"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

పత్రికలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పత్రికలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

28 జూన్, 2026

గౌతమీనది తీరాన…పుస్తకావిష్కరణ, అంకితోత్సవం

 గౌతమీనది తీరాన…పుస్తకావిష్కరణ, అంకితోత్సవం

నినాదం దినపత్రిక 28.6.2026 సౌజన్యంతో 

ఈనాడు దినపత్రిక, రాజమహేంద్రవరం 28.6.2026 సౌజన్యంతో 

ప్రజాకాంక్ష దినపత్రిక, రాజమహేంద్రవరం 28.6.2026 సౌజన్యంతో 

ఈవేళ దినపత్రిక, రాజమహేంద్రవరం 28.6.2026 సౌజన్యంతో 
సాక్షి దినపత్రిక, రాజమహేంద్రవరం 28.6.2026 సౌజన్యంతో 


ఈనాడు దినపత్రిక, రాజమహేంద్రవరం 28.6.2026 సౌజన్యంతో 

వార్త దినపత్రిక, రాజమహేంద్రవరం 28.6.2026 సౌజన్యంతో 


ప్రముఖ కథా రచయిత రత్నాకర్ పెనుమాక రచించిన ‘గౌతమీ నది తీరాన…’ కథల సంపుటి శనివారం మధ్యాహ్నం (27.6.2026) ఆవిష్కరణ, అంకితోత్సవ సభ ఘనంగా జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం, జేగురుపాడు గ్రామంలో కన్వెన్షన్ సెంటర్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ తెలుగు మరియు సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్.డి. విల్సన్ (శరత్ చంద్ర) ముఖ్యఅతిథిగా పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. 

జ్యోతి ప్రజ్వలనం చేసిన ఆర్.డి.విల్సన్, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి తదితులు

పుస్తకాన్ని ఆవిష్కరించిన ముఖ్య అతిథి తెలుగు & సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్.డి.విల్సన్ గారు

పుస్తకాన్ని ఆవిష్కరించిన ముఖ్య అతిథి తెలుగు & సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్.డి.విల్సన్ గారు .

రత్నాకర్ పెనుమాక రచించిన 'గౌతమీ నది తీరాన...కథా సంపుటి గ్రంథాన్ని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారికి అంకితం ఇస్తున్న దృశ్యం. 

రత్నాకర్ పెనుమాక రచించిన 'గౌతమీ నది తీరాన...కథా సంపుటి గ్రంథాన్ని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారికి అంకితం ఇస్తున్న దృశ్యం. 

రత్నాకర్ పెనుమాక రచించిన 'గౌతమీ నది తీరాన...కథా సంపుటి గ్రంథాన్ని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారికి అంకితం ఇస్తున్న దృశ్యం. 

రత్నాకర్ పెనుమాక రచించిన 'గౌతమీ నది తీరాన...కథా సంపుటి గ్రంథ ఆవిష్కరణ వేదిక.

ఆయన మాట్లాడుతూ సమకాలీన కథా రచయితలలో రత్నాకర్ పెనుమాక తూర్పు గోదావరి, ముఖ్యంగా కోనసీమ జీవితాలను కథలుగా వర్ణించడంలో ప్రత్యేక నైపుణ్యాన్ని ప్రదర్శించగలిగిన గొప్ప భావోద్వేగాలు ఉన్న రచయిత అని వ్యాఖ్యానించారు. ఆయన రచించిన గౌతమీ నది తీరాన…సంపుటిలో గల కథలలో తెలుగు పలుకుబడి, భాషలోని పరిమళాన్ని, జీవన వాస్తవికతను కళాత్మకంగా వర్ణించగలిగిన గొప్ప రచయిత కనిపిస్తాడని, ఆయన ‘ధోని గంగమ్మ’అనే కథ ద్వారా ప్రపంచస్థాయి కథకుడుగా ప్రసిద్ధి చెందారని పేర్కొన్నారు. ఆయన కథ ‘ఈపొలం అమ్మబడును’ డిగ్రీ స్థాయి విద్యార్థులకు పాఠ్యాంశంగా ఎంపిక కావడం ఆయన కథల్లో గల నిజమైన ప్రతిభకు నిదర్శనమని ఆర్.డి విల్సన్ వ్యాఖ్యానించారు. ఈ కథా సంపుటిని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ దార్ల వెంకటేశ్వరరావుకి ఘనంగా అంకితం చేశారు. సామాన్యుడిగా కనిపించే రత్నాకర్ లో అసామాన్యుడైన కథకుడు ఉన్నాడని కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మధునాపంతుల సత్యనారాయణమూర్తి అన్నారు. గ్రామ సర్పంచ్ స్టాలిన్ మాట్లాడుతూ జేవురుపాడుకి జాతీయస్థాయిలో గుర్తింపు ఉంది, దాన్ని సాహితీ ప్రపంచానికి కూడా పరిచయం చేసి గుర్తింపు తెచ్చిన కథకుడిగా రత్నాకర్ నిలవడం గర్వకారణంగా ఉందన్నారు. సినీ నటుడు, టీవీ కళాకారుడు నువ్వు బిళ్ళ సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ జేగురుపాడు, తూర్పుగోదావరి జిల్లాల ప్రజల సాంస్కృతిక జీవనాన్ని, వాస్తవిక జీవనస్థితిగతుల చరిత్రను కథల ద్వారా భద్రపరిచిన గొప్ప సాహిత్య సృజనకారుడు రత్నాకర్ అని అభివర్ణించారు. కథా రచయిత రత్నాకర్ వ్యక్తిత్వాన్ని కథల నేపథ్యాన్ని హైదరాబాదులోని గీతం యూనివర్సిటీ ప్రొఫెసర్ దిగుమర్తి సురేష్ ఆత్మీయంగా పరిచయం చేశారు. ఈ ప్రాంతంతో ముడిపడిన జీవితాన్ని కథలుగా మలిచిన తీరుని ఆయన ఆసక్తిగా వివరించారు. ఐఐ ఐ టి తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ ఉడుము ఝాన్సీ మాట్లాడుతూ ఆచార్య దార్ల వెంకటేశ్వరావు జీవితాన్ని, ఆయన బోధనా ప్రభావాన్ని, సాహిత్య కృషినీ,సాహితీవేత్తలను ప్రోత్సహించే తీరుతెన్నులను సోదాహరణంగా కళ్ళకు కట్టినట్లుగా వివరించారు.

రత్నాకర్ పెనుమాక రచించిన 'గౌతమీ నది తీరాన...కథా సంపుటి గ్రంథ ఆవిష్కరణ సభలో  జ్యోతి ప్రజ్వలనం చేస్తున్న ఐఐఐటి తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ ఉడుము ఝాన్సీ... తదితరులు 

 తాను ఆయన విద్యార్థిగా మాట్లాడడం తన అదృష్టంగా ఆయన ఆమె వ్యాఖ్యానించారు. రమ్య సాహితి సమితి పక్షాన అధ్యక్షులు ఎం ఆర్ వి సత్యనారాయణమూర్తి గౌతమీ నదీ తీరాన…కథల సంపుటికి ఉత్తమ కథల సంపుటి పురస్కారాన్ని రత్నాకర్ పెనుమాక కు ఇచ్చి ఆయనను వేదికపై సత్కరించారు. 

తనకు ప్రత్యక్షంగా ఆయనతో పరిచయం లేకపోయినా రత్నాకర్ తనకు పుస్తకం అంకితం ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఆయన కథలు చదివి ఆ కథలలోని జీవితాన్ని, అభివ్యక్తి వైచిత్రినీ ముఖ్యంగా తూర్పుగోదావరి కోనసీమ జీవితాలను అక్షయకరించడంలో ఆయన చూపిన ప్రత్యేకతలను చూసి తానెంతో ఆశ్చర్యపోయాననీ పేర్కొన్నారు. రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల నుండి వస్తున్నటువంటి వాస్తవిక జీవితం కథల ద్వారా కళాత్మకం కావడం ఈ మధ్య రత్నాకర్ పెనుమాక కథలోనే గమనించానని ఆచార్య దార్ల పేర్కొన్నారు. 

అంకితం తీసుకొని కృతజ్ఞతలు తెలియజేస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 

గౌతమీ నదీ తీరాన… కథలలో స్థానికతను, సంస్కృతిని కథనీకరించడంలో గూగుల్ మ్యాప్ లా ఆ ప్రాంతాలన్నింటినీ మనకు చూపిస్తున్నట్లు, ఆ ప్రాంతంలోని వ్యక్తులు మనతో సజీవంగా మాట్లాడుతున్నట్లు వర్ణించగలిగిన సామర్థ్యం, ఈ ప్రాంతంలోని మనుషుల ప్రేమను, మానవత్వాన్నీ అత్యంత భావోద్వేకంతో వర్ణించిన గొప్ప రచయితగా వ్యాఖ్యానించారు. ఆయన రచించిన ‘దోని గంగమ్మ’కథ నిజంగా ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందిన తెలుగు కథగా పేర్కొనవచ్చుననీ, ఆర్.డి. విల్సన్ (శరత్ చంద్ర) గారి సంపాదకత్వంలో వచ్చిన ఉషా పత్రిక నిర్వహించిన పోటీలలో ప్రథమ బహుమతి రావడం ఆయనకు లభించిన గొప్ప పురస్కారం వంటిదని అన్నారు. ఆనాటి నుంచి ఆయన ప్రపంచ స్థాయి కథకుడుగా నిలిచిపోయారన్నారు.ప్రపంచ స్థాయి కథలుగా చెప్పే ‘గాలివాన’, ‘నీలి’ కంటే కూడా ‘దోని గంగమ్మ’ కథ ప్రేమ, మానవత్వం చూపిన అట్టడుగు వర్గాల జీవితాలకు ప్రాతినిథ్యం వహించే గొప్ప కథగా ఆచార్య దార్ల వ్యాఖ్యానించారు. అటువంటి గొప్ప కథలను తనకు అంకితం ఇవ్వడం, అది కూడా ప్రముఖ రచయిత శరత్ చంద్ర గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం, ఆయన ఆధ్వర్యంలో తనకు అంకితం చేయడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. తన కథలకు ప్రేరణగా నిలిచిన తన గ్రామానికీ, గ్రామస్తులకు, కోనసీమ తూర్పుగోదావరి జిల్లాల ప్రజలకు కథా రచయిత రత్నాకర్ పెనుమాక ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

 'గౌతమీ నది తీరాన...కథా రచయిత రత్నాకర్ పెనుమాక కృతజ్ఞతలు తెలుపుతున్న దృశ్యం 

 తన కథలలో వాస్తవికతకు ప్రాధాన్యాన్ని ఇవ్వడంతో పాటు, కుల మతాలకు అతీతంగా మానవత్వాన్ని కేంద్రంగా చేసుకొని కథలు రాశానని, ప్రేమ తత్వాన్ని చాటి చెప్పడమే తన కథల లక్ష్యంగా పేర్కొన్నారు. తనను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. తన కథ డిగ్రీ స్థాయిలో పాఠ్యాంశంగా రావడానికి కారకులైన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తనకు ప్రత్యక్షంగా గురువు కాకపోయినా ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు తనకు గురువు లాంటి వారిని, ఎందరినో నిష్కల్మషంగా ప్రోత్సహించే ఆయనకు తన పుస్తకం అంకితం ఇవ్వాలనుకున్నానని తెలిపారు. ప్రముఖ కథకుడు శరత్ చంద్ర గారు తనకు ప్రపంచ కథకుడిగా కీర్తి ప్రతిష్టలు తెచ్చారని కృతజ్ఞతలు తెలిపారు. అధిక సంఖ్యలో జేగురుపాడు గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యులు, సాహితీవేత్తలు పాల్గొన్న ఈ కార్యక్రమం ఆద్యంతం ఉద్వేగ భరితంగా కొనసాగింది. 



08 ఫిబ్రవరి, 2026

పౌరాణిక దృష్టాంతాల ద్వారా విలువలు ప్రబోధిస్తున్న ‘దార్ల మాట’ శతకం

 

నినాదం దినపత్రిక, సాహిత్య అనుబంధం: 8.2.2026 సౌజన్యంతో ...

పౌరాణిక దృష్టాంతాల ద్వారా విలువలు ప్రబోధిస్తున్న ‘దార్ల మాట’ శతకం

-డి. సాయినాథ్ రెడ్డి

సెంట్రల్ యూనివర్సిటి, హైదరాబాద్ 



సాహిత్యం కేవలం అక్షర విన్యాసం కాదు; అది ఒక సామాజిక అవసరం. "సహితస్య భావ: సాహిత్యం" అన్నట్లుగా, సమాజానికి మేలు చేసే ఆలోచనల సమాహారమే సాహిత్యం. భారతీయ అలంకార శాస్త్రవేత్తలు సాహిత్య ప్రయోజనాన్ని అద్భుతంగా వివరించారు. ఆచార్య మమ్మటుడు తన కావ్యప్రకాశంలో"కావ్యం యశసే/ అర్థకృతే వ్యవహారవిదే శివేతరక్షతయే |

సద్యఃపరనిర్వృతయే/కాంతాసమ్మితతయోపదేశయుజే ||" అని పేర్కొన్నాడు. అంటే కావ్యం వల్ల కీర్తి, ధనం, లోక వ్యవహార జ్ఞానం కలుగుతాయి. అమంగళం తొలగిపోతుంది (శివేతరక్షతయే). అన్నిటికంటే ముఖ్యంగా, ప్రియురాలు చెప్పినట్లుగా హితవును బోధించే 'కాంతాసమ్మిత' ఉపదేశం లభిస్తుంది. మానవుడిని సంస్కరించి, ఉన్నతుడిగా తీర్చిదిద్దడమే సాహిత్య ప్రధాన ప్రయోజనం.

ఈ క్రమంలో తెలుగు సాహిత్యంలో 'శతకం' ఒక శక్తివంతమైన సాధనంగా నిలిచింది. పండితుల నుండి పామరుల వరకు అందరినీ ప్రభావితం చేయగలిగే ప్రక్రియ ఇది. భర్తృహరి తన సుభాషిత త్రిశతి (నీతి శతకం)లో:"సాహిత్య సంగీత కళా విహీనః సాక్షాత్ పశుః పుచ్ఛవిషాణహీనః |"అని పేర్కొన్నాడు. అంటే సాహిత్యం, సంగీతం, కళల పట్ల అవగాహన లేని మనిషి తోక, కొమ్ములు లేని సాక్షాత్ పశువు వంటివాడు. అలాగే హితోపదేశంలో కూడా "ధర్మేణ హీనాః పశుభిః సమానాః" అని చెప్పబడింది. అంటే ఆహార నిద్రా భయ మైథునాలు పశువులకు, మనుషులకు సమానమైనప్పటికీ, మనిషిని వివేకవంతుడిగా మార్చే 'నీతి' లేదా 'ధర్మం' లేనివాడు పశువుతో సమానం. ఈ ప్రాచీన నైతిక సూత్రాలనే వర్తమాన కాలానికి అన్వయిస్తూ, నిత్య జీవితంలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితుల్లో మనిషి ఏ మార్గంలో నడవాలో బోధించే బాధ్యతను తెలుగు శతక కవులు స్వీకరించారు. వేమన, సుమతీ వంటి ప్రాచీన శతకాలు తెలుగువారి నైతిక జీవితాన్ని శతాబ్దాలుగా శాసిస్తూనే ఉన్నాయి. అయితే, నేటి గ్లోబలైజేషన్ కాలంలో మానవీయ విలువలు అడుగంటుతున్నాయి. సాంకేతికత పెరిగినా సంస్కారం తగ్గుతున్న తరుణంలో, వర్తమాన సామాజిక స్థితిగతులకు అనుగుణంగా కొత్త నీతిని ప్రబోధించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ శూన్యాన్ని పూరిస్తూ, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారు తనదైన శైలిలో ‘దార్ల మాట’ (తేటగీతి) నీతి శతకాన్ని అందించారు. ప్రాచీన విలువలను ఆధునిక జీవనశైలికి అన్వయిస్తూ, సరళమైన భాషలో సమాజానికి ఒక కొత్త దిశానిర్దేశం చేసిన ఈ శతకంపై లోతైన అధ్యయనం నేటి తరం విద్యార్థులకు ఎంతో అవసరం. 2021లో వెలువడిన ‘దారి పూలతోట దార్ల మాట’ (ఆటవెలది) తర్వాత వచ్చిన ఈ తేటగీతి శతకం, ‘దారి చూపించునట్టిది దార్ల మాట’ అనే మకుటంతో పాఠకుల అంతఃశ్చేతనను మేల్కొల్పుతోంది.

పౌరాణిక గాథలతో కుటుంబ విలువల బోధన: 

ఈ శతకంలో తల్లిదండ్రుల సేవతో పాటు, 'మంచి మిత్రుడు' ఎలా ఉండాలి అనే విషయానికి పురాణాలలోని శ్రీకృష్ణ-కుచేల సంఖ్యానిని, 'ధర్మం' విజయానికి ఎలా దారి తీస్తుందో చెప్పడానికి మహాభారత నేపథ్యాన్ని కవి అద్భుతంగా వాడుకున్నారు.కుటుంబంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం ఆ వంశానికే వన్నె తెస్తుంది.

’’ వంశ గౌరవ మన్నది వాక్కు తోడ

సత్య మెప్పుడు వీడక సాగ వలయు

మాట తప్పని వానికి మన్ననబ్బు

దారి చూపించు నట్టిది దార్ల మాట’’ ఇది రామాయణంలోని శ్రీరాముని (క్రీ.పూ. 5000 ఏళ్ల క్రితం) 'ఏక వాక్య' పరిపాలనకు నిదర్శనం. ఇచ్చిన మాట కోసం రాజ్యాన్ని త్యాగం చేయడం వల్ల ఇక్ష్వాకు వంశం చరిత్రలో అమరమైంది. కుటుంబంలో సభ్యులు ఒకరికొకరు నమ్మకంగా, సత్యంతో ఉన్నప్పుడే ఆ వంశం గౌరవించబడుతుందనే పౌరాణిక సత్యాన్ని కవి ఎంతో బలంగా మనసులో నాటుకుపోయేలా చెప్పారు.

మాతృత్వం - త్యాగశీలత :

మూర్తిమత్వ వికాసంలో మాతృప్రేమ ఒక గొప్ప సంస్కార పరిమళాన్ని ఈ శతకంలోని కొన్ని పద్యాలలో చూడవచ్చు.

‘’ఆకలిని తీర్చు తల్లిని ఆదు కొనగ

ఆమె త్యాగము మరువని హృదయ మదియె

ప్రేమ పంచెడి మాతయే దైవ మౌను

దారి చూపించు నట్టిది దార్ల మాట’’ ఇది భాగవతంలోని శ్రీకృష్ణుని (క్రీ.పూ. 3100 ప్రాంతం) మాతృభక్తిని స్ఫురింపజేస్తుంది. విశ్వమంతా తన నోటిలో ఉన్నా, తల్లి యశోదకు బిడ్డగా లోబడి ఉండటం ఆయన గొప్పతనం. తల్లిని దైవంగా భావించే సంస్కారమే మనిషిని చరిత్రలో మహోన్నత వ్యక్తిగా తీర్చిదిద్దుతుందనే భావోద్వేగ సత్యాన్ని కవి ఇక్కడ ఆవిష్కరించారు.

కుటుంబ అనుబంధాలు - నైతిక విశ్లేషణ

తల్లి, తండ్రి, అన్నయ్య, తమ్ముడు, సోదరి, భార్య వంటి కుటుంబ సంబంధాలను ఈ శతకంలో చక్కని దృష్టాంతాలతో వివరించడం ఒక విశేషం.

నవ మాసములు మోసి నడక నేర్పి

ఆకలిని తీర్చు తల్లిని ఆదు కోవ

ప్రేమ పంచెడి మాతయే దైవ మనగ

దారి చూపించు నట్టిది దార్ల మాట.

ఇది భాగవతంలోని శ్రీకృష్ణుని (క్రీ.పూ. 3102 ప్రాంతం) మాతృభక్తిని స్ఫురింపజేస్తుంది. విశ్వరూపాన్ని చూపిన పరమాత్మ కూడా యశోదమ్మ ప్రేమకు కట్టుబడినట్లు, మనిషికి తన తల్లిని మించిన దైవం లేదని ఈ పద్యం బోధిస్తుంది.

కష్ట పడి నిన్ను పెంచెడి కన్న తండ్రి

వంశ గౌరవ మెప్పుడు నిలుప జూచు

తండ్రి మాటను మరువని తనయు డొప్పు

దారి చూపించు నట్టిది దార్ల మాట.

రామాయణంలోని శ్రీరాముడు (త్రేతాయుగం) తండ్రి మాట కోసం రాజ్యాన్ని తృణప్రాయంగా వదిలి అడవులకు వెళ్ళిన చారిత్రక సత్యాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. తండ్రి ఆశయాలను గౌరవించడమే బిడ్డల ప్రథమ కర్తవ్యం.

తండ్రి వలె నిన్ను సాకెడి త్యాగ శీలి

అన్న అండగ నున్నచో భయము లేదు

అన్న అడుగుల జాడల నడువ వలయు

దారి చూపించు నట్టిది దార్ల మాట.

భారతంలో ధర్మరాజు అడుగుజాడల్లో నడిచిన భీమార్జున నకుల సహదేవుల అనుబంధం ఇక్కడ స్మరణీయం. అన్నను తండ్రిగా భావించే సంస్కారం కుటుంబ సౌభాగ్యానికి మూలం.

కష్ట కాలాన తోడుగ కలిసి నిలుచు

అన్న మాటకు విలువను ఆదరించు

తమ్ము డన్నను ప్రాణము తనయు డనగ

దారి చూపించు నట్టిది దార్ల మాట.

 రామాయణంలో లక్ష్మణుని (క్రీ.పూ. 5000 ఏళ్ల క్రితం) నిస్వార్థ సేవ ఇక్కడ అద్భుత దృష్టాంతం. అన్న సుఖం కోసం తన సుఖాన్ని వదిలిన తమ్ముడున్న ఇల్లు నందనవనమవుతుంది.

అమ్మ వలె నీకు మమతను పంచ గలుగు

ఆడ పడుచును గౌరవ పరచ వలయు

అక్క చెల్లెలి దీవెన అండ యగును

దారి చూపించు నట్టిది దార్ల మాట.

 ఇది భారతంలోని సుభద్ర పట్ల కృష్ణార్జునులు చూపిన గౌరవాన్ని గుర్తు చేస్తుంది. సోదరిని ఆదరించే చోట సంస్కారం పరిమళిస్తుంది.

సుఖము కష్టము సమముగ జూచు నామె

భార్య గౌరవ మున్నచో భాగ్య మబ్బె

సతిని గౌరవ ముంచిన శాంతి కలుగు

దారి చూపించు నట్టిది దార్ల మాట.

అరణ్య వాసంలోనూ శ్రీరాముని వెన్నంటి నిలిచిన సీతమ్మ ఆదర్శం ఇక్కడ కనిపిస్తుంది. భార్యను అర్థాంగిగా గౌరవించే కుటుంబమే ఆర్థికంగా, సామాజికంగా వృద్ధి చెందుతుంది.

మంచి గుణముల బిడ్డలు వంశ జ్యోతి

చదువు నేర్చిన బిడ్డలే సంపద యిల

వినయ మున్నచో బిడ్డల గెలుపు నిశ్చయము

దారి చూపించు నట్టిది దార్ల మాట.

లోక కళ్యాణం కోసం తండ్రిని ఎదిరించి నిలిచిన ప్రహ్లాదుని (క్రీ.పూ. పురాణ కాలం) జ్ఞాన వైరాగ్యాలు ఇక్కడ స్ఫూర్తిదాయకం. సంతానానికి ఆస్తి కంటే సంస్కారాన్ని ఇవ్వడం ముఖ్యం.

కలిసి మెలిసియు నున్నచో బలము కలుగు

విడిచి పోయిన కష్టము కలుగు నెపుడు

ఐక్య మత్యమే లోకాన గొప్ప శక్తి

దారి చూపించు నట్టిది దార్ల మాట.

ప్రపంచ యుద్ధాల కాలంలో (1914-1945) ఐక్యత లేని రాజ్యాలు ఎలా కూలిపోయాయో చరిత్ర చెబుతుంది. విభజన వినాశనానికి, ఐక్యత వికాసానికి దారి తీస్తుందని ఈ పద్యం హెచ్చరిస్తుంది.

నమ్మకమ్మే గద మరి నవని యందు

మోస మెన్నడు జేయక మొనసి బ్రతుకు

నిజము పల్కెడి వానికె నిశ్చయముగ

దారి చూపించు నట్టిది దార్ల మాట.

సత్యం కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన హరిశ్చంద్రుని (త్రేతాయుగం) చరిత్ర ఇక్కడ గొప్ప దృష్టాంతం. కుటుంబ సభ్యుల మధ్య నమ్మకమే అసలైన పునాది.

ప్రేమ పంచెడి మనసులే పృథివి యందు

శాంతి మార్గము వీడక సాగ వలయు

ధర్మ మెప్పుడు రక్షించు ధరను నిలచి

దారి చూపించు నట్టిది దార్ల మాట.

ఇది మహాత్మా గాంధీ (1869-1948) అహింసా సిద్ధాంతాన్ని, ధర్మో రక్షతి రక్షితః అనే పురాణ సూక్తిని మేళవిస్తుంది. ద్వేషం కంటే ప్రేమ శక్తివంతమైనదని, అదే కుటుంబానికి, లోకానికి క్షేమమని ఈ పద్యం సిద్ధాంతీకరిస్తుంది.

నిస్వార్థ స్నేహం - శ్రీకృష్ణ, కుచేల అనుబంధం:

మంచి మిత్రుడి లక్షణాన్ని వివరిస్తూ కవి ఒక పద్యాన్ని ఇలా మలిచారు:

ఆప దందున ఆదుకొను నట్టి వాడె

మంచి మిత్రుడు జగతిని మరువ వలదు

అద్ద మట్లుగ నిజమును నాడ వలయు

దారి చూపించు నట్టిది దార్లమాట.

భాగవత పురాణంలో శ్రీకృష్ణుడు ద్వారకాధీశుడై ఉండి కూడా, దారిద్ర్యంలో ఉన్న తన బాల్య మిత్రుడు కుచేలుడిని ఆలింగనం చేసుకుని ఆదరిస్తాడు. ఏమీ ఆశించకుండానే మిత్రుడి కష్టాలను తీరుస్తాడు. కవి ఈ పద్యంలో అదే స్ఫూర్తిని పంచుతున్నారు. ధనం, హోదా ఉన్నప్పుడు వచ్చే స్నేహితుల కంటే, ఆపదలో ఉన్నప్పుడు అండగా నిలబడేవాడే 'నిజమైన మిత్రుడు' అని చెప్పడం ద్వారా శ్రీకృష్ణుని స్నేహ ధర్మాన్ని ఇక్కడ స్ఫురింపజేశారు.

ధర్మో రక్షతి రక్షితః - భారతీయ ధర్మ సూత్రం:

ధర్మం, సత్యం యొక్క శక్తిని వివరిస్తూ కవి ఇలా వర్ణించారు.

ధర్మ మెప్పుడు రక్షించు ధరణి నిలచి

న్యాయ మార్గము వీడక నడవ వలయు

సత్య నిరతియే మనిషికి శక్తి యగును

దారి చూపించు నట్టిది దార్లమాట. "ధర్మో రక్షతి రక్షితః" అనే సుప్రసిద్ధ పౌరాణిక సూత్రం స్పష్టంగా కనిపిస్తుంది. మహాభారత యుద్ధంలో పాండవులు ధర్మ పక్షాన నిలిచారు కాబట్టే, భగవంతుని అండతో విజయం సాధించారు. అధర్మం తాత్కాలికంగా గెలిచినట్లు కనిపించినా, అంతిమంగా ధర్మమే లోకాన్ని కాపాడుతుందనే సనాతన సత్యాన్ని కవి ఇక్కడ నొక్కి చెప్పారు. సత్యమే హరిశ్చంద్రుడికి, ధర్మరాజుకు ఏ విధంగా శక్తిని ఇచ్చిందో, నేటి సామాన్యుడికి కూడా అదే శక్తినవుతుందని కవి విశ్లేషించారు.

గురుశిష్య సంబంధం - గురుదేవోభవ:

గురువు ప్రాముఖ్యతను వివరిస్తూ కవి చెప్పిన పద్యంలో గురు బ్రహ్మ తత్త్వం ధ్వనిస్తుంది.

గురువు నేర్పిన విద్యయే గురుతు నిలుచు

జ్ఞాన దీపము వెలిగించు నవని యందు

గురుని దీవన నున్నచో గెలుపు నిశ్చయము

దారి చూపించు నట్టిది దార్లమాట. పురాణాల్లో ద్రోణాచార్యుడు, వశిష్ఠుడు వంటి గురువుల మార్గదర్శకత్వంలో శిష్యులు ఏ విధంగా అజేయులయ్యారో మనకు తెలుసు. "ఆచార్య దేవోభవ" అనే ఉపనిషత్ వాక్యాన్ని కవి ఇక్కడ పద్య రూపంలో పునరుద్ధరించారు. గురువు కేవలం అక్షరాలు నేర్పేవాడు కాదు, హృదయంలో జ్ఞాన దీపాన్ని వెలిగించే 'సంస్కార ప్రదాత' అని వర్ణించడం ద్వారా భారతీయ సాంస్కృతిక మరియు పౌరాణిక వారసత్వాన్ని కవి చాటి చెప్పారు.

సాంఘికీకరణ ప్రక్రియలో కుటుంబం, పాఠశాల, కళాశాల, విశ్వ విద్యాలయం ... అత్యంత ముఖ్యమైనవి. ఇక్కడ ఏర్పడిన పునాదులే ఆ వ్యక్తిని ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దడంలో సహకరిస్తుంది. ఇక్కడ పెరిగిన విధానమే సమాజంలో కనిపిస్తుంది. ఈ విషయాలను ఈ శతకంలో ఎంతో సాధికారికంగా వర్ణించారు కవి. వీరుడిగా తీర్చిదిద్దడం ఇక్కడ గొప్ప సామాజిక దృష్టాంతం.

బాల్యం - పాఠశాల క్రమశిక్షణ (Formal Schooling):

అక్షర జ్ఞానంతో పాటు సామాజిక మర్యాదలను నేర్చుకునే దశ ఇది.

బడిని నేర్చిన విలువలె బ్రతుకు బాట

పుస్తకమ్ముల జ్ఞానము పుడమి రక్ష

వినయ మున్నచో విద్యయు విల్లసిలును

దారి చూపించు నట్టిది దార్ల మాట.

ప్రాచీన గురుకులాల్లో విద్యార్థులు సమిధలు సేకరించడం నుండి వేదాధ్యయనం వరకు చేసేవారు. "వినయమున్నచో విద్యయు విలసిలును" అనడంలో 'విద్యా దదాతి వినయం' అనే సంస్కృత సూక్తిని కవి ఇక్కడ సాంఘికీకరణకు పునాదిగా మార్చారు.

కౌమారం - కళాశాల లక్ష్యశుద్ధి (Skill and Focus):

ఈ దశలో విద్యార్థి తన మూర్తిమత్వాన్ని బాహ్య ప్రపంచం నుండి కాపాడుకుంటూ లక్ష్యం వైపు సాగాలి.

తనదు రూపము తానును తలవ వలయు

వేష భాషల వింతలు వెలయ వలదు

అచ్చ తనమున బ్రతుకగ అంద మబ్బు

దారి చూపించు నట్టిది దార్ల మాట.

మహాభారతంలో కర్ణుడు తన మిత్రుడు దుర్యోధనుడి కోసం తప్పుడు దారిలో వెళ్ళడం వల్ల పతనమయ్యాడు. కానీ అర్జునుడు లక్ష్యశుద్ధితో ఉన్నత విద్యను సాధించాడు. కళాశాల దశలో స్నేహం అనేది వ్యక్తిని నిర్మించవచ్చు లేదా పతనం చేయవచ్చు. అందుకే "చెడును వీడి మంచిని చేరవలయు" అని కవి ఇక్కడ విద్యార్థులను హెచ్చరించారు.

యవ్వనం - విశ్వవిద్యాలయ వివేకం (Higher Wisdom):

విశ్వవిద్యాలయ స్థాయికి వచ్చేసరికి కేవలం మార్కులు మాత్రమే కాదు, సమాజాన్ని మార్చే ఆలోచనలు రావాలి.

శాస్త్ర జ్ఞానము పెరిగిన చాల దనగ

మానవత్వపు విలువలె మనిషి కందము

లోక రీతిని దెలిసిన లోక జ్ఞాని

దారి చూపించు నట్టిది దార్ల మాట.

చారిత్రక మేధావి డా. బి.ఆర్. అంబేద్కర్ (1891-1956) ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలలో చదివినా, తన జ్ఞానాన్ని సమాజంలోని అట్టడుగు వర్గాల విముక్తి కోసం వాడారు. ఉన్నత విద్య అభ్యసించే వ్యక్తి కేవలం మేధావిగానే కాదు, 'మానవత్వపు విలువలు' కలిగిన పౌరుడిగా నిలబడాలని కవి ఇక్కడ సిద్ధాంతీకరించారు.

పరిణతి - సమాజంలో ఉత్తమ పౌరుడు (The Ideal Citizen):

చివరకు అన్ని దశలు దాటిన వ్యక్తి సమాజానికి ప్రతిఫలంగా ఏమి ఇస్తున్నాడనేదే ముఖ్యం.

నలుగురైనను మెచ్చగ నడుప వలయు

మంచి వాడును లోకాన వెలయ వలయు

ధర్మ మెప్పుడు రక్షించు ధరణి నిలచి

దారి చూపించు నట్టిది దార్ల మాట.

ఇది మహాత్మా గాంధీ (1869-1948) జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. ఆయన పొందిన విద్య, ఎదుర్కొన్న అనుభవాలు చివరకు ఆయనను ఒక 'మహాత్ముడిగా' సమాజానికి అర్పించాయి. "నలుగురు మెచ్చడం" అంటే వ్యక్తి సామాజిక బాధ్యతను (Social Responsibility) నెరవేర్చడమే.

సారాంశంగా చెప్పాలంటే, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారి 'దార్ల మాట' శతకం కేవలం ప్రాచీన నీతులను వల్లెవేసే పుస్తకంగా చూడలేం; అది ఆధునిక మానవుడిని సంస్కరించే ఒక 'మానవీయ మ్యానిఫెస్టో'గా కనిపిస్తుంది. సాంఘికీకరణ ప్రక్రియలో కుటుంబం వేసిన సంస్కార పునాది నుండి, విశ్వవిద్యాలయం ప్రసాదించిన వివేకం వరకు, మనిషి ఎలా ఒక పరిపూర్ణ మూర్తిమత్వాన్ని (Personality) సంతరించుకోవాలో కవి దీనిలో సోదాహరణంగా వివరించారు. పౌరాణిక గాథలను వర్తమాన సామాజిక సంక్షోభాలకు అన్వయించడం ద్వారా, ఈ శతకం పాఠకులకు/ విద్యార్థులకు ఒక చారిత్రక స్పృహను, నైతిక స్థైర్యాన్ని కల్పిస్తోంది. గ్లోబలైజేషన్ ఉధృతిలో కొట్టుకుపోతున్న విలువలను కాపాడుకోవడానికి 'దార్ల మాట' ఒక ఆత్మీయమైన దిక్సూచిలా నిలుస్తుంది. విద్యార్థులు, మేధావులు, సామాన్య పాఠకులు తప్పక చదవాల్సిన ఈ శతకం, తెలుగు నీతి సాహిత్య చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని పదిలం పేరుకుంటుంది. ధర్మం వైపు నడిచే ప్రతి అడుగుకూ, నిజాయితీతో కూడిన ప్రతి బ్రతుకూ 'దారి చూపించునట్టిది దార్ల మాట' అన్న మకుటం ఒక నిరంతర ప్రేరణగా ఎంతో ఔచిత్యంతో ఉందనిపిస్తుంది.

( ఈ శతకంలోని మరికొన్ని అంశాలను మరొక వ్యాసంలో తెలుసుకుందాం)



31 డిసెంబర్, 2025

డా. వూటుకూరి వరప్రసాద్ గారి వ్యాస సంపుటి 'భిన్న స్వరాలు'

 


డా. వూటుకూరి వరప్రసాద్ గారు మంచి కవి, విమర్శకులు. అంతకుమించి ఉత్తమ ఉపాధ్యాయులు, వీటన్నింటికీ మించి దైవ భక్తులు. మనిషిని ప్రేమిస్తారు. ఆయనతో కాసేపు మాట్లాడితే మనసంతా హాయిగా ఉంటుంది. దానికి కారణం ఆయన మాటల్లోని స్వచ్ఛత. ఆయన కవిత్వం చదివినా, ఆయన వ్యాసాలు చదివినా అంతే ఆనందాన్నీ, విజ్ఞానాన్నీ కలిగిస్తాయి. ఆయన అప్పుడప్పుడు రాసిన కొన్ని వ్యాసాలను ఒక పుస్తకంగా ప్రచురిస్తున్నారు. కవులు, సాహితీవేత్తలు, వైద్యులు, వివిధ రంగాలలో పనిచేసిన గొప్ప వాళ్ళలో కొంతమంది గురించి ఒక్కొక్క వ్యాసంగా రాసి ఆ వ్యాసాల సంపుటిని ఒక పుస్తకంగా ప్రచురిస్తున్నారు.

_______________

తెలుగు భాషా సాహిత్యాలకు ఎనలేని కృషిచేసిన సి.పి.బ్రౌన్ కృషిని తన వ్యాసంలో కొండను అద్దంలో చూపించినట్లుగా అద్భుతంగా వివరించారు. సి.పి.బ్రౌన్ గురించి బంగోరె, ఆచార్య కొత్తపల్లి వీరభద్రరావు, డా॥ జానమద్ది హనుమచ్చాస్త్రి, డా॥ జోలెపాలెం మంగమ్మ, వి. చెంచయ్య మొదలైన వారు వివిధ గ్రంథాలు రచించారు. ఆ గ్రంథాల్లో సారాంశాన్ని, అది కూడా తెలుగు భాషా సాహిత్యాలకు చేసిన సేవను ఒక్క వ్యాసంలో అందించడం అభినందించతగ్గ విషయం.
______________

అలాగే ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు పొందిన క్యాన్సర్ వైద్యులు డా. నోరి దత్తాత్రేయుడు, సాఫ్ట్వేర్ రంగంలో దిగ్గజం సత్య నాదెండ్ల గురించి రాసిన వ్యాసాలు గొప్ప స్ఫూర్తిని కలిగిస్తాయి. వాళ్లు మన తెలుగు వాళ్ళు కావడం మనం మరింత గర్వించదగిన అంశాలని గుర్తుచేస్తాయి. సాంకేతిక యుగంలో ప్రపంచ గమనాన్ని మార్చిన మైక్రోసాఫ్ట్ వంటి అగ్రశ్రేణి సంస్థకు సీఈఓగా పనిచేసిన తెలుగువాడు సత్య నాదెళ్ళ జీవిత గాథను, నాయకత్వ లక్షణాలను ఈ వ్యాసం పరిచయం చేస్తుంది. వైఫల్యాల నుంచే విజయాలను సాధించాలనే ఆయన స్ఫూర్తిదాయక సిద్ధాంతం, మైక్రోసాఫ్ట్‌ను తిరిగి లాభాల బాట పట్టించడంలో ఆయన చూపిన అసాధారణ సామర్థ్యం ఇందులో విశ్లేషించారు.

భారతదేశానికి తొలి నోబెల్ తెచ్చిన రవీంద్రనాథ్ ఠాగూర్, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి గార్ల సాహిత్యంపై విలువైన అభిప్రాయాలను వ్యక్తీకరించారు.

దళిత, క్రైస్తవ సాహిత్యంపై పరిశోధన చేసిన డాక్టర్ వరప్రసాద్ ఆ సాహిత్యంలో కృషి చేసినటువంటి వ్యక్తుల గురించి రాసిన వ్యాసాలు ఎంతో ప్రామాణికంగా కనిపిస్తున్నాయి. రెవరెండ్ విలియం డాసన్, పురుషోత్తమ చౌదరి చేసిన క్రైస్తవ సాహిత్య సేవను అద్భుతంగా ఆవిష్కరించారు. సంకీర్తనా వాఙ్మయంలో అన్నమాచార్యులు, క్షేత్రయ్య, త్యాగయ్య వంటి భక్త కవులు తమదైన ముద్ర వేశారు. వారి కోవకు చెందిన, తెలుగులో తొలి క్రైస్తవ వాగ్గేయ కారుడు, కవి సార్వభౌముడు పురుషోత్తమ చౌదరి. తెలుగులో తొలి విదేశీ వాగ్గేయకారుడు రెవరెండ్. విలియం డాసన్ (1816-1875) జీవితం, ఆయన అందించిన విశేష సేవలను పరిచయం చేసే వ్యాసం ఉంది.

లండన్ మిషనరీ సొసైటీ తరపున విశాఖపట్నానికి వచ్చి, తెలుగు నేలపై స్థిరపడిన ఈ భక్తుడు, తెలుగు క్రైస్తవ కీర్తనల వాఙ్మయానికి గొప్ప పునాది వేశారు. తెలుగు భాషను అభ్యసించి, వందలాది కీర్తనలు రచించడంతో పాటు, వాటిని క్రోడీకరించి ముద్రించడం ద్వారా స్థానిక భక్తి సంప్రదాయానికి నూతన ఒరవడిని అందించారు. తెలుగు సాహిత్యానికి, భక్తి సంగీతానికి ఒక విదేశీయుడు అందించిన ఈ అమూల్యమైన సేవ గురించి ఈ వ్యాసం విశ్లేషిస్తుంది.

ఆధ్యాత్మిక రంగంలో తనదైన ప్రత్యేక ముద్రతో పాటు దళితులకు ప్రత్యేక ఆధ్యాత్మిక మార్గాన్ని సూచించిన సంత్ రవిదాస్ గురించి రాసిన వ్యాసం ప్రత్యామ్నాయ మత జీవన విధానాన్ని తెలియజేస్తుంది. హిందూ సమాజంలో అంతర్భాగంగా కనిపిస్తూనే సంత్ రవిదాస్ ప్రబోధించిన అంశాల యొక్క విలువను ఎంతో లోతుగా విశ్లేషించారు. ప్రాచీన భారతీయ సమాజంలో పాతుకుపోయిన కులాధిక్యతను, అసమానతలను ప్రశ్నించి, దైవం ముందు అందరూ సమానులే అని ప్రబోధించిన ఆ మహనీయుని జీవితం, భక్తి తాత్విక భావజాలాన్ని వివరిస్తుంది. మనిషి పుట్టుక కన్నా మంచి సంకల్పం, పవిత్రమైన కర్మలే గొప్పవని చాటిచెప్పిన ఆయన బోధనలు, నాటి సామాజిక జీవనంలో వెనకబాటుతనంతో మగ్గుతున్న ప్రజలకు గొప్ప మార్గదర్శిగా నిలిచాయి.

ఎంత తవ్వినా తరగని బంగారు గని లాంటి వాడు వేమన. ఆయన సామాజిక దృక్పథాన్ని పునర్ మూల్యాంకన దృష్టితో వరప్రసాద్ గారు చక్కగా వ్యాఖ్యానించారు. తెలుగు సాహితీ చరిత్రలో ఇతిహాసాల అనువాదాలు, పురాణాల ఆధారిత ప్రబంధాల ధోరణి కొనసాగుతున్న రోజుల్లో, వర్తమాన సామాజిక జీవన స్థితిగతులకు అద్దం పడుతూ రచనలు చేసిన తొలి సామాజిక కవి వేమన. 17వ శతాబ్దానికి చెందిన ఈ కవి, నాటి పాలకుల కుటిల నీతిని, మతాల సంఘర్షణను, మూఢత్వాన్ని, కుల మత భేదాలను ప్రశ్నించిన సామాజికాంశాలను ఈ వ్యాసం వివరిస్తుంది.

బోయి భీమన్నగారు అంబేద్కర్ మార్గాన్ని అనుసరిస్తూనే, వర్గ దృక్పథాన్ని కూడా ఎలా సమన్వయించుకోవాలో చెప్పడంలో ఎంతో నిష్ణాతులు. దాన్ని ‘కూలి-రాజు’ నాటకం ద్వారా ఎలా అన్వయించుకోవాలో వరప్రసాద్ గారు చక్కగా విశ్లేషించారు.

తెలుగు సాహిత్యంలో సంజీవ్ దేవ్ గొప్ప సౌందర్య అన్వేషకుడు. ఆయనను పరిచయం చేసిన వ్యాసం ఎంతో విలువైంది. ప్రకృతిని గురువుగా, దైవంగా, ఆప్తమిత్రుడిగా భావించి, “ప్రకృతిని ప్రేమించగలిగితే ప్రశాంత జీవనం సాధ్యమౌతుంది” అని ప్రకటించిన కళాతత్వవేత్త డాక్టర్ సంజీవ్ దేవ్. చిత్రకళా విమర్శకుడిగా, చిత్రకారుడిగా, తాత్వికుడిగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించిన ఆయన, మానవాళి క్షేమం కోసం తన ఆలోచనలను, ఆవిష్కరణలను ప్రజలందరికీ చేరువయ్యేలా చేయడానికి ప్రయత్నించారు.

నంబూరి పరిపూర్ణ గారి జీవితంలో పాటించిన అనేక ఆదర్శాలను వివరించిన వ్యాసం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. నంబూరి పరిపూర్ణ కథల్లోని ప్రగతిశీల భావాలు మూడు ముఖ్య అంశాలుగా కనిపిస్తాయి: 1.సామాజిక అసమానతలపై ప్రశ్నించడం…ఆమె రచనల్లో కులమత బేధాలు, బీద, గొప్ప తారతమ్యాలు, కర్మ సిద్ధాంతం వంటి సాంఘిక, మత సంబంధమైన ఆలోచనలపై చర్చ జరిపారు. 2.ఆధిపత్య ధోరణి ఖండించడం… కులాంతర వివాహం చేసుకున్న దంపతుల మధ్య అగ్రకులస్తుడైన భర్త (భూషణం) ప్రదర్శించే ఆధిపత్య ధోరణి, పనిచేయనితనాన్ని సమర్థించుకునే స్వభావాన్ని స్పష్టంగా చిత్రించారు, ఆర్థిక సంబంధాలు లేని మానవ సంబంధాలు నిలబడటం కష్టమని సూచించారు. 3.స్త్రీ సాధికారత ప్రేరేపించడం…‘లచ్చుప్ప’ పాత్ర ద్వారా, భర్త అన్యాయం చేసినా అధైర్యపడకుండా, వ్యక్తిగత ప్రేమ కంటే ప్రజాసేవకు, గ్రామాభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చి, సర్పంచ్‌ గా ఎదిగిన శ్రమశక్తి మరియు స్త్రీ మూర్తి రూపాన్ని ఆవిష్కరించారు.

దళిత సాహిత్యంపై వరప్రసాద్ రాసిన వ్యాసంలో పురుషులు, స్త్రీలు రాసిన దళిత సాహిత్యాన్ని విశ్లేషించారు. తెలుగు రచయిత్రులు తమ స్వేచ్ఛాయుత భావజాలాన్ని కవిత్వం, కథల ద్వారా సమాజంలో పంచుకున్న తీరును వివరిస్తూ, ఈ సంకలనంలో ‘దళితవాద దృక్పథం’ పై దీన్ని ఒక ప్రత్యేక వ్యాసంగా చెప్పుకోవచ్చు. కుల, లింగ వివక్షల కారణంగా దళిత స్త్రీలు ఎదుర్కొంటున్న అణచివేత, అదనపు కష్టాల వంటి సంక్లిష్ట సమస్యలను రచయిత్రులు తమ సృజనాత్మక రచనల్లో బలంగా ప్రశ్నించిన విధానం ఇందులో విశ్లేషించబడింది.

హర్షవర్థన్ గారి నానీలను విశ్లేషిస్తూ సమాజంలో ఉన్న సమస్యలను కవిత్వం చేసిన కవిగా అభివర్ణించారు. నా (ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు) ‘నెమలికన్నులు’ కవిత్వం గురించి ఒక చక్కని విశ్లేషణాత్మక వ్యాసం రాశారు. మరోవైపు, కృష్ణానదీ తీరాన వెలసిల్లిన ధాన్యకటకం (అమరావతి) తెలుగు రాజులైన శాతవాహనుల రాజధానిగా ప్రసిద్ధి చెందింది. బౌద్ధ, జైన, శైవ, వైష్ణవ, ముస్లిం, క్రైస్తవ సంప్రదాయ సంస్కృతుల ప్రభావాలను తనలో నింపుకుని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధానిగా నిలిచిన అమరావతి, నవ్యాంధ్ర రాష్ట్ర రాజధానిగా ఎంపిక కావడంతో పాటు, దాని చారిత్రక వైభవాన్ని గుర్తుచేస్తుంది. మొత్తం మీద వ్యక్తుల కేంద్రంగా కొనసాగిన ఈ పుస్తకం కొంతమంది వ్యక్తిత్వాలు పదిమందికి ఆదర్శనీయం అవుతాయో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.ఈ పుస్తకంలో కనిపించే ఏకసూత్రత అదే.

మొత్తం మీద డా.వూటుకూరి వరప్రసాద్ గారి ఆలోచనా తత్వాన్ని ఈ విధంగా క్రోడీకరించవచ్చుననుకుంటున్నాను.

వ్యక్తిత్వ ప్రేరణ (Inspiration through Individuals): తెలుగు భాషా సాహిత్యాలకు కృషిచేసిన సి.పి.బ్రౌన్, క్యాన్సర్ వైద్యులు డా. నోరి దత్తాత్రేయుడు, సాఫ్ట్‌వేర్ దిగ్గజం సత్య నాదెండ్ల వంటి గొప్ప వ్యక్తుల జీవితాలు, వారి విజయ గాథలు పదిమందికి ఆదర్శం కావాలని ఆయన బలంగా విశ్వసించారు.
_____________

సామాజిక, తాత్విక పునర్ మూల్యాంకనం (Socio-Philosophical Re-assessment): ఆయన రచనలు వేమన, సంత్ రవిదాస్, బోయి భీమన్న వంటి మహనీయుల సామాజిక దృక్పథాన్ని, భక్తి తాత్విక భావజాలాన్ని లోతుగా విశ్లేషించడం ద్వారా ప్రత్యామ్నాయ మత-సామాజిక జీవన విధానాలను మరియు సాహిత్య విమర్శకు ప్రాధాన్యతనిచ్చారు.
_______________

ప్రగతిశీల దృక్పథం (Progressive Outlook): దళిత మరియు క్రైస్తవ సాహిత్యం పట్ల ఆయనకున్న పరిశోధనాత్మక దృష్టి, అలాగే కుల, లింగ వివక్షలు వంటి సంక్లిష్ట సామాజిక సమస్యలను రచయిత్రులు ప్రశ్నించిన తీరును విశ్లేషించడం, ఆయనలోని ప్రగతిశీల భావజాలాన్ని ప్రతిబింబిస్తుంది.

సాహిత్య సమన్వయం (Literary Synthesis): ప్రపంచ గమనాన్ని మార్చిన ఆధునిక సాంకేతికత నాయకుల (సత్య నాదెండ్ల) స్ఫూర్తి, వేదనాత్మక దళిత కవిత్వం (దార్ల వెంకటేశ్వరరావు గారి ‘నెమలికన్నులు’) మరియు ప్రాచీన భక్తి కీర్తనల వాఙ్మయాన్ని (విలియం డాసన్, పురుషోత్తమ చౌదరి) ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా గతం-వర్తమానం-భవిష్యత్తుల మధ్య చైతన్య స్ఫూర్తిని నింపాలని ఆకాంక్షించారు.

ఈ వ్యాసాల ద్వారా డా.వూటుకూరి వరప్రసాద్ గారిలోని విమర్శతత్వం, లోతైన తాత్వికతను మనం చూడగలుగుతాం. మంచి వ్యాసాలను అందించిన రచయితకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు , తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్ 

( ఈ వ్యాసం సృజన క్రాంతి దినపత్రిక, ఆదివారం 28.12.2025 వ తేదీన ప్రచురితమైంది)

20 డిసెంబర్, 2025

కృష్ణవేణి, పుష్పిణిలకు సెంట్రల్ ‘వర్సిటీ డాక్టరేట్

కృష్ణవేణి, పుష్పిణిలకు సెంట్రల్ ‘వర్సిటీ డాక్టరేట్


 హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖలో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో పరిశోధనలు చేసిన గొంగులూరి కృష్ణవేణి, దారిశెట్టి పుష్పిణిలకు హెచ్ సియు పిహెచ్.డి. డాక్టరేట్ డిగ్రీలను ప్రకటించింది. తార ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సంగారెడ్డిలో పార్ట్ టైమ్ తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న శ్రీమతి జి. కృష్ణవేణి ‘తెలుగు సాహిత్య చరిత్రలు-పరిశీలన’అనే అంశంపైనా, శ్రీమతి దారిశెట్టి పుష్పిణి ‘మరుపూరు కోదండరామరెడ్డి జీవితం, రచనలు సమగ్రపరిశీలన’ అనే అంశంపై పరిశోధన చేశారు. ఇరువురూ యూజిసి వారి రీసెర్చ్ ఫెలోషిప్ పొంది, పరిశోధన చేశారు. ఇరువురూ ఎం.ఏ. తెలుగు, పిహెచ్.డి. లను సెంట్రల్ యూనివర్సిటీలోనే పూర్తి చేసి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక పరిశోధన పత్రాలను సమర్పించారు. అనేక పరిశోధన పత్రికల్లో పరిశోధన పత్రాలను రాశారు. ఇరువురికీ డాక్టరేట్ డిగ్రీకి అర్హత పొందినట్లు హెచ్ సియు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ కార్యాలయం వారు ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇరువురికీ వచ్చే యేడాది అక్టోబరు లో జరిగే స్నాతకోత్సవంలో డిగ్రీపట్టాలను ప్రదానం చేస్తారు. తమ ఇరువురూ అధ్యాపక వృత్తి అంటే ఇష్టమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య పిల్లలమర్రి రాములు, పర్యవేక్షకులు, తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, ఇతర అధ్యాపకులు, కుటుంబ సభ్యులు ఇరువురి పరిశోధకులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
నినాదం దినపత్రిక 20.12.2025 సౌజన్యంతో 
నమస్తే తెలంగాణ దినపత్రిక 20.12.2025 సౌజన్యంతో 
తరణం దినపత్రిక 20.12.2025 సౌజన్యంతో 

ఆంధ్ర జ్యోతి నపత్రిక 20.12.2025 సౌజన్యంతో 
సాక్షి దినపత్రిక 20.12.2025 సౌజన్యంతో 


ఆంధ్రప్రభ దినపత్రిక 20.12.2025 సౌజన్యంతో 

లోకల్ గైడ్  తెలంగాణ దినపత్రిక 20.12.2025 సౌజన్యంతో 

మన తెలంగాణ దినపత్రిక 20.12.2025 సౌజన్యంతో 

దిశ దినపత్రిక 20.12.2025 సౌజన్యంతో 


సాక్షి దినపత్రిక 20.12.2025 సౌజన్యంతో 


జన ప్రతిధ్వని దినపత్రిక 20.12.2025 సౌజన్యంతో