"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

పత్రిక లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పత్రిక లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

01 నవంబర్, 2026

భారతీయ సాహిత్యంలో కాళిదాసు


నినాదం దినపత్రిక సాహిత్య అనుబంధం 'సాహితీ లహరి' 1.11.2026 సౌజన్యంతో. 

....

భారతీయ సాహిత్యంలో కాళిదాసు 

‘’పురా కవీనాం గణనాప్రసంగే కనిష్ఠికాధిష్ఠితకాళిదాసః ।

అద్యాపి తత్తుల్యకవేరభావాదనామికా సార్థవతీ బభూవ ॥’’

సంస్కృత సాహిత్యంలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన మహాకవి కాళిదాసు గొప్పతనాన్ని చెప్తూ పండితులు, విమర్శకులు చెప్పుకున్నట్లు ఒక ప్రశంసా పూర్వక శ్లోకం ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలోనే అత్యంత గొప్ప కవులు ఎవరు అని లెక్కించే ఒక సందర్భాన్ని ఊహించుకుంటూ, కాళిదాసు కవిత్వానికి సాటిరాగల మరో కవి ఈ సృష్టిలోనే లేడని చాటిచెప్పడానికి ఈ శ్లోకాన్ని సృష్టించారు.

మనం సాధారణంగా ఏదైనా లెక్కింపు చేసేటప్పుడు చేతి వేళ్లను ముడుస్తూ, మొదట చిటికెన వేలితో ప్రారంభించడం భారతీయుల అలవాటు.అలా లెక్కింపు మొదలుపెట్టగానే, చేతి మొదటి వేలైన చిటికెన వేలు మీద అందరికంటే శ్రేష్ఠుడు, మొదటివాడు కాళిదాసే" అని కాళిదాసు పేరును చెప్పారు.మొదటి స్థానం కాళిదాసుకి ఇచ్చాక, రెండవ స్థానంలో ఏ కవిని నిలబెట్టాలి అని ఆలోచిస్తే, నేటికీ కాళిదాసుతో సమానమైన ఆయన స్థాయికి సరితూగగల మరో కవి ఎవ్వరూ కనిపించలేదట! అంత గొప్ప కవి కాళిదాసు.

భారతీయ క్లాసికల్ సంస్కృత సాహిత్యంలో అగ్రగణ్యుడైన మహాకవి కాళిదాసు జీవిత చరిత్ర చారిత్రక ఆధారాల కంటే జానపద ఐతిహ్యాల రూపంలోనే ఎక్కువగా ప్రచారంలో ఉంది. ఒక సాధారణ మూర్ఖుడు దైవానుగ్రహం, అంతఃపరివర్తన ద్వారా జగద్గురు సమానుడైన మహాకవిగా ఎలా రూపాంతరం చెందాడనే సంప్రదాయ కథనం శతాబ్దాలుగా భారతీయ సాహిత్య రంగంలో వినబడుతోంది. అందం, విద్యాగర్వంతో ఉన్న ఒక విదుషీమణికి, అక్షరజ్ఞానం లేని ఒక నిరక్షరాస్యుడికి మధ్య జరిగిన విచిత్ర వివాహ బంధం చుట్టూ ఈ కథనం అల్లబడింది. సంస్కృతం, తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో వెలువడిన అనేక పుస్తకాల్లో ఈ కథలు కనిపిస్తాయి.

సాహిత్య సంప్రదాయం ప్రకారం, ఆనాటి రాజకుమారి, పరమ విదుషీమణి అయిన ‘విద్యోత్తమ’ తనను శాస్త్ర చర్చలో ఓడించిన పండితుడినే వివాహం చేసుకుంటానని ప్రతిజ్ఞ చేస్తుంది. మరికొంతమంది ప్రకారం కాశీరాజు భీమశుక్లుని కుమార్తె ‘వాసంతి’గా చెప్తారు. (కాళిదాసు’ రచయిత: కె.టి.పాండురంగి, తెలుగు అనువాదం:వారణాసి జానకీ దేవి, 1997:8) ఎంతోమంది పండితులను అవమానిస్తుంది. ఆమె అహంకారాన్ని దెబ్బతీయాలని భావించిన కొంతమంది పండితులు, ఒక పరమ మూర్ఖుడిని అన్వేషించే క్రమంలో తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటున్న ఒక అమాయక యువకుడిని కనుగొంటారు. గొర్రెలను వేపుకుంటున్న ఒక వ్యక్తి, వాటి ఆహారం కోసం చెట్ల ఆకులు కొమ్మలను కొట్టి వాటిని మరల కింద తీసుకు వచ్చి వేయడం కష్టమని భావించి, కొమ్మ పైన కూర్చుంటే ఆ కొమ్మతో పాటు తాను కూడా కింద హాయిగా రావచ్చని భావిస్తాడు.‌ అతనికి పండిత వస్త్రాలు ధరింపజేసి, ఆయన గొప్ప మౌన ముని అని, కేవలం సైగలతోనే సమాధానాలు ఇస్తారని విద్యోత్తమను నమ్మిస్తారు. ఆ క్రమంలో జరిగిన విచిత్ర సంకేత శాస్త్రార్థంలో పండితుల కుయుక్తి వల్ల రాజకుమారి ఓడిపోయి, ఆ మూర్ఖుడిని వివాహం చేసుకుంటుంది. అయితే, వివాహానంతరం మొదటి రాత్రే తన భర్త నిరక్షరాస్యుడనే కఠోర సత్యాన్ని విద్యోత్తమ గ్రహిస్తుంది. భర్త మూర్ఖత్వాన్ని భరించలేక, తీవ్రమైన ఆత్మాభిమానంతో ఆమె అతనిని నిందించి, అవమానించి ఇంటి నుండి వెల్లగొట్టేస్తుంది. 

భార్య చేసిన ఆ పరమ పరాభవం తర్వాత ఆ యువకుడి మానసిక స్థితిని పూర్తిగా మార్చివేస్తుంది. తన అజ్ఞానానికి తీవ్రంగా పశ్చాత్తాపపడుతూ, ఆత్మన్యూనతా భావంతో ఆ రాత్రే గ్రామ శివార్లలోని ఓ కాళికా దేవి ఆలయానికి చేరుకుంటాడు. ఆలయంలో కాళీ మాతను దర్శించుకుని, తీవ్రమైన ఆర్తితో, కన్నీటితో జ్ఞానభిక్ష పెట్టమని ప్రార్థిస్తాడు. అతని నిష్కల్మషమైన భక్తికి, తపనకు ప్రసన్నురాలైన కాళికా దేవి ప్రత్యక్షమై, అతని నాలుకపై బీజాక్షరాలను లిఖించి, అపారమైన శబ్ద సంపదను, సకల శాస్త్ర పాండిత్యాన్ని అనుగ్రహిస్తుంది. కాళీ మాత కరుణాకటాక్షాల వల్ల పరమ జ్ఞానిగా మారినందు వల్ల, నాటి నుండి అతను 'కాళిదాసు' అనే నామధేయంతో ప్రసిద్ధి చెందాడు. కాళీకామాతకు దాసుడు కాబట్టి, కాళిదాసు అయ్యాడనే కథ ప్రచారంలో ఉంది. అతని అసలు పేరు కాలుడనీ, తర్వాత కాళిదాసుగా మారాడనీ చెప్తుంటారు. మనం ఎంత మూర్ఖులమైనా, చదువు రాకపోయినా పర్వాలేదు. కానీ పట్టుదల, కష్టపడే తత్వం, మరియు నమ్మకం ఉంటే ఎలాంటి కష్టమైన చదువునైనా సాధించవచ్చు, జీవితంలో గొప్ప స్థాయికి చేరుకోవచ్చు అనేది ఈ కథ ద్వారా తెలుస్తోంది. దివ్యజ్ఞాన సంపన్నుడైన కాళిదాసు తిరిగి గృహానికి విచ్చేసినప్పుడు, అతని ముఖ వర్చస్సును, గంభీరమైన శైలిని గమనించిన విద్యోత్తమ ఆశ్చర్యంతో, సంస్కృతంలో "అస్తి కశ్చిద్ వాగ్విశేషః?" (మీ వాక్కులో ఏదైనా విశేషం కనిపిస్తోందా?) అని ప్రశ్నిస్తుంది. భార్య పలికిన ఆ వాక్యంలోని మూడు పదాలను (అస్తి, కశ్చిత్, వాక్) ప్రేరణగా తీసుకునే తర్వాత కాలంలో కాళిదాసు తన సుప్రసిద్ధ మహాకావ్యాలైన కుమారసంభవం, మేఘదూతం, రఘువంశాలను రచించి భారతీయ వాఙ్మయంలో చిరస్థాయిగా నిలిచిపోయారని సాహితీవేత్తలు వ్యాఖ్యానిస్తుంటారు. 

సాహిత్య విద్యార్థులుగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ కథకు స్పష్టమైన చారిత్రక ఆధారాలు లేవు. కాళిదాసు కావ్యాలలో వ్యక్తమయ్యే అపారమైన వేద, వేదాంగ, జ్యోతిష్య, భౌగోళిక విజ్ఞానాన్ని పరిశీలిస్తే, ఆయన ఒకే రాత్రిలో పండితుడు కాలేదని, సుదీర్ఘమైన విద్యాభ్యాసం చేసి ఉంటారని విమర్శనాత్మకంగా అవగాహన చేసుకోవాలి. అయినప్పటికీ, ఒక కవి ప్రతిభ వెనుక ఉండే పట్టుదలను, కావ్య సృష్టి వెనుక ఉండే దైవిక ప్రేరణను ప్రతీకాత్మకంగా చెప్పడానికి ఈ జానపద గాథ సాహిత్య చరిత్రలో ఒక ముఖ్యమైన భాగంగా నిలుస్తోంది. అంతేకాదు, కాళిదాసు పేరుతో మరికొన్ని రచనలు కనిపిస్తాయి. అవన్నీ ఆయనే రాశాడో లేదో చెప్పలేమనీ, కాళిదాసు పేరుతో మరో కవి కూడా ఉండే అవకాశం ఉందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి.

సాహిత్య పరిశోధనలో అత్యంత క్లిష్టమైన అంశం కాళిదాసు పూర్వీకుల గురించిన వివరాలు సేకరించడంగా నేటికీ చరిత్రకారులు భావిస్తున్నారు. కాళిదాసు తన ఏ ఒక్క కావ్యంలోనూ, నాటకంలోనూ తన తల్లిదండ్రుల పేర్లను గానీ, తన వంశ వృత్తాంతాన్ని గానీ ఎక్కడా ప్రస్తావించలేదు. జానపద ఐతిహ్యాల ప్రకారం ఆయన ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడని, చిన్నప్పుడే అంటే ఆరో నెలలోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారాడని, తదనంతరం ఒక గొర్రెలు మేపుకొనే వాని ఇంట పెరిగాడని చెప్తుంటారు.(kalidasa: His period, Personality & Poetry, by K.S.Ramaswami Sastri, 1933:82) కాళిదాసు జీవించిన కాలాన్ని నిర్ధారించడానికి పరిశోధకులు రెండు చారిత్రక విషయాలను ప్రస్తావిస్తుంటారు.కాళిదాసు రచించిన మొదటి నాటకం ‘మాళవికాగ్నిమిత్రం’. దీనిలోని నాయకుడు శృంగ వంశానికి చెందిన రాజు 'అగ్నిమిత్రుడు' (క్రీ.పూ. 170). కాబట్టి కాళిదాసు క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దం తర్వాతే జీవించి ఉండాలి.చాళుక్య రాజు రెండవ పులకేశి వేయించిన ప్రసిద్ధ ఐహోళె శాసనం (క్రీ.శ. 634) లో కాళిదాసు, భారవిల పేర్లు స్పష్టంగా ప్రస్తావించబడ్డాయి. అలాగే క్రీ.శ. 7వ శతాబ్దానికి చెందిన బాణభట్ట తన 'హర్షచరితం' లో కాళిదాసు కవితా మాధుర్యాన్ని కొనియాడాడు. దీనిని బట్టి కాళిదాసు క్రీ.పూ. 2వ శతాబ్దం నుండి క్రీ.శ. 7వ శతాబ్దం మధ్య కాలంలో జీవించాడని స్పష్టమవుతోంది. ఉజ్జయినిని రాజధానిగా చేసుకుని పాలించిన వీరుడు, క్రీ.పూ. 57 లో 'విక్రమ శకం' ప్రారంభించిన రాజ విక్రమార్కుడి లేదా విక్రమాదిత్యుని ఆస్థానంలోని నవరత్నాలలో కాళిదాసు అగ్రగణ్యుడు అనే ఒక సిద్ధాంతం ఉంది.దీని ప్రకారం కాళిదాసు క్రీ.పూ. 170–57 మధ్య కాలానికి చెందినవాడు. 

మరో సిద్ధాంతం ప్రకారం కాళిదాసు గుప్తుల స్వర్ణయుగానికి చెందినవాడు. గుప్త వంశ చక్రవర్తి అయిన రెండవ చంద్రగుప్తుడు (క్రీ.శ. 375–415) తనకు తాను 'విక్రమార్క' లేదా 'విక్రమాదిత్య' అనే బిరుదును ధరించాడు. ఈ చంద్రగుప్త విక్రమాదిత్యుని ఆస్థానంలోనే కాళిదాసు రాజకవిగా ఉన్నాడని భావిస్తున్నారు. ఈ వాదనకు బలమైన సాహిత్య ఆధారాలు ఉన్నాయి. కాళిదాసు రాసిన ‘రఘువంశం’ లోని రఘుమహారాజు దిగ్విజయ యాత్ర, గుప్త రాజు సముద్రగుప్తుని అలహాబాద్ ప్రశస్తి శాసనంలో ఉన్న దిగ్విజయ యాత్రతో అచ్చుగుద్దినట్లు సరిపోలుతుంది. అలాగే, ఆయన కావ్యాల్లో ప్రతిబింబించే సామాజిక, ఆర్థిక వైభవం మరియు శాంతిభద్రతలు గుప్తుల కాలపు అత్యున్నత సంస్కృతికి అద్దం పడతాయి. అందువల్ల, కాళిదాసు కాలాన్ని చారిత్రకంగా క్రీ.శ. 5వ శతాబ్దం (గుప్తుల కాలం) గా నిర్ధారించడం అత్యంత హేతుబద్ధంగా భావిస్తారు.

ప్రాచీన భారతీయ సాహిత్య చరిత్రలో చాలామంది కవుల విషయంలో ఇలాగే కాలనిర్ణయాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడం సహజంగా కనిపిస్తుంది. సాహిత్య చరిత్రకారులు కాళిదాసు రచించినట్లుగా ప్రమాణీకరించిన గ్రంథాలు మాత్రం మొత్తం ఏడు (7). అవి రెండు మహాకావ్యాలు, రెండు ఖండకావ్యాలు, మూడు నాటకాలు. రఘువంశం, కుమారసంభవం అనేవి రెండు ప్రసిద్ధ మహాకావ్యాలు కాగా; మేఘదూతం, ఋతుసంహారం అనేవి ప్రకృతి సౌందర్యాన్ని, విరహ వేదనను ప్రతిబింబించే రెండు విశిష్ట ఖండకావ్యాలు. నాటక ప్రక్రియలో జగత్ప్రసిద్ధి గాంచిన అభిజ్ఞాన శాకుంతలంతో పాటు, పురూరవ-ఊర్వశుల ప్రణయ గాథ అయిన విక్రమోర్వశీయం, ఆయన తొలి నాటకం అయినప్పటికీ, మాళవికాగ్నిమిత్రం సాహిత్య లోకంలో మకుటాయమానంగా నిలిచిందని కొంతమంది సాహిత్య విమర్శకుల అభిప్రాయం. అవి కేవలం ఒక నిర్దిష్ట కాలానికి లేదా ఒక కుటుంబానికే పరిమితం కాకుండా, విశ్వజనీనమైన భారతీయ సంస్కృతికి శాశ్వత ప్రతీకలుగా నిలిచాయని సాహిత్య చరిత్ర కారుల అభిప్రాయం.

‘రఘువంశం’ ఒక మహాకావ్యం 19 సర్గలతో కూడిన కాళిదాసు పరిణతి చెందిన మహాకావ్యం. సూర్యవంశానికి చెందిన అత్యంత పరాక్రమవంతులైన 29 మంది రాజుల గొప్పతనాన్ని వారి జీవిత విశేషాలను వివరిస్తుంది. ఈ కథ సంతానం లేని దిలీప మహారాజు వశిష్ఠుని ఆజ్ఞ మేరకు నందిని అనే కామధేనువు పుత్రికకు సేవ చేసి, రఘువు అనే పరాక్రమవంతుడైన కుమారుడిని పొందడంతో ప్రారంభమవుతుంది. రఘువు పేరు మీదుగానే ఈ వంశానికి 'రఘువంశం' అనే పేరు వచ్చింది. ఆ తర్వాత రఘువు కుమారుడైన అజుడు, మనవడైన దశరథుడు, ఆ వంశంలోనే జన్మించిన శ్రీరాముడి ఉదాత్తమైన జీవిత చరిత్ర, రావణ వధ, సీతాన్వేషణ వంటి రామాయణ ఘట్టాలు దీనిలో ప్రధానంగా వర్ణించాడు. చివరకు ఈ వంశంలో చివరి వాడైన అగ్నివర్ణుడు అనే రాజు భోగలాలసత్వంతో మరణించడంతో మొత్తం 19 సర్గల ఈ మహాకావ్యం ముగుస్తుంది.

కుమారసంభవం 17 సర్గలతో కూడిన అద్భుతమైన కావ్యం. శివపార్వతుల కళ్యాణం, కుమారస్వామి (షణ్ముఖుడి) జననం, తారకాసుర సంహారం దీనిలోని ప్రధాన ఇతివృత్తం. హిమాలయాల వర్ణనతో ప్రారంభమయ్యే ఈ కావ్యంలో పార్వతీదేవి తపస్సు, మన్మథ దహనం, దేవీదేవుల శృంగార వర్ణనలు కాళిదాసు కల్పనా చాతుర్యానికి నిదర్శనాలు.

తారకాసురుడనే రాక్షసుని బాధల నుండి దేవతలను రక్షించడానికి, శివపార్వతుల తేజస్సుతో మహావీరుడైన 'కుమారస్వామి' (సుబ్రహ్మణ్య స్వామి) జన్మవృత్తాంతమే ఈ కావ్యానికి ప్రధాన ఇతివృత్తం. హిమవంతుని కుమార్తె పార్వతి శివునిపై మనసుపడి, ఆయనను భర్తగా పొందడం కోసం హిమాలయాల్లో కఠినమైన తపస్సు చేస్తుంది. లోకకల్యాణం కోసం మన్మథుడు తన బాణంతో శివుని తపస్సును భగ్నం చేయడానికి ప్రయత్నించగా, శివుని మూడో కంటి మంటకు మన్మథుడు బూడిదవుతాడు. అయినప్పటికీ పార్వతి అచంచల దీక్షకు, భక్తికి సంతోషించిన శివుడు ఆమెను వివాహం చేసుకుంటాడు.శివపార్వతుల వివాహానంతరం వారి తేజస్సుతో ఉద్భవించిన కుమారస్వామి సేనానిగా, దేవసేనను నడిపించి తారకాసురుడిని సంహరిస్తాడు. తద్వారా దేవతలకు స్వర్గరాజ్యాన్ని తిరిగి ఇప్పించి, లోకంలో శాంతిని ప్రతిష్టిస్తాడు. ఈ కావ్యంలో కాళిదాసు ప్రకృతి సౌందర్యాన్ని, హిమాలయ వర్ణనలను, పార్వతీదేవి తపస్సును, శృంగార వీర రసాలను అత్యంత రమణీయమైన శైలిలో వర్ణించాడు. అందుకే ఇది సంస్కృత దృశ్య-కావ్య రంగంలో ఒక సుందరమైన దృశ్యకావ్యంగా నిలిచింది.

మేఘదూతం లఘుకావ్యమైనప్పటికీ ప్రపంచ సాహిత్యంలోనే ఒక విలక్షణమైన స్థానాన్ని సంపాదించుకుంది. అలకాపురి రాజు, ధనాధిపతి అయిన కుబేరుడి కొలువులో ఒక యక్షుడు ఉండేవాడు. అతను తన కొత్త భార్య ప్రేమలో మునిగిపోయి, విధులను నిర్లక్ష్యం చేస్తాడు. దాంతో ఆగ్రహించిన కుబేరుడు, ఒక సంవత్సరం పాటు భార్యకు దూరంగా ఉండాలని అతనికి శాపం విధిస్తాడు.శాపగ్రస్తుడైన యక్షుడు తన నివాసాన్ని వదిలి, దక్షిణ భారతదేశంలోని 'రామగిరి' ఆశ్రమాలకు వస్తాడు.ప్రస్తుత ఛత్తీస్‌గఢ్‌లోని రామ్‌గఢ్ కొండలుగా చెప్తుంటారు భార్య విరహంతో ఎనిమిది నెలలు గడిచిపోతాయి.ఆషాఢ మాసం మొదటి రోజున, కొండలను తాకుతున్న ఒక అందమైన నల్లటి మేఘాన్ని యక్షుడు చూస్తాడు. వర్షాకాలం వస్తుండటంతో భార్యపై విరహం మరింత ఎక్కువవుతుంది. ప్రాణం లేని మేఘాన్ని చూసి, తన భార్యకు తన క్షేమ సమాచారాన్ని చేరవేసే "దూత"గా మార్చుకుంటాడు.

మేఘదూతం రెండు భాగాలుగా విభజించబడింది. పూర్వమేఘం భాగంలో యక్షుడు మేఘానికి రామగిరి నుండి హిమాలయాల్లోని అలకాపురి వరకు వెళ్ళే దారిని వివరిస్తాడు. ఇందులో భారతదేశంలోని నదులు (నర్మద, వెట్రవతి), పర్వతాలు, ఉజ్జయిని నగరం, మహాకాళేశ్వర ఆలయం వంటి ఎన్నో ప్రాంతాల భౌగోళిక అందాలను కాళిదాసు అద్భుతంగా వర్ణించారు. ఉత్తరమేఘం భాగంలో అలకాపురి నగర వైభవాన్ని, యక్షుడి ఇల్లు ఎలా ఉంటుందో, విరహంతో కృశించిపోతున్న అతని భార్య రూపం ఎలా ఉంటుందో మేఘానికి చెప్తాడు. చివరగా, మేఘం ఆమెకు చెప్పాల్సిన సందేశాన్ని అందిస్తాడు. తాను క్షేమంగా ఉన్నానని, శాపకాలం త్వరలోనే ముగుస్తుందని చెప్తాడు. కాళిదాసు రాసిన మేఘదూతం ఎంతగానో ప్రజాదరణ పొందింది. దీని తర్వాత సంస్కృతంలోను తెలుగులోను అనేక 'సందేశ కావ్యాలు' వచ్చాయి. కాళిదాసు కేవలం జడపదార్థమైన మేఘానికి మానవ రూపాన్ని, భావాలను ఆపాదించి, ప్రకృతిని ఒక జీవమున్న పాత్రగా మార్చారు. చివరగా, యక్షుడి సందేశాన్ని విన్న కుబేరుడు కరిగిపోయి, వారిద్దరినీ శాప విముక్తులను చేయడంతో ఈ కావ్యం సుఖాంతమవుతుంది.

వాల్మీకి రామాయణంలోని సుందరకాండలో శ్రీరాముని దూతగా హనుమంతుడు సీతాదేవి వద్దకు వెళ్లి విరహ సందేశాన్ని అందించే ఘట్టమే సంస్కృత సాహిత్యంలోని 'సందేశ కావ్య' ప్రక్రియకు మూలబీజం. ఈ హనుమత్సందేశపు భావనను, విరహ వేదనను, ప్రకృతితో కూడిన మార్గవర్ణనల నేపథ్యాన్ని ప్రధాన ప్రేరణగా తీసుకునే మహాకవి కాళిదాసు ఒక నిర్జీవ మేఘాన్ని దూతగా మలచి విశ్వవిఖ్యాతమైన 'మేఘసందేశం' మహాకావ్యాన్ని అద్భుతంగా సృష్టించారు.

మహాకవి గుర్రం జాషువా గారి 'గబ్బిలం' ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో ఒక అత్యున్నతమైన, విప్లవాత్మకమైన ఖండకావ్యం. సమాజంలో అంటరానితనం, కులవివక్ష వంటి దురాచారాల వల్ల అణచివేతకు గురైన ఒక నిరుపేద దళిత భక్తుని వేదనను భగవంతునికి చేరవేయడానికి జాషువా ఎంచుకున్న అద్భుతమైన దూత 'గబ్బిలం'.

కాళిదాసు 'మేఘసందేశం'లో యక్షుడు మేఘాన్ని దూతగా పంపితే, జాషువా సమాజంచేత అసహ్యించుకోబడిన, అశుభప్రదంగా భావించబడే గబ్బిలాన్ని తన ఆవేదనను కాశీ విశ్వనాథునికి తెలపడానికి దూతగా ఎంచుకోవడం ఆయన సామాజిక దృక్పథానికి నిదర్శనం. అంటరానితనం కారణంగా గుడిలోకి వెళ్ళలేని ఒక దీనుని తరఫున, ఆ రాత్రివేళ తిరిగే గబ్బిలం కైలాసానికి వెళ్లి ఈశ్వరునికి తన గోడును వివరిస్తుందని కవి హృదయ విదారకంగా వర్ణించారు. కేవలం సామాజిక వేదనను తెలపడమే కాకుండా, దేశభక్తిని, జాతి ఐక్యతను ఆకాంక్షిస్తూ, పండిత లోకాన్ని సైతం ఆలోచింపజేసిన ఈ రూపకం తెలుగు సాహిత్యానికి జాషువా అందించిన అమూల్యమైన కానుక.

బహుభాషా కోవిదులైన పుట్టపర్తి నారాయణాచార్యులు తెలుగులోకి అదే స్థాయిలో రమణీయమైన పద్యరూపంలో 'మేఘదూతము'గా రమణీయంగా అనువదించారు. 

ఋతుసంహారం కాళిదాసు తొలి రచనగా పరిశోధకులు భావిస్తారు. భారతదేశంలోని ఆరు ఋతువులను (వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత, శిశిర) ప్రేమికుల హృదయ స్పందనలతో ముడిపెడుతూ అద్భుతంగా వర్ణించిన ప్రకృతి కావ్యం ఇది.

అభిజ్ఞాన శాకుంతలం ఏడు అంకాలతో కూడిన ఈ నాటకం కాళిదాసు సృష్టిలోనే కాక, ప్రపంచ నాటక సాహిత్యంలోనే ఒక మకుటాయమానమైన గ్రంథం. మహాభారతంలోని దుష్యంత-శకుంతలల ఉపాఖ్యానాన్ని తీసుకుని, ఆ విప్రలంభ శృంగారానికి 'అంగుళీయం' అనే అద్భుతమైన కల్పనను జోడించి నాటక శిల్పాన్ని శిఖరాగ్రానికి తీసుకెళ్లాడు. "కావ్యేషు నాటకం రమ్యం తత్ర రమ్యా శకుంతలా" అనే నానుడి దీని విశిష్టతను చాటుతుంది. జర్మన్ మహాకవి గెథే (Goethe) ఈ నాటకాన్ని చదివి పరవశించి తలపై పెట్టుకుని నాట్యం చేశాడని చరిత్ర చెబుతోంది.

విక్రమోర్వశీయం ఐదు అంకాల 'త్రోటకం' అనే నాటక ప్రక్రియకు చెందినది. భూలోక రాజు పురూరవుడికి, దేవలోక అప్సరస ఊర్వశికి మధ్య నడిచిన ప్రణయగాథ దీని ఇతివృత్తం. విరహవేదనతో ఉన్మాదిగా మారిన పురూరవుడి ప్రకృతి వర్ణనలు కాళిదాసు కవితా ప్రతిభకు పరాకాష్ఠ.

మాళవికాగ్నిమిత్రం కాళిదాసు రచించిన మొదటి నాటకంగా సాహిత్య చరిత్ర కారులు భావిస్తారు. శృంగ వంశానికి చెందిన రాజు అగ్నిమిత్రుడు, అంతఃపుర నర్తకి మాళవికల మధ్య నడిచిన శృంగార, రాజకీయ చదరంగం దీని ఇతివృత్తం. తొలి రచన అయినప్పటికీ నాటక రంగస్థల నియమాలను, నృత్య శాస్త్ర విశేషాలను ఇందులో అత్యంత నిశితంగా పొందుపరిచాడు.

సంస్కృత సాహిత్య విమర్శకులు కాళిదాసు కవిత్వ శైలిని "ఉపమా కాళిదాసస్య" అని సూత్రీకరించారు. కాళిదాసు ఒక వస్తువును లేదా సందర్భాన్ని వర్ణించేటప్పుడు చెప్పే పోలిక ఊహాతీతంగా, ఎంతో సహజంగా ఉంటుంది. ఆయన వాడే ఉపమ కేవలం అందం కోసమే కాకుండా, కథా సందర్భాన్ని, పాత్రల అంతరంగాన్ని విప్పి చెప్పేలా ఉంటుంది. అందుకే పోలిక చెప్పడంలో ఆయనకు ఆయనే సాటి.

వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే ।

జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ ॥ ‘రఘువంశం’ ప్రారంభ శ్లోకంలో శబ్దం, దాని అర్థం ఎలాగైతే ఒకదానిని విడిచి ఒకటి ఉండలేవో, అంతగా కలిసిపోయి ఉంటాయో, అలాగే విడదీయరాని బంధంతో ఎల్లప్పుడూ కలిసి ఉండే జగత్తుకు తల్లిదండ్రులైన పార్వతీపరమేశ్వరులను నేను పూజిస్తున్నాను. నాకు వాక్సుద్ధి వాటికి తగిన ఉత్తమమైన అర్థం సిద్ధించాలని వారిని వేడుకుంటున్నానని మంగళాచరణ శ్లోకం చెప్పే సందర్భం. శివపార్వతులు విడదీయరాని శక్తి స్వరూపులని చెప్పడానికి ఈ ఉపమ వాడారు.

సంచారిణీ దీపశిఖేవ రాత్రౌ 

యం యం వ్యతీయాయ పతింవరా సా ।

నరేంద్రమార్గాట్ట ఇవ ప్రపేదే 

వివర్ణభావం స స భూమిపాలః ॥ 

(రఘువంశ మహాకావ్యం – ఆరవ సర్గ (6వ సర్గ), 67వ శ్లోకం) 

స్వయంవర మంటపంలో వరుడిని ఎన్నుకునే ఇందుమతి, చేతిలో జ్యోతిని పట్టుకుని రాత్రి వేళ రాజమార్గంలో నడిచి వెళ్తున్న ఒక "కదిలే దీపశిఖ" లా ఉంది. ఆ దీపం ఒక భవనం ముందుకు వచ్చినప్పుడు ఆ భవనం వెలిగిపోయి, దీపం ముందుకు సాగిపోగానే ఆ భవనం మళ్లీ ఎలా చీకట్లో మునిగిపోతుందో... అలాగే ఇందుమతి తన ముందుకు వచ్చినప్పుడు ఆశతో ముఖాలు వెలిగించుకున్న రాజులు, ఆమె తమ్మును దాటి ముందుకు వెళ్ళిపోగానే నిరాశతో ముఖాలు వెలవెలబోయి అంధకారంలో మునిగిపోయారు.

కాళిదాసు తన రఘువంశం, కుమారసంభవం, అభిజ్ఞాన శాకుంతలం వంటి రచనలలో ప్రకృతిని, మానవ భావాలను పోలుస్తూ చెప్పిన ఉపమానాలు పాఠకులను మంత్రముగ్ధులను చేస్తాయి. అందుకే ఉపమ అనగానే అందరికీ మొదట గుర్తుకువచ్చేది కాళిదాసే. 

మహాకవి కాళిదాసు రచనలలోని ఇతివృత్తాలు, భాషా శైలి ఆనాటి ఉన్నత వర్గాలైన రాజులు, పండితులకు చెందినవనే వాదనలో కొంత నిజముంది. ఆయన తన కావ్య నాటకాలకు కథలను రామాయణ, మహాభారత, పురాణాల నుండి సేకరించారు. రఘువంశం, అభిజ్ఞాన శాకుంతలం వంటి రచనలు మహారాజుల వైభవాన్ని, రాజప్రసాదాల ప్రణయ గాథలను వివరిస్తాయి. అలాగే, నాటకాల్లోని ప్రధాన పాత్రలు ఉన్నతమైన సంస్కృత భాషలో మాట్లాడటం వల్ల ఇవి సామాన్యులకు దూరమనే భావన కలుగుతుంది. ఆనాటి సామాజిక, సాహిత్య నిబంధనల ప్రకారం కాళిదాసు ఈ శైలిని అవలంబించాల్సి వచ్చింది.

అయినప్పటికీ, కాళిదాసు రచనలు సామాన్య ప్రజల జీవితాలను, వారి భావోద్వేగాలను ఎక్కడా విస్మరించలేదు. ఆయన తన నాటకాల్లో మహిళలు, సేవకులు, చేపలు పట్టుకునే ధీవరుడి వంటి సామాన్య పాత్రల చేత ఆనాటి ప్రజాభాష అయిన ప్రాకృతం మాట్లాడించి, వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించారు. కథలు రాజులవైనా, అందులోని ప్రేమ, విరహం, కూతురిని అత్తగారింటికి సాగనంపే తండ్రి ఆవేదన వంటి మానవ సహజమైన అనుభూతులు సామాన్యునికి సైతం అర్థమయ్యేలా ఉంటాయి. కాబట్టి, కాళిదాసు సాహిత్యం పైకి ఉన్నత వర్గాలదిగా కనిపించినా, అంతర్లీనంగా అది అందరి హృదయాలను తాకే సార్వజనీనమైనదిగా నిలుస్తుందనే అభిప్రాయాలు బలంగా ఉన్నాయి. 

కాళిదాసు పేరుతో ఉన్న కథలు, చరిత్ర కేవలం కవిగా పేరొచ్చిన కాళిదాసుకి చెందినదే కాదనీ, ఇద్దరు ముగ్గురు ఆ పేరుతో ఉండి ఉండవచ్చుననే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. మనిషి ప్రారంభ స్థితి అతడి అంతిమ గమ్యాన్ని నిర్ణయించదు. అవమానం ఆత్మపరిశీలనకు దారితీస్తే, సంకల్పం సాధనగా మారితే, సాధన ప్రతిభకు పునాది అవుతుంది. కాళిదాసు గాథలోని అంతరార్థం ఇదే.

డా. దార్ల వెంకటేశ్వరరావు, ప్రొఫెసర్, తెలుగు శాఖ, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్, ఫోన్: 9989628049







11 అక్టోబర్, 2026

విల్సన్ రావుగారి 'జాషువా పద్య శిల్పం- గ్రంథ విశిష్టత' ( నినాదం దినపత్రిక, 11.10.2026 సౌజన్యంతో)

 విల్సన్ రావు గారి 'జాషువా పద్య శిల్పం-  గ్రంథ విశిష్టత'



 
నినాదం దినపత్రిక సాహిత్య అనుబంధం 'సాహితీ లహరి' 11.10.2026 సౌజన్యంతో 


ఒక ఆత్మీయమైన పలకరింపు… అంతే అనుభూతిని నింపే కవిత్వం ఏకకాలంలో చూడాలంటే ప్రముఖ కవి, విమర్శకులు విల్సన్ రావు కొమ్మవరపు గారిని కలవాలి. ఆయనతో ఒకసారి పరిచయం అయితే, ఆ పరిచయం ఒక కుటుంబ సంబంధం కంటే గాఢంగా ముడిపడి కొనసాగుతుంది. అంతేకాదు, ఆయన ఇంకా ముందే పరిచయమై ఉంటే బాగుండేదని కూడా అనిపిస్తుంది. ఆయన కవిత్వంలో కొత్త వస్తువులతో పాటు, కొత్త అభివ్యక్తులుంటాయి. అక్షరాలను శిల్పంలా చెక్కే పనితనం కనిపిస్తుంది.

ఒక వ్యక్తి తన అంతరాత్మను తానే ప్రశ్నించుకుని, ఏది తప్పు, ఏది రైటో తేల్చుకోవడమే పరమార్థం అనే భావనతో వెలువరించిన "న్యాయ నిర్ణేతవూ నీవే" కావచ్చు; వ్యవస్థలోని లోపాలను ఎండగడుతూనే, కొత్తగా ఉదయించబోయే రేపటిపై ఆశావాహ దృక్పథంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఆహ్వానిస్తూ రాసిన "తెల్లారితే…" కవితా సంపుటి కావచ్చు; రైతుల కష్టాలను, మట్టి మనుషుల జీవన పోరాటాన్ని ప్రతిబింబించే "నాగలి కూడా ఆయుధమే…!" కావచ్చు; సాధారణ మానవుల జీవితాలను, సమాజంలోని రుగ్మతలను తనదైన శైలిలో ఎండగడుతూ రాసిన "దేవుడు తప్పిపోయాడు" కావచ్చు... ఆయన ప్రతి కవితా సంపుటి ఒక ఆణిముత్యం లాంటిదే. ఆయన అక్షరంలో, ప్రతి మాటలో కృతజ్ఞతా భావం పొంగిపొర్లుతూ ఉంటుంది. తన కవిత వేసిన పత్రిక గురించి కావచ్చు, తన సాహిత్యం పై మాట్లాడిన మాట గురించి కావచ్చు… ఆయన ఎంతో పారవశ్యంతో ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటారు.

దాదాపు మూడు దశాబ్దాలకు పైబడిన వీరి రచనా ప్రస్థానంలో కవిత్వంతో పాటు వ్యాసాలు, పుస్తక సమీక్షలు, విమర్శనాత్మక విశ్లేషణలు వెలువడ్డాయి. 'ప్రేరణ', 34 మంది సాహితీవేత్తల ముఖాముఖులతో 'అంతరంగ వీక్షణం', 31 మంది కవుల కవితా విశ్లేషణలతో 'లోపలి మాట' వంటి వ్యాస సంపుటులు ఆయనలోని లోతైన విమర్శకుడిని మనకు పరిచయం చేస్తాయి. ఒక సృజనకారుడు విమర్శకుడిగా మారినప్పుడు, ఆ విమర్శలో కేవలం పాండిత్య ప్రదర్శనే కాకుండా, తోటి కవి పడే ప్రసవ వేదనను అర్థం చేసుకునే సహృదయత ఉంటుంది. విల్సన్ రావు గారి విమర్శలో అదే సహృదయత నిండి ఉంటుంది.



మహాకవి గుర్రం జాషువాపై ప్రత్యేకమైన ఆసక్తితో రాసిన ఎనిమిది వ్యాసాలను ఒక పుస్తకంగా మన ముందుకు తీసుకొచ్చారు. ఈ సంపుటి మహాకవి గుర్రం జాషువా సాహిత్య వైవిధ్యాన్ని, తాత్త్విక దృక్పథాన్ని అత్యంత లోతుగా ఆవిష్కరిస్తుంది. 'గబ్బిలం' కావ్యాన్ని ఒక విప్లవాత్మక సామాజిక మేనిఫెస్టోగా విశ్లేషిస్తూనే, సంప్రదాయ 'తేటగీతి' ఛందస్సులో ఆధునిక నవ్య కవిత్వాన్ని వెలువరించిన జాషువా శైలీ విశేషాలను ఈ గ్రంథం చర్చిస్తుంది. కవి వ్యక్తిత్వానికి, ఆయన సృజించిన సామాజిక సాహిత్యానికి మధ్య గల అవినాభావ సంబంధాన్ని స్పష్టం చేస్తూ, అణగారిన వర్గాల గొంతుకగా నిలిచిన జాషువా సాహిత్య తత్త్వాన్ని ఇది సమగ్రంగా పరిశీలిస్తుంది. కులవివక్షను ధిక్కరిస్తూ సమసమాజ స్థాపన కోసం తపించిన ప్రజాకవికి అక్షర రూపంలో అందిస్తున్న ఈ అరుదైన నివాళి, నేటి తరానికి జాషువా ఆలోచనలను పునఃసమీక్షించుకోవడానికి ఒక చక్కటి దిక్సూచిలా నిలుస్తుంది.

 


విల్సన్ రావు గారి కవిత్వం, ఆయన హృదయం లాగే మృదుమధురంగా ఉంటుంది. ఈ వ్యాసం కూడా పఠనాసక్తితో పరుగెట్టిస్తూనే, కొత్త ఆలోచనల తలుపులు తీస్తుందని భావిస్తున్నాను. చదువుతున్నంతసేపూ పాఠకుడిని ఆలోచింపజేస్తూ, జాషువా విశ్వమానవ దృక్పథాన్ని సరికొత్త కోణంలో పరిచయం చేసే ఒక అద్భుతమైన సాహిత్య వేదికగా ఈ పుస్తకం నిలుస్తుందని నమ్ముతున్నాను. 'గుఱ్ఱం జాషువ 'గబ్బిలం': ఒక సామాజిక మేనిఫెస్టో’ఈ గ్రంథంలోని మొదటి వ్యాసంలో పేర్కొనదగిన కొన్ని ముఖ్యాంశాలు.

 'గబ్బిలం' కావ్యం కేవలం ఒక పక్షిని రాయబారిగా పంపే కావ్యం కాదని, ఒక అట్టడుగుజాతి ఆత్మఘోషను కైలాస శిఖరాల దాకా మోసుకెళ్లిన సామాజిక చైతన్య రథమని విల్సన్ రావు  విశ్లేషించారు. ఈ కావ్యంలోని రెండవ భాగంలో గల 164 పద్యాలలో కేవలం పది కంద పద్యాలు మాత్రమే ఉండటం ఒక విశేషం.  దళిత జాతి సామాజికంగా చిన్నగా కనిపించినా అందులో అణచివేయబడిన శక్తి అపారమని చెప్పడానికి, పరిమాణంలో చిన్నదైన కందపద్యాన్ని జాషువా  ఒక 'సామాజిక అస్తిత్వ ఆయుధం'గా మలిచారు. రెండవ భాగం కంద పద్యంతో ప్రారంభమై, కందంతోనే ముగియడం జాషువా గారి ఒక శిల్ప రహస్యమని, దీని ద్వారా దళిత అస్తిత్వానికి ఒక భద్రతా వలయం లాంటి ఛందో చట్రాన్ని ఆయన నిర్మించారని రచయిత గుర్తించారు.అభాగ్యుడైన ఆ పేదవాడి బాధలు విని కైలాసంలో శివుడు కన్నీరు కార్చాడని మొదటి కంద పద్యంలోనే చెప్పడం ద్వారా, బాధకు కులం, మతం లేదని దేవుడు సైతం దానికి స్పందిస్తాడని జాషువా నిరూపించారు. ఈ పది కంద పద్యాలు విడివిడి పద్యాలు కావని, ఇవి నిరాశ నుండి ఆశ వైపుకు, ఆశ నుండి వాస్తవం వైపుకు సాగే ఒక క్రమ పరిణామం అని రచయిత సోదాహరణంగా వివరించారు.

వైకోమ్ ఉద్యమ ప్రభావంతో గుడి తలుపులు తెరుచుకోవడంపై స్పందిస్తూ, అంటరానితనం దేవుడికి కూడా సంకెళ్లు వేసిందని, దళితుల ప్రవేశంతో దేవుడికే ఏకాకితనం (దౌర్భాగ్య దశ) వదిలిందని జాషువా పేర్కొన్నారు. అణగారిన వర్గాలకు రాజ్యాధికారం వచ్చినప్పుడు తాము సగర్వంగా ఎగురవేసే జెండా మీద ఈ గబ్బిలాన్నే ముద్రిస్తామని చెప్పడం ద్వారా, అట్టడుగు వర్గాల ఆత్మగౌరవాన్ని జాషువా ఆకాశమంత ఎత్తులో నిలిపారు. ఆ పేదవాడు పంపిన సందేశం వల్ల కలిగే మార్పును (ఫలితాన్ని) తాను చూస్తాడా లేదా ఆలోపే ప్రాణాలు వదులుతాడా? అన్న ఆవేదనతో, సందేహంతో జాషువా కావ్యాన్ని ముగించారు. ఈ అసంపూర్ణ ముగింపు వెనుక ఒక బలమైన హెచ్చరిక ఉందని, మార్పు తీసుకురావాల్సింది దేవుడు కాదు సమాజమే అన్న బాధ్యతను పాఠకుల మీద జాషువా వదిలేశారని విల్సన్ రావు  వివరించారు. స్వాతంత్ర్యం వస్తున్నా సామాజిక సమానత్వం రాకపోతే ఆ స్వాతంత్ర్యం నిరర్థకమని కవి ఈ కావ్యంలో హెచ్చరించిన తీరును రచయిత స్పష్టం చేశారు.

జాషువా గబ్బిలంలో వైకోమ్ సత్యాగ్రహం గురించి విల్సన్ రావు ఒక కొత్తవిషయాన్ని వెలుగులోకి తెచ్చారు. నిజానికి ‘గబ్బిలం’ కావ్యానికి ఆత్మగా చెప్పకోదగ్గ ఒక అద్భుతమైన చారిత్రక అంశాన్ని విల్సన్ రావు గుర్తించారు. "తిరువానుకూరు దేవుఁడు తెఱచెం గుడితలుపు..." అనే పద్యం ద్వారా వైకోమ్ సత్యాగ్రహం వల్ల వచ్చిన సామాజిక మార్పును జాషువా ఎలా కవితాత్మకంగా మలిచారో ఆయన విశ్లేషించారు. అంటరానితనం కేవలం మనుషులకే కాదు, దేవుడికి కూడా సంకెళ్లు వేసిందని, అణగారిన వర్గాల ప్రవేశంతో దేవుడికే పట్టిన ఏకాకితనం, 'దౌర్భాగ్య దశ' వదిలిందని జాషువా భావించిన తీరును విల్సన్ రావు  దళిత అస్తిత్వ కోణంలో ఎంతో పదునుగా ఆవిష్కరించారు. ఇది కేవలం కవితా వర్ణన కాదనీ, చారిత్రక వాస్తవానికి అద్దం పట్టే ఒక మేధోపరమైన అస్త్రమని ఆయన విశ్లేషణ ద్వారా స్పష్టమవుతుంది.

ఏమిటీ వైకోమ్ సత్యాగ్రహం?

భారతదేశ సామాజిక చరిత్రలో అంటరానితనానికి వ్యతిరేకంగా 1924–1925 మధ్య అప్పటి త్రావణకూర్ సంస్థానం (ప్రస్తుత కేరళ)లో జరిగిన చారిత్రాత్మక పోరాటమే 'వైకోమ్ సత్యాగ్రహం'. కేరళలోని ఇతర గొప్ప దేవాలయాల మాదిరిగానే వైకోమ్ శివాలయం (వైకోమ్ శ్రీ మహాదేవ ఆలయం) కూడా దశాబ్దాలుగా నిమ్న కులాలు, 'అంటరానివారిని' లోపలికి ప్రవేశించకుండా మాత్రమే కాకుండా, చుట్టుపక్కల ఉన్న రోడ్లపై నడవకుండా నిషేధించింది.  వైకోమ్ లోని మహాదేవాలయం చుట్టూ ఉన్న వీధులలో అణగారిన వర్గాలైన ఈళవులు, పులయలు నడవకూడదనే కఠినమైన కుల వివక్షను ఎదిరిస్తూ 1924 మార్చి 30న ఈ ఉద్యమం ప్రారంభమైంది. ఇది కేవలం దేవాలయ ప్రవేశం కోసం జరిగిన పోరాటం కాదు, మనుషులుగా జీవించి పబ్లిక్ రోడ్ల మీద నడిచే ప్రాథమిక పౌర హక్కు కోసం జరిగిన తొలి వ్యవస్థీకృత ఉద్యమం. టి.కె. మాధవన్ చొరవతో కాంగ్రెస్ జాతీయ అజెండాలోకి చేరిన ఈ పోరాటాన్ని, స్థానిక నాయకుల అరెస్టు తర్వాత తమిళనాడు నుండి వచ్చిన పెరియార్ ఈ.వి. రామసామి ముందుండి నడిపించి "వైకోమ్ వీరన్"గా నిలిచారు. దీనికి శ్రీ నారాయణ గురు మద్దతుతో పాటు, మన్నత్ పద్మనాభన్ నేతృత్వంలో సవర్ణ హిందువులు సైతం భారీ కవాతు నిర్వహించి అండగా నిలవడం చారిత్రక మలుపు.

మహాత్మా గాంధీ జోక్యంతో ఈ ఉద్యమం ఒక కొలిక్కి వచ్చిందని చరిత్ర చెబుతుంది. 1925 మార్చిలో గాంధీజీ వైకోమ్ చేరుకుని అప్పటి    ట్రావెన్‌కోర్ మహారాణి సేతు లక్ష్మీబాయి తోనూ, ఛాందసవాదులతోనూ జరిపిన చర్చల ఫలితంగా.. 1925 నవంబర్ 23న దేవాలయం చుట్టూ ఉన్న రోడ్లను (తూర్పు వైపున ఉన్న ఒక చిన్న భాగం మినహా) అన్ని కులాల వారికీ తెరుస్తూ ఒప్పందం కుదిరింది. వైకోమ్ సత్యాగ్రహం సాధించిన ఈ విజయం దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలకు గొప్ప స్ఫూర్తినిచ్చిందని సామాజిక శాస్త్రవేత్తలు అభిప్రాయం. ఈ పోరాటం అప్పట్లో నేరుగా గుడిలోకి ప్రవేశాన్ని కల్పించకపోయినా, అది వేసిన బలమైన సామాజిక పునాది కారణంగానే పదేళ్ల తర్వాత 1936లో    ట్రావెన్‌కోర్ మహారాజు చారిత్రాత్మకమైన 'ఆలయ ప్రవేశ ప్రకటన' (Temple Entry Proclamation) చేయవలసి వచ్చింది. గుఱ్ఱం జాషువా తన ‘గబ్బిలం’ కావ్యంలో ఈ ఉద్యమాన్ని ప్రధానమైన స్ఫూర్తిగా తీసుకున్న విషయాన్ని విల్సన్ రావు స్పూర్తిమంతంగా పేర్కొనడం అభినందించదగ్గ విషయం.

ఈ చారిత్రక ఘట్టానికి సంబంధించి మరింత లోతైన పరిశీలన చేసినప్పుడు, జాషువా  ఎంతటి సామాజిక, చారిత్రక స్పృహతో ఈ పద్యాన్ని రాశారో అర్థమవుతుంది. ఈ వైకోమ్ ఉద్యమ మూలాలను, నాటి సామాజిక పరిస్థితులను మరింతశాస్త్రీయంగా రాబిన్ జెఫ్రీ (Robin Jeffrey, 1976) రాసిన "Temple-Entry Movement in Travancore, 1860-1940" అనే పరిశోధనా పత్రం సవివరంగా తెలియజేస్తుంది. అలాగే, ఈ సత్యాగ్రహంలో జార్జ్ జోసెఫ్ వంటి నాయకులు పోషించిన కీలక పాత్రను అల్ఫోన్స్ జార్జ్ (Alphons George, 2014) ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ ప్రొసీడింగ్స్ (Vol. 75: 569–574) లో ప్రచురించిన "The Role of George Joseph in the Vaikom Satyagraha" అనే వ్యాసం ఒక ప్రామాణిక ఆధారంగా విశ్లేషిస్తుంది. వీటికి తోడుగా, 2018 డిసెంబర్ 24న 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' పత్రికలో ప్రచురితమైన "God's own challenge" అనే కథనం కూడా ఈ ఉద్యమ ప్రాధాన్యతను నేటి సామాజిక కోణంలో పునఃసమీక్షించింది. ఇటువంటి బలమైన చారిత్రక ఆధారాల వెలుగులో చూసినప్పుడు, జాషువా అక్షరబద్ధం చేసిన దేవుడి 'దౌర్భాగ్య దశ' విముక్తి వెనుక ఉన్న దళిత అస్తిత్వ పోరాటం ఎంతటి మహోన్నతమైనదో, దానిని తన గ్రంథంలో విల్సన్ రావు  పట్టిచూపిన విధానం ఎంతటి సమగ్రమైనదో మనకు అవగతమవుతుంది.

రెండవది 'జాషువ 'తేటగీతి' - నవ్య కవితారీతి’ వ్యాసంలో జాషువా  'తేటగీతి' లాంటి సంప్రదాయ ఛందస్సును, ఆధునిక, అభ్యుదయ భావాల వ్యక్తీకరణకు ఎలా వాడుకున్నారో విల్సన్ రావు  విశ్లేషించారు. సమాజంలోని ద్రోహులను తేలు, పాముతో పోలుస్తూ రాసిన పద్యం, తనకు ఉద్యోగం వచ్చినప్పటి సామాజిక స్థితిని తెలిపే పద్యాలతో పాటు, ముంతాజమహల్ కావ్యంలోని "కులము లేదన్న వానినిఁ గూడవలచు" అనే పద్యం ద్వారా కళకు కులమత భేదాలు లేవని జాషువా ఆకాంక్షించిన తీరును వివరించారు. గబ్బిలంలో హిందూ సమాజంలోని చాతుర్వర్ణ వ్యవస్థను "నాల్గు పడగల హైందవ నాగరాజు"గా అభివర్ణిస్తూ జాషువా చేసిన తీవ్రమైన సామాజిక విమర్శను ఈ వ్యాసంలో అద్భుతంగా ఆవిష్కరించారు.

మూడవ వ్యాసం ‘జాషువ గురువులు’దీనిలో జాషువా తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత దయనీయమైన పేదరికం, కుల వివక్షలే ఆయన కవిత్వానికి ఎలా పునాదులు వేశాయో ఈ వ్యాసం తెలియజేశారు. పండుగ పూట కిందపడిన మిఠాయిని తీసుకున్న చిన్ననాటి సంఘటన నుండి, రైలు ప్రయాణంలో కవిత్వాన్ని మెచ్చుకున్న పండితుడు జాషువా కులం తెలుసుకుని "అయ్యయ్యో! వాణి అంటుపడ్డది" అని అవమానించడం, వినుకొండ సభలో జరిగిన పరాభవం వంటి బాధాకరమైన స్వానుభవాలను రచయిత ప్రస్తావించారు. ఈ అవమానాలే ఆయనకు ఎదిరించే శక్తినిచ్చాయని, తనను తాను "విశ్వనరుడ నేను" అని ప్రకటించుకునే స్థాయికి ఆయన వ్యక్తిత్వాన్ని ఎలా తీర్చిదిద్దాయో ఈ వ్యాసంలో వివరించారు.

నాల్గవది ‘'ప్రజాకవి' జాషువ’ అనే వ్యాసంలో కవిత్వం ఎలా ఉండాలి, కవి లక్షణాలు ఎలా ఉండాలి అనే అంశాలపై జాషువా గారికి ఉన్న స్పష్టమైన దృక్పథాన్ని చర్చించారు. కవిత్వానికి కృత్రిమమైన అలంకారాలు అవసరం లేదని, కవికి 'ప్రవిమల చరిత్ర' (స్వచ్ఛమైన నడవడిక) ఉండాలని జాషువా స్పష్టం చేశారని విల్సన్ రావు  తెలిపారు. అలాగే "వీరకులంబున బుట్టితి... పౌరుష గుణ ముగ్గుబాల బడసినవాడన్" అంటూ తన ఆత్మగౌరవాన్ని ప్రకటించిన తీరును, రాజులు కేవలం రాతి విగ్రహాల్లో జీవిస్తే "సుకవి జీవించు ప్రజల నాల్కల యందు" అంటూ కవికి ఉండే శాశ్వతత్వాన్ని చాటిన పద్యాలను ఇందులో లోతుగా విశ్లేషించారు.

ఐదవ వ్యాసం ‘జాషువ సాహిత్యతత్త్వం- పరిశీలన’ జాషువా రచనల్లో సామాజిక స్పృహ, నాయకత్వ లోపాలపై ఆయన చేసిన విమర్శలను  కొత్త లోచనలను రేకెత్తించే ప్రశ్నలుగా మనముందుంచారు. పల్నాటి యుద్ధం నేపథ్యంగా "పరిపాలకులే ప్రజాళి వేధించెడు బందెపోటయి ప్రతిక్షణ హత్యలు చేయుచున్న" అని రాసిన పద్యం ద్వారా స్వార్థపూరిత రాజకీయ నాయకులు సమాజాన్ని ఎలా నాశనం చేస్తారో జాషువా దార్శనికంగా చెప్పారని రచయిత వివరించారు. హింసతో నిండిన ప్రపంచాన్ని అహింసాత్మకంగా మార్చడం ఎంత కష్టమో ప్రశ్నించిన తీరును, అలాగే తన భావాలకు కట్టుబడి ఉదారవాదిగా జీవించిన జాషువా గారి సామాజిక నాయకత్వాన్ని ఈ వ్యాసంలో విశ్లేషించారు.

ఆరో వ్యాసం‘'పిరదౌసి' పద్యశిల్పం’లో గజనీ మహమ్మదుకు, పారశీక మహాకవి పిరదౌసికి మధ్య జరిగిన సంఘర్షణను తెలిపే 'పిరదౌసి' కావ్యంలోని చతుర్ధాశ్వాసంలో జాషువా వాడిన 'కంద' పద్య శిల్పాన్నిచర్చించారు. రాజు మోసం చేయడంతో కవి అడవుల పాలు కావడం, కవిని వేటాడుతూ అశ్విక దళాలు కదలడం లాంటి నాటకీయమైన, వేగవంతమైన ఘట్టాలను వివరించడానికి జాషువా  చిన్నదైన కంద పద్యాన్ని అత్యంత సమర్థవంతంగా ఎలా వాడుకున్నారో విల్సన్ రావు  నిరూపించారు. అధికారం తాత్కాలికమని, కవి రాసిన కృతి (కావ్యం) శాశ్వతమని సామంత రాజులు పలికిన హితబోధలను ఇందులో పొందుపరిచారు.

ఏడవ వ్యాసం ‘'పిరదౌసి' కాప్యంలో 'తేటగీతి' అక్షర దుందుభి’ అదే 'పిరదౌసి' చతుర్ధాశ్వాసంలో సుదీర్ఘమైన నిట్టూర్పులను, పాలకుల హృదయహీనతను పాఠకులకు హత్తుకునేలా చెప్పడానికి జాషువా వాడిన 'తేటగీతి' పద్యాల గొప్పదనాన్ని విశ్లేషించారు. కవిని "దిక్కఱిన వంటయింటి కుందేటి"తో పోల్చిన రాజు అహంకారాన్ని, "కవులకన్నీరు తగదు" అని హెచ్చరించిన సామంతుల వివేకాన్ని ఇందులో విశ్లేషించారు. చివరికి సత్కవి దేహం స్మశానానికి వెళ్తుండగా, రాజు పంపిన ధనం కవి శూన్య గృహానికి చేరుకున్న తీరును ("నిమిషభేదంబు నడుమ సంధింపఁబడిన ఈ రహస్యంబు") విధి ఆడిన వింత నాటకంగా ఈ వ్యాసంలో కళ్లకు కట్టినట్లు వివరించారు.

ఎనిమిదవ వ్యాసం ‘పిరదౌసి' కావ్యం ఒక విషాద రసప్రవాహం’లో కరుణ, వీర రసాలను అత్యంత గంభీరంగా పలికించడానికి జాషువా  'ఉత్పలమాల' వృత్తాన్ని వాడిన తీరును విశ్లేషించారు. గుర్రాల గిట్టల ధ్వనిని తెలిపే "సైంధవ ఖురాహుతి భూమిరజంబు లెఱ్ఱడాలు" అన్న పద్యం ద్వారా సైన్యం క్రూరత్వాన్ని, మసీదుకు వెళ్లి ప్రార్థించే కవి దైన్య స్థితిని రచయిత వివరించారు. తండ్రి మరణానంతరం ధనాన్ని తెచ్చిన రాజును కవి కుమార్తె "ఓయి కృతఘ్నుడా... మనుపీన్నుఁగువై చరింపుమా!" అని శపించిన ఘట్టాన్ని విశ్లేషిస్తూ.. భౌతిక సంపదపై అక్షరానిదే అంతిమ విజయం అని చెబుతూ, నేటి కవులు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకూడదని విల్సన్ రావు  ఇచ్చిన సందేశంతో ఈ వ్యాసాన్ని ముగించారు.

 

ముగింపు సమసమాజ స్థాపన కోసం తపించిన ఒక అరుదైన ప్రజాకవికి, విల్సన్ రావు     అక్షర రూపంలో అందిస్తున్న ఘనమైన నివాళి ఈ గ్రంథం. కవిత్వం కేవలం పాలకుల భోగభాగ్యాలను కీర్తించడానికి మాత్రమే కాదని, సమాజంలో చైతన్యాన్ని, పశ్చాత్తాపాన్ని రగిలించే ఆయుధమని ఈ పుస్తకం ద్వారా రచయిత స్పష్టం చేశారు. అక్షర నిష్ఠను, ఆత్మగౌరవాన్ని నేర్పే ఒక నిరంతర దిక్సూచిగా నేటి కవులందరూ చదివి తీరవలసిన ఒక అద్భుతమైన సాహిత్య వేదిక ఈ 'జాషువా పద్యశిల్పం. మొత్తం మీద చూస్తే, మహాకవి గుర్రం జాషువా గారి కవితాత్మను ఆవిష్కరించడంలో విల్సన్ రావు కొమ్మవరపు ఒక సహృదయ విమర్శకుడిగా అద్భుతమైన పాత్రను పోషించారని చెప్పవచ్చు. "మంచి కవిత్వానికి ఆర్ద్రమైన గుండె ఉండాలి, ఆ గుండె సాటి మనిషి వేదనకు కన్నీరు కార్చాలి" అన్న జాషువా గారి ప్రగాఢ విశ్వాసాన్ని విల్సన్ రావు  ఈ వ్యాసాల ద్వారా అత్యంత లోతుగా పట్టిచూపారు. అంటరానితనం, దారిద్ర్యం లాంటి అమానవీయ స్వానుభవాల నుంచి పుట్టిన జాషువా వేదనను, అలాగే అధికార గర్వాన్ని ఎదిరించిన ఒక అక్షర శిల్పి ఆత్మగౌరవాన్ని ఆయన కేవలం ఛందోపరంగానే కాకుండా తాత్త్విక, సామాజిక కోణాల్లో విశ్లేషించారు. జాషువా ప్రయోగించిన కందం, తేటగీతి, ఉత్పలమాల పద్యాల వెనుక దాగి ఉన్న కవి అంతరంగపు ఆక్రోశాన్ని, సామాజిక చైతన్యాన్ని పాఠకుల హృదయాలకు హత్తుకునేలా వివరించిన విల్సన్ రావు గారి కృషి.. జాషువా విశ్వమానవ దృక్పథాన్ని నేటి తరానికి సరికొత్త కోణంలో పరిచయం చేయడంలో నూటికి నూరుపాళ్లూ సఫలీకృతమైందని చెప్పవచ్చు.

 

- డా. దార్ల వెంకటేశ్వరరావు,

ప్రొఫెసర్, తెలుగు శాఖ,

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్.

15.9.2026

 

 


03 అక్టోబర్, 2026

'లోపలిమాట’లో దార్ల కవితపై విల్సన్ రావు కొమ్మవరపు గారి విశ్లేషణ..

 ప్రముఖ కవి విమర్శకులు, కవి  విల్సన్ రావు కొమ్మవరపు గారు నవ మల్లెతీగ మాసపత్రికలో  ‘లోపలిమాట’  పేరుతో ఒక శీర్షిక నిర్వహిస్తున్నారు. ఒక కవిత తీసుకొని ఆ కవి లేదా కవయిత్రి జీవిత విశేషాలను, సాహిత్య కృషిని సంక్షిప్తంగా సమగ్రంగా పరిచయం చేస్తూనే, ఆ కవితను తనదైన దృక్పథంతో లోతుగా విశ్లేషిస్తున్నారు. సాహిత్య చరిత్రకు, సాహిత్య విమర్శల వికాసానికి ఈ శీర్షిక ఎంతగానో సహకరిస్తుంది. ఈనెల నవ మల్లెతీగ మాసపత్రిక, అక్టోబర్ 2026, పుటలు: 17- 19 (103 వ సంచిక) లో నా కవిత ‘ఎన్నాళ్ళీ దృష్టి మరల్చే కళ?’ కవితను పరిచయం చేసి చక్కటి విశ్లేషణను అందించారు. 

అందుకు వీరికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. తమ పత్రికలో ప్రచురించిన పత్రిక సంపాదకులకు, యాజమాన్యానికి నా ధన్యవాదాలు. ఈ కవితను మొదట ప్రచురించిన ప్రజాశక్తి దినపత్రిక సంపాదకులకు, ముఖ్యంగా సత్యాజి గారికి నాకు కృతజ్ఞతలు. ఈరోజుల్లో ముద్రణ పత్రికలు తగ్గిపోతున్న తరుణంలో ఈ పత్రిక రెగ్యులర్ గా రావడమే కాకుండా, ఉత్తమ సాహిత్యాన్ని అందిస్తున్నందుకు పత్రికా నిర్వాహకులకు నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. పత్రిక కావలసినవారి సౌకర్యార్థం చందా వివరాలను పంపించవలసిన ఫోన్ నెంబర్ కూడా పెడుతున్నాను. సంవత్సర చందా రూ.280/- మాత్రమే. ఫోన్: 9246415150.


...

(పూర్తి వ్యాసం...ఆ పత్రిక సౌజన్యంతో...)

  భుజం మీద మతం, నుదుటి మీద కులం..ఇదే నేటి ఇజం

   తెలుగు సాహిత్య విమర్శారంగంలో నిరంతర అన్వేషణ, సామాజిక నిబద్ధత మూర్తీభవించిన అరుదైన విద్వత్ శిఖరం ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారు. కవిగా, విమర్శకుడిగా, పరిశోధకుడిగా, విద్యావేత్తగా తెలుగు అకడమిక్ రంగాన్ని విస్తృత పరిచిన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఒకవైపు విశ్వవిద్యాలయ తరగతి గదుల్లో సంప్రదాయ సాహిత్యపు మూలాలను బోధిస్తూనే, మరోవైపు సమకాలీన సామాజిక ఉద్యమాల తాత్వికతను సిద్ధాంతీకరించిన అక్షర తపస్వి.

     1990ల నాటి సామాజిక ఉద్యమాల్లో భాగంగా వెలువడిన ‘మాదిగ చైతన్యం’ (1997) ఉపసంపాదకత్వం నుంచి మొదలుకొని, డా. ఎస్.టి. జ్ఞానానందకవి ‘ఆమ్రపాలి’ పరిశీలనతో పరిశోధనారంగంలో అడుగుపెట్టిన ఆయన కలం ఏనాడూ విరామం ఎరుగదు. ‘దళిత తాత్త్వికుడు’ (2004), ‘నెమలి కన్నులు’ (2016) వంటి సంపుటాలతో వచన కవిత్వంలో ఆర్ద్రతను, పదునైన అభివ్యక్తినీ నింపిన దార్ల గారు, ‘దార్లమాట’ (2021) ద్వారా శతక ప్రక్రియలోనూ తనదైన ముద్ర వేశారు. ‘దళిత సాహిత్యం - మాదిగ దృక్పథం’ (2008), ‘బహుజన సాహిత్య దృక్పథం’ (2012), ‘పునర్మూల్యాంకనం’ (2010), ‘వీచిక’ (2009) వంటి విమర్శనా గ్రంథాల ద్వారా దళిత, బహుజన సాహిత్యానికి శాస్త్రీయమైన విమర్శనా ప్రమాణాలను నెలకొల్పారు. సిద్ధాంతాల పరంగా మార్క్సిజం పట్ల సానుభూతి ఉన్నప్పటికీ, పుట్టిన నేలకు సంబంధించిన దేశీయ అవసరాలను, అస్తిత్వ ఆకాంక్షలను గుర్తెరిగి దళిత-బహుజన భావజాలాన్ని బలంగా నమోదు చేశారు.

    వీరి రచనలు కేవలం తెలుగుకే పరిమితం కాకుండా ‘Voice of Dalit’, ‘Cultural Identity and Dalit Literature’ రూపంలో ఆంగ్లంలోకి అనువాదమై అంతర్జాతీయ పాఠకులకు సైతం దళిత సౌందర్యశాస్త్రాన్ని పరిచయం చేశాయి. 2023లో వెలువడిన ‘నెమలి కన్నులు’ (ఆత్మకథ - బాల్యం) వారి జీవితంలోని అనుభవాల లోతులను సాహితీ ప్రపంచం ముందుంచింది.

     కేవలం రచయితగానే కాక, హైదరాబాదు విశ్వవిద్యాలయం (HCU) తెలుగు శాఖలో ఆచార్యులుగా ఆయన అకడమిక్ రంగంలో తెచ్చిన సంస్కరణలు విప్లవాత్మకమైనవి. యూజీసీ ప్రవేశపెట్టిన ‘ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్’ (CBCS) స్ఫూర్తిని అందిపుచ్చుకుని, కేవలం మార్కుల కోసమే కాకుండా విద్యార్థుల్లో ఉద్యోగ, అనువర్తిత నైపుణ్యాలు పెరిగేలా ఎం.ఏ. స్థాయిలో ‘పరిశోధన గ్రంథ రచనా నైపుణ్యాలు’, ‘సృజనాత్మక నైపుణ్యాలు’, ‘దళిత సాహిత్యం’, ‘ప్రవాసాంధ్ర సాహిత్యం’ వంటి వినూత్న కోర్సులను ప్రవేశపెట్టిన మార్గదర్శి. సాహిత్యాన్ని.. జీవితానికి, ఉపాధికి, సామాజిక న్యాయానికి వారధిగా మలచిన గొప్ప అధ్యయనశీలి ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారు. ఇటీవల ఆయన రాసిన “ఎన్నాళ్ళీ దృష్టి మరల్చే కళ?’’ కవితపై విశ్లేషణ ‘నవ మల్లెతీగ’ మాసపత్రిక పాఠకులకు ప్రత్యేకం.

_____________________________

 

ఎన్నాళ్ళీ దృష్టి మరల్చే కళ?

 

నా చేతిలో

ఎప్పుడూ ఏదొక దరఖాస్తే

రేషన్ కార్డు కోసమో,

ఆధార్‌లో పేరు సరిచేయించుకోవడానికో,

పింఛన్ కోసమో,

ఆరోగ్యశ్రీ కోసమో,

ఓటుని నిలబెట్టుకోవడం కోసమో...

నా జీవితాన్ని

ఒక కిటికీ ముందు నిలబెట్టి

నువ్వు నిశ్చింతగా వేడుక చూస్తుంటావు.

‘సర్వర్ పనిచేయడం లేదు…’

అనే ఒక్క వాక్యం

నా రోజంతా మింగేస్తుంది.

వేలిముద్ర పడదు.

ఓటీపీ రాదు.

తలుపు తెరుచుకోదు.

ఒక యంత్రం నన్ను గుర్తుపట్టే వరకూ

నేను మనిషినని కూడా నిరూపించుకోవాల్సిందే.

నా చేతిలోని టోకెన్,

కౌంటర్ దగ్గర వినిపించే సంఖ్యలే

నా ప్రపంచమైపోతాయి.

నువ్వు నా భుజం మీద మెల్లగా

ఒక మతాన్ని ఉంచుతావు.

నా నుదుటిపై ఒక కులాన్ని రాస్తావు.

నా చుట్టూ ఒక ప్రాంతాన్ని గీస్తావు.

చివరికి

ఒక జెండాను నా చేతిలో పెట్టి

“ఇదే నీ దేశం’’ అనీ అంటావు.

నేను

ఆ జెండా రంగుల గురించే

వాదిస్తూ ఉంటాను.

నా ఇంటి పొయ్యిలో

మంట ఆరిపోయిందన్న వాస్తవాన్ని

గమనించలేను.

నా బిడ్డ

ఉద్యోగ ప్రకటన కోసం

ప్రతిరోజూ వార్తాపత్రికను తిరగేస్తున్న

వాడి ఆందోళనను చూడలేను

నా తండ్రి మందుల సీసాలో

పెరుగుతున్న ఖాళీనీ నేను చూడలేను.

నా ఊరి చెరువు

రోజుకో అడుగు చొప్పున

మాయమవుతోందన్న నిజాన్నీ

ఎవరూ చెప్పరు.

ఒకరోజు

సినిమానే దేశమవుతుంది.

మరొకరోజు

ఒక వ్యాఖ్యే యుద్ధమవుతుంది.

ఇంకోరోజు

సోషల్ మీడియానే నా కోపానికి చిరునామా!

 

అంతలోనే

ఒక చట్టం

నా జీవితంలోకి నిశ్శబ్దంగా ప్రవేశిస్తుంది.

ఒక హక్కు

నా చేతిలోంచి శబ్దం చేయకుండా జారిపోతుంది.

నేను మాత్రం

హ్యాష్‌ట్యాగ్‌లతో గెలిచానని

నన్ను నేనే అభినందించుకుంటాను.

 

అప్పుడు అర్థమవుతుంది

నన్ను ఓడించింది నీ బలం కాదు,

నా దృష్టిని మరల్చే నీ కళ.

ఎన్నాళ్ళిలా…ఏదొకనాడు

నేను క్యూలో నిల్చున్న మనిషిని కాను.

ప్రశ్న అడగడం నేర్చుకుంటున్న పౌరుడినవుతాను.

 

ప్రజాస్వామ్యం

ఓటు వేసిన రోజుతో ముగిసే పండుగ కాదనీ,

ప్రతి రోజూ అధికారాన్ని ప్రశ్నించే

సజీవమైన జ్ఞాపకమనీ గుర్తు చేస్తాను.

 

ఆ జ్ఞాపకం మేల్కొన్న రోజు

సర్వర్లు మాత్రమే కాదు,

మౌనాలూ పనిచేయడం మొదలుపెడతాయి.

కార్డుల కంటే ముందు మనిషి కనిపిస్తాడు.

జెండాల కంటే ముందు ఆకలి కనిపిస్తుంది.

నినాదాల కంటే ముందు నిజమే వినిపిస్తుంది.

 

ఆ రోజు

తలవంచి క్యూలో నిల్చున్న “నన్ను” కాదు,

తలెత్తి ప్రశ్నించే ఓ పిడికిలిని చూస్తావు.

-డా.దార్ల వెంకటేశ్వరరావు

___________________________

  వర్తమాన సమాజంలోని సగటు పౌరుడి బతుకు చిత్రాన్ని, రాజకీయ వంచనలను అత్యంత పదునుగా ఆవిష్కరించిన ఈ కవిత అద్భుతమైనది, సమకాలీనమైనది.

  ఆధునిక కాలంలో సాంకేతికత పేరిట సామాన్యుడు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, వారి దృష్టిని అసలైన సమస్యల నుంచి మరలించే పాలకుల పద్ధతులను నిలదీస్తూనే... ప్రజాస్వామ్యంలో సగటు మనిషి తలెత్తి ప్రశ్నించే స్థాయికి ఎలా ఎదుగుతాడో ఈ కవిత ఎంతో స్పష్టంగా చూపిస్తుంది. ఈ చైతన్యం నేడు ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న 'జెన్ జీ' (Gen Z) యువతరపు ఉద్యమ స్ఫూర్తికి కూడా అచ్చమైన ప్రతిబింబంగా నిలుస్తుంది.

  ఈ కవితావస్తువు నేటి నయా-ఉదారవాద, డిజిటల్ యుగంలో సామాన్యుడికి ఎదురవుతున్న అస్తిత్వ వేదన. రాజ్యాంగం పౌరుడికి కల్పించిన హక్కులను పక్కనబెట్టి, పాలకుల వ్యవస్థలు సగటు మనిషిని కేవలం పథకాల కోసం దరఖాస్తులు పట్టుకుని గంటల తరబడి ‘క్యూ’లో నిలబడే ఒక అర్జీదారుడిగా మార్చేశాయి.

  కవిత ప్రారంభమే నిత్యం ఎంతోమంది అనుభవిస్తున్న, చూస్తున్న అత్యంత సహజమైన వాస్తవంతో మొదలవుతుంది. నా చేతిలో ఎప్పుడూ ఏదో ఒక దరఖాస్తు వుంటూనే ఉంటుందని, రేషన్ కార్డు కోసమో, ఆధార్‌లో పేరు మార్పు కోసమో, పింఛను, ఆరోగ్యశ్రీ లేదా ఓటును కాపాడుకోవడం కోసమో నిత్యం పోరాడాల్సి వస్తోందని కవి చెప్తారు. ఈ క్రమంలో “సర్వర్ పనిచేయడం లేదు” అనే ఒక్క మాట సగటు మనిషి రోజంతటినీ మింగేస్తుంది. వేలిముద్ర పడక, ఓటీపీ రాక, ఒక యంత్రం తనను గుర్తుపట్టేంత వరకు తాను మనిషినని కూడా నిరూపించుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.



  ఆధునిక సాంకేతికత పేరిట మనిషి ఉనికిని ఎంత తేలికగా పరిగణిస్తున్నారో చెప్పడానికి కవి వాడిన ఈ యంత్రాల సాంకేతిక  పరిభాష చాలా బలంగా హృదయాలను తాకుతుంది. ఇటువంటి దైనందిన ఇబ్బందుల్లో మగ్గుతున్న పౌరుడిని హెచ్చరిస్తూ, వ్యవస్థలు అతడి దృష్టిని అసలైన బతుకు సమస్యల నుంచి ఎలా పక్కకు మళ్లిస్తున్నాయో కవి ఎంతో చమత్కారంగా, లోతుగా వివరించారు.

  ప్రజలపై మతాన్ని రుద్దడం, నుదుటిపై కులాన్ని రాయడం, చుట్టూ ప్రాంతీయ హద్దులు గీయడం, చివరికి చేతిలో ఒక జెండా పెట్టి ఇదే నీ దేశం అని చెప్పడం ద్వారా... ప్రజలను భావోద్వేగాల పరంపరలో తడిపేస్తారు. దాంతో ప్రజలు ఆ జెండా రంగుల గురించే వాదించుకుంటూ ఉండిపోతారు కానీ, తమ ఇంట్లో పొయ్యిలో మంట ఆరిపోయిందన్న నిజమైన ఆకలిని గమనించలేరు.

  ఉద్యోగ ప్రకటనల కోసం ప్రతిరోజూ పేపరు తిరగేస్తున్న బిడ్డల ఆందోళనను, మందుల సీసాలో పెరుగుతున్న ఖాళీతో కుమిలిపోతున్న తండ్రి బాధను, ఊరి చెరువు రోజుకో అడుగు చొప్పున మాయమవుతున్న పర్యావరణ నష్టాన్ని ఎవరూ పట్టించుకోరు. ఒకరోజు సినిమానే దేశమవుతుంది, మరోరోజు ఒక చిన్న వ్యాఖ్యే పెద్ద యుద్ధమవుతుంది, సోషల్ మీడియానే కోపానికి చిరునామా అవుతుంది. ఇలాంటి చిల్లర గొడవల్లో, హ్యాష్‌ట్యాగ్‌ల పోరాటాల్లో గెలిచామని భ్రమపడుతున్న సమయంలోనే... ఒక చట్టం నిశ్శబ్దంగా వచ్చి ఒక హక్కును లాక్కెళ్ళిపోతుంది. అప్పుడు గానీ పౌరుడికి అర్థం కాదు—తన్ను ఓడించింది పాలక వ్యవస్థల బలం కాదు, తన దృష్టిని అసలు సమస్యల నుంచి పక్కకు మళ్లించే వారి కళ అని!

ఈ కవితా నిర్మాణం, రూపకాల అల్లిక ఎంతో నాటకీయంగా ఉంది. శిల్పపరంగా చూస్తే, కవిత ప్రారంభంలో డిజిటల్ సమస్యలతో నలిగిపోయే సగటు మనిషి నిస్సహాయత నుంచి మొదలై, మధ్యలో మతం, కులం, మీడియా మాయాజాలాన్ని విశ్లేషిస్తూ, చివరకు ప్రశ్నించే పౌరుడిగా మారే వరకు ఒక క్రమమైన పెరుగుదల కనిపిస్తుంది. అలాగే డిజిటల్ యంత్రాల ముందు మనిషి పడే వేదనను, భావోద్వేగాల మాయలో బందీ అయిన స్థితిని పక్కపక్కనే నిలిపి కవి సమాజంలోని అసమానతలను కళ్లముందుంచారు.

ఇందులో ‘క్యూలో నిలబడడం’ అనేది విధేయతకు గుర్తు అయితే, ‘తలెత్తి ప్రశ్నించడం’ అనేది చైతన్యానికి గుర్తు. ఈ మార్పునే కవి శిల్పసౌందర్యంగా ఆవిష్కరించారు.

  ఇందులోని అభివ్యక్తి, ప్రతీకలు నిత్య జీవిత దృశ్యాలకు చాలా దగ్గరగా ఉన్నాయి. సాంకేతిక భాష అయిన ఓటీపీ, వేలిముద్రలు, టోకెన్లు, సర్వర్లు వంటి పదాలను కవి వాడిన తీరు... డిజిటల్ నియంత్రణలో నలిగిపోతున్న మనిషి ఉనికిని స్పష్టంగా చూపుతుంది.

  అలాగే భుజం మీద మతం, నుదుటి మీద కులం, చేతిలో జెండా అని చెప్పిన ఊహలు అత్యంత శక్తివంతమైన దృశ్యాలుగా నిలుస్తాయి. పాతకాలపు కష్టమైన పదాలు గానీ, సంక్లిష్టమైన అలంకారాల భారం గానీ లేకుండా, నిత్యం మన వాడుకలో ఉండే సరళమైన భాషతోనే లోతైన కవితాత్మక పదును తీసుకురావడం ఈ కవి శైలిలోని ప్రత్యేకత.

  ముఖ్యంగా ఈ కవితలో ‘సర్వర్, ఆధార్, పింఛన్, ఓటీపీ, టోకెన్, కౌంటర్, సోషల్ మీడియా, హ్యాష్‌ట్యాగ్’ వంటి ఆంగ్ల పదాలను వాడటం అనేది ఆధునిక కవితా నిర్మాణంలో వస్తున్న ఒక గొప్ప మార్పుకు సూచిక.

  ఒకప్పుడు కవిత్వం అంటే గ్రాంథికమో లేక కేవలం ప్రకృతి వర్ణనలతో కూడిన గ్రామీణ భాషో ఉండేది. కానీ నేటి సామాన్యుడి రోజువారీ  అనుభవాలు ఈ డిజిటల్ పరిభాషతో ముడిపడి ఉన్నాయి. ఓటీపీ రాకపోవడం, సర్వర్ పనిచేయకపోవడం అనేవి నేటి సగటు మనిషి నిజమైన బాధలు. వాటికి అచ్చతెలుగు అనువాదాలు వెతికితే ఆ అనుభవంలో ఉండే నిజాయితీ, తాజాదనం దెబ్బతింటాయి. అందుకే కవి ఆ ఆంగ్ల పదాలను ఫ్యాషన్ కోసం కాకుండా, సగటు మనిషి వేదనను యథాతథంగా ఆవిష్కరించడానికి, అలాగే సాంకేతికత పేరిట జరుగుతున్న ఆధిపత్యాన్ని ప్రశ్నించడానికి ఒక ఆయుధంగా వాడుకున్నారు. ఇది నేటి యువ కవులకు ఒక గొప్ప పాఠం. ఆంగ్ల పదాలను ఎలా పడితే అలా వాడకూడదని, అనుభవంలోని నిజాయితీని చెప్పడానికి, సమాజంలోని యాంత్రికతను ఎత్తిచూపడానికి మాత్రమే వాడాలని ఈ కవితలో దార్ల గారు చెప్పకనే చెప్పారు.

  అలాగే కేవలం ఆక్రోశాన్ని నింపడం కాకుండా, ఆలోచనను రేకెత్తించే రీతిలో కవిత్వాన్ని ఎలా నడపాలో కూడా నేటి యువతకు ఇది దిశానిర్దేశం చేస్తుంది.

ఈ కవితలో వ్యక్తమైన లోతైన చైతన్యాన్ని నేడు ప్రపంచవ్యాప్తంగా రూపుదిద్దుకుంటున్న జెన్ జీ (Gen Z) ఉద్యమాల పోరాట నమూనాతో నేరుగా ముడిపెట్టి చూడవచ్చు. సాంకేతికతనే ఆయుధంగా మలచుకోవడం ఈ తరం ప్రత్యేకత. పాలక వ్యవస్థలు సోషల్ మీడియాను, హ్యాష్‌ట్యాగ్‌లను ప్రజల దృష్టి మరల్చడానికి వాడుతుంటే... నేటి జెన్ జీ యువత అదే వేదికల ద్వారా నిజమైన సమస్యలను బట్టబయలు చేస్తూ అధికారాన్ని నిలదీస్తోంది.

  కవి ఆవేదన చెందినట్లు మతం, కులం, ప్రాంతం, రాజకీయ పార్టీల జెండాల చుట్టూ తిరిగే పాత నమూనాను జెన్ జీ తిరస్కరిస్తోంది. “జెండాల కంటే ముందు ఆకలి, కార్డుల కంటే ముందు మనిషి” అనే సూత్రంతో నిరుద్యోగం, పర్యావరణ వినాశనం, హక్కుల హరణంపై వీధుల్లోకి వస్తోంది. ప్రభుత్వాలు ఇచ్చే హామీల కోసం క్యూలో నిలబడే బాధితుల్లా కాకుండా, ప్రశ్నించే పౌరులుగా మారే ఈ క్రమం జెన్ జీ ఉద్యమాల్లో స్పష్టంగా కనిపిస్తుంది.

  ఈ కవిత ముగింపు కూడా సరిగ్గా అలాంటి ఒక గొప్ప ప్రజాస్వామ్య మేల్కొలుపునే ఆవిష్కరిస్తుంది. ప్రజాస్వామ్యం అంటే ఐదేళ్లకోసారి ఓటు వేసి ఊరుకునే పండుగ కాదని, అది ప్రతిరోజూ అధికారాన్ని ప్రశ్నించే సజీవమైన జ్ఞాపకమని కవి ఉద్బోధిస్తారు. ఆ జ్ఞాపకం మేల్కొన్న రోజు సర్వర్లు మాత్రమే కాదు, ప్రజల మౌనాలు కూడా మాట్లాడటం మొదలుపెడతాయి. రాజ్యాంగ కార్డుల కంటే ముందు మనిషి కనిపిస్తాడు, రంగుల జెండాల కంటే ముందు ఆకలి కనిపిస్తుంది, రాజకీయ నినాదాల కంటే ముందు పచ్చి నిజమే వినిపిస్తుంది. ఆ రోజు తలవంచి క్యూలో నిల్చున్న సగటు జీవిని కాక, తలెత్తి ప్రశ్నించే ఒక పిడికిలిని ఈ వ్యవస్థ చూస్తుందని కవి చెప్పిన తీరు అత్యంత ప్రభావవంతమైనది.

వర్తమాన సంక్షోభాన్ని కవిత్వంలోకి ఎలా ఆవహింపజేయాలో, ఆధునిక పరిభాషను కవితాత్మక అస్త్రంగా ఎలా మలచుకోవాలో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారు ఈ కవిత ద్వారా కళ్లకు కట్టినట్లుగా నిరూపించారు. దృష్టి మరల్చే రాజకీయాల మాయను పటాపంచలు చేస్తూ, ప్రశ్నించే కొత్త తరానికి దిశానిర్దేశం చేసిన నేటి కాలానికి ఎంతో అవసరమైన ఒక గొప్ప సామాజిక సందేశం.

-విల్సన్ రావు కొమ్మవరపు

  89854 35515

 

 

 




19 జులై, 2026

మల్లవరపు కవులతో మధురస్మృ తులు

 


మల్లవరపు కవులతో మధురస్మృతులు  


‘‘ నేను ఛందోబద్ధ కవిత్వాన్ని, స్వచ్ఛందంగా సాగిన వచన కవిత్వాన్ని కూడా ఆహ్వానిస్తాను. నిజానికి కవిత్వం అనేది విషయ ప్రధానంగానే ఉంటుంది తప్ప రూప ప్రధానంగా వుండదు. గుణానికి నేను ప్రాధాన్యం ఇస్తాను. శ్రీ జాన్ గారి కవిత్వం గుణభూయిష్ఠంగా వుంటుంది. మాధుర్య గుణం వీరి మనసులో, మాటలో పొంగులెత్తుతూ ఉంటుంది. కవికి ప్రధానంగా కావల్సిన ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసాలు శ్రీ జాన్ గారిలో పుష్కలంగా వున్నాయి.’ 

 అని మల్లవరపు జాన్ కవిగారి ‘‘అతుకుల బ్రతుకులు’’ కావ్యానికి 1981లో ప్రముఖ కవి దాశరథి రాసిన మాటలివి. అటువంటిమల్లవరపు జాన్ కవి గారి శతజయంతి ఉత్సవాలు ఏడాది నుండి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సాహిత్య అకాడమీ వారు, జానుడి సంస్థతో కలిసి ఒంగోలులో ఒకరోజు (12 జూలై 2026) సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాహిత్య అకాడమీ, తెలుగు సలహా మండలి కన్వీనర్ ఆచార్య సి.మృణాళిని పాల్గొని శత జయంతి ఉత్సవాలను ప్రారంభించారు. 

మాట్లాలాడుతున్న  సాహిత్య అకాడమీ, తెలుగు సలహా మండలి కన్వీనర్ ఆచార్య సి.మృణాళిని. వేదికపై డాక్టర్ జవహర్, ఆచార్య కోయి కోటేశ్వరరావు, మల్లవరపు ప్రభాకర రావు, డా.నూకతోటి రవికుమార్ 

జాన్ కవిగారి పద్యశిల్పాన్ని డా. సి.నారాయణరెడ్డి ప్రస్తుతించేవారన్నారు. చమత్కారం, వ్యంగ్యం, తెలుగు పలుకుబడులతో చక్కని సంభాషణాత్మక, హేతుబద్ధ శైలిలో పద్యం రాసిన జాన్ కవి పద్యకవులకు సరికొత్త స్ఫూర్తినిచ్చారన్నారు. జాన్ కవి శతజయంతి సభను కేంద్ర సాహిత్య అకాడమీ నిర్వహించడంలో ప్రధాన ఉద్దేశ్యం జాన్ కవి గారి రచనల్లో సామాజికతను, సర్వకాలీనతను సమకాలీనతను, పునర్మూల్యాంకనం చేయడమేనన్నారు. జానుడి కన్వీనర్ డా.నూకతోటి రవికుమార్ ప్రారంభ సమావేశానికి అధ్యక్షత వహించారు. ప్రముఖ కవి, విమర్శకులు ఆచార్య కోయి కోటేశ్వరరావు కీలకోపన్యాసం చేశారు. 

మాట్లాడుతున్న ఆచార్య కోయి కోటేశ్వరరావు 

మల్లవరపు సాహిత్య భారతి అధ్యక్షులు డా.జవహర్, ప్రముఖ నాటకకర్త పాటిబండ్ల ఆనందరావు, ప్రముఖ కవి బీరం సుందరరావు, ఆచార్య విస్తాలి శంకరరావు, డా.వై.విజయానందరాజు, కవి కోట్ల వేంకటేశ్వర రెడ్డి, ఆచార్య కప్పగంతుల మధుసూదన్ , సాహిత్య అకాడమీ ప్రతినిథి చంద్రశేఖర్ లతో పాటు మల్లవరపు జాన్ కవి గారి మనవలు, కమర్షియల్ ట్యాక్స్ అసిస్టెంట్ కమీషనర్లు మల్లవరపు సుధాకర రావు, మల్లవరపు ప్రభాకరరావు, మనకాలం మాస పత్రిక సంపాదకులు కత్తి కళ్యాణ్, డా.కోలాశేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేను మల్లవరపు జాన్ కవి గారి కవిత్వ శిల్పం గురించి మాట్లాడాను. అకాడమీ నిర్వహించిన కార్యక్రమం తో పాటు దానికి కొనసాగింపుగా సాయంత్రం అనేక సాహిత్య కార్యక్రమాలను నిర్వహించారు. 

మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 

తెలుగు సాహిత్య చరిత్రలో మల్లవరపు కవులు అనే ఒక అధ్యాయాన్ని కేటాయించదగినంత కృషిచేసిన వారీ కవులు. మల్లవరపు జాన్ కవి, రాజేశ్వరరావు, ప్రభాకరరావు, సుధాకరరావు, రాజీవ్ తెలుగు సాహిత్యంలో విశేషమైన సేవచేసిన వారికి ప్రతియేడాది మల్లరపు జాన్ కవిగారి స్మృత్యర్థం ఒక పురస్కారాన్ని ఇస్తున్నారు. ఈ పురస్కారాన్ని 2016 నుండి ప్రారంభించారు. తొలిపురస్కారాన్ని నాకు అందించారు. అది నాకు లభించిన గొప్పగౌరవంగా భావిస్తున్నాను. 

మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 

జాను కవి గారు 22 జనవరి 1927లో జన్మించారు. మల్లవరపు దావీదు, శ్రీమతి రత్నమ్మ గార్లు వీరి తల్లి తండ్రులు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలోని చీమకుర్తివీరి జన్మ స్థలం. వీరి కుటుంబానికో ప్రత్యేకత ఉంది. వీరి కుమారుడు రాజేశ్వరరావు, కుమార్తె కోటి రత్నమ్మ, మనవడు ప్రభాకరరావులు మంచి కవులు. ఒక మనవడు మంచి చిత్రకారుడు. జాను కవి గారు 12 ఆగష్టు 2006 న మరణించారు. ఆయన కవిత్వం రాశారు. ఆ కవిత్వాన్ని ఛందోబద్ద పద్యంలో రాశారు. సాంసన్‌ - డెలీలా నాటకం రాశారు. అది క్రైస్తవ సాహిత్యేతివృత్తం. అందులోనూ కొన్ని పద్యాలున్నాయి. ‘సజ్జనాను రక్తిజాను సూక్తి’ మకుటంతో ఒక సూక్తి శతకం రాశారు. అది అనేక భావాల సంగమం. రేడియోలో సమస్యపూరణం పేరుతో వారం వారం ప్రసారమైన కార్యక్రమంలో అనేక సమస్యలకు పద్యపూరణ చేశారు. 

మాట్లాడుతున్న ఆచార్య విస్తాలి శంకరరావు 

తన కృతులను ప్రచురించినవారినీ, ప్రచురించడానికి సహకరించినవారినీ, తన రచనలపై స్పందించినవారినీ అభినందిస్తూ పద్యాలు రాశారు. కవిత్వంలో తనకిష్టమైన ప్రాచీనాధునిక కవులనూ, కావ్యాలనూ స్పర్శించారు. మాతృభాషపై, మాతృభూమిపై అభిమానాన్ని కురిపించారు. వీటిని పరిశీలించినప్పుడు జాన్‌ కవి భిన్న వస్తువులను తీసుకొని కవిత్వం రాశారని తెలుస్తుంది. కవి భిన్న వస్తువులను తీసుకోవడం వల్ల మాధుర్యం వస్తుందా? తీసుకున్న వస్తువులను కవిత్వీకరించడంలో మాధుర్యం వ్యక్తమవుతుందా? అనే ప్రశ్న ప్రతి కవి గురించీ, ప్రతి రచన గురించీ వేసుకోవలసి వస్తుంది. ఈ ప్రశ్నకు వచ్చిన సమాధానాల సమాహారం నుండే కవిత్వ స్థాయి తెలుస్తుంది. కవి వచ్చిన సమాజం నుండి కూడా కవిత్వ స్థాయిని చూడాలి. కవిత్వ మాధుర్యాన్ని గుర్తించాలి. అందుకేనేమో కరుణశ్రీ ..

‘’పనస తొనలకన్న పాల మీగడకన్న

 మధువుకన్న ముగ్ధ వధువు కన్న 

మల్లవరపు కవిత మధురాతి మధురమ్ము 

“జాను” తెనుగు మేలి “జాను తెనుగు" అని జాన్ కవిగారిని ప్రశంసించారు. జాన్‌ కవి అప్పకవి నిర్ణయాన్ని ఖండించడంతోనే ఆగిపోలేదు. మహాకవి జాషువా కవిత్వంతో కలిసి పయనించారు. కవిత్వం రాయడానికి కులం అడ్డంకి కాదని నిరూపించిన జాషువాని ప్రశంసించారు. 

ఆచార్య సి.మృణాళినిగారితో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, కేంద్ర సాహిత్య అకాడమీ ప్రతినిథి చంద్రశేఖర్ తదితరులు 
దార్ల వెంకటేశ్వరరావు, మల్లవరపు రాజేశ్వరరావుగారి భార్య, కోయి కోటేశ్వరరావు 
మల్లవరపు రాజేశ్వరరావు గారి భార్య, ప్రభాకరరావు, దార్ల వెంకటేశ్వరరావు 


మల్లవరపు ప్రభాకరరావు, సుధాకర రావు, కోయి కోటేశ్వరరావు, దార్ల వెంకటేశ్వరరావు 


 కవిత్వంలోని వస్తువు, అభివ్యక్తులను బట్టి గుర్తించటమే ప్రతి కవికీ నిజమైన గుర్తింపు. అలాంటప్పుడు కుల, మత, ప్రాంతీయ భేదాలు పొడచూపవు. నిజానికి కవిత్వాన్ని ఇష్ట పడటానికి ఈ కొలమానాలు చాలా మంది చూస్తుంటారు. వీటితో పాటు అత్యంత ముఖ్యమైనది భావజాలం. భావజాలం నచ్చినప్పుడు పైవేమీ పెద్దగా ప్రభావాన్ని చూపకపోవచ్చు. ఇవేమీ కాకుండా, కేవలం కవిత్వాన్నే ఇష్టపడేవాళ్ళూ ఉంటారు. అటువంటి వాళ్ళు చాలా అరుదు. అసలు విషయం ఏమిటంటే, ఇటీవల సాహితీకౌముది త్రైమాసిక పత్రిక ఏప్రిల్ 2007 సంచిక చూశాను. దాన్ని మధుర కవి శ్రీ మల్లవరపు జాన్‌ 80 వ జయంతి ప్రత్యేక సంచికగా ప్రచురించారు. తెలుగు పద్య సాహిత్యాన్ని ప్రోత్సాహించే పత్రిక. దీనిలో చాలా మంచి వ్యాసాలు, కవితలు ఉన్నాయి. జాన్‌ కవి గారి గురించే కాకుండా, మరికొన్ని శీర్షికలు కూడా ఉన్నాయి. సాహితీ వార్తలు ఉన్నాయి.

Courtesy: Hans india news 

వ్యవస్థాపక ప్రధాన సంపాధకులు శిష్ట్లా వెంకట్రావు గారు మంచి సంపాదకీయం రాశారు. సంచికలో ఉన్న అన్ని వ్యాసాల పెట్టు ఆ సంపాదకీయంలో ఉంది. జాన్‌కవిగారి సమగ్ర వ్యక్తిత్వం ఆ సంపాదకీయంలో పెట్ట గలిగారు. సనాతన సంప్రదాయాన్ని మన్నిస్తూనే వాటిలోని బల హీనతలను త్రోసి రాజనగల కవులలో ఒకరుగా జాన్‌ కవిని బాగా అంచెనా వేయగలిగారు. "దైవభక్తి, దేశభక్తి, సామాజిక స్వభావం, మృదుస్వాభావికత ఆయన వ్యక్తిత్వాన్ని మహోన్నత స్థాయిలో నిల్పిన కవిగా జాన్‌ కవి గారిని అభివర్ణించారు.

షేక్ ఆలీ, ఎం.పి. జాను కవి, ఉన్నం జ్యోతి వాసు, మల్లవరపు రాజేశ్వరరావు, మల్లవరపు వెంకటరావు, ఫణితపు శ్రీరామ మూర్తి, కొండ్రెడ్డి వేంకటేశ్వర రెడ్డి , డా.బీరం సుందరరావు, బోడావుల నాగేశ్వరరావు, గంగవరపు జానకి రావు, బులుసు వేంకటేశ్వర్లు మొదలైన వారు జాన్‌ కవిగారి సాహిత్యాన్ని, వ్యక్తిత్త్వాన్నిఛందో బద్దంగా మంచి పద్యాలను రాశారు.

జాన్‌ కవిగారి గురించి చాలామంది మంచి వ్యాసాలు రాశారు. " మధుర కవి సాహిత్య దర్శనం" పేరుతో డా// గోగినేని యోగ ప్రభావతి గారు రాసిన వ్యాసం చాలా బాగుంది. ఇంకా ఇలాంటి వ్యాసాలు చాలా ఉన్నాయి. జాన్‌ కవి గారి వ్యక్తిత్వాన్ని, సాహిత్యాన్ని తెలుసుకోవాలనే వారికి ఈ సంచిక ఒక ఆకర గ్రంథంగా ఉపయోగిస్తుంది.

కం.

మాదార్ల మనసువెన్నెల

ప్రాధాన్యతనిచ్చి కవుల పండితులను తా

నాదరము జూచి మమతా

మాధుర్యమొసంగిబ్రోచు మంజుల హృదితోన్

తే.గీ.

మధుర కవి మల్లవరపు జాన్ మధుర పద్య

కవన భావ సౌరభ్య వైభవము గాంచి

మెచ్చి మెండు సమీక్షల నిచ్చి కవుల

మనసు దోచుకున్నారు నమ్మకముగలుగ!

Rajeev Book Cover 

ఈ పద్యాలను మల్లవరపు రాజేశ్వరరావుగారు నా గురించి 22 అక్టోబరు 2009లో ప్రేమతో వర్ణించినవి. నాకు మల్లవరపు జాన్ గారు, రాజేశ్వరరావుగారి కంటే ముందు వారి కుటుంబసభ్యుడైన ప్రభాకరరావు బాగా తెలుసు. ఆయన చిక్కనైన వచన కవిత్వం రాస్తారు. 

జాన్ కవి కుమారుడు మల్లవరపు రాజేశ్వరరావు. తండ్రి వారసత్వాన్ని నిలబెడుతూ తెలుగుపండితుడిగా పనిచేస్తూనే అనేక రచనలు చేశారు. 1949 డిసెంబరు 17 వతేదీన జన్మించిన రాజేశ్వరరావుకి 'జీవనది' పద్యకావ్య సంపుటి ఎంతో పేరు తెచ్చింది. భక్తయోబు, అనాథ గంగ, ఎయిడ్స్ మహమ్మారి, బాలగేయాలు, హన్నా, కాళింది, రజయ ప్రణయం, ఎస్తేరు రాణి మొదలైన రచనలు చేశారు. వీటితో పాటు ఈయన రాసిన కావ్యాలు, నాటకాలు ముద్రణలో ఉన్నాయి. ఈయన రాసిన 'ముంతాజ్ మహల్' పద్యకావ్యం అనేకమంది సాహితీవేత్తల ప్రశంసలు అందుకుంది. పద్యంలోరాసినప్పటికీ వీరి భాష ఎంతో సరళంగా ఉంటుంది. మల్లవరపు జాన్ కవి వారస త్వాన్ని పుణికి పుచ్చుకొని పోతనలోని మాధుర్యాన్ని, కరుణశ్రీలోని మృదుత్వాన్ని, వేమనలోని వస్త్వలంకారాలతో సత్యాన్ని సామాన్యు లకు అందించగల నేర్పునీ, జాషువాలోని సామాజిక స్పందన్నీ ఏకోన్ముఖంగా మనకి అందించగల కళానైపుణ్యం ఈయన కవిత్వం లో కనిపిస్తుంది. ఈయన రాసిన 'మల్లవరపు శతకం'లో సామాజిక సమస్యల్ని వర్ణించారు. 'మతములన్నియు జనుల హితమునే కూ ర్చును/ సత్యము వాని నమ్మి సాగువారి/బ్రతుకులందు శాంతి భావాలు వెలుగొందు/ మల్లవరపు మాట మల్లెమూట' అని మతం ప్రజలకు హితాన్ని కలిగించి ముందుకు తీసుకుపోవడానికి ఒక మార్గంగా ఉండాలని ధ్యన్యాత్మకంగా ప్రబోధించారు.సమాజంలో జీవిస్తున్న బాధ్యతాయుత మైన కవిగానీ, కళాకారుడు గానీ తన చుట్టూ జరుగుతున్న వాటికి స్పందించడంలో 'కళాత్మకత' ఉంటుం ది. అది బయటకొచ్చే వరకు 'పురిటి నొప్పులు' భరించాల్సిందే నన్నట్లుంటుంది. కొన్నిసార్లు 'గుం డెగొంతులో కొట్లాడుతూనే ఉం టుంది. నిలబడనీయదు. అందరి లో ఉన్నా ఒంటిరిని చేస్తుంది. ఒంటరిగా ఉన్న సమూహాన్నీ చేస్తుంది. అది బయటకొచ్చిన తర్వాత కవి గొప్ప రిలీఫ్ పొందుతాడు. కవి మల్లవరపు రాజేశ్వరరావు అటువంటి 'తల్లి'గురించెలా వర్ణించారో చూడండి. 'కనెడి వేళ తల్లి కష్టంబు పడునెంతొ/ కాన్పులైన పిదప కలత మరచు/ హత్తుకొనును బిడ్డ పొత్తిళ్ళలో నుంచి/మల్లవరపు మాట మల్లె మూట'. గుర్రం జాషువా స్మారక కళాపరిషత్, ప్రకాశం జిల్లా ముస్లిం రచయితల సంఘం, శ్రీకష్ణదేవరాయ సాంస్కృతిక సేవా సమితి మొదలైన సంస్థలు పురస్కారాలతో పాటు, ఆచార్య నాగారు ్జన విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారంతో సత్కరించింది. 2007 లో ప్రభుత్వం నుంచి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందు కున్నారు. ఈయన రాసిన జీవనది కావ్యంపై తెలుగుశాఖ, హైదరా బాదు విశ్వవిద్యాలయంలో ఎం.ఫిల్ పరిశోధన చేశారు. రాజేశ్వరరావుగారు 24 అక్టోబరు 2018వ తేదీన మరణించారు.

మల్లవరపు జాన్ శత జయంతి ప్రారంభ సమావేశంలో పాల్గొన్న సాహితీవేత్తలు.

***

‘వసంతానికి స్వాగతం’ పేరుతో1996 లో మల్లవరపు ప్రభాకరరావుగారు రాసిన కవితలోని కొన్ని భాగాలు చూడండి. 

‘’కల్లలైన కలల మధ్య

చేదు జ్ఞాపకాలలోని తీపి స్మృతుల మధ్య

అలనల్లన నడిచొచ్చే ఉగాదికి స్వాగతం’అంటూనే ఎన్ని ఉగాదులు వచ్చినా సామాన్యులను, మధ్యతరగతిలను ఎలాంటి జీవన పరిస్థితుల్లో నెట్టేస్తూ ఉంటాయో చెప్తూ…

‘ఒక్కో వసంతం ఎన్ని తీపికలలను వెంట తీసికొస్తుందో

ఒక్కో వసంతం ఎన్ని వాడిన జీవితాల కథలను వెంటకొనిపోయిందో’

పిల్లాడి స్కూల్ ఫీజుల కోసం

కాఫీ కప్పులో పంచదార కోసం

ఇంటి కొచ్చిన కొత్తల్లుడి గొంతెమ్మ కోర్కెలు తీర్చడం కోసం

మా ఆత్మాభిమానాన్ని చంపుకుంటున్నా

వసంతానికి ఆహ్వానం చెబుతుంటాం’ అంటాడు కవి.

మల్లవరపు రాజీవ్ తన పద్దెనిమిదేళ్ల వయసులోనే 'ఇగ్నోరెంట్ బ్లిస్' (Ignorant Bliss) అనే ఆంగ్ల కవితా సంకలనం ద్వారా అద్భుతమైన పరిణతిని, విశాల దృక్పథాన్ని కనబరిచాడు. యువతకు సహజమైన ఆవేశాలకు బదులుగా, మనిషి అంతరంగం, స్వచ్ఛమైన హృదయం, తప్పుల నుంచి నేర్చుకునే పాఠాలు, జీవితం పట్ల ఆశావాదం వంటి ఉన్నతమైన అంశాలను తన కవితల్లో లోతుగా స్పృశించాడు. కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా సాటి మనిషితో బంధాన్ని పెనవేసుకోవాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతూ, సమాజంలోని కృత్రిమత్వాన్ని, మూస ధోరణులను తన కవిత్వం ద్వారా అత్యంత సుతిమెత్తగా, ప్రభావవంతంగా విమర్శించాడు.

రాజీవ్ రాసిన 'విచ్ వే' (Which Way) కవిత చదువుతుంటే, సుప్రసిద్ధ అమెరికన్ కవి రాబర్ట్ ఫ్రాస్ట్ రాసిన 'రోడ్ నాట్ టేకెన్' (Road not Tken) కవిత ఇచ్చిన స్ఫూర్తి మనకు అడుగడుగునా కనిపిస్తుంది. అదేవిధంగా, 'త్రూ దేర్ ఐస్' (Through Their Eyes) కవితలో విలియం హెన్రీ డేవిస్ రాసిన 'లెయిజర్' (Leisure) కవిత తాలూకు ప్రభావం అద్భుతంగా ఒదిగిపోయిందని విమర్శకులు అన్నారు.

 ఒక మంచి పాఠకుడు మాత్రమే గొప్ప రచయిత కాగలడన్న నానుడిని నిజం చేస్తూ, తన విస్తృత పఠనం వల్లే ఇంతటి చిన్న వయసులో జీవిత గమ్యాన్ని, తత్వవిచారాన్ని నిష్పక్షపాతంగా, కవితాత్మకంగా ప్రపంచానికి పరిచయం చేయగలిగాడని ఈ కవితలు స్పష్టం చేస్తున్నాయి.


'మన కాలం' మానసపత్రిక సంపాదకులు కత్తి కళ్యాణ్, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 

మల్లవరపు కవుల కుటుంబం ఒకవైపు ప్రాచీన పద్య సంప్రదాయాన్ని, మరోవైపు ఆధునిక వచన కవిత్వాన్ని సమపాళ్లలో పండిస్తూ తెలుగు సాహిత్యానికి అమూల్యమైన సేవలు అందిస్తుంది. పద్య సాహిత్యం ద్వారా జాన్ కవి, రాజేశ్వరరావు గార్లు తమ కావ్యాల్లో సామాజికతను, భావ మాధుర్యాన్ని ఏమాత్రం లోపించనివ్వకుండా అద్భుతమైన పద్య శిల్పాన్ని చెక్కారు. అదే సమయంలో సుధాకరరావు, ప్రభాకరరావు ఢమగార్లు వంటి వారు వచన కవిత్వం ద్వారా సామాన్యుల కన్నీటి గాథలను, మధ్యతరగతి జీవిత పోరాటాలను ఆర్ద్రంగా ఆవిష్కరించారు. ఛందస్సుల చట్రంలో ఇమిడిన పద్యమైనా, స్వేచ్ఛగా సాగే వచన కవితైనా.... అంతర్జాతీయంగా వినిపించగలిగే ఆంగ్ల కవిత్వమైనా మల్లవరపు కవుల కలం నుండి జాలువారిన ప్రతి అక్షరం మానవతా విలువలనే సుసంపన్నం చేసింది. విభిన్న ప్రక్రియల ద్వారా సమాజ హితాన్ని కోరిన వారి సాహితీ ప్రస్థానం భావితరాల కవులకు నిరంతరం ఒక గొప్ప స్ఫూర్తిదాయకం.

కోట్ల వేంకటేశ్వర రెడ్డి, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 


నేను 1998 సంవత్సరంలో జాన్ కవి గారిని కలిసాను. అప్పుడు నాపై రెండు పద్యాలు రాశారు. హైదరాబాద్ చేరే సరికి ఆ పద్యాలున్న నా పర్సు ఎవరో కొట్టేశారు. అప్పుడు పద్యం పోయినందుకు బాధపడ్డాను. ఇప్పుడు ఆయనకు నేనే ఒక పద్యాన్ని సమర్పిస్తున్నాను.

తే.గీ.

జ్ఞాన మూర్తిగ వెలసిన జాన్ కవీంద్ర

శత వసంతములందున శతము జేసి

నిత్య కవితల గీతుల నిత్యగతిని

అంజలిని ఘటియించుచు అభినుతింతు.


-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ 

19.7.2026

(నినాదం దినపత్రిక సాహిత్య అనుబంధం 'సాహితీ లహరి' 19.7.2026 సౌజన్యంతో)

15 జులై, 2026

‘విశ్వర్షి వాసిలి’ - ఒక యౌగిక స్పర్శ ( నినాదం దినపత్రిక సాహిత్య అనుబంధం 'సాహితీ లహరి' 12.7.2026 సౌజన్యంతో .)

 ‘విశ్వర్షి వాసిలి’ - ఒక యౌగిక స్పర్శ


సాహిత్యం  సమాజానికి అద్దం పడుతుందంటారు. దానితో పాటు సాహిత్యం  మనిషి అంతరంగాన్ని, విశ్వ చైతన్యాన్ని ఏకకాలంలో ఆవిష్కరించే అద్భుత సాధనంగా కూడా పనిచేస్తుంది. అలాంటి అక్షర సాధనతో నన్ను అమితంగా ప్రభావితం చేసిన వారిలో ‘విశ్వర్షి’ డా. వాసిలి వసంతకుమార్  గారు ఒకరు. పాత్రికేయుడిగా, శతాధిక గ్రంథకర్తగా, అనువాదకుడిగా, ఐదు దశాబ్దాల యోగా  సాధకుడిగా ఆయనది బహుముఖ ప్రజ్ఞ. ఆయనకు డెబ్బది ఏండ్లు నిండుతున్న సందర్భంగా ఆయన అభిమానులు చేస్తున్న ‘విశ్వర్షి సప్తతి మహోత్సవాలు’ తెలుగు సాహిత్యానికి, భారతీయ విజ్ఞానానికి చేస్తున్న పండుగలా అనిపిస్తుంది. ఈ సందర్భంగా ఆయనతో, ఆయన సాహిత్యంతో, ప్రత్యేకించి ఆయన తాత్త్విక ఆలోచనలతో నాకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకోవాలనుకుంటున్నాను. 


( నినాదం దినపత్రిక సాహిత్య అనుబంధం 'సాహితీ లహరి' 12.7.2026 సౌజన్యంతో .)

 

తొలి పరిచయం: ఉస్మానియా పరిశోధన సంచిక:

డాక్టర్ వాసిలి వసంతకుమార్ గారి అక్షరాలతో నాకు తొలి పరిచయం ఒక  సాహిత్య పరిశోధన  వ్యాస సందర్భంలో జరిగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం వారు ప్రచురించిన ఒక పరిశోధన సంచికలో సుప్రసిద్ధ సాహితీవేత్తలు డా. ఎన్. గోపి, డా. ననుమాసస్వామి గార్లతో కలిసి ఆయన రాసిన ఒక పరిశోధనాత్మక వ్యాసం నేను చదవడం తటస్థించింది. అది పరిశోధన చేసేవారికి ఉపయోగపపడేరచన. 

వాసిలి కుటుంబ నేపథ్యం: 

ఆధ్యాత్మిక యోగి శార్వరి గారి పుత్రుడిగా 1956 జులై 10న పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలంలోని సమిశ్రగూడెంలో జన్మించిన వసంతకుమార్ గారి విద్యాభ్యాసం, అక్షర ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ తొలి స్నాతకోత్తర (ఎం.ఏ) విద్యార్థి ఆయనే కావడం విశేషం. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పీహెచ్‌.డి. పొందిన ఆయన, తన ఇరవయ్యవ ఏటనే పాత్రికేయ రంగంలో కాలమిస్ట్‌గా అడుగుపెట్టారు. ‘అవలితీరం’ పత్రికకు సంపాదకుడిగా పనిచేశారు.

యాభైకి పైగా పుస్తకాలు, వందకు పైగా గ్రంథ సమీక్షలతో ఆయన తెలుగు సాహిత్యానికి చేసిన సేవ అపారం. ఆయన రచించిన 'తెలుగు నవల : అస్తిత్వ సంఘర్షణ', 'తెలుగు పరిశోధన' గ్రంథాలు పరిశోధక విద్యార్థులకు నేటికీ ప్రామాణికాలుగా భావిస్తున్నారు. వీటితో పాటు ఆయన కలం నుండి జాలువారిన 77 సాధనారహస్యాలు, 56 ఆత్మదర్శనాలు, కొత్తకోణంలో గీతారహస్యాలు, ప్రజ్ఞానరహస్యాలు, అతీంద్రియరహస్యాలు, సిగ్గుపడితే సక్సెస్ రాదు, మనకే తెలియని మన రహస్యాలు వంటి అనేక రచనలు ఆయనలోని మనోవిజ్ఞానవేత్తను, దార్శనికుడిని పాఠకులకు పరిచయం చేస్తాయి.


 ‘నేను’ యౌగిక కావ్యం:

వాసిలి వసంతకుమార్ గారి గ్రంథాలలో నన్ను అత్యంత లోతుగా ప్రభావితం చేసింది ఆయన రచించిన ‘నేను’ యౌగిక కావ్యమని చెప్పాను కదా!. ఈ కావ్యం నాలో రేకెత్తించిన ఆలోచనలకు అక్షర రూపమిస్తూ 3,4 వ తేదీల్లో జులై 2020లో పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నిర్వహించిన జాతీయ సదస్సులో   ‘విశ్వర్షి వాసిలి’ రచించిన నేను యౌగిక కావ్యం- సామాజిక జీవన చిత్రణ’’ అనే అంశంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశాను. 

సాధారణంగా సాహిత్యంలో సమాజజీవన చిత్రణ అనేది వివిధ పాత్రలు, సన్నివేశకల్పనలు, వర్ణనల ద్వారా జరుగుతుంది. కానీ, వచన దీర్ఘకావ్యంలో ఒక బలమైన వస్తువుని లేదా ఒక అంత: సూత్రాన్ని లేదా ఒక సిద్ధాంతాన్ని వర్ణిస్తుంటారు. ‘‘నేను’’ యౌగిక కావ్యం ఆధునిక సమాజంలో కొంతమంది ఆలోచనాదృక్పథంగా అభివర్ణించవచ్చు.  ఈ కావ్యంలోని ‘‘నేను’’ వైయక్తికం కాదు; మానవునికి ప్రతీక. మానవ అన్వేషణకు ప్రతీక. మానవ పరిణామానికి ప్రతీక. మానవుడికీ, విశ్వానికీ జరిగే ఆలోచనల సంఘర్షణకు ప్రతీక.  ఈ సందర్భంగా బిగ్ బ్యాంగ్ థియరీ గురించి చెప్పుకోవాలి. ఒక పెద్ద విస్ఫోటన ఫలితంగా విశ్వం ఏర్పడ్డదని చెప్పేదే బిగ్ బ్యాంగ్ థియరీ.  మహా విస్ఫోటన సమయంలో హీలియం సింథసైజేషన్ జరిగి ఉంటుందని పరిశోధకుల అభిప్రాయం. హీలియం (Helium) అనేదొక రసాయన మూలకం. రంగు, రుచి, వాసన లేని, విషపూరితం కాని (non-toxic), తటస్థమైన  ఒకే అణువు కలిగిన రసాయన మూలకంగా చెప్తారు. Hydrogen (ఉదజని) ఒక రసాయన మూలకం. దీన్ని "H" అనే సంకేతముతో సూచిస్తారు. ఉదజని యొక్క అణు సంఖ్య 1. మూలకాల పట్టికలో ఇది మొదటి మూలకం. హైడ్రోజెన్ ని ఆంగ్లంలోని H  అనే అక్షరంతో మూలకాల పట్టికలో మొదటిగా సూచిస్తారు. తర్వాత  2 వదిగా సూచించేది హీలియం (He ). సాధారణోష్ణము, పీడనముల వద్ద ఇది రంగు, వాసన, రుచి లేని, అలోహిత బణు (H2) వాయువు. ఇవన్నీ పై కవితాత్మక పంక్తుల్లో సులభంగా వివరించాడు కవి.ఇలా శాస్త్రీయంగా వివరించాల్సిన అంశాలెన్నో ఈ కవిత్వంలో ఉన్నాయి.  అలాంటి సృష్టి ఆవిర్భావంలో మానవుని ఆవిర్భావం జరిగిన పరిణామాన్ని ఇలా కవిత్వీకరిస్తారు కవి.

‘‘కాలం స్థితీ విడివడని ఏకత

ఆ ఏకత్వంతో ఖగోళ జవజలం

జలధిన ఈదులాడుతూ ఒక జీవం

జీవనానికై కలయ తిరుగుతున్న ప్రాణం

జల జీవనానికి ప్రాణభూతంలా భూగోళం

భూగ్రహానికి శ్రీకరంగా నేను ( పుట: 49)   

            ఇక్కడ మత గ్రంథాల్లో సృష్టి ఆవిర్భావం గురించి కనిపించే వర్ణనల్లా అనిపిస్తాయి. కానీ, తర్వాత ‘‘జలతత్వంతో ముడిపడ్డ మానవతత్త్వం/ మత్స్యావతారంగా తొలి ఆవిష్కరణ’’ అని ప్రతిపాదిస్తారు కవి. ఇక్కడే కవి భారతీయ దార్శనిక ఆలోచనాదృక్పథంతో శాస్త్రీయంగా వివరించే ప్రయత్నం కనిపిస్తుంది. కేవలం దశావతారాల్ని ఉన్నతీకరిస్తూనో, దాన్నే విశదీకరిస్తే ఒక వర్గానికి వెనుకేసుకొచ్చిన వాదనతో నిండిన కావ్యమయ్యేది.

‘‘చిరుజీవం పెరుగుతూ పెనుజీవం కావటం

పెరిగిన కణం మూల కణంగా వెనుతిరగడం

రేపటి కోసం ఒకరిని ఒకరు ఆశ్రయించడం

చివరికి నిష్ర్కమించడం సృష్టి పరిణామం

తిరోగమనం మృతతత్వానికి తొలిపరిణామం

ఇదే నా జనన మరణ ఆవిష్కృత రహస్యం’’ (పుట: 51) ఇక్కడున్నారు కవిగా, దార్శనికుడిగా ‘విశ్వర్షి వాసిలి’. మన కళ్ళముందు కనిపించే వాస్తవాన్ని భ్రమలుగా చెప్పట్లేదు. జనన-మరణాలు మనకి కనిపించే వాస్తవం. కానీ, మనిషి పుట్టింది అందుకేనా? ‘‘తిరోగమనం మృతత్త్వానికి తొలిపరిణామం’’ అనే ప్రతిపాదనతో కావ్యాన్ని పురోగమనం దిశగా పయనించడం ఎలాగో వివరిస్తూ పరిపూర్ణం చేయడం కావ్యపరమార్థం. దీనికి శాస్త్రాన్ని,  ఆధ్యాత్మిక రహస్యాలతో సమన్వయీకరిస్తూ డార్విన్ జీవపరిణామ సిద్ధాంతాన్ని హిందూ పురాణాల్లో దశావతారాలుగా చెప్పేవాటిలో గల అంతరార్థవ్యక్తీకరణగా జీవపరిణామాన్ని కవిత్వీకరిస్తారు కవి.

‘‘నేను కార్య జాతం కాదు...

కర్మజాతం కానే కాదు...’’ (పుట: 52) అని తన శాస్త్రీయమైన అనుభవాన్ని, విశ్వరహస్యశోధన సత్యాన్ని నిజాయితీగా వెల్లడిస్తారు కవి.  మూసి మాస పత్రిక, మార్చి 2021లో  ‘విశ్వర్షి’ వాసిలి నేను దీర్ఘ కావ్యం-సౌందర్య దృక్పథం’ అనే పేరుతో రాసిన నా వ్యాసాన్ని చదివి ఆచార్య కె.కె.రంగనాథాచార్యులుగారు నన్ను మెచ్చుకుంటూ ఫోన్ చేశారు. అదొక మరిచిపోలేని జ్ఞాపకం. 

108 రోజుల అంతర్జాతీయ సదస్సులు:

యోగాలయ రీసెర్చ్ సెంటర్, సికింద్రాబాద్ వారి ఆధ్వర్యంలో ‘విశ్వర్షి వాసలి వసంత కుమార్ గారి అక్షర అక్షర ప్రస్థానం’ పేరుతో  108 రోజుల పాటు అంతర్జాతీయ సదస్సులు జరిగాయి. అదొక ప్రపంచ రికార్డు. వాసిలి వసంత కుమార్ గారు రాసిన వివిధ పుస్తకాలపై జరిగిన అంతర్జాతీయ సదస్సు అది. దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అమెరికా, ఇంగ్లాండ్ తదితర దేశాల నుండి కూడా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల నుండి ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ద్రావిడ విశ్వవిద్యాలయం, మద్రాస్ విశ్వవిద్యాలయం, బెనారస్ కాశీ హిందూ విశ్వవిద్యాలయం ఇలా అనేక విశ్వవిద్యాలయాల నుండి ఆచార్యులు పూర్వాచార్యులు సదస్సులలో పాల్గొని వివిధ అంశాలపై పత్రాలను సమర్పించారు.  భారతీయ తాత్విక దర్శనంలో యోగా విద్యకు విశిష్టమైన స్థానం ఉందని ఈ సమావేశంలో పాల్గొన్న ఆచార్యులు వక్తలు పేర్కొన్నారు. ఆ సదస్సులు విజయవంతంగా పూర్తయిన సందర్భంగా 31.7.2022 వ తేదీన జరిగిన సమాపనోత్సవంలో నేను కూడా  పాల్గొన్నాను. 

అక్షర యోగికి అరుదైన సత్కారాలు:

విశ్వమే తానై, తానై విశ్వమై యోగ దార్శనిక సత్యాన్ని ప్రవచించిన డా. వాసిలి వసంతకుమార్ గారిని, ఆయన చదివిన మద్రాసు విశ్వవిద్యాలయం అక్టోబరు 2022లో 'అక్షరయోగి'పురస్కారంతో సత్కరించడం అత్యంత ముదావహం. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం, మద్రాసు విశ్వవిద్యాలయం మరియు పెనుగొండ ఎస్‌వీకేపీ అండ్‌ డాక్టర్‌ కేఎస్‌ రాజు ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల సంయుక్తంగా ‘విశ్వర్షి వాసిలి వాజ్ఞయ వరివస్య’ అనే అంశంపై అంతర్జాతీయ తెలుగు సదస్సును నిర్వహించడం, ఆయన అక్షర తపస్సుకు దక్కిన గొప్ప గౌరవం.

ఆయన సాహిత్యంపై పలు సందర్భాల్లో సదస్సుల్లోనూ, అంతర్జాల సమావేశాల్లోనూ పాల్గొని మాట్లాడాను. ఆయన రచించిన ‘‘ఏడో ఋతువు’’(2024)  కవితాసంపుటి ఒక కావ్య స్పృహను కలిగిస్తుంది. దీనిలో సుమారు 46 ఖండికలు ఉన్నాయి.  దీనికి ప్రత్యేకించి ముందుమాటలు, ప్రస్తావనలు వంటివేమీ లేకపోవడం ఒక ప్రత్యేకత. కానీ, కవర్ పేజీ వెనుక అట్టపై కవితాత్మకమైన కొన్ని వాక్యాలు, అదీ కవిత్వ రూపంలోనే రాశారు. ఈ కవితా సంపుటిలోని తొలి కవిత శీర్షిక ‘’పదకొండో అవతార మెత్తిన ఏడో ఋతువు’’

‘’అరిషడ్వర్గ దైనికయానానికి

ఆరు ఋతువుల షడ్రసోపేత విందు 

జీవితం జిహ్వాగ్ర పసందు


ప్రకృతి కన్నెర్రతో ఉలిక్కి పడే ప్రవృత్తి 

అష్టవన్నెల కోరచూపుల ఋతు ఆగ్రహంతో

పదకొండో అవతార మెత్తిన ఏడో ఋతువు’’ 

ఈ కవితలోనే ఈ కవితాసంపుటిలో కవి చెప్పదలచుకున్న ‘తత్త్వం’ కొంతవరకూ కనిపిస్తుంది. మన తెలుగు సంవత్సరానికి  ఆరు (6) ఋతువులే. అవి: వసంతం, గ్రీష్మం, వర్ష, శరదృతువు, హేమంత, శిశిర ఋతువులు. కానీ, ఏడవ ఋతువు అంటున్నారు కవి. అదేమిటో ఎక్కడా వాచ్యం చేయలేదు. దీన్ని సూచిస్తూ ‘ప్రకృతి కన్నెర్ర’ అనీ, ‘పదకొండో అవతారం’ అనీ వర్ణించడంలో కొంత అవగాహనకు వచ్చే అవకాశం ఉంది. మనకున్న ఆరు ఋతువుల్లో కూడా ఒక్కోసారి అతివృష్టీ, అనావృష్టిగా జరగవచ్చు. కానీ అవి దీర్ఘకాలంగా కొనసాగవు. సుమారు ఒక సంవత్సర కాలం పాటు ప్రకృతి కన్నెర్ర చేసిన ఒక కాలాన్ని చూసాం. అది కరోనాకాలం. ఆ కాలం మనిషిని రక్తంసిక్తం చేసిన దృశ్యం అంతా తర్వాత కవితలో వర్ణితమైంది. 

‘’పురుషత్వం స్త్రీత్వాన్ని చేరుకునే వలస 

కణమో జీవమో ప్రాణమో ఆత్మనో 

ప్రకృతి గర్భాన్ని చేరుకుంటున్న వలస 

భవిష్య తత్వాన్ని నవమాసాలు మోసిన 

అమ్మతనం నుండి విడివడుతున్న వలస 

పరం నుండి పాంచభౌతికానికి వలస 

ఇహాన్ని వదిలించుకుంటున్న వలస 

పుట్టుకా వొక వలసనే 

చావూ వొక వలసనే 

వలసకాని వరసంటూ వుందా’’ (పుట్టి 81)

మనం సాధారణంగా దశావతారాలను చెప్పుకుంటాం. తల్లి గర్భంలో పడిన క్రోమోజోమ్ (ఒక కోణం) మరొక క్రోమోజోమ్ తో కలిసినప్పటినుండి శిశువు బయటకు వచ్చేవరకు జరిగే వివిధ దశలను కూడా దశావతారాలుగా శాస్త్రీయంగా వివరించనవారున్నారు. విశ్వావిర్భావం నుండి సమస్త జీవుల స్థితిగతులను వివిధ పరిణామాలకు లోనైన సృష్టి స్థితి లయను దశావతారాలుగా వివరించే వాళ్ళూ ఉన్నారు. దుష్టశిక్షణ, శిష్టరక్షణ దశావతారాల్లోని పరమార్థం. 

మరి పదకొండో అవతారం లక్ష్యమేంటి?  

శ్రీమహావిష్ణువు పదకొండవ అవతారంగా ‘మోహిని’ ని చెప్తారు. 

భస్మాసురుడికి శివుడిచ్చిన వరం వల్ల తన ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది. ఆ సందర్భంలోనే ఆవిర్భవించిందే మోహినీ అవతారం. అసురుడైన భస్మాసురుడు మద్యపానం మత్తులో మోహినిని చూసిన మోహంతో తానేమి చేస్తున్నాడో తనకే తెలియకుండా తన శిరస్సుపై తానే చేతిని పెట్టుకుంటాడు. తన చేయి ఎవరి శిరస్సుపై పెడితే అది దహించుకుపోతుంది. ఇక్కడ కవి కూడా పదకొండో అవతారంగా కరోనాను పోల్చారు.

ప్రకృతి సమతుల్యత దెబ్బతింటున్నప్పుడు ప్రకృతే తనకూ తానుగా ఒక్కో అవతారం ఎత్తుతుందేమో!ఇది మాయ కాదు, ప్రకృతి సత్యం!  కరోనాను ప్రకృతి వైపరీత్యమే పదకొండో అవతారంగా చెప్పారా?  ఇలా ఆధునిక సాహిత్యంలో ముఖ్యంగా కవిత్వంలో శాస్త్రీయమైన విషయాల్ని వర్ణించిన ప్రత్యేక కవిగా నిలిచిపోతారు.

ఇప్పుడు ఆయనకు డెబ్బది వసంతాలు నిండుతున్న సందర్భంగా చేస్తున్న ఈ మూడు రోజుల జన్మదినోత్సవం సందర్భంగా ఆయన గురించి ఇలా రాసుకున్నాను.

విశ్వర్షి సప్తతి

ఆయన ఒక యౌగిక విజ్ఞాని
సత్యాన్ని అన్వేషించే
శాస్త్రీయ తాత్వికుడు
పరిమళించే సాహిత్య పుష్పం!

ఆయన ఆలోచన
అనుభవపు అగ్నికుండంలో
కాలిన సత్యపు కణిక,
ఆయన మాట
మనసులను మేల్కొలిపే
మంత్రధ్వని!

వేదాంతపు లోతుల్లోకి వెళ్లి
విజ్ఞానపు శిఖరాలను తాకి,
రెండింటి మధ్య నిర్మితమయ్యే
ఓ విశ్వాసపు వంతెన!

పదానికి ప్రాణం పోసి
ధ్యాన రహస్యాలను
జీవితంగా నిలిపిన ఋషి,
అక్షరాలను ఆత్మవెలుగులుగా చేసి
మనిషిలోని మనిషిని వెతికి చూపే యాత్రికుడు!

డెబ్బై వసంతాల ప్రస్థానంలో
కాలం ఆయన కేశాలను తాకినా,
ఆలోచనలను తాకలేకపోయింది;
వయసు ఆయన దేహానికి చేరినా,
వివేకం యౌవనాభరణమైంది!

ఈ సప్తతి — ‘విశ్వర్షి సప్తతి’
ప్రతి యేటా వచ్చే
జన్మదిన సంబరం కాదు;
ఒక నిరంతర సాధనకు
సమాజం సమర్పించే వందనం!

విశ్వాన్ని ఋషి దృష్టితో దర్శించిన
ఆ విశ్వర్షికి
సాహిత్య హృదయాలు కురిపించే
సహస్ర నమస్సులు! 

భారతీయ సంప్రదాయ విజ్ఞానానికి
ఆయన ఓ ప్రకాశవంతమైన యశశ్శిఖరం!

  • డా.దార్ల వెంకటేశ్వరరావు 8.7.2026