"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

జాషువా లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
జాషువా లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

08 నవంబర్, 2023

జాషువా ‘ఆత్మ’ను గుర్తించడంలో భిన్న పార్శ్వాలు (8.11.2023)

 వారం వారం జాషువా సాహిత్యం-5



జాషువా ‘ఆత్మ’ను గుర్తించడంలో భిన్న పార్శ్వాలు

 

గతవారం జాషువా ‘ఆత్మ’ను గుర్తించడమెలా? అని ఆయన కులం  వల్ల పడిన కష్టనష్టాల్ని తన రచనల్లో ఎంతో శక్తివంతంగా వర్ణించారనీ, దానిలో ఆయన జీవితం, తన రచనా లక్ష్యం కనిపిస్తుందని రాశాను. కుల నిర్మూలన తన ఆశయాల్లో ఒకటనీ గుర్తించాలని వ్యాఖ్యానించాను. దీనికి చాలామంది స్పందించారు. ఆయన్ని ఒక కులానికి, ఒక ప్రాంతానికీ కట్టిపడేయడం మంచిదికాదంటూ అభిప్రాయపడ్డారు. నిజానికి  ఆయన కూడా అదే కోరుకున్నాడనీ చెప్పాను. ఒక కవి జీవితాంతం వరకు అనేక రచనలు చేస్తాడు. ఆ రచనల్లో ఆ కవి ఆశయాన్ని, రచనల లక్ష్యాన్ని గుర్తించడం కూడా కష్టమే. తాను ఆత్మాశ్రయంగా చెప్పుకున్న అనేకాంశాలలో ఆ కవి ‘ఆత్మ’ కనిపిస్తుంది. కానీ, అదే ఆ కవి ఆత్మగా చెప్పలేం. డా.సి.నారాయణరెడ్డిగారు చమత్కారంగా కప్పిచెప్పేవాడు ‘కవి’ అన్నట్లు, అన్ని విషయాల్నీ కవి ‘విప్పి’ కూడా చెప్పడు. 

సాధారణంగా కవి తన జీవితకాల లక్ష్యాన్ని గుర్తించాలంటే సాహిత్య విమర్శకులు కొన్ని పద్ధతులను అనుసరిస్తుంటారు. వాటిలో కవిజీవిత కావ్యసమన్వయ విమర్శ పద్ధతి ఒకటి. కవి వర్ణించిన రచనలను, ఆయన జీవితాన్ని తులనాత్మకంగా విశ్లేషిస్తూ కవి ‘ఆశయాన్ని’ గుర్తించే పద్దతి ఇది.  ‘కవి’ అంటేనే సాహిత్యానికి సంబంధించినవాడు కదా. దానిలో రాజకీయాలు ఉండకూడదు.  సాహిత్యాన్ని మూల్యాంకనం చేసే ప్రమాణాలతో నిజాయితీగా విశ్లేషించాలి. 

మన తెలుగు సాహిత్యాన్ని, ఆ సాహిత్య తత్వాన్ని మూల్యాంకనం చేయడానికి ఉన్న ప్రధానమైన ప్రమాణం భారతీయ ఆలంకారిక సిద్ధాంతాలు. పాశ్చాత్య సాహిత్య విమర్శ పద్ధతులతో అనుశీలించినప్పుడు కవి సామాజిక దృక్పథంలో ‘భావజాలం’ ప్రధానంగా తీసుకోవాలంటారు. అంటే, కవి సాహిత్య దృక్పథంతో పాటు, సామాజిక దృక్పథాన్నీ, ప్రాపంచిక దృక్పథాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలి.  ఒక కవి సాహిత్యాన్ని సాహిత్యంగానే పరిశీలిస్తూ ఆ సాహిత్య సౌందర్యాన్నే వివరించడమంటే సామాజిక కోణం అప్రధానమైపోతుంది. అప్రధానంకానట్లుండే పద్ధతిలో సాహిత్యాన్ని సాహిత్యంగా చూస్తున్న కొంతమంది దృష్టిలో ‘సర్వజనశ్రేయస్సు’, ‘విశ్వశ్రేయస్సు’ ‘సంస్కృతి ప్రతిఫలనం’ ‘జాతి చరిత్ర’ వంటి పద్ధతిలో వెళ్ళి పోతుంది. ఇక్కడెవరైనా ప్రశ్నించడం మొదలు పెడితే వాళ్ళకు సాహిత్యాన్ని అధ్యయనం చేసే పద్ధతి వాళ్ళకు తెలియదంటారు. మహాభారతంలో వర్ణాశ్రమ ధర్మం గురించి స్పష్టంగా చెప్పినా, అది ‘విశ్వశ్రేయస్సు’నే ఆకాంక్షిస్తుందంటారు. ఒకవేళ ఆ సాహిత్యంలో ఎవరి సంస్కృతి ప్రతిఫలిస్తుందని ప్రశ్నించినా సమాజాన్ని విభాగాలుగా చూడకూడదంటారు. జాతి చరిత్రలో కొంతమందిని అధములుగా చిత్రిస్తూ, మరికొంతమందిని శ్రేష్ఠులుగా కీర్తిస్తూ ‘జాతిమహోన్నతచరిత్ర’ను చెప్తుంటే ప్రశ్నించనంతకాలం ఆ రచనలన్నీ ఆ జాతి చరిత్రలుగానే కీర్తించబడతాయి. ఇలా ప్రశ్నించడాన్ని సామాజిక దృక్పథం నేర్పింది. ఆ సామాజిక దృక్పథమే భావజాలాన్ని గుర్తించేలా ప్రేరేపించింది. ఆ భావజాలమే ప్రాపంచిక దృక్పథాన్నీ చూడాలనే మార్గాన్ని విస్తరించింది. 

గుర్రం జాషువాను రెండు కోణాల్లోనూ అధ్యయనం చేయాలి. భారతీయాలంకారిక సిద్ధాంతాలు తన రచనల్లో లోతుగానే ఉన్నాయి. ఆ ఉండడం దేన్నైనా ధనంజయుడనే ఆలంకారికుడు భావించినట్లు ‘రసవంతం’ చేయడం వరకే పరిమితం కాలేదు. ఒక సాలీడు, ఒక కుక్కపిల్ల, ఒక గిజిగాడు, ఒక గబ్బిలం వంటివన్నీ తన కవితావస్తువులు అయ్యాయి. సాలీడు తన గూడుని అల్లడంలో ఎంతో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది. పురుగుల్ని ఆకర్షించడానికి వీలుగా మెరిసేలా సన్నని దారంలా కనిపించీ కనిపించనట్లు అల్లుతుంది. సాలీడు పొట్టలో నూలు తయారు చేసే యంత్రంగానీ, ప్రత్తిని ఒడికే రాట్నంగానీ ఉందేమో. లేకపోతే అంత సన్నని దారంలా రావడమే కాకుండా ఒకేరకమైన పద్ధతిలో ఆ  దారం అల్లడం అద్భుతం కదా అంటాడు. బహుశా ఈ రెండూ కాకపోతే ఈశ్వరుడే నీ గర్భంలో ఉండి అలా సౌందర్యవంతమైన గూడుని అల్లేశక్తినిస్తున్నాడేమో అనిపిస్తుందంటాడు కవి. ఇంత ప్రతిభావంతుడైన నిన్ను ప్రపంచమంతా మోసగాడని పిలిస్తుందెందుకని ప్రశ్నిస్తాడు.

పాఠకులకోసం పద్యాన్ని కొద్దిగా ఆ సౌందర్యం చెడిపోకుండా సులభంగా విడదీసి చదువుకుందాం.

నీలో నూలు తయారుజేయు మర గానీ, 

ప్రత్తి రాట్నంబు గానీ,

 లేదా ఈశ్వరశక్తి

 నీ కడుపులోనే లీనమై యుండునో

యేలీలన్ రచియింతువు

ఈ జిలుగు నూలీ పట్టు పుట్టంబులు!

ఓసాలీడా, నిను మోసగాడవని 

విశ్వంబేల ఘోషించెడిన్?

 సాలీడు  తాను బ్రతకడం కోసం తన విధ్యక్తధర్మాన్ని నిర్వర్తించింది. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ కదా. అదే సాలీడు కూడా చేసిందనేది ఆ సాలీడు తరపున కవివాదన.  ఆ తర్వాత ఆ పద్యాన్ని సామాజిక వాస్తవికతలో భాగం చేస్తూ, సాలీడు అంతనైపుణ్యంతో గూడుని కట్టడానికి కారణం దాని గురువులనీ, వాళ్ళంతా కనిపించకుండాపోయారనీ, దానికి కారణం చేనేతవృత్తులకు ఆదరణలేకపోవడమే కారణమంటాడు. అప్పుడే ప్రవేశిస్తున్న వస్త్రాల మిల్లులు, దాని వల్ల ఉపాధి కోల్పోతున్న నేతన్న దుస్థితినీ, పరోక్షంగా గాంధీజీ చరఖా ద్వారా ఇచ్చే సందేశాన్ని గుర్తుచేశాడు కవి. ‘పురుగుల గుంపు వచ్చి నాశనం చేయకుండా  వాటిని మోసగించాలనే నెపంతో మెరుపుల వంటి దారాలతో ఎవరికీ కనిపించకుండా కడుపులోనే దాచుకున్న దొంగమగ్గాలపై ఉల్లిపొరలాంటి సన్ననివస్త్రాలను నేసి ఆరబెట్టుకుంటున్నావు. ఎంత తెలివైన మోసగాడివోయ్... నీ సంపదను నువ్వు కాపాడుకోవడానికి వాళ్ళను మాయలో పడేస్తున్నావు. నీ సంపదను దొంగతనం చేయడానికి వచ్చే వాళ్ళను దొంగలనకుండా నిన్ను దొంగవని పిలుస్తుందే’ అనడంలో జాషువా చమత్కారం, భావనాపటిమ అసామాన్యంగా కనిపిస్తుంది. ఒక దోపిడీ స్వభావాన్ని, దాన్ని ఎదుర్కోవడానికి జరిగే ప్రయత్నాన్నీ సాలీడులో కవి అద్భుతమైన రక్షణ వ్యూహంగా వర్ణించాడు.  

ఒక చిన్నిపక్షి గిజిగాడు. దీని గురించి కూడా అద్భుతమై పద్యాలను వర్ణించాడు జాషువా. పిచ్చుకనే ‘గిజిగాడు’ అని కూడా అంటారు. పెద్దపెద్ద గాలి వేసేటప్పుడు, తుఫానులు వచ్చినప్పుడు పక్షులు తలదాచుకోవడానికి ఎంతో కష్టపడుతుంటాయి. ఈ పరిస్థితుల్లో కూడా గిజిగాడు కట్టుకునే ‘పిచ్చుకగూళ్ళు’ పాడవకుండా ఉంటాయి. ఊరికి దూరంగా లేదా పాడుపడిన ఇళ్ళ చూరులకు ఈ పిచ్చుక గూళ్ళు కనిపిస్తుంటాయి. సాధారణంగా చెట్లలో పనికిరాని వానిగా తుమ్మచెట్లను భావిస్తుంటారు. పాడుబడిన చేలలో, అడవుల్లో బాగా పెరుగుతాయి. వాటికి ముళ్ళుంటాయి. తినే పండ్లు కాయవు. కాబట్టి వాటిజోలికి ఎవరూ వెళ్ళరు. ఈ మధ్య కాలంలో వ్యాపారస్తులు తప్ప సొంతంగా ఇళ్ళు కట్టుకొనేవాళ్ళెవరూ తుమ్మచెట్టుని తమ గృహనిర్మాణాల్లో ఉపయోగించరు. అందువల్లనే పిచ్చుకలు ఆ చెట్లకే గూళ్ళు కట్టుకుంటాయనీ, అదొక బంగారు రంగులు పూసే చెట్టనీ, వాటిని నిగనిగలాడే బంగారు ఆభరణాలుగా పోలుస్తాడు కవి. తన గృహాన్ని ఎంతో సౌందర్యవంతంగా సహజంగా మెరిసేలా  ఉండే తుమ్మచెట్టుని ఎన్నుకోవడంలోనే ఒక చిన్నిపక్షిలోని పెద్దఆలోచనను మనముందుంచాడు కవి. రాత్రీ, పగలూ  వేసవి కాలంలో వచ్చే గాడ్పుని తట్టుకుంటూ, వర్షాకాలంలో వచ్చే వానను తట్టుకుంటూ ఎంతో రక్షణతో సంతోషంగా ఒక ఊయలతో కూడిన ఇల్లు నిర్మించిన ఘనత తనది అంటాడు కవి. 

“జిలుగుం బంగరు రంగులం

 కులుకు మేలైన 

చిన్నారి పూగుత్తి సొమ్ములు 

కీలించిన తుమ్మగొమ్మలకు,

 నీవు నీ సతీరత్న మూ

యెల గీమున్ దగిలించి

 రేఁబవలు హాయిందూఁగరా; 

గాడ్పు బిడ్డలు 

మీ కూడిగ మాచరింప,

 గిజిగాఁడా! నీకు దీర్ఘాయువౌ!”

గిజిగాడు గూడుని నిర్మించే నిర్మాణాన్ని ఒక అద్భుతమైన పనిగా వర్ణిస్తాడు కవి. చెట్లకు కట్టే ఇల్లు కాబట్టి తేలిగ్గా ఉండాలనే ఆలోచనలో గిజిగాడొక ఇంజనీరులా కనిపిస్తాడు. ఇంటిలో ఏయే సౌకర్యాలు ఉండాలో తెలుసు. తమ పిల్లలతో పాటు  అవసరమైతే తాను, తన భార్య కూడా ఉయ్యాలల్లో ఊగేలా ఆ గూడుని నిర్మించుకోవడంలో గొప్ప ఆలోచన ఉంది. చీకటి పడితే వెలుగుకోసం మిణుగురుపురుగుల్ని తెచ్చి ఒక అంత: పురంలా వెలుగులతో నింపడం గొప్ప వైభవం. ఆ గూడులోని శత్రువులెవరూ రాలేరు. అలాంటి చిన్న దానిలోనే గదులు, వెలుగులు, మంచములు ఉండే ఆ  గృహనిర్మాణం మానవులకు కూడా సాధ్యం కాదు కదా అంటాడు.

“తేలిక గడ్డి పోచలను దెచ్చి, 

రచించెద వీవు తూఁగుటుయ్యేల గృహంబు, 

మానవుల కేరికి సాధ్యముగాదు, 

దానిలోజాలరు, లందులో జిలుఁగు శయ్యలు 

అంతిపురంబు లొప్పగామేలు భళీ! 

పులుంగుటెకిమీడవురా గిజిగాఁడ! నీడజా!”

చివరికి గిజిగాడుని మించిన అందగాడే లేదంటాడు. అలాంటి గృహనిర్మాణం చేయగలిగేమొనగాడు లేడు. నీలాంటి వైభవాన్ని అనుభవించగలిగే దేవతలే లేరంటాడు. నిజంగా నువ్వొకమొనగాడువంటాడు. ఇలా అనేకమైన అల్పవస్తువులుగా  భావించి కావ్య వస్తువులుగా తీసుకోనివాటిని తాను కావ్య వస్తువులుగా తీసుకో వడంలో జాషువా ‘అల్పవస్తువు’లో అనల్పతను నిరూపించే ప్రయత్నం చేయడం కూడా ఒక ఆలోచనగా కొనసాగింది. సమాజంలో నిర్లక్ష్యానికి గురికాబడేవారిలోని ప్రతిభను, వారి మానసిక స్థితినీ వర్ణించాడు కవి. అవి కేవలం వస్తువులుగా పురుగులు, జంతువులు, పక్షులు, ఉభయచరాలుగా మాత్రమే తీసుకోకూడదు. వాటిని ఆధారంగా చేసుకొని దీనజనుల ఆర్తిని పలికించాడు జాషువా. జాగ్రతగా పరిశీలిస్తే ఆ రచనలు కొనసాగించిన ‘దృక్పథం’ దాన్ని తెలియజేస్తుంది. అందువల్ల రచనకు సామాజిక ప్రయోజనం కూడా జాషువా రచనల్లో  ప్రధానమయ్యిందని గమనించాలి.  జాషువా జీవితాన్నీ, దృక్పథాన్నీ కేవలం ఆయన రాసుకున్న ‘నాకథ’ అనే ఆత్మకథాభాగాల్ని మాత్రమే చూస్తే సరిపోదు. ఆయన అనేక సందర్భాల్లో చెప్పిన పద్యాల్లో ఆయన ఆత్మీయ స్పృహ ప్రతిఫలిస్తుంది. ‘నేను’ అనే పేరుతో ఒకచోట రెండు పద్యాలను, మరొకచోట  ఆటవెలదితో కలిపిన ఐదు సీసపద్యాలను రాసుకున్నాడు. 

‘‘నిఖిలలోకమెట్లు నిర్ణయించిన నాకు

తరుగులేదు, విశ్వనరుడ నేను’’ మకుటంగా ఐదు పద్యాలకు ‘‘నేను’’ ఖండకావ్యంగా వర్ణించుకున్నాడు జాషువా.

‘నేను నివసించడానికి చిన్న ఇల్లుంటే చాలు. సంపాదించేసుకోవాలనే ఆశ తనకు లేదు. భార్యాబిడ్డలకు ఆస్తిపాస్తులు కూడబెట్టి వాళ్ళను పెడత్రోవలో పెట్టాలనుకోను. నేను ఆచరించని నీతులు బోధించను. నాకు రాని రాగాన్ని తీస్తూ పాడను. నాకు సంసారం గడవడానికి సరిపడా ఉంటే చాలు. అంతకు మించి నాకు ఒక్క గవ్వను కూడా అధికంగా కోరుకోను. కులం, మతం అనే గీతలతో కట్టిపడేసే పంజరంలో బంధీకాను. ఈ ప్రపంచం  తనను ఎలా భావించినా నాకేమీ తక్కువతనం కలగదు. నేను విశ్వనరుడను’’ అని మొదటి పద్యంలో అన్నాడు కవి. ఆ తర్వాత పద్యంలో తన రచనాలక్ష్యం, తన రచనల ఆశయాన్ని తెలిపే తన ప్రాపంచిక దృక్పథాన్ని వివరించాడు. 

‘‘వాస్తవ జ్ఞాన సంపత్తి ఖూనీ చేయు 

గాథలు జీర్ణంబుగావు

నాకు ఒక జాతి శ్రేయస్సునకు 

సాయ మొనరించు కపట సంస్థలు నాటకములు 

నాకు అనుభవంబునకు గిట్టని 

నభఃకుసుమ వేదాంతముల్

ప్రబల స్వార్ధములు

నాకు ప్రజల రక్తంబు నాస్వాదించు రాజకీయములు 

గుండెలకు భారములు నాకు

సహజమైన ప్రకృతి సౌఖ్యంబు లొక వ్యక్తి 

దొంగిలించి మనుట దొసగు నాకు 

నిఖిలలోక మెట్లు నిర్ణయించిన నాకు 

తరుగులేదు, విశ్వనరుడ నేను.’’

దీనిలో స్పష్టంగా భావవాదాన్ని వ్యతిరేకించాడు జాషువా. అంతేకాదు, ‘విశ్వశ్రేయస్సు’ పేరుతో ‘కొంతమందిశ్రేయస్సు’ని వ్యతిరేకించాడు. అటువంటి వాళ్ళ మాటల్నీ, చేతల్నీ కపటనాటకాలుగా అభివర్ణించాడు. వాటిని జీవితానుభవంలో  వాస్తవంగా కనిపించని గగన కుసుమాలుగా కూడా ఆక్షేపించాడు. ఆనాడే సాహిత్యంలో ప్రవేశించిన సాహిత్య రాజకీయాల్ని అసహ్యించుకున్నాడు. అందరికీ చెందవలసిన ప్రకృతిలోని నీరు, గాలి, అగ్నీ, భూమి, ఆకాశం వంటి పంచభూతాలను కొంతమందే స్వాధీనం చేసుకొని శ్రీమంతులు కావడాన్ని తీవ్రంగా త్రిప్పికొట్టడంలో గొప్పమార్క్సిస్టులా కనిపిస్తాడు. వ్యక్తి శ్రేయస్సు కంటే సమాజశ్రేయస్సు ముఖ్యంగా భావిస్తాడు. జాషువా పిరదౌసి కావ్యాన్ని పరిచయం చేస్తూ ఒక అంతర్జాల పత్రికలో ఇలా వ్యాఖ్యానించారొకరు..  ‘‘జాషువా విశ్వనాథలాగా పండితుడు కాడు. దేవులపల్లి, కరుణశ్రీల లాగాపదాల్ని సానబట్టి నునుపుదేర్చి ప్రయోగించేవాడు కాడు. ఆయన పద్యాలు ఎక్కడో తప్ప కదనుతొక్కవు. ఆయన పదశిల్పం తీర్చిదిద్దినట్లు ఉండదు. ఐతే ఆయన మహోన్నత భావుకుడు. అంతరంగంలో రసగంగలు పొంగిపొరలే సహజశిల్పి. కళ్ళు మిరుమిట్లు గొలిపే భావనలు, కల్పనలు, ఊహాశక్తి ఆయన్ని ఆధునికకవులందర్లోను ఒక ప్రత్యేక స్థానంలో నిలబెట్టాయి. ఒక పద్యం తీసుకుంటే దాన్లోని పదాలు,సమాసాలు, ఎత్తుగడలు, శిల్పం ఇవి కాదు మనని విస్మితుల్ని చేసేవి. ఆ పద్యం మొత్తం లోను వ్యాపించిగుప్పుమని గుబాళించే భావనాసౌందర్యం, వినూత్నమైన ఊహాశబలత, స్వచ్చంగా ప్రతిఫలించేనిజాయితీ.’’

జాషువా ఎంత శక్తివంతంగా ఛందోబద్దమైన పద్యాలు రాసినా, నేటికీ ప్రజల నోళ్ళలో నానుతున్నా వాటిలో కదనుతొక్కి ప్రవహించే లక్షణం ఈ వ్యాసకర్తకు కనిపించలేదు. శిల్పనిర్మాణాన్ని తప్పుపట్టాడు. కానీ, అదెక్కడో చెప్పడు. చివరిలో జాషువాలో భావనాసామర్థ్యాన్ని మెచ్చుకున్నట్లు కనిపించేలా వ్యాఖ్యానించాడు. అంటే జాషువాది సాహిత్యం కాదనీ, కొత్త ఊహల్ని ఎవరైనా చేసినా అది భావనాసౌందర్యాన్ని కలిగించవచ్చునని తేల్చిపారేశాడు. మనం నేడు చదువుకుంటున్న ప్రాచీన లేదా సంప్రదాయ పద్య కావ్యాలన్నీ యథాతధంగా చూస్తే ఆ పద్యాల సొగసేమిటో తెలుస్తుంది. ఆ కావ్యాలకు చేసిన పరిష్కరణలు చూస్తే తెలుస్తుంది ఆ ఛందోవైభవమూ, ఆ పదసౌందర్యమూ. అలాంటి పరిష్కరణలెన్ని జరిగాయి జాషువాగారి కావ్యాలకు అని అడిగితే సమాధానం ఉండదు.  ఆ వ్యాసంలో రచయిత పేరు లేదు. మరి పత్రికలవారే పెట్టలేదో, ఆయనే పెట్టుకోలేదో మరి. ఇదంతా సాహిత్య రాజకీయం కాకపోతే ఏమిటి? విశ్వనాథ ‘వీరవల్లడు’ గొప్పనవలనడంలోను, దేవులపల్లి ‘అభ్యుదయ సాహిత్య’ నిర్వచనాన్నీ పదేపదే ప్రస్తావించే సాహిత్యవేత్తల్నీ జాగ్రత్తగా చూస్తే సాహిత్య రాజకీయాలే కనిపిస్తాయి. అందుకే గుర్రం జాషువాకు తన సాహిత్యం పట్లా, ఆ  రాజకీయాల పట్లా ఒక స్పష్టమైన అవగాహన ఉంది. లేకపోతే చూడండీ పద్యం వచ్చేదే కాదు. 

‘‘నా కవితా వధూటి వదనంబు నెగాదిగ జూచి, రూపరే

ఖా కమనీయ వైఖరులుగాంచి ‘భళీ! భళి’ యన్నవాడే ‘మీ

దేకుల’మన్న ప్రశ్న వెలయించి, చివాలున లేచి పోవుచో

బాకున గ్రుమ్మినట్లగును ప్రార్థివ చంద్ర! వచింప సిగ్గగున్”.

కులం వల్ల అవమానపడేవాళ్ళు, తమని కులం పరిధిలోనే చూస్తున్నారనుకునేవాళ్ళు కులాన్ని పట్టించుకోకూడదనే చెప్తారు. నిజంగా మనం కులం ఆధారంగా మన నాయకుల్ని, కవుల్ని గుర్తించడం లేదా? ఇతర కవులకు ఒక్కొక్కరోజుని కేటాయించి జాతీయ దినోత్సవాలను జరుపుతున్నట్లే దళిత నాయకులకు, దళిత కవులకు కూడా స్థానం కల్పించాలి. అలా జరుగుతుందా? 

 జాషువా పాఠాన్ని కొన్నాళ్ళపాటు ఒక తరగతిలో ఆయన బాల్యస్మృతులను పెట్టారు. అది కూడా ఎలాంటిదో చూడండి.  జాషువా చిన్నవయసులో ఉండగా తన పక్కింటి పిల్లవాడి దగ్గర ఉండే కౌజు పక్షిని చూచి ముచ్చటపడి దాన్ని కావాలంటాడు. ఆ విషయాన్ని తన తల్లికి చెప్తాడు. ఆమె దాన్ని అడుగుతుంది. కానీ, వాళ్ళివ్వరు. దాన్ని దొంగతనం చేసి తెచ్చుకుంటాడు.  ‘నాకథ’లోని ఈ భాగాన్ని పెట్టారు. ఇక ప్రశ్నలు ఎలా ఉంటాయి? జాషువా దొంగతనం చేసిన పక్షిపేరేంటి?  జాషువా తన పక్కింటిలో పక్షిని దొంగతనం చేయడానికి గల కారణమేమిటి? ఇలా ‘జాషువా ఒక దొంగ’ అనే ముద్రను చిన్నపిల్లల్లో గాఢంగా ముద్ర వేయడానికి ఈ పాఠాన్ని చక్కగా ఉపయోగించుకుంటారు. బాల్యచేష్టలు గురించి చెప్పడం కంటే పిల్లల్లో దీనివల్ల  జాషువాపై ఎలాంటి అభిప్రాయాన్ని కలిగించాలనుకున్నారు?  

భారతీయ సమాజంలో కులం వాస్తవం. మనుష్యుల్ని కులంతో చూడ్డం వాస్తవం. వాళ్లెంత ప్రతిభావంతులైనా కులాన్ని ఆధారం చేసుకోకుండా వ్యాఖ్యానించడం చాలా అరుదైన విషయం. నిత్యం భారతదేశంలో అమ్మాయిల్ని అత్యాచారం చేయడం, హత్యలు చేయడం మనమెన్ని చూడ్డంలేదు? కానీ, కొన్నింటిని మాత్రమే మన మీడియా ‘ప్రపంచం’ దృష్టికి తీసుకొస్తుంది. దీని వెనుక కులం లేదనగలమా? ఎంతో ఘోరంగా కొంతమంది ఉత్తర భారతదేశంలో ‘నిర్భయ్ ’ పైనా (16 డిసెంబర్ 2012)  దక్షిణ భారతదేశంలో ‘దిశ’  పైనా (28 డిసెంబరు 2019)  జరిగిన అత్యాచారాలు అందరూ ఖండించదగినవే. కానీ, వీటిని ఖండించినంతగా అంతకు ముందూ, తర్వాత జరిగిన, జరుగుతున్న దళిత యువతులు, మహిళలపట్ల ‘ప్రజలకు’ ‘మీడియా’కు సానుభూతి ఎందుకు రాలేదు? వీళ్ళవి ప్రాణాలు కాదా? వీళ్ళవి మానాభిమానాలు లేవా?

జాషువాను ఒక కవిగా గుర్తించడంలోను పైకి ‘విశ్వమానవుడు’ అని చెప్పినా వాళ్ళ వాళ్ల  ‘అంతరంగంలో మాత్రమే నిజంగా కనపడు తుంది అసలు రంగు. కానీ దాన్ని అంగీకరించలేరు. తనని అలా చూడ్డం లేదు కాబట్టే,తాను అందుకనే తనను ‘విశ్వనరుడు’గా చూడమని చెప్పాడు జాషువా. 


ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

తెలుగుశాఖ, అధ్యక్షులు,

 స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్,

యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్-500 046





29 అక్టోబర్, 2023

వారం వారం జాషువా సాహిత్యం-3

 వారం వారం జాషువా సాహిత్యం-3


 

‘పిరదౌసి’లో కవిత్వ నిర్వచనమే తానైన  గుర్రం జాషువ (2)

 


‘‘నా గ్రంథం చదివే ప్రతీ స్త్రీ, పురుషుడైనా వీరకృత్యాలు చేయుటకు సంసిద్ధులవుతారు. నేటి గృహాఉ ఎండ వానలకు నశించగలవు కాని తుఫాను, వర్షం ఏవీ నేను కట్టిన కావ్యసౌధాన్ని పడగొట్టలేవు. స్వర్గం నాకవిత్వం ముందు శిరస్సు వాల్చింది.’’ అని ఫిరదౌసి తన గ్రంథంలో రాసుకున్నాడు. ఆ కథ నిజంగానే భాషలకు అతీతంగా అందర్నీ ఒక సంవేదనకు గురిచేస్తుంది. ‘షానామా’ (షహనామా) బాహిరీ-తాఖ్ రబ్ అనే పార్సీ వృత్తాల్లో సుమాఏభై వేల పద్యాల్లో రాశాడని  చరిత్ర చెబుతుంది.  ఫిరదౌసి ‘షానామా’ కావ్యాన్ని రాయడానికి పడిన వేదన మళ్ళీ జాషువా పొందితే తప్ప అంత భావతీవ్రత ‘పిరదౌసి’ కావ్యంలో కనిపించదేమో అనిపిస్తుంది.

             తన వంశావళిని కావ్యేతిహాసంగా వర్ణిస్తే, ఒక్కోపద్యానికీ ఒక్కో బంగారునాణాన్ని ఇస్తానని తమకెంతో పవిత్రమైన మక్కామసీదు సాక్షిగా చక్రవర్తి వాగ్దానం చేశాడట. దీన్ని జాషువా ఇలా వర్ణించాడు.

ఒక్కొక్క పద్దియంబున

 కొక్కొక్క బంగారు రూక యొసగెదను కవీ!

 మక్కా మసీదుతోడని

 వక్కాణించెన్ మహాసభా మధ్యమునన్.

ఈ పద్యంలో కవి జాగ్రత్తగా మూడు విషయాల్ని పద్యంలో వచ్చేటట్లు చేశాడు. రాజు బంగారం ఆశచూపడం, దానికి మక్కామసీదు సాక్ష్యం, సభలో ఉన్నవాళ్ళు సాక్ష్యం. వీటని మళ్ళీ ఎలా ధ్వంసం చేశాడో తర్వాత కావ్యంలో మళ్లీ అదే పద్ధతిలో వర్ణిస్తాడు కవి. బంగారానికి బదులు వెండినాణాలు ఇవ్వడం రాజు మాటతప్పడమే. మసీదుపై ప్రమాణం చేసినా దాన్నీ అతడు నిజంగా నమ్మలేదు. బహిరంగంగా ప్రకటించిన వాళ్ల దగ్గరే మళ్ళీ బహిరంగంగా మాటతప్పాడు. దీనిలో సమకాలీన రాజకీయ నాయకుల వాగ్దానాలు, వాటిని నెరవేర్చకుండా అబద్దాలాడ్డం, ఏదొకనెపం వేయడం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఈ పద్యంలోని ఈ సత్యమే ప్రాసంగితకమయ్యింది.  దీనికంటే కవిపడే తపనను జాషువా వర్ణించిన తీరు అద్భుతం.

మానవేంద్రుని సత్యవాగ్దానమునకు

హృదయగోచరమగుచు వర్ణింపరాని

అద్భుతావేశమంగంబునాక్రమించె

స్వాంతమున తోచె నిసర్గకవిత ’’ అని కవి వర్ణించడంలో కవిత్వం రాసేటప్పుడు కవి ఒక ఆవేశానికి గురయ్యే అనుభవాన్ని ‘హృదయంలో కనిపిస్తుందట, కానీ వర్ణించాలంటే సాధ్యం కావడంలేదనడా’న్ని గమనించాలి. కవి పడే వేదనకిది నిదర్శనం. ఇటువంటి అభిప్రాయాన్నే నండూరి సుబ్బారావు ‘ఎంకి’ మాటున చెప్పాడు. ‘గుండె గొంతుకలోన కొట్లాడుతాదీకూకుండనీదురా కూసింతసేపు’. నిజమైన స్పందన గల కవి ఒక అందమైన వస్తువుని చూసినా, ఒక భయంకరమైన దృశ్యాన్ని చూసినా కవిత్వమవుతాడు. ఇతరులకు కవికీ ఉన్న తేడా అదే. తాను చూసిన, తాను అనుభవించిన ‘అనుభవం’ అక్షరంగా రూపదాల్చేలా చేస్తాడు. శ్రీశ్రీ తన ‘ కవితా! ఓ కవితా!’లో మొత్తం కవిపడే వేదననే వర్ణించాడు. అయితే కవిత్వం సామాన్యులకు అందకుండా దూరంగా ఉన్న స్థితిని చెప్తూనే కవిత్వావేశాన్ని కూడా వర్ణించం ఒక విశేషం. ‘‘నీ ప్రాబల్యంలో/చిరదీక్షా శిక్షా తపస్సమీక్షణలో/నిశ్చల సమాధిలో/స్వర్గద్వారపు తోరణమై వ్రేలిన నా/మస్తిష్కంలో/ఏయే ఘోషలు, భాషలు, దృశ్యాల్ తోచాయో?/నే నేయే చిత్రవిచిత్ర శ్యమంత/రోచిర్నివహం చూశానో!/నా గీతం ఏయే శక్తులలో/ప్రాణస్పందన పొందిందో?’’...అంటూనే మళ్ళీ ఇలా అంటాడు శ్రీశ్రీ. ‘‘మరి నిన్ను స్మరిస్తే/నా కగుపించే దృశ్యాలా?/వినిపించే భాష్యాలా?/అగ్నిసరస్సున వికసించిన వజ్రం!/ఎగిరే లోహశ్యేనం!/ఫిరంగిలో జ్వరం ధ్వనించే మృదంగ నాదం!’’ ఇదంతా కవి కవిత్వమయ్యే పయనమే. శ్రీశ్రీ తన అభ్యుదయకవితాదృక్పథం కూడా దీనిలో వ్యక్తమయ్యేలా వర్ణించాడు. దేవరకొండ బాలగంగాధర్ తిలక్ ‘అమృతం కురిసినరాత్రి’లో కవి కవిత్వమయ్యే మార్గంతోపాటు, కవిత్వమయ్యాక పొందే సంతోషాన్నిలా వర్ణించాడు.‘‘కళ్ళ చివర కాంతి సంగీత గీతాన్ని రచిస్తున్నాడు/ఎర్రని పెదవులమీద తెల్లని నవ్వుల వీణల్ని మీటుతున్నాడు/ఎవరికీ దొరకని రహస్యాల్ని వశపరచుకున్నాడు/జీవితాన్ని ప్రేమించినవాడు జీవించడం తెలిసినవాడు/నవనవాలైన ఊహావర్ణార్ణవాల మీద ఉదయించిన సూర్యుడు.’’ కవి ఆశనూ, ఆశయాన్నీ కలిగించాలంటూనే నూతన ఊహలు ఉండాలంటాడు తిలక్. దీనితో పాటు ‘నవత-కవిత’ అనే కవితలో ‘కవిత్వం ఒక ఆల్కెమీ, దాని రహస్యం కవికే తెలుసు’ అంటూనే, ‘కవిత్వం అంతరాంతర జ్యోతిశ్శీమల్ని బహిర్గతం చెయ్యాల’ని ప్రబోధిస్తాడు. తిలక్ తాను కవిత్వమైన తీరుని తెలుసుకోవాలంటే ‘అదృష్టాధ్వగమనం’ కవితకూడా చూస్తే శ్రీశ్రీ పడిన వేదనలాంటి వేదన కనిపిస్తుంది. ఇలా ఇంచుమించు ప్రతి కవీ తన కవిత్వం బయటకు రావడానికి రకరకాలుగా ప్రసవవేదన పడటం తప్పని సరి. ఫిరదౌసి కవి వేదనతో మమేకమైన  జాషువా  ఈ పద్యంలో ‘‘అద్భుతావేశమంగంబునాక్రమించె/స్వాంతమున తోచె నిసర్గకవిత ’’ అనడం ద్వారా కవి లోకాన్ని చూడ్డం లేదా స్పందన పొందడం, ఆ స్పందన ఆవేశంగా రూపుదాల్చడం, ఆ రూపం పరిపూర్ణంగా వచ్చేవరకూ లేదా వచ్చిందని భావించేవరకూ వేదనకు గురికావడం, అది ఒకరూపం దాల్చిన తర్వాత ఒక తల్లి ప్రసవవేదన పడుతూ తన బిడ్డను చూసుకోగానే కలిగేటంతటి స్వాంతనను కవి కూడా పొందేవరకు కనిపించే స్పందనను అంతటినీ వర్ణిస్తాడు. అది సహజత్వాన్ని సంతరించుకునేలా ఉండాలి. అప్పుడు మరలా కవి నిజమైన సంతోషాన్ని పొందుతాడు. దీనిలో భారతీయాలంకారికుడు రాజశేఖరుడు ‘కావ్యమీమాంస’లో కవిత్వ సృజనకు సంబంధించిన విషయాలెన్నో ఉన్నాయి. అలంకారశాస్త్రమే అయినా దీనిలో ఒక కావ్యంలా   కావ్యపురుషుడు అనే పాత్రను సృష్టించి, కవిత్వం, దానికి సంబంధించిన అనేక అంశాల్ని రాజశేఖరుడు చర్చించాడు. ఆ కావ్య పురుషుడు వేదపురుషుడే అంటాడు రాజశేఖరుడు. కవులకు రాజులకు మధ్య ఉండే సంబంధాలెలా ఉంటాయో కూడా  వర్ణించాడు. ‘ప్రజ్ఞా నవనవోన్మేషశాలినీ ప్రతిభా మతా, తదనుప్రాణనాజ్జీవేద్వర్ణనానిపుణః కవిః’ అని భామహుడనే ఆలంకారికుడు ప్రతిభావంతుడైన కవికి ఉండవలసిన భావుకతను వివరించాడు. దీన్నే తిలక్ కూడా తన కవిత్వంలో చెప్పాడు.  ఆవేశం కవిత్వానికి అత్యంత ప్రధానమని ఆంగ్ల కవులు కూడా చెప్పారు. వర్డ్స్ వర్త్ ‘లిరికల్ బ్యాలెడ్స్’(1801) కి రాసుకున్న ముందుమాటల్లో మాటల్ని  సందర్భంగా ‘పోయెట్రీ ఈస్ ది స్పాంటేనియస్ ఓవర్ ఫ్లూ ఆఫ్ పవర్ పుల్ ఫీలింగ్స్ : ఇట్ టేక్స్ ఆరిజన్ ప్రమ్ ఎమోషన్ రికలెక్టెడ్ ఇన్ ట్రాక్విలిటీ’’ అన్న మాటలు గుర్తుచేసుకోవాలి. జాషువా తాను పైన చెప్పిన పద్యంలో కవిత్వానికి ఆవేశంతోపాటు మరలా అది సహజంగా వెలువడాలనడంలో రాజశేఖరుడు చెప్పిన ‘సమాధ్యవస్థ’ ఉంది. కవిత్వం రాసేటప్పుడు మన చుట్టూ ఉండే అనేకాంశాల వల్ల ‘కవిత్వావేశం’ వస్తుంది. దాన్ని ఆలంకారికుడు  భావయిత్రీ-కారయిత్రీ శక్తలు ఉంటాయని చెప్పాడు.  ఒకటి కవి భావుకతను, మరొకటి ఆ భావుకతను అక్షరీకరించేది. ఈ రెండింటికి మధ్యా ‘సమాధి’ అనేది ఉంటుంది. దాన్నే వర్డ్స్ వర్త్ ‘ ట్రాక్విలిటీ’ అన్నాడు. జాషువా తన పద్యంలో ఈ పరిణామాన్ని అంతటినీ ఫిరదౌసి కవి పొంది కవిత్వమయ్యాడని వర్ణించాడు. ఫిరదౌసిని చక్రవర్తి కావ్యం రాయమనడం ప్రేరణ. జీవిత అస్తిత్వం. దానికి సిద్ధపడి అనేక చరిత్ర గ్రంథాలు, ఆధారాలు, సాహిత్య విషయాలు అవగాహన చేసుకొని భావుకతకు పయనించడం భావయిత్రీశక్తిని పొందడం. షానామా కావ్యాన్ని అందించడమే కారయిత్రీశక్తి. ఈ రెండింటి మధ్యా   ఆవేశాన్ని సహజంగా మార్చుకోవడం నిసర్గకవితగా మారడం. ఫిరదౌసి అలా చేశాడో లేదో గానీ, జాషువా తన కావ్యాన్ని వర్ణించడంలో ఈ పరిణామాలన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి.

పిరదౌసి కావ్యం కేవలం కవి, కవిత్వం మాత్రమే కాదు, ఆ పద్యాలు నేటి సమాజానికి కూడా ప్రాసంగికంగా కనిపిస్తున్నాయి. ఒక మతం వాళ్ళు మరొక మతాన్ని ధ్వంసం చేస్తే , తర్వాత కాలంలో మళ్లీ అది వ్యతిరేకదిశలో కూడా పనిచేయవచ్చు. కాలం ఒకేలా ఉండదు. గజనీమహ్మద్ హిందూదేవాలయాల్ని ధ్వంసం చేశాడు. దేవాలయాల్లో దాచిన ధనం, బంగారం వంటి వాటికోసం మొదటి ఆలోచన. రెండవ ఆలోచన మతాన్ని , మత విశ్వాసాల్ని నాశనం చేయడం. ఇది సరైంది కాదని జాషువా ఆనాడే ప్రబోధించాడు. దాన్ని ఒక పద్యంలో  ఇలా వర్ణించాడు.

భారత క్షోణికల్గు దేవస్ధలములు

చెదరి గజనీ పురాన మసీదులయ్యె

నిప్పటి మసీదు లేరూప మెత్తగలవొ

కాలమెఱుగును,ధారుణీగర్భ మెఱుగు. ఈ మధ్య కాలంలో భారతదేశ వ్యాప్తంగా, ముఖ్యంగా కాశీపట్టణంలో దేవాలయాల పునరుద్ధరణలోను, తాజమహల్ పట్ల వస్తున్న వాదనల్లోనూ ఈ ధోరణులో కనిపిస్తున్నాయి. కవి దార్శనికుడు. ఆలంకారికులు అందుకే ‘కవయ: క్రాంతిదర్శన:’ అన్నారు. అది జాషువా కవిత్వంలో స్పష్టంగా కనిపిస్తుంది.

     

చాలామంది పరిశీలకులు పిరదౌసి కావ్యాన్ని అంత రసభరితంగా రాయడానికి, ఆయన కూడా అలాంటి జీవితాన్నే జీవించడం ఒక కారణంగా చెప్పారు. దీనిలో కొంత నిజం లేకపోతేదని ఆయన రచనల్ని చదివేవారికి కచ్చితంగా స్పురిస్తుంది. కానీ, కవులంతా ఇలాగే తమ జీవితంతో ముడిపడిన వస్తువు, జీవితం వల్లనే అలా వర్ణించగలిగారనే సిద్ధాంతం సరైందికాదు. సందర్భాన్ని, సన్నివేశాన్ని, వస్తువుని బట్టి కవి వాటిని ఆవాహన చేసుకుంటాడు. అందుకే తన కావ్యంలోని పాత్రలు భిన్న మనస్తత్వాల్ని కలిగి ఉంటాయి. ఒక పాత్ర మంచివాడుగా, మరొకపాత్ర చెడ్డవాడుగా ఉండొచ్చు. అలాంటప్పుడు కేవలం వీళ్ళిద్దరిలో ఒక గుణాన్ని మాత్రమే కవికి ఆపాదించలేం. పోనీ, అన్ని గుణాల్నీ ఆపాదిద్దామనుకున్నా, అది సరైందికాదు. అవి కేవలం ఆలంకారికులు చెప్పిన ‘సహృదయత’తో పలికించే భావాలు. అందుకే జీవుల్లో ఉండే సత్వ, రజో,తమో గుణాలన్నింటినీ నవరసభరితంగా కవి వర్ణించగలుగుతాడు.

             చక్రవర్తి మాటతప్పి బంగారు నాణాలకు బదులు వెండినాణాలు పంపాడు. ఏదొకటి పంపితేకవి సంతోషించవచ్చు. కానీ, చక్రవర్తే మాట తప్పితే సామాన్యునిపరిస్థితి ఏమిటి? అందుకనే కవి దాన్ని ఇంత వేదనగా వర్ణించాడు. ఆ స్థితిలో కవి

‘‘ఎన్నో కొండలు గుండెలో

 గరఁగిపో యెన్

వార్ధి సంతానముల్

 గన్నీరయ్యె

సమస్త లోకము నిరాకారస్ధితిం బొల్చెన్’’ అంటాడు. తాను మోసపోయానని గ్రహించాడు. అటువంటప్పుడు కవి ఎలాంటి స్థితిలో ఉండి ఉంటాడో వర్ణిస్తూ...

 ఓ సుల్తాను మహమ్మదూ!

కృతక విద్యుద్ధీపముల్ నమ్మి

యాశాసౌధంబును గట్టికొంటిని’’ అంటాడు.

అంతే కాదు ‘అది నిస్సారంపుటాకాసమైనా సర్వస్వమును దొంగలించి నరకానం గూల్చిపోయెన్’’ అని బాధపడతాడు.  అరవైవేల పద్యాలు వర్ణించడానికి తాను పడిన కష్టమంతా కళ్ళెదుట కనిపించింది. ఆ ఆవేదన ఎవరితో చెప్పుకోవాలి.

కృతి యొక బెబ్బులింబలె శరీరపటుత్వము నాపహరింప

,శే షితమగు నస్థిపంజరము
 జీవలవంబున నూగులాడగా
 బ్రతికితుచచ్చియున్నముది వగ్గు మహమ్మదుగారి ఖడ్గదే
 వతకు రుచించునా?

పరిభవ వ్యధ యింతట నంతరించునా? అని బాధపడతాడు. ఇలా ప్రతిపద్యమూ జాషువా ఫిరదౌసిలా మమేకమై వర్ణించాడు.

             ఇచ్చకపు మాటలు విన్న చక్రవర్తి కవిని శిక్షించడానికి సైనికులను పంపెంచాడని తెలిసి కూడా దు:ఖితుడయ్యాడు. అప్పుడు ఇలా ఒక పద్యాన్ని వర్ణించాడు.

ముత్యముల కిక్కయైన సముద్రమున

 బెక్కుమాఱులు మున్కలు వేసినాడ;

 భాగ్యగీనుడ ముత్యమ్ము వడయనైతి

 వనధి;నను మ్రింగ నోరు వచ్చినది తుదకు.

జాషువ ఈ ‘ఫిరదౌసి’ కావ్యాన్నెందుకు రాశాడో ఆయనకే తెలియదనీ, ఎన్నో అనౌచిత్యాలు ఉన్నాయనీ, ఈ కావ్యానికి సాహితీలోకంలో పేరెలా వచ్చిందో తెలియదని, కేవలం జాషువ కులం వల్ల పడిన అవమానాలను, ఆయన పేదరికాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే  ఈ కావ్యాన్ని ప్రశంసించారని విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా జాషువా చెప్పుకున్న మాటలను ఒకసారి గుర్తుచేసుకోవాలి. ఈ కావ్యానికి ‘విజ్ఞప్తి’ పేరుతో వచనంలో ఈ కావ్యనేపథ్యాన్ని చెప్పుకున్నాడు. ఫిరదౌసి చరిత్రను తాను ఒక పత్రికలో చదివాననీ, దాన్ని ఇతివృత్తాన్ని ఒక చిన్న ప్రబంధంగా రాయాలనుకున్నాననీ అన్నాడు. దీన్ని కావ్యంగా వర్ణించే క్రమంలో కొన్ని మార్పులు, చేర్పులు చేశాననీ ప్రకటించాడు. ‘‘పారశీక పండితుల రచనకనుకూలంగా నేను చేసిన మార్పులు మనించమ’’ని వేడుకున్నాడు. ‘‘పిరదౌసి గజనీపట్టణాన్ని విడిచిపెట్టి పారిపోయేటప్పుడు వర్ణించిన కీకారణ్యాలు, సింహం, పులి మొదలైన జంతువులు దేశ నైసర్గిక స్థితి, స్వభావాలకు విపరీతంగా ఉన్నాయని తనకు తెలుసుననీ, కానీ, ఫిరదౌసి కవి మానసిక వ్యథను నిరూపించడానికి కవులు ఉపయోగించుకునే కవిసమయాలకు అనుగుణంగా కల్పితాల్ని చేశానని, ఇది సాహసమే అయినా, ఆ సాహసాన్ని మన్నించమని వేడుకున్నానని’’ అన్నాడు. ఈ సందర్భంగా మనం గుర్తించవలసిందొకటి. చరిత్ర వేరు. కావ్యం వేరు. చరిత్రలో సంఘటనలు, తేదీలు వాస్తవంగా చిత్రించబడటం ఉంటే, కావ్యంలో ఆ నాటి మానవుల మానసిక స్పందనలు, ఆ ఉద్వేగాలు వర్ణితం కావాలి. చరిత్ర ఒక కాలానికి మాత్రమే పరిమితం. కానీ, మానవ హృదయ స్పందనలు శాశ్వతాలు. కవులు తమ అనుభవాలను కూడా వివిధ సందర్భాల్లో వివిధ పాత్రల్లో వర్ణిస్తారు. అలాగని, అవన్నీ ఆ కవి అనుభవాలేనని అనుకోలేం. అలాగని అవి పూర్తిగా అసందర్భాలనీ, అసత్యాలనీ చెప్పలేం. కవులు  దార్శనిక సత్యంతో సాహిత్యంలో ఆ అనుభవాన్ని తీసుకొస్తారు. ఆ పనినే జాషువ ‘ఫిరదౌసి’లో చేశాడు. ఫిరదౌసి జీవితం, ఆ చారిత్రక సన్నివేశాలు, ఆ జీవన పరిణామాలను తెలుసుకోవాలంటే ఆ చరిత్రను చదువుకోవాలి.  ఆ పారశీక కవుల సంప్రదాయాల్ని తెలుసుకోవాలంటే ఆ సాహిత్య చరిత్రల్ని అధ్యయనం చేయాలి. ఇంకా ఆ కావ్యాల్నే చదవాలి. కానీ, ఆ కవి హృదయం నుండి వచ్చిన వేదనను జాషువ హృదయ స్పందనను తెలుసుకోవాలంటే ఫిరదౌసి కావ్యాన్ని ఆస్వాదించాలి.

-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

తెలుగుశాఖ, అధ్యక్షులు,

 స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్,

యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్-500 046

 

 

 

 


12 అక్టోబర్, 2023

ఫిరదౌసి’లో కవిత్వ నిర్వచనమే తానైన గుర్రం జాషువ

 వారం వారం జాషువా సాహిత్యం-2


11.10.2023 భూమిపుత్ర దినపత్రిక సౌజన్యంతో


‘ఫిరదౌసి’లో కవిత్వ నిర్వచనమే తానైన  గుర్రం జాషువ


‘కవిని కన్న తల్లి గర్భంబు ధన్యంబు;

కృతిని చెందువాడు మృతుడు గాడు;

పెరుగు తోటకూర, విఖ్యాత పురుషులు;

కవిని వ్యర్థజీవిగా తలంత్రు.’’ కవిని మహోన్నతమైన స్థానంలో ఉంచిన ఈ పద్యం గుర్రం జాషువ ఫిరదౌసి కావ్యంలోనిది.

సాధారణంగా కవి, కవిత్వం, దాని నిర్వచనాలు, లక్షణాలు చెప్పేవారిని లాక్షణికులని అంటారు. అయితే, కవులు కూడా అప్పుడప్పుడు కవిత్వం అంటే ఏమిటి? కవి అంటే ఎవరు?  కవిత్వ ప్రయోజనం ఏమిటి?  కవిత్వం ఎలా రాయాలి? వంటి అనేక విషయాలు కూడా తమ కవిత్వంలోనే చెప్తూ ఉంటారు. మన తెలుగు కవులు నన్నయ నుండి నేటి వరకు కవిత్వం రాసినటువంటి వాళ్ళ గురించి చాలా మంది వ్యాసాలుగా, పుస్తకాలుగా రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. జాషువా చెప్పిన అభిప్రాయాలు కూడా ఇంతకుముందు ఎవరైనా వ్యాసంగా రాశారేమో నాకు తెలియదు. కానీ, ఫిరదౌసి కావ్యంలో ఉన్న వివిధ అంశాలపై నేనే గతంలో ఒక వ్యాసం రాశాను. అప్పుడు  జాషువా కవిత్వం మీద చెప్పిన అభిప్రాయాలపైనే ప్రత్యేకించి ఒక వ్యాసం రాస్తే బాగుంటుందని అనుకున్నాను. అలా కొంత నోట్స్ రాసుకున్నాను. వాటిని చూశాక మళ్ళీ మూలంలో అవి ఏ సందర్భంలో చెప్పారో చెప్పకపోతే అసందర్భంగా ఉంటుందనుకున్నాను. మళ్ళీ ఆయన సాహిత్యాన్ని పరిశీలించాను. కొన్ని పరిశీలనలలో జాషువ నిజంగా ఒక లాక్షణికుడిలా అనిపించాడు. కావ్య శాస్త్రం పై ఆయనకున్న లోతైన పరిశీలన తెలుస్తుంది. కవిగా తన్మయమై అనుభవంతో చెప్పిన అభిప్రాయాలుకా కనిపిస్తాయి.కొన్ని చోట్ల కవిత్వ నిర్వచనమే తానై ప్రతిబింబినట్లుగా అనిపిస్తుంది. భారతీయ ప్రాచీన కావ్య సంప్రదాయాలను ఆయన కొన్నిచోట్ల ఎంత జాగ్రత్తగా అనుసరించాడో మరి కొన్నిచోట్ల వాటికి ప్రత్యామ్నాయంగా తనదైన అభిప్రాయాన్ని చెప్పాడం కూడా కనిపిస్తుంది. అన్ని రచనల్లోని ఈ అంశాన్ని మాత్రమే కేంద్రంగా చేసుకొని పరిశోధన చేసే అవకాశం కూడా ఉంది. ఇక్కడ కూడా అలాగే రాయొచ్చు. పరిశోధనను, విమర్శను చదివే పాఠకులు మాత్రమే ఉండే పత్రికల్లో అలా రాస్తే బాగుంటుంది. ఇక్కడ అన్ని వర్గాలకు చెందిన పాఠకులను దృష్టిలో ఉంచుకొని ఈ వ్యాసాన్ని రాస్తున్నాను. వ్యాసంలో పాఠకులకు విషయ విశ్లేషణతో పాటు ఆసక్తికూడా ప్రధానం.జాషువ వివిధ సందర్బాల్లో కవి, కవిత్వం గురించి చెప్పినా అన్నీ ఒకేచోట అయితే సాధ్యమైనంత సమగ్రంగా చెప్పేవీలుండదు. కనుక, రెండు వ్యాసాలుగా  జాషువ వర్ణించిన ఫిరదౌసి కావ్యంలో కవిహృదయాన్ని విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. 

ఫిరదౌసి కావ్యంలో  జాషువా కవిత్వ విశ్వరూపం:

గుర్రం జాషువ ‘ఫిరదౌసి’ కావ్యాన్ని 1930లో రాశాడు. ఫిరదౌసి కావ్య నామాన్ని జాషువ పిరదౌసి’ అని రాశాడు.  కొంతమంది ‘ఫిరదౌసి’ అని కూడా రాస్తుంటారు. ఫిరదౌసి అనేది పారశీక కవిపేరు. ఫిర్దౌస్ అంటే స్వర్గం అని అర్థం. ఫిరదౌసి అనేది కవి నామమే కనుక, ఫిరదౌసి అని రాసినా తప్పేమీకాదు. గజనీని పరిపాలించిన చక్రవర్తి ‘మహమ్మద్ ఘజనీ’  2.11. 971లో పుట్టి, 30.4.1030 లో మరణించాడు. అరబిక్, సంస్కృత భాషల్లో ప్రావీణ్యం ఉన్నవాడు. మొట్టమొదటిసారిగా ‘సుల్తాన్’ బిరుదు పొందిన చక్రవర్తి. భారతదేశంపై సుమారు పద్దెనిమిది సార్లు దండయాత్రలు చేసి హిందూ దేవాలయాల్ని దోచుకున్న చక్రవర్తిగా ప్రఖ్యాతి పొందాడు.ఫిరదౌసి క్రీ.శ. 940లో పుట్టి, 1020 వరకు జీవించాడు. ఫిరదౌసి అసలు పేరు: మన్సూర్ ఇబిన్ అహ్మద్. ఒక భూస్వామి ఇంట్లోనే పుట్టి పెరిగిన కవి. ఘజనీమహమ్మద్ సుమారు 60సంవత్సరాలు, ఫిరదౌసి సుమారు 70సంవత్సరాలు పైగా బతికారు. ఇరువురూ చారిత్రక పురుషులే. ఒక చారిత్రక సంఘటనను తీసుకొని ఒక రసభరిత కావ్యంగా తీర్చిదిద్దిన ఖండకావ్యం ‘ఫిరదౌసి’ దీన్ని జాషువా1930లో రాశాడనుకున్నాం కదా. జాషువా పుట్టింది 1895. అంటే అప్పటికి 35 యేండ్ల ప్రాయం. గొప్పకావ్యం రాయాలనే ఉబలాటపడే వయస్సు. ఆ వయసులో సహజంగానే పండితుల ప్రశంసలు పొందాలనే కుతూహలం  ఉంటుంది. అందువల్ల తన శక్తియుక్తులన్నీ ఉపయోగించి ఈ కావ్యాన్ని వర్ణించాడు. అప్పుడప్పుడే అభ్యసించిన కావ్యశాస్త్రాంశాల్ని తన కావ్యంలో సమన్వయిస్తూ, కవి గొప్పతనాన్ని, కావ్యౌచిత్యాన్ని ధ్వనిగర్భితంగా చెప్పాలనే ఉత్సాహం కనిపించే గొప్పకావ్యమిది.  ఈ కావ్య వర్ణనలో కొన్ని భారతీయ కావ్యశాస్త్రాంశాలను అనుకూలంగాను, మరికొన్ని ప్రయోగాత్మకంగాను వర్ణించాడుకవి. దీని గురించి ప్రముఖ విమర్శకుడు ఆచార్య వెల్చేరు నారాయణరావుగారు చెప్తూ ‘‘ఫిరదౌసి వంటి కావ్య వస్తువు జాషువాకి ఆకర్షకంగా కనిపించడంలో మనకి ఆశ్చర్యమేమీ లేదు. ఒక్క ఫిరదౌసి కావ్యమే జాషువా కొంత తాదాత్మ్యంతో రాసినట్టు కనిపిస్తుంది. అందులో కొంత ఆత్మాశ్రయం ఉందేమో కూడా. కవిగా తనని ప్రభుత్వంలో ఉన్నవాళ్లు, అధికార వర్గంలో ఉన్నవాళ్లు తగింతగా గుర్తించలేదనే భావం జాషువాకి ఫిరదౌసి మీద సానుభూతికి అవకాశం ఇచ్చి ఉంటుంది. కావ్యవస్తువులో పూర్తిగా లీనమైపోయి రాసిన కథాకావ్యమిది.’’ (ఈమాట, జనవరి, 2021) అన్నారు. ‘ఫిరదౌసి ననుసరించి నార్ల చిరంజీవి భాగ్యనగరం నాటకం, కట్టమంచి రామలింగారెడ్డి ముసలమ్మ మరణం కావ్యం, విద్వాన్ విశ్వం పెన్నేటి పాట, డా. సినారె కర్పూర వసంత రాయలు రాయడం జాషువా విజయాన్ని సూచిస్తుంద’ని డా.ఏనుగు నరసింహారెడ్డి (సృజననేడు, 8.4.2021)చెప్పారు.


   ఫిరదౌసి కావ్యంగా రాకముందు కొన్ని పద్యాలు “భారతి” లోను కొన్ని “ఆంధ్రపత్రిక”లోను ప్రచురితం అయ్యాయి. దీన్ని కొన్ని ప్రచురణలలో మూడు ఆశ్వాసాలుగాను, మరికొన్ని ప్రచురణలలో నాల్గు ఆశ్వాసాలుగాను విభజించడం కనిపిస్తుంది. తొలిప్రచురణను  సింగరాజు లక్ష్మీనారాయణగారికి అంకితం చేశాడు. ఈ కావ్యాన్ని అంతటినీ సింగరాజు మల్లపరాజుగారు విని తండ్రి లక్ష్మీనారాయణగారికి అంకితమివ్వమని చెప్పారని జాషువ స్వయంగా రాశారని మనసు ఫౌండేషన్ వారి ముద్రణలో కనిపిస్తుంది. కానీ, దీని తృతీయ ముద్రణను మనసు ఫౌండేషన్ కంటే ముందే వేసిన ప్రతిలో కూడా ‘‘నా ఖండకావ్యాల్ని రెండు భాగాలుగా ముద్రించడానికి ద్రవ్య సహాయం చేసి, తమ మాతాపితలకు  అంకితమిప్పించిన ఏకాదండయ్య పంతులుగార్కి ధన్యవాదాలు’’ అని తెలిపాడు జాషువ. పద్యాలు మాత్రం రెండు ప్రచురణల్లోను ఒకేరకంగా ఉన్నాయి. ఈ పద్యాల్లోని భావాల్ని పరిశీలిస్తే సింగరాజు మల్లపరాజు కొడుకు లక్ష్మీనారాయణ, ఆయన కొడుకు పేరు కూడా మల్లపరాజు కావడం విశేషం. కాబట్టి ఫిరదౌసి కావ్యాన్ని గుర్రం జాషువ  సింగరాజు వంశానికి  అంటే మాతాపితలకు అంకితం చేశాడు. ఇక కావ్యేతివృత్తానికి వద్దాం. 

ఫిరదౌసి ‘షానామా’  రాజచరిత్రతో కూడిన కావ్యాన్ని రాయడానికి గత చరిత్రను తవ్వాడో లేదో గానీ, సుమారు  వెయ్యి సంవత్సరాల తర్వాత ఆ చరిత్రను ‘ఫిరదౌసి’ కావ్యాన్ని ఖండకావ్యంగా  జాషువా  వర్ణించాడానికి మాత్రం ఆ పని చేసే ఉంటాడు. వస్తువైక్యతతో రసభరితంగా రాసే చిన్ని కావ్యాన్ని ఖండకావ్యం అంటారని విశ్వనాథుడు తన ‘సాహిత్య దర్పణం’  (‘‘ఖండకావ్యం భవేత్కావ్యస్త్వైకదేశానుచారిచ’’) లో చెప్పాడు. సాధారణంగా మహాకావ్యంలోని ఏదైనా ఒక రసవద్ఘట్టాన్ని తీసుకొని రాస్తే దాన్ని ఖండకావ్యం అంటారని విశ్వనాథ సత్యనారాయణ (ఆంధ్ర వార పత్రిక, జనవరి, 1938) వివరించారు.

ఫిరదౌసి కావ్య కథాసారాంశం:

 ఫిరదౌసి ఒక కవి పేరు. కవిని కథానాయకుడిగా చేసి వర్ణించని కావ్యం ‘ఫిరదౌసి’  గజనీమహమ్మద్ తన వంశ చరిత్రను కావ్యం రాయించుకోవాలనుకుంటాడు. పారశీక కవులలో దాన్ని రసభరితంగా, సమర్ధవంతంగా రాయగల కవి ఫిరదౌసి అని తెలుసుకుంటాడు. ఫిరదౌసిని తన ఆస్థానానికి రప్పించుకొని కమ్మని కావ్యాన్ని రాయమంటాడు. ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క బంగారు నాణాన్ని(దీనారం) ఇస్తానని వాగ్దానం చేస్తాడు. ఫిరదౌసి ముప్పయ్యేళ్లు కష్టపడి సుమారు అరవై వేల పద్యాల్లో ‘షాహనామా’ పేరుతో కావ్యాన్ని వర్ణిస్తాడు. దాన్నే వ్యవహారంలో ‘షానామా’ అని పిలుస్తారు. ఆ కావ్యాన్ని విన్న తర్వాత రాజు తన ఆస్థానంలో గల కవుల అభిప్రాయాలను తెలుసుకుంటాడు. కొంతమంది చాలాబాగుందనీ, మరికొంతమంది ఇంకా బాగారాయవచ్చుననీ, మరికొంతమంది బాగాలేదనీ చెప్తారు. ఆ మాటలు విని బంగారు నాణాలకు బదులు వెండి నాణాలిస్తానంటాడు. రాజు మాట తప్పినందుకు కవి ఆ నాణాల్ని తిరస్కరిస్తాడు.అంతే కాకుండా రాజుని నిందిస్తూ కొన్ని పద్యాల్ని రాసి పంపిస్తాడు. ఆ పద్యాల్ని విన్న రాజు కవిని పట్టి చంపమని ఆజ్ఞాపిస్తాడు. ఫిరదౌసి ప్రాణభయంతో గజనీని వదిలి ‘తూసు’ పట్టణానికి కుటుంబ సమేతంగా పారిపోతాడు. కొన్నాళ్ళకు సామంతరాజులు, కొంతమంది ఉత్తమ కవులు ఫిరదౌసి కవిత్వం గొప్పతనాన్ని రాజుకి వివరిస్తారు. ఆ మాటలు విని గజనీమహమ్మదు మనసు మారుతుంది. ఎలాగోలా కవి ఋణాన్ని తీర్చుకోవాలనుకుంటాడు. పదివేల బంగారు నాణాల్ని కవికి ఇవ్వమని భటుల చేత పంపిస్తాడు. కానీ, అప్పటికే కవి ఫిరదౌసి చనిపోతాడు. ఆ నాణాల్ని కవిగారి కూతురుకివ్వబోతారు. తన తండ్రిని క్షోభకు గురిచేసిన ఆ సొమ్ము తనకు వద్దని వాటిని తిరస్కరిస్తుంది.ఈ వార్త విని రాజు తన తప్పుకి విచారించి, ఆ ధనంతో తూసు పట్టణంలో ఒక సత్రాన్ని కట్టిస్తాడు. నేటికీ ఆ గుర్తులు కనిపిస్తాయి. కానీ, అందులో ఒకరికి కీర్తి, మరొకరికి అపకీర్తి కనిపిస్తాయి.కవిగానీ, రాజు గానీ ఇద్దరూ భౌతికంగా లేరు. శాశ్వతంగా నిలిచిపోయింది మాత్రం సత్యం ఒక్కటే.


కవిత్వమైన ప్రతిబింబించిన జాషువ:

“మంగళాదీని, మంగళ మధ్యాని, మంగళాన్తాని” అని భారతీయ కావ్య సంప్రదాయంతో పద్య కావ్యాల్ని ప్రారంభిస్తారు. కానీ జాషువా ఈ సంప్రదాయాన్ని పాటించలేదు. 

మును 

గజనీమహమ్మదుఁడభూత పరాక్రమశాలి,

 వీరవాహినుల బలంబుతో 

బదియునెన్మిది మాఱులు కత్తిదూసి

చిక్కని రుధిరంబులో 

భరతఖండము నార్ద్ర మొనర్చి

 సోమనాధుని పెకలించి

కైకొని యెతొమ్మిది వన్నెల రత్నరాసులన్’’  అని గజినీ మహమ్మద్ సుమారు 18 సార్లు భారతదేశంపై దండయాత్ర చేసి భారత దేశంలోని  ఎంతో  సంపదను  తమ దేశానిదోచుకొనిపోయిన చక్రవర్తిగా తొలిపద్యాన్ని వర్ణించాడు. భారతదేశంలోని సంపదను ఎలా దోచుకొనిపోయాడో ఇలా వర్ణిస్తాడు.

బంగారు నాణెముల్ బస్తాల కెత్తించి

 మదపుటేన్గుల మీద బదిలపరచి

 లేతపచ్చల నేరి గోతాల కుట్టించి

 లొట్టి పిట్టలమీద దిట్టపఱచి

 కురువిందమణులను కుంచాల కొలిపించి

 పరువు డెద్దులబండ్లపై నమర్చి

 మొలక వజ్రముల జాలెల పోసి కూర్పించి

 గుఱ్రాల మూపుల గుస్తరించి

పదియు నెనిమిది విజయరంభల వరించి

గాంగలజలమున నెత్తుటికత్తి గడగి

సర్వము హరించి హిందూదేశంబు విడచి

గజనీమామూదు గజనీకి కదలిపోయె


అటువంటి చక్రవర్తి తన యుద్ధ విజయాలను చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోవాలనే ఉద్దేశంతో పారశీక కవులలో ముఖ్యమైన వారందరినీ పిలిచి తన చరిత్రను వర్ణించి రాయమంటాడు. ఆ సందర్భంలోనే చక్రవర్తి మాటలుగా కవి గొప్పతనాన్ని అనేక పార్శ్వాలలో జాషువా వర్ణించాడు. 

'ఓ కవివర్య!

నీసుకవితోజ్జ్వలవాఙ్మయ

పుణ్యభూమిలో 

నాకుకృతిప్రధానసదనంబు 

రచింపుము శాశ్వతంబుగన్ 

మాకులభూషణంబులగు 

మానవనాథుల కావ్యదేహ 

దివ్యాకృతులంబొనర్పుము

చిరాయురుపేతులచేయుమిద్ధరన్'' 

కవికి కవిత్వమనే ఒక పుణ్యభూమిని సృష్టించగల ఉంచుతాడు. ఆ పుణ్యభూమి కవి భావుకతతో ఉజ్జ్వలంగా వెలుగొందుతూ ఉంటుంది. ఆ వెలుగులలో తన వంశానికి చెందిన వారికి చూడాలనుకుంటున్నాడు పారశీక కవి. అలా ఆ పారశీకరణలో గొప్పవాడైన పిరదోసి తన కావ్య చరిత్రను వర్ణించినట్లైతే అది శాశ్వతమైనటువంటి కీర్తి అనే వెలుగులతో శాశ్వతంగా శోభిల్లుతుందని ఆశిస్తున్నాడు కవి చక్రవర్తి. ఇక్కడ చక్రవర్తి ఆశించాడో లేదో తెలియదు గానీ ,గుర్రం జాషువా కవి  భావుకతలోని వైశిష్ట్యాన్ని వర్ణించాడు. ఆ భావుకత శాశ్వతమైనటువంటి రూపాలను ఆవిష్కరించి శాశ్వతంగా నిలిపేలా చేస్తుంది. అది కవికి ఉన్న గొప్ప భావుకతాసామర్థ్యం అని చాటి చెబుతున్నాడు. ఆ సందర్భంగానే కవిని కన్న తల్లి గర్భం ధన్య మని, ఆ కవిత్వాన్ని అంకితం తీసుకున్న కృతికర్త కూడా శాశ్వతంగా కీర్తి ప్రతిష్టలతో వెలుగొందుతాడని చెప్తాడు. 

భారతీయ కావ్య సంప్రదాయంలో... 

''అపారే కావ్య సంసారే  కవిరేవ ప్రజాపతిః

యథాస్మై రోచతే విశ్వంతదేవ పరివర్తతే'' అని కవిని అపరబ్రహ్మగా  పోలుస్తాడు ఆనందవర్థనుడు. ఇంచుమించు ఈ భావాన్నే జాషువా కూడా ఇక్కడ తీసుకున్నప్పటికీ, బ్రహ్మదేవుడుకి తన చేతిలో స్వచ్ఛతకు ప్రతీకయైన తామర పువ్వు ఉంటుంది. అలాగే కవి చేతిలో కలం ఉంటుందట. ఒకరేమో ఎంతో నైపుణ్యంతో ఈ ప్రపంచాన్ని సృష్టిస్తే, మరొకరేమో తన భావుకత్వ ప్రపంచాన్ని ఎంతో అద్భుతంగా తన కలంతో సృష్టించగలుగుతాడట. ఇక్కడ వరకు అయితే  సంప్రదాయ శ్లోకాన్ని తెలుగులో  అనువదించాడ నుకోవచ్చు. కానీ, కవికి ఈశ్వరత్వం ఆపాదించాడు జాషువ. ఆ భగవత్వత్వం వలన మాత్రమే కవి పూజనీయుడయ్యాడని కవిలోని స్వచ్ఛతకు పతాక సన్నివేశంగా కవి గొప్పతనాన్ని వర్ణించాడు. అక్కడితో కూడా తృప్తి చెందలేదు. కవి గొప్పతనాన్ని భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలుగా కాలచక్రాన్ని తన చేతితో తిప్పగలిగిన గొప్పవాడు కవి మాత్రమే. దాన్నిలా వర్ణిస్తూ…

''క్షణము గడచిన దాని వెన్కకు మఱల్ప 

సాధ్యమే మానవున కిలాచక్రమందు?

దాటిపోయిన యుగములనాటి చరిత 

మరల పుట్టింప కవియ సమర్థు డగును'' అని కవి గతాన్ని వర్తమానంతో ముడివేయగల సామర్థ్యం కలిగినవాడు అంటాడు.

నిజమైన కవిత్వం ఒక అద్భుతమైన ఆవేశంతో వస్తుందని చెబుతూ …

''మానవేంద్రుని సత్యవాగ్దానమునకు 

హృదయగోచర మగుచు వర్ణింప రాని

యద్భుతావేశ మంగంబు నాక్రమించె 

స్వాంతమున తోచె నూత్న నిసర్గకవిత'' అంటాడు.

కవిత్వం రాయడం అంటే కేవలం భావుకత ఉన్నంత మాత్రాన సరిపోదు. సత్యావిష్కరణకు కావలసిన సాధనాలు కొన్ని భౌతికంగా కూడా స్వీకరించవలసి ఉంటుంది. సుల్తాన్ మహమ్మద్ చరిత్ర రాయడానికి ఆ సాహిత్య సంప్రదాయంలో ఉపయోగించే పలుకుబడులు, జాతీయాలు తీసుకోవాలి. వాటికి సాహిత్య సుగంధం అద్దాలి. అంటే కావ్యానుగుణంగా కవిత్వాన్ని వర్ణించాలి. వాచ్యార్థం, వ్యంగ్యార్థం సందర్భోచితంగా ఉన్నప్పుడు మాత్రమే రసికుడు ఆ కావ్యాన్ని ఆస్వాదించగలుగుతాడు. అందుకనే ఫిరదౌసి పారసీక గ్రంథాలను అధ్యయనం చేశాడట. దానిలోని తీయనైన పదాలను ఏరుకున్నాడట. అంతే కాదు, కావ్యం రసభరితంగా ఉండాలి అంటే పాత్రనుగుణంగా, శబ్దానుగుణంగా శబ్దాలను, అలంకారాలను, శబ్దాలను, ఛందస్సుని  ప్రయోగించాలి. కవిత్వం రాయడానికి ఉద్యుక్తుడైన కవి ఆవేశం ఎలా ఉంటుందో ఒక అద్భుతమైన పద్యంలో వర్ణించాడు జాషువ. 

వసుధ శాసింపఁగల సార్వభౌముడగును 

ధీరుడగు, భిక్షకుండగు, దీనుడగును 

దుఃఖితుం డగు నిత్యసంతోషి యగును 

సత్కవి ధరింపరాని వేషములుఁ గలవె?

ఒక కావ్యంలో ఉండే పాత్రలన్నింటిలోనూ తానై ఉంటాడు. కానీ, తనదైన ఒక పాత్రలో కూడా ఉంటాడు. అది కవి వర్ణంలోని గొప్పతనం. వసుధ శాసింపఁగల సార్వభౌముడగును అనే మాటల్ని చదివేటప్పుడు ఆంగ్ల కవి పి.బి. షెల్లీ  ‘ది డిఫెన్స్ ఆఫ్ పోయెట్రీ’ (1821)లో   ‘పోయిట్స్ ఆర్ ది అన్ ఎక్నాల్డెడ్ లెజిస్లేటర్స్ ఆఫ్ ది వరల్డ్’  అన్న మాటలు మనకు గుర్తుకొస్తాయి. కవులు కూడా శాసనకర్తలు లాంటి వారే, కానీ, వాళ్ళు ప్రత్యేకంగా అలా గుర్తింపు పొందకపోవచ్చు. ఎందుకంటే తన కావ్య ప్రపంచానికి తానే శాసనకర్త. తన ఇష్టానుసారంగానే ఆ కావ్యం నడుస్తుంది. ఇక్కడ కవి జాషువా కవి దేన్నైనా వర్ణించేటప్పుడు దాన్ని తనలో జీర్ణింపజేసుకోవాలనీ, అప్పుడు మాత్రమే ఆ రచన మృదుమధురంగా వస్తుందనే భావం కనిపిస్తుంది. అయితే, అలా తన్మయీభావన ఎంత ముఖ్యమో ప్రతిభకూడా అంతే ముఖ్యం. అప్పుడు మాత్రమే భావనాసామర్థ్యం, వర్ణనా సామర్థ్యం, పాత్రచిత్రణ, సమయోచిత శబ్దప్రయోగం సాధ్యం. అది జాషువాలో పరిపూర్ణంగా కనిపిస్తుంది. 

ఫిరదౌసి కావ్యంలో కవి, కవిత్వం, జాషువ అనుభవైక కవిత్వాన్ని మరలా వచ్చేవారం మరికొంత చూద్దాం. 

(సశేషం)

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

తెలుగుశాఖ, అధ్యక్షులు,

 స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్,

యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్-500 046