కాళోజీ కవిత్వంలో పాశ్చాత్య కవుల ప్రభావం
ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణ రావు న్యాయవాదిగా పనిచేశారు. అందువల్ల తెలుగుతో పాటు ఆంగ్లం, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ, ఇంగ్లీషు భాషలు తెలుసు. అందువల్ల ఆయన కవిత్వంలో స్వదేశీ, ప్రాంతీయ ఉద్యమాలతో పాటు ప్రపంచ మానవతా దృక్పథం బలంగా ప్రతిఫలిస్తుంది. తెలంగాణ మట్టి వాసనలను అలికిన ఆయన గొంతులో, సమకాలీన సామాజిక మార్పును కాంక్షించే క్రమంలో విశ్వసాహిత్య పరిచయం కూడా ప్రముఖ పాత్ర పోషించింది. ప్రత్యక్షంగా పాశ్చాత్య సాహిత్య పద్ధతులను యథాతథంగా అనుకరించకపోయినా, పీడితుల పక్షాన నిలబడే తిరుగుబాటు తత్వం, స్వేచ్ఛా పిపాస, మానవ హక్కుల పరిరక్షణ వంటి భావనల్లో ఫ్రెంచ్ విప్లవ స్ఫూర్తి, పాశ్చాత్య విప్లవ కవుల ప్రభావం ఆయన కవిత్వంలో అంతర్లీనంగా కనిపిస్తుంది. సామాజిక అసమానతలను ఎదిరించడంలో ఆయన ఎంచుకున్న నిప్పులు చెరిగే ధిక్కార స్వరం ప్రపంచ సాహిత్యాంలోని ఆధునిక ధోరణులతో మేళవిస్తూ, తెలుగు కవిత్వానికి సరికొత్త అర్ధాన్ని తెచ్చిపెట్టింది.
కాళోజీ అనగానే తెలంగాణలో వివిధ సమస్యలపై ఉద్యమాలు చేయడం గురించే ఎక్కువగా మాట్లాడుకుంటాం. కానీ ఆయన తెలంగాణ భాష, సాహిత్యం పట్ల ప్రత్యేకమైన అభిమానంతో తనదైన శైలిలో కవిత్వం రాశారు. ఆయన కవిత్వంలో తెలంగాణ సజీవ భాష, ప్రజల నిత్య వ్యావహారిక భాష ప్రాణం పోసుకున్నాయి. పండితులకే పరిమితమవుతున్న గ్రాంథిక భాషను పక్కనపెట్టి, సామాన్యుడు మాట్లాడుకునే నుడికారాన్ని, పలుకుబడిని తన కవిత్వానికి అద్దారు. 'నా భాష, నా యాస' అంటూ తెలంగాణ మాండలికానికి ఉన్నతమైనస్థాయి సాహిత్య గౌరవాన్ని దక్కించిన తొలితరం కవుల్లో ఆయన అగ్రగణ్యులు. అన్యభాషల వ్యామోహంలో పడి మాతృభాషను విస్మరించే వారిని చూసి "అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా" అని నిలదీసిన అచ్చమైన భాషాభిమాని కాళోజీ. ఆయన కవితలు ‘నాగొడవ’ పేరుతో పుస్తకంగా వచ్చాయి.
కాళోజీ ఫౌండేషన్ వారు 2004లో ‘కాళోజీ నాగొడవ విశిష్ఠకవితలు’ పేరుతో పునర్ముద్రించారు. తొలి ప్రచురణకు 1.1.1953 వ తేదీన కాళోజీ రాసుకున్న పీఠిక ‘ నా గొడవ పడక ముందు’లో కవిత్వం పట్ల తన అభిప్రాయాల్ని ఇలా చెప్పుకున్నారు. ‘’ఆనందమో, ఆవేదనో కలిగినప్పుడు వచ్చిన భావాన్ని వెలిబుచ్చడం జరిగింది. అది యితరులకు కాకున్నా వెలిబుచ్చిన వానికి బాగా నచ్చింది. ఇతరులకు కూడా నచ్చుతే విశేషం. ఈ విశేషధర్మం కైతకే మాత్రం ఆధారం కాదు. దానికి మూలం ప్రాణం కవికి అప్పుడప్పుడు కలిగిన ఆవేదన, ఆనందం మాత్రమే.’’ అని తన కవిత్వానికి గల ప్రేరణను స్పష్టంగా ప్రకటించారు.
కాళోజీ తన కవితా సంపుటికి 'నా గొడవ' అని పేరు పెట్టడం వెనుక అత్యంత లోతైన సామాజిక తాత్వికత దాగి ఉంది. ‘నేను-నా గొడవ’ పేరుతో ఒక కవితలో ఆయన ఇలా అంటాడు.
‘నేనంటే నేడు
నా గొడవంటే నాడు
నిజమో కాదోకల రుజువు
నీవూ నేనూ వాడూ
నేనంటె నేటి మనం
నా గొడవ మనస్థితి వైనం
నేనంటే భారత పౌరుడు
నా గొడవ ఆ, పౌరుని స్థితి
నేనంటే ఒక వోటరు
నా గొడవ వోటేసేవారు
నేనంటే తిరుగుబాటు దారు
నా గొడవ మన తిరుగుబాటు’
దీనిలో "నేను" అంటే కేవలం ఒక వ్యక్తి కాదు, ఈ దేశంలో బతుకుతున్న సజీవ ప్రజుల సామూహిక చైతన్యం; "నా గొడవ" అంటే ఆ ప్రజల దైనందిన వేదన, అణచివేతపై సాగే నిరసన స్వరం. వ్యక్తిగత అస్తిత్వాన్ని భారతీయ పౌరుడిగా, బాధ్యత గల ఓటరుగా విస్తరింపజేస్తూనే, అన్యాయాలను ప్రశ్నించే క్రమంలో అదే పౌరుడిని ఒక తిరుగుబాటుదారుడిగా మార్చారు. ఇక్కడ కాళోజీ తన గొడవను కేవలం తన సొంత ఇబ్బందిగా కాక, దేశంలోని ప్రతి పీడితుడి స్థితిగతులకు, సామూహిక ధిక్కారానికి అద్దం పట్టే ప్రజా చైతన్య ప్రస్థానంగా ఈ కవిత ద్వారా సార్థకం చేసుకున్నారు.
పైకి ఇది ఆయన వ్యక్తిగత సమస్యగా లేదా ఆవేదనగా ధ్వనించినా, వాస్తవానికి ఇందులో ఉన్న 'నేను' సమాజానికి ప్రతీక. లోకంలో ఎక్కడ అన్యాయం జరిగినా, ఎవరికి కష్టం వచ్చినా కాళోజీ తన సొంత బాధగా అల్లాడిపోయేవారు. సమాజంలో జరుగుతున్న అవకతవకలను, దోపిడీని, అణచివేతను చూసి తన మనసు పడుతున్న క్షోభనే ఆయన 'నా గొడవ'గా అభివర్ణించారు. ‘సమాజపు గొడవే తన గొడవ’ అనే ఆలోచనతో ఈ పేరు పెట్టి ఉండొచ్చు.తన కవిత్వం అంతిమ లక్ష్యం ఏమిటో, ఈ 'గొడవ' ఎప్పుడు తీరుతుందో కాళోజీ స్వయంగా ఈ వాక్యాల్లో ప్రకటించారు."అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి,అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి.అన్యాయాన్నెదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు.”
1942 ప్రాంతంలో కాళోజీ ఒక వ్యాసం చదివాడు. అది Gold Smith 'City night Peace’. దీని ప్రేరణతో ‘‘ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు?’ అనే గేయాన్నిలా రాశారు.
‘‘అవనిపై జరిగేటి అవకతవకలు జూచి
ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు?
పరుల కష్టము జూచి కరిగిపోవును గుండె
మాయ మోసము జూచి మండిపోవును
ఒళ్లు పతిత మానవుజూచి
చితికి పోవును మనసు
ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు?
తప్పుదిద్దగలేను దారి జూపగ లేను
తప్పు చేసిన వాని దండింపగా లేను
కష్టపడువారలను కాపాడగా లేను
ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు?
అవకతవకతలు నేను సవరింపలేనపుడు '
పరుల కష్టాలతో పనియేమి మాక'నెడు
అన్యులను గనియైన హాయిగా మనలేను
ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు’’
కాళోజీ ఈ గేయం ఆయనలోని అపారమైన మానవతావాదానికి, సామాజిక బాధ్యతకు సజీవ రూపం. సమాజంలో జరిగే అక్రమాలను, అన్యాయాలను చూసి ఏ మాత్రం తట్టుకోలేకపోయే సున్నితమైన మనస్తత్వం ఆయనది.
"అవనిపై జరిగేటి అవకతవకలు జూచి
ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు?" అని ఆయన తన ఆవేదనను వ్యక్తం చేస్తూనే,
"పరుల కష్టము జూచి కరిగిపోవును గుండె
మాయ మోసము జూచి మండిపోవును ఒళ్లు
పతిత మానవుజూచి చితికి పోవును మనసు" అంటూ సాటి మనుషుల పట్ల తనకు గల గాఢమైన సానుభూతిని చాటుకున్నారు. తోటివారి బాధలను తన సొంత బాధలుగా భావించే ఈ విశాల హృదయమే ఆయనను నిత్యం కవిత్వం వైపు నడిపించింది. అయితే, సమాజంలోని సమస్యలను చూసి కేవలం బాధపడటమే కాకుండా, వాటిని తాను స్వయంగా సరిదిద్దలేకపోతున్నాననే నిస్సహాయత ఆయనను మరింత కుమిలిపోయేలా చేసింది.
"తప్పుదిద్దగలేను దారి జూపగ లేను
తప్పు చేసిన వాని దండింపగా లేను
కష్టపడువారలను కాపాడగా లేను" అంటూ తన అశక్తతను ఆయన ఎంతో నిజాయితీగా వెల్లడించారు. గోల్డ్‌స్మిత్ రాసిన "ది సిటీ నైట్ పీస్" (The City Night Piece) వ్యాసానికి, ప్రజాకవి కాళోజీ నారాయణరావు రాసిన "ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు?" గేయానికి మధ్య అద్భుతమైన భావసారూప్యత ఉంది. లండన్ నగర వీధుల్లో అర్ధరాత్రి పూట అణగారిన వర్గాల దీనావస్థను, నిరాశ్రయుల ఆకలిని, ధనవంతుల అహంకారాన్ని చూసి చలించిపోయిన గోల్డ్‌స్మిత్... తన చుట్టూ సమాజంలో జరిగే అన్యాయాలను, అసమానతలను చూసి తలవంచని కాళోజీకి గొప్ప ప్రేరణగా నిలిచారు. గోల్డ్‌స్మిత్ రచనలోని ఆర్ద్రత, సమాజంలోని వికృత రూపాన్ని చూసి కలిగిన వేదన కాళోజీ కవితలో అణువణువునా ప్రతిఫలించాయి. గోల్డ్‌స్మిత్ తన వ్యాసంలో రాత్రివేళ లండన్ వీధుల్లో ఆకలితో అల్లాడుతున్న నిరాశ్రయులను, మోసపోయిన మహిళలను, సమాజంలో ఎవరూ పట్టించుకోని పేదలను చూసి తన శక్తిహీనతను తలచుకుని బాధపడతారు. సరిగ్గా ఇదే మానసిక స్థితిని కాళోజీ తన గేయంలో “పరుల కష్టము జూచి కరిగిపోవును గుండె, మాయ మోసము జూచి మండిపోవును ఒళ్లు, పతిత మానవుజూచి చితికి పోవును మనసు” అంటూ అద్భుతంగా ఆవిష్కరించారు. సమాజంలో జరిగే అవకతవకలను, అక్రమాలను చూసి తట్టుకోలేకపోయే సున్నితమైన హృదయం, పరుల బాధలను తన సొంత బాధగా భావించే తత్వం ఇద్దరు రచయితలలోనూ సమానంగా కనిపిస్తుంది. గోల్డ్‌స్మిత్ లండన్ వీధుల్లో ఏ దృశ్యాలైతే చూసి వేదన చెందారో, అవే దృశ్యాలు తాను జీవిస్తున్న సమాజంలో కనిపించడం వల్ల అవి కాళోజీని నిత్యం కలచివేసుంటాయి.ఈ కవితలో కాళోజీ వ్యక్తం చేసిన నిస్సహాయత పూర్తిగా గోల్డ్‌స్మిత్ పడిన ఆవేదనను పోలి ఉంటుంది. “తప్పుదిద్దగలేను దారి జూపగ లేను... కష్టపడువారలను కాపాడగా లేను” అంటూ సమాజంలోని అన్యాయాలను ఎత్తిచూపుతూనే, వాటిని మార్చలేకపోతున్నాననే బాధ ఇద్దరిలోనూ స్పష్టంగా గోచరిస్తుంది. గోల్డ్‌స్మిత్ పేదల కష్టాలను తీర్చే శక్తి తనకు లేదని భావించి ఎలా కుమిలిపోయారో, కాళోజీ కూడా తాను వాటిని సవరించలేకపోతున్నానని ఆవేదన చెందారు. అయితే, లోకంలో ఎక్కడో ఏడుపులు వినిపిస్తుంటే తాము మాత్రం ‘పరుల కష్టాలతో పనియేమి మాక’ని మిగతా వారిలా హాయిగా జీవించలేమని ఇద్దరూ నిరూపించారు. సాటి మనుషుల వేదనకు చలించే ఈ మానవతా దృక్పథమే కాళోజీని గోల్డ్‌స్మిత్ రచన వైపు ఆకర్షితులుగా చేసి, ఈ గొప్ప కవితను సృష్టించేలా ప్రేరేపించింది.
‘‘నేను ఒక మనిషిగా ఎందుకు పుట్టాను, సహాయం చేయలేని అభాగ్యుల కష్టాలను ఎందుకు చూడాల్సి వస్తోంది! అయ్యో ఇళ్లు లేని అభాగ్యులారా, ప్రపంచం మిమ్మల్ని నిందిస్తుంది కానీ ఆదరించదు! ధనవంతుల అత్యంత చిన్న చిన్న దురదృష్టాలు, వారి ఊహాజనిత అసౌకర్యాలు కూడా వాక్చాతుర్యంతో పెద్దవి చేసి చూపబడతాయి, మన దృష్టిని, సానుభూతితో కూడిన విచారాన్ని ఆకర్షించడానికి వాటిని ముందుకు తెస్తారు. కానీ పేదవాడు ఎవరికీ పట్టించుకోకుండా ఏడుస్తాడు, ప్రతి చిన్నపాటి అణచివేత చేత వేధించబడుతున్నాడు; ఇతరులకు భద్రతను ఇచ్చే ప్రతి చట్టం వారికి శత్రువుగా మారుతుంది. ’’ (Why, why was I born a man, and yet see the sufferings of wretches I cannot relieve! Poor houseless creatures! the world will give you reproaches, but will not give you relief. The slightest misfortunes of the great, the most imaginary un easinesses of the rich, are aggravated with all the power of eloquence, and held up to engage our attention and sympathetic sorrow. The poor weep unheeded, persecuted by every subordinate species of tyranny; and every law, which gives others security, becomes an enemy to them. ) ఈ భావాల్ని కాళోజీ తన కవితలో కొన్ని భావాలను ఇలా పెట్టారనిపిస్తుంది. .
‘‘ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు?
తప్పుదిద్దగలేను దారి జూపగ లేను
తప్పు చేసిన వాని దండింపగా లేను
కష్టపడువారలను కాపాడగా లేను
ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు?
‘Justice without power is Impotence, Power without Justice is tyranny' అన్న ఇంగ్లీష్ సామెతను దృష్టిలో పెట్టుకొని 1951 వ సంవత్సరంలో ‘వ్యర్థం’ అనే గేయం రాశారు. ఈ సామెతను తెలుగులో "న్యాయం లేని అధికారం బలహీనత, అధికారం లేని న్యాయం నిరంకుశత్వం." అని అనువాదం చేసుకోవచ్చు.
టక్కరితనమెప్పుడుండదు పొంగక?
బిక్కమొగా లెప్పుడుండవు లొంగక?
అనాదిగా రుజువగుచుండ నీ మాట
ఎందులకో కవి వ్రాయుట ఈ పాట?
బలం తోడుగా లేని న్యాయం
కవి కనిపెట్టిన గొప్ప ఉపాయం
'ఊరడి' పోసిన పందిపిల్ల అరుపు
పూజారికి చేయగలదా చెరుపు?
గంటములెన్నియో అరిగెను
కంటకము లేమాత్రము తరిగెను?
మిన్నుముట్ట మున్ను బెట్టిన కేకలు
వక్రతలకు వేయజాలెనా బ్రేకులు?
ఎలుగెత్తి పాడిన కంఠాలు
ఏపాటి తీర్చె లోకుల తంటాలు?
ఇకపై చెల్లవని శ్రీశ్రీ అనినంత
మోసం, దౌర్జన్యం తగ్గినదెంత?
'ఇంకానా! ఇకపై చెల్లవు'
ఏమైనది ఎందుకు చెల్లవు?
'కవులకసలు లేదు బుద్ధి'
అన్నవాడు మహాసుబుద్ధి
వ్యవహారజ్ఞాన శూన్యులు
అలౌకిక శిఖామణులు
ఆకాశహర్మ్య నిర్మాతలు
గగన కుసుమ ఆఘ్రాతలు’’
కాళోజీ రాసిన 'వ్యర్థం' కవితలో ఆయన ప్రయోగించిన పదునైన కవితా పాదాలు ఈ సత్యాన్ని స్పష్టం చేస్తాయి. బలం లేని న్యాయం ఎంత నిస్సహాయంగా ఉంటుందో చెబుతూ, "బలం తోడుగా లేని న్యాయం / కవి కనిపెట్టిన గొప్ప ఉపాయం" అంటూ కవిత్వం కేవలం ఒక భ్రమగా మిగిలిపోతుందనే వాస్తవాన్ని అద్దం పట్టారు. అలాగే, సమాజంలో అన్యాయాలను చూసి కవులు ఎన్నిసార్లు గళం ఎత్తినా దోపిడీ వ్యవస్థ మారడం లేదనే నిజాన్ని వివరిస్తూ, "గంటములెన్నియో అరిగెను
కంటకము లేమాత్రము తరిగెను?" అని ప్రశ్నించారు. శ్రీశ్రీ లాంటి మహాకవులు విప్లవ నినాదాలు ఇచ్చినా మార్పు రాలేదనే సందర్భాన్ని వివరిస్తూ ...
"ఇకపై చెల్లవని శ్రీశ్రీ అనినంత
మోసం, దౌర్జన్యం తగ్గినదెంత?
'ఇంకానా! ఇకపై చెల్లవు'
ఏమైనది ఎందుకు చెల్లవు?" అని నిలదీశారు. కేవలం మాటలకే పరిమితమై, ఆచరణాత్మక శక్తి లేని కవుల వైఖరిని కాళోజీ ఎంతో వ్యంగ్యంగా, ఆత్మవిమర్శనాత్మకంగా ఈ కవితా పాదాల ద్వారా విమర్శించారు. కేవలం కవితలతో సమాజాన్ని మార్చాలనుకోవడం ఎంత నిరర్థకమో చెబుతూ, అది
"‘నేనంటే నేడు
నా గొడవంటే నాడు
నిజమో కాదోకల రుజువు
నీవూ నేనూ వాడూ
నేనంటె నేటి మనం
నా గొడవ మనస్థితి వైనం
నేనంటే భారత పౌరుడు
నా గొడవ ఆ, పౌరుని స్థితి
నేనంటే ఒక వోటరు
నా గొడవ వోటేసేవారు
నేనంటే తిరుగుబాటు దారు
నా గొడవ మన తిరుగుబాటు’
అంటూ సూటిగా ప్రశ్నించారు. వాస్తవ ప్రపంచంతో సంబంధం లేకుండా, కేవలం కల్పనా లోకంలో విహరించే కవులను ఉద్దేశించి...
"కవులకసలు లేదు బుద్ధి
అన్నవాడు మహాసుబుద్ధి
వ్యవహారజ్ఞాన శూన్యులు
అలౌకిక శిఖామణులు
ఆకాశహర్మ్య నిర్మాతలు
గగన కుసుమ ఆఘ్రాతలు" అంటూ తనదైన శైలిలో తీవ్రంగా విమర్శించుకున్నారు. ఈ కవితా పాదాల ద్వారా కేవలం పదాల గారడీతో సరిపెట్టే కవిత్వం కన్నా, బలంతో కూడిన వాస్తవ పోరాటమే సమాజాన్ని మారుస్తుందనే ఆయన ప్రగతిశీల దృక్పథం స్పష్టమవుతుంది.
‘సిరాచుక్క’ పేరుతో రాసిన కవితలోని ‘‘ఒకే ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్ళకు కదలిక ’’ అనే భాగాన్నే చాలామంది కోట్ చేస్తారు. కానీ పూర్తి కవిత ఇలా ఉంటుంది.
A Single drop of Ink that make the millions to think" BYRON.
ఒకే ఒక్క సిరాచుక్క
లక్ష మెదళ్ళకు కదలిక
అన్నాడు బైరన్
నిజమేనా అది?
మరి నేను ఒలక బోసిన
సిరా సీసాల కొద్ది గాదు
పీపాల కొద్ది
ఏ ఒక్క మెదడు కదిలినట్టు లేదు
మొదట నా మెదడులో ఉంటేగా కదలిక
మరోడ్ని కదిలించ’’
ఇది 23-11-1975 వ తేదీ ఎమర్జెన్సీ సందర్భంలో రాసిన కవిత. ప్రఖ్యాత ఆంగ్ల కవి లార్డ్ బైరన్ "ఒకే ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్లను ఆలోచింపజేస్తుంది" అన్న మాటలను ఉటంకిస్తూ ఎమర్జెన్సీ కాలం (1975 నవంబర్ 23) నాటి పరిస్థితుల నేపథ్యంలో కాళోజీ రాసిన ఈ కవిత ఆయన నిష్కల్మషమైన ఆత్మవిమర్శకు, కవితా నిజాతికి అద్దం పడుతుంది. ఇతరులను మేల్కొలపడానికి తాను పీపాల కొద్దీ సిరా ఒలకబోసినా ఎవరి మెదడూ కదలలేదని ఆవేదన చెందుతూనే, ఇతరులలో కదలిక రావాలంటే ముందుగా తన స్వంత మెదడే చైతన్యవంతం కావాలనే కఠిన సత్యాన్ని ఆయన ఈ కవితలో ఆవిష్కరించారు. నియంతృత్వపు చీకట్లను ఎదిరించడంలో కేవలం అక్షరాల ప్రసక్తే కాకుండా, రచయిత అంతర్మథనం, ఆత్మపరిశీలన ఎంత ముఖ్యమో ఈ కవిత ద్వారా కాళోజీ అత్యంత నిజాయితీగా ప్రశ్నించుకున్నారు.
కాళోజీ కవితా శైలి అత్యంత విలక్షణమైనది. ఛందస్సు, వ్యాకరణాల ఇనుప సంకెళ్లకు కట్టుబడకుండా, సూటిగా ఉండే భావ ప్రకటనకే ఆయన పెద్దపీట వేశారు. పదునైన పదాలు, సునిశిత వ్యంగ్యం, సామాజిక ఆగ్రహం ఆయన కవిత్వ లక్షణాలు. సామాన్యుల కన్నీళ్లను, దైనందిన కష్టాలను కవిత్వంగా మలచడంలో ఆయనది అందెవేసిన చేయి. క్లిష్టమైన పదజాలం లేకుండా, పామరులకు సైతం సూటిగా గుండెకు హత్తుకునేలా రాయడం ఆయన ప్రత్యేకత. అందుకే ఆయన రచనలు గ్రంథాలయాలకే పరిమితం కాకుండా ప్రజల నాల్కలపై పాటలై, నినాదాలై మార్మోగాయి. నిత్య అన్వేషిగా, నిర్భయ కవిగా తెలంగాణ సాహిత్య చరిత్రలో తనదైన చెరగని ముద్ర వేశారు. తెలంగాణ సామాజిక చైతన్యానికి, ధిక్కార స్వరానికి ఒక నిలువెత్తు రూపంగా 'ప్రజాకవి' కాళోజీ నారాయణరావు కనిపిస్తారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై, అసమానతలపై తన ఆగ్రహాన్ని 'నా గొడవ' పేరుతో అక్షరబద్ధం చేసి, కలాన్ని ఒక సామాజిక ఆయుధంగా మలిచారు. నిజాం నిరంకుశత్వం మీద, అణచివేత మీద ఆయన ఎక్కుపెట్టిన కవితాస్త్రాలు ప్రజల్లో విప్లవాగ్నిని రగిలించేలా ఉన్నాయి. కాళోజీ కవిత్వం అణగారిన వర్గాల ఆత్మఘోషకు, తెలంగాణ పోరాట ఆకాంక్షలకు సజీవ సాక్ష్యం. ఈ కవితా సంపుటి మొదటి ముద్రణకు 2.1-1-1953 వ తేదీన రాసుకున్న పీఠికలో ఇలా తన కవిత్వ ఆవిర్భావానికి గల కారణాలను చెప్పుకున్నారు.
‘‘ఆనందమో, ఆవేదనో కలిగినప్పుడు వచ్చిన భావాన్ని వెలిబుచ్చడం జరిగింది. అది యితరులకు కాకున్నా వెలిబుచ్చిన వానికి బాగా నచ్చింది. ఇతరులకు కూడా నచ్చుతే విశేషం. ఈ విశేషధర్మం కైతకే మాత్రం ఆధారం కాదు. దానికి మూలం ప్రాణం కవికి అప్పుడప్పుడు కలిగిన ఆవేదన, ఆనందం మాత్రమే.ఎన్నో సంఘటనలు జరుగుతుంటవి మన చుట్టుపట్టు. ఒకే సంఘటన అందరినీ ప్రభావితుల చేయదు, ఒకే రీతిగ అసలే చేయదు.ప్రసార యంత్రం ఒకటే అయినా స్వీకరించే యంత్రాలు తమ తమ శక్తితో దానిని గ్రహిస్తవి. యంత్రాలలో అన్ని విధాల సమాన శక్తిగల పరికరాలను నిర్మించవచ్చు. మానవుల నిర్మాణం అట్లా జరగలేదు. మనకు ఏదైనా "శక్తిని బట్టి సాక్షాత్కారం, భావానుగుణ్యం రూపం”.
దీన్ని బట్టి చూస్తే, ఆయన అంతరంగానికి, సమాజ స్పందనకు మధ్య జరిగే సత్యమైన సంభాషణ. సమాజంలో ఎన్నో సంఘటనలు జరుగుతున్నప్పటికీ, ప్రతి ఒక్కరూ వాటికి ఒకేలా స్పందించలేరని, ఎవరి మనస్తత్వాన్ని బట్టి వారు వాటిని గ్రహిస్తారని కాళోజీ నమ్ముతారు. మానవ మెదడు ఒకేలా ఉండదు కాబట్టి, చూసే దృక్పథం, స్పందించే తీరు మనుషుల అనుభవాలు, మనస్తత్వాల ఆధారంగా మారుతుంటాయి. ఈ సూత్రం ఆధారంగానే, సాటి మనుషుల కష్టాలను, అన్యాయాలను చూసి చలించిపోయే సున్నితమైన హృదయం నుండి ఉద్భవించిన ఆవేదనే ఆయన కవిత్వానికి అసలైన ప్రాణంగా నిలిచింది. పరుల బాధలను తన సొంత బాధగా భావించి అక్షరరూపం ఇవ్వడమే కాళోజీ కవిత్వ లక్ష్యం.
కాళోజీ ఇంగ్లీష్ సాహిత్యంతో పాటు ప్రపంచ సాహిత్య విశేషాలను కూలంకషంగా అధ్యయనం చేసిన విశాల దృక్పథం గల మేధావిగా ఈ కొన్ని అంశాల్ని చూసినా అర్థమవుతుంది.. పాశ్చాత్య కవులను, సాహిత్యాన్ని, దాని అంతరార్థాన్ని ఆయన ఎంతగానో ఆకళింపు చేసుకున్నారని తెలుస్తుంది. ఇతర భాషలలోని ఈ గొప్ప తాత్విక భావాలను, సామాజిక సత్యాలను కేవలం చదివి వదిలేయకుండా, తన మేధస్సును పదునుపెట్టడానికి మాత్రమే కాకుండా, లోకంలోని రుగ్మతలను విశ్లేషించడానికి ఒక కొలబద్ధగా మలచుకున్నారు. ఇలా ప్రపంచ సాహిత్యం ద్వారా తాను గ్రహించిన విశాలమైన సామాజిక స్పృహను, తన చుట్టూ ఉన్న తెలుగు నేల ప్రజల కన్నీళ్లకు, బతుకుపోరాటాలకు అద్దం పట్టే సాహిత్య వస్తువుగా కాళోజీ విజయవంతంగా మార్చారు. లండన్ వీధుల్లోని పేదల దైన్యాన్ని చూసి గోల్డ్‌స్మిత్ ఎలా చలించిపోయారో, అదేవిధంగా తన తెలంగాణ సమాజంలో అణచివేతకు గురవుతున్న నిస్సహాయుల కష్టాలను చూసి ఆయన హృదయం పరితపించింది. పరుల కష్టాలకు కరిగిపోయే సున్నితమైన మనస్తత్వాన్ని, బలం లేని న్యాయం ఎంత నిస్సహాయంగా ఉంటుందనే వాస్తవాన్ని తన కవితల్లో మేళవించారు. విదేశీ సాహిత్య పరిజ్ఞానాన్ని, స్వదేశీ ప్రజల వ్యథలతో అనుసంధానించడం ద్వారానే ఆయన కేవలం ఒక రచయితగా కాకుండా, ప్రజల గొంతుకగా నిలిచారు.అన్యాయాన్ని ఎదిరించడమే పరమావధిగా, పరుల కష్టాలను తన కష్టాలుగా భావిస్తూ 'నా గొడవ' ద్వారా సామాజిక చైతన్యానికి ప్రతీకగా నిలిచారు. అక్షరాన్ని కేవలం అలంకారంగా కాక, పీడితుల పక్షాన ఆయుధంగా మలిచి, తెలుగు సాహిత్యంలో ఎప్పటికీ చెరగని ప్రజాస్వామిక ముద్ర వేసిన అజరామరమైన కవిగా కాళోజీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు.
డా.దార్ల వెంకటేశ్వరరావు 5.9.2026.
(కాళోజీ ప్రత్యేక సంచిక, సాహిత్య లహరి సాహిత్య అనుబంధం, నినాదం దినపత్రిక 9.9.2026 సౌజన్యంతో)





కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి