సామాజిక అన్యాయం 'సమైక్య'వాదం

( కృపాకర్ మాదిగ రాసిన ఈ వ్యాసం చర్చ కోసం ఆంధ్రజ్యోతి దినపత్రిక ( 31-12-2009)సౌజన్యంతో ఇక్కడ ప్రచురిస్తున్నాను.)

చిన్న రాష్ట్రాల డిమాండ్లకు సానుకూలంగా ఉండడం అంబేడ్కర్‌వాద దృక్పథమని సామాజిక న్యాయం కోరుకునే ప్రజలంతా గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు సీమాంధ్ర రాజకీయ పార్టీల ఉచ్చుల్లో చిక్కుకోకుండా, గుడ్డి ద్వేషాలను పెంచుకోకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును స్వాగతించాలి.

నేను సమైక్య వాదిని కాదలుచుకోలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియని వ్యతిరేకిస్తూ 'సమైక్యాంధ్ర' నినాదంతో సీమాంధ్ర రాజకీయ పార్టీ లు బలవంతపు 'ఐక్యత'కి దిగాయి. మూకుమ్మడిగా ఎంపీ, ఎమ్మెల్యేల పదవుల రాజీనామాల నాటకాలతో ఇటు తెలంగాణ రాష్ట్రం కోరుకుంటున్న వారిని, అటు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్‌ చేశాయి. సీమాంధ్రా రాజకీయ నేతలు ఆమరణ నిరాహార దీక్షలు, బందులు, ప్రదర్శనలు, రాస్తారోకోలు, నిరసనల తో తెలంగాణ రాష్ట్రం పునరుద్ధరణని వ్యతిరేకిస్తూ సామాజిక అన్యాయానికి ఒడిగట్టినందుకు... నేను సమైక్యవాదిని కాను.

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఊపందుకున్న సమయంలోనే తెలంగాణ ప్రాంతం పట్ల అత్యంత వివక్ష చూపెడు తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 1845ను జారీ చేసింది. ఈ జీవో ద్వారా గ్రామీణ రహదారుల అభివృద్ధి కోసం కోస్తాంధ్ర ప్రాంతానికి 103.67 కోట్లు, రాయలసీమ ప్రాంతానికి 15.57 కోట్లు, తెలంగాణ ప్రాంతానికి కేవలం 9.31 కోట్ల రూపాయల ను మాత్రమే కేటాయించి ఆంధ్ర పాలకులు మరోసారి తెలంగాణ ప్రాంతం పట్ల వివక్షాపూరిత దురహంకారాన్ని నిరూపించుకున్నారు. ఇదేమని ముఖ్యమంత్రిని నిలదీసిన తెలంగాణ ప్రజాప్రతినిధులను సచివాలయంలోనే అక్రమంగా అరెస్టులు చేసినందుకు గాను... నేను సమైక్యవాదిని కాను.

1956లో తెలంగాణ, ఆంధ్ర విలీనం షరతులతో కూడుకున్నదన్న సంగతిని సీమాంధ్ర నేతలు, రాజకీయ పార్టీలు మరుగుపరుస్తున్నందుకు నేను సమైక్యవాదిని కాను. 1956కు ముందున్న హైదరాబాద్‌ (తెలంగాణ) రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని ఆదేశిస్తు న్న ముల్కీ నిబంధనలను కొనసాగిస్తామని రాసుకున్న పెద్దమనుషుల ఒప్పందాన్ని ఆంధ్ర పాలకులు నిరంతరాయంగా ఉల్లంఘిస్తున్నందుకు నేను సమైక్యవాదిని కాను. పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం ముల్కీ నిబంధనలు కొనసాగకపో తే, తెలంగాణకు విపరీతమైన అన్యాయం జరుగుతుందని, ఇదే గనక నిజమైతే తిరిగి తెలంగాణ (హైదరాబాద్‌) రాష్ట్రాన్ని పునరుద్ధరించుకోవచ్చునని సూచించిన ఫజల్‌ ఆలీ, నెహ్రూల అభిప్రాయాలను సీమాంధ్ర రాజకీయ పార్టీలు అగౌరవపరిచినందుకు నేను సమైక్యవాదిని కాను. 1919 నవంబర్‌ 16న నిజాం ముల్కీ ఫర్మానా జారీ చేశా డు.

ఈ ఫర్మానా ప్రకారం స్థానికులు మాత్రమే ప్రభుత్వోద్యోగాలకు అర్హులు. ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే, స్థానికులు ముల్కీ సర్టిఫికెట్స్‌ని తప్పనిసరిగా సమర్పించాలి. ఐతే ఇంకా స్పష్టతతో సవరించిన ముల్కీ ఫర్మానా 1934 జూన్‌7న జారీ అయ్యింది. దీని ప్రకారం 12-15 సంవత్సరాల స్థిర నివాసం తో పాటు అభ్యర్థి పూర్వీకుల నివాసం, వివాహబంధం, ఆస్తు లు తదితర అంశాలను లెక్కలోకి తీసుకుని ముల్కీ సర్టిఫికెట్‌ జారీ చెయ్యాలని ఈ ఫర్మానా ఆదేశిస్తున్నది. కాగా, ఆంధ్ర, హైదరాబాద్‌ రాష్ట్రాల విలీనానికి ముందు 1956 జూన్‌19న జరిగిన పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం విలీనానంతరం కూడా తెలంగాణలో ముల్కీ రూల్స్‌ అమలు జరగాలి.

అలా జరగని పక్షంలో తెలంగాణ వారు తమ రాష్ట్రాన్ని పునరుద్ధరించుకోవచ్చు. ఐతే ముల్కీ నిబంధనలకు విరుద్ధంగా 1956- 1968 నాటికి హైదరాబాద్‌లో అక్రమంగా ఉద్యోగాల్లోకి చొరబడిన సీమాంధ్రుల సంఖ్య 22 వేలు. వీరిని వెనక్కి పంపాలని అప్పటి కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం జీవో 36ను జారీ చేసింది. ఈ జీవోకు వ్యతిరేకంగా ముల్కీ రూల్స్‌ను రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రావారు ఉన్నత న్యాయస్థానాలకు ఎక్కినందు వల్ల నేను సమైక్యవాదిని కాను. ఆంధ్రుల అక్రమ నియామకాలను నిలువరిస్తూ, ముల్కీ రూల్స్‌ రాజ్యాంగబద్ధమేనని 1972 అక్టోబర్‌ 16న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీనితో ఖంగుతిన్న ఆంధ్ర రాజకీయ పాలకులు అంతటితో ఊరుకోకుండా ఏకంగా సుప్రీంకోర్టు ధృవీకరించిన ముల్కీ రూల్స్‌నే రద్దు చేయించారు.

ఇందుకు వారు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేసి పార్లమెంటులో 32వ రాజ్యాంగ సవరణ ద్వారా అధికరణం 371కి 'డి' క్లాజు ను చేర్చారు. ఈ సవరణతో సంక్రమించిన అధికారంతో రాష్ట్రపతి 1975 అక్టోబర్‌ 18న (ఆరు సూత్రాల పథకం) ఉత్తర్వు లు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల స్ఫూర్తిని కూడా ఉల్లంఘించి ఆంధ్ర, రాయలసీమ ఉద్యోగులు 1975 నుంచి 1985 వరకు 60 వేల మంది అక్రమంగా హైదరాబాద్‌లో చొరబడ్డారు. వీరిని వెనక్కి పంపడానికి 1985లో ఎన్టీఆర్‌ ప్రభుత్వం 610 జీవోని జారీ చేసింది. హైదరాబాద్‌లో అక్రమంగా ఉన్న ఆంధ్ర ప్రాంత ఉద్యోగులను వెనక్కి పంపడానికి ఉద్దేశించిన ఈ జీవోను హైదరాబాద్‌లో ఉన్న తెలంగాణ ప్రాంత ఉద్యోగులను వెనక్కి పంపడానికి ఉపయోగిస్తూ మరో చారిత్రక తప్పిదాన్ని చేస్తున్న ఆంధ్ర పాలకుల పోకడల వల్ల నేను సమైక్యవాదిని కాను.

సీమాంధ్ర రాజకీయ పార్టీలు తెలంగాణ ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయాయి. ఆంధ్రోళ్ల మోసపూరిత పొత్తు వద్దని తెలంగాణ వారు అంటుండగా, మనమంతా ఒక్కటే, మనదంతా ఒక్కటేనని సీమాంధ్ర నేతలు ముందుకు తెస్తున్న దౌర్జన్యపూరిత ఐక్యత వల్ల నేను సమైక్యవాదిని కాను. నీళ్లు, నిధులు, నియామకాల అమలులో తెలంగాణకు పంపిణీ న్యాయం ఎన్నడూ అందలేదు. ప్రతిచోట, ప్రతిదశలో పథకం ప్రకారం తెలంగాణ ప్రజలు ఆంధ్ర పాలకులచే మోసగించబడ్డారు. కొల్లగొట్టబడ్డారు. 20 ఏళ్ల కిందట తూర్పు ఐరో పా సంఘర్షణలకు లోనై అనేక కొత్త, చిన్న దేశాలుగా విడిపోయిన చరిత్ర మనం చూశాం. ఎంత రక్తపాతం జరిగిందో తెలిసిందే.

అటువంటి హింసాపూరిత సంఘటనలు మన దేశంలో చోటు చేసుకోకూడదు. అత్యంత అణచివేతలకు గురైన ప్రాంతాలకు, అణగారిన సాంఘిక సమూహాలకు, జెండర్‌ వర్గాలకు, వివిధ రకాల మైనారిటీలకు వారు కోరుకున్న రీతు ల్లో ప్రాధాన్యంతో కూడిన సామాజిక న్యాయాన్ని ప్రభుత్వాలు అందించాలి. ఇందుకు వీలుగా మొదట రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యీకరించబడాలి. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ, మహిళల హక్కులు, ప్రాతినిధ్యాలు, చిన్న రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్లు అత్యవసరంగా పరిష్కరించవలసిన ప్రాధాన్యం గల డిమాండ్లుగా మన దేశంలోని రాజకీయ పార్టీ లు, కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు గుర్తించాలి.

దేశంలో ప్రాంతీ య, సామాజిక శాంతి భద్రతల సుస్థిర స్థాపన కోసం తెలంగాణ రాష్ట్రం, ఇతర కొత్త రాష్ట్రాల డిమాండ్లకు సానుకూల పరిష్కారాల కోసం రాజకీయ పార్టీలు స్పందించాలి. ఆంధ్రప్రదేశ్‌ స్నేహంగా విడిపోయి మొదట తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి. తదుపరి రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, మన్యసీమ రాష్ట్రాలు ఏర్పడాలి. హిందీ మాట్లాడే రాష్ట్రాలు పది ఉన్నప్పు డు తెలుగు మాట్లాడే రాష్ట్రా లు నాలుగైదు ఉంటే నష్టమేమీలేదని అందరూ గుర్తించాలి. రాష్ట్రాల సంఖ్య పెరిగి తే, కేంద్రం బలహీనపడుతుందనేది అపోహ మాత్రమే. ఎన్టీఆర్‌ తాలూకా వ్యవస్థకు మారుగా మండల వ్యవస్థ తీసుకువచ్చినప్పుడు స్వాగతించిన రాజకీయ పార్టీలు నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును అంగీకరించలేకపోవడం చాలా అన్యాయం.

అందువల్ల నేను సమైక్యవాదిని కాలేను. చిన్న రాష్ట్రాల డిమాండ్లకు సానుకూలంగా ఉండడం అంబేడ్కర్‌వాద దృక్పథమని సామాజిక న్యాయం కోరుకునే ప్రజలంతా గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు సీమాంధ్ర రాజకీయ పార్టీ ల ఉచ్చుల్లో చిక్కుకోకుండా, ద్వేషాలను పెంచుకోకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును స్వాగతించాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో పార్లమెంటులో చట్టం చెయ్య డం తప్ప, రాష్ట్ర శాసనసభ అభిప్రాయం నిర్ణయాత్మకం కాదంటున్న రాజ్యాంగ స్ఫూర్తిని సీమంధ్ర పార్టీలు, ప్రజాప్రతినిధు లు, నేతలు గ్రహించాలి. రాజ్యాంగంలోని అధికరణం 3కు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ప్రక్రియకు అన్ని రాజకీయ పార్టీలు, సీమాంధ్ర నేతలు చిత్తశుద్ధితో ముందుకు సహకరించాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడనంత వరకు, సీమాంధ్రుల్లో సానుకూల పరివర్తన రానంత వరకు నేను సమైక్యాంధ్రుడను కాజాలను.

-కృపాకర్‌ మాదిగ
(వ్యాసకర్త మాదిగ దండోర ఉద్యమ వ్యవస్థాపకులు)

'సమైక్యత' ఎవరి కోసం?

( సాంబయ్య గుండిమెడ రాసిన వ్యాసాన్ని ఆంధ్రజ్యోతికి పంపి దాన్ని నా బ్లాగులో పెట్టమని రచయిత ఫోను చేశారు. ఆంధ్రజ్యోతిలో నిన్న( 27-12-2009) దాన్ని ప్రచురించారు. ఆ వ్యాసాన్ని ఇక్కడ ప్రచురిస్తున్నాను.. దార్ల)

ఆంధ్ర విశ్వ విద్యాలయం వంటి కొన్ని చోట్ల అణగారిన కుల-వర్గాల విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది సమైక్య ఆంధ్ర అంటూ ఉద్యమంలో ముందున్నప్పటికీ, నిజానికి ఈ ఉద్యమం ద్వారా వారు బావుకునేది ఏమీ లేదు. సమైక్యంగా ఉండడం వల్ల వారు పొందుతున్న ప్రత్యేక ప్రయోజనాలు ఏమిటో, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రావడం వల్ల ఈ ప్రత్యేక ప్రయోజనాలకు ఎట్లా గండి పడుతుందో ఓ పట్టాన అర్థం కావడం లేదు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రక్రియను మొదలు పెడతామని కేంద్ర హోం మంత్రి చిదంబరం మొదట ప్రకటించిన తరువాత కోస్తాంధ్ర, రాయలసీమ నాయకులు, ప్రజల వినిపించిన వాదాలు, చేపట్టిన చేష్టలు ఆశ్చర్యం కలిగించాయి. మలిదశం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఆరంభమైన దగ్గర నుంచి ఏనాడు మచ్చుకైనా వినిపించని సమైక్య వాదం ఇప్పుడు ఎందుకు ఇంత ప్రబలంగా వినిపిస్తున్నది? ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా కానీ, సమైక్య వాదానికి మద్దతుగా కానీ కనీసం ఓ మీటింగ్‌ పెట్టడం, ఓ చిన్న పాదయాత్ర జరపడం చేయని కోస్తాంధ్ర, రాయలసీమ నాయకులు, ప్రజలు ఇప్పుడు భారీ ఎత్తున బయటకొచ్చి నిరసన వ్యక్తం చేయడంలో ఆశిస్తున్న ప్రయోజనాలేమిటి? అసలు సమైక్యవాద ఉద్యమం ప్రజల నుంచి వచ్చిందా లేక ఆర్థిక, రాజకీయ, సామాజిక బలాలున్న కొందరు వ్యక్తులు స్పాన్సర్‌ చేసిందా? ఇటీవల శక్తివంతంగా జరిగిన విద్యార్థి ఉద్యమం వల్లనే తెలంగాణకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది అనుకుంటే పొరపాటే.

అంతకు ముందు ఎన్నికలలో టిఆర్‌ఎస్‌ మరింత బలంగా ఉన్నా కేంద్రం ఎందుకు సానుకూలత చూపలేదో అర్థం చేసుకోవాలి. వై.ఎస్‌. మరణం, చంద్రబాబు అధి కార లేమి ప్రత్యేక తెలంగాణకు మార్గం సుగమం చేశాయి. ఆంధ్ర విశ్వ విద్యాలయం వంటి కొన్ని చోట్ల అణగారిన కుల-వర్గాల విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది సమైక్య ఆంధ్ర అంటూ ఉద్యమంలో ముందున్నప్పటికీ, నిజానికి ఈ ఉద్య మం ద్వారా వారు బావుకునేది ఏమీ లేదు. సమైక్యంగా ఉండడం వల్ల వారు పొందుతున్న ప్రత్యేక ప్రయోజనాలు ఏమిటో, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రావడం వల్ల ఈ ప్రత్యేక ప్రయోజనాలకు ఎట్లా గండి పడుతుందో ఓ పట్టాన అర్థం కావడం లేదు.

అయితే వారికి తెలుసో, తెలియదో కానీ ఒక్క విషయం మాత్రం నిజం. సమైక్య ఆంధ్ర ఉద్యమం వెనుక అగ్రకులాలున్నాయి. ముఖ్యంగా ఆ కులాలలో ఆర్థికంగా బలపడిన వర్గాల వారి ప్రయోజనాలున్నాయి. హైదరాబాద్‌లో, దాని చుట్టూ ఉన్న ప్రాంతాలలో బట్టల వ్యాపారం దగ్గర నుంచి, ఫైవ్‌స్టార్‌ హోటల్స్‌, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, షాపింగ్‌ మాల్స్‌, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం, మీడియా - వంటివి కోస్తాంధ్ర, రాయలసీమ వారి చేతిలో ఉన్నాయి. వీరి వ్యాపార సామ్రాజ్యాలలో పనిచేసే ఉద్యో గస్తులలో కింది శ్రేణిని తప్పించి ఉన్నత, మధ్య శ్రేణులకు చెందిన వారి సామాజిక, ప్రాంతీయ చిట్టా తీస్తే అప్పుడు తెలుస్తుంది, ఆ వ్యాపార అధిపతులలో పేరుకు పోయిన కుల, ప్రాంతీయ తత్వం.

మరి ఉన్నత కులాల వారు నిర్వహిస్తున్న వ్యాపారాలలో , సంస్థలలో తమకు ఉద్యోగాలు కూడా ఇవ్వని అగ్రకుల వర్గాలు నడిపిస్తున్న సమైక్య ఉద్యమంలో అణచివేతకు గురి కాబడిన కుల వర్గాల వారు సిపాయిలుగా ఎందుకు మారాలో అర్థం కావడం లేదు. హైదరాబాద్‌లో, నగర శివారులో సంస్కృతి కళల పేరిట, అభివృద్ధి వ్యాపారాల పేరిట ఉన్నత వర్గాలకు కట్టబెట్టిన వేలాది ఎకరాల చిట్టాను బయటకు తీసే అవకాశం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అది సాధ్యమైన రోజున అన్యాయంగా కట్టబెట్టిన , అక్రమం గా ఆక్రమించుకున్న భూములను ప్రభుత్వం తీసుకుని తెలంగాణలో అణగారిన కుల-వర్గాలకు, అగ్రకులాలలోని పేదలకు పంచడానికి మార్గం సుగమం అవుతుంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వల్ల మైనారిటీల రక్షణకు భంగం కలుగుతుందనే వాదనను కొందరు ముందుకు తెస్తున్నారు. ఇది తప్పుడు ప్రచారం. నిజాం చరిత్రను పరికిస్తే- వందల ఏళ్ళుగా హైదరాబాద్‌ సంస్థానంలో భిన్న మతాల వారు సామరస్యంతో జీవించారు. హైదరాబాద్‌, సికిందరాబాద్‌లలోనే కాదు తెలంగాణలోని పలు చోట్ల క్రైస్తవ దేవాలయాలు నిజాం కాలంలో నిర్మితమయ్యాయి. తెలంగాణ ఏర్పడిన తరువాత మైనారిటీల శాతం పెరిగి మరిన్ని ప్రయోజనాలు సాధించుకోవచ్చు. ఎస్‌.సి, ఎస్‌.టి, బి.సి, మైనారిటీలు సమైక్యాంధ్ర వాదాన్ని వ్యతిరేకించి, ప్రత్యేక తెలంగాణకు మద్దతు తెలుపవలసి ఉంది.

ఇందుకు తగిన కారణాలున్నాయి. కోస్తాంధ్రలో విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందడం వల్ల ఈ ప్రాంతంలోని కింది కుల-వర్గాలవారు కొందరయినా విద్య నేర్చుకుని ఉద్యోగాలు చేయగలుగుతున్నారు. కానీ విద్యాభివృద్ధి అంతగా లేని తెలంగాణలో కింది కుల-వర్గాల వారు అధికశాతం ఇంకా వ్యవ సాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. కృష్ణా గోదావరి వంటి జీవనదులు తమ ముంగిటే ప్రవ హిస్తున్నప్పటికీ వాటిని తమ పొలాల్లోకి మళ్ళించుకోలేక పోతున్నారు. తెలంగాణ వస్తే వారి ముంగిట్లో పరవళ్లు తొక్కుకుంటూ పారే నదీ ప్రవాహాలను తమ పొలాలకు మళ్లించుకుంటారు. కొత్త రాష్ట్రం అంటే ప్రభుత్వంలోని ప్రతి శాఖను ప్రత్యేకించి ఏర్పాటు చేయవలసి ఉంటుం ది.

దీని వల్ల ఉద్యోగావకాశాలు లభిస్తాయి. దీనిలో ఎస్‌సి, బిసి, ఎస్‌టి, మైనారిటీలకు తమ కోటా ఎలాగూ ఉంటుంది. అంబేద్కర్‌, ఆయన అనుయాయుల చిరకాల స్వప్నం దళిత ఆదివాసీ బహుజన మైనారిటీ వర్గాల వారికి రాజ్యాధికారం. ఇప్పటి వరకు రెండు కులాల వారే అన్ని పార్టీలను గుప్పెట్లో పెట్టుకుని పాలిస్తున్నారు. తెలంగాణలో బహు సంఖ్యలో ఉన్న దళి త, ఆది వాసీ, మైనారిటీలు ఉమ్మడిగా రాజ్యాధికారాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో చేజిక్కించుకునే ఒక సువర్ణ అవకాశాన్ని తెలంగాణ రాష్ట్రం కల్పిస్తుంది. అందుకే న్యాయబద్ధమైన తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని సమర్థించవలసిన బాధ్యత అణచివేతకు గురవుతున్న కుల-వర్గాల ప్రజలపై ఉంది.

- సాంబయ్య గుండిమెడ
(వ్యాసకర్త గుంటూరు జిల్లా వాస్తవ్యుడు, లండన్‌ విశ్వవిద్యాలయంలో పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలో)

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ త్వరితగతిని మొదలు పెట్టాలి!

తెలంగాణ ప్రజల ఆకాంక్షను మన్నిస్తూ కేంద్రం గతంలో ప్రకటించిన ప్రకటనకు కట్టుబడి ఉంటే బాగుండేది. కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న ఉద్యమాన్ని గుర్తించడం అంటే పీడిత ప్రజల పక్షాన నిలబడటమే అవుతుంది. అయితే, ఉద్యమ పరంగా కొన్ని అవాంచనీయ సంఘటనలు ఆంధ్ర, రాయలసీమ వాసులను కలవరపెడుతున్నాయి. వాటిని సామరస్యపూరకంగా చర్చించుకొని పరిష్కరించుకోవచ్చు. ప్రస్తుతం అయితే తెలంగాణ విభజన ప్రక్రియ మొదలుపెడితేనే రాష్టంలో పరిస్థితి శాంతియుతంగా మారుతుందేమో!

ఆంబేద్కర్ ఆశయ సాధనే ఆయనకిచ్చే నిజమైన నివాలి!


భారతరాజ్యాంగ నిర్మాత డా. బి. ఆర్. అంబేద్కర్ 53 వ వర్థంతి సందర్భంగా 06-12-2009 ఉదయం యూనివర్సిటీ ఆవరణంలోని షాపింగ్ కాంపెల్క్స్ దగ్గర హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఇన్ చార్జ్ వైస్ చాన్స్ లర్ ఆచార్య ప్రకాశ్ సి. సారంగి, రిజిస్ట్రార్ ఆచార్య సి.పి.మోహన్ కుమార్, ఢీన్, స్టూడెంట్స్ వెల్పేర్ ఆచార్య బి. రాజశేఖర్, డా. తిరుమల్, ఆచార్య ప్రకాశరావు, ఆచార్య తుమ్మల రామకృష్ణ, డా. దార్ల వెంకటేశ్వరరావు, డా. జి.నాగరాజు, అసిస్టెంట్ లైబ్రరీయన్ డా రవి, విద్యార్థి నాయకులు ఉల్లి ధనరాజ్ , సిలివేరు హరినాథ్, మల్లికార్జున్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. యూనివర్సిటీలోని లైబ్రరీ, డా.అంబేద్కర్ ఆడిటోరియం,. అడ్మినిస్ట్రేషన్ భవన్, ఎస్.సి., ఎస్.టి వెల్ఫెర్ భవన్, హాస్టల్స్ లలో గల డా.అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో డా.అంబేద్కర్ భావాలను వివరించారు. ఆయన సిద్ధాంతాలు నేటికీ అనుసరణీయాలని కొనియాడారు. ఆయన ఆశయాలను నెరవేర్చడమే ఆయనకు మనమిచ్చేనివాళి అని అన్నారు.


అంబేద్కర్ కి నివాళులు అర్పించి సందేశం ఇస్తున్న ఇన్ చార్జ్ వైస్ చాన్సలర్ ఆచార్య ప్రకాశ్ సి. సారంగి

అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలాలంకరణ చేస్తున్న అంబేద్కర్ అసోసియేషన్ నాయకుడు ఉల్లి ధనరాజ్, సోషియాలజీ లెక్చరర్ డా. జి.నాగరాజు



మాట్లాడుతున్న డా. దార్ల వెంకటేశ్వరరావు


మాట్లాడుతున్న డా. నాగరాజు



















మాట్లాడుతున్న యూనివర్సిటీ రిజిస్టార్ మోహన్ కుమార్










హైదరాబాదుతో కూడిన తెలంగాణా రాష్ట్రం కావాలి!


ప్రత్యేక తెలంగాణ రాష్ట్రసాధన కోసం జరుగుతున్న ఉద్యమంలో భాగంగా హైదరాబాదు విశ్వవిద్యాలయంలో కూడా విద్యార్థులు రిలే నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. నిన్న ( 02-12-2009) సి.హరనాథ్, పసునూరి రవీందర్, యు.ధనరాజ్ తదితరులు రిలే నిరాహార దీక్షలో కూర్చుని పాటలతో, ఉపన్యాసాలతో విద్యార్థులను ఉత్సాహపరుస్తూ తమ ఉద్యమాన్ని కొనసాగించారు. కేవలం తెలంగాణ ప్రాంతానికి చెందిన విద్యార్థులే కాకుండా, రాష్ట్రంలోని మిగితా ప్రాంతాలకు చెందిన విద్యార్థులు కూడా రిలే నిరాహార దీక్షా శిబిరంలో కూర్చుని, తమ మద్దతుని తెలిపారు. జాయింట్ యాక్షన్ కమిటి ( JAC) తరపున జరుగుతున్న ఈ ఉద్యమంలో నవీన్ కుమార్, మద్దిరాల సిద్ధార్థ, ఎన్. రాంబాబు, రామేశ్వర్, భరత్ నాయక్, లింగస్వామి, రాంచంద్రయ్య, నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొంటున్నారు
నిన్న సాయంత్రం ఆచార్య హరగోపాల్, డా.పిల్లలమర్రి రాములు. డా. స్వరూపరాణి, డా. దార్ల వెంకటేశ్వరరావు, రత్నమాల, వేమూరి మురళీకృష్ణ,, సంగిశెట్టి శ్రీనివాస్ తదితరులు తమ మద్దతుని తెలుపుతూ దీక్షాశిబిరంలో కొంత సేపు కూర్చున్నారు.
ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం ఒక ముఖ్యమైన కార్యక్రమమని, దానికంటే ఎలాంటి తెలంగాణాను సాధించుకున్నామనేది కూడా అత్యంతముఖ్యమని అన్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడినా, చాలా మంది హైదరాబాదు ప్రత్యేక రాష్ట్రంగా గాని, స్వయంప్రతిపత్తి గల పాలనా భాగంగా గాని ఉండాలని వాదిస్తున్నారని, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదు లేకపోతే గుండెకాయ లేని రాష్ట్రంగానే మిగిలిపోతుందని వ్యాఖ్యానించారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా కృష్ణానదీ జలాల్లో రావలసిన వాటా దక్కించుకోవడం ద్వారా లక్షలాది ఎకరాలకు ప్రయోజనం చేకూరుతుందని హరగోపాల్ వివరించారు. హైదరాబాదు, సికింద్రాబాదులో భారతదేశానికి చెందిన అనేక భాషలు మాట్లాడేవారు, అనేక ప్రాంతాలవాళ్ళు నివశిస్తున్నారని, పొట్టచేతిపట్టుకొచ్చిన వాళ్ళతో తెలంగాణా ఉద్యమకారులకు ఎలాంటి ఇబ్బంది లేదనీ, వాళ్ళు భయపడవలసిన పనిలేదని చెప్పారు. ఒకవేళ అటువంటి వారిపై దాడులు గానీ, భయపెట్టడం గాని చేస్తే వారికి అండగానిలవవసి ఉందన్నారు. ఆంధ్రాప్రాంతాన్నుండి తెలంగాణా ప్రాంతానికి వచ్చి దోచుకొనేవాళ్ళతోనూ, ఆధిపత్యం చెలాయించేవాళ్ళతోనే తెలంగాణా ఉద్యమకారుల పోరాటమన్నారు.
డా.పిల్లలమర్రి రాములు మాట్లాడుతూ నైజాం కాలంలో దాశరథి వంటివాళ్ళు గేయాలు రాస్తే నేడు మావిద్యార్థులే ఆశువుగా పాటలు పాడి ఉద్యమానికి ఉత్సాహాన్ని కలిగిస్తున్నారని వారిని అభినందించారు. ప్రాంతాలు వేరైనా పీడన, ఆధిపత్యాన్ని నిరసించడానికి అన్ని ప్రాంతాల వాళ్ళూ కలిసి ఉద్యమంలో పాల్గొనడం అభినందనీయమన్నారు.
డా. దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తనది ఆంధ్రప్రాంతంలోని తూర్పుగోదావరి జిల్లా, కోనసీమ ప్రాంతమనీ, ఇక్కడకు 1995 లో వచ్చానని, అప్పటికి ఆంధ్ర – తెలంగాణ అంటే సరిగ్గా తెలియదనీ, ఇన్ని వ్యత్యాసాలు ఉన్నాయని ఇక్కడికి వచ్చిన తర్వాతనే తెలిసాయని చెప్పారు. మీది ఆంధ్రా? అని ఎవరైనా అడిగితే “ ఔను..ఆంధ్ర ప్రదేశ్ .. మీది కాదా? “ అని అడిగేవాడినని, అప్పుడు మాది తెలంగాణ, రాయలసీమ అంటూ చెప్పేవారని, అప్పటినుండే నాకు ప్రాంతీయవైరుధ్యం గురించి తెలిసిందని పేర్కొన్నారు. క్రమేపీ అలాంటి విభజనకు సాంస్కృతిక, రాజకీయ ఆధిపత్యమే ప్రధాన కారణమని గమనించానని చెప్పారు. తాను తెలంగాణ అమ్మాయినే వివాహం చేసుకున్నానని తెలిపారు. ఇలా అన్ని ప్రాంతాల వాళ్ళూ సంబంధ బాంధవ్యాలు ఏర్పరుచుకొంటే ఈ వైరుధ్యాలు తలెత్తి ఉండేవి కాదేమోనని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో ఎక్కడైనా అధిపత్యం చేస్తూ గానీ, పీడన కొనసాగించడం గాని జరుగుతుంటే దాన్ని మానవతావాదులు ఖండిస్తారు. పీడితుల పక్షాన నిలబడతారు. అలాంటప్పుడు ఒకే భాష మాట్లాడుతూ, ఒకే జాతిగా ఉన్న వాళ్ళకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా ఖండించకుండా ఎలా ఉండగలమనీ, అందుకే తన సంపూర్ణ మద్దతుని ప్రకటిస్తున్నానని అన్నారు.
హరగోపాల్ గారు మాట్లాడినట్లు ఆంధ్రాప్రాంతం నుండి వచ్చిన వాళ్ళు కూడా ఉద్యమంలో భాగస్వాములు కావాలంటే తెలంగాణా ప్రాంతానికి ఏ ఆంధ్రావాళ్ళ వల్ల అన్యాయం జరుగుతుందో, ఒకవేళ ప్రత్యేక తెలంగాణ వస్తే అందరినీ పంపేస్తారా? లేక పోతే పొట్టకూటికోసం వచ్చిన వాళ్ళనీ తరిమేస్తారా? అనే విషయాలపై ఉద్యమకారులు స్పష్టంగా వివరిస్తే, అప్పుడు తెలంగాణా లో స్థిరపడిన ఆంధ్రాప్రాంతప్రజలు కూడా ఉద్యమానికి మరింత మద్దతునిస్తారని దార్ల సూచించారు.
డా. స్వరూప రాణి మాట్లాడుతూ తెలంగాణా వారికి పోరాట చైతన్యం పుట్టుకతోనే వచ్చిందనీ, ఆ చైతన్యం నేడు మరింతగా బహిర్గతం కావలసి ఉందని పేర్కొన్నారు. హైదరాబాదు ప్రాంతంలో నిర్మించిన ఆంధ్రాప్రాంతీయుల భవనాలు, కట్టడాలు ధ్వంసం చేసి వెళ్ళిపోతామని కొంతమంది ఆంధ్రావాళ్ళు ప్రకటిస్తున్నారని, అలా చేస్తే వాటిని వెంటనే నిర్మించుకోగల సత్తాకూడా తెలంగాణా వారికి ఉందని పేర్కొన్నారు.
ఇంకా సంగిశెట్టి శ్రీనివాస్, రామయ్య,తదితరులు ప్రసంగించి సంఘీభావాన్ని ప్రకటించారు.