"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

08 నవంబర్, 2023

జాషువా ‘ఆత్మ’ను గుర్తించడంలో భిన్న పార్శ్వాలు (8.11.2023)

 వారం వారం జాషువా సాహిత్యం-5



జాషువా ‘ఆత్మ’ను గుర్తించడంలో భిన్న పార్శ్వాలు

 

గతవారం జాషువా ‘ఆత్మ’ను గుర్తించడమెలా? అని ఆయన కులం  వల్ల పడిన కష్టనష్టాల్ని తన రచనల్లో ఎంతో శక్తివంతంగా వర్ణించారనీ, దానిలో ఆయన జీవితం, తన రచనా లక్ష్యం కనిపిస్తుందని రాశాను. కుల నిర్మూలన తన ఆశయాల్లో ఒకటనీ గుర్తించాలని వ్యాఖ్యానించాను. దీనికి చాలామంది స్పందించారు. ఆయన్ని ఒక కులానికి, ఒక ప్రాంతానికీ కట్టిపడేయడం మంచిదికాదంటూ అభిప్రాయపడ్డారు. నిజానికి  ఆయన కూడా అదే కోరుకున్నాడనీ చెప్పాను. ఒక కవి జీవితాంతం వరకు అనేక రచనలు చేస్తాడు. ఆ రచనల్లో ఆ కవి ఆశయాన్ని, రచనల లక్ష్యాన్ని గుర్తించడం కూడా కష్టమే. తాను ఆత్మాశ్రయంగా చెప్పుకున్న అనేకాంశాలలో ఆ కవి ‘ఆత్మ’ కనిపిస్తుంది. కానీ, అదే ఆ కవి ఆత్మగా చెప్పలేం. డా.సి.నారాయణరెడ్డిగారు చమత్కారంగా కప్పిచెప్పేవాడు ‘కవి’ అన్నట్లు, అన్ని విషయాల్నీ కవి ‘విప్పి’ కూడా చెప్పడు. 

సాధారణంగా కవి తన జీవితకాల లక్ష్యాన్ని గుర్తించాలంటే సాహిత్య విమర్శకులు కొన్ని పద్ధతులను అనుసరిస్తుంటారు. వాటిలో కవిజీవిత కావ్యసమన్వయ విమర్శ పద్ధతి ఒకటి. కవి వర్ణించిన రచనలను, ఆయన జీవితాన్ని తులనాత్మకంగా విశ్లేషిస్తూ కవి ‘ఆశయాన్ని’ గుర్తించే పద్దతి ఇది.  ‘కవి’ అంటేనే సాహిత్యానికి సంబంధించినవాడు కదా. దానిలో రాజకీయాలు ఉండకూడదు.  సాహిత్యాన్ని మూల్యాంకనం చేసే ప్రమాణాలతో నిజాయితీగా విశ్లేషించాలి. 

మన తెలుగు సాహిత్యాన్ని, ఆ సాహిత్య తత్వాన్ని మూల్యాంకనం చేయడానికి ఉన్న ప్రధానమైన ప్రమాణం భారతీయ ఆలంకారిక సిద్ధాంతాలు. పాశ్చాత్య సాహిత్య విమర్శ పద్ధతులతో అనుశీలించినప్పుడు కవి సామాజిక దృక్పథంలో ‘భావజాలం’ ప్రధానంగా తీసుకోవాలంటారు. అంటే, కవి సాహిత్య దృక్పథంతో పాటు, సామాజిక దృక్పథాన్నీ, ప్రాపంచిక దృక్పథాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలి.  ఒక కవి సాహిత్యాన్ని సాహిత్యంగానే పరిశీలిస్తూ ఆ సాహిత్య సౌందర్యాన్నే వివరించడమంటే సామాజిక కోణం అప్రధానమైపోతుంది. అప్రధానంకానట్లుండే పద్ధతిలో సాహిత్యాన్ని సాహిత్యంగా చూస్తున్న కొంతమంది దృష్టిలో ‘సర్వజనశ్రేయస్సు’, ‘విశ్వశ్రేయస్సు’ ‘సంస్కృతి ప్రతిఫలనం’ ‘జాతి చరిత్ర’ వంటి పద్ధతిలో వెళ్ళి పోతుంది. ఇక్కడెవరైనా ప్రశ్నించడం మొదలు పెడితే వాళ్ళకు సాహిత్యాన్ని అధ్యయనం చేసే పద్ధతి వాళ్ళకు తెలియదంటారు. మహాభారతంలో వర్ణాశ్రమ ధర్మం గురించి స్పష్టంగా చెప్పినా, అది ‘విశ్వశ్రేయస్సు’నే ఆకాంక్షిస్తుందంటారు. ఒకవేళ ఆ సాహిత్యంలో ఎవరి సంస్కృతి ప్రతిఫలిస్తుందని ప్రశ్నించినా సమాజాన్ని విభాగాలుగా చూడకూడదంటారు. జాతి చరిత్రలో కొంతమందిని అధములుగా చిత్రిస్తూ, మరికొంతమందిని శ్రేష్ఠులుగా కీర్తిస్తూ ‘జాతిమహోన్నతచరిత్ర’ను చెప్తుంటే ప్రశ్నించనంతకాలం ఆ రచనలన్నీ ఆ జాతి చరిత్రలుగానే కీర్తించబడతాయి. ఇలా ప్రశ్నించడాన్ని సామాజిక దృక్పథం నేర్పింది. ఆ సామాజిక దృక్పథమే భావజాలాన్ని గుర్తించేలా ప్రేరేపించింది. ఆ భావజాలమే ప్రాపంచిక దృక్పథాన్నీ చూడాలనే మార్గాన్ని విస్తరించింది. 

గుర్రం జాషువాను రెండు కోణాల్లోనూ అధ్యయనం చేయాలి. భారతీయాలంకారిక సిద్ధాంతాలు తన రచనల్లో లోతుగానే ఉన్నాయి. ఆ ఉండడం దేన్నైనా ధనంజయుడనే ఆలంకారికుడు భావించినట్లు ‘రసవంతం’ చేయడం వరకే పరిమితం కాలేదు. ఒక సాలీడు, ఒక కుక్కపిల్ల, ఒక గిజిగాడు, ఒక గబ్బిలం వంటివన్నీ తన కవితావస్తువులు అయ్యాయి. సాలీడు తన గూడుని అల్లడంలో ఎంతో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది. పురుగుల్ని ఆకర్షించడానికి వీలుగా మెరిసేలా సన్నని దారంలా కనిపించీ కనిపించనట్లు అల్లుతుంది. సాలీడు పొట్టలో నూలు తయారు చేసే యంత్రంగానీ, ప్రత్తిని ఒడికే రాట్నంగానీ ఉందేమో. లేకపోతే అంత సన్నని దారంలా రావడమే కాకుండా ఒకేరకమైన పద్ధతిలో ఆ  దారం అల్లడం అద్భుతం కదా అంటాడు. బహుశా ఈ రెండూ కాకపోతే ఈశ్వరుడే నీ గర్భంలో ఉండి అలా సౌందర్యవంతమైన గూడుని అల్లేశక్తినిస్తున్నాడేమో అనిపిస్తుందంటాడు కవి. ఇంత ప్రతిభావంతుడైన నిన్ను ప్రపంచమంతా మోసగాడని పిలిస్తుందెందుకని ప్రశ్నిస్తాడు.

పాఠకులకోసం పద్యాన్ని కొద్దిగా ఆ సౌందర్యం చెడిపోకుండా సులభంగా విడదీసి చదువుకుందాం.

నీలో నూలు తయారుజేయు మర గానీ, 

ప్రత్తి రాట్నంబు గానీ,

 లేదా ఈశ్వరశక్తి

 నీ కడుపులోనే లీనమై యుండునో

యేలీలన్ రచియింతువు

ఈ జిలుగు నూలీ పట్టు పుట్టంబులు!

ఓసాలీడా, నిను మోసగాడవని 

విశ్వంబేల ఘోషించెడిన్?

 సాలీడు  తాను బ్రతకడం కోసం తన విధ్యక్తధర్మాన్ని నిర్వర్తించింది. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ కదా. అదే సాలీడు కూడా చేసిందనేది ఆ సాలీడు తరపున కవివాదన.  ఆ తర్వాత ఆ పద్యాన్ని సామాజిక వాస్తవికతలో భాగం చేస్తూ, సాలీడు అంతనైపుణ్యంతో గూడుని కట్టడానికి కారణం దాని గురువులనీ, వాళ్ళంతా కనిపించకుండాపోయారనీ, దానికి కారణం చేనేతవృత్తులకు ఆదరణలేకపోవడమే కారణమంటాడు. అప్పుడే ప్రవేశిస్తున్న వస్త్రాల మిల్లులు, దాని వల్ల ఉపాధి కోల్పోతున్న నేతన్న దుస్థితినీ, పరోక్షంగా గాంధీజీ చరఖా ద్వారా ఇచ్చే సందేశాన్ని గుర్తుచేశాడు కవి. ‘పురుగుల గుంపు వచ్చి నాశనం చేయకుండా  వాటిని మోసగించాలనే నెపంతో మెరుపుల వంటి దారాలతో ఎవరికీ కనిపించకుండా కడుపులోనే దాచుకున్న దొంగమగ్గాలపై ఉల్లిపొరలాంటి సన్ననివస్త్రాలను నేసి ఆరబెట్టుకుంటున్నావు. ఎంత తెలివైన మోసగాడివోయ్... నీ సంపదను నువ్వు కాపాడుకోవడానికి వాళ్ళను మాయలో పడేస్తున్నావు. నీ సంపదను దొంగతనం చేయడానికి వచ్చే వాళ్ళను దొంగలనకుండా నిన్ను దొంగవని పిలుస్తుందే’ అనడంలో జాషువా చమత్కారం, భావనాపటిమ అసామాన్యంగా కనిపిస్తుంది. ఒక దోపిడీ స్వభావాన్ని, దాన్ని ఎదుర్కోవడానికి జరిగే ప్రయత్నాన్నీ సాలీడులో కవి అద్భుతమైన రక్షణ వ్యూహంగా వర్ణించాడు.  

ఒక చిన్నిపక్షి గిజిగాడు. దీని గురించి కూడా అద్భుతమై పద్యాలను వర్ణించాడు జాషువా. పిచ్చుకనే ‘గిజిగాడు’ అని కూడా అంటారు. పెద్దపెద్ద గాలి వేసేటప్పుడు, తుఫానులు వచ్చినప్పుడు పక్షులు తలదాచుకోవడానికి ఎంతో కష్టపడుతుంటాయి. ఈ పరిస్థితుల్లో కూడా గిజిగాడు కట్టుకునే ‘పిచ్చుకగూళ్ళు’ పాడవకుండా ఉంటాయి. ఊరికి దూరంగా లేదా పాడుపడిన ఇళ్ళ చూరులకు ఈ పిచ్చుక గూళ్ళు కనిపిస్తుంటాయి. సాధారణంగా చెట్లలో పనికిరాని వానిగా తుమ్మచెట్లను భావిస్తుంటారు. పాడుబడిన చేలలో, అడవుల్లో బాగా పెరుగుతాయి. వాటికి ముళ్ళుంటాయి. తినే పండ్లు కాయవు. కాబట్టి వాటిజోలికి ఎవరూ వెళ్ళరు. ఈ మధ్య కాలంలో వ్యాపారస్తులు తప్ప సొంతంగా ఇళ్ళు కట్టుకొనేవాళ్ళెవరూ తుమ్మచెట్టుని తమ గృహనిర్మాణాల్లో ఉపయోగించరు. అందువల్లనే పిచ్చుకలు ఆ చెట్లకే గూళ్ళు కట్టుకుంటాయనీ, అదొక బంగారు రంగులు పూసే చెట్టనీ, వాటిని నిగనిగలాడే బంగారు ఆభరణాలుగా పోలుస్తాడు కవి. తన గృహాన్ని ఎంతో సౌందర్యవంతంగా సహజంగా మెరిసేలా  ఉండే తుమ్మచెట్టుని ఎన్నుకోవడంలోనే ఒక చిన్నిపక్షిలోని పెద్దఆలోచనను మనముందుంచాడు కవి. రాత్రీ, పగలూ  వేసవి కాలంలో వచ్చే గాడ్పుని తట్టుకుంటూ, వర్షాకాలంలో వచ్చే వానను తట్టుకుంటూ ఎంతో రక్షణతో సంతోషంగా ఒక ఊయలతో కూడిన ఇల్లు నిర్మించిన ఘనత తనది అంటాడు కవి. 

“జిలుగుం బంగరు రంగులం

 కులుకు మేలైన 

చిన్నారి పూగుత్తి సొమ్ములు 

కీలించిన తుమ్మగొమ్మలకు,

 నీవు నీ సతీరత్న మూ

యెల గీమున్ దగిలించి

 రేఁబవలు హాయిందూఁగరా; 

గాడ్పు బిడ్డలు 

మీ కూడిగ మాచరింప,

 గిజిగాఁడా! నీకు దీర్ఘాయువౌ!”

గిజిగాడు గూడుని నిర్మించే నిర్మాణాన్ని ఒక అద్భుతమైన పనిగా వర్ణిస్తాడు కవి. చెట్లకు కట్టే ఇల్లు కాబట్టి తేలిగ్గా ఉండాలనే ఆలోచనలో గిజిగాడొక ఇంజనీరులా కనిపిస్తాడు. ఇంటిలో ఏయే సౌకర్యాలు ఉండాలో తెలుసు. తమ పిల్లలతో పాటు  అవసరమైతే తాను, తన భార్య కూడా ఉయ్యాలల్లో ఊగేలా ఆ గూడుని నిర్మించుకోవడంలో గొప్ప ఆలోచన ఉంది. చీకటి పడితే వెలుగుకోసం మిణుగురుపురుగుల్ని తెచ్చి ఒక అంత: పురంలా వెలుగులతో నింపడం గొప్ప వైభవం. ఆ గూడులోని శత్రువులెవరూ రాలేరు. అలాంటి చిన్న దానిలోనే గదులు, వెలుగులు, మంచములు ఉండే ఆ  గృహనిర్మాణం మానవులకు కూడా సాధ్యం కాదు కదా అంటాడు.

“తేలిక గడ్డి పోచలను దెచ్చి, 

రచించెద వీవు తూఁగుటుయ్యేల గృహంబు, 

మానవుల కేరికి సాధ్యముగాదు, 

దానిలోజాలరు, లందులో జిలుఁగు శయ్యలు 

అంతిపురంబు లొప్పగామేలు భళీ! 

పులుంగుటెకిమీడవురా గిజిగాఁడ! నీడజా!”

చివరికి గిజిగాడుని మించిన అందగాడే లేదంటాడు. అలాంటి గృహనిర్మాణం చేయగలిగేమొనగాడు లేడు. నీలాంటి వైభవాన్ని అనుభవించగలిగే దేవతలే లేరంటాడు. నిజంగా నువ్వొకమొనగాడువంటాడు. ఇలా అనేకమైన అల్పవస్తువులుగా  భావించి కావ్య వస్తువులుగా తీసుకోనివాటిని తాను కావ్య వస్తువులుగా తీసుకో వడంలో జాషువా ‘అల్పవస్తువు’లో అనల్పతను నిరూపించే ప్రయత్నం చేయడం కూడా ఒక ఆలోచనగా కొనసాగింది. సమాజంలో నిర్లక్ష్యానికి గురికాబడేవారిలోని ప్రతిభను, వారి మానసిక స్థితినీ వర్ణించాడు కవి. అవి కేవలం వస్తువులుగా పురుగులు, జంతువులు, పక్షులు, ఉభయచరాలుగా మాత్రమే తీసుకోకూడదు. వాటిని ఆధారంగా చేసుకొని దీనజనుల ఆర్తిని పలికించాడు జాషువా. జాగ్రతగా పరిశీలిస్తే ఆ రచనలు కొనసాగించిన ‘దృక్పథం’ దాన్ని తెలియజేస్తుంది. అందువల్ల రచనకు సామాజిక ప్రయోజనం కూడా జాషువా రచనల్లో  ప్రధానమయ్యిందని గమనించాలి.  జాషువా జీవితాన్నీ, దృక్పథాన్నీ కేవలం ఆయన రాసుకున్న ‘నాకథ’ అనే ఆత్మకథాభాగాల్ని మాత్రమే చూస్తే సరిపోదు. ఆయన అనేక సందర్భాల్లో చెప్పిన పద్యాల్లో ఆయన ఆత్మీయ స్పృహ ప్రతిఫలిస్తుంది. ‘నేను’ అనే పేరుతో ఒకచోట రెండు పద్యాలను, మరొకచోట  ఆటవెలదితో కలిపిన ఐదు సీసపద్యాలను రాసుకున్నాడు. 

‘‘నిఖిలలోకమెట్లు నిర్ణయించిన నాకు

తరుగులేదు, విశ్వనరుడ నేను’’ మకుటంగా ఐదు పద్యాలకు ‘‘నేను’’ ఖండకావ్యంగా వర్ణించుకున్నాడు జాషువా.

‘నేను నివసించడానికి చిన్న ఇల్లుంటే చాలు. సంపాదించేసుకోవాలనే ఆశ తనకు లేదు. భార్యాబిడ్డలకు ఆస్తిపాస్తులు కూడబెట్టి వాళ్ళను పెడత్రోవలో పెట్టాలనుకోను. నేను ఆచరించని నీతులు బోధించను. నాకు రాని రాగాన్ని తీస్తూ పాడను. నాకు సంసారం గడవడానికి సరిపడా ఉంటే చాలు. అంతకు మించి నాకు ఒక్క గవ్వను కూడా అధికంగా కోరుకోను. కులం, మతం అనే గీతలతో కట్టిపడేసే పంజరంలో బంధీకాను. ఈ ప్రపంచం  తనను ఎలా భావించినా నాకేమీ తక్కువతనం కలగదు. నేను విశ్వనరుడను’’ అని మొదటి పద్యంలో అన్నాడు కవి. ఆ తర్వాత పద్యంలో తన రచనాలక్ష్యం, తన రచనల ఆశయాన్ని తెలిపే తన ప్రాపంచిక దృక్పథాన్ని వివరించాడు. 

‘‘వాస్తవ జ్ఞాన సంపత్తి ఖూనీ చేయు 

గాథలు జీర్ణంబుగావు

నాకు ఒక జాతి శ్రేయస్సునకు 

సాయ మొనరించు కపట సంస్థలు నాటకములు 

నాకు అనుభవంబునకు గిట్టని 

నభఃకుసుమ వేదాంతముల్

ప్రబల స్వార్ధములు

నాకు ప్రజల రక్తంబు నాస్వాదించు రాజకీయములు 

గుండెలకు భారములు నాకు

సహజమైన ప్రకృతి సౌఖ్యంబు లొక వ్యక్తి 

దొంగిలించి మనుట దొసగు నాకు 

నిఖిలలోక మెట్లు నిర్ణయించిన నాకు 

తరుగులేదు, విశ్వనరుడ నేను.’’

దీనిలో స్పష్టంగా భావవాదాన్ని వ్యతిరేకించాడు జాషువా. అంతేకాదు, ‘విశ్వశ్రేయస్సు’ పేరుతో ‘కొంతమందిశ్రేయస్సు’ని వ్యతిరేకించాడు. అటువంటి వాళ్ళ మాటల్నీ, చేతల్నీ కపటనాటకాలుగా అభివర్ణించాడు. వాటిని జీవితానుభవంలో  వాస్తవంగా కనిపించని గగన కుసుమాలుగా కూడా ఆక్షేపించాడు. ఆనాడే సాహిత్యంలో ప్రవేశించిన సాహిత్య రాజకీయాల్ని అసహ్యించుకున్నాడు. అందరికీ చెందవలసిన ప్రకృతిలోని నీరు, గాలి, అగ్నీ, భూమి, ఆకాశం వంటి పంచభూతాలను కొంతమందే స్వాధీనం చేసుకొని శ్రీమంతులు కావడాన్ని తీవ్రంగా త్రిప్పికొట్టడంలో గొప్పమార్క్సిస్టులా కనిపిస్తాడు. వ్యక్తి శ్రేయస్సు కంటే సమాజశ్రేయస్సు ముఖ్యంగా భావిస్తాడు. జాషువా పిరదౌసి కావ్యాన్ని పరిచయం చేస్తూ ఒక అంతర్జాల పత్రికలో ఇలా వ్యాఖ్యానించారొకరు..  ‘‘జాషువా విశ్వనాథలాగా పండితుడు కాడు. దేవులపల్లి, కరుణశ్రీల లాగాపదాల్ని సానబట్టి నునుపుదేర్చి ప్రయోగించేవాడు కాడు. ఆయన పద్యాలు ఎక్కడో తప్ప కదనుతొక్కవు. ఆయన పదశిల్పం తీర్చిదిద్దినట్లు ఉండదు. ఐతే ఆయన మహోన్నత భావుకుడు. అంతరంగంలో రసగంగలు పొంగిపొరలే సహజశిల్పి. కళ్ళు మిరుమిట్లు గొలిపే భావనలు, కల్పనలు, ఊహాశక్తి ఆయన్ని ఆధునికకవులందర్లోను ఒక ప్రత్యేక స్థానంలో నిలబెట్టాయి. ఒక పద్యం తీసుకుంటే దాన్లోని పదాలు,సమాసాలు, ఎత్తుగడలు, శిల్పం ఇవి కాదు మనని విస్మితుల్ని చేసేవి. ఆ పద్యం మొత్తం లోను వ్యాపించిగుప్పుమని గుబాళించే భావనాసౌందర్యం, వినూత్నమైన ఊహాశబలత, స్వచ్చంగా ప్రతిఫలించేనిజాయితీ.’’

జాషువా ఎంత శక్తివంతంగా ఛందోబద్దమైన పద్యాలు రాసినా, నేటికీ ప్రజల నోళ్ళలో నానుతున్నా వాటిలో కదనుతొక్కి ప్రవహించే లక్షణం ఈ వ్యాసకర్తకు కనిపించలేదు. శిల్పనిర్మాణాన్ని తప్పుపట్టాడు. కానీ, అదెక్కడో చెప్పడు. చివరిలో జాషువాలో భావనాసామర్థ్యాన్ని మెచ్చుకున్నట్లు కనిపించేలా వ్యాఖ్యానించాడు. అంటే జాషువాది సాహిత్యం కాదనీ, కొత్త ఊహల్ని ఎవరైనా చేసినా అది భావనాసౌందర్యాన్ని కలిగించవచ్చునని తేల్చిపారేశాడు. మనం నేడు చదువుకుంటున్న ప్రాచీన లేదా సంప్రదాయ పద్య కావ్యాలన్నీ యథాతధంగా చూస్తే ఆ పద్యాల సొగసేమిటో తెలుస్తుంది. ఆ కావ్యాలకు చేసిన పరిష్కరణలు చూస్తే తెలుస్తుంది ఆ ఛందోవైభవమూ, ఆ పదసౌందర్యమూ. అలాంటి పరిష్కరణలెన్ని జరిగాయి జాషువాగారి కావ్యాలకు అని అడిగితే సమాధానం ఉండదు.  ఆ వ్యాసంలో రచయిత పేరు లేదు. మరి పత్రికలవారే పెట్టలేదో, ఆయనే పెట్టుకోలేదో మరి. ఇదంతా సాహిత్య రాజకీయం కాకపోతే ఏమిటి? విశ్వనాథ ‘వీరవల్లడు’ గొప్పనవలనడంలోను, దేవులపల్లి ‘అభ్యుదయ సాహిత్య’ నిర్వచనాన్నీ పదేపదే ప్రస్తావించే సాహిత్యవేత్తల్నీ జాగ్రత్తగా చూస్తే సాహిత్య రాజకీయాలే కనిపిస్తాయి. అందుకే గుర్రం జాషువాకు తన సాహిత్యం పట్లా, ఆ  రాజకీయాల పట్లా ఒక స్పష్టమైన అవగాహన ఉంది. లేకపోతే చూడండీ పద్యం వచ్చేదే కాదు. 

‘‘నా కవితా వధూటి వదనంబు నెగాదిగ జూచి, రూపరే

ఖా కమనీయ వైఖరులుగాంచి ‘భళీ! భళి’ యన్నవాడే ‘మీ

దేకుల’మన్న ప్రశ్న వెలయించి, చివాలున లేచి పోవుచో

బాకున గ్రుమ్మినట్లగును ప్రార్థివ చంద్ర! వచింప సిగ్గగున్”.

కులం వల్ల అవమానపడేవాళ్ళు, తమని కులం పరిధిలోనే చూస్తున్నారనుకునేవాళ్ళు కులాన్ని పట్టించుకోకూడదనే చెప్తారు. నిజంగా మనం కులం ఆధారంగా మన నాయకుల్ని, కవుల్ని గుర్తించడం లేదా? ఇతర కవులకు ఒక్కొక్కరోజుని కేటాయించి జాతీయ దినోత్సవాలను జరుపుతున్నట్లే దళిత నాయకులకు, దళిత కవులకు కూడా స్థానం కల్పించాలి. అలా జరుగుతుందా? 

 జాషువా పాఠాన్ని కొన్నాళ్ళపాటు ఒక తరగతిలో ఆయన బాల్యస్మృతులను పెట్టారు. అది కూడా ఎలాంటిదో చూడండి.  జాషువా చిన్నవయసులో ఉండగా తన పక్కింటి పిల్లవాడి దగ్గర ఉండే కౌజు పక్షిని చూచి ముచ్చటపడి దాన్ని కావాలంటాడు. ఆ విషయాన్ని తన తల్లికి చెప్తాడు. ఆమె దాన్ని అడుగుతుంది. కానీ, వాళ్ళివ్వరు. దాన్ని దొంగతనం చేసి తెచ్చుకుంటాడు.  ‘నాకథ’లోని ఈ భాగాన్ని పెట్టారు. ఇక ప్రశ్నలు ఎలా ఉంటాయి? జాషువా దొంగతనం చేసిన పక్షిపేరేంటి?  జాషువా తన పక్కింటిలో పక్షిని దొంగతనం చేయడానికి గల కారణమేమిటి? ఇలా ‘జాషువా ఒక దొంగ’ అనే ముద్రను చిన్నపిల్లల్లో గాఢంగా ముద్ర వేయడానికి ఈ పాఠాన్ని చక్కగా ఉపయోగించుకుంటారు. బాల్యచేష్టలు గురించి చెప్పడం కంటే పిల్లల్లో దీనివల్ల  జాషువాపై ఎలాంటి అభిప్రాయాన్ని కలిగించాలనుకున్నారు?  

భారతీయ సమాజంలో కులం వాస్తవం. మనుష్యుల్ని కులంతో చూడ్డం వాస్తవం. వాళ్లెంత ప్రతిభావంతులైనా కులాన్ని ఆధారం చేసుకోకుండా వ్యాఖ్యానించడం చాలా అరుదైన విషయం. నిత్యం భారతదేశంలో అమ్మాయిల్ని అత్యాచారం చేయడం, హత్యలు చేయడం మనమెన్ని చూడ్డంలేదు? కానీ, కొన్నింటిని మాత్రమే మన మీడియా ‘ప్రపంచం’ దృష్టికి తీసుకొస్తుంది. దీని వెనుక కులం లేదనగలమా? ఎంతో ఘోరంగా కొంతమంది ఉత్తర భారతదేశంలో ‘నిర్భయ్ ’ పైనా (16 డిసెంబర్ 2012)  దక్షిణ భారతదేశంలో ‘దిశ’  పైనా (28 డిసెంబరు 2019)  జరిగిన అత్యాచారాలు అందరూ ఖండించదగినవే. కానీ, వీటిని ఖండించినంతగా అంతకు ముందూ, తర్వాత జరిగిన, జరుగుతున్న దళిత యువతులు, మహిళలపట్ల ‘ప్రజలకు’ ‘మీడియా’కు సానుభూతి ఎందుకు రాలేదు? వీళ్ళవి ప్రాణాలు కాదా? వీళ్ళవి మానాభిమానాలు లేవా?

జాషువాను ఒక కవిగా గుర్తించడంలోను పైకి ‘విశ్వమానవుడు’ అని చెప్పినా వాళ్ళ వాళ్ల  ‘అంతరంగంలో మాత్రమే నిజంగా కనపడు తుంది అసలు రంగు. కానీ దాన్ని అంగీకరించలేరు. తనని అలా చూడ్డం లేదు కాబట్టే,తాను అందుకనే తనను ‘విశ్వనరుడు’గా చూడమని చెప్పాడు జాషువా. 


ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

తెలుగుశాఖ, అధ్యక్షులు,

 స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్,

యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్-500 046





కామెంట్‌లు లేవు: