భూమిపుత్రి దినపత్రిక, 31.8.2025 సౌజన్యంతో....
ఆరుద్ర అత్యుత్తమ రచన సమగ్ర ఆంధ్ర సాహిత్యం
తెలుగు సాహిత్యంలో కవిగా, సినీగేయ రచయితగా, నవలా రచయితగా, పరిశోధకుడుగా, సాహిత్య విమర్శకుడుగా, నాటకకర్తగా ఆరుద్ర ఒక శాశ్వతమైన ముద్రను వేశారు. ఆరుద్ర పూర్తి పేరు భాగవతుల సదాశివశకంకరశాస్త్రి. ఆయన కళాశాలలో చదువుకున్నది ఇంటర్మీడియట్ వరకు మాత్రమే. కానీ, ప్రత్యేక ఆసక్తితో తెలుగు, ఆంగ్ల సాహిత్యాన్ని ఔపోసనపట్టారు. జీవిక కోసం రకరకాల ఉద్యోగాలు చేసినా, మిలటరీలో కూడా పనిచేసి, చివరికి పాత్రికేయునిగా తన ప్రస్థానం కొనసాగి బహురూపాలుగా విస్తరించుకొంది. ఆయన 31 ఆగస్టు 1925 వ తేదీన జన్మించారు. త్వమేవాహమ్, సినీవాలి, కూనలమ్మపదాలు, ఇంటింటి పజ్యాలు, గాయాలు-గేయాలు, పైలా పచ్చీసు మొదలైన కవిత సంపుటాలు ప్రచురించారు. ఆరుద్ర తన జీవిత సహచరి రామలక్ష్మితో కలిసి ఏటికేడాది అనే కవితాసంపుటి ప్రచురించారు. ఆ తర్వాత ఆయన వందలాది సినీగీతాలు రచించారు. వాటిని ఆరుద్ర రామలక్ష్మిగారు సంపాదకులుగా ఐదుసంపుటాలుగా వచ్చాయి. నేను చెప్పానుగా, ఆరుద్ర కథలు, డిటెక్టివ్ కథలు, రాశారు. వీటితో పాటు పలకల వెండిగ్లాసు, రెండు రెళ్ళు ఆరు, ఆనకట్టమీద ఆత్మహత్య, గ్రామాయణం వంటి నవలల్ని రచించారు. పన్నెండు దృశ్యనాటికలు, తొమ్మిది శ్రవ్యనాటికలు, రాదారి బంగళా వంటి ప్రసిద్ధ నాటకాల్ని రచించారు. శ్రీకృష్ణదేవరాయలు అనే రూపవాణి నాటకాన్ని కూడా రచించారు.ఆంగ్ల, తమిళ భాషల నుండి కొన్ని అనువాదాలు కూడా చేశారు.
శ్రీవేంకటేశ్వరవిశ్వవిద్యాలయం. తెలుగు విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్ ని ఇచ్చి ఆరుద్రను సత్కరించాయి. ఆంధ్ర విశ్వకళాపరిషత్ ‘కళాప్రపూర్ణ’తో గౌరవించింది. తెలుగు విశ్వవిద్యాలయం వారు ఉత్తమ సాహిత్య విమర్శకుడుగా బహుమతినిచ్చి సత్కరించింది. వీటితో పాటు రాముడుకి సీత ఏమవుతుంది. గుడిలో సెక్స్, గురజాడ గురుపీఠం, చదరంగం, దక్షిణవేదం, ప్రజాకళలూ- ప్రగతి వాదులూ, మహనీయులు, మనవేమన, వ్యాసపీఠం, సమగ్ర ఆంధ్ర సాహిత్యం వంటి అనేక పరిశోధన, సాహిత్య విమర్శ గ్రంథాలను రచించిన ఆరుద్ర 4 జూన్1998 న మరణించారు.
ఆయన రచించిన సమగ్ర ఆంధ్ర సాహిత్యానికి గాను నాటి ఉభయ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆరుద్రగారి కుటుంబానికి పెద్దమొత్తంలో డబ్బు ఇచ్చి, వాటిని తెలుగు అకాడమీ ప్రచురించింది. ఉభయ రాష్ట్రాలలోను ఆగష్టు నుండి ఆరుద్ర శతజయంతి (1925-2025) వేడుకలు ప్రారంభమవుతున్న సందర్భంగా ఆయనపై పరిశోధన చేసిన సెంట్రల్ యూనివర్సిటీ తెలుగుశాఖ పూర్వ శాఖాధ్యక్షలు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుగారితో ముఖాముఖీ.
నమస్కారం సర్, మీరు ఆరుద్ర మీద పరిశోధన చేశారు కదా. ఆరుద్ర శతజయంతి సందర్భంగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని అనుకొంటున్నాను. ఆయన రచనలపైనే పరిశోధన చేయాలని మీరెందుకు అనుకున్నారు?
ఆచార్య దార్ల: నేను ఎం.ఫిల్., డా.యస్.టి. జ్ఞానానందకవిగారి ఆమ్రపాలి కావ్యంపై పూర్తి చేసి పిహెచ్డి కోసం సిద్ధమవుతున్నాను. మా సూపర్వైజర్ గారేమో ఎం.ఫిల్ చేసిన టాపిక్ నే పొడిగించి, అంటే డా.యస్.టి. జ్ఞానానందకవి గారి అన్ని రచనలపైనే పరిశోధన చేయమని అంటున్నారు. అప్పటికే ఆయనపై పరిశోధనలు జరుగుతున్నాయి. నా దృష్టిలో మరలా ఆయనపై డాక్టరేట్ చేసేటంతటి సాహిత్యం లేదనిపించింది. ఈ పరిస్థితుల్లో మాకు పాఠాలు చెప్పిన, నాకిష్టమైన గురువుల్లో ఒకరైన ఆచార్య కే.కే. రంగనాథచార్యులు గారి దగ్గరికి వెళ్లి, నా భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి టాపిక్ తీసుకుంటే బాగుంటుందో చెప్పమని సలహా అడిగాను. నేను అకాడమిక్ రంగంలో స్థిరపడాలనే నా లక్ష్యాన్ని చెప్పడంతో ఆయన నన్ను ఆరుద్ర పై పరిశోధన చేస్తే బాగుంటుందని చెప్పారు. అప్పుడు కవుల చరిత్రలు, సాహిత్య చరిత్రలు అన్నీ చదివే అవకాశం ఉంటుందని, అది భవిష్యత్తులో విద్యాబోధనకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఆ విధంగా ఆరుద్ర రచనలపై, ప్రత్యేకించి సమగ్ర ఆంధ్ర సాహిత్యం, ఆయన పరిశోధనలపై ‘ పరిశోధకుడిగా ఆరుద్ర’ అనే అంశంపై నా పరిశోధన దృష్టిని కేంద్రీకరించాను. ఆరుద్ర గారి ‘గురజాడ గురుపీఠం’ అనే గ్రంథానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు ఉత్తమ విమర్శకుడు పురస్కారాన్ని ఇచ్చారు. సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో కూడా పరిశోధన, విమర్శ మిళితమై ఉన్నాయి. ఆరుద్ర అనగానే సమగ్ర ఆంధ్ర సాహిత్యమే ప్రధానంగా చెప్పుకోవాలి. కానీ దానిపై పరిశోధన నాకు తెలిసినంతవరకు జరగలేదు. అందువల్ల దానిపై పరిశోధన చేయాలనుకున్నాను.
అంతకుముందు ఆరుద్ర పై ఎవరూ పరిశోధన చేయలేదా చెప్పండి?
నాకు తెలిసి కొన్ని పరిశోధనలు జరిగాయి. కె.చంద్రారెడ్డి గారు ‘ఆరుద్ర కవితానుశీలన’(1979), కె. భీమేశ్వరరావుగారు ‘ఆరుద్ర కవిత్వంలో అన్యదేశ్యాల పరిశీలన’(1983), వి. రామిరెడ్డిగారు ‘ఆరుద్ర త్వమేవాహమ్ - పరిశీలన’(1987), ఎం. సుబ్బారావుగారు ‘త్వమేవాహమ్ పరిశీలన’ (1989), ఎల్. సంగయ్యగారు ‘ఆరుద్ర జీవితం - రచనలు: సమగ్ర పరిశీలన’ (1991), ఆర్. నరసింహారావుగారు ‘అభ్యుదయ కవిత్వంలో ఆరుద్రత’ (1992), కానీ, ఆరుద్ర సాహిత్య విమర్శ పరిశోధనలపై ప్రత్యేకమైన పరిశోధన జరగలేదు.
ఆచార్య మేడిపల్లి రవికుమార్ గారు సాహిత్య అకాడమీ వారి భారతీయ సాహిత్య నిర్మాతలు సిరీస్ లో భాగంగా ఆరుద్రపై ఒక మంచి పుస్తకం రాశారు.
మీరు ఆరుద్ర పై ఏ సంవత్సరంలో పరిశోధన మొదలుపెట్టి, ఎప్పటికి పూర్తి చేశారు? మీరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఎప్పుడు చేరారు?
నా ఎం.ఫిల్ 1997లో పూర్తి చేశాను. 1998లో పిహెచ్.డి.లో చేరాను. ఆరుద్ర గారు కూడా 4 జూన్ 1998లో మరణించారు. ఆ సందర్భంగానే చాలా మంది సమగ్ర ఆంధ్ర సాహిత్యంపై ఆరుద్ర పరిశోధన చేశారని ప్రస్తావించడమే తప్ప, ఎలాంటి పరిశోధన చేశారనేది చెప్పేవారు కాదు. ఆ విషయాలు కూడా ఆచార్య కే.కే. రంగనాథచార్యులు గారితో చర్చించినప్పుడు ఒక నవ్వు నవ్వి అందుకే ‘నువ్వు పరిశోధన చేసి చెప్పు’ అన్నారు. అలా నా పరిశోధనను ప్రారంభించి జూలై, 2003 నాటికి పూర్తి చేశాను. నా పిహెచ్.డి. పూర్తి కాకముందే అంటే 2001లో డిగ్రీ కళాశాలలో తెలుగు ఉపన్యాసకుడుగా ఉద్యోగం వచ్చింది. రెండేళ్లపాటు రెగ్యులర్ గా రీసెర్చ్ మెథడాలజీతో పార్ట్ -1 పూర్తి చేస్తే, ఆ లోగా పర్మినెంట్ ప్రాతిపదికన ఉద్యోగం వస్తే, పిహెచ్.డి ని పార్ట్ టైమ్ గా మార్చుకొనే సౌలభ్యం ఉంది. దాని వల్ల ఆ ఉద్యోగంలో చేరి, ఆ బోధనానుభవం, అధ్యయన అనుభవాలతో 2003లో నా సిద్థాంత గ్రంథాన్ని పూర్తి చేశాను. అది అయిన వెంటనే సెంట్రల్ యూనివర్సిటీ లో నోటిఫికేషన్ రావడం, అసిస్టెంట్ ప్రొఫెసర్ గా సెలెక్ట్ కావడంతో 2004 లో యూనివర్సిటీ లో చేరాను.
కవిత్వం, సినిమా పాటలు, నాటకాలు ఎన్నింటిలోనో బిజీ బిజీగా ఉండే ఆరుద్ర పరిశోధనలోకి ఎలా వచ్చారు?
నిజానికి ఆరుద్ర గారు ఒక సినిమా కథ డిస్కషన్ లో భాగంగా పరిశోధనలోకి దిగారు. ఆయనకు కవి తిక్కన, ఖడ్గ తిక్కన ఒక్కడా? వేర్వేరా? అనే సందేహం వచ్చింది. దాన్ని ఆ సందేహాన్ని తీర్చుకోవడం కోసం అన్వేషణ మొదలైంది. ఆ విషయాన్ని ఆయన తన వ్యాసపీఠం అనే గ్రంథంలో స్పష్టంగా చెప్పుకున్నారు. అప్పటికి (1948) ఆరుద్ర కు తెలుగు సాహిత్య చరిత్రతోనే పరిచయం లేదట. దీన్ని అన్వేషించడం కోసం కొన్ని గ్రంథాలను అధ్యయనం చేశాడు. తిక్కన అనే పేరుతో సంబంధం ఉన్న కొన్ని పుస్తకాలను ఆరుద్ర చదివాడు. కేతన తన దశకుమార చరిత్రను తిక్కనకు అంకితం ఇచ్చాడు. కాకతీయ రాజుల చరిత్రను ముఖ్యంగా ప్రతాప రుద్రుని చరిత్రను తెలియజేసే కాసె సర్వప్ప రచించిన శ్రీ సిద్దేశ్వర చరిత్ర అనే ద్విపదకావ్యం, తిక్కన రచించిన నిర్వచనం రామాయణం వంటి రచనలను పరిశీలించాడు. వీటితోపాటు కాటమరాజు కథలో తిక్కన ప్రస్తావన ఒకటి వస్తుంది. కనుక వాటిని కూడా అధ్యయనం చేశాడు. కాటమరాజు తో జరిగిన యుద్ధంలో తిక్కన మరణిస్తాడు అతన్నే ఖడ్గ తిక్కన, రణతిక్కన అని పిలుస్తారు. వీరిద్దరూ ఒక్కరా, వేర్వేరా అనేది తెలుసుకోవడం కోసం మల్లంపల్లి సోమశేఖర శర్మ, వేటూరి ప్రభాకర శాస్త్రి తదితరుల పరిశోధనా అంశాలను కూడా అధ్యయనం చేశారు. మొత్తం మీద ఇద్దరు వేర్వేరని అయితే ఇద్దరికీ బంధుత్వం ఉందని తేల్చాడు ఆరుద్ర. వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత ఆరుద్ర ఒక వంశ వృక్షాన్ని కూడా తయారు చేశాడు. కాటమరామరాజు కథ అనే పేరుతో ఒక స్టేజి నాటకాన్ని కూడా రచించారు.
సారకవితాభిరాముడు, గుంటూరు విభుడు అయిన కొట్టరపు భాస్కరమంత్రికి నలుగురు కొడుకులు. మూడవ కుమారుడైన సిద్ధనమంత్రికి ఏడుగురు కొడుకులు. వీళ్ళలో పెద్దవాడు ఖడ్గతిక్కన. భాస్కరమంత్రి నాలుగో కుమారుడైన కొమ్మన దండ నాథునికి ఒక్కడే కొడుకు. అతడే కవితిక్కన అని ఆరుద్ర నిరూపించి, సాహిత్య పరిశోధన వడ్డించిన విస్తరికాదన్నారు. ఆరుద్ర అలా పరిశోధనలోకి ప్రవేశించారు.
గురజాడ గురుపీఠం గ్రంథాన్ని ఆధారం చేసుకుని ఆరుద్రకు ఉత్తమ విమర్శకుడు పురస్కారం ఇచ్చారు కదా. ఆ గ్రంథం ప్రత్యేకత ఏమిటి?
ఔను. ప్రధానంగా ఈ గ్రంథాన్ని ఆధారంగా చేసుకునే ఆరుద్ర పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు ఉత్తమ విమర్శకులు పురస్కారాన్ని ఇచ్చి గౌరవించారు. గురజాడ చేసిన భాషా సాహిత్యాల కృషిని, అభ్యుదయ దృక్పథాన్ని ఆ గ్రంథంలో ఆరుద్ర ఎంతో శాస్త్రీయంగా విశ్లేషించారు. గురజాడ తన కవిత్వంలో చేసిన ప్రయోగాలు, ఆ ప్రయోగాల్లోని సామాజిక అభ్యుదయ ఆకాంక్ష, ఆయన ప్రదర్శించిన వ్యావహారిక భాషా దృక్పథం, కన్యాశుల్కంలోని పాత్రల విశిష్టత వంటివన్నీ అనేక మంది సాహితీవేత్తలతో, అనేక గ్రంథాలతో పోల్చి చెప్పడం ఆ గ్రంథంలో కనిపించి ఒక విశిష్టత.
గురజాడ జీవిత దృక్పథం, రచనల పరిణామం ఆరుద్ర ‘గురజాడ గురుపీఠం’ లోనూ, ‘సమగ్ర ఆంధ్ర సాహిత్యం’ (11వ సంపుటి) లోనూ, ప్రత్యేక సంచికల్లో, పత్రికల్లో, వివిధ పుస్తకాలకు రాసిన ‘ముందుమాట’ ల్లోనూ ప్రకటించారు. అయితే, వీటన్నింటిలో కంటే, ‘గురజాడ గురుపీఠం’ గ్రంథంలో గల వ్యాసాల్లోనే ఆరుద్ర విమర్శనా దృక్పథం బాగా వ్యక్తమవుతుంది. గురజాడ కన్యాశుల్కం రచన చేయడంలో గానీ పూర్ణమ్మలో బాల్యవివాహాల సమస్యల్ని కరుణ రస ప్రధానం చేయడంలో గానీ, సోషల్ రిఫార్మ్, స్పోకెన్ తెలుగు అనే వాటినే మనసులో పెట్టుకున్నారని ఆరుద్ర చెప్పారు.
ఆయన అన్ని పుస్తకాల కంటే ఆ పుస్తకంలో ఉత్తమ విమర్శకుడికి ఉండవలసిన లక్షణాలన్నీ ఆరుద్రలో చూడాలంటే ఆ పుస్తకం చూడాలి. మిగతా అన్ని రచనల్లోనూ విషయాన్ని సాగదీసి చెప్తారు. కానీ, ఈ గ్రంథంలో తాను చెప్పవలసిన అంశాలన్నీ సూటిగా చెప్పారు. ‘వేమన్న వేదం’ లో ఆరుద్ర వ్యాఖ్యానం మార్క్సిస్టు విమర్శనా దృక్పథాన్ని కలిగి ఉందనే కంటే, ఆ దృక్పథానికి వీలయ్యే పద్యాలకే వ్యాఖ్యానాన్ని కొనసాగించారనడం సమంజసం. వేలకొలదీ ఉన్న వేమన పద్యాలన్నింటినీ వ్యాఖ్యానిస్తే, భిన్నదృక్పథాలు వెలువడవచ్చు. ఈ విషయంలో పరిశోధకులు వేమన పద్యాల గురించి ఎన్నో చర్చోపచర్చలు జరుపుతూనే ఉన్నారు. ఆరుద్ర తనది అభ్యుదయ దృక్పథమని చెప్పుకోవడమే కాకుండా, ఈ గ్రంథానికి “ఆముఖం’’ రాస్తూ ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారు “వేమన కవిత అభ్యుదయ భావ ప్రచారానికి అభినవ సాధనంగా సమాదరింప బడుతున్నది. సామాజిక వ్యవస్థను సామ్యవాద దృక్పథంతో సమక్షించి సౌమ్యశీలంతో సత్యాన్ని విశ్వజనీనంగా ప్రతిపాదించగలిగిన ప్రతిభావంతులు’’ గా ఆరుద్రను ప్రశంసించారు.
గురజాడను కొంత మంది మార్క్సిస్టు అనీ, హేతువాది అనీ, నాస్తికుడు అనీ రకరకాలుగా వ్యాఖ్యానించారు. ఇలాంటి అభిప్రాయాల నేపథ్యంలో గురజాడను ఆరుద్ర ఎలా నిరూపించారు?
గురజాడను కొన్ని సందర్భాలలో అభ్యుదయ ఆకాంక్ష సామాజిక స్పృహ ఉన్న సంస్కరణ వాదిగా, మానవతావాదిగా ఆరుద్ర వ్యాఖ్యానించారు. కన్యాశుల్కం నాటకంలో ఆయన భాషా దృక్పథం ప్రజా దృక్పథమన్నారు. ఆ నాటకంలో సౌజన్యరావు పంతులు మధురవాణికి భగవద్గీత ఇవ్వడాన్ని ఆధారంగా చేసుకుని గురజాడను పూర్తిగా మాక్సిస్టు భావజాలం ఉన్న వ్యక్తిగా చెప్పలేమని అన్నారు. ఈ ఆధారంతోపాటు పూర్ణమ్మ, కన్యక వంటి కావ్యాలను, గురజాడ లేఖలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. గురజాడ మొత్తం సాహిత్యాన్ని మూల్యాంకన చేస్తూ అక్కడక్కడా కొన్ని మార్క్సిస్టు ధోరణులు కనిపిస్తున్నా, అప్పారావుగారు హేతువాదే గాని, నాస్తికులు కాదని కూడా ఆరుద్ర తన నిర్ణయాన్ని ప్రకటించారు.
కవిగా, సినీరచయితగా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న సమయంలో ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్యం రాయాలనుకోవడానికి వెనుక గల కారణాలు ఏమిటి?
ఆరుద్ర మొదటి పాత్రికేయుడు. తర్వాతే ఆయన కవి, రచయిత, పరిశోధకుడు. కొంతమంది పాత్రికేయులకు సమాజంలో ఏం జరుగుతుందనే విషయాన్ని చెప్పడం మాత్రమే కాకుండా, తమ చరిత్రను, సంస్కృతిని, సాహిత్య స్థితిగతులను అందించాలనే తపన కూడా ఉంటుంది. తద్వారా సామాజిక మార్పుకి చాలామంది పాత్రికేయులు శక్తివంచన లేకుండా కృషి చేస్తారు. వార్తలకు మాత్రమే పరిమితం కాకుండా జీవవంతమైన సామాజిక నిర్మాణంలో భాగస్వాములు అవుతుంటారు. అదే ఆరుద్రను అనేక పత్రికల్లో రకరకాల శీర్షికలు నిర్వహించేలా చేసింది. అలా ఆయన సినిమాలకే అంకితం కావచ్చు. కానీ, ఆయన ఆత్మ అంతా సాహిత్యంతోనే ముడిపడి ఉంది. ఆ సమయంలో అంటే 1965 ఏప్రిల్ లో మొదటి సంపుటి వెలువరించేటప్పుడు తమ లక్ష్యాలను స్పష్టంగా ప్రకటించారు. నెల నెలా సమగ్ర ఆంధ్ర సాహిత్యం 12 పుస్తకాలుగా విడుదల చేయాలని భావించారు.
ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో రాజులు పోషకుల ఆధారంగా యుగ విభజన చేయడానికి గల కారణాలు ఏమిటి?
సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో రాజుల, పోషకులను ఆధారంగా యుగ విభజన చేసినా, చరిత్ర, కాలనిర్ణయాలను స్పష్టంగా విశదీకరించే ఆలోచన ఆరుద్ర సత్యాన్యేషణను ప్రతిబింబిస్తుంది. వివిధ కాలాల్లో రాజులు, పోషకులు కవుల్ని పోషించారనీ, కవులు, రాజుల పోషణకు అర్రులు చాచారనీ, ఆ కార్యకారణ సంబంధాల్లో ఉన్న రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితుల్ని గతి తార్కిక ‘చారిత్రక’ భౌతిక విశ్లేషణలతో సత్యాన్యేషణతోనే ఆరుద్ర ఆ యుగవిభజనను ఎంపికచేసుకున్నారు. కేవలం పోషకుల ఆధారంగానే యుగవిభజన చేయలేదు. ప్రక్రియల వారీగా కూడా విభజన చేశారు. ఆధునిక సాహిత్యాన్ని అంతా అలాగే విభజించారు. ‘కవిత్వవేది’ కల్లూరి వేంకట నారాయణరావు గారి ‘ఆంధ్రవాజ్మయ చరిత్ర సంగ్రహం’లోని యుగవిభజనకు సురవరం ప్రతాపరెడ్డిగారి ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ ప్రభావంతోను ఆరుద్ర చేసిన యుగవిభజన ఉంటుంది. చారిత్రక పరిస్థితుల్ని ఆధారంగా చేసుకొని ఒక క్రమపద్ధతిలో అధ్యయనం చేయడానికి బాగుంటుందని ఆరుద్రదీన్ని ఎన్నుకొని ఉంటారు.
సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో ఎంతమంది కవుల్ని, వారి రచనల్ని ఆధారంగా చేసుకుని సమగ్ర ఆంధ్ర సాహిత్యాన్ని రచించారో ఒక అంచనాగా చెప్తారా?
ఆరుద్ర తన సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో దాదాపు వెయ్యి మందికి పైగానే తెలుగు కవుల్ని వారి రచనల్ని విశ్లేషణ చేస్తూ తనదైన శైలిలో విమర్శనాత్మక, పరిశోధనాత్మక దృక్పథాల్ని తెలియజేశారు. ఆ కవులను మాత్రమే కాకుండా గ్రంథాలను వివరించేటప్పుడు మరి కొంతమంది రచనలు కూడా పేర్కొన్నారు. వాటిని తొలి, మలి ముద్రణలలో చేసిన మార్పులు చేర్పులను, ఆ కవుల వివరాలను ఒక పట్టికగా నా డాక్టరేట్ సిద్ధాంత గ్రంథం అనుబంధంలో వేశాను. అయితే, ఇంచుమించు అదే పద్ధతిలో తెలుగు అకాడమీ వారు కూడా ఇటీవల ఆరుద్ర పేర్కొన్న కవులు కాలాలను తెలుపుతూ ఒక పుస్తకంగా ప్రచురించారు.
తనకు బంధుత్వం ఉన్నప్పటికీ శ్రీశ్రీ పై ఆరుద్ర వైయక్తికమైన విమర్శ చేశాడని అంటారు. ఆ విషయాలేమైన సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో గమనించారా ?
తన సాహిత్య అభిలాషకు కారణంగా చెప్పిన అనేకమంది సాహితీవేత్తలలో శ్రీశ్రీ కూడా ఒకరు. స్వయంగా ఆయనకు బంధువు అవుతాడు కూడా. అంటే శ్రీశ్రీకి మేనల్లుడు ఆరుద్ర. అబ్బూరి రామకృష్ణారావు, పింగళి లక్ష్మీకాంతం, నారాయణ బాబు, రావిశాస్త్రి, చాసో, రోణంకి అప్పలస్వామి మొదలైన వారితో ఆరుద్ర నిరంతరం కలుస్తుండేవాడు. శ్రీశ్రీ, పఠాభి, కొడవటిగంటి కుటుంబరావు, సెట్టి ఈశ్వరరావు, కోగంటి గోపాలకృష్ణయ్య మొదలైన వారి వల్ల ఆయనకు అభ్యుదయ భావజాలం అలవడింది. ఆరుద్ర నిరుద్యోగ ఉన్నప్పుడు శ్రీశ్రీ దగ్గరకు చేరుకొని ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేశాడు. క్రమేపీ శ్రీశ్రీకి ఆరుద్రకు ఏవో వ్యక్తిగతమైన వివాదాలు వచ్చాయి. వాటికి నా సిద్ధాంత గ్రంథంలో ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇవ్వలేదు. సమగ్ర సాహిత్యంలో ఆయన రాసిన అంశాలకు మాత్రం పరిమితం అయ్యాను.
‘రెండు శ్రీలు ధరించి
రెండు పెగ్స్ బిగించి
వెలుగు శబ్ద విరించి
ఓకూనలమ్మ’’ అని తన కూనలమ్మ పదాల్లో శ్రీశ్రీని అభివర్ణించారు ఆరుద్ర.
తనతో సంబంధబాంధవ్యాలు సక్రమంగా కొనసాగినంత కాలమూ ఒక పద్ధతిలోనూ, తర్వాత మరొక రకంగానూ విమర్శను కొనసాగించడం ఒక విమర్శకుని దృక్పథాన్ని పట్టి చూసినప్పుడు సద్విమర్శను కొనసాగించలేదని నిరూపితం కావడం తప్పుదు. ఆరుద్రలో శ్రీశ్రీ పట్ల ఇలాంటి విమర్శనా దృక్పథం కనిపిస్తుంది. సమగ్రాంధ్ర సాహిత్యంలో కొన్ని విషయాల్లో ఆరుద్ర వ్యాఖ్యానాలు ఈ విషయాన్ని నిరూపిస్తున్నాయి. ఆరుద్ర, శ్రీశ్రీపై వ్యక్తీకరించిన కొన్ని అభిప్రాయాల్ని యధాతథంగా పేర్కొనడం ద్వారా ఆరుద్ర దక్పథం స్పష్టమవుతుంది. "శ్రీశ్రీ ఆరవింద ఘోష్‌ను ఎప్పుడూ అరవింద ఘూస్టు అని పేర్కొనేవాడు'' (స. ఆ. సా. 13 సం. పు. 96). "మహాప్రస్థానం గీతానికి నజ్రల్ ఇస్లామ్ కవితా, హరీన్ రాసిన 'షురూ హువా హై జంగ్' అనే పాటా, శిష్ట్లా రచించిన 'మారో - మారో - మారో' అనే పాటా ప్రోద్బలాలని, అయినీత తన గీతరచనకు ఉత్తేజితమచ్చినవేవో 'చిరకాలం' దాకా శ్రీశ్రీ చెప్పలేదు'' (స. ఆం. సా., 13 సం. పు. 146). దీన్ని ఇటీవల పునర్ముద్రణ చేసిన తెలుగు అకాడమీ (నాల్గవ సంపుటి పు. 764) కూడా మార్చకుండానే ప్రచురించింది."శ్రీశ్రీ సాహిత్య జీవితంలో పరిస్థితులకు వ్యక్తిగత జీవితంలో పరిస్థితులకు సమన్వయం సైకాలజిస్టులే చేయగల ప్రయత్నం" (స. ఆం. సా. 13వ సం. పు. 264).
ఇవన్నీ సమగ్ర ఆంధ్ర సాహిత్య 13వ సంపుటిలో శ్రీశ్రీ పట్ల ఆరుద్ర చేసిన వ్యాఖ్యలు. ఆరుద్ర తన 'గురజాడ గురుపీఠం'లో 'సంకల్పం' శీర్షికతో ముందు మాట రాసుకొంటూ... "జాఢ్యం ముదిరినవాడు తానే ఆద్యుడనుకొంటాడు. 1972లో నేనూ ఈ పాతికేళ్ల సాహిత్యం అనే వ్యాసంలో ఇతగాడు 1939 దాకా తెలుగు సాహిత్యం నన్ను నడపించింది. ఆ తర్వాత నుంచీ దాన్ని నేను నడిపిస్తున్నానని నిస్సార స్వోత్కర్ష చేసుకున్నాడు. బండిచక్రం మీదనున్న ఈగ ఆ బండిని తానే కదిలిస్తాననుకొంటుంది. చారిత్రక, భౌతికవాది ఎవరూ యిలా అనుకోరు. 1930 నుంచీ తెలుగు సాహిత్య చరిత్ర శ్రీశ్రీ స్వీయ చరిత్ర అని కూడా ఆ ప్రబుద్ధుడు నొక్కి వక్కాణించాడు" అని అన్నారు.
అభ్యుదయవాదిగా భావించే ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో గానీ, విడిగా గానీ స్త్రీవాద, దళిత, ప్రాంతీయ అస్తిత్వవాద ఉద్యమాల గురించి ఏమైనా రాశారా?
ఆరుద్ర తన సమగ్ర ఆంధ్ర సాహిత్యం 13వ సంపుటి పూర్తి చేసే నాటికి తెలుగు సాహిత్యం లో స్త్రీవాద, దళిత ఉద్యమాలు ఇంచుమించు ప్రాచుర్యంలోకి వచ్చేశాయనే చెప్పాలి. ఆ ప్రభావం వల్లనే ఇండియా టుడే వార్షిక సాహిత్య సంచిక(1995)లో ‘మనిషి- ఆడమనిషి’ (ఆధునిక మహాకావ్యం) అనే పేరుతో కొన్ని భాగాల్ని ‘స్త్రీ పురాణం’ పేర్కొన్నారు. అయినా గాని దీన్ని ఒక స్త్రీవాద కావ్యంగా పూర్తి చేయలేదు. ఇది అసంపూర్ణంగానే మిగిలిపోయింది. గుర్రం జాషువాని కూడా ఒక కవికోకిలగా చూశారే తప్ప దళితుల ఆర్తిని శక్తివంతంగా వ్యక్తీకరించిన దళిత ప్రాతినిథ్య కవిగా చూడలేదు. అనేక మంచి దళిత కవులను ప్రస్తావించలేదు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కవులను ఇతర సాహిత్య చరిత్రలతో పోలిస్తే అనేకమందిని ఆరుద్ర తన గ్రంథంలో పేర్కొన్నారు.
కవుల చరిత్ర, సాహిత్య చరిత్రలను ఎవరు రాసినప్పటికీ అందరినీ లేదా అన్ని ఉద్యమాలను రాయలేకపోవచ్చు. అందుకనే ముందుగా ఆ జిల్లాకు చెందిన కవుల, సాహిత్య చరిత్రలు వెలువడాలి. అటువంటి పరిశోధనలు ఈ మధ్యకాలంలో మొదలయ్యాయి. కవుల చరిత్ర, సాహిత్య చరిత్ర రచన అనేది నిరంతరం కొనసాగే ఒక ప్రక్రియ. ఆచార్య ఎస్వీ రామారావు, డాక్టర్ ద్వా.నా.శాస్త్రి, ఆచార్య వెలమల సిమ్మన్నగార్ల రచించిన సాహిత్య చరిత్రలు అనేకమంది కవులను, ఉద్యమాలను ప్రస్తావించాయి.
మన తెలుగులో కవుల చరిత్రలు, సాహిత్య చరిత్రలు, వికాస చరిత్రలు అనే సంప్రదాయం ఉంది కదా! ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్యం వీటిలో దేనికి చెందుతుంది?
మూడింటికీ చెందుతుంది. కానీ, ఎక్కువగా సాహిత్య చరిత్ర, వికాస చరిత్రల స్వభావాన్ని కలిగి ఉంటుంది. కవుల పుట్టుపూర్వోత్తరాలు, రచనల వివరాలు, కర్తృత్వ వివాదాలు చర్చించేటప్పుడు కవుల చరిత్రలు చదువుతున్నట్లు అనిపిస్తుంది. కానీ రచనలను వివరించేటప్పుడు ఆశ్వాసాంత కథలను, వస్తు వైవిధ్యాన్ని ఇతర కావ్యాలతో తులనాత్మకంగా పరిశీలించడం కావ్య లేదా రచనల మూలాల్ని వివరించడం, కవి లేదా రచయిత దృక్పథాల్ని అంచనా వేయడం వంటివాటిని వివరించేటప్పుడు సాహిత్య చరిత్రలా అనిపిస్తుంది. కవి ప్రభావాలను, యుగ విభజనలను పక్రియా పరిణామ స్థితి గతులను వివరించేటప్పుడు వికాస చరిత్రలా స్ఫురిస్తుంది. కానీ, మూడింటిలో దేనిగా నిర్ణయించాలో చెప్పమంటే మాత్రం సాహిత్య చరిత్ర వికాసచరిత్రల సమ్మిళిత రూపంగా ఆరుద్ర గారి సమగ్ర ఆంధ్ర సాహిత్యాన్ని వ్యాఖ్యానించవచ్చు.
ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్యంలోను, ఇతర రచనల్లోను, భాషా శైలిలో కనిపించే ప్రత్యేకతల్ని తెలపండి?
ఏ విషయాన్నైనా సృజనాత్మకంగా చెప్పడం ఆయన శైలిలో కనిపించే ప్రత్యేకతే! నిజానికి సృజనాత్మక సాహిత్యం - కవిత, కథ, నవల, నాటకం వంటి వాటిలో సృజనాత్మక ఉండాలి. దానితో పాటు భావుకత, అభివ్యక్తి వైవిధ్యం రచనను ఆసక్తిగా చదివించేలా చేస్తాయి. జ్ఞానమే ప్రధానమైన విమర్శ, పరిశోధన వ్యాసాలలో సృజనాత్మక శైలి కంటే విషయాన్ని సూటిగా, స్పష్టంగా అర్ధమయ్యేలా చెప్పాలి. కానీ, ఆరుద్ర విమర్శ, పరిశోధనల్లో కూడా సృజనాత్మకతను ప్రదర్శించేవారు. దానివల్ల రెండు మూడు సార్లు చదివితే తప్ప ఆయన చెప్పే విషయం స్పష్టంగా బోధపడటం సాధ్యం కాదు.
తెలుగులో వచ్చిన సాహిత్య చరిత్రల్లో మీకు నచ్చిన రచన ఏది?
తొలితరంలో పింగళి లక్ష్మీకాంతంగారి ‘తెలుగు సాహిత్య చరిత్ర’, ‘కవిత్వవేది’ కె.వి. నారాయణరావు ‘ఆంధ్ర వాజ్మయ చరిత్ర సంగ్రహము’ చాలా బాగుంటాయి. ఆ తర్వాత ఆధునిక కాలంలో సుంకిరెడ్డి నారాయణరెడ్డిగారి ‘ముంగిలి’ (తెలంగాణ ప్రాచీన సాహిత్య చరిత్ర) ఆ స్వరూప స్వభావాలను విస్మరించకుండా, విషయాన్ని సూటిగా, స్పష్టంగా చెప్పిన రచనలు. వాటితో పాటు కె.కె. రంగనాథాచార్యులు గారి ‘తెలుగు సాహిత్యం - చారిత్రక భూమిక’, ‘తెలుగు సాహిత్యంలో మరో చూపు’, జి.వి. సుబ్రహ్మణ్యంగారి ‘సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు’, పిల్లి జాన్సన్ గారి ‘దళిత సాహిత్య చరిత్ర’ సంగిశెట్టి శ్రీనివాస్ ‘తెలంగాణ దళితోద్యమ చరిత్ర’ మొదలైనవి కూడా మౌలిక రచనలే.
పాత్రికేయునిగా, కవిగా, సినీగేయ రచయితగా, కథకుడిగా, నవలా రచయితగా, విమర్శకుడిగా, పరిశోధకుడిగా, చరిత్రకారుడిగా ఆరుద్ర దేనిలో సక్సెస్ అయ్యారని భావిస్తారు?
వీటిలో ఆయన కొన్ని జీవిక కోసం చేసినవి. మరికొన్ని తన భావోద్వేగాల్ని సామాజిక స్పృహను వ్యక్తీకరించేవి. ఇంకొన్ని తనకు వచ్చిన అవకాశాల్ని వినియోగించుకోవడానికి విమర్శ, పరిశోధన సాహిత్యచరిత్ర పరిశోధన తన జ్ఞానాన్వేషణతో జ్ఞానతృష్ణను తీర్చుకోవడంలో భాగంగా చూడాలి. ఇవన్నీ ఆ కాలం, ఆ వయస్సు దృష్టితో చూసినప్పుడు అన్నీంటిలోను ఆయన సక్సెస్ అయ్యినట్లే. అయినప్పటికీ సినీవాలి, త్వమేవాహం, ఇంటింటి పద్యాలు, ఆయన్ని కవిగా గుర్తించేలా చేశాయి. కొన్ని సినీగీతాలు ఆయణ్ణి చలనచిత్ర రంగంతో విడదీయరాని బంధాన్ని కలిగించాయి. వీటన్నింటినీ కంటే గురజాడ గురుపీఠం ఆయణ్ణి విమర్శకుడిగా రాముడికి సీత ఏమవుతుంది, సమగ్ర ఆంధ్ర సాహిత్యం వంటి గ్రంథాలు ఆయణ్ణి పరిశోధకులు చిత్రకారుడిగా ఒక విశిష్ట స్థానంలో నిలబెట్టాయి.
ఆరుద్ర పై పరిశోధన చేసి డాక్టరేట్ పొందిన సిద్ధాంత గ్రంథాన్ని ప్రచురించారా ?
ప్రస్తుతం పిహెచ్. డి సిద్ధాంత గ్రంథాల్ని ప్రత్యేకించి ప్రచురించాల్సిన పని లేదు. అవన్నీ యూ.జి.సి శోద్ గంగా అనే వెబ్ సైట్ ద్వారా పబ్లిక్ డొమైన్ లో పెడుతుంది. అంతేకాకుండా ఆయా యూనివర్సిటీలు కూడా వెబ్ సైట్ లో అందుబాటులో పెడతారు. నా గ్రంథం కూడా అలా అందుబాటులో ఉంది. నిజానికి ఆ సిద్ధాంత గ్రంథం కొన్ని పరిశోధనా పద్ధతులతో ఆ నియమాల్ని పాటిస్తూ రాయాల్సి ఉంటుంది. దాన్నే మళ్ళీ ప్రచురించే కంటే ఆ గ్రంథంతో పాటు మరికొన్ని అంశాల్ని అందించగలిగే అడ్వాన్స్ రీసెర్చ్ తో కూడిన గ్రంథాల్ని ప్రచురిస్తే బాగుంటుంది. అంతర్జాలంలో నా సిద్ధాంత గ్రంథం ప్రజలకు అందుబాటులోనే ఉండడం వల్ల మళ్ళీ ప్రచురించలేదు. ఎవరైనా పబ్లిషర్ ముందుకొచ్చి ప్రచురిస్తానంటే ఇవ్వడానికి నాకు అభ్యుంతరం లేదు.
తెలుగు భాషా సాహిత్య పరిశోధనల్లో క్రమేపీ ప్రమాణాలు తగ్గిపోతున్నాయనే అభిప్రాయం తరచుగా వినిపిస్తోంది. దీనిపై మీ అభిప్రాయం ?
ఇటువంటి అభిప్రాయాలు పరిశోధనలు మొదలైన నాటి నుండి నేటి వరకు వస్తూనే ఉన్నాయి. నిజానికి యూనివర్సిటీ స్థాయిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం పొందడానికి పిహెచ్.డి (డాక్టరేట్) ఉండాలనే నియమం సరైనది కాదు. పరిశోధన చేయడానికి ఆ విధానాల్ని, పద్ధతుల్ని అవగాహన చేసుకోవడానికి ప్రత్యేక కోర్సు ఉత్తీర్ణులై ఉండాలని పెట్టాలి. దీనికి కారణం అత్యధిక శాతం పరిశోధకులు ఒకవైపు ఉద్యోగం కోసం అన్వేషణలో ఉంటారు. అందువల్ల ఆ పోటీ పరీక్షలకు సిద్ధమవ్వాలి. మరో వైపు సిద్ధాంత గ్రంథాలను సకాలంలో పూర్తి చేయాలి. ఆ గ్రంథాన్ని రాసే నైపుణ్యం ఆ సిద్ధాంతాల అవగాహన ఆ వయసులో ఉన్నవారికి బోధనా అనుభవం, పరిశోధన అనుభవం లేని వాళ్ళకి సరిపోవు. అందువల్ల డాక్టరేట్ తో సంబంధం లేకుండా పి.జి తరువాత ఒక రీసెర్చ్ మెథడాలజీ పూర్తి చేసిన వారికి అవకాశం కల్పించాలి. అప్పుడు ఇంక్రీమెంట్లు, ప్రమోషన్లో వారు చేసే పరిశోధనలను ఆధారంగా ఇవ్వాలి. అప్పుడు వారికి ఆ రంగంలో అనుభవం ఉంటుంది. పరిశోధన ప్రమాణాలు పడిపోతున్నాయనే అభిప్రాయాలు కూడా తగ్గుముఖంపడతాయి.
మరి అలా అయితే, విశ్వ విద్యాలయాల్లో అధ్యాపకులు కేవలం బోధనకే పరిమితం అవ్వాలా ? అప్పుడు డిగ్రీ కళాశాల అధ్యాపకులకు, విశ్వవిద్యాలయ అధ్యాపకులకు తేడా ఏమీ అవసరం లేదా?
విశ్వవిద్యాలయంలో చేరిన వాళ్ళకు కూడా కొన్నాళ్ళ పాటు అధ్యయనం, అధ్యాపనమే ప్రధానం అవుతుంది. అవి చేస్తూనే పరిశోధన పత్రాలు రాయాలి.అందులో నిష్ణాతులైన వారే పరిశోధనలకు, పర్యవేక్షణకు అర్హత అవుతారు. వారికే ప్రమోషన్లు, కీలకమైన పదవులు ఇవ్వాలి. ఇప్పుడు కూడా కొన్ని ప్రమోషన్లకు, కీలకమైన పదవులకు కొన్ని పరిశోధనా పత్రాలు రాయడంతో పాటు పర్యవేక్షణ అనుభవం ఉండడం వంటి వాటిని ప్రమాణాలుగా తీసుకుంటున్నారు. డిగ్రీ కళాశాలలో చేరినా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ వారి గుర్తింపు పొందిన నెట్, స్లెట్ వంటి పరీక్షలు ఉత్తీర్ణులైన వారికి యుజిసి శాలరీ, ఆ నియమాలే వర్తిస్తాయి. విశ్వవిద్యాలయంలో పనిచేసేవారికి కూడా ఆ శాలరీ స్లాబ్ వర్తించినా, టీచింగ్ అవర్స్ తక్కువగా ఉండి, రీసెర్చ్ అవర్స్ పెరుగుతాయి. ఇప్పుడు క్రమేపీ డాక్టరేట్ డిగ్రీతో పాటు కొన్ని నియమ, నిబంధనలు సరిపోతే వాళ్ళు కూడా రీసెర్చ్ గైడ్ గా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ డాక్టరేట్ డిగ్రీ విషయంలో కొన్ని సంస్కరణలు రావాలి. అప్పుడు పరిశోధనల్లో ప్రమాణాలు పడిపోతున్నాయనే అభిప్రాయాలు క్రమేపీ తగ్గుతాయి.
ఆరుద్ర సినీగేయాల పై మీ అభిప్రాయం?
ఆరుద్ర సినీ గేయాల్లో కూడా అనేక అభ్యుదయ భావాలు ఉన్నాయి. అయితే అది నా పరిశోధన పరిధిలోకి రాదు. వాటిపై ప్రత్యేకంగా పరిశోధన చేయడానికి అవకాశం ఉంది. యూనివర్సిటీలల్లో తెలుగు సినీగేయ సాహిత్యం గురించి పరిశోధనలు చేశారు. అటువంటివారిలో ఆత్రేయ, శ్రీశ్రీ, ఘంటసాల, సి.నా.రె, శ్రీ వేటూరి సుందర రామమూర్తి, దాశరథి, సిరివెన్నెల సీతారామశాస్త్రి వంటి సినీ గేయాల్లోని భాషాశైలి, అభివ్యక్తి,కథా కథనం, ఆధ్యాత్మికత, భక్తి పాటలు, లాలి పాటలు, దేశభక్తి పాటలు, పిల్లల పాటలు, జానపద పాటలు, ఇలా విభిన్న అంశాలపై పరిశోధనలు చేశారు. కానీ ఆరుద్ర సినీ గేయ సాహిత్యం గురించి ప్రత్యేకంగా పరిశోధనలు చేసే అవకాశం ఉంది. ఈ విషయాలన్నింటినీ కె. రామలక్ష్మీ ‘ఆరుద్ర సినీ గీతాలు’ అనే సంకలనాల్ని ఐదింటికి తీసుకొచ్చారు. వీటిని విశాలాంధ్ర వారు పబ్లిష్ చేశారు. సినీ గీతాలు ఎవరు రాసినా, ఆ సినిమా సన్నివేశానికి అనుగుణంగా రాాయాలి. అలాంటి వారే ఆ సినీరంగంలో నిలబడగలుగుతారు. ఆ సినీ నిర్మాతలు, డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లతో సర్ధుకుపోవాలి. వాళ్ళు చెప్పినట్లు రాయాలి. కాబట్టి సినీగీతాల ద్వారా వారి భావజాలాన్ని నిర్ణయించడం కుదురదు. ఆరుద్ర కూడా దీనికి అతీతుడు కాదనుకొంటాను. కాకపోతే, తన భావజాలాన్ని చెప్పగలిగే అవకాశం వచ్చినప్పుడు అభ్యుదయ భావజాలాన్ని పలికించిన అనేక గీతాలను రచించారు.
ఆరుద్ర పై భవిష్యత్తులో ఇంకా ఏ యే కోణంలో పరిశోధనలు చేసే అవకాశం ఉంది?
ఆయన సినీ గీతాలు మీద ప్రత్యేకించి పరిశోధన చేయవచ్చు. సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో ఆరుద్ర ప్రతిపాదించిన కొన్ని ప్రతిపాదనలపై ప్రత్యేకంగా పరిశోధన చేయవచ్చు. తెలుగులో ప్రబంధాలు, తెలుగులో పురాణాలు, తెలుగులో కథా కావ్యాలు, అష్టదిగ్గజ కవులు, రాముడికి సీత ఏమవుతుంది అనే గ్రంథంలో ఆయన చేసిన ప్రతిపాదనలు, సంప్రదాయ నృత్యాలకు జానపద విజ్ఞానంలో మాతృకలు ఉన్నాయనీ, అవే భరతుని నాట్యశాస్త్రంలో కనిపిస్తున్నాయనీ చేసిన ప్రతిపాదనలు, తెలుగులో కథానిక, నవల, నాటకం మొదలైన ప్రక్రియలలో తొలి రచనగా దేన్ని గుర్తించాలనే అంశాలు ఇలా ఎన్నో సమగ్రహాంతర సాహిత్యం నుండి తీసుకొని భవిష్యత్తులో పరిశోధన చేయవచ్చు.
తెలుగు సాహిత్యాన్ని చదివేవారికి, పరిశోధనలు చేసేవారికి, ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్యం అధ్యయనం చేయడం వలన కలిగే ప్రయోజనాలు చెప్పండి?
సృజనాత్మక పరిశోధకుడిగా ఆరుద్ర తన సమగ్ర ఆంధ్ర సాహిత్యాన్ని రచించాడని చెప్పుకున్నాం. సాహిత్య చరిత్రలు అంటే కేవలం పండితులకే కాదు, అందరూ చదువుకోవచ్చనీ, దాని ద్వారా తెలుగు సాహిత్యంలో గల వివిధ కోణాలను, ఆ భాషా సాహిత్యాలమాధుర్యాన్ని అనుభవించగలుగుతారు. కొరుకుడు పడని పద్యాలుగా ఉన్న అనేక కావ్యాల్లోని మూల విషయాలను సులభంగా అర్థం చేసుకోవడానికి సమగ్ర ఆంధ్ర సాహిత్యం దారి చూపిస్తుంది. పేరు వినడం తప్ప ఆ కావ్యంలో ఏముందో కనీసం తెలియని వారికి ఆ కావ్యంలో ఉన్న విషయాన్ని పరిచయం చేసుకోగలుగుతారు. మూల గ్రంథాలను చదవడానికి ప్రేరణ పొందుతారు. సాహిత్య చరిత్రకారులు తమ సాహిత్య చరిత్ర, వికాస చరిత్రలకు కొత్త సూత్రీకరణలను ఈ గ్రంథం నుండి స్వీకరించవచ్చు. సాహిత్య చరిత్రలతో ముడిపడిన విమర్శ తీరును ఈ గ్రంథంలో గమనించవచ్చు. తెలుగు అకాడమీ వాళ్ళు నాలుగు సంపుటాలుగా ప్రచురించిన సమగ్ర సాహిత్యం ఎంతో ఆకర్షణీయంగా ఉంది. కానీ, అంత పెద్ద పుస్తకాలుగా ప్రచురించె కంటే చిన్న పుస్తకాలుగా ప్రచురించటమే మంచిది.
ఆరుద్ర శతజయంతి సందర్భంగా ఇంటర్వ్యూ చేసిన మీకు, ప్రచురించిన పత్రిక సంపాదకులకు నా కృతజ్ఞతలు.
డా.నలసాని రామ్ ప్రసాద్,
తెలుగుశాఖ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్,
హైదరాబాద్. ఫోన్: 9502847494
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి