వారం వారం జాషువా సాహిత్యం-3
‘పిరదౌసి’లో కవిత్వ నిర్వచనమే తానైన గుర్రం జాషువ (2)
‘‘నా గ్రంథం చదివే ప్రతీ స్త్రీ, పురుషుడైనా వీరకృత్యాలు చేయుటకు సంసిద్ధులవుతారు. నేటి గృహాఉ ఎండ వానలకు నశించగలవు కాని తుఫాను, వర్షం ఏవీ నేను కట్టిన కావ్యసౌధాన్ని పడగొట్టలేవు. స్వర్గం నాకవిత్వం ముందు శిరస్సు వాల్చింది.’’ అని ఫిరదౌసి తన గ్రంథంలో రాసుకున్నాడు. ఆ కథ నిజంగానే భాషలకు అతీతంగా అందర్నీ ఒక సంవేదనకు గురిచేస్తుంది. ‘షానామా’ (షహనామా) బాహిరీ-తాఖ్ రబ్ అనే పార్సీ వృత్తాల్లో సుమాఏభై వేల పద్యాల్లో రాశాడని చరిత్ర చెబుతుంది. ఫిరదౌసి ‘షానామా’ కావ్యాన్ని రాయడానికి పడిన వేదన మళ్ళీ జాషువా పొందితే తప్ప అంత భావతీవ్రత ‘పిరదౌసి’ కావ్యంలో కనిపించదేమో అనిపిస్తుంది.
తన వంశావళిని కావ్యేతిహాసంగా వర్ణిస్తే, ఒక్కోపద్యానికీ ఒక్కో బంగారునాణాన్ని ఇస్తానని తమకెంతో పవిత్రమైన మక్కామసీదు సాక్షిగా చక్రవర్తి వాగ్దానం చేశాడట. దీన్ని జాషువా ఇలా వర్ణించాడు.
ఒక్కొక్క పద్దియంబున
కొక్కొక్క బంగారు రూక యొసగెదను కవీ!
మక్కా మసీదుతోడని
వక్కాణించెన్ మహాసభా మధ్యమునన్.
ఈ పద్యంలో కవి జాగ్రత్తగా మూడు విషయాల్ని పద్యంలో వచ్చేటట్లు చేశాడు. రాజు బంగారం ఆశచూపడం, దానికి మక్కామసీదు సాక్ష్యం, సభలో ఉన్నవాళ్ళు సాక్ష్యం. వీటని మళ్ళీ ఎలా ధ్వంసం చేశాడో తర్వాత కావ్యంలో మళ్లీ అదే పద్ధతిలో వర్ణిస్తాడు కవి. బంగారానికి బదులు వెండినాణాలు ఇవ్వడం రాజు మాటతప్పడమే. మసీదుపై ప్రమాణం చేసినా దాన్నీ అతడు నిజంగా నమ్మలేదు. బహిరంగంగా ప్రకటించిన వాళ్ల దగ్గరే మళ్ళీ బహిరంగంగా మాటతప్పాడు. దీనిలో సమకాలీన రాజకీయ నాయకుల వాగ్దానాలు, వాటిని నెరవేర్చకుండా అబద్దాలాడ్డం, ఏదొకనెపం వేయడం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఈ పద్యంలోని ఈ సత్యమే ప్రాసంగితకమయ్యింది. దీనికంటే కవిపడే తపనను జాషువా వర్ణించిన తీరు అద్భుతం.
మానవేంద్రుని సత్యవాగ్దానమునకు
హృదయగోచరమగుచు వర్ణింపరాని
అద్భుతావేశమంగంబునాక్రమించె
స్వాంతమున తోచె నిసర్గకవిత ’’ అని కవి వర్ణించడంలో కవిత్వం రాసేటప్పుడు కవి ఒక ఆవేశానికి గురయ్యే అనుభవాన్ని ‘హృదయంలో కనిపిస్తుందట, కానీ వర్ణించాలంటే సాధ్యం కావడంలేదనడా’న్ని గమనించాలి. కవి పడే వేదనకిది నిదర్శనం. ఇటువంటి అభిప్రాయాన్నే నండూరి సుబ్బారావు ‘ఎంకి’ మాటున చెప్పాడు. ‘గుండె గొంతుకలోన కొట్లాడుతాదీకూకుండనీదురా కూసింతసేపు’. నిజమైన స్పందన గల కవి ఒక అందమైన వస్తువుని చూసినా, ఒక భయంకరమైన దృశ్యాన్ని చూసినా కవిత్వమవుతాడు. ఇతరులకు కవికీ ఉన్న తేడా అదే. తాను చూసిన, తాను అనుభవించిన ‘అనుభవం’ అక్షరంగా రూపదాల్చేలా చేస్తాడు. శ్రీశ్రీ తన ‘ కవితా! ఓ కవితా!’లో మొత్తం కవిపడే వేదననే వర్ణించాడు. అయితే కవిత్వం సామాన్యులకు అందకుండా దూరంగా ఉన్న స్థితిని చెప్తూనే కవిత్వావేశాన్ని కూడా వర్ణించం ఒక విశేషం. ‘‘నీ ప్రాబల్యంలో/చిరదీక్షా శిక్షా తపస్సమీక్షణలో/నిశ్చల సమాధిలో/స్వర్గద్వారపు తోరణమై వ్రేలిన నా/మస్తిష్కంలో/ఏయే ఘోషలు, భాషలు, దృశ్యాల్ తోచాయో?/నే నేయే చిత్రవిచిత్ర శ్యమంత/రోచిర్నివహం చూశానో!/నా గీతం ఏయే శక్తులలో/ప్రాణస్పందన పొందిందో?’’...అంటూనే మళ్ళీ ఇలా అంటాడు శ్రీశ్రీ. ‘‘మరి నిన్ను స్మరిస్తే/నా కగుపించే దృశ్యాలా?/వినిపించే భాష్యాలా?/అగ్నిసరస్సున వికసించిన వజ్రం!/ఎగిరే లోహశ్యేనం!/ఫిరంగిలో జ్వరం ధ్వనించే మృదంగ నాదం!’’ ఇదంతా కవి కవిత్వమయ్యే పయనమే. శ్రీశ్రీ తన అభ్యుదయకవితాదృక్పథం కూడా దీనిలో వ్యక్తమయ్యేలా వర్ణించాడు. దేవరకొండ బాలగంగాధర్ తిలక్ ‘అమృతం కురిసినరాత్రి’లో కవి కవిత్వమయ్యే మార్గంతోపాటు, కవిత్వమయ్యాక పొందే సంతోషాన్నిలా వర్ణించాడు.‘‘కళ్ళ చివర కాంతి సంగీత గీతాన్ని రచిస్తున్నాడు/ఎర్రని పెదవులమీద తెల్లని నవ్వుల వీణల్ని మీటుతున్నాడు/ఎవరికీ దొరకని రహస్యాల్ని వశపరచుకున్నాడు/జీవితాన్ని ప్రేమించినవాడు జీవించడం తెలిసినవాడు/నవనవాలైన ఊహావర్ణార్ణవాల మీద ఉదయించిన సూర్యుడు.’’ కవి ఆశనూ, ఆశయాన్నీ కలిగించాలంటూనే నూతన ఊహలు ఉండాలంటాడు తిలక్. దీనితో పాటు ‘నవత-కవిత’ అనే కవితలో ‘కవిత్వం ఒక ఆల్కెమీ, దాని రహస్యం కవికే తెలుసు’ అంటూనే, ‘కవిత్వం అంతరాంతర జ్యోతిశ్శీమల్ని బహిర్గతం చెయ్యాల’ని ప్రబోధిస్తాడు. తిలక్ తాను కవిత్వమైన తీరుని తెలుసుకోవాలంటే ‘అదృష్టాధ్వగమనం’ కవితకూడా చూస్తే శ్రీశ్రీ పడిన వేదనలాంటి వేదన కనిపిస్తుంది. ఇలా ఇంచుమించు ప్రతి కవీ తన కవిత్వం బయటకు రావడానికి రకరకాలుగా ప్రసవవేదన పడటం తప్పని సరి. ఫిరదౌసి కవి వేదనతో మమేకమైన జాషువా ఈ పద్యంలో ‘‘అద్భుతావేశమంగంబునాక్రమించె/స్వాంతమున తోచె నిసర్గకవిత ’’ అనడం ద్వారా కవి లోకాన్ని చూడ్డం లేదా స్పందన పొందడం, ఆ స్పందన ఆవేశంగా రూపుదాల్చడం, ఆ రూపం పరిపూర్ణంగా వచ్చేవరకూ లేదా వచ్చిందని భావించేవరకూ వేదనకు గురికావడం, అది ఒకరూపం దాల్చిన తర్వాత ఒక తల్లి ప్రసవవేదన పడుతూ తన బిడ్డను చూసుకోగానే కలిగేటంతటి స్వాంతనను కవి కూడా పొందేవరకు కనిపించే స్పందనను అంతటినీ వర్ణిస్తాడు. అది సహజత్వాన్ని సంతరించుకునేలా ఉండాలి. అప్పుడు మరలా కవి నిజమైన సంతోషాన్ని పొందుతాడు. దీనిలో భారతీయాలంకారికుడు రాజశేఖరుడు ‘కావ్యమీమాంస’లో కవిత్వ సృజనకు సంబంధించిన విషయాలెన్నో ఉన్నాయి. అలంకారశాస్త్రమే అయినా దీనిలో ఒక కావ్యంలా కావ్యపురుషుడు అనే పాత్రను సృష్టించి, కవిత్వం, దానికి సంబంధించిన అనేక అంశాల్ని రాజశేఖరుడు చర్చించాడు. ఆ కావ్య పురుషుడు వేదపురుషుడే అంటాడు రాజశేఖరుడు. కవులకు రాజులకు మధ్య ఉండే సంబంధాలెలా ఉంటాయో కూడా వర్ణించాడు. ‘ప్రజ్ఞా నవనవోన్మేషశాలినీ ప్రతిభా మతా, తదనుప్రాణనాజ్జీవేద్వర్ణనానిపుణః కవిః’ అని భామహుడనే ఆలంకారికుడు ప్రతిభావంతుడైన కవికి ఉండవలసిన భావుకతను వివరించాడు. దీన్నే తిలక్ కూడా తన కవిత్వంలో చెప్పాడు. ఆవేశం కవిత్వానికి అత్యంత ప్రధానమని ఆంగ్ల కవులు కూడా చెప్పారు. వర్డ్స్ వర్త్ ‘లిరికల్ బ్యాలెడ్స్’(1801) కి రాసుకున్న ముందుమాటల్లో మాటల్ని సందర్భంగా ‘పోయెట్రీ ఈస్ ది స్పాంటేనియస్ ఓవర్ ఫ్లూ ఆఫ్ పవర్ పుల్ ఫీలింగ్స్ : ఇట్ టేక్స్ ఆరిజన్ ప్రమ్ ఎమోషన్ రికలెక్టెడ్ ఇన్ ట్రాక్విలిటీ’’ అన్న మాటలు గుర్తుచేసుకోవాలి. జాషువా తాను పైన చెప్పిన పద్యంలో కవిత్వానికి ఆవేశంతోపాటు మరలా అది సహజంగా వెలువడాలనడంలో రాజశేఖరుడు చెప్పిన ‘సమాధ్యవస్థ’ ఉంది. కవిత్వం రాసేటప్పుడు మన చుట్టూ ఉండే అనేకాంశాల వల్ల ‘కవిత్వావేశం’ వస్తుంది. దాన్ని ఆలంకారికుడు భావయిత్రీ-కారయిత్రీ శక్తలు ఉంటాయని చెప్పాడు. ఒకటి కవి భావుకతను, మరొకటి ఆ భావుకతను అక్షరీకరించేది. ఈ రెండింటికి మధ్యా ‘సమాధి’ అనేది ఉంటుంది. దాన్నే వర్డ్స్ వర్త్ ‘ ట్రాక్విలిటీ’ అన్నాడు. జాషువా తన పద్యంలో ఈ పరిణామాన్ని అంతటినీ ఫిరదౌసి కవి పొంది కవిత్వమయ్యాడని వర్ణించాడు. ఫిరదౌసిని చక్రవర్తి కావ్యం రాయమనడం ప్రేరణ. జీవిత అస్తిత్వం. దానికి సిద్ధపడి అనేక చరిత్ర గ్రంథాలు, ఆధారాలు, సాహిత్య విషయాలు అవగాహన చేసుకొని భావుకతకు పయనించడం భావయిత్రీశక్తిని పొందడం. షానామా కావ్యాన్ని అందించడమే కారయిత్రీశక్తి. ఈ రెండింటి మధ్యా ఆవేశాన్ని సహజంగా మార్చుకోవడం నిసర్గకవితగా మారడం. ఫిరదౌసి అలా చేశాడో లేదో గానీ, జాషువా తన కావ్యాన్ని వర్ణించడంలో ఈ పరిణామాలన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి.
పిరదౌసి కావ్యం కేవలం కవి, కవిత్వం మాత్రమే కాదు, ఆ పద్యాలు నేటి సమాజానికి కూడా ప్రాసంగికంగా కనిపిస్తున్నాయి. ఒక మతం వాళ్ళు మరొక మతాన్ని ధ్వంసం చేస్తే , తర్వాత కాలంలో మళ్లీ అది వ్యతిరేకదిశలో కూడా పనిచేయవచ్చు. కాలం ఒకేలా ఉండదు. గజనీమహ్మద్ హిందూదేవాలయాల్ని ధ్వంసం చేశాడు. దేవాలయాల్లో దాచిన ధనం, బంగారం వంటి వాటికోసం మొదటి ఆలోచన. రెండవ ఆలోచన మతాన్ని , మత విశ్వాసాల్ని నాశనం చేయడం. ఇది సరైంది కాదని జాషువా ఆనాడే ప్రబోధించాడు. దాన్ని ఒక పద్యంలో ఇలా వర్ణించాడు.
భారత క్షోణికల్గు దేవస్ధలములు
చెదరి గజనీ పురాన మసీదులయ్యె
నిప్పటి మసీదు లేరూప మెత్తగలవొ
కాలమెఱుగును,ధారుణీగర్భ మెఱుగు. ఈ మధ్య కాలంలో భారతదేశ వ్యాప్తంగా, ముఖ్యంగా కాశీపట్టణంలో దేవాలయాల పునరుద్ధరణలోను, తాజమహల్ పట్ల వస్తున్న వాదనల్లోనూ ఈ ధోరణులో కనిపిస్తున్నాయి. కవి దార్శనికుడు. ఆలంకారికులు అందుకే ‘కవయ: క్రాంతిదర్శన:’ అన్నారు. అది జాషువా కవిత్వంలో స్పష్టంగా కనిపిస్తుంది.
చాలామంది పరిశీలకులు పిరదౌసి కావ్యాన్ని అంత రసభరితంగా రాయడానికి, ఆయన కూడా అలాంటి జీవితాన్నే జీవించడం ఒక కారణంగా చెప్పారు. దీనిలో కొంత నిజం లేకపోతేదని ఆయన రచనల్ని చదివేవారికి కచ్చితంగా స్పురిస్తుంది. కానీ, కవులంతా ఇలాగే తమ జీవితంతో ముడిపడిన వస్తువు, జీవితం వల్లనే అలా వర్ణించగలిగారనే సిద్ధాంతం సరైందికాదు. సందర్భాన్ని, సన్నివేశాన్ని, వస్తువుని బట్టి కవి వాటిని ఆవాహన చేసుకుంటాడు. అందుకే తన కావ్యంలోని పాత్రలు భిన్న మనస్తత్వాల్ని కలిగి ఉంటాయి. ఒక పాత్ర మంచివాడుగా, మరొకపాత్ర చెడ్డవాడుగా ఉండొచ్చు. అలాంటప్పుడు కేవలం వీళ్ళిద్దరిలో ఒక గుణాన్ని మాత్రమే కవికి ఆపాదించలేం. పోనీ, అన్ని గుణాల్నీ ఆపాదిద్దామనుకున్నా, అది సరైందికాదు. అవి కేవలం ఆలంకారికులు చెప్పిన ‘సహృదయత’తో పలికించే భావాలు. అందుకే జీవుల్లో ఉండే సత్వ, రజో,తమో గుణాలన్నింటినీ నవరసభరితంగా కవి వర్ణించగలుగుతాడు.
చక్రవర్తి మాటతప్పి బంగారు నాణాలకు బదులు వెండినాణాలు పంపాడు. ఏదొకటి పంపితేకవి సంతోషించవచ్చు. కానీ, చక్రవర్తే మాట తప్పితే సామాన్యునిపరిస్థితి ఏమిటి? అందుకనే కవి దాన్ని ఇంత వేదనగా వర్ణించాడు. ఆ స్థితిలో కవి
‘‘ఎన్నో కొండలు గుండెలో
గరఁగిపో యెన్
వార్ధి సంతానముల్
గన్నీరయ్యె
సమస్త లోకము నిరాకారస్ధితిం బొల్చెన్’’ అంటాడు. తాను మోసపోయానని గ్రహించాడు. అటువంటప్పుడు కవి ఎలాంటి స్థితిలో ఉండి ఉంటాడో వర్ణిస్తూ...
ఓ సుల్తాను మహమ్మదూ!
కృతక విద్యుద్ధీపముల్ నమ్మి
యాశాసౌధంబును గట్టికొంటిని’’ అంటాడు.
అంతే కాదు ‘అది నిస్సారంపుటాకాసమైనా సర్వస్వమును దొంగలించి నరకానం గూల్చిపోయెన్’’ అని బాధపడతాడు. అరవైవేల పద్యాలు వర్ణించడానికి తాను పడిన కష్టమంతా కళ్ళెదుట కనిపించింది. ఆ ఆవేదన ఎవరితో చెప్పుకోవాలి.
కృతి యొక బెబ్బులింబలె శరీరపటుత్వము నాపహరింప
,శే షితమగు నస్థిపంజరము
జీవలవంబున నూగులాడగా
బ్రతికితుచచ్చియున్నముది వగ్గు మహమ్మదుగారి ఖడ్గదే
వతకు రుచించునా?
పరిభవ వ్యధ యింతట నంతరించునా? అని బాధపడతాడు. ఇలా ప్రతిపద్యమూ జాషువా ఫిరదౌసిలా మమేకమై వర్ణించాడు.
ఇచ్చకపు మాటలు విన్న చక్రవర్తి కవిని శిక్షించడానికి సైనికులను పంపెంచాడని తెలిసి కూడా దు:ఖితుడయ్యాడు. అప్పుడు ఇలా ఒక పద్యాన్ని వర్ణించాడు.
ముత్యముల కిక్కయైన సముద్రమున
బెక్కుమాఱులు మున్కలు వేసినాడ;
భాగ్యగీనుడ ముత్యమ్ము వడయనైతి
వనధి;నను మ్రింగ నోరు వచ్చినది తుదకు.
జాషువ ఈ ‘ఫిరదౌసి’ కావ్యాన్నెందుకు రాశాడో ఆయనకే తెలియదనీ, ఎన్నో అనౌచిత్యాలు ఉన్నాయనీ, ఈ కావ్యానికి సాహితీలోకంలో పేరెలా వచ్చిందో తెలియదని, కేవలం జాషువ కులం వల్ల పడిన అవమానాలను, ఆయన పేదరికాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ కావ్యాన్ని ప్రశంసించారని విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా జాషువా చెప్పుకున్న మాటలను ఒకసారి గుర్తుచేసుకోవాలి. ఈ కావ్యానికి ‘విజ్ఞప్తి’ పేరుతో వచనంలో ఈ కావ్యనేపథ్యాన్ని చెప్పుకున్నాడు. ఫిరదౌసి చరిత్రను తాను ఒక పత్రికలో చదివాననీ, దాన్ని ఇతివృత్తాన్ని ఒక చిన్న ప్రబంధంగా రాయాలనుకున్నాననీ అన్నాడు. దీన్ని కావ్యంగా వర్ణించే క్రమంలో కొన్ని మార్పులు, చేర్పులు చేశాననీ ప్రకటించాడు. ‘‘పారశీక పండితుల రచనకనుకూలంగా నేను చేసిన మార్పులు మనించమ’’ని వేడుకున్నాడు. ‘‘పిరదౌసి గజనీపట్టణాన్ని విడిచిపెట్టి పారిపోయేటప్పుడు వర్ణించిన కీకారణ్యాలు, సింహం, పులి మొదలైన జంతువులు దేశ నైసర్గిక స్థితి, స్వభావాలకు విపరీతంగా ఉన్నాయని తనకు తెలుసుననీ, కానీ, ఫిరదౌసి కవి మానసిక వ్యథను నిరూపించడానికి కవులు ఉపయోగించుకునే కవిసమయాలకు అనుగుణంగా కల్పితాల్ని చేశానని, ఇది సాహసమే అయినా, ఆ సాహసాన్ని మన్నించమని వేడుకున్నానని’’ అన్నాడు. ఈ సందర్భంగా మనం గుర్తించవలసిందొకటి. చరిత్ర వేరు. కావ్యం వేరు. చరిత్రలో సంఘటనలు, తేదీలు వాస్తవంగా చిత్రించబడటం ఉంటే, కావ్యంలో ఆ నాటి మానవుల మానసిక స్పందనలు, ఆ ఉద్వేగాలు వర్ణితం కావాలి. చరిత్ర ఒక కాలానికి మాత్రమే పరిమితం. కానీ, మానవ హృదయ స్పందనలు శాశ్వతాలు. కవులు తమ అనుభవాలను కూడా వివిధ సందర్భాల్లో వివిధ పాత్రల్లో వర్ణిస్తారు. అలాగని, అవన్నీ ఆ కవి అనుభవాలేనని అనుకోలేం. అలాగని అవి పూర్తిగా అసందర్భాలనీ, అసత్యాలనీ చెప్పలేం. కవులు దార్శనిక సత్యంతో సాహిత్యంలో ఆ అనుభవాన్ని తీసుకొస్తారు. ఆ పనినే జాషువ ‘ఫిరదౌసి’లో చేశాడు. ఫిరదౌసి జీవితం, ఆ చారిత్రక సన్నివేశాలు, ఆ జీవన పరిణామాలను తెలుసుకోవాలంటే ఆ చరిత్రను చదువుకోవాలి. ఆ పారశీక కవుల సంప్రదాయాల్ని తెలుసుకోవాలంటే ఆ సాహిత్య చరిత్రల్ని అధ్యయనం చేయాలి. ఇంకా ఆ కావ్యాల్నే చదవాలి. కానీ, ఆ కవి హృదయం నుండి వచ్చిన వేదనను జాషువ హృదయ స్పందనను తెలుసుకోవాలంటే ఫిరదౌసి కావ్యాన్ని ఆస్వాదించాలి.
-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
తెలుగుశాఖ, అధ్యక్షులు,
స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్,
యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్-500 046
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి