Tuesday, February 10, 2009

వర్గీకరణ వాదానికి శాస్త్రీయ దృక్పథం

స్వయంగా దళిత కులం (మాదిగ)లో పుట్టి, పెరిగి, అనేక ఆటుపోట్లకు గురై ఉన్నత విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తూనే, తన జాతి వెనుకబాటు తనానికి గల కారణాలను అన్వేషించాలనుకొని పరిశోధనకు పూనుకున్న వారిలో సాంబయ్య గుండిమెడ ఒకడు. పుట్టిందీ, పెరిగిందీ పల్లె ప్రాంతంలోనే. నేటికీ గుండె నిండా పల్లె వాతావరణాన్నీ, దళితుల బాధల గాథల్నీ దాచుకున్నవాడు. ఎన్నుకున్న పరిశోధన అంశంలో, రాసే అక్షరంలో, మాట్లాడే ఆలోచనలో అవన్నీ ప్రతిఫలిస్తూనే ఉన్నాయి. సాంబయ్య గుండిమెడను, నేను 'అన్నా' అని పిలుస్తుంటాను. అతడు సెంట్రల్ యూనివర్సిటీలో పి.జి. చేస్తున్నప్పుడు నాకు వ్యక్తిగతంగా తెలుసు. దళితులు అనుభవించే సారూప్య లక్షణాలవల్లే అతనితో నాకు పరిచయం ఏర్పడింది. బహుశా ప్రతి దళితుడి బాధల్లోనూ, సమస్యల్లోనూ ఈ సారూప్యత అనేది గొప్ప అనుబంధాన్ని కలిగిస్తుంటుందేమో! ఈ అనుబంధ పటిష్టతే ఏకవచన సంబోధనకు అవకాశం కల్పించింది. నిజానికి ఆత్నీయుల మధ్య ఏకవచన సంబోధన మరింత చేరువకావడానికి మార్గాన్నేర్పరుస్తుంది.

అన్న సాంబయ్య పి.జి. చేసేటప్పుడు దళితుల గురించి లోతైన ఆలోచన చేస్తున్నట్లు గుర్తించలేకపోయాను. అతనూ నేనూ వేరు వేరు సబ్జెక్టుల్లో పి.జి. చేయడం, అతను చేసే, పాల్గొనే చర్చల్లో విరివిగా పాల్గొనే అవకాశం నాకు కలగకపోవడం వంటివన్నీ దీనికి కారణాలనుకుంటున్నాను. అప్పటికే యూనివర్సీటీ క్యాంపస్‌లో 'మాదిగ సాహిత్య వేదిక' ద్వారా నాగప్పగారి సుందర్ రాజు, కత్తి కల్యాణ్ చంద్ర, కొలికపూడి శ్రీనివాసరావు వంటి వాళ్ళతో కలిసి మాదిగ సాహిత్యాన్ని రాయడం ప్రారంభించాం. ఈలోగా "సాంబయ్యకి ఫోర్డ్ ఫెలోషిప్ వచ్చింది.'' అనే వార్త క్యాంపస్‌లో గుప్పుమంది. నా మాదిగ సోదరుడికి ఈ ఫెలోషిప్ వచ్చినప్పుడు నేను పొందిన ఆనందాన్ని అక్షరాల్లో వర్ణించలేను! దాన్ని నేనే సాధించినంతగా ఫీలయ్యాను. మాదిగ విద్యార్థి గొప్ప విద్యావంతుడు కాబోతున్నందుకు పొంగిపోయాను. విమానం ఎక్కి లండన్ వెళ్ళిపోయాడు. హాయిగా సెటిల్ కాబోతున్నాడనుకున్నాను. కానీ, అక్కడ కూడా దళితుల సమస్యలతోనే కుస్తీ పడుతున్నాడని తెలుసుకున్నాను.

ఒకరోజు లండన్ నుండి ఫోన్ చేశాడు. సెంట్రల్ యూనివర్సిటీలో నేను ఉద్యోగం పొందానని తెలుసుకొని ఫోన్ చేశాడు. చాలాసేపు గుండెకు హత్తుకున్నంత ఆనందంతో మాట్లాడాడు. ఆ సందర్భంలో అతడు మాట్లాడిన మాటలు నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేను. అప్పుడే అతనిలో ఒక గొప్ప దళిత మేధావి మాటలు విన్నాను. అతని పరిశోధన గురించి విని సంతోషించాను. దళిత జాతి జాగృతికి అతడు పడే తపనను గమనించాను. అప్పటి నుండి రెగ్యులర్‌గా ఫోన్, మెయిల్స్ ద్వారా చర్చలు జరుగుతుండేవి. ఒక రోజు మెయిల్‌లో ఒక వ్యాసం పంపించి, అభిప్రాయం చెప్పమన్నాడు. ప్రస్తుతం దళితుల్లో జరగవలసిన వర్గీకరణ ఆవశ్యకతను ఒక శాస్త్రీయ దృక్పథంతో ఆ వ్యాసంలో విశ్లేషించాడనిపించింది. దళితులు సమైక్యత సాధించాలంటే తక్షణం జరగవలసిన వర్గీకరణను అందరూ అంగీకరించవలసి ఉంటుందని ఆ వ్యాసంలో ప్రతిపాదించాడు. వ్యాసాన్ని ప్రారంభించింది మాత్రం వర్గీకరణను వ్యతిరేకిస్తూ చేసిన వాదనను ఖండించడానికే! కానీ ఒక వ్యక్తి రాసిన వ్యాసానికి ఖండనగానే దాన్ని రాయడానికి పూనుకున్నా, వ్యక్తులకంటే వ్యవస్థనే లక్ష్యం చేసుకోగలిగే సంయమనాన్ని, సమన్వయాన్ని ఆ రచనలో సాధించగలిగాడు. ఒక పరిశోధన పత్రంలా దాన్ని రూపొందించాడు. మందకృష్ణ మాదిగ, కృపాకర్ మాదిగలు మాదిగ జాతికి లభించిన గొప్ప వరం. అయితే, వీరి ప్రసంగాలు, 'రికార్డు' అయితే వర్తమాన దళిత ఉద్యమానికి ఎంతో మేలు చేయగలుగుతాయి. 'వర్గీకరణ వాదాన్ని' ప్రతి దళితుడి చేత అంగీకరింపజేయ గలుగుతాయి. భవిష్యత్తు తరాలకు మార్గదర్శ సూత్రాలవుతాయి. దళితులు - అందులోనూ వృత్తి చేత హీనంగా చూడబడుతున్న మాదిగల గురించి పరిశోధన చేసిన సాంబయ్య, ఈ రకమైన లోపాన్ని పూరించే ప్రయత్నం చేయడానికి పూనుకున్నాడు. ఆ వ్యాసంలో ప్రతి మాదిగకూ, ప్రతి దళిత మేధావికీ, దళిత, దళితేతరులందరికీ వర్గీకరణవాదం లోని సామంజస్యాలను శాస్త్రీయ దృక్పథంతో విశ్లేషించి చూపగలిగాడు. ఆ వ్యాసాన్ని పుస్తక రూపంలో ప్రకటిస్తే బాగుంటుందన్నాను. దానికి కార్యరూపమే ఈ గ్రంథం!

వర్గీకరణను వ్యతిరేకించేది దళితుల్లోని ఒక వర్గం మాలలే ప్రధానంగా కనిపిస్తున్నారు. అసమానతను పోగొట్టుకొనే దిశలో అవకాశాల అందుబాటుని సాధించుకోవాలనేది అంబేద్కరిజంలో ఒక ప్రధాన ఆశయం. ఆ ఆశయానికి క్రియారూపమే రిజర్వేషన్ల పొడిగింపు కూడా! అంటే సామాజిక వాస్తవికత నుండి రిజర్వేషన్ల పొడిగింపు కొనసాగుతుంది. దీన్ని వ్యతిరేకించని దళితుల్లోని ఒక ప్రధాన వర్గం, సామాజిక వాస్తవికతలో స్పష్టంగా గణాంక వివరాలతో సహా కనిపిస్తున్న లోపాల్ని పూరించే దిశగా ఎస్.సి. వర్గీకరణ జరగాలనడాన్ని ఆ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇలా అంబేద్కరిజానికి వ్యతిరేకంగా, బ్రాహ్మణత్వ భావజాలంతో వర్గీకరణను వ్యతిరేకించే ఆలోచననను మాలత్వగా వ్యాసకర్త ప్రయోగిస్తున్నాడు. బ్రాహ్మణత్వ మాలత్వ అనే పారిభాషిక పదాలు వైయిక్తిక గుర్తింపుతో కాకుండా భావజాలం (Idealogy) ఆధారంగా, స్పష్టమైన వివరణతోనే రచన కొనసాగడం వల్ల స్పష్టతకు బలమైన మార్గాన్ని ఏర్పరిచినట్లయ్యింది. 'బ్రహ్మాస్త్రం' బదులు 'అగ్రాస్త్రం' అనడంలో గాని, 'రాజ్యాధికారం' 'అంబేద్కరిజమ్' అనే ప్రయోగాలను గాని లోతైన అవగాహనతోనే ఉపయోగించాడు.

వర్గీకరణ మాలత్వ వ్యతిరేక వాదంలో గల వివిధ విషయాలను తొమ్మిది అంశాలుగా వర్గీకరించి, చారిత్రక, ఆర్థిక, రాజకీయ, విద్యా ఉద్యోగ రంగాలలో జరుగుతున్న వాస్తవిక సంఘటనలను సోదాహరణంగా నిరూపించగలగడంలో సాంబయ్య దళిత మేధావి పాత్రను నిర్వహిస్తున్నాడు. గ్రామీణ దళితుల్లో ఆంగ్ల విద్యాలోపం, అది వెంటబెట్టుకొచ్చే ఆత్మన్యూనతలను అనుసరించి ప్రతిభాపాటవాల్ని నిర్వచించుకోవలసి ఉంటుందని అంటున్నాడు. ఒక సామాజిక శాస్త్రవేత్త పాత్ర పోషిస్తున్నట్లు ఈ విశ్లేషణలో కనిపిస్తున్నాడు సాంబయ్య.

పలువురి మేధావుల ఆలోచనలను సైద్ధాంతిక లోతుల్లోకి వెళ్ళి, వర్గీకరణ వాదంలో గల సామంజస్యాన్ని నిరూపించడానికి వాటిని ఉపయోగించి ఒక మంచి ప్రయత్నం చేశాడు. ఇవన్నీ వర్గీకరణ వాదాన్ని అందరిచేత అంగీకరింపజేయడానికి గ్రంథకర్త పాటించిన శాస్త్రీయ దృక్పథాన్ని పట్టి చూపిస్తున్నాయి. వ్యక్తావ్యక్తంగా ఉన్న అస్పష్టతను స్పష్టత వైపుకి తీసుకొని పోవడంలోనే ఈ శాస్త్రీయత వెల్లడవుతుంది. సమాజంలో 'దళితులు' అంటే అందరికీ వ్యక్తమయ్యే అభిప్రాయం ఒకటి ఉంది. తరతరాల సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక పీడనలకు గురై సమాజానికి దూరం చేయబడిన వాళ్ళనేదే అభిప్రాయం. దళితుల్లోనూ ఆంతరంగిక పీడనకూ గురయ్యే వాళ్ళు ఉన్నారనేది అవ్యక్తం, అస్పష్టం. ఇప్పుడిప్పుడే స్పష్టం చేసే ప్రయత్నం కనిపించడం వల్లనే వ్యక్తావ్యక్త, స్పష్టాస్పష్ట వైరుధ్యం గోచరమవుతుంది. అలాగే దళితులందరూ కలిసి ఉంటేనే హక్కుల సాధన లేదా నిజమైన సమైక్యత అనేది వ్యక్తం. హక్కులు సాధించుకొనేదెవరు? నిజమైన సమైక్యత ఉందా? అనేది అవ్యక్తం, అస్పష్టం. ఈ అభిప్రాయాలను దళితేతరులే కాదు, దళితుల్లోని ఉపకులాలకూ కలిగేవే. అందుకనే, 'మాలత్వాన్ని' ఒక భావనగా గ్రహించి వ్యక్తావ్యక్తాలను, స్పష్టాస్పష్టాలను తార్కికంగా నిరూపిస్తున్నాడు వ్యాసకర్త. తద్వారా ముసుగేసుకున్న బ్రాహ్మణత్వ, గాంధీ సూచిత సమైక్యత కంటే, అంబేద్కరిజంలోని సమానత్వ భావనను ఎలుగెత్తి చాటుతున్నాడు.

మందకృష్ణ మాదిగ, కృపాకర్ మాదిగ తదితరులు మాదిగ హక్కుల పోరాట సమితిగా, మాదిగ దండోరాగా ఏర్పడి ఉద్యమరూపాన్ని సాధించడానికి బహిర్గతం అయినప్పటి నుండి చూసినా సుమారు దశాబ్ద కాలంగా ఎస్.సి. వర్గీకరణ కోసం ప్రయత్నాలు ముమ్మరంగా చర్చల్లోకి వచ్చి, వాడిగా, వేడిగా కొనసాగుతున్నాయి. కృష్ణ మాదిగ, కృపాకర్ మాదిగ ఉద్యమరూపంలో, రాష్ట్రంలోని మాదిగలను అందరినీ సమైక్యంగా పోరాటానికి లేదా హక్కుల సాధనకి ప్రేరేపించడంలో కృతకృత్యులు కాగలిగారు. కానీ, అంతకు ముందు నుంచే ఎస్.సి. వర్గీకరణ జరగాలనే వాదనలు జరగకపోలేదు. అప్పుడు ఎస్.సి. వర్గీకరణ గురించి మాట్లాడే లేదా పోరాడే వారికి ఇప్పుడున్నంతగా మాదిగల సహాయ సహకారాలు లభించకపోవడం, ఆ మార్గాలు అన్వేషించకపోవడం, తెలిసినా కొంతమంది వైయక్తిక ప్రయోజనాలకు వాడుకోవడం వంటి వాటి వల్ల అవి నేటి వర్గీకరణ వాదానికున్నంత పటిష్ఠతను సాధించలేకపోయాయి.

ఇంతకు ముందు లేనంత సహకారం ఇతర పార్టీలు కూడా ఇప్పుడు మాదిగలకు అందించడంలో గల హిందూత్వ రాజకీయాలను గమనించమంటున్న దళితత్వ భావాలను కూడా ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకోవలసిందే. రాజ్యాంగం కల్పించిన అవకాశాల వల్ల, రాష్ట్రంలో జరిగిన కారంచేడు, చుండూరు, పదిరి కుప్పం వంటి ప్రాంతాల్లో జరిగిన దళితేతర వర్ణాలు చేసిన దాడులతో దళితుల్లో వచ్చిన చైతన్యం సామాన్యమైంది కాదు. బహుజన సమాజ్ పార్టీ సిద్ధాంతకర్త, వ్యవస్థాపక అధ్యక్షుడు కాన్సీరామ్‌తో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి యన్,టి. రామారావు పొత్తు పెట్టుకోవాలనుకున్నారు. అది ఒక రకంగా దళితుల్లో వచ్చిన చైతన్యాన్ని ఇతర్లు గుర్తించడమే. మరి అలాంటి చైతన్యం తర్వాత ఎందుకు కొనసాగలేదు? ఎన్నికల మ్యానిషెస్టోలలో దళితులను ఆకర్షించే పథకాలు లేకుండా ఉండేవే కాదు. మరిప్పుడు వాటినెందుకు విస్మరిస్తున్నారు? దళితులను విభజించాలని ఎదురు చూసే హిందూత్వ బ్రాహ్మణత్వ భావజాలం కొంత పనిచేసే, నేటి వర్గీకరణ వాదానికి పూర్తి మద్దతు కొనసాగుతుందనడంలో కొంత చారిత్రక సత్యం ఉంది. కానీ, అదే పూర్తి సత్యం కాదు.

దళితులను విభజించి పాలించడానికి లేదా దళితులనే కాదు ఎవరినైనా విడగొట్టి తమ ఆధిపత్యం చెలాయించుకోవడానికి దళితేతరులకు అనేక మార్గాలున్నాయి. వాటిని అన్నింటినీ కాదని వర్గీకరణ వాదాన్నే సమర్థించడంలో అన్ని పార్టీలకు ఏకాభిప్రాయం ఏర్పడింది. చివరికి అన్ని పార్టీలు రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం కూడా తెలిపాయి. ఇవన్నీ హిందూత్వ బ్రాహ్మణత్వ భావజాలాలే అనడం హేతుబద్ధమైన ఆలోచన అనిపించుకోదు! వీటిని ఈ గ్రంథకర్త సాంబయ్య గుండిమెడ శాస్త్రీయంగానే గణాంకాలు, చారిత్రక సత్యాలను చూపుతూనే వర్గీకరణ వాదాన్ని సమర్థించడంలో అన్ని పార్టీల ఆలోచనలనీ సమన్వయం చేయగలిగాడు. సమకాలీన పరిస్థితులని చూపగలిగాడు.

ఈ సందర్భంలోనే ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.శాసన, కార్య నిర్వాహక, న్యాయ వ్యవస్థల మధ్య సమన్వయం సాధించనంత వరకూ 'న్యాయం / ధర్మం' అందరికీ అందుబాటులోకి రావడం అంత సులభమైన విషయం కాదు. ఈ సమన్వయం సాధించడంలో దొర్లే పొరపాట్ల వల్లనే సమాజంలో కొంతమంది ప్రజలు ఇక్కట్ల పాలవ్వవలసి వస్తుంది. వీటిని ఉపయోగించుకునే కొంతమంది, మరి కొంతమందిపై ఆధిపత్యాన్ని చెలాయిస్తూ, అందవలసిన హక్కుల్ని అందకుండా ఆపగలుగుతూ, తాము అనుభవించగలుగుతూ, తమకి ఆటంకం కలిగినప్పుడు "అన్యాయం" జరిగిపోతుందని గగ్గోలు పెట్టడం జరుగుతుంటుంది. అప్పుడు వాళ్ళు ఎన్ని వాదనలైనా వినిపించడానికి ముందుకి వస్తారు. వాదనను సమర్ధవంతంగా వినిపించగలిగిన, నిరూపించగలిగిన వాళ్లే విజేతలు! విజేతలు అంతా న్యాయం ప్రకారమో, ధర్మం ప్రకారమో తమ హక్కుల్ని పొందగలుగుతున్నారనుకోవడానికి వీలు లేదు.

సుప్రీంకోర్టు ఎస్.సి. వర్గీకరణ చట్టాన్ని కొన్ని సాంకేతిక కారణాల్ని చూపి తాత్కాలికంగా కొట్టేసింది. దానికి కొన్ని రాజ్యాంగపరమైన ఆటంకాలను చూపింది. ఎస్.సి. వర్గీకరణ సమస్యను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసనసభ ద్వారా ఆమోదించిన తీర్మానాని పంపినా, పార్లమెంటు ఆమోదం ద్వారా మాత్రమే చట్టం కావలసి ఉంది. ఇవన్నీ సాంకేతిక అంశాలే! కానీ, సమాజ వాస్తవికతను జస్టీస్ రామచంద్రరాజు కమీషన్ స్పష్టంగా చూపగలిగింది. మళ్ళీ ఇప్పుడు కేంద్రం నియమించిన దళిత వర్గీకరణ అధ్యయన కమిటీ (ఉషామెహ్రా్కమీషన్‌ ) ద్వారా నిర్ణయం కావలసి ఉందని అంటున్న వాళ్ళు ఉన్నారు. దీన్నీ వ్యతిరేకించే వాళ్ళూ ఉన్నారు. దీన్ని డా// బి.ఆర్. అంబేద్కర్ ఆలోచన ప్రకారమే చూసినా 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకరం అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం హయాంలోనే ఒక ఉత్తర్వు జారీ చేశారు. దీని ప్రకారం ఒక రాష్ట్రంలో ఒక్కో విధంగా అస్పృశ్యత ఉంటుందని, దాని ప్రకారం అప్పుడు 9 భాగాలుగా ఆ ఉత్తర్వులో వివిధ రాష్ట్రాల్లోని అస్పృశ్య కులాల, జాతుల, తెగలను వివరించారు. దాన్ని అంబేద్కర్ "సవివరమైనదిగాను, వాస్తవికమైనదిగాను గుర్తించవలిసిందని'' ప్రకటించారు. (బాబా సాహెబ్ అంబేద్కర్ రచనలు - ప్రసంగాలు (సంపుటం- 7) - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచురణలు: 1992-246) కనుక, కేంద్రం నియమించిన దళితుల వర్గీకరణ అధ్యయన కమిటీ ఎలాంటి ప్రతిపాదనలు చేసినా, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన పేర్లతో కులవివక్ష, ఆర్థిక స్థితిగతులు అనేవి కొనసాగుతున్నాయని గుర్తించి, ఆయా రాష్ట్రాల వారీగా ప్రత్యేక ఏర్పాటు ప్రకారం రిజర్వేషన్లను ప్రకటించడమే శాస్త్రీయమవుతుంది. దీన్ని ఈ గ్రంథకర్త మాదిగ వృత్తులు ఎలా పరాధీనమైపోయాయో, అక్కడ కూడా మాదిగలు కర్మికులుగానే చూడబడుతున్నారో చేసిన విశ్లేషణలో పట్టుకోగలిగాడు. ఇలాంటి లోతైన విశ్లేషణలు దళిత సమస్య పరిష్కారాలకు కొత్త కోణాన్ని అందించగలుగుతుంది. లిడ్‌క్యాప్ ద్వారానో, తోలు పరిశ్రమల స్థాపన ద్వారానో మాదిగలకు ఆర్థిక సహాయం అందిస్తే, అవి మాదిగల పేరుతో మరొకరు పొందుతారు తప్ప, నిజమైన మాదిగ వృత్తిదారులకు అందవనేది గ్రంథకర్త పరిశోధనలో తేలిన ఒక అంశం! తోలు పరిశ్రమలు స్థాపించిన వారు, లేదా లిడ్‌క్యాప్ ద్వారా చెప్పుల దుకాణాలు పెట్టుకున్న వాళ్ళను కేంద్రం నియమించిన వర్గీకరణ అధ్యయన కమిటీ ప్రశ్నించడానికి ఎన్నుకొనే పద్ధతి ఏమిటి? ఎన్నుకునే ప్రశ్నావళి ఎలా ఉంటుంది? దీనికి అంతటికి పట్టే కాలమెంత? ఇవన్నీ దళితుల్లో కొన్ని వర్గాల అవకాశాలను మరొక వర్గం 'స్వాహా' చేయడానికి కలిగించే ఏర్పాటుగా కూడా భావించే వీలుంది.

కేంద్ర ప్రభుత్వం ఓ కమీషన్ వేసి, శాస్త్రీయ పద్ధతిలో నివేదిక సమర్పించి, ఒక్కో రాష్ట్రంలో కనిపించే ఒక్కో పరిస్థితిని వివరించి, ఆయా రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ మార్గనిర్దేశాలను అనుసరించి కొన్ని అవకాశాలను ఇవ్వడానికి ఆయా శాసనసభలకే అధికారం కట్టబెట్టవచ్చు లేదా ఉమ్మడిగానే ఒక మార్గాన్ని సూచించవచ్చు. అప్పటి వరకు కొన్నివర్గాలు నష్టపోతున్నాయనే వాస్తవాన్ని గుర్తించి, తక్షణం రాష్ట్ర శాసనసభ ఆమోదించిన తీర్మానం ప్రకారం అవసరమైతే అభివృద్ధిలోకి వచ్చిన దళితులు తమ సహ దళితుల కోసం కొన్ని త్యాగాలకు సిద్ధం కావలసిన సమయం ఆసన్నమయ్యిందని చెప్పడంలో రచయిత దళిత సమస్యకు నిష్కల్మష దృష్టికోణాన్ని చూపుతున్నాడు. ఇతరుల నుండి పొందడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు, ఇతరులకు నిజాయితీగా తమ అవసరాలు తీరాయని ఒప్పుకొని, అవకాశాలను 'త్యాగం' చేయడానికి దళితులు ఎంత మంది సిద్ధంగా ఉన్నారని అడగడం అనేది కేవలం మాలలనో, ఆ ఉపకులాలనో మాత్రమే కాదు. అలాంటి అభివృద్ధికి చేరువైన మాదిగ, ఉపకులాల వారికి కూడా ఈ సూత్రం అన్వయిస్తుంది.

ఈ గ్రంథంలో సాంబయ్య ప్రతిపాదనలను కింది అంశాలుగా వింగడించే అవకాశం ఉంది.

1) వర్గీకరణతోనే దళిత సమస్యలన్నీ పరిష్కారమైపోతాయనే దానితో గ్రంథకర్త కూడా విభేదిస్తున్నాడు. కానీ దళిత సమస్యల పరిష్కారంలో మొదటి మెట్టుగా, లేదా ఒక్కో మెట్టుగా సమస్య పరిష్కారమనేది సాధించటంలో 'వర్గీకరణ'ను ఒకటిగా గుర్తించమంటున్నాడు. దీనికి అవసరమైతే క్రిమీలేయర్ విధానాన్ని కూడా పాటించడం వల్ల నిజమైన దళితులకే అవకాశాలు అందుబాటులోకి రాగలిగి, రిజర్వేషన్ల లక్ష్యం నెరవేరుతుందంటున్నాడు.

2) వర్గీకరణ వాదానికి బ్రాహ్మణత్వ భూమికను రచయిత అంగీకరించడం లేదు. బ్రాహ్మణత్వ / హిందూత్వ భావాలతో వర్గీకరణను సమర్థించే పార్టీలు ఉన్నా, అదే ప్రభావం పూర్తిగా వర్గీకరణ సమర్థనకు ఉందనడం సమంజసం కాదంటున్నాడు. దీన్ని సోపపత్తికంగా నిరూపించాడు.

3) పేర్ల వెనుక ఉండే కుల సూచికల పట్ల కూడా రచయిత దృష్టి కేంద్రీకరించడం కనిపిస్తుంది. 'కుల అస్తిత్వం' సమాజంలో వ్యక్తి అస్తిత్వాన్ని నిర్ణయించింది. "అస్పృశ్యులు"గా ఉన్న వాళ్ళే అంతర విభజనలకు గురై వారి కుల సూచికలను గౌరవప్రదంగా భావించుకోవడం వల్లనే గౌరవాన్ని పొందగలిగారు. కానీ, మాల - మాదిగల కుల సూచికలు బలవంతపు ఆరోపిత కుల సూచికలు. నిందార్థంలో, నీచార్థంలో అంగీకరింపజేసినవి. అయినా వాటితోనే 'తిరుగుబాటు తత్వం'తో గౌరవప్రదంగా మార్చుకోగలగాలంటున్నాడు గ్రంథకర్త. ఈ విషయంలో అంబేద్కరిజమ్‌తో కొంచెం లోతుగా ఆలోచించవలసిన అవసరం ఉంది. కానీ, ప్రత్యామ్నాయాన్ని అలోచించి, అది అందరికీ ప్రసరింపజేయడం కంటే, ఉన్న దానిలోనే ఔన్నత్యాన్ని సాధించుకోవడం అనే పద్ధతీ ఉంది. ఆ పద్ధతిలోనే ఆపాదిత గౌరవం కుల సూచికలకు ఏర్పడుతుంది. దీన్నింకా లోతుగా చర్చించవలసిన అవసరం ఉంది! ఈ విషయంలో ఇక్కడ మాదిగ దండోరా సాధించిన సాంస్కృతిక ఔనత్యాన్ని గ్రంథ కర్త సిద్ధాంతీకరించే ప్రయత్నం కనిపిస్తుంది.

4) ప్రభుత్వ రంగంలో ఉపాధి అవకాశాలు కోల్పోయిన తర్వాత ప్రయివేట్ రంగంలో రిజర్వేషన్ల కోసం దళితులు ఉమ్మడిగా పోరాడవలసిన తరుణంలో, వర్గీకరణ చేటు తెస్తుందనే విషయాన్ని సునిశితంగానే పరిశీలించగలిగాడు. ప్రభుత్వ ఉపాధి అవకాశాల్లో ఉన్న కొద్దిపాటి అవకాశాలనే మాదిగ, తదితర ఉపకులాల వారికి లభించనివ్వని వాళ్ళు, రేపు ఉమ్మడిగా ప్రయివేట్ రంగంలో రిజర్వేషన్లు సాధిస్తే అప్పుడు అవకాశాల్ని పొందనిస్తారని ఎలా నమ్మగలమని సహేతుకంగానే ప్రశ్నిస్తున్నాడు. రెండో కోణంలో ప్రభుత్వ ఉపాధి అవకాశాలు ఇప్పటికే కోల్పోయినా, ఇకపై రాబోయే ప్రయివేట్ రంగంలో రిజర్వేషన్లనయినా కాపాడుకోవాలంటే వర్గీకరణ ఉండవలసిందే అనేది మరో వాదనగా ముందుకి తీసుకొస్తున్నాడు.

5) రాజ్యాధికార భావన గురించి ఆచరణాత్మక సిద్ధాంతాన్ని గ్రంథంలో ప్రతిపాదించి, 'దళిత రాజ్యాధికారం' అనే దానికి కొత్త నిర్వచనానివ్వగలుగుతున్నాడు రచయిత. అంబేద్కరిజం పునాదిగానే దీని విస్తృతపరిచే ప్రయత్నం చేశాడు. రాజ్యాధికారం రావడానికి ముందుగా వర్గీకరణ వాదాన్ని అంగీకరించవలసి ఉంటుందంటున్నాడు. అలా వీలుకానంత వరకూ దళితుల పేరుతో మాలలు మాత్రమే రిజర్వేషన్ అవకాశాలను అనుభవిస్తున్నారనేది దళిత సమైక్యత పేరుతో జరిగే కౌటిల్యాన్ని మాదిగలు గుర్తించగలిగారనేది గ్రంథకర్త విశ్లేషణ. దీనితోపాటు ప్రభుత్వ విద్యలో సంస్కరణలు రావాలనేది కూడా రచయిత ఆకాంక్షగా కనిపిస్తుంది. అలా కాకపోతే రిజర్వేషన్ల లక్ష్యం దెబ్బతినే ప్రమాదం ఉందంటున్నాడు. ఇది కేవలం దళితుల్లోని ఒక వర్గ ప్రయోజనాన్ని మాత్రమే ఆకాంక్షించేది కాదు. వర్గీకరణానంతరం దళితుల శాశ్వతాభివృద్ధికి సంబంధించిన తాత్త్విక ఆలోచన. కనుక, ఈ గ్రంథంలో కేవలం దళితుల్లో ఒక వర్గాన్ని గుడ్డిగా సమర్థిస్తున్నాడనుకోవడానికి వీలులేదు.

ఇలా దళిత సమస్యకు వర్గీకరణ వాదంతో 'పంచసూత్ర సిద్ధాంతాన్ని' ఈ గ్రంథంలో ప్రతిపాదించి, ఒక చారిత్రక పత్రం (Historical Document)గా దీన్ని రూపొందించాడు. ప్రతి పల్లె మూలమూలకీ ఈ భావజాలం ప్రచారం కావలసి ఉంది. ఒక వర్గం ఎలా రామాయణం , భారతం , భాగవతాలు చదివించుకుని ఆనందిస్తుందో,అలా ఈ చారిత్రక పత్రం ప్రతి దళితుడూ చదివి/ చదివించుకొని ఆలోచించమంటున్నాడు. వర్గీకరణ పోరాటంలో భాగస్వామ్యం కల్పించుకొని, వర్గీకరణను సాధించుకొనే దిశగా ప్రేరేపిస్తున్నాడు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన తీర్మానాన్ని అనుసరించి, రాష్ట్రపతి విడుదల చేసిన ఒకప్పటి ప్రత్యేక చట్టం వలే గానీ, ప్రత్యేక ఉత్తర్వుతో గానీ మాదిగ, అనుబంధ ఉపకులాలు వారి హక్కులను తక్షణం పరిరక్షించాలనేదే గ్రంథకర్త వాదంలోని సారాంశం. అదే ప్రధానంగా మాదిగ దండోరా నాయకులు కూడా కోరుకునేది. మాదిగ, తదితర ఉపకులాలు ఆశించేది! అంతవరకు కేవలం క్రిమీలేయర్, ప్రాంతాలవారీ రిజర్వేషన్లు, గ్రామీణ, పట్టణ దళితుల విభజన, రాజ్యాధికారం వంటివన్నీ తర్వాత ఆలోచించవలసిన విషయాలయినా ప్రాధాన్యక్రమాన్ని పాటించవలసి ఉంటుందని విశ్లేషిస్తున్నాడు.

గ్రంథాన్ని చక్కని శైలిలో రాశాడు. వాక్యాల్లో అక్కడక్కడా హృదయం నుండి పొంగిపొరలే కవిత్వ ధార కూడా కనిపిస్తుంది. స్పష్టతను, ఆత్మీయతను మరింత అర్థవంతంగా చెప్పాలనుకునే అక్షర వేదనగా దీన్ని అర్థం చేసుకోవాలి. సామాన్యుడికి అందే విధంగా తన భావాల్ని బాగా పంచుకోగలిగాడు. ప్రస్తుతం దళితుల్లో సాంఘిక శాస్త్రాల అధ్యయనం వల్ల రాటుదేలిన Social Scientists రావలసిన అవసరం ఉంది. అలాంటి Social Scientists వైయక్తిక అభివృద్ధి కంటే, వ్యవస్థ అభివృద్ధికి తోడ్పడగలుగుతారు. ఆ లక్షణాలు సాంబయ్య గుండిమెడలో కనిపిస్తున్నాయని ఈ పుస్తకం చదివిన వారి అందరికీ అనిపిస్తుంది. ఇంకా అనేక కొత్త ఆలోచనలు గ్రంథంలో ఉన్నాయి. గ్రంథంలోనికి వెళ్ళండి. బయట సమాజంలోని వాస్తవికతను అర్థం చేసుకోండి. నిజమైన న్యాయాన్ని బలపరచండి.

దళితుల అభ్యున్నతికి కృషి చేసే వారిలో సాంబయ్య గుండిమెడ కూడా ఒక వరసలో నిలవగలిగే మంచి ఆలోచనలను అందించే ఇలాంటి మరిన్ని రచనలను చేయాలని ఆశిస్తూ............

-డా//దార్ల వెంకటేశ్వరరావు


(సాంబయ్య గుండిమెడ రాసిన పుస్తకానికి రాసిన ముందు మాట)

No comments: