Tuesday, October 26, 2010

డయాస్పోరా సాహిత్య గమ్యమేంటి?‘‘ పవిత్ర తెలుగు దేశాన్ని వదిలేసి అమెరికాలోనూ, ఇతర దేశాల్లోనూ పూర్వం జ్యూయిష్‌ వాళ్ళలా పరాయిదేశాల్లో సెటిల్‌ అయిపోయిన తెలుగు వాళ్ళ’’నే తెలుగు డయాస్పోరా ప్రజలు అనే కొంతమంది భావిస్తున్నారు. ఇంచుమించు ఇలాంటిదే నిఘంటువుల్లో ఒక వివరణ కనిపిస్తుంది. పరాయిదేశాలకు పారిపోయి అక్కడే  సెటిల్‌ అయిన వాళ్ళనే అర్థంలో కాకుండా, విద్య, ఉద్యోగ, వివాహాది కారణాల వల్ల ఆ యా రాష్ట్రాలు, దేశాల్లో ఉండే వాళ్ళనేది నిఘంటువు ఇచ్చే రెండవ వివరణ.  డయాస్పోరా సాహిత్యంపై రాస్తున్న వేలూరి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు దీన్నే సమర్థిస్తున్నారు.
ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతంలో అనేక యేళ్ళ పాటు గానీ, శాశ్వతంగా గాని నివసించేవాళ్ళు, తాము పుట్టి పెరిగిన ప్రాంతం మారడం ద్వారా కలిగిన తమ జీవితానుభవాల్ని ఏదొక ప్రక్రియలో రాస్తే దాన్ని డయాస్పోరా సాహిత్యం అంటారు.  దీన్నే ‘‘వలసవాద సాహిత్యం’’, ‘‘వలసాంధ్రసాహిత్యం’’, ‘‘ప్రాంతేతర ఆంధ్ర సాహిత్యంఅని కూడా పిలుస్తున్నారు.
డయాస్పోరా సాహిత్యం స్వరూప స్వభావాల పట్ల భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. ‘‘20 వ శతాబ్దంలో అమెరికా తెలుగు కథానిక’’ గురించి రాసిన ఒక వ్యాసంలో వేలూరి వెంకటేశ్వరరావు డయాస్పోరా లో చిన్న  d             (diaspora)  గమనించమన్నారు.   ‘‘ అమెరికా నుంచి వచ్చిన ప్రతి రచనా డయాస్పోరా రచనగా భావించడం గాని మొదలైయ్యిందా ?’’ అని అనుమానించానన్నారు. దీనికి సమాధానమా అన్నట్లు జంపాల చౌదరి ఇచ్చిన వివరణ ఉటంకించారు. ‘‘కొన్ని కథలలో కథాస్థలం మాత్రమే అమెరికా, వస్తువు, పాత్రలు, చిత్రీకరణ మొత్తం ఇండియా నుంచే. కథాస్థలాన్ని హ్యూస్టన్‌ బదులు హైదరాబాదు, చికాగో బదులు శ్రీకాకుళం చేసి కథల్ని పెద్దమార్పులు లేకుండా తిరగవ్రాస్తే, పాఠకులకు పెద్ద తేడా ఏమీ తెలియదు. వీటిని డయాస్పోరా కథలు అనలే’’ మన్నారు. అంటే ప్రాంతం మారినా, ఆ ప్రాంతంలో వాళ్ళ అనుభవాల్ని అవసరమైతే రెండు ప్రాంతాలతోను మిళితం చేసి రాసినా, అక్కడి జీవితానుభవమే వ్యక్తమయ్యే సాహిత్యం డయాస్పోరా సాహిత్యమవుతుంది. 
డయాస్పోరా రచయితలు గతాన్ని తలచుకుని, వర్తమానస్థితిగతులను సమీక్షించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఒంటరితనం నుండి సామూహిక జీవనం వైపు పయనించాలనే ఆకాంక్షను వ్యక్తం చేస్తుంటారు.తమ సంస్కృతే గొప్పదనుకున్న వాళ్ళు కూడా అనివార్యంగా ఇతరుల సంస్కృతుల్ని అంగీకరించక తప్పని పరిస్థితి ఎదురవుతుంది. మరి కొంతమంది వాటితో మమేకమవుతారు. భాషకు అధిక ప్రాధాన్యాన్నిస్తారు. దీన్లో భాగంగానే తమ మాతృభాష మాట్లాడడం, చదవడం, రాయడం చేస్తుంటారు. దాని ద్వారా తమ ప్రత్యేకతను కాపాడాలనుకుంటారు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ వీళ్ళ  సాహిత్య గమ్యం విచిత్రమైన మలుపులు తిరుగుతుంది.  
డయాస్పోరాసాహిత్యం మొదట్లో కుల, మత వస్తువుల్ని స్వీకరించకపోయినా, ఆ యా వర్గాల వారే కలిసి సాహిత్యసంస్థలు ప్రారంభించడంలో తమ వాళ్ళు కలవడానికో వేదికగా చేసుకుని సాహిత్యాన్ని, కళల్ని వినోదం కోసం ఉపయోగించుకుంటుంటారు. పైకి మాత్రం విలువల సాహిత్యంగా, తమ వారసత్వ సంపదగా చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. అందుకనే వీళ్ళు నిర్వహించే సాహిత్య సమావేశాల్లో అవధానాలకీ, ప్రయోగవాదాలకీ, చిత్రకవిత్వానికీ, పద్యకవిత్వానికీ ప్రాధాన్యానిస్తుంటారు. పైకి సాహిత్యసేవగా కనిపిస్తున్నా, ఆ సమావేశాల్లో ప్రకటించే సాహిత్యంలో సమకాలీన సమాజం అంతగా ప్రతిఫలించదు. 
సామూహికంగా మారాలనే ఆసక్తితో డయాస్పోరాసాహిత్యం మొదలైనా, మళ్ళీ తమకు తెలియకుండానే చిన్న చిన్న గ్రూపులుగా విడిపోయే లక్షణాల్ని సంతరించుకుంటుంది. సామూహిక ప్రయాణం బహిర్రూపమైనా, దాని అంతర్రూపం మళ్ళీ విభజన వైపే పోతుండడం జరుగుతుంది. అంటే అక్కడ కూడా మళ్ళీ ‘‘తమ’’ వాళ్ళ ప్రాబల్యం పెరిగేసరికి తామేమి కోల్పోయామో, దేనికోసం తపిస్తున్నామో దానికోసం ఉమ్మడిగా ఒకే వేదిక పైకి వస్తున్నామనుకున్న వాళ్ళంతా తమ నిజ స్వరూపాల్ని ప్రదర్శించుకోవడం మొదలుపెడతారన్నమాట! అప్పుడు డయాస్పోరాసాహిత్యం యావత్తు సాహిత్యానికి గానీ, ప్రత్యేకంగా పోనీ తెలుగు సాహిత్యానికి గాని ఇచ్చే నూతనవిలువలేమైనా ఉన్నాయా అనే సందేహం అందర్నీ వెంటాడే ప్రమాదం ఉంది.
అమెరికా సాహిత్య సభల్లో పాల్గోవడానికి వెళ్ళి చూసొచ్చి , అక్కడ మన తెలుగు వాళ్ళ గ్రూపుల గురించి ఎండ్లూరి సుధాకర్‌  ఇలా రాశారు. ‘‘ ఆంధ్రా తెలంగాణా/ ఫీలింగ్‌ఫ్యాన్సు/ అమెరికాలోనూ/ పసిగట్టాను ఈ డిఫరెన్సు/ చెప్పాలంటే/ చాలా వుంది రిఫరెన్సు.... ఇందులోంచి/ బయటపడకపోతే/ ప్రవాసాంధ్ర పరిస్థితి/ కోరలు చాచిన గాడ్జిల్లా...!’’
ఇటువంటి పరిస్థితుల్లో డయాస్పోరాసాహిత్యం నూతన విలువల్నిప్రతిపాదించి మానవుణ్ని మహోన్నతంగా మార్చగలుగుతుందని నమ్మగలమా? మేమెక్కడున్నా, తెలుగువాళ్ళగానే ఉంటామంటే దీని గురించి చర్చించాల్సిన అవసరమే లేదనుకుంటాను.
కానీ దీనికి భిన్నమైన ప్రకటనలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి.  అమెరికాలోని తెలుగు డయాస్పోరా వాళ్ళ ఆధ్వర్యంలోనే నడుస్తున్న ఒక ఆన్‌లైన్‌ తెలుగు మాసపత్రిక కుల, మత, వర్గ ధోరణులకు దూరంగా ఉండే విధంగా పత్రికను నడపాలనే ఆశయం ఉందన్నారు. చాలా సంతోషం కలిగించి ప్రకటనే. నిజానికి ఇలాంటి ప్రకటనలకు కట్టుబడి సాహిత్య పత్రికలు వస్తే, ఉత్తమసాహిత్యం వస్తుందనిపిస్తుంది. ఉత్తమ సంస్కారం అలవడుతుంది. కానీ, అది ఊహాత్మక జీవితానికి సంబంధించినదై ఉండకూడదు. కాల్పనిక సాహిత్యం కోసం అంత శ్రమకోర్చి పత్రికను నడపాల్సిన పనిలేదు. తమ అనుభవాల్ని అందరితో పంచుకోవడానికి దాన్నొక వేదికగా ఉపయోగించుకుంటున్నారు. అంటే అక్కడ జరుగుతున్న తెలుగు వారి జీనవ విధానాన్ని ప్రకటించడం జరుగుతుంది. దానితో పాటు వాళ్ళ అనుభవాల్ని, అనుభూతుల్ని ప్రకటించాలి. అలా ప్రకటించలేనప్పుడు ఆ సాహిత్యం ఆనందాన్ని కలిగించలేదు.
 అదే పత్రికలో వచ్చిన రచనల్లో దాన్ని పాటించగలిగారా అని నేడొకసారి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రబంధ సాహిత్యం, ప్రాచీన సాహిత్యం పేరుతో మళ్ళీ మనమెటువైపు పోతున్నామని ప్రశ్నించుకోవాలి. ఇక్కడ ఒకటి గమనించాలి. ప్రాచీన సాహిత్యాన్ని నిరాకరించమని కాదు, గానీ, ఆధునిక సాహిత్యంలో వస్తున్న అన్ని ధోరణుల్నీ ఆదరించగలగాలి. దళిత, ముస్లిం సాహిత్యాల్ని కూడా ఆహ్వానించగలగాలి. వీటిని కుల, మత చట్రాల్లో ఇరికించే ప్రయత్నం సరైంది కాదు. అక్కడున్న తెలుగు వాళ్ళంతా ఒకే రకమైన సాంస్కృతిక జీవనాన్ని కలిగున్నారా? వాటికెందుకు ప్రాధాన్యాన్నివ్వలేకపోతున్నారు?
ఆ మధ్య కాలంలో మరో ఆన్‌లైన్‌ తెలుగు పత్రిక పద్యాల్లోనే ఉగాది కవిత్వాన్ని రాయాలని, దాన్నే తూ.చ. తప్పకుండా పాటించాలని ప్రయత్నించింది. దాన్లో పాల్గొన్న పద్యకవుల్లో నేటి కాలపు కవిత్వం రాసేవాళ్ళు వేళ్ళ మీద లెక్కించదగిన వాళ్ళు కూడా లేరు. ఇంకా చెప్పాలంటే ప్రముఖ పద్యకవులు దానిలో భాగస్వామ్యం కాలేకపోయారు. అయినా తెలుగు భాష, సంస్కృతుల పేరుతో ఏ మత సంస్కృతిని పునరుద్దరిస్తున్నామో సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. సందర్భం మరొకటైనా డయాస్పోరా సాహిత్యాన్ని ఒక తరానికి చెందిన సాహిత్యంగా కాకుండా భిన్నతరాలుగా చూడాలంటూ, ఒక తరం వాళ్ళ డయాస్పోరా సాహిత్య సంస్కృతిని అఫ్సర్‌ ఇలా వ్యాఖ్యానించారు.‘‘ కొత్త దేశంలో తాము ఎదుర్కొంటున్న ప్రతి స్థితినీ స్వదేశంలో పరిస్థితితో బేరీజు వేసుకోవడం మాత్రమే కాకుండా, ఆ పరిస్థితి వొకే సాంస్కృతిక విలువ వున్నట్టు భావించుకునే వాళ్ళు. కొన్ని కథల్లో ఇక్కడి ప్రతి సన్నివేశాన్నీ అర్ధం చేసుకోవడానికి దాన్ని సనాతన హిందూధర్మంతో పోల్చుకోవడం కనిపిస్తుంది’’  కాబట్టి డయాస్పోరా సాహిత్యం ప్రతిఫలించే సంస్కృతిని ఒకే సంస్కృతిగా చెప్పలేం.
తమవి కాని జీవితానుభవాలు తమ సాహిత్యంలో లేనప్పుడు జీవితాన్నీ జీవించలేక, జీవితంలో ఎదురయ్యే సుఖదు:ఖాల్నీ సాహిత్యీకరించలేనప్పుడు జీవితం యాంత్రికం కాకపోతే ఏమవుతుంది? అందుకే పరభాష పట్ల వ్యతిరేకత, మాతృభాష పట్ల మమకారానికి కారణమవుతుంది. మరి వాళ్ళే మళ్ళీ ఎప్పుడైనా తమ ప్రాంతంలోకి వచ్చినప్పుడు తమ మాతృభాషలోనే మాట్లాడుతున్నారా? తమ సాహిత్యంలోని విషయాలే ఉదహరిస్తున్నారా? తమకు తెలిసిన భాషతో ఆధిక్యాన్నిక్కడ ప్రదర్శించకుండా ఉండగలుగుతున్నారా? ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ నుండి వెళ్ళిన మార్క్సిస్టులు కూడా దృక్పథమేమైనా అన్నమాచార్యుల కీర్తనల్ని, మన ప్రబంధసాహిత్నాన్నీ విశ్వవిద్యాలయాల్లో బోధిస్తూ, వాటిపైనే రచనలు చేస్తున్నారు. దీన్ని డయాస్పోరా సాహిత్యం అనవచ్చా అనేదీ ఆలోచించవలసిందే. ఇతర ప్రాంతాల వారికి బోధించే సాహిత్యంలో నిజంగా ఈ సమాజాన్ని చూపిస్తున్నారా? డయాస్పోరాసాహిత్యంలో ఇది కూడా భాగమనే వాళ్ళు, కాదనే వాళ్ళూ ఉన్నారు.
 ఏది ఏమైనా డయాస్పోరా సాహిత్యసృష్టి కర్తలు తమ నేల విడిచి, పరనేలపై ఉన్నా, తమ మూలాలతోనే ఒక నూతన ధోరణికి మార్గం వేయగలిగితే బాగుంటుంది. డయాస్పోరా సాహిత్యం ముసుగులో వాస్తవాల్ని విస్మరించి, అందరి సంస్కృతి పేరుతో కొందరి సంస్కృతిని రుద్దే ప్రయత్నం చేయకపోతే సాహిత్యం ద్వారా నిజమైన మానవీయ విలువల్ని అందించగలిగే వీలుకలుగుతుంది. అది ఎలాంటిదంటే, గాంధీ దక్షిణాప్రికా వెళ్ళి వచ్చిన తర్వాతనే తెలిసిన కుల వివక్ష లాంటిది.
కనీసం సంస్కరణ రూపంలో దాన్ని నిరసించడానికైనా (తమ ఉద్యమం ద్వారా కూడా) అవకాశం కలిగించారు. ఫస్టుక్లాసు ప్రయాణంలో ఆంగ్ల దొరలతో సమానంగా పయనించకుండా బయటకు గెంటేయడమనే వివక్షలోని వికృత రూపాన్ని కొద్దిగా చవిచూస్తేనే అంత బాధ కలిగి కాస్త సంస్కరణకు వీలుకల్పించారు. అది కూడా భారతీయ కుల వివక్షకు ఎంతో ఊరటనిచ్చింది. మన దేశానికి చెందిన వాళ్ళకెలాంటి అవమానం జరిగినా మనవాళ్ళు ముక్తకంఠంతో ఖండిస్తారు. కానీ, దళితులకు జరిగే అవమానాలకు ఇక్కడ వాళ్ళూ పట్టించుకోరు, అక్కడ వాళ్ళూ పట్టించుకోరు. ఇలాంటి స్థితిని తుల్లిమల్లి విల్సన్ సుధాకర్ ఇలా రాసారు. అంకుల్ శ్యామ్ విమానా శ్రయాల్లో/ వివక్ష కుక్కవేషం కట్టి/  జాతికి బూట్లు మేజోళ్ళూ  ఊడదీస్తున్నప్పుడు/ ఒక్కపెట్టున నిరసించిన దేశం/ దేవాలయాలూ ఊరిభావుల దగ్గర/ దళితుల్ని తరిమికొడుతున్నప్పుడు/ నల్లపూసవుతుందెందుకో"
అందుకనే ఇప్పుడు డయాస్పోరా సాహిత్యవేత్తలు కూడా వివక్షల్లోని భిన్న కోణాల్ని రాయగలగాలి. ఆ ప్రాంతంలో వాళ్ళు నిజంగా ఎదుర్కొంటున్న వాస్తవపరిస్థితుల్ని సాహిత్యీకరించాలి. సాహిత్యం నిజంగా మానవీయ విలుల పతాకాన్ని ఎగురవేయగలిగే స్పూర్తిని రగిల్చగలగాలి.
 - డా దార్ల వెంకటేశ్వరరావు

                                                                                                                                                                               

No comments: