Monday, June 02, 2008

దౌర్జన్యం దళితుల తత్వం కాదు!- మల్లెపల్లి లక్ష్మయ్య

గతంలో మీడియా పై జరిగిన దాడులతో పోలిస్తే ఇటీవల 'ఆంధ్ర జ్యోతి'పై ఎమ్మార్పీఎస్ చేసిన దాడి అన్ని రకాలుగా భిన్నమైం ది. 'ఆంధ్రజ్యోతి' కార్యాలయంపై ఇరవై మందికి పైగా యువ కులు పెట్రోలు డబ్బాలతో, కర్రలతో దాడిచేసి అద్దాలను పగులగొట్టి, కార్లను ధ్వంసం చేసి చివరకు రిసెప్షన్ ఫర్నిచర్‌పై పెట్రోలు చల్లి అంటించారు. ఈ దాడిలో రిసెప్షనిస్టుపై కూడా పెట్రోలు పడింది. ఒక వేళ ప్రమాదవశాత్తు మంటలు ఆమెకు అంటుకొనివుంటే ఒక నిండు ప్రాణం బలయ్యేది. ఏరీత్యా చూసినా ఈ దాడి చాలా తీవ్రమైంది, అమానుషమైంది కూడా. గతంలో మీడియా పై దాడిచేసిన వారు ప్రధా నంగా ప్రభుత్వాధికారులు, పోలీసులు, రాజకీయ పక్షాల నాయకులు, అసాంఘిక శక్తులు . ఈ దాడి చేసిన వాళ్ళు గత పదేళ్ళకు పైగా ఒక సామాజిక సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఏనాడు మీడియా తో ఘర్షణలేని వాళ్ళు. పైగా మీడియా సహకారంతో తమ ఉద్యమాన్ని కొనసాగించిన వాళ్ళు. వైరంగాని, పెద్దగా వైరుధ్యంకాని లేని ఈ వర్గం యీ దాడికి పూనుకోవటం ఒకింత బాధ కలిగించే విషయం. సమాజంలో జరుగుచున్న చెడుకు వ్యతిరేకంగా మీడియా ప్రజల పక్షాన నిలబడటం, ప్రజా ఉద్యమాలతో భుజం, భుజం కలిపి తమ వంతు సహాయాన్ని అందించడం ఇప్పటి వరకు జరుగుతున్నది. ఆయా పత్రికల స్వభావాన్ని బట్టి కొంచెం ఎక్కువతక్కువగా ఈ స్పందన వుండవచ్చు. ప్రజా ఉద్యమాలు, పత్రికలు ఒకే ప్రవాహంలో కలిసి పయనిస్తున్న నావలలాంటివి. కాని ఇవి ఈ రోజు ఒక దానికెదురుగా ఒకటి నిలుచొని డీకొనే పరిస్థితి వచ్చింది. ఇది ఎంత మాత్రం వాంఛ నీయం కాదు. పైగా ఈ పరిణామం ప్రజా ఉద్యమాలు నడిపే వాళ్ళకు మంచిది కాదు. అంతిమంగా పేద ప్రజల ప్రయోజనాలకు భంగం కలి గే అవకాశం ఉంది. ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన వార్తాకథనం కొంత మందికి బాధ కలిగించి వుండవచ్చు. దానిని ఎవరం తప్పు పట్టడానికి లేదు. తమకు ఇబ్బంది కలిగించిన అంశాన్ని మరొక విధంగా ఎదు ర్కోవడానికి ప్రయత్నించి వుండాల్సింది. ఆంధ్రజ్యోతి గతంలో ఎప్పు డూ కావాలని దళితులు, బిసిలకు వ్యతిరేకంగా పని కట్టుకొని రాయ లేదు. గత ఐదేళ్ళకు పైగా ఆంధ్రజ్యోతి సంపాదక వర్గం, యాజమా న్యం అనేక కోణాల నుంచి దళితుల సమస్యలను వెలుగులోకి తీసుకొ చ్చాయి. ఉదాహరణకు గత ఐదేళ్ళుగా నేను రాస్తున్న కాలమ్‌లో నిత్యం దళిత సమస్యలను ఎత్తిచూపే అవకాశాన్ని యాజమాన్యం కల్పించింది. దళితుల బడ్జెట్‌కు సంబంధించిన అనేక వార్తాకథనాలు ఈ పత్రికలో అచ్చయిన విషయం తెలిసిందే. అంటే దీనర్థం పత్రిక యాజ మాన్యానికి దళిత ప్రజల పట్ల వ్యతిరేకత లేదనే విషయం మనకర్థమవు తుంది. అయితే ఆ పత్రిక రాస్తున్న ప్రతి విషయాన్ని అందరూ అంగీకరించాల ని లేదు. కొంతమందికి ఆ పత్రికలో వచ్చిన అంశాలు నచ్చకపోవచ్చు. దానిని దాడితో కాకుండా న్యాయపరంగా, నైతిక పరంగా ఎదుర్కోవ డానికి ప్రయత్నించాల్సింది. పత్రికలలో వస్తున్న వార్తల విషయంలో కొన్ని చట్టాలు ఉన్నాయి. కొన్ని నియమాలున్నాయి. ఆ చట్టా లను, ఆ నియమాలను వాడుకొని నిన్నటివరకు స్నేహితులుగా ఉన్న పత్రికారం గాన్ని తమపద్ధతులు మార్చుకొనేట్టు చేయాల్సివుంటుంది. ఏవైనా తప్పులు దొర్లితే వాటిని సరిదిద్దడానికి సంఘాల అభిప్రాయాల ను ప్రచురించే విధంగా కోరవచ్చు. ఒకవేళ ఆ పత్రిక బాధ్యులు ప్రచురించ డానికి అంగీకరించకపోతే న్యాయపరంగా న్యాయస్థానాలలో కేసులు పెట్టవచ్చు. ప్రెస్ కౌన్సిల్ లాంటి సంస్థల్ని ఆశ్రయించి న్యాయం కోరవ చ్చు. ఈ విధమైన పద్ధతుల్లో కూడా తాము కోరిన విధంగా న్యాయం దొరకక పోతే ప్రజా సంఘాల ద్వారా ప్రజల్లోనికి వెళ్ళి ఆ పత్రిక తప్పు లను ఎత్తి చూపవచ్చు. ఆ విధంగా తాము చేస్తున్న పని న్యాయమైన దని చాటుకొనే అవకాశం వుంటుంది. అంతే కాకుండా ప్రజల్లో ఆ పత్రి కల స్వభావాన్ని ఎండగట్టి నిజాలను పత్రికలు గుర్తించేటట్టు చేయవ చ్చు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక మంచి ఆనవాయితీ. ఆ విధం గానే దీర్ఘకాలంగా తాము చేస్తున్న చేయబోతున్న ఉద్యమానికి ఒక మంచి అండదండ దొరికే అవకాశం ఉంటుంది. ఈ సమాజంలో దళితులు వెలివేతకు గురౌతున్నారనే విషయంలో ఎవరికీ సందేహం అక్కరలేదు. అన్ని రంగాలనుంచి వీళ్ళను పక్కన పెడుతున్నారనే నిజం ఎవరూ కాదనటానికి లేదు. ముఖ్యంగా సమా జం అంటే మతం, కులం లాంటి వ్యవస్థలు దళితుల్ని మరింత అణచి వేతకు గురిచేస్తున్నాయి. వీటిని ఎదుర్కోవటంలో ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, మీడియా దళితులకు అండగా నిలస్తున్నాయి. నిజానికి ఈ మూడు అంగాలు కూడా ఈ వ్యవస్థ నుంచి పుట్టినవే. అయితే ఇందు లో ప్రభుత్వంలో ఉండే వివిధ విభాగాలు ఇప్పటివరకు దళితుల పట్ల నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నాయి. ఏదో మొక్కుబడిగా వందల పథకా లు ప్రకటించుకున్నప్పటికీ వాటి అమలు ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. ఇది గత అరవై ఏళ్ళ అనుభవం. అదే సమయంలో రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఏవో కొన్ని వాగ్దానాలు చేసి ఓట్లు దండు కోవటానికి ప్రయత్నం చేస్తుంటాయి. ఎన్నికల్లో గెలిచిన తరువాత అందులో కొన్నింటిని అమలు చేసినట్టు నటించడం చాలావాటిని పట్టిం చుకోకపోవటం మనం చూస్తున్నాం. ఈ విషయాలను గమనించి ప్రభు త్వంపై, రాజకీయ పార్టీలపై దళితుల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న సంఘాలకు నైతికపరమైన మద్దతు ఇప్పటివరకు మీడియా నుంచే లభి స్తున్నది. దానివలన ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు తమ విధానాలు, పద్ధతులను మార్చుకొని కొంత మేరకు న్యాయం చేయటానికి వీలవ తున్నది. ఇది ఎవరికి ఎన్ని అభిప్రాయాలున్నా కాదనలేని సత్యం. అటువంటి పరిస్థితిలో ప్రజా సంఘాలు ముఖ్యంగా దళిత సంఘా లు మీడియా పట్ల వ్యవహరించాల్సిన తీరులో శ్రద్ధ వహించాలి. అంతే కాని అమీతుమీ తేల్చుకొనే పద్ధతికి వెళ్ళటం ఎంతమాత్రం మంచిది కాదు. సమాజం పైన జరుగుతున్న పోరాటం ఈనాటిది కాదు. ఈరోజు అయిపోయేది కూడా కాదు. ఈ సమాజంలో దళితులు కూడా అందరి లాగ మానవులుగా గుర్తింపబడేవరకు ఈ పోరాటం వివిధరూపాలలో సాగుతూనే వుంటుంది. అందులో భాగంగా అక్కడక్కడ మీడియాతో కూడా అభిప్రాయ బేధాలు రావచ్చు. వైరుధ్యాలు కూడా రావచ్చు. కాని అది వైరంగా మారకూడదు. సమాజంలో అన్ని అంగాలలో ఎంతోకొం త దగ్గరగా వున్న మీడియాను శత్రువుగా చేసుకోవటం అంటే వున్న ఒక అండదండను దూరం చేసుకోవడమే అవుతుంది. ప్రజాస్వామ్య భావాలను అమితంగా నమ్ముతున్న దళిత జనులకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘాలు ఆచరణలో ప్రజాస్వామ్య విధానా లనుంచి పక్కకు తొలగరాదు.దౌర్జన్యం దళితుల తత్వంకాదు. ఈ విష యంలో డాక్టర్ అంబేద్కర్ మనందరికి ఆదర్శం కావాలి.

No comments: