‘‘ఆత్మకథ రాస్తున్నానంటే నవ్విన వాళ్ళు ఉన్నారు’’
ఆత్మకథలపై ఆచార్య దార్ల
ప్రత్యేక ఇంటర్వ్యూ
భూమిపుత్ర దినపత్రిక, సంపుటి:04, సంచిక:295, 29.1.2023 సౌజన్యంతో
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు తన ఆత్మకథ నెమలి
కన్నులు 25 భాగాలు పూర్తి చేసిన సందర్భంగా భూమి పుత్ర దినపత్రిక
జరిపిన ఇంటర్వ్యూ…
ప్రశ్న: నమస్కారం. మీరు మీ ఆత్మకథ
25 భాగాలు పూర్తి చేసిన సందర్భంగా శుభాకాంక్షలు. ఈ ఆత్మకథ రాస్తున్నప్పుడు దాన్ని మరలా
భూమిపుత్ర దినపత్రికలో చదువుతున్నప్పుడు మీరు పొందిన అనుభవాలు మాతో పంచుకోగలరా?
ముందుగా మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ముందుగా
మీకే ఎందుకు చెప్తున్నానంటే, నేను నా ఆత్మకథను
25 భాగాలు పూర్తి చేయడానికి ప్రధాన కారకులు మీరు.
దీన్ని వారం వారం ప్రచురించడానికి మీరు తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ నాకు తెలుసు. ప్రతి
వారం రావాలని, ఏవారంలోను దాన్ని మిస్ చేయకుండా వేద్దామని ఆత్రుతతో నాకు మీరు రెండు
రోజులు ముందు నుండే వచ్చేవారం భాగం పంపించండి అని అడిగేవారు.
ఒక్కోసారి మంగళవారం రాత్రి 9 గంటల వరకు కూడా
పంపించలేకపోయినా మీరు నాకోసం నిరీక్షించి నా ఆత్మకథను రాయించి, బుధవారం ఉదయమే అందరూ
చదువుకొనేలా ప్రచురించారు.
అయినా,
నేను కొన్ని పనులు ఒత్తిడితో సతమతమవ్వడం
వల్ల ఒకటి, రెండు వారాల పాటు రాయలేకపోయాను.
ఇలా, నా బాల్యానికి సంబంధించిన 25 భాగాలు ఆత్మకథగా రాయగలిగానంటే అది మీ ప్రోత్సాహమే. అందుకనే ముందుగా మీకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఆత్మకథ రాస్తున్నప్పుడు, దాన్ని ధారావాహికంగా వస్తున్నప్పుడు నాకు చాలా అనుభవాలు ఉన్నాయి. రచనకు సంబంధించిన
అనుభవాలతో పాటు, మనం అనుకున్న జీవితాన్ని రచనగా తీర్చిదిద్దే క్రమంలో ఎదుర్కొనే సంఘర్షణలు
ఉన్నాయి.
అయినా
ఎప్పటికప్పుడు రాయడం వలన దీన్నొక ఛాలెంజ్ గా తీసుకోవాల్సి వచ్చిందని మాత్రం చెప్తున్నాను.
ఆత్మకథను చదువుతున్నటువంటి వాళ్ళు కొంతమంది
'దీన్ని ముందే రాసి ఉంటారు కదా. నాకు దాన్ని పంపించండి. పుస్తకంగా వస్తే దాన్ని పంపించండి'
అని కూడా అడిగేవారు. వాళ్ళు ఏ భాగాన్ని ఆ భాగమే అప్పటికప్పుడు రాస్తున్నానంటే నమ్మనట్లుగా
మొహం పెట్టేవారు.
ప్రశ్న: ఆత్మకథలు ఎందుకు చదవాలి
? మీ ఆత్మకథను ఇతరులు ఎందుకు చదవాలి?
సాధారణంగానే ప్రతి ఒక్కరికీ తన జీవితం తనకు తెలుసనుకుంటారు. కానీ, ఇతరుల సంతోషానికి గాని, దుఃఖానికి గాని కారణమైనటువంటి
ఆ వ్యక్తిగతమైన , ఆ ఆంతరంగిక మైన విషయాలను తెలుసుకోవాలని చాలామంది ఉత్సాహపడుతుంటారు.
అలా తెలుసుకునేటప్పుడు కొన్ని మంచి విషయాలు, తనకు నచ్చిన విషయాలు వాళ్లకి స్ఫూర్తినిస్తాయి.
కొన్ని విషయాలు చదివిన తర్వాత, ఆ వైఫల్యాలకు కారణభూతమైన ఆ లోపాలనిపించే విషయాలు జీవితంలో తనకి ఉండకూడదని , వీటన్నింటినీ తన జీవితానికి
కొన్ని పాఠాల్ని నేర్పుతాయి. ఆ విషయాలు ప్రత్యక్షంగా
విన్నప్పుడు గానీ, ఎవరైనా చెబుతున్నప్పుడు గానీ విన్నా వినకపోయినా ఆవిషయాలకు సాహితీ పరిమళంతో రాస్తే , వాటిని చదివేటప్పుడు సాహిత్యానికి ఉన్న
పరమ ప్రయోజనమైన మానసిక పరివర్తన కలుగుతుంది.
అందుకని ఆత్మకథను కథలను చదవాలి. నా జీవితంలో కూడా అటువంటి విషయాలు ఉన్నాయి. అవి ఎంతో
వైవిధ్యంతో కూడినవని నమ్ముతున్నాను. కాబట్టి నా ఆత్మకథను ఇతరులు చదవాలనుకుంటారని భావిస్తున్నాన్నాను.
ప్రశ్న: మీకు
మీ ఆత్మకథ రాయాలనే ఆలోచనకు ముఖ్యమైన కారణం ఏమిటి?
నేను ప్రాథమికంగా ఒక విశ్వవిద్యాలయంలో నిత్యం పాఠాలు చెప్పే
ఒక ఆచార్యుడిని. ఈ నేపథ్యంలో నేను సాహిత్యంలో అనేక ప్రక్రియలు గురించి చదువుతూ ఉంటాను. వాటిని మా విద్యార్థులకు
బోధిస్తుంటాను. ఆ యా ప్రక్రియల గురించి వివిధ
సదస్సుల్లో కూడా వింటుంటాం. మా ఆలోచనలను ఆ
సదస్సుల్లో పంచుకుంటూ ఉంటాం. ఈ క్రమంలోనే పర్సనల్ నేరేటివ్స్ పై మా యూనివర్సిటీలో ఒక సదస్సు జరిగింది. వాళ్ల ప్రసంగాలు విన్నాను. చాలా
మంది బాగా చదువుకోలేని వాళ్ళు కూడా తమ జీవితానుభవాలను చెబుతుంటే నా హృదయం విదారకంగా మారిపోయింది. వాటిని వాళ్ళలో చాలామంది అక్షర రూపంలో
పెట్టలేదు. ఆ అనుభవాల్ని ఎవరైనా యథాతధంగా అక్షర రూపంలో పెడితే ఆ పర్సనల్ నెరేటివ్స్
ఎంతోమంది జీవితాలకు కొత్త పాఠాలు నేర్పుతాయనిపించింది. ఆ సదస్సు ప్రేరణతోనే నేను నా
అనుభవాలను రాద్దామని అనుకున్నాను. అయితే, వాటిని జ్ఞాపకాలుగానో అనుభవాలుగానో కాకుండా ఒక ఆత్మకథ రూపంలో
చెప్పాను.
పర్సనల్ నెరేటివ్స్ కి ఆత్మకథకు
మధ్య గల భేద సాదృశ్యాలను ఎలా అర్థం చేసుకోవాలి?
ఎవరి జీవితానుభవాలను వాళ్ళు కథనాత్మక శైలిలో
రాయగలిగితే అవి ఆత్మకథలు అవుతాయి. ఆత్మకథలకు ఒక క్రమ పరిణామం ఉంటుంది. కొంతమంది తేదీలను
పేర్కొంటూ, తమ జీవిత సంఘటనలను వివరించే క్రమంలో
వాటి క్రమపరిణామాలను, వాటి పూర్వాపరాలను విశ్లేషణాత్మకంగా రాస్తుంటారు. ఆత్మకథ అనేది
కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన జీవితానుభవాల కాల పరిణామాన్ని, మంచి చెడుల సంఘర్షణలను
వాస్తవికంగా చెప్పడం మాత్రమే కాదు, ఆ వ్యక్తితో కలిసి మెలిసిన వారి వ్యక్తిత్వాలను
తనదైన దృష్టితో పరిశీలిస్తూ, ఆనాటి సమాజ స్థితిగతులను
చెప్పకనే చెప్తున్నట్లు వివరించాలి. తన కుటుంబ సభ్యులను, తన స్నేహితులను, తన శత్రువులను, తనతో కలిసిన వారందరి వ్యక్తిత్వాలను తను కేంద్రంగా
చూసిన పార్శ్వాల్ని అంచనా వేయడానికి ఆత్మకథ
దోహదపడాలి. తాను చెబుతున్న వాటిలో సత్యాలే ఉన్నాయో, అసత్యాలే ఉన్నాయో ఆ నిజానిజాలను తర్వాత కాలంలో పరిశీలించడానికి అంతర్భుతంగా
కొన్ని సాక్ష్యాలను పెట్టగలగాలి. తన అనుభవాలను అనుభూతులను చెబుతూనే ఇతరుల మనోభావాలను
దెబ్బతీయకుండా కూడా జాగ్రత్త పడాలి. కొన్ని విషయాలను చెప్పేటప్పుడు వాళ్ళ పేర్లు, కులమతాల
ప్రస్తావన కూడా అవసరమైనంత మేరకు పరిహరించడం మంచిది. కానీ వాళ్ళు ఎవరో పాఠకులు తెలుసుకోవాలని
మాత్రం సూచించగలగాలి. ఇవన్నీ తనకు తానే రాసుకుంటే దాని ఆత్మకథ అంటారు.
పర్సనల్ నేరేటివ్ లో ఒక క్రమ పరిణామం ఉండాలనేమీ లేదు. తన జీవితంలోని
కొన్ని అనుభవాలను తనకు తెలిసిన పద్ధతిలో తాను చెప్పుకుంటూపోతూ ఉంటారు. దీనిలో కూడా
శైలీ పరంగా చూస్తే కథలాగే సాగినా దీనిలో జీవితానుభవమే
ముఖ్యం. పర్సనల్ నేరేటివ్ లో తన జీవితానుభవాలను చెబుతుంటే ఆ అనుభవాలను వాళ్లే చెబుతున్నట్లుగా ఇతరులు కూడా రాయవచ్చు. కొన్నిసార్లు తామే రాయవచ్చు కూడా! తనకు మాత్రమే ప్రత్యేకమైన కొన్ని తేదీలు,
కొన్ని సంఘటనలు ముఖ్యమైనవాటిని కేంద్రంగా చేసుకుని పర్సనల్
నెరేటివ్ కొనసాగుతూ, ప్రధానంగా ఆ ఎమోషన్ ఆకర్షించేలా చేస్తుంది. సత్యాలు అంటే
వాస్తవాలు, ఆ చరిత్ర, ఆ వివరణల కంటే కూడా జీవితానుభవాలే ప్రధానమవవుతాయి. అందువల్ల ఆత్మకథల్లో
పర్సనల్ నేరేటివ్ ఒక భాగం అవుతుంది. కానీ,
ప్రతీ పర్సనల్ నెరేటివ్ ఒక ఆత్మ కథ కాదు.
ప్రశ్న: ఆత్మకథకి జీవిత చరిత్రకీ మధ్య గల ముఖ్యమైన భేదం ఏమిటి?
ఆత్మకథ తన జీవితానుభవాన్ని ఒక కథలా
చెప్తారు. అది పద్యంలో గాని, గద్యంలో గాని అంటే వచనంలో కూడా చెప్పవచ్చు. జీవిత చరిత్ర
కూడా అంతే. ఎలాగైనా రాయవచ్చు. ఒకరి జీవిత చరిత్రను మరొకరు వివిధ ఆధారాలను సేకరించి రాస్తుంటారు. అంతేకాకుండా,
జీవిత చరిత్రను ఆ మనిషి మరణాంతరం లేదా ఆ వ్యక్తి
మహోన్నతమైన స్థితిలోకి వెళ్ళినప్పుడు గాని మరొకరు రాస్తారు.
కొంతమంది మహోన్నతమైన స్థితికి చేరుకోవడం కంటే ఒక రకమైన పేరు ప్రఖ్యాతులతో మారు మ్రోగుతూ ఉంటారు. అది మంచి వలనే కాకపోవచ్చు, చెడువల్ల కూడా కావచ్చు. అటువంటి వారి జీవితాన్ని కూడా జీవిత చరిత్రగా రాస్తుంటారు. అయితే,
జీవిత చరిత్ర పరిశోధనతో ముడిపడి ఉంటుంది.
ఆత్మకథ జీవితానుభవాల సంఘర్షణగా, ఆత్మసాక్షి ప్రమాణంతో కొనసాగుతుంది. పర్సనల్ నెరేటివ్స్
లో జీవితానుభవాన్ని మాత్రమే వివరిస్తారు.
ప్రశ్న: మీరు కూడా జీవితంలోని
కొన్ని అంశాలను మాత్రమే చెప్పారు కదా. అటువంటి అప్పుడు దీన్ని ఆత్మకథగా ఎలా భావించాలి?
నేను నా జీవితంలోని కొన్ని భాగాలను చెప్పిన
మాట నిజమే. ప్రతి భాగానికి ఒక క్రమ పరిణామంతో కొనసాగింది అనేది నా ఆత్మకథ చదివిన ప్రతి
ఒక్కరికీ తెలుస్తుంది. పర్సనల్ నెరేటివ్ అంటే 'స్వీయానుభవ కథనం' లో కేవలం ఒక ఎమోషన్
కు కేంద్రమయ్యే అంశం మాత్రమే ఉంటుంది. మన జీవితంలో ఎమోషన్ కి గురికాని అంశాలు కూడా
అనేకం ఉంటాయి. వాటిని చెప్పకపోతే మన జీవిత క్రమ పరిణామాన్నీ చెప్పలేం. స్వీయానుభవ కథనం జీవితంలోని సంఘటనలు ముక్కలు ముక్కలుగా
కనిపిస్తూ దాని క్రమ పరిణామం తెలియదు. సాధారణంగా జీవితంలో ఒక ఎమోషన్ కి గురయ్యే సంఘటనలు
జరిగినప్పుడు దాని ఫలితాలు ఎలా ఉంటాయో అనేది
కూడా ముఖ్యం. వాటిని ఎదుర్కోవడంలో జయాపజయాలు ఎదురు కావచ్చు. వాటిని వాస్తవంగా తెలపటం
ఆత్మకథలో మాత్రమే సాధ్యం. నేను ఇంతవరకు రాసిన 25 భాగాలలో నా జీవితంలో బాల్యానికి సంబంధించిన జీవితానువాలు, వాటి మధ్య కార్యకారణ సంబంధాలను ఆ క్రమ వికాసాన్ని
చెప్పాననే నేను భావిస్తున్నాను.
ప్రశ్న: ఈ ఆత్మకథ వస్తున్న నేపథ్యంలో
మీకు ఎదురైన అనుభవాలు, ఇతరులు చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయి?
సాధారణంగా పెద్ద వయసులో ఉన్నవాళ్లు తమ ఆత్మ
కథల్ని రాస్తుంటారు. నాకు ఇంకా 50 సంవత్సరాలు
పూర్తి కాలేదు. నేను ఆత్మకథ రాస్తున్నానంటే కొంతమంది నవ్విన వాళ్ళు ఉన్నారు. వాళ్ల
వాళ్ల ప్రైవేట్ టాక్స్ లో వెటకారం చేసిన వాళ్లు కూడా ఉన్నారు. 'నువ్వే ఆత్మకథ రాస్తుంటే నేను
ఎందుకు రాయకూడదు?' అని కలం పట్టిన వాళ్లు ఉన్నారు. వాళ్ళే నాకు స్వయంగా చెప్పారు.
''ఆత్మకథ అని మొదలుపెట్టి రాస్తున్నావ్.
కాబట్టి, నువ్వు నిజంగా రాస్తే ముందు, ముందు నీ జీవితంలో నువ్వు చాలా సమస్యలు ఎదుర్కొంటావు.
జాగ్రత్త'' అని హెచ్చరించిన వాళ్ళు కూడా ఉన్నారు.
కొంతమందైతే ''దీన్ని రెగ్యులర్ గా చదవడమే కాదు, మా విద్యార్థినీ
విద్యార్థులను చదివించి దీనిపై వాళ్ళ అభిప్రాయాలను కూడా తెలుసుకుంటున్నా''మని చెప్పారు.
కొంతమంది విద్యార్థులైతే వాయిస్ మెసేజ్ ద్వారా రచన తాము చదివిన తర్వాత పొందిన అనుభవాలను, అభిప్రాయాలను
నాకు కూడా పంపించారు.
ప్రశ్న: మాకు అందిన స్పందనను
బట్టి మీరు హిందూ ఆచారాలకు ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇచ్చారని అంటున్నారు. మీరేమంటారు?
ఆత్మకథకు నిజమైన జీవితం సత్యాన్ని ఆవిష్కరించడమే. నేను దాన్ని మనసా, వాచా, కర్మణా నా జీవితాన్ని ఆత్మకథలో వ్యక్తికరిస్తున్నాను. నాకు ఊహ తెలిసినప్పటి నుండి
నన్ను ఆదరించిన వాళ్ళు ఏ కులస్థులైనా వాళ్ల గురించి నేను మర్చిపోకుండా రాయడం
నా కనీస ధర్మంగా నేను భావిస్తున్నాను.
మా కుటుంబం మొదటి నుండీ హిందూ ఆచార, వ్యవహారాలతోనే
పెరిగింది. కాలక్రమంలో వచ్చిన కొన్ని మార్పులు వచ్చాయి. అవి జీవితంలో ఎదురైన వివిధ
సంఘటనలు, దాని ఫలితంగా ఏర్పడిన అవగాహన ఇవన్నీ మా కుటుంబంలో కొంతమంది క్రిస్టియానిటీ
వైపు వెళ్లడానికి దోహదం చేశాయి. ఇవన్నీ ఒక్కరోజులో జరిగినవి కాదు.
మనల్ని ఎవరైతే దూరంగా పెడతారో, మన పట్ల ఎవరైతే వివక్షను ప్రదర్శిస్తారో వాళ్ళకీ,
వాళ్ళ ఆలోచనలకీ, వాళ్ళ ఆచార, సంప్రదాయాలకీ మనం దూరంగానే ఉంటాం. అలాంటి వివక్ష లేకపోతే వాళ్ళు మనల్ని బాగా ఆదరించిస్తే కేవలం ఏవో కొన్ని చిన్న చిన్న కారణాల వల్లా, పుట్టుకతో
వచ్చిన గుర్తింపుల వల్లా వాళ్ళందరినీ దూరం చేసుకోవాల్సిన పనిలేదని నా అభిప్రాయం.
నేను ఒక హిందువుతో ఉన్నప్పుడు హిందువుగా,
ఒక క్రిస్టియన్ తో ఉన్నప్పుడు ఒక క్రిస్టియన్ గా , ఒక ముస్లిం తో ఉన్నప్పుడు ఒక ముస్లింగా ఆ ఆచార సంప్రదాయాలు నా వ్యక్తిగతమైన స్వేచ్ఛను, నా విశ్వాసాన్ని భంగం కలిగించనంతవరకు,
నా ఆత్మ గౌరవాన్ని కాపాడిన జంతువులకు వాళ్ళందరితోను సహృదయ వాతావరణాన్నే కలిగి ఉంటాను.
వాళ్ళ జీవన విధానాన్నీ గౌరవిస్తాను. ఆ మతాచారాలను , విశ్వాసాలను, సంప్రదాయాలను నేను ఆచరిస్తానా? లేదా? అనేదానికంటే వాళ్లకున్న
హక్కుని వాళ్ళకున్న విశ్వాసాన్ని, వాళ్ళకున్న స్వేచ్చను భంగం కలిగించడానికి నేను కూడా
ఇష్టపడను.
ప్రశ్న: మరి మిగతా భాగాలను రాయడం
మొదలు పెడతారా? దానికి సంబంధించిన మీ ఆలోచనలు?
మీరు నాతో ఇన్ని భాగాలను వ్రాయించారు. వాటిని మీ పత్రికలోనే వారం వారం ప్రచురించారు.
ఈ ఊపులోనే మిగతా భాగాలను కూడా రాస్తే బాగుంటుంది
అనుకుంటున్నాను. కానీ, వాటిని ఇప్పుడే ప్రచురించాలనుకోవడం లేదు.
ఈలోగా, ఈ రచనానుభవంతో కొన్ని కథలను, అవసరమైతే నవలను కూడా రాయాలని ఆలోచన చేస్తున్నాను.
ఆత్మకథ రాస్తున్న క్రమంలో నాకు కొన్ని రచనానుభవాలు ఎదురయ్యాయి. కొన్ని సత్యాలను ఆత్మకథలో
ఆవిష్కరించేటప్పుడు ఎంతో మానసికంగా సంఘర్షణకు గురవుతుంటాం. ఆత్మకథ లో సత్యావిష్కరణ చేస్తూనే, ఎవర్నీ నొప్పించని
పద్ధతిలో విషయాన్ని తెలియజేయడానికి ఎంతో నైపుణ్యం కావాలి. నేను ఆ నైపుణ్యానికి ఇంకా
సాధించాలని తెలిసింది. అంతవరకు వాటిని సృజనాత్మక
ప్రక్రియలైన కథలు, నవలల్లో చెప్పుకునే అవకాశం ఉందని కూడా తెలిసి వచ్చింది.
ప్రశ్న: సాధారణంగా సృజనాత్మక
సాహిత్యంలో కవిత్వం, కథ, నవల, నాటకం… ఇలాంటి సాహిత్య ప్రక్రియల్లో రచయిత తన జీవితాన్ని
లేదా తన జీవితాన్నే ప్రతిఫలిస్తున్నాడనుకునే
అవకాశం ఉందా?
ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం చాలా కష్టం.
చాలామంది తమ జీవితానుభవాల నుండే కవిత్వం గాని, కథ గాని, నవల గాని రాస్తుంటారు. ఉత్తమపురుషలో
రాసేటప్పుడు నెరేటర్ ''నేను'' గా మారిపోతాడు.
ఆ నేను అంతా ఆ కవి లేదా రచయిత స్వీయానుభవంగానే మనం భావించడానికి వీల్లేదు. అలాగని అందులో కొంతైనా వాస్తవం లేకపోలేదనీ మనం గుర్తించాలి.
ఒక సామూహిక అనుభవాన్ని, ఒక వైయక్తి అనుభవంగా, తనకు అనిపించిన సత్యావిష్కరణగా మనకి అందిస్తూ
ఉంటాడు. ఆ రచనల్లోని వైయక్తిక ''నేను'' ని గుర్తించడానికి ఆ కవులు/రచయితలు వివిధ సందర్భాలలో ఇచ్చిన ఇంటర్వ్యూలు,
రాసుకున్న ఆత్మకథలు, సభలు,సమావేశాల్లో వారి ప్రసంగాలు, వాళ్ళు రాసుకున్న డైరీలు, ఉత్తరాలు, వాళ్లు వివిధ వ్యక్తులతో మాట్లాడుకునే ప్రైవేటు సంభాషణలు…వాళ్ళ దృక్పథం…ఇలా కొన్నింటి బట్టి గుర్తించడానికి వీలవుతుంది.
అందుకే సాహిత్యం సమాజ ప్రతిఫలమే కాదు, తాను
చూసిన వాస్తవాల ప్రతిబింబం…తనకు కలిగిన అవగాహన కూడా!
ప్రశ్న: రాబోయే మీఆత్మకథ రెండవ
భాగంలో మమ్మల్ని ఆకట్టుకునే అంశాలు ఏమైనా వెల్లడించే అవకాశం ఉందా?
సాధారణంగా ఆత్మకథ మన తెలుగులో తన జీవిత చరమాకంలో
రాస్తుంటారు. నా అభిప్రాయం ప్రకారం ప్రతి 30 ఏళ్లకోసారి మన ఆత్మకథను రాయాలి. ఒక్కొక్క
భాగంలోను ఒక్కొక్క పార్శ్వం కనిపిస్తుంది. అలాగే, నా ఆత్మకథ రెండవ భాగంలో యౌవనం నాటి
సహజమైన అనుభవాలు, ఆ ఉడుకు రక్తం తెచ్చే ఆవేశాలు, వాటివల్ల వచ్చేటువంటి సంఘర్షణలు రకరకాలైన
పరిణామాలన్నీ ప్రతిఫలించేలా రాయాలనుకుంటున్నాను.
నాకు అక్కడినుండే సామాజిక అవగాహనమొదలైందనుకోవచ్చు.
నాకు అక్కడి నుండే నా నిజమైన జీవిత సంఘర్షణ ప్రారంభమైందనుకోవచ్చు. అక్కడి నుండే నేనొక
మనిషిని నన్ను నేను తెలుసుకున్నాని అనుకోవచ్చు. అక్కడ నుండే మనిషి ఆత్మగౌరవంతో తలెత్తుకుని
బ్రతకడంలో ఎదుర్కోవాల్సినవెన్నో ఉన్నాయని న్తెలుసుకున్నానని అనుకోవచ్చు. ఇవన్నీ నా
ఆత్మకథ రెండవ భాగంలో అందించే ప్రయత్నం చేస్తాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి