Saturday, May 31, 2008

గుజ్జర్ల సమస్య ఏమిటి? ( ఈనాడు వార్తాకథనం)


'గుజరాత్' గుజ్జర్లదే!


భారత్‌లో మమేకమైపోయిన తెగ


హిందూ, ముస్లిం, సిక్కులూ వారే


రాజస్థాన్‌లో మరోసారి కులచిచ్చు రగులుకుంది. ఎస్టీ హోదా కోసం గుజ్జర్లు ప్రారంభించిన పోరాటం హింసాత్మకంగా మారింది. ప్రాణాల్ని బలితీసుకుంటోంది. ఈ నేపథ్యంలో అసలు గుజ్జర్లు ఎక్కడి నుంచి వచ్చారు? వారి పుట్టు పూర్వోత్తరాలు... చారిత్రకంగా వీరులుగా పేరున్న వీరు ఎస్టీ హోదా డిమాండ్ చేసే పరిస్థితి ఎందుకొచ్చింది? వంటి విశేషాలను పరిశీలిస్తే... మొదట క్షత్రీయులే: గుజ్జర్లను ప్రాంతాన్ని బట్టి, వాడుకని బట్టి గుర్జర్, గుర్జారా, గుజార్, గూజర్ అనే పేర్లతో కూడా పిలుస్తారు. ఈ తెగ పుట్టుక గురించి స్పష్టమైన ఆధారాలేవీ లేవు. చారిత్రకంగా వీరు మధ్య ఆసియా నుంచి అఫ్గానిస్థాన్ మీదుగా భారత్ వచ్చారని పరిశోధకులు చెబుతారు. భారత్‌పై హుణుల దండయాత్రల కాలంలో వారితో పాటు వచ్చారని కూడా మరికొందరు అంటారు. 7వ శతాబ్దంలో రాజస్థాన్‌లోని మౌంట్ అబూ ప్రాంతంలో వీరు రాజ్యాన్ని స్థాపించారు. అప్పట్లో దేశంలో హర్షుడి పాలన నడుస్తోంది. 8వ శతాబ్దం తొలినాళ్లలో వీరు భారత్‌పై అరబ్బు దండయాత్రలను సమర్థంగా ఎదుర్కొన్నారు. అయితే ప్రతీహార రాజుల దాడుల్లో గుజ్జర్లకు చెందిన ఛాపా సామ్రాజ్యం పతనమైంది. ప్రతీహారులు ఈ ప్రాంతాన్ని క్రీ.శ.1000 వరకు పాలించారు. తర్వాత ఘజనీ మహ్మద్ దండయాత్రలో వారి అధికారమూ అంతమైంది. మరోవైపు రాజస్థాన్ విడిచిపెట్టిన గుజ్జర్లు గుజరాత్ ప్రాంతంలో స్థిరపడ్డారు. వారు గుజారీ అనే భాషను మాట్లాడేవారు. ఇది పహారీ, ఉర్దూ భాషలకు దగ్గరగా ఉంటుంది. 10వ శతాబ్దంలో కాశ్మీర్‌కు చెందిన రాజా శంకర్‌వర్మన్ గుజరాత్‌పై దాడి చేసే సమయానికి ఈ రాజ్యాన్ని లఖన్‌దేవ్ పాలించేవాడు. ఈ కాలంలోనే గుజ్జర్ల అధీనంలో ఉన్న పంజాబ్‌లోని టక్కా అనే ప్రాంతాన్ని శంకర్‌వర్మన్ చేజిక్కించుకున్నాడు. దీన్నిబట్టి ఈ తెగ పంజాబ్ వరకు విస్తరించిందని భావిస్తారు. గుజరాత్, గుజ్రన్‌వాలా, గుజార్‌ఖాన్, గుర్దాస్‌పూర్ వంటి పేర్లు గుజ్జర్ అనే పదం నుంచి వచ్చి ఉండొచ్చని కొందరు వాదిస్తారు. అయితే ఇందుకు ఎలాంటి ఆధారంలేదు. ఇక మొఘల్ కాలంలో అక్బర్ పాలన నాటికి గుజ్జర్ల రాజ్యం పూర్తిగా మాయమైంది. ఈ కాలంలోనే ఉత్తర ప్రాంతంలోని కొందరు గుజ్జర్లు ఇస్లాంకు మారడంతో హిందువులుగా ఉన్నవారికీ, వీరికీ సంబంధాలు అడుగంటిపోయాయి. కొన్నాళ్లకు గుజ్జర్ల ప్రాంతంలో (ప్రస్తుతం రాజ్‌పుటానా, గుజరాత్, కథియవాడ్‌గా పిలిచే ప్రాంతాలు) తీవ్రమైన కరవు రావడంతో వీరిలో కొన్ని తెగలు కాశ్మీర్ తదితర ప్రాంతాలకు వలసపోయాయి. ప్రస్తుతం వీరు భారత్‌తో పాటు పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌లలో ఉన్నారు. మనదేశంలో దాదాపు ఉత్తరాది రాష్ట్రాలన్నింటిలోనూ ఈ తెగవాళ్లున్నారు. వీరిని హిమాచల్, కాశ్మీర్‌లలో ఎస్టీలుగా, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో ఓబీసీలుగా గుర్తించారు. హిందు, ఇస్లాంలతో పాటు సిక్కులు, జైనుల్లోనూ గుజ్జర్లు ఉన్నారు. కాశ్మీర్‌లో వీరిని సున్నీ ముస్లింలుగా పరిగణిస్తారు. 18వ శతాబ్దం నాటికి కూడా కొన్ని చిన్న ప్రాంతాల్లో ఆధిపత్యం చెలాయించిన గుజ్జర్లు బ్రిటీష్ వారిని తరచూ చికాకు పెట్టారు. 1857 సిపాయిల తిరుగుబాటులోనూ పాల్గొన్నారు. కొన్ని ప్రాంతాల్లో గుజ్జర్ తెగలు దోపిడీలకు పాల్పడడంతో బ్రిటిష్ ప్రభుత్వం ఓ చట్టం ద్వారా వారిని నేరగాళ్ల తెగగా ప్రకటించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక దీన్ని రద్దుచేశారు. రాజస్థాన్‌లో ఓబీసీలు: ప్రస్తుతం రాజస్థాన్ జనాభాలో గుజ్జర్లు 6 శాతం ఉన్నారు. డాంగ్ ప్రాంతంగా పిలిచే సవాయ్ మధోపూర్, కరౌలీ, ధోల్‌పూర్, భరత్‌పూర్, దౌసా జిల్లాల్లో వీరు ఎక్కువగా ఉన్నారు. చారిత్రకంగా క్షత్రియులుగా గుర్తింపు ఉన్న వీరు రాష్ట్రంలో ఓబీసీలు. కాంగ్రెస్ దివంగత నేత రాజేష్ పైలట్ గుజ్జర్ తెగకు చెందినవారే. రాష్ట్ర జనాభాలో 12 శాతం ఉన్న మీనాలు ఎస్టీ హోదాలో పొందుతున్న ప్రయోజనాలను చూసి గుజ్జర్లు చాలా ఏళ్ల క్రితం నుంచే ఆ హోదా కోసం డిమాండ్ చేయడం ప్రారంభించారు. 1981లోనే కాంగ్రెస్ ప్రభుత్వం వారి డిమాండ్‌ను తోసిపుచ్చింది. భాజపా కూడా దీన్ని పట్టించుకోలేదు. నిజానికి ఒక సామాజిక వర్గం స్థితిగతుల ఆధారంగా దాన్ని ఎస్సీ, ఎస్టీల్లో చేర్చే అంశం కేంద్రం పరిధిలోనిది. ఇలా చేయడానికి రాజ్యాంగ సవరణ, రాష్ట్రపతి ఆమోదం అవసరం. ఈ ప్రక్రియలో జిల్లా కలెక్టర్ నుంచి వచ్చే నివేదిక ఆధారంగా కేంద్రానికి సిఫారసు చేయడం వరకే రాష్ట్రం పాత్ర పరిమితం. దాన్ని ఆమోదించాలా వద్దా అన్నది కేంద్రం విచక్షణ. అయితే ఈ అంశాన్ని పట్టించుకోకుండా వారికి ఎస్టీ హోదా కల్పిస్తామని గత ఎన్నికల సమయంలో భాజపా హామీ ఇచ్చింది. ఇదే ఇప్పుడు సమస్యకు దారితీసింది.


(ఈనాడు 25-05-2008 సౌజన్యంతో...)

1 comment:

bojja.vasu said...

డా.దార్ల వెంకటేశ్వర రావు గారు గుజ్జర్ల మీద మీరు వ్రాసిన టపా చక్కటి విశ్లేషణతొ ఉంది.మీ బ్లాగు చూడటం ఇదే మొదటిసారి.చాలా విషయాల మీద మీరు వ్రాసిన టపాల చిట్టా చూస్తుంటేనే మీ శ్రమ అర్థం అవుతుంది.
అభినందనలు.
మీరు తెలుగు వికిపిడియాకి(http://te.wikipedia.org) మీరు ఏమయినా వ్యాసాలు వ్రాసారా?
తెలుపగలరు.