"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

15 జులై, 2026

‘విశ్వర్షి వాసిలి’ - ఒక యౌగిక స్పర్శ ( నినాదం దినపత్రిక సాహిత్య అనుబంధం 'సాహితీ లహరి' 12.7.2026 సౌజన్యంతో .)

 ‘విశ్వర్షి వాసిలి’ - ఒక యౌగిక స్పర్శ


సాహిత్యం  సమాజానికి అద్దం పడుతుందంటారు. దానితో పాటు సాహిత్యం  మనిషి అంతరంగాన్ని, విశ్వ చైతన్యాన్ని ఏకకాలంలో ఆవిష్కరించే అద్భుత సాధనంగా కూడా పనిచేస్తుంది. అలాంటి అక్షర సాధనతో నన్ను అమితంగా ప్రభావితం చేసిన వారిలో ‘విశ్వర్షి’ డా. వాసిలి వసంతకుమార్  గారు ఒకరు. పాత్రికేయుడిగా, శతాధిక గ్రంథకర్తగా, అనువాదకుడిగా, ఐదు దశాబ్దాల యోగా  సాధకుడిగా ఆయనది బహుముఖ ప్రజ్ఞ. ఆయనకు డెబ్బది ఏండ్లు నిండుతున్న సందర్భంగా ఆయన అభిమానులు చేస్తున్న ‘విశ్వర్షి సప్తతి మహోత్సవాలు’ తెలుగు సాహిత్యానికి, భారతీయ విజ్ఞానానికి చేస్తున్న పండుగలా అనిపిస్తుంది. ఈ సందర్భంగా ఆయనతో, ఆయన సాహిత్యంతో, ప్రత్యేకించి ఆయన తాత్త్విక ఆలోచనలతో నాకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకోవాలనుకుంటున్నాను. 


( నినాదం దినపత్రిక సాహిత్య అనుబంధం 'సాహితీ లహరి' 12.7.2026 సౌజన్యంతో .)

 

తొలి పరిచయం: ఉస్మానియా పరిశోధన సంచిక:

డాక్టర్ వాసిలి వసంతకుమార్ గారి అక్షరాలతో నాకు తొలి పరిచయం ఒక  సాహిత్య పరిశోధన  వ్యాస సందర్భంలో జరిగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం వారు ప్రచురించిన ఒక పరిశోధన సంచికలో సుప్రసిద్ధ సాహితీవేత్తలు డా. ఎన్. గోపి, డా. ననుమాసస్వామి గార్లతో కలిసి ఆయన రాసిన ఒక పరిశోధనాత్మక వ్యాసం నేను చదవడం తటస్థించింది. అది పరిశోధన చేసేవారికి ఉపయోగపపడేరచన. 

వాసిలి కుటుంబ నేపథ్యం: 

ఆధ్యాత్మిక యోగి శార్వరి గారి పుత్రుడిగా 1956 జులై 10న పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలంలోని సమిశ్రగూడెంలో జన్మించిన వసంతకుమార్ గారి విద్యాభ్యాసం, అక్షర ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ తొలి స్నాతకోత్తర (ఎం.ఏ) విద్యార్థి ఆయనే కావడం విశేషం. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పీహెచ్‌.డి. పొందిన ఆయన, తన ఇరవయ్యవ ఏటనే పాత్రికేయ రంగంలో కాలమిస్ట్‌గా అడుగుపెట్టారు. ‘అవలితీరం’ పత్రికకు సంపాదకుడిగా పనిచేశారు.

యాభైకి పైగా పుస్తకాలు, వందకు పైగా గ్రంథ సమీక్షలతో ఆయన తెలుగు సాహిత్యానికి చేసిన సేవ అపారం. ఆయన రచించిన 'తెలుగు నవల : అస్తిత్వ సంఘర్షణ', 'తెలుగు పరిశోధన' గ్రంథాలు పరిశోధక విద్యార్థులకు నేటికీ ప్రామాణికాలుగా భావిస్తున్నారు. వీటితో పాటు ఆయన కలం నుండి జాలువారిన 77 సాధనారహస్యాలు, 56 ఆత్మదర్శనాలు, కొత్తకోణంలో గీతారహస్యాలు, ప్రజ్ఞానరహస్యాలు, అతీంద్రియరహస్యాలు, సిగ్గుపడితే సక్సెస్ రాదు, మనకే తెలియని మన రహస్యాలు వంటి అనేక రచనలు ఆయనలోని మనోవిజ్ఞానవేత్తను, దార్శనికుడిని పాఠకులకు పరిచయం చేస్తాయి.


 ‘నేను’ యౌగిక కావ్యం:

వాసిలి వసంతకుమార్ గారి గ్రంథాలలో నన్ను అత్యంత లోతుగా ప్రభావితం చేసింది ఆయన రచించిన ‘నేను’ యౌగిక కావ్యమని చెప్పాను కదా!. ఈ కావ్యం నాలో రేకెత్తించిన ఆలోచనలకు అక్షర రూపమిస్తూ 3,4 వ తేదీల్లో జులై 2020లో పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నిర్వహించిన జాతీయ సదస్సులో   ‘విశ్వర్షి వాసిలి’ రచించిన నేను యౌగిక కావ్యం- సామాజిక జీవన చిత్రణ’’ అనే అంశంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశాను. 

సాధారణంగా సాహిత్యంలో సమాజజీవన చిత్రణ అనేది వివిధ పాత్రలు, సన్నివేశకల్పనలు, వర్ణనల ద్వారా జరుగుతుంది. కానీ, వచన దీర్ఘకావ్యంలో ఒక బలమైన వస్తువుని లేదా ఒక అంత: సూత్రాన్ని లేదా ఒక సిద్ధాంతాన్ని వర్ణిస్తుంటారు. ‘‘నేను’’ యౌగిక కావ్యం ఆధునిక సమాజంలో కొంతమంది ఆలోచనాదృక్పథంగా అభివర్ణించవచ్చు.  ఈ కావ్యంలోని ‘‘నేను’’ వైయక్తికం కాదు; మానవునికి ప్రతీక. మానవ అన్వేషణకు ప్రతీక. మానవ పరిణామానికి ప్రతీక. మానవుడికీ, విశ్వానికీ జరిగే ఆలోచనల సంఘర్షణకు ప్రతీక.  ఈ సందర్భంగా బిగ్ బ్యాంగ్ థియరీ గురించి చెప్పుకోవాలి. ఒక పెద్ద విస్ఫోటన ఫలితంగా విశ్వం ఏర్పడ్డదని చెప్పేదే బిగ్ బ్యాంగ్ థియరీ.  మహా విస్ఫోటన సమయంలో హీలియం సింథసైజేషన్ జరిగి ఉంటుందని పరిశోధకుల అభిప్రాయం. హీలియం (Helium) అనేదొక రసాయన మూలకం. రంగు, రుచి, వాసన లేని, విషపూరితం కాని (non-toxic), తటస్థమైన  ఒకే అణువు కలిగిన రసాయన మూలకంగా చెప్తారు. Hydrogen (ఉదజని) ఒక రసాయన మూలకం. దీన్ని "H" అనే సంకేతముతో సూచిస్తారు. ఉదజని యొక్క అణు సంఖ్య 1. మూలకాల పట్టికలో ఇది మొదటి మూలకం. హైడ్రోజెన్ ని ఆంగ్లంలోని H  అనే అక్షరంతో మూలకాల పట్టికలో మొదటిగా సూచిస్తారు. తర్వాత  2 వదిగా సూచించేది హీలియం (He ). సాధారణోష్ణము, పీడనముల వద్ద ఇది రంగు, వాసన, రుచి లేని, అలోహిత బణు (H2) వాయువు. ఇవన్నీ పై కవితాత్మక పంక్తుల్లో సులభంగా వివరించాడు కవి.ఇలా శాస్త్రీయంగా వివరించాల్సిన అంశాలెన్నో ఈ కవిత్వంలో ఉన్నాయి.  అలాంటి సృష్టి ఆవిర్భావంలో మానవుని ఆవిర్భావం జరిగిన పరిణామాన్ని ఇలా కవిత్వీకరిస్తారు కవి.

‘‘కాలం స్థితీ విడివడని ఏకత

ఆ ఏకత్వంతో ఖగోళ జవజలం

జలధిన ఈదులాడుతూ ఒక జీవం

జీవనానికై కలయ తిరుగుతున్న ప్రాణం

జల జీవనానికి ప్రాణభూతంలా భూగోళం

భూగ్రహానికి శ్రీకరంగా నేను ( పుట: 49)   

            ఇక్కడ మత గ్రంథాల్లో సృష్టి ఆవిర్భావం గురించి కనిపించే వర్ణనల్లా అనిపిస్తాయి. కానీ, తర్వాత ‘‘జలతత్వంతో ముడిపడ్డ మానవతత్త్వం/ మత్స్యావతారంగా తొలి ఆవిష్కరణ’’ అని ప్రతిపాదిస్తారు కవి. ఇక్కడే కవి భారతీయ దార్శనిక ఆలోచనాదృక్పథంతో శాస్త్రీయంగా వివరించే ప్రయత్నం కనిపిస్తుంది. కేవలం దశావతారాల్ని ఉన్నతీకరిస్తూనో, దాన్నే విశదీకరిస్తే ఒక వర్గానికి వెనుకేసుకొచ్చిన వాదనతో నిండిన కావ్యమయ్యేది.

‘‘చిరుజీవం పెరుగుతూ పెనుజీవం కావటం

పెరిగిన కణం మూల కణంగా వెనుతిరగడం

రేపటి కోసం ఒకరిని ఒకరు ఆశ్రయించడం

చివరికి నిష్ర్కమించడం సృష్టి పరిణామం

తిరోగమనం మృతతత్వానికి తొలిపరిణామం

ఇదే నా జనన మరణ ఆవిష్కృత రహస్యం’’ (పుట: 51) ఇక్కడున్నారు కవిగా, దార్శనికుడిగా ‘విశ్వర్షి వాసిలి’. మన కళ్ళముందు కనిపించే వాస్తవాన్ని భ్రమలుగా చెప్పట్లేదు. జనన-మరణాలు మనకి కనిపించే వాస్తవం. కానీ, మనిషి పుట్టింది అందుకేనా? ‘‘తిరోగమనం మృతత్త్వానికి తొలిపరిణామం’’ అనే ప్రతిపాదనతో కావ్యాన్ని పురోగమనం దిశగా పయనించడం ఎలాగో వివరిస్తూ పరిపూర్ణం చేయడం కావ్యపరమార్థం. దీనికి శాస్త్రాన్ని,  ఆధ్యాత్మిక రహస్యాలతో సమన్వయీకరిస్తూ డార్విన్ జీవపరిణామ సిద్ధాంతాన్ని హిందూ పురాణాల్లో దశావతారాలుగా చెప్పేవాటిలో గల అంతరార్థవ్యక్తీకరణగా జీవపరిణామాన్ని కవిత్వీకరిస్తారు కవి.

‘‘నేను కార్య జాతం కాదు...

కర్మజాతం కానే కాదు...’(పుట: 52) అని తన శాస్త్రీయమైన అనుభవాన్ని, విశ్వరహస్యశోధన సత్యాన్ని నిజాయితీగా వెల్లడిస్తారు కవి.  మూసి మాస పత్రిక, మార్చి 2021లో  ‘విశ్వర్షి’ వాసిలి నేను దీర్ఘ కావ్యం-సౌందర్య దృక్పథం’ అనే పేరుతో రాసిన నా వ్యాసాన్ని చదివి ఆచార్య కె.కె.రంగనాథాచార్యులుగారు నన్ను మెచ్చుకుంటూ ఫోన్ చేశారు. అదొక మరిచిపోలేని జ్ఞాపకం. 

108 రోజుల అంతర్జాతీయ సదస్సులు:

యోగాలయ రీసెర్చ్ సెంటర్, సికింద్రాబాద్ వారి ఆధ్వర్యంలో ‘విశ్వర్షి వాసలి వసంత కుమార్ గారి అక్షర అక్షర ప్రస్థానం’ పేరుతో  108 రోజుల పాటు అంతర్జాతీయ సదస్సులు జరిగాయి. అదొక ప్రపంచ రికార్డు. వాసిలి వసంత కుమార్ గారు రాసిన వివిధ పుస్తకాలపై జరిగిన అంతర్జాతీయ సదస్సు అది. దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అమెరికా, ఇంగ్లాండ్ తదితర దేశాల నుండి కూడా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల నుండి ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ద్రావిడ విశ్వవిద్యాలయం, మద్రాస్ విశ్వవిద్యాలయం, బెనారస్ కాశీ హిందూ విశ్వవిద్యాలయం ఇలా అనేక విశ్వవిద్యాలయాల నుండి ఆచార్యులు పూర్వాచార్యులు సదస్సులలో పాల్గొని వివిధ అంశాలపై పత్రాలను సమర్పించారు.  భారతీయ తాత్విక దర్శనంలో యోగా విద్యకు విశిష్టమైన స్థానం ఉందని ఈ సమావేశంలో పాల్గొన్న ఆచార్యులు వక్తలు పేర్కొన్నారు. ఆ సదస్సులు విజయవంతంగా పూర్తయిన సందర్భంగా 31.7.2022 వ తేదీన జరిగిన సమాపనోత్సవంలో నేను కూడా  పాల్గొన్నాను. 

అక్షర యోగికి అరుదైన సత్కారాలు:

విశ్వమే తానై, తానై విశ్వమై యోగ దార్శనిక సత్యాన్ని ప్రవచించిన డా. వాసిలి వసంతకుమార్ గారిని, ఆయన చదివిన మద్రాసు విశ్వవిద్యాలయం అక్టోబరు 2022లో 'అక్షరయోగి'పురస్కారంతో సత్కరించడం అత్యంత ముదావహం. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం, మద్రాసు విశ్వవిద్యాలయం మరియు పెనుగొండ ఎస్‌వీకేపీ అండ్‌ డాక్టర్‌ కేఎస్‌ రాజు ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల సంయుక్తంగా ‘విశ్వర్షి వాసిలి వాజ్ఞయ వరివస్య’ అనే అంశంపై అంతర్జాతీయ తెలుగు సదస్సును నిర్వహించడం, ఆయన అక్షర తపస్సుకు దక్కిన గొప్ప గౌరవం.

ఆయన సాహిత్యంపై పలు సందర్భాల్లో సదస్సుల్లోనూ, అంతర్జాల సమావేశాల్లోనూ పాల్గొని మాట్లాడాను. ఆయన రచించిన ‘‘ఏడో ఋతువు’’(2024)  కవితాసంపుటి ఒక కావ్య స్పృహను కలిగిస్తుంది. దీనిలో సుమారు 46 ఖండికలు ఉన్నాయి.  దీనికి ప్రత్యేకించి ముందుమాటలు, ప్రస్తావనలు వంటివేమీ లేకపోవడం ఒక ప్రత్యేకత. కానీ, కవర్ పేజీ వెనుక అట్టపై కవితాత్మకమైన కొన్ని వాక్యాలు, అదీ కవిత్వ రూపంలోనే రాశారు. ఈ కవితా సంపుటిలోని తొలి కవిత శీర్షిక ‘’పదకొండో అవతార మెత్తిన ఏడో ఋతువు’’

‘’అరిషడ్వర్గ దైనికయానానికి

ఆరు ఋతువుల షడ్రసోపేత విందు 

జీవితం జిహ్వాగ్ర పసందు


ప్రకృతి కన్నెర్రతో ఉలిక్కి పడే ప్రవృత్తి 

అష్టవన్నెల కోరచూపుల ఋతు ఆగ్రహంతో

పదకొండో అవతార మెత్తిన ఏడో ఋతువు’’ 

ఈ కవితలోనే ఈ కవితాసంపుటిలో కవి చెప్పదలచుకున్న ‘తత్త్వం’ కొంతవరకూ కనిపిస్తుంది. మన తెలుగు సంవత్సరానికి  ఆరు (6) ఋతువులే. అవి: వసంతం, గ్రీష్మం, వర్ష, శరదృతువు, హేమంత, శిశిర ఋతువులు. కానీ, ఏడవ ఋతువు అంటున్నారు కవి. అదేమిటో ఎక్కడా వాచ్యం చేయలేదు. దీన్ని సూచిస్తూ ‘ప్రకృతి కన్నెర్ర’ అనీ, ‘పదకొండో అవతారం’ అనీ వర్ణించడంలో కొంత అవగాహనకు వచ్చే అవకాశం ఉంది. మనకున్న ఆరు ఋతువుల్లో కూడా ఒక్కోసారి అతివృష్టీ, అనావృష్టిగా జరగవచ్చు. కానీ అవి దీర్ఘకాలంగా కొనసాగవు. సుమారు ఒక సంవత్సర కాలం పాటు ప్రకృతి కన్నెర్ర చేసిన ఒక కాలాన్ని చూసాం. అది కరోనాకాలం. ఆ కాలం మనిషిని రక్తంసిక్తం చేసిన దృశ్యం అంతా తర్వాత కవితలో వర్ణితమైంది. 

’పురుషత్వం స్త్రీత్వాన్ని చేరుకునే వలస 

కణమో జీవమో ప్రాణమో ఆత్మనో 

ప్రకృతి గర్భాన్ని చేరుకుంటున్న వలస 

భవిష్య తత్వాన్ని నవమాసాలు మోసిన 

అమ్మతనం నుండి విడివడుతున్న వలస 

పరం నుండి పాంచభౌతికానికి వలస 

ఇహాన్ని వదిలించుకుంటున్న వలస 

పుట్టుకా వొక వలసనే 

చావూ వొక వలసనే 

వలసకాని వరసంటూ వుందా’’ (పుట్టి 81)

మనం సాధారణంగా దశావతారాలను చెప్పుకుంటాం. తల్లి గర్భంలో పడిన క్రోమోజోమ్ (ఒక కోణం) మరొక క్రోమోజోమ్ తో కలిసినప్పటినుండి శిశువు బయటకు వచ్చేవరకు జరిగే వివిధ దశలను కూడా దశావతారాలుగా శాస్త్రీయంగా వివరించనవారున్నారు. విశ్వావిర్భావం నుండి సమస్త జీవుల స్థితిగతులను వివిధ పరిణామాలకు లోనైన సృష్టి స్థితి లయను దశావతారాలుగా వివరించే వాళ్ళూ ఉన్నారు. దుష్టశిక్షణ, శిష్టరక్షణ దశావతారాల్లోని పరమార్థం. 

మరి పదకొండో అవతారం లక్ష్యమేంటి?  

శ్రీమహావిష్ణువు పదకొండవ అవతారంగా ‘మోహిని’ ని చెప్తారు. 

భస్మాసురుడికి శివుడిచ్చిన వరం వల్ల తన ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది. ఆ సందర్భంలోనే ఆవిర్భవించిందే మోహినీ అవతారం. అసురుడైన భస్మాసురుడు మద్యపానం మత్తులో మోహినిని చూసిన మోహంతో తానేమి చేస్తున్నాడో తనకే తెలియకుండా తన శిరస్సుపై తానే చేతిని పెట్టుకుంటాడు. తన చేయి ఎవరి శిరస్సుపై పెడితే అది దహించుకుపోతుంది. ఇక్కడ కవి కూడా పదకొండో అవతారంగా కరోనాను పోల్చారు.

ప్రకృతి సమతుల్యత దెబ్బతింటున్నప్పుడు ప్రకృతే తనకూ తానుగా ఒక్కో అవతారం ఎత్తుతుందేమో!ఇది మాయ కాదు, ప్రకృతి సత్యం!  కరోనాను ప్రకృతి వైపరీత్యమే పదకొండో అవతారంగా చెప్పారా?  ఇలా ఆధునిక సాహిత్యంలో ముఖ్యంగా కవిత్వంలో శాస్త్రీయమైన విషయాల్ని వర్ణించిన ప్రత్యేక కవిగా నిలిచిపోతారు.

ఇప్పుడు ఆయనకు డెబ్బది వసంతాలు నిండుతున్న సందర్భంగా చేస్తున్న ఈ మూడు రోజుల జన్మదినోత్సవం సందర్భంగా ఆయన గురించి ఇలా రాసుకున్నాను.

విశ్వర్షి సప్తతి

ఆయన ఒక యౌగిక విజ్ఞాని
సత్యాన్ని అన్వేషించే
శాస్త్రీయ తాత్వికుడు
పరిమళించే సాహిత్య పుష్పం!

ఆయన ఆలోచన
అనుభవపు అగ్నికుండంలో
కాలిన సత్యపు కణిక,
ఆయన మాట
మనసులను మేల్కొలిపే
మంత్రధ్వని!

వేదాంతపు లోతుల్లోకి వెళ్లి
విజ్ఞానపు శిఖరాలను తాకి,
రెండింటి మధ్య నిర్మితమయ్యే
ఓ విశ్వాసపు వంతెన!

పదానికి ప్రాణం పోసి
ధ్యాన రహస్యాలను
జీవితంగా నిలిపిన ఋషి,
అక్షరాలను ఆత్మవెలుగులుగా చేసి
మనిషిలోని మనిషిని వెతికి చూపే యాత్రికుడు!

డెబ్బై వసంతాల ప్రస్థానంలో
కాలం ఆయన కేశాలను తాకినా,
ఆలోచనలను తాకలేకపోయింది;
వయసు ఆయన దేహానికి చేరినా,
వివేకం యౌవనాభరణమైంది!

ఈ సప్తతి — ‘విశ్వర్షి సప్తతి’
ప్రతి యేటా వచ్చే
జన్మదిన సంబరం కాదు;
ఒక నిరంతర సాధనకు
సమాజం సమర్పించే వందనం!

విశ్వాన్ని ఋషి దృష్టితో దర్శించిన
ఆ విశ్వర్షికి
సాహిత్య హృదయాలు కురిపించే
సహస్ర నమస్సులు! 

భారతీయ సంప్రదాయ విజ్ఞానానికి
ఆయన ఓ ప్రకాశవంతమైన యశశ్శిఖరం!

  • డా.దార్ల వెంకటేశ్వరరావు 8.7.2026









కామెంట్‌లు లేవు: