Wednesday, December 02, 2009

హైదరాబాదుతో కూడిన తెలంగాణా రాష్ట్రం కావాలి!


ప్రత్యేక తెలంగాణ రాష్ట్రసాధన కోసం జరుగుతున్న ఉద్యమంలో భాగంగా హైదరాబాదు విశ్వవిద్యాలయంలో కూడా విద్యార్థులు రిలే నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. నిన్న ( 02-12-2009) సి.హరనాథ్, పసునూరి రవీందర్, యు.ధనరాజ్ తదితరులు రిలే నిరాహార దీక్షలో కూర్చుని పాటలతో, ఉపన్యాసాలతో విద్యార్థులను ఉత్సాహపరుస్తూ తమ ఉద్యమాన్ని కొనసాగించారు. కేవలం తెలంగాణ ప్రాంతానికి చెందిన విద్యార్థులే కాకుండా, రాష్ట్రంలోని మిగితా ప్రాంతాలకు చెందిన విద్యార్థులు కూడా రిలే నిరాహార దీక్షా శిబిరంలో కూర్చుని, తమ మద్దతుని తెలిపారు. జాయింట్ యాక్షన్ కమిటి ( JAC) తరపున జరుగుతున్న ఈ ఉద్యమంలో నవీన్ కుమార్, మద్దిరాల సిద్ధార్థ, ఎన్. రాంబాబు, రామేశ్వర్, భరత్ నాయక్, లింగస్వామి, రాంచంద్రయ్య, నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొంటున్నారు
నిన్న సాయంత్రం ఆచార్య హరగోపాల్, డా.పిల్లలమర్రి రాములు. డా. స్వరూపరాణి, డా. దార్ల వెంకటేశ్వరరావు, రత్నమాల, వేమూరి మురళీకృష్ణ,, సంగిశెట్టి శ్రీనివాస్ తదితరులు తమ మద్దతుని తెలుపుతూ దీక్షాశిబిరంలో కొంత సేపు కూర్చున్నారు.
ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం ఒక ముఖ్యమైన కార్యక్రమమని, దానికంటే ఎలాంటి తెలంగాణాను సాధించుకున్నామనేది కూడా అత్యంతముఖ్యమని అన్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడినా, చాలా మంది హైదరాబాదు ప్రత్యేక రాష్ట్రంగా గాని, స్వయంప్రతిపత్తి గల పాలనా భాగంగా గాని ఉండాలని వాదిస్తున్నారని, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదు లేకపోతే గుండెకాయ లేని రాష్ట్రంగానే మిగిలిపోతుందని వ్యాఖ్యానించారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా కృష్ణానదీ జలాల్లో రావలసిన వాటా దక్కించుకోవడం ద్వారా లక్షలాది ఎకరాలకు ప్రయోజనం చేకూరుతుందని హరగోపాల్ వివరించారు. హైదరాబాదు, సికింద్రాబాదులో భారతదేశానికి చెందిన అనేక భాషలు మాట్లాడేవారు, అనేక ప్రాంతాలవాళ్ళు నివశిస్తున్నారని, పొట్టచేతిపట్టుకొచ్చిన వాళ్ళతో తెలంగాణా ఉద్యమకారులకు ఎలాంటి ఇబ్బంది లేదనీ, వాళ్ళు భయపడవలసిన పనిలేదని చెప్పారు. ఒకవేళ అటువంటి వారిపై దాడులు గానీ, భయపెట్టడం గాని చేస్తే వారికి అండగానిలవవసి ఉందన్నారు. ఆంధ్రాప్రాంతాన్నుండి తెలంగాణా ప్రాంతానికి వచ్చి దోచుకొనేవాళ్ళతోనూ, ఆధిపత్యం చెలాయించేవాళ్ళతోనే తెలంగాణా ఉద్యమకారుల పోరాటమన్నారు.
డా.పిల్లలమర్రి రాములు మాట్లాడుతూ నైజాం కాలంలో దాశరథి వంటివాళ్ళు గేయాలు రాస్తే నేడు మావిద్యార్థులే ఆశువుగా పాటలు పాడి ఉద్యమానికి ఉత్సాహాన్ని కలిగిస్తున్నారని వారిని అభినందించారు. ప్రాంతాలు వేరైనా పీడన, ఆధిపత్యాన్ని నిరసించడానికి అన్ని ప్రాంతాల వాళ్ళూ కలిసి ఉద్యమంలో పాల్గొనడం అభినందనీయమన్నారు.
డా. దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తనది ఆంధ్రప్రాంతంలోని తూర్పుగోదావరి జిల్లా, కోనసీమ ప్రాంతమనీ, ఇక్కడకు 1995 లో వచ్చానని, అప్పటికి ఆంధ్ర – తెలంగాణ అంటే సరిగ్గా తెలియదనీ, ఇన్ని వ్యత్యాసాలు ఉన్నాయని ఇక్కడికి వచ్చిన తర్వాతనే తెలిసాయని చెప్పారు. మీది ఆంధ్రా? అని ఎవరైనా అడిగితే “ ఔను..ఆంధ్ర ప్రదేశ్ .. మీది కాదా? “ అని అడిగేవాడినని, అప్పుడు మాది తెలంగాణ, రాయలసీమ అంటూ చెప్పేవారని, అప్పటినుండే నాకు ప్రాంతీయవైరుధ్యం గురించి తెలిసిందని పేర్కొన్నారు. క్రమేపీ అలాంటి విభజనకు సాంస్కృతిక, రాజకీయ ఆధిపత్యమే ప్రధాన కారణమని గమనించానని చెప్పారు. తాను తెలంగాణ అమ్మాయినే వివాహం చేసుకున్నానని తెలిపారు. ఇలా అన్ని ప్రాంతాల వాళ్ళూ సంబంధ బాంధవ్యాలు ఏర్పరుచుకొంటే ఈ వైరుధ్యాలు తలెత్తి ఉండేవి కాదేమోనని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో ఎక్కడైనా అధిపత్యం చేస్తూ గానీ, పీడన కొనసాగించడం గాని జరుగుతుంటే దాన్ని మానవతావాదులు ఖండిస్తారు. పీడితుల పక్షాన నిలబడతారు. అలాంటప్పుడు ఒకే భాష మాట్లాడుతూ, ఒకే జాతిగా ఉన్న వాళ్ళకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా ఖండించకుండా ఎలా ఉండగలమనీ, అందుకే తన సంపూర్ణ మద్దతుని ప్రకటిస్తున్నానని అన్నారు.
హరగోపాల్ గారు మాట్లాడినట్లు ఆంధ్రాప్రాంతం నుండి వచ్చిన వాళ్ళు కూడా ఉద్యమంలో భాగస్వాములు కావాలంటే తెలంగాణా ప్రాంతానికి ఏ ఆంధ్రావాళ్ళ వల్ల అన్యాయం జరుగుతుందో, ఒకవేళ ప్రత్యేక తెలంగాణ వస్తే అందరినీ పంపేస్తారా? లేక పోతే పొట్టకూటికోసం వచ్చిన వాళ్ళనీ తరిమేస్తారా? అనే విషయాలపై ఉద్యమకారులు స్పష్టంగా వివరిస్తే, అప్పుడు తెలంగాణా లో స్థిరపడిన ఆంధ్రాప్రాంతప్రజలు కూడా ఉద్యమానికి మరింత మద్దతునిస్తారని దార్ల సూచించారు.
డా. స్వరూప రాణి మాట్లాడుతూ తెలంగాణా వారికి పోరాట చైతన్యం పుట్టుకతోనే వచ్చిందనీ, ఆ చైతన్యం నేడు మరింతగా బహిర్గతం కావలసి ఉందని పేర్కొన్నారు. హైదరాబాదు ప్రాంతంలో నిర్మించిన ఆంధ్రాప్రాంతీయుల భవనాలు, కట్టడాలు ధ్వంసం చేసి వెళ్ళిపోతామని కొంతమంది ఆంధ్రావాళ్ళు ప్రకటిస్తున్నారని, అలా చేస్తే వాటిని వెంటనే నిర్మించుకోగల సత్తాకూడా తెలంగాణా వారికి ఉందని పేర్కొన్నారు.
ఇంకా సంగిశెట్టి శ్రీనివాస్, రామయ్య,తదితరులు ప్రసంగించి సంఘీభావాన్ని ప్రకటించారు.5 comments:

Anonymous said...

Meeku paadabhivandanaalu!!

Rajanna said...

1956 లో ఆంద్ర తెలంగాణా లు విలీనం అయ్యేప్పుడు ఆంద్ర రాష్ట్రానికి రాజ దాని కర్నూలు.

హైదరాబాద్ రాష్ట్రానికి (తెలంగాణాకు) రాజధాని హైదరాబాద్.

వందల వేల సంవత్సరాలు గా తెలంగాణాకు హైదరాబాదే తలకాయ లా వుంది.

ఇప్పుడు ఆ తలకాయను ఎవడు తీసేసేది. ఎట్లా తీసేస్తారు? అసలు ఆ ఆలోచనే రక్తాన్ని మరిగిస్తోంది. ఇదొక దుర్మార్గమా , ఇదొక మడత పెచీయా విడిపోయటప్పుడు!

kumar said...

Welcome to Best Blog 2009 Contest


The Andhralekha best blog 2009 contest is the first ever blog contest for telugu speaking bloggers. This contest is to recognize the effort & energy shown by bloggers. The contest is open for all bloggers and the blog should be in either english or telugu.Submit your best blog written in 2009 along with URL and enter to win Best blog 2009 contest. All the blogs submitted will be carefully reviewed by our senior journalists and editors. Voting for selected finalists is expected begin January 15, 2010. Top 3 winners would receive shields and surprise gifts.Please submit your entries by sending an email to blogchamp@andhralekha.com with your name, location, blog details and URL.

Good Luck! Spread the word and enjoy the contest.


plz contact andhralekha@gmail.com

http://andhralekha.com/blog_contest/AL_blog_contest.php

అప్పారావు శాస్త్రి said...

"డా. దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తనది ఆంధ్రప్రాంతంలోని తూర్పుగోదావరి జిల్లా, కోనసీమ ప్రాంతమనీ, ఇక్కడకు 1995 లో వచ్చానని" అని
సెలవిచారు. అంటే మీరు కూడా ఆంద్రా నించీ పొట్ట చేత పట్టుకుని, వలస వచ్చిన వారె కదా ? మీరెంత
దోచుకున్నారు తెలంగాణాని ? నిజం చెప్పండి.

Sirapangi Santhi Swaroop said...

The movement to achieve a separate Telangana state is not going in proper direction. On many previous occasions, the leadership of Mr. K Chandrashekar Rao (KCR) was suspected, by many. Though many civil society activists, organizations and other personalities, occasionally criticized Telangana Rashtra Samithi (TRS) leadeship's genuine abilities and strategies in leading the movement and gave a call to lead Telangana movement irrespective of political affiliation/s, especially without TRS, they failed to realize such an aspiration. Even today, only KCR is able to take lead, but not other prominent personalities, who usually criticize TRS and KCR. But the unconsolidated civil society activists and leaders are always ready to blame and suspect KCR movements.

For a much more powerful movement, in the direction of achieving Telangana statehood, non TRS cadres should take lead and consolidate the movement on all possible realistic grounds, instead of occasionally blaming TRS and KCR.

Note: The above comment was originally posted as response to The Hindu editorial of December 2, 2009, titled as "A persistent issue". The link can be followed at:

http://beta.thehindu.com/opinion/editorial/article58414.ece