రత్నాకర్ పెనుమాక రచించిన 'గౌతమి నది తీరాన...' కథల సంపుటిపై ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారి వ్యాసం. ప్రజాశక్తి దినపత్రిక సాహిత్య అనుబంధం 20.4.2026 సౌజన్యంతో ...
కోనసీమ సహజత్వాన్ని సజీవం చేసే కథలు
తెలుగు కథా సాహిత్యాన్ని దీప్తిమంతం చేయడం మాత్రమే కాదు, సహజత్వాన్ని మన ముందు నిలిపే సజీవ చిత్రాలు రత్నాకర్ పెనుమాక కథలు. కోస్తాలో, అందులోనూ కోనసీమ సంతకం చేసిన ఈ కథలు చదివిన తర్వాత ఇన్నాళ్లు ఇలాంటి కథల్ని చదవకుండా ఎలా మిస్ అయ్యామని ప్రతి పాఠకుడూ అనుకుంటాడు.
Advertisement
ఇంతకుముందు ఈ తరహా కొన్ని కథలు రాయలసీమ నుంచి బాగా వచ్చాయి. వాటికంటే ముందు ఉత్తరాంధ్ర నుంచి కూడా కొన్ని కథలు వచ్చాయనిపిస్తుంది. వంశీ 'మా పసలపూడి కథలు', దాట్ల దేవదానం రాజు గారి కథలు కూడా తూర్పు గోదావరి జిల్లా కేంద్రంగా రాశారు. అంతకు ముందే ప్రసిద్ధులైన వంగూరి చిట్టెన్ రాజు ఈ ప్రాంతాన్ని అమెరికా దాకా తీసుకెళ్ళారు. ఇలా మరికొంతమంది రాసినా కానీ, ఆ మార్గంలో నడుస్తూనే తన ప్రత్యేకతను నిలుపుకునే కథలుగా రత్నాకర్ గారి కథలు కనిపిస్తున్నాయి.
ఈ కథల్లో సజీవత్వానికి నిదర్శనాలుగా మూడు అంశాలు ప్రాధాన్యాన్ని వహిస్తాయి. ఒక ప్రాంతానికి సంబంధించిన వర్ణనలు, అక్కడ మాట్లాడుకునే సజీవమైన భాష, అక్కడి సంస్కృతి … ఈ మూడు అంశాలు కథల్లో సహజంగా ఒదిగిపోవడం ఎంతో ముఖ్యం. సాధారణంగా ఒక కథ చదివితే ఆ ప్రాంతాన్ని చూడాలనిపించాలి. ఆ ప్రాంతం ప్రత్యేకత ఏదో తెలిసిందనిపించాలి. ఆ కథ మూస పద్ధతిలో కాకుండా ఎంతో భిన్నమైందనిపించాలి. దానిలో చిత్రితమయ్యే సంవేదనలు, జీవన సంఘర్షణలు సార్వకాలికమో, సార్వజనీనమో కావాలి. అది ప్రతిభావంతుడైన రచయితకు మాత్రమే సాధ్యం. అది రత్నాకర్ గారికి సాధ్యమైంది. రత్నాకర్ ప్రతిభావంతుడైన కథా రచయిత అని ఆయన రాసిన ఏ కథను చదివినా తెలుస్తుంది.
ఆంధ్రప్రదేశ్‌లో నేడు వివిధ జిల్లాలుగా మారిన ఒకప్పటి ఉభయ గోదావరి జిల్లాల్లో రికార్డింగ్ డ్యాన్సులు, దానిలో డ్యాన్స్ చేసే వాళ్ళ జీవితాల చుట్టూ అల్లుకున్న కథల్లోని వాస్తవాలు 'సునీల' కథలో రచయిత వర్ణించిన తీరు అద్భుతం. ఆ ప్రాంతానికి చెందిన ఆర్థిక, సాంస్క ృతిక అంశాల్ని చెప్తున్నట్టు ఎక్కడా అనిపించకుండానే, కథ ముగిసేసరికి మనసు కరిగిపోయి, నాలుగు కన్నీటి చుక్కలు రాలి పడ్డాక, మెదడు ఆలోచించడం పెడుతుంది. మనుషుల్ని మనం అర్థం చేసుకునే తీరుకీ, అర్థం చేసుకోవాల్సిన విధానానికీ మధ్య ఒక సమన్వయమేదో అవగాహనకొస్తుంది. సునీల ఒక విటుడ్ని ఆకర్షించి, ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఏమి జరిగిందో తెలియాలంటే ముగింపు చదివి తీరాల్సిందే! డ్యాన్సర్ సునీలలోని మానవత్వం గురజాడ వారి మధురవాణి కంటే మహౌన్నతమైందనిపిస్తుంది. నగముని 'పాలు ఎర్రబడ్డాయి' కవితలో వర్ణించిన మాతృత్వానికి సహృదయ పాఠకుని మనసు చివుక్కుమంటుంది. ఒక ఆర్థిక కోణమే మన మనసుని విలవిలడాడేలా చేస్తుంది. కానీ, ఈ కథలో వీటన్నింటి కంటే సునీల ఉన్నతురాలనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా ఆ ప్రాంతంలోనే పుట్టి, పెరిగిన నాకు తెలిసినంత వరకూ కోనసీమలో ఎంతోమంది చెట్టునీ పుట్టనీ మనుషులు పెనవేసుకుంటారు. ఎంతో అందంగా కట్టుకొనే ఇంటికి చెట్టు అడ్డొచ్చినా చాలామంది దాన్ని కొట్టేయకుండా ఇంటిలో భాగం చేసుకొని కట్టుకొనే పర్యావరణ ప్రేమికులున్నారు. రోడ్ల విస్తరణ పేరుతో చెట్లను నరికేస్తుంటే, ఆ చెట్టుని పట్టుకొని వదలని మనిషిని సలీం 'గుర్రపుడెక్క' నవలలో చెప్తే, ఒక చెట్టుతో తమ జీవితాన్నెలా ముడివేసుకుంటారో 'మా పొలమూర్లో రాయిచెట్టు' కథలో ఇద్దరు మిత్రుల ద్వారా ఈ కథకుడు ఎంతో ఆర్ద్రంగా వర్ణించాడు. చెట్లను నరికేయకుండా, వాటిని పూజించేలా చేయడానికి గ్రామీణులు తమకు తెలిసిన విద్యలనెలా ప్రదర్శిస్తారో కూడా ఈ కథలో నర్మగర్భంగా కథాకథనం చేశాడు రచయిత. జీవితాన్ని పోషించుకోవడం కోసం చేసే రకరకాల పనుల్లో చిలుక జోస్యం కూడా ఒకటి. అయితే, దాన్ని నమ్మని వాళ్ళపై కూడా దాని ప్రభావం ఎలా ఉంటుందో, యాదృచ్ఛికంగా జరిగే సంఘటనలను కూడా తమ అమాయకత్వంతో కొంతమంది వాటినెలా తమ జీవితంతో ముడిపెట్టుకుంటారో ఈ కథ మనకు వివరిస్తుంది. అయితే, ప్రపంచాన్ని కబళించేస్తూ వేయి బాహువులతో వస్తున్న ప్రపంచీకరణను, అభివృద్ధి పేరుతో జరుగుతున్న మారిపోతున్న పట్టణీకరణ, అందమైన, సుందరమైన కోనసీమకు కూడా దూరం కాదనేది వాస్తవ సత్యం. అయితే, దాన్ని సమూలంగా అడ్డుకోలేకపోయినా కొంతలో కొంతైనా ఆపగలిగే ఆలోచనలు చేసేవాళ్ళు కూడా ఉంటారనే ఆశావాహదృక్పథం 'ఈ పొలం అమ్మబడును' కథలో కనిపిస్తుంది. ప్రపంచీకరణ నేపథ్యంలో వస్తున్న కథాసాహిత్యంలోనే భిన్నమైన కథగా దీన్ని చెప్పుకోవచ్చు.
నేను పుట్టి, పెరిగింది ఈ ప్రాంతంలోనే కావడంతో ఈ కథలు చదువుతుంటే నా వాళ్ళంతా నాతో మాట్లాడుతున్నట్లనిపించింది. నాకు తెలిసిన జీవితాల్నే నేను మళ్ళీ చూస్తున్నట్లనిపించింది. నా బాల్యమంతా మళ్ళీ తిరిగొచ్చినట్లనిపించింది. ఆ కాల్వలు, ఆ ఈత కొట్టడాలు, మునిగిపోవడాలు, అప్పుడు జరిగే ప్రమాదాలు… ఆ ప్రాంతంలో ముంజకాయలు, మామిడి తోటలు, ఉప్పూకారం పెట్టుకొని మామిడికాయలు తినడం, ఆ రికార్డింగ్ డ్యాన్సులు.. ఇలా ఒక్కొక్కటీ తెరలు తెరలుగా గుర్తొస్తున్నాయి. ఒక ఆత్మీయమైన స్పర్శ ఏదో తగులుతున్నట్లనిపిస్తుంది. ఇంతకీ రత్నాకర్ పెనుమాక రాసిన ఏ కథల పుస్తకం గురించి చెప్తున్నానో ప్రస్తావించలేదు కదా!
'గౌతమీ నది తీరాన…' పేరుతో రాసిన కథలు చదువుతుంటే నాకు కలిగిన అనుభూతులివి. రత్నాకర్ గారి ఈ పన్నెండు కథలూ నిజంగానే కథా సాహిత్య తీరంలో మెరిసే రత్నాలు. ప్రతి కథా ఇంతకు ముందు వివిధ పత్రికల్లో ప్రచురితమ్వడమే కాదు, ఏదొక బహుమతిని కూడా పొందిందే కావడం విశేషం. కోనసీమ జీవితాన్ని ఇంత సజీవంగా వర్ణించిన కథలు నేను ఇంతకుముందు చదవలేదని ఎందుకంటున్నానంటే, ఈ కథల్లో వాడిన భాష, ఊరి పేర్లు, ఇంటి పేర్లతో సహా ఆయా పాత్రల పేర్లన్నీ వాస్తవాలు. కాకపోతే, ఇతివృత్తం, స్థలాలు, సంఘటనలు, సంభాషణలు రచయిత కళాత్మకంగా సృజనీకరించినవి. చిత్రమేమిటంటే నెరేటర్ వాడే భాష కూడా కోనసీమదే కావడం ఒక ప్రత్యేకతగా చెప్పుకోవాలి. కథలన్నీ వ్యాఖ్యానించాలనున్నా, ఆ పని చేస్తే ఇదో పెద్ద వ్యాసమైపోతుందేమోనని నాకు భయంగా ఉంది. అందుకే కొన్ని కథలను మాత్రమే ప్రస్తావించాను. ఈ కథలన్నింటిలోను కోనసీమ సజీవత్వం తొణికిసలాడుతుంది. ప్రతి కథా ఒక గూగుల్ మ్యాప్‌లా వీధివీధికీ, గ్రామ గ్రామానికీ, పాత్ర పాత్రకీ పాఠకుల మనసులను తీసుకెళ్ళి పోతుంది. ఈ కథల్లో స్టేట్మెంట్స్, మేధో చర్చోపచర్చలు చేయడం కంటే కోనసీమ జీవితాల్లోని సజీవత్వానికే ప్రాధాన్యాన్నిస్తాయి.
కథల్ని రాసేవాళ్ళు మూడు రకాలుగా ముగింపులిస్తుంటారు. సమస్యలకు తనదైన పరిష్కారాన్ని సూచించడం, సూచించకుండా పాఠకులకే వదిలేయడం, ఈ రెండింటినీ మిళితంతో చేయడం అనే పద్ధతుల్లో కొనసాగిస్తుంటారు. ఈ కథకుడు రత్నాకర్ చాలా కథలు ముగింపులు సూచనాత్మకాలు. అలాగే, కథా కథనంలో ఉత్తమ పురుష కథనం, సర్వసాక్షి కథనాలనే సాధారణంగా వాడుకున్నారు. రెండింటిలోనూ ఉత్తమ పురుష కథనం కొంచెం కష్టమైనా అది ఆత్మీయంగా ఉంటుంది. సర్వసాక్షి కథనం పాఠకుడికి వీడియో చూపిస్తున్నట్లు ఉంటుంది. ఈ రెండు కథన పద్ధతులనూ కథకుడు రత్నాకర్ వస్తువుని బట్టి సమర్థవంతంగా ఉపయోగించుకున్నారు. రావిచెట్టుతో ముడిపడిన జీవితాన్ని చెప్పడానికి ఉత్తమ పురుష కథనాన్ని శక్తివంతంగా ఉపయోగించుకున్నా, చివరికెలా ముగిస్తాడనే తెలివైన పాఠకుల్ని కూడా మెప్పించేలా వర్ణించాడు. మొత్తం మీద కథలన్నీ వస్తువైవిధ్యంలోను, అభివ్యక్తిలోను వేటికవే ప్రత్యేకంగా నిలుస్తూనే కోనసీమలో ప్రవహించే గోదావరి పాయల్లోని గౌతమీ నదీతీరంలోని మనుషుల మనస్తత్వాన్ని సజీవంగా ఆవిష్కరించాయి. కోనసీమ మనుషుల్ని కథాసాహిత్యంలో ఎంతో సహజత్వంతో శాశ్వతంగా నిలుపుతున్నందుకు, తెలుగు సాహిత్యానికి తనదైన ముద్రతో మరొక కొత్త కోణాన్ని అందిస్తూ, సాహిత్య విస్తృతికి తోడ్పడుతున్న రత్నాకర్‌ని పాఠకులు ప్రత్యేకంగా అభినందించకుండా ఉండలేరు.
- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
99896 28049

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి