"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

ప్రజాశక్తి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ప్రజాశక్తి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20 ఏప్రిల్, 2026

రత్నాకర్ పెనుమాక రచించిన 'గౌతమి నది తీరాన...' కథలు

 

రత్నాకర్ పెనుమాక రచించిన 'గౌతమి నది తీరాన...' కథల సంపుటిపై ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారి వ్యాసం. ప్రజాశక్తి దినపత్రిక సాహిత్య అనుబంధం 20.4.2026 సౌజన్యంతో ...



కోనసీమ సహజత్వాన్ని సజీవం చేసే కథలు


తెలుగు కథా సాహిత్యాన్ని దీప్తిమంతం చేయడం మాత్రమే కాదు, సహజత్వాన్ని మన ముందు నిలిపే సజీవ చిత్రాలు రత్నాకర్‌ పెనుమాక కథలు. కోస్తాలో, అందులోనూ కోనసీమ సంతకం చేసిన ఈ కథలు చదివిన తర్వాత ఇన్నాళ్లు ఇలాంటి కథల్ని చదవకుండా ఎలా మిస్‌ అయ్యామని ప్రతి పాఠకుడూ అనుకుంటాడు.

Advertisement
ఇంతకుముందు ఈ తరహా కొన్ని కథలు రాయలసీమ నుంచి బాగా వచ్చాయి. వాటికంటే ముందు ఉత్తరాంధ్ర నుంచి కూడా కొన్ని కథలు వచ్చాయనిపిస్తుంది. వంశీ 'మా పసలపూడి కథలు', దాట్ల దేవదానం రాజు గారి కథలు కూడా తూర్పు గోదావరి జిల్లా కేంద్రంగా రాశారు. అంతకు ముందే ప్రసిద్ధులైన వంగూరి చిట్టెన్‌ రాజు ఈ ప్రాంతాన్ని అమెరికా దాకా తీసుకెళ్ళారు. ఇలా మరికొంతమంది రాసినా కానీ, ఆ మార్గంలో నడుస్తూనే తన ప్రత్యేకతను నిలుపుకునే కథలుగా రత్నాకర్‌ గారి కథలు కనిపిస్తున్నాయి.
ఈ కథల్లో సజీవత్వానికి నిదర్శనాలుగా మూడు అంశాలు ప్రాధాన్యాన్ని వహిస్తాయి. ఒక ప్రాంతానికి సంబంధించిన వర్ణనలు, అక్కడ మాట్లాడుకునే సజీవమైన భాష, అక్కడి సంస్కృతి … ఈ మూడు అంశాలు కథల్లో సహజంగా ఒదిగిపోవడం ఎంతో ముఖ్యం. సాధారణంగా ఒక కథ చదివితే ఆ ప్రాంతాన్ని చూడాలనిపించాలి. ఆ ప్రాంతం ప్రత్యేకత ఏదో తెలిసిందనిపించాలి. ఆ కథ మూస పద్ధతిలో కాకుండా ఎంతో భిన్నమైందనిపించాలి. దానిలో చిత్రితమయ్యే సంవేదనలు, జీవన సంఘర్షణలు సార్వకాలికమో, సార్వజనీనమో కావాలి. అది ప్రతిభావంతుడైన రచయితకు మాత్రమే సాధ్యం. అది రత్నాకర్‌ గారికి సాధ్యమైంది. రత్నాకర్‌ ప్రతిభావంతుడైన కథా రచయిత అని ఆయన రాసిన ఏ కథను చదివినా తెలుస్తుంది.
ఆంధ్రప్రదేశ్‌లో నేడు వివిధ జిల్లాలుగా మారిన ఒకప్పటి ఉభయ గోదావరి జిల్లాల్లో రికార్డింగ్‌ డ్యాన్సులు, దానిలో డ్యాన్స్‌ చేసే వాళ్ళ జీవితాల చుట్టూ అల్లుకున్న కథల్లోని వాస్తవాలు 'సునీల' కథలో రచయిత వర్ణించిన తీరు అద్భుతం. ఆ ప్రాంతానికి చెందిన ఆర్థిక, సాంస్క ృతిక అంశాల్ని చెప్తున్నట్టు ఎక్కడా అనిపించకుండానే, కథ ముగిసేసరికి మనసు కరిగిపోయి, నాలుగు కన్నీటి చుక్కలు రాలి పడ్డాక, మెదడు ఆలోచించడం పెడుతుంది. మనుషుల్ని మనం అర్థం చేసుకునే తీరుకీ, అర్థం చేసుకోవాల్సిన విధానానికీ మధ్య ఒక సమన్వయమేదో అవగాహనకొస్తుంది. సునీల ఒక విటుడ్ని ఆకర్షించి, ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఏమి జరిగిందో తెలియాలంటే ముగింపు చదివి తీరాల్సిందే! డ్యాన్సర్‌ సునీలలోని మానవత్వం గురజాడ వారి మధురవాణి కంటే మహౌన్నతమైందనిపిస్తుంది. నగముని 'పాలు ఎర్రబడ్డాయి' కవితలో వర్ణించిన    మాతృత్వానికి సహృదయ పాఠకుని మనసు చివుక్కుమంటుంది. ఒక ఆర్థిక కోణమే మన మనసుని విలవిలడాడేలా చేస్తుంది. కానీ, ఈ కథలో వీటన్నింటి కంటే సునీల ఉన్నతురాలనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా ఆ ప్రాంతంలోనే పుట్టి, పెరిగిన నాకు తెలిసినంత వరకూ కోనసీమలో ఎంతోమంది చెట్టునీ పుట్టనీ మనుషులు పెనవేసుకుంటారు. ఎంతో అందంగా కట్టుకొనే ఇంటికి చెట్టు అడ్డొచ్చినా చాలామంది దాన్ని కొట్టేయకుండా ఇంటిలో భాగం చేసుకొని కట్టుకొనే పర్యావరణ ప్రేమికులున్నారు. రోడ్ల విస్తరణ పేరుతో చెట్లను నరికేస్తుంటే, ఆ చెట్టుని పట్టుకొని వదలని మనిషిని సలీం 'గుర్రపుడెక్క' నవలలో చెప్తే, ఒక చెట్టుతో తమ జీవితాన్నెలా ముడివేసుకుంటారో 'మా పొలమూర్లో రాయిచెట్టు' కథలో ఇద్దరు మిత్రుల ద్వారా ఈ కథకుడు    ఎంతో ఆర్ద్రంగా వర్ణించాడు. చెట్లను నరికేయకుండా, వాటిని పూజించేలా చేయడానికి గ్రామీణులు తమకు తెలిసిన విద్యలనెలా ప్రదర్శిస్తారో కూడా ఈ కథలో నర్మగర్భంగా కథాకథనం చేశాడు రచయిత. జీవితాన్ని పోషించుకోవడం కోసం చేసే రకరకాల పనుల్లో చిలుక జోస్యం కూడా ఒకటి. అయితే, దాన్ని నమ్మని వాళ్ళపై కూడా దాని ప్రభావం ఎలా ఉంటుందో, యాదృచ్ఛికంగా జరిగే సంఘటనలను కూడా తమ అమాయకత్వంతో కొంతమంది వాటినెలా తమ జీవితంతో ముడిపెట్టుకుంటారో ఈ కథ మనకు వివరిస్తుంది. అయితే, ప్రపంచాన్ని కబళించేస్తూ వేయి బాహువులతో వస్తున్న ప్రపంచీకరణను, అభివృద్ధి పేరుతో జరుగుతున్న మారిపోతున్న పట్టణీకరణ, అందమైన, సుందరమైన కోనసీమకు కూడా దూరం కాదనేది వాస్తవ సత్యం. అయితే, దాన్ని సమూలంగా అడ్డుకోలేకపోయినా కొంతలో కొంతైనా ఆపగలిగే ఆలోచనలు చేసేవాళ్ళు కూడా ఉంటారనే ఆశావాహదృక్పథం 'ఈ పొలం అమ్మబడును' కథలో కనిపిస్తుంది. ప్రపంచీకరణ నేపథ్యంలో వస్తున్న కథాసాహిత్యంలోనే భిన్నమైన కథగా దీన్ని చెప్పుకోవచ్చు.
నేను పుట్టి, పెరిగింది ఈ ప్రాంతంలోనే కావడంతో ఈ కథలు చదువుతుంటే నా వాళ్ళంతా నాతో మాట్లాడుతున్నట్లనిపించింది. నాకు తెలిసిన జీవితాల్నే నేను మళ్ళీ చూస్తున్నట్లనిపించింది. నా బాల్యమంతా మళ్ళీ తిరిగొచ్చినట్లనిపించింది. ఆ కాల్వలు, ఆ ఈత కొట్టడాలు, మునిగిపోవడాలు, అప్పుడు జరిగే ప్రమాదాలు… ఆ ప్రాంతంలో ముంజకాయలు,    మామిడి తోటలు, ఉప్పూకారం పెట్టుకొని మామిడికాయలు తినడం,    ఆ రికార్డింగ్‌ డ్యాన్సులు.. ఇలా ఒక్కొక్కటీ తెరలు తెరలుగా గుర్తొస్తున్నాయి. ఒక ఆత్మీయమైన స్పర్శ ఏదో తగులుతున్నట్లనిపిస్తుంది. ఇంతకీ రత్నాకర్‌ పెనుమాక రాసిన ఏ కథల పుస్తకం గురించి చెప్తున్నానో ప్రస్తావించలేదు కదా!
'గౌతమీ నది తీరాన…' పేరుతో రాసిన కథలు చదువుతుంటే నాకు కలిగిన అనుభూతులివి. రత్నాకర్‌ గారి ఈ పన్నెండు కథలూ నిజంగానే కథా సాహిత్య తీరంలో మెరిసే రత్నాలు. ప్రతి కథా ఇంతకు ముందు వివిధ పత్రికల్లో ప్రచురితమ్వడమే కాదు, ఏదొక బహుమతిని కూడా పొందిందే కావడం విశేషం. కోనసీమ జీవితాన్ని ఇంత సజీవంగా వర్ణించిన కథలు నేను ఇంతకుముందు చదవలేదని ఎందుకంటున్నానంటే, ఈ కథల్లో వాడిన భాష, ఊరి పేర్లు, ఇంటి పేర్లతో సహా ఆయా పాత్రల పేర్లన్నీ వాస్తవాలు. కాకపోతే, ఇతివృత్తం, స్థలాలు, సంఘటనలు, సంభాషణలు రచయిత కళాత్మకంగా సృజనీకరించినవి. చిత్రమేమిటంటే నెరేటర్‌ వాడే భాష కూడా కోనసీమదే కావడం ఒక ప్రత్యేకతగా చెప్పుకోవాలి. కథలన్నీ వ్యాఖ్యానించాలనున్నా, ఆ పని చేస్తే ఇదో పెద్ద వ్యాసమైపోతుందేమోనని నాకు భయంగా ఉంది. అందుకే కొన్ని కథలను మాత్రమే ప్రస్తావించాను. ఈ కథలన్నింటిలోను కోనసీమ సజీవత్వం తొణికిసలాడుతుంది. ప్రతి కథా ఒక గూగుల్‌ మ్యాప్‌లా వీధివీధికీ, గ్రామ గ్రామానికీ, పాత్ర పాత్రకీ పాఠకుల మనసులను తీసుకెళ్ళి పోతుంది. ఈ కథల్లో స్టేట్మెంట్స్‌, మేధో చర్చోపచర్చలు చేయడం కంటే కోనసీమ జీవితాల్లోని సజీవత్వానికే ప్రాధాన్యాన్నిస్తాయి.
కథల్ని రాసేవాళ్ళు మూడు రకాలుగా ముగింపులిస్తుంటారు. సమస్యలకు తనదైన పరిష్కారాన్ని సూచించడం, సూచించకుండా పాఠకులకే వదిలేయడం, ఈ రెండింటినీ మిళితంతో చేయడం అనే పద్ధతుల్లో కొనసాగిస్తుంటారు. ఈ కథకుడు రత్నాకర్‌ చాలా కథలు ముగింపులు సూచనాత్మకాలు. అలాగే, కథా కథనంలో ఉత్తమ పురుష కథనం, సర్వసాక్షి కథనాలనే సాధారణంగా వాడుకున్నారు. రెండింటిలోనూ ఉత్తమ పురుష కథనం కొంచెం కష్టమైనా అది ఆత్మీయంగా ఉంటుంది. సర్వసాక్షి కథనం పాఠకుడికి వీడియో చూపిస్తున్నట్లు ఉంటుంది. ఈ రెండు కథన పద్ధతులనూ కథకుడు రత్నాకర్‌ వస్తువుని బట్టి సమర్థవంతంగా ఉపయోగించుకున్నారు. రావిచెట్టుతో ముడిపడిన జీవితాన్ని చెప్పడానికి ఉత్తమ పురుష కథనాన్ని శక్తివంతంగా ఉపయోగించుకున్నా, చివరికెలా ముగిస్తాడనే తెలివైన పాఠకుల్ని కూడా మెప్పించేలా వర్ణించాడు. మొత్తం మీద కథలన్నీ వస్తువైవిధ్యంలోను, అభివ్యక్తిలోను వేటికవే ప్రత్యేకంగా నిలుస్తూనే కోనసీమలో ప్రవహించే గోదావరి పాయల్లోని గౌతమీ నదీతీరంలోని మనుషుల మనస్తత్వాన్ని సజీవంగా ఆవిష్కరించాయి. కోనసీమ మనుషుల్ని కథాసాహిత్యంలో ఎంతో సహజత్వంతో శాశ్వతంగా నిలుపుతున్నందుకు, తెలుగు సాహిత్యానికి తనదైన ముద్రతో మరొక కొత్త కోణాన్ని అందిస్తూ, సాహిత్య విస్తృతికి తోడ్పడుతున్న రత్నాకర్‌ని పాఠకులు ప్రత్యేకంగా అభినందించకుండా ఉండలేరు.

- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
99896 28049


12 ఆగస్టు, 2025

వివక్షను ఎండగట్టిన తొలి తరం కవి ‘చోడగిరి’ (11.8.2025, ప్రజాశక్తి దినపత్రిక సౌజన్యంతో)

 

వివక్షను ఎండగట్టిన తొలి తరం కవి ‘చోడగిరి’

తెలుగులో దళిత సాహిత్యం ప్రధానంగా రెండు దశలలో కొనసాగుతోంది. తొలిదశలో సంస్కరణోద్యమంలో భాగంగా వచ్చింది. దీనిలో అస్పృశ్యత వల్ల ఎదుర్కొనే సమస్యల చిత్రణ, దళితులు అభ్యున్నతి కోసం విజ్ఞాపన చేయడం, తమ దళిత నాయకుల స్మరణ, సంప్రదాయ కవులతో పోటీపడి పద్య కవిత్వాన్ని కూడా రాయడం, సంప్రదాయ సాహితీవేత్తల మన్ననల కోసం ఎదురుచూడ్డం, దళితేతరులు కూడా దళితుల పట్ల సానుభూతితో రచనలు చేయడం మొదలైన ధోరణిలో కనిపిస్తుంది. రెండవ దశలో ఆత్మగౌరవ ప్రకటన, ప్రధాన జీవన స్రవంతి కోసం ప్రయత్నం, రాజ్యాధికారానికి సాహిత్యం కూడా ఒక సాధనమని నమ్మడం, సాహిత్యాన్ని ప్రయోజన సాధనంగా భావించడం, ఒక ధిక్కార స్వరాన్ని వినిపించడం, ప్రత్యామ్నాయ సాహిత్యాభిలాష, సంస్కృతి నిర్మాణం మొదలైనవి ప్రధానంగా కనిపిస్తాయి. తొలి తరం దళిత సాహితీవేత్తలలో గుర్రం జాషువా, బోయి భీమన్న, యస్.టి.జ్ఞానానందకవి మరికొంతమంది తెలిసినంతగా మిగతా కవులు, రచయితలు ఈనాటి యువకవులు, సాహితీవేత్తలకు పెద్దగా తెలియదని చెప్పొచ్చు. దళితసాహిత్య సౌందర్యంపై డాక్టరేట్ చేసిన పరిశోధకుడు, కవి, మంచి వక్త డా.కోయి కోటేశ్వరరావు తొలి, మలితరాలను చక్కగా సమన్వయిస్తూ దళిత సాహిత్యాన్ని ప్రధాన జీవన స్రవంతిలోని పత్రికల ద్వారా సమాజానికి తెలియజేస్తున్నారు. కొంతమంది పేర్లు విన్నవారికి, వారి గురించి లోతుగా వ్యాసం రూపంలో చదివినప్పుడు, ఇంత గొప్ప కవి తెలుగులో ఉన్నారా?’ అనిపించేటంతటి ఆశ్చర్యానికి లోనయ్యే అంశాలను తన పరిశోధన ద్వారా డా.కోయి కోటేశ్వరరావు వెలికితీస్తున్నారు. ఇప్పుడు ఆయన సంపాదకత్వంలో  ‘మధురకవి’ చోడగిరి చంద్రరావుగారి సాహిత్యం వెలువడ్డం తెలుగు సాహిత్యం చేసుకున్న అదృష్టం. ఒకప్పుడు ప్రాచీన సాహిత్యానికి వేటూరి ప్రభాకరశాస్త్రి, అన్నమయ్య సాహిత్యానికి రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, వేమనకు ఎన్.గోపి మొదలైనవారు ఎలాగో, ఇప్పుడు తెలుగు దళిత సాహిత్యానికి డా. కోయి కోటేశ్వరరావు అటువంటి పాత్రను నిర్వహిస్తున్నారు. సంప్రదాయ సాహిత్యంతో పాటు, ఆధునిక సాహిత్య తత్వాన్ని అవగాహన చేసుకున్న సహృదయ కవి, పండితుడు, విమర్శకుడు డా. కోయి కోటేశ్వరరావు. ఈ దిశగా జరుగుతున్న కృషిలో ఈ పుస్తకం తొలి అడుగు కావచ్చు.



తొలితరానికి చెందిన దళిత కవి చోడగిరి చంద్రరావు తూర్పుగోదావరి జిల్లా  కోనసీమ ప్రాంతానికి చెందిన కవి. 1932 జూలై 15న కోరుమిల్లి గ్రామంలో జన్మించాడు. తల్లితండ్రులు బుల్లెమాంబ, వెంకటస్వామి. చంద్రరావు కొంతకాలం పాటు రక్షణ శాఖలో సైనికుడిగా పనిచేశాడు. ఆ తరువాత భారతీయ రైల్వే శాఖలో వివిధ హోదాల్లో విధులు నిర్వహించాడు. పద్యకవిత్వాన్ని ఎంతో రసభరితంగా రచించారు.  అలాగే గేయకవిత్వాన్ని కూడా సరళ సుందరంగా, మాధుర్యంతో అందించారు. ఈయన తన తొలిరచన శతకంతో ప్రారంభమయ్యింది. ఆయన‘భీమశతకము’ పేరుతో 144 పద్యాలను రచించారు.  సాహిత్యంలో కులం వల్ల జరుగుతున్న కష్ట నష్టాలను కూడా దీనిలో ప్రస్తావించారు. ఈ శతకం మరో ప్రత్యేకత ఏమిటంటే, ముందుగా డా.బి.ఆర్. అంబేద్కర్ జీవితాన్ని, ఆయన దళితులకు చేసిన అపూర్వమైన కృషిని చక్కని వచనంలో వివరించడం. ఆ తర్వాత ‘భీమశతకము’ను వర్ణిస్తూ, దళితుల జీవనస్థితిగతులు ఎలా ఉన్నాయో సరళసుందరమైన పద్యాల్లో వర్ణించారు.  భీమశతకము రెండవ భాగాన్ని డా.బి.ఆర్. అంబేద్కర్ కి అంకితమిస్తూ..."కవిత నీవు నాకు, కావ్యవస్తువు నీవు

కంఠమందు నీవు కనుల నీవు

నీవులేని నేను నిర్జీవ ప్రతిమనే

ఏమి చెప్పనయ్య భీమరాయ”అని తన ఆయన పట్ల తనకున్న అభిమానాన్ని వర్ణించారు. ఈ రెండవ భాగంలో 108 పద్యాలు ఉన్నాయి. ఇవన్నీ దళితుల వేదనను వర్ణించేవి. ఆ సమస్యలను  పరిష్కరించడంలో డా.బి.ఆర్. అంబేద్కర్ అందించిన మార్గాల్ని సందర్భానుసారంగా ప్రస్తావిస్తాడు కవి.

చంద్రరావు గీతాలు (1974) లో ఉగాదిని తనదైన పద్ధతిలో ప్రేమను కురిపించే ఉగాదిగా రావాలని ఆహ్వానిస్తాడు. ‘దివ్యసంస్కృతి’ పేరుతో డా.బి.ఆర్. అంబేద్కర్ పై చక్కని గీతాన్ని రాశారు. దీనిలో ఉన్న 12 గీతాలు పాడుకోవడానికి, కొన్ని పాఠశాల స్థాయిలో పాఠ్యాంశాలుగా పెట్టడానికి అనుకూలమైనవి. సంప్రదాయ సాహిత్య సాన్నిహిత్యంతో ఈ గీతాలు కొనసాగాయి. ‘చంద్రరావు కవిత’ (1977) ఛందోబద్ద పద్యాలతో పాటు, మాత్రా ఛందస్సుతో కూడిన కవిత్వం . దీనికి ఇంద్రకంటి హనుమచ్ఛాస్త్రి  పీఠిక రాశారు. భారతదేశంలో ఏర్పడిన అత్యవసర పరిస్థితి, దాని తర్వాత వచ్చినటువంటి సామాజిక స్థితిగతులను కూడా ఈ పుస్తకంలో చంద్రరావు వివరించారు. తన ఊరు గురించి వర్ణిస్తూ చెప్పిన కవిత కోనసీమ అందాలను కనువిందు చేస్తూ శాశ్వేతమైన ఒక చిత్రంలా మనసులో ముద్రితమయ్యేటట్లుగా వర్ణించాడు కవి. 

‘‘పచ్చని పూలు విచ్చి నవ్వెను

పచ్చనీ చేలన్నీ నవ్వెను 

అచ్చ తెలుగున పాటలను విని

అందమే నవ్వెన్’’ అని వర్ణించిన వర్ణన ఎంతో భావుకతతో కూడింది.  అక్కడ ఉండే లతలు గురించి వర్ణిస్తూ ‘‘ ఏటి మీదకు వంగి చెవిలో, మాటయేదో మరువవద్దని మాటి మాటికి తలల నూచెడి మాలతీ లతలు’’  తమ ఊరిలో ప్రవహిస్తున్న గౌతమీగోదావరి నీటి మీద గాలికి వ్రాలే లతలకు సజీవత్వాన్నిచ్చి, ఒక రహస్యమేదో చెవిలో చెప్తున్నట్లు ఉత్పేక్షించిన భావుకత కవి ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తుంది.

అప్పటికే ఈ కవి ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అనేక కవితలను చదివి వినిపించేవారు. ‘ఏకలవ్యుడు’ పేరుతో రాసిన రెండు పద్యాలు కవి సంప్రదాయ సాహిత్య దృక్పథాన్ని తెలియజేస్తున్నాయి. ఏకలవ్యుడు బొటనవ్రేలు కోల్పోవడం,, కర్ణుడు కుంతీ కుమారుడే అయినా అతడిని అస్తవిద్యా ప్రదర్శన సమయంలో చేసిన అవమానం వంటివన్నింటినీ అన్యాయంగా భావిస్తాడు కవి. ‘హృదయ వీణ’ (1968) రచనకు గుర్రం జాషువ, వేదుల సత్యనారాయణ శాస్త్రి,  తోకల భాస్కరరావు (స్ఫూర్తిశ్రీ), దివాకర్ల వేంకటావధాని, బోయి భీమన్న, గున్నేపల్లి అక్షయలింగకవి, సి.నారాయణరెడ్డి, యస్.టి.జ్ఞానానందకవి వంటి వాళ్ళెంతోమంది తమ ముందుమాటల్ని అందిస్తూ ప్రశంసించారు. ‘‘అన్వేషణ’’ (1981) ఖండకావ్య సంపుటిలో  ‘వాల్మీకి’ గురించి వర్ణిస్తూ ఆయన జీవితాన్ని పరిచయం చేస్తారు.‘ అంటరానితనము’’ పేరుతో రాసిన ఖండికలో కులం వల్ల కలిగే నష్టాలను వర్ణిస్తూ .

‘‘దేశప్రగతి సర్వనాశనమ్ము జేసిన

కులవ్యవస్థ గూర్చి కమిలి యేడ్తు

హార్టెటాకు, టీబి అబ్బ! క్యాన్సరుకన్న

అంటరానితనము హానికరము’’ అంటాడు కవి. దీనిలో కులం వల్ల సమాజంలో వచ్చే కష్టనష్టాలను గుండెపోటు, క్షయ, క్యాన్సరు కంటే భయంకరమైనడం అనుభవపూర్వకంగా చెప్పినమాటలు. చోడగిరి చంద్రరావుగారు అంబేద్కర్ తత్త్వాన్ని ప్రచారం చూసి అంబేద్కర్ కవిగా పేరొందినా, వాల్మీక, వ్యాసుడు, బోయి భీమన్న తదితర దళిత కవులను ప్రశంసించినా, ప్రతి ఒక్కరినీ స్పందింపజేసే కవిత్వాన్ని ఎంతో రచించారు. అంబేద్కర్ భావాల్ని సాహిత్యంలో అందించే ఈ కవిని ‘భీమ్ కవి’ అని ప్రసిద్ధిపొందారు.  ఈయన శైలి మృదుమధురమైంది. కోనసీమలో పువ్వుల పరిమళాలను నింపుకొని ప్రవహించే  గౌతమీనది ప్రవాహంలానే ఆయన కవిత్వం కూడా మనసులను పరిమళింపజేస్తుంది. తెలుగు సాహిత్యంలో ఒక ఉత్తమ కవిని మరలా ఇలా ఆయన రచనలన్నింటినీ తీసుకొస్తూ ఈ తరానికి కూడా పునః పరిచయం చేయడం ఎంతో గొప్పపని. ఈయన రచనలను భీమ్ సాహితీ స్రవంతి పక్షాన ఇలా తీసుకొన్న ప్రచురణ కర్త,చంద్రరావుగారి అల్లుడు, ప్రముఖ అంబేద్కరిస్ట్ నేలపూడి బాలరాజుగార్నీ, దీన్ని సేకరించి ఇలా అన్ని రచనలు ఒకపుస్తకంగా వెలువడ్డానికి కారణమవుతున్న డా. కోయి కోటేశ్వరరావుగార్ని ప్రతిఒక్కరూ అభినందించాలి.

-      ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, తెలుగుశాఖ పూర్వ అధ్యక్షుడు, మానవీయ శాస్త్రాల విభాగం, యూనివర్సిటి  ఆఫ్ హైదరాబాద్ (సెంట్రల్ యూనివర్సిటి) హైదరాబాదు. ఫోన్: 9989628049

 

(ఈ వ్యాసాన్ని ప్రజాశక్తి దినపత్రిక,  అక్షరం సాహిత్యానుబంధం, 11.8.2025)

 

02 జనవరి, 2023

కెరటమై ఎగిసిపడాల్సిందే!(ప్రజాశక్తి ‌‌సవ్వడి, 2.1.2023 సౌజన్యంతో)

 కెరటమై ఎగిసిపడాల్సిందే!




ప్రజాశక్తి ‌‌సవ్వడి సాహిత్యం, 2.1.2023 సౌజన్యంతో 




నువ్వు జారిపడ్డావని భయపడకు
నీ తలకు తగిలిన గాయానికి 
స్రవించిన ఆ రక్తం నాదేనని 
ఇద్దరి కళ్ళల్లో నుండి వచ్చే ఆ కన్నీళ్ళకూ తెలుసు
ఒకే లయలో కొట్టుకుంటున్న ఆ గుండెకీ తెలుసు
తడబడినా సరిచేసుకుంటున్న చేతులకూ తెలుసు 
నువ్వు జారిపడ్డావని భయపడకు
నడవడం మొదలెడితేనే కదా తెలిసేది 
నీ మార్గంలో లోయలున్నాయో
నీ పయనంలో శిఖరాలున్నోయో 
నువ్వు విజేతవో పరాజితవో తెలిసేది


నిన్ను మళ్ళీ నా చేతుల్లోకి తీసుకుంటాను
నువ్వు పోరాడినంతకాలమూ
నిన్ను మళ్ళీ మళ్ళీ నాచేతుల్లోకి తీసుకుంటాను
నేను జారవిడుకున్న జీవితాన్నీ
నేను పోగొట్టుకోలేక పోరాడిన ఆత్మగౌరవాన్నీ
మళ్ళీ నీకిస్తూ ముద్దులతో అభిషేకిస్తున్నాను

నువ్వు పడినప్పుడల్లా 
రెట్టింపు ఉత్సాహంతో పైకి లేవాలి
నిన్ను జాతి పేరుతోనో
కులం, మతం, జెండర్ పేర్లేమైతేనేమి
నీ ఆత్మగౌరవాన్నంతటినీ 
ప్రోదు చేసుకొంటూ మళ్ళీ లేవాలి.
పుడుతూనే నేనూ నువ్వూ 
మెత్తని పరుపులపై పడలేదు
నిత్యం వేదాశీర్వాదాలు
మంగళ ధ్వనులు వినిపించే
 మున్యాశ్రమంలోనూ పడలేదు
ఈ భూమి పై పడగానే పడగలెత్తి బుసకొట్టే 
యుద్ధక్షేత్రంలోనే పడ్డామని మరిచిపోకు
ఈ యుద్ధం
ఆ దుమ్మూ, ఈ ధూళీ 
వారసత్వంగా మోసుకెళ్ళాలంటుంది 
ఈ యుద్ధంలో మాయల్నీ మంత్రాల్నీ 
అధికార సమ్మోహాల్నీ ఎరవేస్తుందేమో
మళ్ళీ తుళ్ళిపడిపోతావేమో
మళ్ళీ మళ్ళీ నువ్వు నిలబడ్డ నేలను ముద్దాడు


నువ్వైనా నేనైనా
ఎవరైనా సరే 
తలెత్తుకొని నిలబడ్డం కోసం
నిరంతరం యుద్ధం చెయ్యాల్సిందే
అవమానితులెందరో నిన్నే చూస్తున్నారు
అనుమానితులెందరో 
నువ్వేంటే నిరూపించమంటున్నారు
అనునిత్యం నిన్నే తలుచుకునే 
ఆశావాహులెందరో నువ్వై పోరాడుతున్నారు
నువ్వొంటరివి కాదు
నువ్వే మా సామూహిక స్వప్నానివి


నిన్ను మళ్ళీ నా చేతుల్లోకి తీసుకుంటాను
నువ్వు పోరాడినంతకాలమూ
నిన్ను మళ్ళీ మళ్ళీ నాచేతుల్లోకి తీసుకుంటాను
నేను జారవిడుకున్న జీవితాన్నీ
నేను పోగొట్టుకోలేక పోరాడిన ఆత్మగౌరవాన్నీ
మళ్ళీ నీకిస్తూ ముద్దులతో అభిషేకిస్తున్నాను.
దార్ల వెంకటేశ్వరరావు
ఫోన్: 9182685231