోగ ప్రకటవచ్చింది. దానికి
దరఖాస్తుచేశాడు. ఇంటర్వ్యూలో ఉద్యోగానికి సంబంధం లేని ప్రశ్నల్ని, ఇంటి వంటపని, తోటపని, వ్యవసాయపని, ఇంటి పనిమనిషి
చేసే పనులన్నీ అడిగారు. అవన్నీ వచ్చన్నాడు. ఉద్యోగిగా ఎంపికయ్యాడు. తాను, తన కుటుంబం ప్రభుత్వోద్యోగిగా మారిన ఆనందాన్ని
అనుభవించాలనుకున్నారు. తన ఉద్యోగ విధులన్నీ జడ్జిగారి ఇంటి దగ్గరేనని, జడ్జిగార్లు మారినప్పుడల్లా ఆ పనులు, వాటిని చేయించే వాళ్ళ మనస్తత్వాలు ఒక్కొక్కటి గమనించాడు.
తనలో నిగూఢంగా ఉన్న కళాతష్ణ తీరట్లేదు. దాన్నెలాగోలా తీర్చుకోవాలి. దాన్ని
గుర్తించి ప్రోత్సహించిన వాళ్ళు కొంతమందైతే, మరికొంతమంది ఆ
కళాతృష్ణను ఎలా అణచివేయాలో ఆలోచించేవారు. ఆ కళ సమాజంలో అతనికి అదనపు గౌరవాన్ని
తెస్తున్నందుకు సహించలేని ఉన్నతాధికారుల మానసిక స్వభావాన్ని, వారి ప్రవర్తననీ కళ్ళకు కట్టినట్లు వర్ణించాడు రచయిత.
తానొక ''న్యాయమూర్తి''గా సమాజంలో గౌరవమర్యాదలున్నా, ఇంటిలో పనిమనుషుల్ని వేధించడంలోను, ''న్యాయమైన'' తీర్పు ఇవ్వడం కోసం తాను
రకరకాలుగా పొందే బహుమతులు, సమర్పణలు మొదలైనవి ఎలా ఉంటాయో పాఠకులకు దర్శింపజేశాడు
రచయిత. సందర్ఛోచితంగా తన పాటల్ని ఈ ఆత్మకథలో ప్రస్తావించి తాను చెప్పబోయే అంశానికి
తాత్వికతను అద్దే ప్రయత్నం చేశాడు. జడ్జిగారు ఒక్కొక్కప్పుడు తనలో తాను పొందే
మానసిక సంఘర్షణను ఎవరికీ చెప్పుకోలేక, తన కింది ఉద్యోగులపై ఎలా తీర్చుకుంటుంటాడో చాలా సందరాÄ్భల్లో వర్ణించాడు
రచయిత. మాక్సిమ్ గోర్కీ రాసిన ‘‘అమ్మ’’ నవలలో పొద్దస్తమాను ఫ్యాక్టరీలో పనిచేసి, యజమాని
తిట్టిన తిట్లు తిని, పై అధికారులనేమీ అనలేక
ఇంటికొచ్చిన ఒక కార్మికుడు తన భార్యను, కొడుకునీ, ఇంటి ప్రక్కల వాళ్ళనీ ఎలా తిడుతుంటాడో వర్ణించిన చక్కని
సన్నివేశం మనకి ఈ ఆత్మకథలో జడ్జిగారు తాగి తన పనిమనిషుల్ని తిట్టేటప్పుడు స్ఫురిస్తుంది. తన కుటుంబం ఒకచోట, తానొక చోట నివసిస్తూ ఉద్యోగం చేసే జడ్జిగారి
పిసినారితనాన్ని, తన కుటుంబం పట్ల ప్రదర్శించే
అనురాగాన్ని, దాన్ని నిరంతరం పొందలేని ఎడబాటుకి
పడుతున్న సంఘర్షణనీ ముప్పేటలా రచయిత చక్కగా వర్ణించాడు. తన మనసు బాగాలేనప్పుడల్లా
తిడుతూనే మరలా తంబూరా తెచ్చి పాటపాడమని, ఆ పాట వింటూ
ఆనందించేవాడు. తన మనసు బాగాలేనప్పుడల్లా, తన పనివెంటనే
కానప్పుడు గానీ ఆ కళాకారుడైన పనిమనిషిని పిలిచి, ఆతనిలో దాగున్న కళాకారుని వల్లే ఆ పని చేయలేదని ఎత్తిపొడవడం, దాన్ని చూసి కళాకారుడు నవ్వుకోవడంలో ఒక గొప్పతాత్వికత ఉంది.
జడ్జిగారు బదిలీ అయి మరొక చోటుకి వెళ్ళేటప్పుడు మరలా ఆ కళాకారుడ్ని దగ్గరకు పిలిచి
తన హదయానికి హత్తుకొని ఏడ్చినప్పుడు దాన్ని చక్కగా వ్యక్తం చేశాడు రచయిత. ఈ
ఆత్మకథలో పనిమనిషిగా ఉన్న ఆ గొప్పకళాకారుడు తన విధుల్ని నిర్వర్తిస్తూనే ఆ ఉద్యోగం
మానేద్దామనుకుంటే, తన కుటుంబం అనుభవిస్తున్న పేదరికం
గుర్తుకొచ్చేది. మరి తాను ఆత్మవంచన చేసుకొని, ఆత్మగౌరవాన్ని
కోల్పోయి ఆ పనిమనిషిగానే జీవించాడా? ఏమిచేశాడు? ఇవన్నీ ఆత్మకథ పూర్తిగా చదివితేనే తెలుస్తాయి.
ఇదొక అనువాద గ్రంథంలా అనిపించదు. సుమారు తొంభైశాతం వరకూ
తెలుగుదనం పరిమళించేలా ఈ గ్రంథాన్ని రచయిత డా॥పఠాన్ రహీమ్ ఖాన్ మనకి అందించారు. తెలుగు
సాహిత్యాన్ని మరింత సుసంపన్నం చేయడానికి ఈ ఆత్మకథ ఎంతగానో దోహదపడుతుంది. అందుకు కృషి
చేసిన రచయితను అభినందిస్తూ, తెలుగు పాఠకుల్ని ఈ ఆత్మకథను
చదవమని సాహితీ ప్రియులందర్నీ ఆహ్వానిస్తున్నాను.
డా॥దార్ల
వెంకటేశ్వరరావు
అసోసియేట్
ప్రొఫెసర్,
తెలుగుశాఖ, యూనివర్సిటి
ఆఫ్ హైదరాబాద్,హైదరాబాదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి