కెరటమై ఎగిసిపడాల్సిందే!
ప్రజాశక్తి సవ్వడి సాహిత్యం, 2.1.2023 సౌజన్యంతో
నువ్వు జారిపడ్డావని భయపడకు
నీ తలకు తగిలిన గాయానికి
స్రవించిన ఆ రక్తం నాదేనని
ఇద్దరి కళ్ళల్లో నుండి వచ్చే ఆ కన్నీళ్ళకూ తెలుసు
ఒకే లయలో కొట్టుకుంటున్న ఆ గుండెకీ తెలుసు
తడబడినా సరిచేసుకుంటున్న చేతులకూ తెలుసు
నువ్వు జారిపడ్డావని భయపడకు
నడవడం మొదలెడితేనే కదా తెలిసేది
నీ మార్గంలో లోయలున్నాయో
నీ పయనంలో శిఖరాలున్నోయో
నువ్వు విజేతవో పరాజితవో తెలిసేది
నిన్ను మళ్ళీ నా చేతుల్లోకి తీసుకుంటాను
నువ్వు పోరాడినంతకాలమూ
నిన్ను మళ్ళీ మళ్ళీ నాచేతుల్లోకి తీసుకుంటాను
నేను జారవిడుకున్న జీవితాన్నీ
నేను పోగొట్టుకోలేక పోరాడిన ఆత్మగౌరవాన్నీ
మళ్ళీ నీకిస్తూ ముద్దులతో అభిషేకిస్తున్నాను
నువ్వు పడినప్పుడల్లా
రెట్టింపు ఉత్సాహంతో పైకి లేవాలి
నిన్ను జాతి పేరుతోనో
కులం, మతం, జెండర్ పేర్లేమైతేనేమి
నీ ఆత్మగౌరవాన్నంతటినీ
ప్రోదు చేసుకొంటూ మళ్ళీ లేవాలి.
పుడుతూనే నేనూ నువ్వూ
మెత్తని పరుపులపై పడలేదు
నిత్యం వేదాశీర్వాదాలు
మంగళ ధ్వనులు వినిపించే
మున్యాశ్రమంలోనూ పడలేదు
ఈ భూమి పై పడగానే పడగలెత్తి బుసకొట్టే
యుద్ధక్షేత్రంలోనే పడ్డామని మరిచిపోకు
ఈ యుద్ధం
ఆ దుమ్మూ, ఈ ధూళీ
వారసత్వంగా మోసుకెళ్ళాలంటుంది
ఈ యుద్ధంలో మాయల్నీ మంత్రాల్నీ
అధికార సమ్మోహాల్నీ ఎరవేస్తుందేమో
మళ్ళీ తుళ్ళిపడిపోతావేమో
మళ్ళీ మళ్ళీ నువ్వు నిలబడ్డ నేలను ముద్దాడు
నువ్వైనా నేనైనా
ఎవరైనా సరే
తలెత్తుకొని నిలబడ్డం కోసం
నిరంతరం యుద్ధం చెయ్యాల్సిందే
అవమానితులెందరో నిన్నే చూస్తున్నారు
అనుమానితులెందరో
నువ్వేంటే నిరూపించమంటున్నారు
అనునిత్యం నిన్నే తలుచుకునే
ఆశావాహులెందరో నువ్వై పోరాడుతున్నారు
నువ్వొంటరివి కాదు
నువ్వే మా సామూహిక స్వప్నానివి
నిన్ను మళ్ళీ నా చేతుల్లోకి తీసుకుంటాను
నువ్వు పోరాడినంతకాలమూ
నిన్ను మళ్ళీ మళ్ళీ నాచేతుల్లోకి తీసుకుంటాను
నేను జారవిడుకున్న జీవితాన్నీ
నేను పోగొట్టుకోలేక పోరాడిన ఆత్మగౌరవాన్నీ
మళ్ళీ నీకిస్తూ ముద్దులతో అభిషేకిస్తున్నాను.
దార్ల వెంకటేశ్వరరావు
ఫోన్: 9182685231
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి