వివక్షను
ఎండగట్టిన తొలి తరం కవి ‘చోడగిరి’
తెలుగులో దళిత సాహిత్యం ప్రధానంగా రెండు దశలలో కొనసాగుతోంది. తొలిదశలో సంస్కరణోద్యమంలో
భాగంగా వచ్చింది. దీనిలో అస్పృశ్యత వల్ల ఎదుర్కొనే సమస్యల చిత్రణ, దళితులు అభ్యున్నతి
కోసం విజ్ఞాపన చేయడం, తమ దళిత నాయకుల స్మరణ, సంప్రదాయ కవులతో పోటీపడి పద్య కవిత్వాన్ని
కూడా రాయడం, సంప్రదాయ సాహితీవేత్తల మన్ననల కోసం ఎదురుచూడ్డం, దళితేతరులు కూడా దళితుల
పట్ల సానుభూతితో రచనలు చేయడం మొదలైన ధోరణిలో కనిపిస్తుంది. రెండవ దశలో ఆత్మగౌరవ ప్రకటన,
ప్రధాన జీవన స్రవంతి కోసం ప్రయత్నం, రాజ్యాధికారానికి సాహిత్యం కూడా ఒక సాధనమని నమ్మడం,
సాహిత్యాన్ని ప్రయోజన సాధనంగా భావించడం, ఒక ధిక్కార స్వరాన్ని
వినిపించడం, ప్రత్యామ్నాయ సాహిత్యాభిలాష, సంస్కృతి నిర్మాణం
మొదలైనవి ప్రధానంగా కనిపిస్తాయి. తొలి తరం దళిత సాహితీవేత్తలలో గుర్రం జాషువా, బోయి
భీమన్న, యస్.టి.జ్ఞానానందకవి మరికొంతమంది తెలిసినంతగా మిగతా కవులు, రచయితలు ఈనాటి యువకవులు,
సాహితీవేత్తలకు పెద్దగా తెలియదని చెప్పొచ్చు. దళితసాహిత్య సౌందర్యంపై డాక్టరేట్ చేసిన
పరిశోధకుడు, కవి, మంచి వక్త డా.కోయి కోటేశ్వరరావు తొలి, మలితరాలను చక్కగా సమన్వయిస్తూ
దళిత సాహిత్యాన్ని ప్రధాన జీవన స్రవంతిలోని పత్రికల ద్వారా సమాజానికి తెలియజేస్తున్నారు.
కొంతమంది పేర్లు విన్నవారికి, వారి గురించి లోతుగా వ్యాసం రూపంలో చదివినప్పుడు, ఇంత
గొప్ప కవి తెలుగులో ఉన్నారా?’ అనిపించేటంతటి ఆశ్చర్యానికి లోనయ్యే అంశాలను తన పరిశోధన
ద్వారా డా.కోయి కోటేశ్వరరావు వెలికితీస్తున్నారు. ఇప్పుడు ఆయన సంపాదకత్వంలో ‘మధురకవి’ చోడగిరి చంద్రరావుగారి సాహిత్యం వెలువడ్డం
తెలుగు సాహిత్యం చేసుకున్న అదృష్టం. ఒకప్పుడు ప్రాచీన సాహిత్యానికి వేటూరి ప్రభాకరశాస్త్రి,
అన్నమయ్య సాహిత్యానికి రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, వేమనకు ఎన్.గోపి
మొదలైనవారు ఎలాగో, ఇప్పుడు తెలుగు దళిత సాహిత్యానికి డా. కోయి
కోటేశ్వరరావు అటువంటి పాత్రను నిర్వహిస్తున్నారు. సంప్రదాయ సాహిత్యంతో పాటు, ఆధునిక
సాహిత్య తత్వాన్ని అవగాహన చేసుకున్న సహృదయ కవి, పండితుడు, విమర్శకుడు డా. కోయి కోటేశ్వరరావు.
ఈ దిశగా జరుగుతున్న కృషిలో ఈ పుస్తకం తొలి అడుగు కావచ్చు.
తొలితరానికి చెందిన దళిత కవి చోడగిరి చంద్రరావు తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతానికి చెందిన కవి. 1932 జూలై 15న కోరుమిల్లి గ్రామంలో జన్మించాడు. తల్లితండ్రులు బుల్లెమాంబ, వెంకటస్వామి. చంద్రరావు కొంతకాలం పాటు రక్షణ శాఖలో సైనికుడిగా పనిచేశాడు. ఆ తరువాత భారతీయ రైల్వే శాఖలో వివిధ హోదాల్లో విధులు నిర్వహించాడు. పద్యకవిత్వాన్ని ఎంతో రసభరితంగా రచించారు. అలాగే గేయకవిత్వాన్ని కూడా సరళ సుందరంగా, మాధుర్యంతో అందించారు. ఈయన తన తొలిరచన శతకంతో ప్రారంభమయ్యింది. ఆయన‘భీమశతకము’ పేరుతో 144 పద్యాలను రచించారు. సాహిత్యంలో కులం వల్ల జరుగుతున్న కష్ట నష్టాలను కూడా దీనిలో ప్రస్తావించారు. ఈ శతకం మరో ప్రత్యేకత ఏమిటంటే, ముందుగా డా.బి.ఆర్. అంబేద్కర్ జీవితాన్ని, ఆయన దళితులకు చేసిన అపూర్వమైన కృషిని చక్కని వచనంలో వివరించడం. ఆ తర్వాత ‘భీమశతకము’ను వర్ణిస్తూ, దళితుల జీవనస్థితిగతులు ఎలా ఉన్నాయో సరళసుందరమైన పద్యాల్లో వర్ణించారు. భీమశతకము రెండవ భాగాన్ని డా.బి.ఆర్. అంబేద్కర్ కి అంకితమిస్తూ..."కవిత నీవు నాకు, కావ్యవస్తువు నీవు
కంఠమందు నీవు కనుల నీవు
నీవులేని నేను నిర్జీవ ప్రతిమనే
ఏమి చెప్పనయ్య భీమరాయ”అని తన
ఆయన పట్ల తనకున్న అభిమానాన్ని వర్ణించారు. ఈ రెండవ భాగంలో 108 పద్యాలు ఉన్నాయి. ఇవన్నీ
దళితుల వేదనను వర్ణించేవి. ఆ సమస్యలను పరిష్కరించడంలో
డా.బి.ఆర్. అంబేద్కర్ అందించిన మార్గాల్ని సందర్భానుసారంగా ప్రస్తావిస్తాడు కవి.
చంద్రరావు గీతాలు (1974) లో ఉగాదిని తనదైన పద్ధతిలో ప్రేమను కురిపించే ఉగాదిగా రావాలని ఆహ్వానిస్తాడు. ‘దివ్యసంస్కృతి’ పేరుతో డా.బి.ఆర్. అంబేద్కర్ పై చక్కని గీతాన్ని రాశారు. దీనిలో ఉన్న 12 గీతాలు పాడుకోవడానికి, కొన్ని పాఠశాల స్థాయిలో పాఠ్యాంశాలుగా పెట్టడానికి అనుకూలమైనవి. సంప్రదాయ సాహిత్య సాన్నిహిత్యంతో ఈ గీతాలు కొనసాగాయి. ‘చంద్రరావు కవిత’ (1977) ఛందోబద్ద పద్యాలతో పాటు, మాత్రా ఛందస్సుతో కూడిన కవిత్వం . దీనికి ఇంద్రకంటి హనుమచ్ఛాస్త్రి పీఠిక రాశారు. భారతదేశంలో ఏర్పడిన అత్యవసర పరిస్థితి, దాని తర్వాత వచ్చినటువంటి సామాజిక స్థితిగతులను కూడా ఈ పుస్తకంలో చంద్రరావు వివరించారు. తన ఊరు గురించి వర్ణిస్తూ చెప్పిన కవిత కోనసీమ అందాలను కనువిందు చేస్తూ శాశ్వేతమైన ఒక చిత్రంలా మనసులో ముద్రితమయ్యేటట్లుగా వర్ణించాడు కవి.
‘‘పచ్చని పూలు విచ్చి నవ్వెను
పచ్చనీ చేలన్నీ నవ్వెను
అచ్చ తెలుగున పాటలను విని
అందమే నవ్వెన్’’ అని వర్ణించిన
వర్ణన ఎంతో భావుకతతో కూడింది. అక్కడ ఉండే లతలు
గురించి వర్ణిస్తూ ‘‘ ఏటి మీదకు వంగి చెవిలో, మాటయేదో మరువవద్దని మాటి మాటికి తలల నూచెడి
మాలతీ లతలు’’ తమ ఊరిలో ప్రవహిస్తున్న గౌతమీగోదావరి
నీటి మీద గాలికి వ్రాలే లతలకు సజీవత్వాన్నిచ్చి, ఒక రహస్యమేదో చెవిలో చెప్తున్నట్లు
ఉత్పేక్షించిన భావుకత కవి ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తుంది.
అప్పటికే ఈ కవి ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అనేక కవితలను చదివి వినిపించేవారు. ‘ఏకలవ్యుడు’ పేరుతో రాసిన రెండు పద్యాలు కవి సంప్రదాయ సాహిత్య దృక్పథాన్ని తెలియజేస్తున్నాయి. ఏకలవ్యుడు బొటనవ్రేలు కోల్పోవడం,, కర్ణుడు కుంతీ కుమారుడే అయినా అతడిని అస్తవిద్యా ప్రదర్శన సమయంలో చేసిన అవమానం వంటివన్నింటినీ అన్యాయంగా భావిస్తాడు కవి. ‘హృదయ వీణ’ (1968) రచనకు గుర్రం జాషువ, వేదుల సత్యనారాయణ శాస్త్రి, తోకల భాస్కరరావు (స్ఫూర్తిశ్రీ), దివాకర్ల వేంకటావధాని, బోయి భీమన్న, గున్నేపల్లి అక్షయలింగకవి, సి.నారాయణరెడ్డి, యస్.టి.జ్ఞానానందకవి వంటి వాళ్ళెంతోమంది తమ ముందుమాటల్ని అందిస్తూ ప్రశంసించారు. ‘‘అన్వేషణ’’ (1981) ఖండకావ్య సంపుటిలో ‘వాల్మీకి’ గురించి వర్ణిస్తూ ఆయన జీవితాన్ని పరిచయం చేస్తారు.‘ అంటరానితనము’’ పేరుతో రాసిన ఖండికలో కులం వల్ల కలిగే నష్టాలను వర్ణిస్తూ .
‘‘దేశప్రగతి సర్వనాశనమ్ము జేసిన
కులవ్యవస్థ గూర్చి కమిలి యేడ్తు
హార్టెటాకు, టీబి అబ్బ! క్యాన్సరుకన్న
అంటరానితనము హానికరము’’ అంటాడు
కవి. దీనిలో కులం వల్ల సమాజంలో వచ్చే కష్టనష్టాలను గుండెపోటు, క్షయ, క్యాన్సరు కంటే
భయంకరమైనడం అనుభవపూర్వకంగా చెప్పినమాటలు. చోడగిరి చంద్రరావుగారు అంబేద్కర్ తత్త్వాన్ని
ప్రచారం చూసి అంబేద్కర్ కవిగా పేరొందినా, వాల్మీక, వ్యాసుడు, బోయి భీమన్న తదితర దళిత
కవులను ప్రశంసించినా, ప్రతి ఒక్కరినీ స్పందింపజేసే కవిత్వాన్ని ఎంతో రచించారు. అంబేద్కర్
భావాల్ని సాహిత్యంలో అందించే ఈ కవిని ‘భీమ్ కవి’ అని ప్రసిద్ధిపొందారు. ఈయన శైలి మృదుమధురమైంది. కోనసీమలో పువ్వుల పరిమళాలను
నింపుకొని ప్రవహించే గౌతమీనది ప్రవాహంలానే
ఆయన కవిత్వం కూడా మనసులను పరిమళింపజేస్తుంది. తెలుగు సాహిత్యంలో ఒక ఉత్తమ కవిని మరలా
ఇలా ఆయన రచనలన్నింటినీ తీసుకొస్తూ ఈ తరానికి కూడా పునః పరిచయం చేయడం ఎంతో గొప్పపని.
ఈయన రచనలను భీమ్ సాహితీ స్రవంతి పక్షాన ఇలా
తీసుకొన్న ప్రచురణ కర్త,చంద్రరావుగారి అల్లుడు, ప్రముఖ అంబేద్కరిస్ట్
నేలపూడి బాలరాజుగార్నీ, దీన్ని సేకరించి ఇలా అన్ని
రచనలు ఒకపుస్తకంగా వెలువడ్డానికి కారణమవుతున్న డా. కోయి కోటేశ్వరరావుగార్ని
ప్రతిఒక్కరూ అభినందించాలి.
- ఆచార్య
దార్ల వెంకటేశ్వరరావు, తెలుగుశాఖ పూర్వ అధ్యక్షుడు, మానవీయ శాస్త్రాల విభాగం, యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్
(సెంట్రల్ యూనివర్సిటి) హైదరాబాదు. ఫోన్: 9989628049
(ఈ వ్యాసాన్ని
ప్రజాశక్తి దినపత్రిక, అక్షరం
సాహిత్యానుబంధం, 11.8.2025)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి