మేమిద్దరం చాలా రోజుల తర్వాత కలిశాం
అతన్ని చూడగానే
ఏ పోటీ ఫలితాలు చూసినా
అతనో కవితగానో అతనో కథగానో
విజేతల్లో కనిపించిన అతని పేరే చూసి చూసి
ఆ మనిషిని ప్రత్యక్షంగా చూస్తున్నంతనే
తెగి ప్రవహించే సంతోషం…
నేను
అతని భావుకతనీ అతని రచనా నైపుణ్యాన్నీ
ఎలా వరదనై ప్రవహిస్తున్నానో ….
అతని కళ్ళు వర్షించాయి
ఆనందంతోనే అనుకున్నాను
'బహుశా
ఈమాట వినడానికే నేనింకా బ్రతికున్నానేమో సర్'
ఒక ఉద్వేగంతో కన్నీళ్ళు తడిపిన మాటొకటి
నూతిలో గొంతుకలా వినిపించింది
ఈసారి నా ఒళ్ళంతా కంపించింది
ఈ సారి నా చూపంతా స్తంభించింది
'కరోనా వాక్సిన్ వికటించింది
ఆసుపత్రి నాకున్న వన్నీ అమ్మించింది
నన్నెలాగోలా బయటపడేసినా
నాకథకి వాళ్ళిచ్చిన వస్తువు మాత్రం
నా ఊహలకే అందడంలేదు'
ఈసారి మేమిద్దరం ఒకర్నొకరం
అలా చూసుకోవడమే తప్ప
మాటలన్నీ మూగబోయాయి
నవ్వుల వెనుకున్న విషాదాన్ని
విషాదం వెనుకున్న విధ్వంసాన్ని
గుర్తించే భాషకోసమేనేమో
మా చూపులన్నీ స్తంభించి పోయాయి!
దార్ల వెంకటేశ్వరరావు,
హైదరాబాద్, 9182685231
23.1.2023
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి