"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

19 జులై, 2011

మన సాహిత్య పరిశోధనలు - మన పర్యవేక్షకులు

surya literary page 18 -7-2011
తెలుగులో ఏదైనా ఒక కొత్తపుస్తకం వచ్చిందంటే దానిపై ఏడాది తిరక్కముందే ఏదొక విశ్వవిద్యాలయంలో పరిశోధన జరిగిపోతుందనే మాటల్ని వింటున్నాం.అంతేకాదు, విశ్వవిద్యాలయాల్లో పనిచేసే ప్రొఫెసర్స్‌ని లేదా పర్యవేక్షణార్హత ఉన్న డిగ్రీ అధ్యాపకుల్ని గాని ఆ గ్రంథావిష్కరణకు పిలిస్తే, సభలోనే హామీ కూడా దొరకవచ్చనేవ్యంగ్యబాణాలూ ఈ మధ్యనే కాదు, అంతకు ముందు నుంచే వినబడుతున్నాయి.నిజానికి చాలా సందర్భాల్లో అలా జరగడం కూడా చూస్తూనే ఉన్నాం.
కొన్ని పుస్తకాల విషయంలో పరిశోధన జరగవలసిన అవసరం ఉన్నా,  కనీసం ఆ కవితా/ కథా సంకలనం/నవలపై ఏ పత్రికలోనైనా సమీక్షలుగాని, వ్యాసాలుగాని వచ్చాయో లేదో పరిశోధకులు/ పర్యవేక్షకులుగమనిస్తున్నారో లేదో ఆధారగ్రంథాలే చెప్తున్నాయి. చాలా మంది వాటిని చూడ్డంలేదు.అలాంటప్పుడు, అసలు ఆ పరిశోధనాంశంపై పరిశోధకుడికి ఆసక్తి ఉందా? లేకపోతే పర్యవేక్షకుడు సూచించడం వల్లే దానిపై పరిశోధన చేస్తున్నాడో అనే అనుమానాలు కలగకమానవు.ఎలా చేసినా, అలాంటి పరిస్థితుల్లో వచ్చిన ఆ పరిశోధన ఆశయం ఎవరిదై ఉంటుంది? పరిశోధన డిగ్రీ పొంది, ఒకవేళ ముద్రణ జరిగి బయటకొచ్చినా, రాకున్నా, దానిపై చర్చజరిగినప్పుడు ఆ పరిశోధనలో కనుగొన్న లేదా ప్రతిపాదించిన లేదా సమన్వయించిన లేదా సేకరించిన అంశాలకు బాధ్యులెవరు? ఇవన్నీ చర్చనీయాంశాలు.
సృజనాత్మక రచయితల్లో చాలా మందికి ఒకప్రాపంచిక దృక్పథం ఉన్నట్లే, విమర్శకులకూ ఒక దృక్పథం ఉంటుంది.అలాంటిదే పరిశోధన చేయించే పర్యవేక్షకుల్లోను, పరిశోధకుల్లోను కనిపిస్తుంది.చాలా మంది ప్రాచీనసాహిత్యమో, ఆధునిక సాహిత్యమో ఇలా రకరకాల ప్రత్యేకాంశాల్లో మాత్రమే పరిశోధనలు చేయించేవారు, చేసేవాళ్ళూ ఉన్నారు.ఆ విభాగంలో మాత్రమే తమకు అవగాహన ఉండటం దీనికి ఒక ప్రధాన కారణం.ఒకవేళ ఆ విభాగంలో అవగాహన ఉన్నా, ఆ అంశాల పట్ల వ్యక్తిగతంగా తమకి ఇష్టం లేకపోవడం వల్ల కూడా దానిలో పరిశోధన చేయించరు.కేవలం ఈ అంశాలే పరిశోధన చేయించడానికి లేదా చేయడానికి కారణాలు కాని సందర్భాలు కూడా ఉండొచ్చు. భావజాలం నచ్చినా, ఆ పరిశోధకుడు/పర్యవేక్షకుడుకి ఆ అంశం నచ్చనప్పుడు తమ ఆసక్తుల్ని చంపుకుంటుంటారు.
తమ కులస్థుడైతేనో, తనప్రాంతానికి చెందినవాళ్ళైతేనో కూడా పరిశోధనలు చేయించడమో, చేయడమో జరుగుతుంటుంది.ఇప్పటి వరకు జరిగిన పరిశోధకుల్ని, పర్యవేక్షకుల్ని వారి వారి కులాల్ని గమనిస్తే, వారిరువురూ అత్యధికులు ఒకేకులానికి చెందినవాళ్లై ఉంటారు.ఇలాంటి కారణాలే తొలి, మలితరం పరిశోధకుల్లో అత్యధికంగా కనిపిస్తున్నాయి.విశ్వవిద్యాలయాల్లో జరిగిన పరిశోధనల్ని ఈ దృష్టితో పరిశీలిస్తే, ఈ విషయం స్ఫష్టమౌతుంది.
చాలా మంది పరిశోధనలు గురించి మాట్లాడినప్పుడల్లా,‘‘గతకాలము మేలు, వచ్చుకాలముకంటెన్‌’’ అన్నట్లు వ్యాఖ్యానిస్తుంటారు.నిజానికి నేడూ విలువైన పరిశోధనలన్నో జరుగుతున్నాయి.అయితే, నాటి తెలుగు భాషా, సాహిత్యాలపై జరిగే పరిశోధనలకీ, జరిగిన తీరుతెన్నులకీ ఎంతో వ్యత్యాసం ఉంది.
తొలితరం పరిశోధకులకు పరిశోధనాంశాలు విరివిగా ఉండటం వల్ల అప్పట్లో పెద్ద సమస్య ఉండేది కాదు. కేవలం కొన్ని వర్గాల వాళ్ళకే పరిశోధనావకాశాలు లభించేవి.వీళ్ళు ఒకపైపు పరిశోధనలు చేస్తూనే, తమ గురువుల సిఫారసుతో ఉద్యోగాల్లో చేరుతుంటే, మరొక సామాజిక వర్గానికి చదువుకోవడానికే అవకాశం లభించేది కాదు.ఆర్ధిక పరిస్థితులతో పాటు అనేక సామాజికాంశాలు పరిశోధనకు ఆటంకంగా నిలిచేవి. అవన్నీ జయించినా, పరిశోధన చేయాలకునేసరికి అనేక పరీక్షలకు గురవ్వాలి. కులం ప్రధాన అడ్డంకిగా నిలిచేది. తర్వాత పర్యవేక్షకులు సూచించిన అంశాన్నే చేయాలి.
నేటి పరిస్థితి అలాంటిది కాదు. విశ్వవిద్యాలయాల సంఖ్యతోపాటు, పరిశోధనలు చేసేవారి సంఖ్య పెరిగింది.నేడు చదువుకోవడం అందరికీ ఉన్న ఒక హక్కుగా మారి,విశ్వవిద్యాలయాల్లో ప్రజాస్వామిక వాతావరణం ప్రవేశించాక, తెలుగు భాషా సాహిత్యాలపై పరిశోధన చేసేవారిలో అత్యధికులు అట్టడుగు సామాజికవర్గాల వాళ్ళే కావడం జరుగుతోంది.కానీ,తొలితరంలో పరిశోధనలు చేసిన వారికున్నన్ని ఉపాధి అవకాశాలు నేడున్నాయని చెప్పలేం.చాలామంది డాక్టరేట్‌ చేసిన వాళ్ళుకు తన పరిశోధన ఉపయోగపడుతుందనే హామీలేని పరిస్థితి కనిపిస్తోంది.దీనికి కారణం, తమకి అవార్డులు ఇచ్చేవారిపైనో, ఇప్పించేవారి రచనలపైనో, తమకి ఉపయోగపడతారనుకొనేవారి ప్రభావంతోనో ఏదొక పరిశోధన చేయించేయడమే తప్ప, పరిశోధకుడి భవిష్యత్తు గురించి ఆలోచించని పర్యవేక్షకులు కూడా ఉన్నారు.
ఒక విద్యార్థి వామపక్ష ఉద్యమాల పట్ల అభిమానం ఉన్నవాడు. పరిశోధనకోసం వస్తే, ఒక గైడ్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలమున్న వారి రచనల పై పరిశోధన చేయించి సందర్భం ఉంది.అతని ఉద్యోగానికి డిగ్రీ కావాలి. అందువల్ల నోరు మూసుకొని ఆ పరిశోధన చేయాల్సివచ్చిందని వాపోయిన పరిస్థితి.దాన్నిప్పటికీ చెప్పుకోలేడు.ఇలాంటప్పుడు ఆ పరిశోధన ఆసక్తి ఎవరిదని చెప్పాలి? ఇలాంటి ఉదాహరణలెన్నో ఉన్నాయి. ఇటువంటివన్నీ పరిశీలించినప్పుడు, పరిశోధన అంశాన్ని సూచించడంలోను, చేయించడంలోను పర్యవేక్షకుడి పాత్ర ఎంతగానో ఉండటం వల్ల, భాషా సాహిత్య పరిశోధనల్లోపర్యవేక్షకుడి దృక్పథం కనిపించక తప్పదు.
 తన దగ్గర ‘‘ఇన్ని’’ పరిశోధనలు పూర్తయ్యాయనో, తమ పదోన్నతులకు ఆ సంఖ్యను ఉపయోగించుకోవడానికో మాత్రమే పర్యవేక్షణ చేయించేవాళ్ళనెలా చూడాలనే ప్రశ్న కూడా వస్తుంది. కొంతమంది తమ దగ్గర జరుగుతున్న పరిశోధనల శీర్షికలు కూడా తెలియని పర్యవేక్షకులున్నారు.ఇలాంటప్పుడు రెండు రకాలుగా పరిశోధన జరిగే అవకాశం ఉంది. పరిశోధకుడికి స్వేచ్ఛ ఉంటుంది.అందువల్ల తన భావాల్ని స్వేచ్ఛగా వ్యక్తీకరించుకోవచ్చు.ఒక్కోసారి, పర్యవేక్షకుడు నామమాత్రమైనా, మరో మార్గదర్శిగాని లేదా అనేకమంది అభిప్రాయాల వల్ల మంచి పరిశోధన వచ్చే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు దురదృష్టం ఏమిటంటే, ఆ పరిశోధనకి సంతకం పెట్టడం తప్ప ఏమీ తెలియకపోయినా పర్యవేక్షకుడికీ పేరొస్తుంది.ఒకవేళ పర్యవేక్షకుడు ఎంత చెప్పినా అవగాహన చేసుకోకుండా తన ఇష్టం వచ్చినట్లు రాసేసి, రకరకాల ఒత్తుళ్ళకు గురిచేసి పరిశోధనని పూర్తి చేయించేసుకొనే వాళ్ళు కూడా ఉంటారు.అటువంటప్పుడూ పర్యవేక్షకుడే మాటలు పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఏది ఏమైనా పరిశోధనలో కనిపించీ, కనిపించని ప్రేరకుడు పర్యవేక్షకుడే. పరిశోధన చూస్తే పర్యవేక్షకుడి దృక్పథం, భావజాలం కనిపిస్తుంటాయి. అలాగనీ అన్ని పరిశోధనలు అలాగే జరుగుతున్నాయనీ చెప్పలేం.

-Dr.Darla Venkateswara Rao,
Assistant Professor, 
Dept .of Telugu, 
University of Hyderabad, (Central University), 
Gachibowli, Hyderabad-500 046 
e-mail: vrdarla@gmail.com 
Ph: 040-23133563 (O), Mobile: 09989628049,

 

1 కామెంట్‌:

Afsar చెప్పారు...

దార్ల:

మంచి విషయం చర్చకి తీసుకువచ్చారు. నిజానికి మన విశ్వవిద్యాలయాల తెలుగు శాఖల్లో వున్న కొత్త తరం అధ్యాపకులంతా వొక చోట సదస్సు నిర్వహించి, చర్చించాల్సిన విషయాలు ఇందులో వున్నాయి. కానీ, ఈ కొత్త తరం అధ్యాపకులని ఏకతాటిపైకి తీసుకువచ్చే వొక బృందం కావాలి ఇప్పుడు. అది సాధ్యపడుతుందేమో ఆలోచించండి. ఆ తరవాత పరిశోధనల తీరు కొంత అయినా మారుతుంది.

ఇక పరిశోధకుల గురించి. ఉపాధి ముఖ్యం. కానీ, పూర్వకాలపు పరిశోధనలు కేవలం ఉపాధి వల్లనే బాగుండేవని అనుకొను. ఒక అంకిత భావం కూడా పరిశోధకుల్లో వుండేది. చదవాలి, కొత్త విషయం శోధించాలి అన్న తపన కూడా వుండేది. అది ఇప్పుడు లోపిస్తుందని నా అనుమానం. మనకి పెద్ద సమూహాలు అక్కరలేదు, కనీసం పది పదిహేను మంది మంచి పరిశోధకులు వుంటే చాలు. కనీసం అయిదేళ్ళ పాటు నిరంతరాయంగా పని చేయాలన్న పట్టుదల వుంటే చాలు. లేదా, తామే తీసుకున్న అంశాల లోతు చూడాలన్న తపన వుంటే చాలు. మీలాంటి ఈ తరం అధ్యాపకులే ఈ పని చెయ్యగలరు.