"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

12 అక్టోబర్, 2023

ఫిరదౌసి’లో కవిత్వ నిర్వచనమే తానైన గుర్రం జాషువ

 వారం వారం జాషువా సాహిత్యం-2


11.10.2023 భూమిపుత్ర దినపత్రిక సౌజన్యంతో


‘ఫిరదౌసి’లో కవిత్వ నిర్వచనమే తానైన  గుర్రం జాషువ


‘కవిని కన్న తల్లి గర్భంబు ధన్యంబు;

కృతిని చెందువాడు మృతుడు గాడు;

పెరుగు తోటకూర, విఖ్యాత పురుషులు;

కవిని వ్యర్థజీవిగా తలంత్రు.’’ కవిని మహోన్నతమైన స్థానంలో ఉంచిన ఈ పద్యం గుర్రం జాషువ ఫిరదౌసి కావ్యంలోనిది.

సాధారణంగా కవి, కవిత్వం, దాని నిర్వచనాలు, లక్షణాలు చెప్పేవారిని లాక్షణికులని అంటారు. అయితే, కవులు కూడా అప్పుడప్పుడు కవిత్వం అంటే ఏమిటి? కవి అంటే ఎవరు?  కవిత్వ ప్రయోజనం ఏమిటి?  కవిత్వం ఎలా రాయాలి? వంటి అనేక విషయాలు కూడా తమ కవిత్వంలోనే చెప్తూ ఉంటారు. మన తెలుగు కవులు నన్నయ నుండి నేటి వరకు కవిత్వం రాసినటువంటి వాళ్ళ గురించి చాలా మంది వ్యాసాలుగా, పుస్తకాలుగా రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. జాషువా చెప్పిన అభిప్రాయాలు కూడా ఇంతకుముందు ఎవరైనా వ్యాసంగా రాశారేమో నాకు తెలియదు. కానీ, ఫిరదౌసి కావ్యంలో ఉన్న వివిధ అంశాలపై నేనే గతంలో ఒక వ్యాసం రాశాను. అప్పుడు  జాషువా కవిత్వం మీద చెప్పిన అభిప్రాయాలపైనే ప్రత్యేకించి ఒక వ్యాసం రాస్తే బాగుంటుందని అనుకున్నాను. అలా కొంత నోట్స్ రాసుకున్నాను. వాటిని చూశాక మళ్ళీ మూలంలో అవి ఏ సందర్భంలో చెప్పారో చెప్పకపోతే అసందర్భంగా ఉంటుందనుకున్నాను. మళ్ళీ ఆయన సాహిత్యాన్ని పరిశీలించాను. కొన్ని పరిశీలనలలో జాషువ నిజంగా ఒక లాక్షణికుడిలా అనిపించాడు. కావ్య శాస్త్రం పై ఆయనకున్న లోతైన పరిశీలన తెలుస్తుంది. కవిగా తన్మయమై అనుభవంతో చెప్పిన అభిప్రాయాలుకా కనిపిస్తాయి.కొన్ని చోట్ల కవిత్వ నిర్వచనమే తానై ప్రతిబింబినట్లుగా అనిపిస్తుంది. భారతీయ ప్రాచీన కావ్య సంప్రదాయాలను ఆయన కొన్నిచోట్ల ఎంత జాగ్రత్తగా అనుసరించాడో మరి కొన్నిచోట్ల వాటికి ప్రత్యామ్నాయంగా తనదైన అభిప్రాయాన్ని చెప్పాడం కూడా కనిపిస్తుంది. అన్ని రచనల్లోని ఈ అంశాన్ని మాత్రమే కేంద్రంగా చేసుకొని పరిశోధన చేసే అవకాశం కూడా ఉంది. ఇక్కడ కూడా అలాగే రాయొచ్చు. పరిశోధనను, విమర్శను చదివే పాఠకులు మాత్రమే ఉండే పత్రికల్లో అలా రాస్తే బాగుంటుంది. ఇక్కడ అన్ని వర్గాలకు చెందిన పాఠకులను దృష్టిలో ఉంచుకొని ఈ వ్యాసాన్ని రాస్తున్నాను. వ్యాసంలో పాఠకులకు విషయ విశ్లేషణతో పాటు ఆసక్తికూడా ప్రధానం.జాషువ వివిధ సందర్బాల్లో కవి, కవిత్వం గురించి చెప్పినా అన్నీ ఒకేచోట అయితే సాధ్యమైనంత సమగ్రంగా చెప్పేవీలుండదు. కనుక, రెండు వ్యాసాలుగా  జాషువ వర్ణించిన ఫిరదౌసి కావ్యంలో కవిహృదయాన్ని విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. 

ఫిరదౌసి కావ్యంలో  జాషువా కవిత్వ విశ్వరూపం:

గుర్రం జాషువ ‘ఫిరదౌసి’ కావ్యాన్ని 1930లో రాశాడు. ఫిరదౌసి కావ్య నామాన్ని జాషువ పిరదౌసి’ అని రాశాడు.  కొంతమంది ‘ఫిరదౌసి’ అని కూడా రాస్తుంటారు. ఫిరదౌసి అనేది పారశీక కవిపేరు. ఫిర్దౌస్ అంటే స్వర్గం అని అర్థం. ఫిరదౌసి అనేది కవి నామమే కనుక, ఫిరదౌసి అని రాసినా తప్పేమీకాదు. గజనీని పరిపాలించిన చక్రవర్తి ‘మహమ్మద్ ఘజనీ’  2.11. 971లో పుట్టి, 30.4.1030 లో మరణించాడు. అరబిక్, సంస్కృత భాషల్లో ప్రావీణ్యం ఉన్నవాడు. మొట్టమొదటిసారిగా ‘సుల్తాన్’ బిరుదు పొందిన చక్రవర్తి. భారతదేశంపై సుమారు పద్దెనిమిది సార్లు దండయాత్రలు చేసి హిందూ దేవాలయాల్ని దోచుకున్న చక్రవర్తిగా ప్రఖ్యాతి పొందాడు.ఫిరదౌసి క్రీ.శ. 940లో పుట్టి, 1020 వరకు జీవించాడు. ఫిరదౌసి అసలు పేరు: మన్సూర్ ఇబిన్ అహ్మద్. ఒక భూస్వామి ఇంట్లోనే పుట్టి పెరిగిన కవి. ఘజనీమహమ్మద్ సుమారు 60సంవత్సరాలు, ఫిరదౌసి సుమారు 70సంవత్సరాలు పైగా బతికారు. ఇరువురూ చారిత్రక పురుషులే. ఒక చారిత్రక సంఘటనను తీసుకొని ఒక రసభరిత కావ్యంగా తీర్చిదిద్దిన ఖండకావ్యం ‘ఫిరదౌసి’ దీన్ని జాషువా1930లో రాశాడనుకున్నాం కదా. జాషువా పుట్టింది 1895. అంటే అప్పటికి 35 యేండ్ల ప్రాయం. గొప్పకావ్యం రాయాలనే ఉబలాటపడే వయస్సు. ఆ వయసులో సహజంగానే పండితుల ప్రశంసలు పొందాలనే కుతూహలం  ఉంటుంది. అందువల్ల తన శక్తియుక్తులన్నీ ఉపయోగించి ఈ కావ్యాన్ని వర్ణించాడు. అప్పుడప్పుడే అభ్యసించిన కావ్యశాస్త్రాంశాల్ని తన కావ్యంలో సమన్వయిస్తూ, కవి గొప్పతనాన్ని, కావ్యౌచిత్యాన్ని ధ్వనిగర్భితంగా చెప్పాలనే ఉత్సాహం కనిపించే గొప్పకావ్యమిది.  ఈ కావ్య వర్ణనలో కొన్ని భారతీయ కావ్యశాస్త్రాంశాలను అనుకూలంగాను, మరికొన్ని ప్రయోగాత్మకంగాను వర్ణించాడుకవి. దీని గురించి ప్రముఖ విమర్శకుడు ఆచార్య వెల్చేరు నారాయణరావుగారు చెప్తూ ‘‘ఫిరదౌసి వంటి కావ్య వస్తువు జాషువాకి ఆకర్షకంగా కనిపించడంలో మనకి ఆశ్చర్యమేమీ లేదు. ఒక్క ఫిరదౌసి కావ్యమే జాషువా కొంత తాదాత్మ్యంతో రాసినట్టు కనిపిస్తుంది. అందులో కొంత ఆత్మాశ్రయం ఉందేమో కూడా. కవిగా తనని ప్రభుత్వంలో ఉన్నవాళ్లు, అధికార వర్గంలో ఉన్నవాళ్లు తగింతగా గుర్తించలేదనే భావం జాషువాకి ఫిరదౌసి మీద సానుభూతికి అవకాశం ఇచ్చి ఉంటుంది. కావ్యవస్తువులో పూర్తిగా లీనమైపోయి రాసిన కథాకావ్యమిది.’’ (ఈమాట, జనవరి, 2021) అన్నారు. ‘ఫిరదౌసి ననుసరించి నార్ల చిరంజీవి భాగ్యనగరం నాటకం, కట్టమంచి రామలింగారెడ్డి ముసలమ్మ మరణం కావ్యం, విద్వాన్ విశ్వం పెన్నేటి పాట, డా. సినారె కర్పూర వసంత రాయలు రాయడం జాషువా విజయాన్ని సూచిస్తుంద’ని డా.ఏనుగు నరసింహారెడ్డి (సృజననేడు, 8.4.2021)చెప్పారు.


   ఫిరదౌసి కావ్యంగా రాకముందు కొన్ని పద్యాలు “భారతి” లోను కొన్ని “ఆంధ్రపత్రిక”లోను ప్రచురితం అయ్యాయి. దీన్ని కొన్ని ప్రచురణలలో మూడు ఆశ్వాసాలుగాను, మరికొన్ని ప్రచురణలలో నాల్గు ఆశ్వాసాలుగాను విభజించడం కనిపిస్తుంది. తొలిప్రచురణను  సింగరాజు లక్ష్మీనారాయణగారికి అంకితం చేశాడు. ఈ కావ్యాన్ని అంతటినీ సింగరాజు మల్లపరాజుగారు విని తండ్రి లక్ష్మీనారాయణగారికి అంకితమివ్వమని చెప్పారని జాషువ స్వయంగా రాశారని మనసు ఫౌండేషన్ వారి ముద్రణలో కనిపిస్తుంది. కానీ, దీని తృతీయ ముద్రణను మనసు ఫౌండేషన్ కంటే ముందే వేసిన ప్రతిలో కూడా ‘‘నా ఖండకావ్యాల్ని రెండు భాగాలుగా ముద్రించడానికి ద్రవ్య సహాయం చేసి, తమ మాతాపితలకు  అంకితమిప్పించిన ఏకాదండయ్య పంతులుగార్కి ధన్యవాదాలు’’ అని తెలిపాడు జాషువ. పద్యాలు మాత్రం రెండు ప్రచురణల్లోను ఒకేరకంగా ఉన్నాయి. ఈ పద్యాల్లోని భావాల్ని పరిశీలిస్తే సింగరాజు మల్లపరాజు కొడుకు లక్ష్మీనారాయణ, ఆయన కొడుకు పేరు కూడా మల్లపరాజు కావడం విశేషం. కాబట్టి ఫిరదౌసి కావ్యాన్ని గుర్రం జాషువ  సింగరాజు వంశానికి  అంటే మాతాపితలకు అంకితం చేశాడు. ఇక కావ్యేతివృత్తానికి వద్దాం. 

ఫిరదౌసి ‘షానామా’  రాజచరిత్రతో కూడిన కావ్యాన్ని రాయడానికి గత చరిత్రను తవ్వాడో లేదో గానీ, సుమారు  వెయ్యి సంవత్సరాల తర్వాత ఆ చరిత్రను ‘ఫిరదౌసి’ కావ్యాన్ని ఖండకావ్యంగా  జాషువా  వర్ణించాడానికి మాత్రం ఆ పని చేసే ఉంటాడు. వస్తువైక్యతతో రసభరితంగా రాసే చిన్ని కావ్యాన్ని ఖండకావ్యం అంటారని విశ్వనాథుడు తన ‘సాహిత్య దర్పణం’  (‘‘ఖండకావ్యం భవేత్కావ్యస్త్వైకదేశానుచారిచ’’) లో చెప్పాడు. సాధారణంగా మహాకావ్యంలోని ఏదైనా ఒక రసవద్ఘట్టాన్ని తీసుకొని రాస్తే దాన్ని ఖండకావ్యం అంటారని విశ్వనాథ సత్యనారాయణ (ఆంధ్ర వార పత్రిక, జనవరి, 1938) వివరించారు.

ఫిరదౌసి కావ్య కథాసారాంశం:

 ఫిరదౌసి ఒక కవి పేరు. కవిని కథానాయకుడిగా చేసి వర్ణించని కావ్యం ‘ఫిరదౌసి’  గజనీమహమ్మద్ తన వంశ చరిత్రను కావ్యం రాయించుకోవాలనుకుంటాడు. పారశీక కవులలో దాన్ని రసభరితంగా, సమర్ధవంతంగా రాయగల కవి ఫిరదౌసి అని తెలుసుకుంటాడు. ఫిరదౌసిని తన ఆస్థానానికి రప్పించుకొని కమ్మని కావ్యాన్ని రాయమంటాడు. ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క బంగారు నాణాన్ని(దీనారం) ఇస్తానని వాగ్దానం చేస్తాడు. ఫిరదౌసి ముప్పయ్యేళ్లు కష్టపడి సుమారు అరవై వేల పద్యాల్లో ‘షాహనామా’ పేరుతో కావ్యాన్ని వర్ణిస్తాడు. దాన్నే వ్యవహారంలో ‘షానామా’ అని పిలుస్తారు. ఆ కావ్యాన్ని విన్న తర్వాత రాజు తన ఆస్థానంలో గల కవుల అభిప్రాయాలను తెలుసుకుంటాడు. కొంతమంది చాలాబాగుందనీ, మరికొంతమంది ఇంకా బాగారాయవచ్చుననీ, మరికొంతమంది బాగాలేదనీ చెప్తారు. ఆ మాటలు విని బంగారు నాణాలకు బదులు వెండి నాణాలిస్తానంటాడు. రాజు మాట తప్పినందుకు కవి ఆ నాణాల్ని తిరస్కరిస్తాడు.అంతే కాకుండా రాజుని నిందిస్తూ కొన్ని పద్యాల్ని రాసి పంపిస్తాడు. ఆ పద్యాల్ని విన్న రాజు కవిని పట్టి చంపమని ఆజ్ఞాపిస్తాడు. ఫిరదౌసి ప్రాణభయంతో గజనీని వదిలి ‘తూసు’ పట్టణానికి కుటుంబ సమేతంగా పారిపోతాడు. కొన్నాళ్ళకు సామంతరాజులు, కొంతమంది ఉత్తమ కవులు ఫిరదౌసి కవిత్వం గొప్పతనాన్ని రాజుకి వివరిస్తారు. ఆ మాటలు విని గజనీమహమ్మదు మనసు మారుతుంది. ఎలాగోలా కవి ఋణాన్ని తీర్చుకోవాలనుకుంటాడు. పదివేల బంగారు నాణాల్ని కవికి ఇవ్వమని భటుల చేత పంపిస్తాడు. కానీ, అప్పటికే కవి ఫిరదౌసి చనిపోతాడు. ఆ నాణాల్ని కవిగారి కూతురుకివ్వబోతారు. తన తండ్రిని క్షోభకు గురిచేసిన ఆ సొమ్ము తనకు వద్దని వాటిని తిరస్కరిస్తుంది.ఈ వార్త విని రాజు తన తప్పుకి విచారించి, ఆ ధనంతో తూసు పట్టణంలో ఒక సత్రాన్ని కట్టిస్తాడు. నేటికీ ఆ గుర్తులు కనిపిస్తాయి. కానీ, అందులో ఒకరికి కీర్తి, మరొకరికి అపకీర్తి కనిపిస్తాయి.కవిగానీ, రాజు గానీ ఇద్దరూ భౌతికంగా లేరు. శాశ్వతంగా నిలిచిపోయింది మాత్రం సత్యం ఒక్కటే.


కవిత్వమైన ప్రతిబింబించిన జాషువ:

“మంగళాదీని, మంగళ మధ్యాని, మంగళాన్తాని” అని భారతీయ కావ్య సంప్రదాయంతో పద్య కావ్యాల్ని ప్రారంభిస్తారు. కానీ జాషువా ఈ సంప్రదాయాన్ని పాటించలేదు. 

మును 

గజనీమహమ్మదుఁడభూత పరాక్రమశాలి,

 వీరవాహినుల బలంబుతో 

బదియునెన్మిది మాఱులు కత్తిదూసి

చిక్కని రుధిరంబులో 

భరతఖండము నార్ద్ర మొనర్చి

 సోమనాధుని పెకలించి

కైకొని యెతొమ్మిది వన్నెల రత్నరాసులన్’’  అని గజినీ మహమ్మద్ సుమారు 18 సార్లు భారతదేశంపై దండయాత్ర చేసి భారత దేశంలోని  ఎంతో  సంపదను  తమ దేశానిదోచుకొనిపోయిన చక్రవర్తిగా తొలిపద్యాన్ని వర్ణించాడు. భారతదేశంలోని సంపదను ఎలా దోచుకొనిపోయాడో ఇలా వర్ణిస్తాడు.

బంగారు నాణెముల్ బస్తాల కెత్తించి

 మదపుటేన్గుల మీద బదిలపరచి

 లేతపచ్చల నేరి గోతాల కుట్టించి

 లొట్టి పిట్టలమీద దిట్టపఱచి

 కురువిందమణులను కుంచాల కొలిపించి

 పరువు డెద్దులబండ్లపై నమర్చి

 మొలక వజ్రముల జాలెల పోసి కూర్పించి

 గుఱ్రాల మూపుల గుస్తరించి

పదియు నెనిమిది విజయరంభల వరించి

గాంగలజలమున నెత్తుటికత్తి గడగి

సర్వము హరించి హిందూదేశంబు విడచి

గజనీమామూదు గజనీకి కదలిపోయె


అటువంటి చక్రవర్తి తన యుద్ధ విజయాలను చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోవాలనే ఉద్దేశంతో పారశీక కవులలో ముఖ్యమైన వారందరినీ పిలిచి తన చరిత్రను వర్ణించి రాయమంటాడు. ఆ సందర్భంలోనే చక్రవర్తి మాటలుగా కవి గొప్పతనాన్ని అనేక పార్శ్వాలలో జాషువా వర్ణించాడు. 

'ఓ కవివర్య!

నీసుకవితోజ్జ్వలవాఙ్మయ

పుణ్యభూమిలో 

నాకుకృతిప్రధానసదనంబు 

రచింపుము శాశ్వతంబుగన్ 

మాకులభూషణంబులగు 

మానవనాథుల కావ్యదేహ 

దివ్యాకృతులంబొనర్పుము

చిరాయురుపేతులచేయుమిద్ధరన్'' 

కవికి కవిత్వమనే ఒక పుణ్యభూమిని సృష్టించగల ఉంచుతాడు. ఆ పుణ్యభూమి కవి భావుకతతో ఉజ్జ్వలంగా వెలుగొందుతూ ఉంటుంది. ఆ వెలుగులలో తన వంశానికి చెందిన వారికి చూడాలనుకుంటున్నాడు పారశీక కవి. అలా ఆ పారశీకరణలో గొప్పవాడైన పిరదోసి తన కావ్య చరిత్రను వర్ణించినట్లైతే అది శాశ్వతమైనటువంటి కీర్తి అనే వెలుగులతో శాశ్వతంగా శోభిల్లుతుందని ఆశిస్తున్నాడు కవి చక్రవర్తి. ఇక్కడ చక్రవర్తి ఆశించాడో లేదో తెలియదు గానీ ,గుర్రం జాషువా కవి  భావుకతలోని వైశిష్ట్యాన్ని వర్ణించాడు. ఆ భావుకత శాశ్వతమైనటువంటి రూపాలను ఆవిష్కరించి శాశ్వతంగా నిలిపేలా చేస్తుంది. అది కవికి ఉన్న గొప్ప భావుకతాసామర్థ్యం అని చాటి చెబుతున్నాడు. ఆ సందర్భంగానే కవిని కన్న తల్లి గర్భం ధన్య మని, ఆ కవిత్వాన్ని అంకితం తీసుకున్న కృతికర్త కూడా శాశ్వతంగా కీర్తి ప్రతిష్టలతో వెలుగొందుతాడని చెప్తాడు. 

భారతీయ కావ్య సంప్రదాయంలో... 

''అపారే కావ్య సంసారే  కవిరేవ ప్రజాపతిః

యథాస్మై రోచతే విశ్వంతదేవ పరివర్తతే'' అని కవిని అపరబ్రహ్మగా  పోలుస్తాడు ఆనందవర్థనుడు. ఇంచుమించు ఈ భావాన్నే జాషువా కూడా ఇక్కడ తీసుకున్నప్పటికీ, బ్రహ్మదేవుడుకి తన చేతిలో స్వచ్ఛతకు ప్రతీకయైన తామర పువ్వు ఉంటుంది. అలాగే కవి చేతిలో కలం ఉంటుందట. ఒకరేమో ఎంతో నైపుణ్యంతో ఈ ప్రపంచాన్ని సృష్టిస్తే, మరొకరేమో తన భావుకత్వ ప్రపంచాన్ని ఎంతో అద్భుతంగా తన కలంతో సృష్టించగలుగుతాడట. ఇక్కడ వరకు అయితే  సంప్రదాయ శ్లోకాన్ని తెలుగులో  అనువదించాడ నుకోవచ్చు. కానీ, కవికి ఈశ్వరత్వం ఆపాదించాడు జాషువ. ఆ భగవత్వత్వం వలన మాత్రమే కవి పూజనీయుడయ్యాడని కవిలోని స్వచ్ఛతకు పతాక సన్నివేశంగా కవి గొప్పతనాన్ని వర్ణించాడు. అక్కడితో కూడా తృప్తి చెందలేదు. కవి గొప్పతనాన్ని భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలుగా కాలచక్రాన్ని తన చేతితో తిప్పగలిగిన గొప్పవాడు కవి మాత్రమే. దాన్నిలా వర్ణిస్తూ…

''క్షణము గడచిన దాని వెన్కకు మఱల్ప 

సాధ్యమే మానవున కిలాచక్రమందు?

దాటిపోయిన యుగములనాటి చరిత 

మరల పుట్టింప కవియ సమర్థు డగును'' అని కవి గతాన్ని వర్తమానంతో ముడివేయగల సామర్థ్యం కలిగినవాడు అంటాడు.

నిజమైన కవిత్వం ఒక అద్భుతమైన ఆవేశంతో వస్తుందని చెబుతూ …

''మానవేంద్రుని సత్యవాగ్దానమునకు 

హృదయగోచర మగుచు వర్ణింప రాని

యద్భుతావేశ మంగంబు నాక్రమించె 

స్వాంతమున తోచె నూత్న నిసర్గకవిత'' అంటాడు.

కవిత్వం రాయడం అంటే కేవలం భావుకత ఉన్నంత మాత్రాన సరిపోదు. సత్యావిష్కరణకు కావలసిన సాధనాలు కొన్ని భౌతికంగా కూడా స్వీకరించవలసి ఉంటుంది. సుల్తాన్ మహమ్మద్ చరిత్ర రాయడానికి ఆ సాహిత్య సంప్రదాయంలో ఉపయోగించే పలుకుబడులు, జాతీయాలు తీసుకోవాలి. వాటికి సాహిత్య సుగంధం అద్దాలి. అంటే కావ్యానుగుణంగా కవిత్వాన్ని వర్ణించాలి. వాచ్యార్థం, వ్యంగ్యార్థం సందర్భోచితంగా ఉన్నప్పుడు మాత్రమే రసికుడు ఆ కావ్యాన్ని ఆస్వాదించగలుగుతాడు. అందుకనే ఫిరదౌసి పారసీక గ్రంథాలను అధ్యయనం చేశాడట. దానిలోని తీయనైన పదాలను ఏరుకున్నాడట. అంతే కాదు, కావ్యం రసభరితంగా ఉండాలి అంటే పాత్రనుగుణంగా, శబ్దానుగుణంగా శబ్దాలను, అలంకారాలను, శబ్దాలను, ఛందస్సుని  ప్రయోగించాలి. కవిత్వం రాయడానికి ఉద్యుక్తుడైన కవి ఆవేశం ఎలా ఉంటుందో ఒక అద్భుతమైన పద్యంలో వర్ణించాడు జాషువ. 

వసుధ శాసింపఁగల సార్వభౌముడగును 

ధీరుడగు, భిక్షకుండగు, దీనుడగును 

దుఃఖితుం డగు నిత్యసంతోషి యగును 

సత్కవి ధరింపరాని వేషములుఁ గలవె?

ఒక కావ్యంలో ఉండే పాత్రలన్నింటిలోనూ తానై ఉంటాడు. కానీ, తనదైన ఒక పాత్రలో కూడా ఉంటాడు. అది కవి వర్ణంలోని గొప్పతనం. వసుధ శాసింపఁగల సార్వభౌముడగును అనే మాటల్ని చదివేటప్పుడు ఆంగ్ల కవి పి.బి. షెల్లీ  ‘ది డిఫెన్స్ ఆఫ్ పోయెట్రీ’ (1821)లో   ‘పోయిట్స్ ఆర్ ది అన్ ఎక్నాల్డెడ్ లెజిస్లేటర్స్ ఆఫ్ ది వరల్డ్’  అన్న మాటలు మనకు గుర్తుకొస్తాయి. కవులు కూడా శాసనకర్తలు లాంటి వారే, కానీ, వాళ్ళు ప్రత్యేకంగా అలా గుర్తింపు పొందకపోవచ్చు. ఎందుకంటే తన కావ్య ప్రపంచానికి తానే శాసనకర్త. తన ఇష్టానుసారంగానే ఆ కావ్యం నడుస్తుంది. ఇక్కడ కవి జాషువా కవి దేన్నైనా వర్ణించేటప్పుడు దాన్ని తనలో జీర్ణింపజేసుకోవాలనీ, అప్పుడు మాత్రమే ఆ రచన మృదుమధురంగా వస్తుందనే భావం కనిపిస్తుంది. అయితే, అలా తన్మయీభావన ఎంత ముఖ్యమో ప్రతిభకూడా అంతే ముఖ్యం. అప్పుడు మాత్రమే భావనాసామర్థ్యం, వర్ణనా సామర్థ్యం, పాత్రచిత్రణ, సమయోచిత శబ్దప్రయోగం సాధ్యం. అది జాషువాలో పరిపూర్ణంగా కనిపిస్తుంది. 

ఫిరదౌసి కావ్యంలో కవి, కవిత్వం, జాషువ అనుభవైక కవిత్వాన్ని మరలా వచ్చేవారం మరికొంత చూద్దాం. 

(సశేషం)

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

తెలుగుశాఖ, అధ్యక్షులు,

 స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్,

యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్-500 046


కామెంట్‌లు లేవు: