"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

27 ఆగస్టు, 2025

"దళితులు ప్రధాన జీవన స్రవంతిలోకి రావాలి !" దళిత శక్తి పత్రికకు ఆచార్య ‘దార్ల’ప్రత్యేక ఇంటర్వ్యూ. ( September, 2025. Dalita Shakti Monthly)

 దళితులు  ప్రధాన జీవన స్రవంతిలోకి రావాలి !

దళిత శక్తి పత్రికకు ఆచార్య ‘దార్ల’ప్రత్యేక 

ఇంటర్వ్యూ.  దీన్ని సెప్టెంబరు, 2025 సంచికలో ప్రచురించారు.


ఒక నిరుపేద దళిత కుటుంబంలో పుట్టి, చదువుకున్న వాళ్లలో తొలితరం విద్యార్థిగా అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా నిలిచారు. ప్రముఖ దిన, వారమాస పత్రికలలో కవిత్వం, కథలు, వ్యాసాలు రచించారు. తన కవిత్వాన్ని ‘దళిత తాత్వికుడు’ ‘నెమలి కన్నులు’ పేరుతో ప్రచురించారు.  ఇటీవలే తన ఆత్మకథ మొదటి భాగం ‘నెమలి కన్నులు’ పేరుతో కూడా ప్రకటించారు. దీనిపై మంచి సమీక్షలు వ్యాసాలు విరివిగా వచ్చాయి. దళిత విద్యార్థులకు ఇదొక ఆదర్శనీయమైన గ్రంథంగా ఆ సమీక్షలు వ్యాఖ్యానించాయి. ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొమ్మిదవ తరగతి తెలుగు పాఠ్యాంశానికి ప్రధాన సంపాదకులలో ఒకరిగా వ్యవహరించారు. బెనారస్, కృష్ణా, మద్రాస్ విశ్వవిద్యాలయ బోర్డ్ ఆఫ్ స్టడీస్ లలో సభ్యులుగా ఉన్నారు. వీటితోపాటు ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని అన్ని కళాశాలల తెలుగు శాఖల్లో బోర్డ్ ఆఫ్ స్టడీస్ సభ్యులుగా ఉన్నారు. ప్రకాశిక త్రైమాస పత్రికకు కార్యనిర్వహక సంపాదకులుగా, ఔచిత్యం, భావవీణ, ప్రజామణిపూస, రాయలసీమ జాగృతి తదితర పరిశోధన పత్రికల  సంపాదకవర్గ సభ్యులుగా ఉన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారంతోపాటు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వారి ఛాన్సలర్ అవార్డు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఉగాది పురస్కారం (2025) వంటి వాటిని ఎన్నింటినో అందుకున్నారు.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖలో 'దళిత సాహిత్యం' ఒక ఆప్షనల్ కోర్సుగా పెట్టారు. దీని ద్వారా దళిత కవులు, రచయితలు, రచనలను అధ్యయనం చేయడం, పరిశోధనలకు ప్రేరణపొందడం జరుగుతోంది. తాను చదువుకున్న విద్యాసంస్థలోనే అధ్యాపకుడుగా చేరారు. తాను బోధనలోకి ప్రవేశించి ఇరవై ఐదు సంవత్సరాలవుతున్న సందర్భంగా ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుగారితో ‘దళితశక్తి’ పత్రిక చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూ. 




దళితశక్తి మాసపత్రిక, సెప్టెంబరు 2025 ముఖచిత్రంగా ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు చిత్రం






  • నమస్కారం సార్. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి, అత్యున్నతమైన సెంట్రల్ యూనివర్సిటీ లో శాఖాధ్యక్షులు, ప్రొఫెసర్ స్థాయి వరకు వచ్చారు. ఈ పయనంలో మీరెలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు?  

మన భారతీయ సమాజంలో ఒక దళితుడు, ఒక పేదవాడు ఈ స్థాయిలోకి రావడం చాలా కష్టమే. కానీ, ఒక సామాన్యుడు ఈ స్థాయికి రావాలంటే అనేక కష్టనష్టాలను భరించతప్పదు. కానీ, పరిస్థితులను మనకు అనుకూలంగా మార్చుకోవాలంటే నిరంతరం కష్టపడాలి. క్రమశిక్షణ ఉండాలి. అనేకాంశాలపై నియంత్రణ ఉండాలి. తాత్కాలిక సంతోషాల్ని, ఆనందాల్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. మన చుట్టూ మన ఉండే వాతావరణాన్ని ఎప్పటికప్పుడు గమనించుకొంటూ ముందుకెళ్ళాలి. అలా నా కంటే మరింత కష్టాల్లో ఉన్నవాళ్ళు కూడా ఉన్నతమైన స్థాయిలోకొచ్చారు. ఇలాంటి వన్నీ అదృష్టాన్ని బట్టి జరిగేవి కాదు. తమకొక లక్ష్యం పెట్టుకోవాలి. దాన్ని సాధించడానికి కావాల్సినవన్నీ సమకూర్చుకొంటూ ముందుకెళ్ళాలి. ఆ మార్గంలో అనేక ఆటంకాలు ఎదురుకావచ్చు. వాటితో పాటే సహకారాన్ని అందించడానికి కూడా సిద్ధంగా ఉండే వాళ్ళు ఉంటారు. సంతోషకరమైనవి కావచ్చు, బాధపెట్టేవైనాకావచ్చు. అటువంటి వాటిని అంటే ఆ ఉద్వేగాలను అదుపులో  పెట్టుకోగలగాలి.

నేను ఒక సాధారణ, పేద దళిత కుటుంబంలో జన్మించాను. ఆర్థిక ఇబ్బందులు, సామాజిక అడ్డంకులు,  విద్యావకాశాల కొరత వంటి ఒడిదుడుకులు ఈ ప్రయాణంలో ఎదురయ్యాయి. భారతీయ సమాజంలో కులం ఆధారిత వివక్ష, అవమానాలు కొన్నిసార్లు నన్ను కుంగదీశాయి, కానీ, నేను వాటిని సవాళ్లుగా తీసుకుని ముందుకు సాగాను. విద్య నా జీవితాన్ని మార్చే సాధనంగా నేను భావించాను. నా తల్లిదండ్రులు, గురువులు, కొంతమంది స్నేహితులు నాకు నిరంతరం ప్రోత్సాహాన్ని అందించారు. ప్రభుత్వస్కాలర్‌షిప్‌లు, రిజర్వేషన్ విధానాలు వంటి అవకాశాలు నాకు మార్గాన్ని సుగమం చేశాయి. నా పట్టుదల, కష్టపడే తత్వం,  ఏ పరిస్థితిలోనూ వెనక్కి తగ్గకపోవడం నన్ను ఈ సెంట్రల్ యూనివర్సిటీలో శాఖాధ్యక్షుడిగా, ప్రొఫెసర్‌గా నిలబెట్టాయి.ఈ విజయం నాకు కేవలం వ్యక్తిగతమైనది కాదు; ఇది నా కుటుంబానికి, సమాజానికి ఒక స్ఫూర్తి. నా లాంటి నేపథ్యం నుండి వచ్చిన యువతకు, కలలు కనడం, వాటిని సాధించడం సాధ్యమని నా ప్రయాణం చూపిస్తుందని నేను నమ్ముతున్నాను.

  • మీరు పల్లె నుండి పల్లెటూరు వరకు, పాఠశాల నుంచి విశ్వవిద్యాలయం వరకు అనేకమందిని చూసి ఉంటారు. కలిసిమెలిసి చదువుకున్న దళిత, దళితేతర విద్యార్థులలో మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎవరితో మీరు ఎక్కువ సన్నిహితంగా ఉంటారు? లేదా  మీతో ఎవరు  సన్నిహితంగా ఉంటారు? 


నా జీవిత ప్రయాణంలో, పల్లె నుండి పట్టణం, నగరం, విశ్వవిద్యాలయం వరకు, నేను దళిత, దళితేతర విద్యార్థులతో కలిసిమెలిసి చదువుకున్నాను. కలిసి అనేక సందర్భాల్లో పనిచేశాను. మనం కలిసి మెలిసి సత్సంబంధాలు కొనసాగించాలనే భావిస్తాం. నేను  అందరినీ సమానంగా గౌరవిస్తాను. అయితే ఇతరులంతా నన్ను అంతే గౌరవం ఇస్తున్నారని చెప్పలేను. 

 బయటకు వెళ్ళినప్పుడు, నేను విశ్వవిద్యాలయంలో లేదా వృత్తిపరమైన వాతావరణంలో అనేక ఆలోచనల్లో, లక్ష్యాలలో సమానమైన ఆసక్తి ఉన్నవాళ్ళతో ఎక్కువ సన్నిహితంగా ఉండటం సహజం.  దళిత, దళితేతర అనే తేడా నా సంబంధాలలో పెద్దగా ప్రభావం చూపదు, ఎందుకంటే నేను సమానత్వం, ఉమ్మడి లక్ష్యాలపై నమ్మకం ఉంచుతాను. అయితే, కొన్నిసార్లు దళిత నేపథ్యం నుండి వచ్చిన వారితో నాకున్న భాగస్వామ్య అనుభవాల వల్ల ఒక ప్రత్యేక అనుబంధం ఏర్పడుతుంది. ఎందుకంటే మేము సమాజంలో సమానమైన సవాళ్లను ఎదుర్కొన్నాం. అందువల్ల దళితుల ఇళ్ళకు వెళ్ళడానికే మొదటి ప్రాధాన్యతనిస్తాను. ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు దళితేతరులు తమ ఇంటికి ఆహ్వానించడం జరుగుతుంది. వెళతాను కూడా. కానీ, వాళ్ళలో కలిసిపోవడం అనున్నంత సులభంకాదు. వాళ్ళేమైనా కొద్దిగా చిన్నచూపు చూసినా, అలా అనిపించినా అదొక అవమానంలా అనిపించే అవకాశం ఉంది. అందువల్ల సాధ్యమైనంత వరకు వాళ్ళిళ్లళ్ళో ఉండే కంటే, ఏదైనా ఒక హోటల్ లేదా గెస్ట్ హౌస్ లో ఉండడానికే ఇష్టపడతాను. 

  • మీ జీవితంలో ఇలాంటి సందర్భాల్లో ఏదైనా చెప్పుకోదగిన అనుభవం మాతో పంచుకుంటారా? 

నేను కాలేజీలో చదివేటప్పుడు నా స్నేహితుల్లో  కొంతమంది బ్రాహ్మణ మిత్రులు కూడా ఉండేవారు. నేను సెలవుల్లో   పొలం పనికి వెళుతూ ఉండేవాడిని. ఏదో పనిమీద మా ఊరు వచ్చిన ఒక మిత్రుడు నన్ను కలుసుకోవాలని నేను పనిచేస్తున్న మా పొలం దగ్గరకే వచ్చాడు. ఇద్దరం కలిసి మా ఇంటికి బయలుదేరాం. మా ఇద్దరం ఒకరిమీద మరొకరు చేతులు వేసుకొని మాట్లాడుంటూ నడుచుకొంటూ వస్తున్నాం. వీధిలో ఒక ఇంటి దరిదాపుల్లోకి వస్తున్నామనుకొనేసరికి నా మీద చేతులు తీసేశాడు. నన్ను కూడా తన మెడమీద ఉన్న చేతులు తీసేస్తూ ‘ మనం వచ్చే రెండిళ్ళ తర్వాత మాకు తెలిసిన మా బంధువులున్నారు. ఇలా చూస్తే మా పెద్దగొడవైపోద్ది’ అని చెప్పాడు ఏదో చెప్పలేని ఇబ్బంది పడుతున్నట్లు! ఇక నేను వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకున్నాను. ఇవన్నీ మాకు మామూలే కదా అనుకున్నాను. ఇలాంటి సంఘటనలు నా జీవితంలో చాలా జరిగాయి. 


  •   తెలుగు సాహిత్యంలో వస్తున్న వివిధ భావజాలాలపై గత మూడు దశాబ్దాలుగా రచనలు చేస్తున్నారు. ప్రత్యేకించి దళిత, బహుజనులు కేంద్రంగా మీ రచనా ప్రస్థానం కొనసాగుతోంది? దీనికి గల ప్రత్యేక కారణాలను తెలుసుకోవచ్చా? 

నన్ను మరొకసారి సమీక్షించుకునేలా అడిగిన మీ ప్రశ్నకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.  ప్రతీ కవి లేదా రచయితకు ఒక భావజాలం ఉంటుంది. ఈ ప్రపంచాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటున్నామో ఆ భావజాలం తెలుపుతుంది. దీన్నే మార్క్సిస్టులు ప్రాపంచిక దృక్పథం అన్నారు. ఆ ప్రాపంచిక దృక్పథం ఏర్పడడానికి ఆ కవి వచ్చిన సమాజం, ఆ సమాజంలో తన ఆస్తిత్వం, తనని అలా  ఆలోచింపజేసేలా చేస్తాయి. తాను ఎవరికోసం రచనలు చేయాలో కూడా ఆ పరిస్థితులే తెలియజేస్తాయి. అలా నేను కూడా దళితులు, బహుజనుల గురించి ఎక్కువగా రాయవలసిన అవసరం ఉందని గుర్తించాను. అందువల్ల నా రచనలకు ప్రధాన కేంద్రంగా దళిత, బహుజనలే ఉంటారు.  దళిత కవులు, రచయితలు తమకు జరుగుతున్న అవమానాలను, కష్టనష్టాలను దళితులు చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు.

  • మీరు ఒక కవిగా, రచయితగా ఎంత పేరు తెచ్చుకున్నారో,  ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ గా అంతే పేరు తెచ్చుకున్నారని నా అభిప్రాయం. దీనికి మీరు ఏమంటారు?

నేను కవిగా, రచయితగా కంటే ముందు ఒక అధ్యాపకుడిగానే ఇష్టపడతాను. అది నాకు ఎంతో ఇష్టమైన ప్రొఫెషన్. ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఎంతోమందికి సహాయపడగలిగిన గొప్ప వృత్తి అది. అక్కడ ఎంతోమందిని ప్రభావితం చేయగలిగే అవకాశం ఉంది. అక్కడ మనం తీసుకునే నిర్ణయాలు కొన్ని సంవత్సరాలపాటు, కొన్ని లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపయోగపడేలా చేస్తుంది. అలా వ్యవస్థీకృత నిర్మాణంలో భాగస్వామ్యం కావచ్చు. మనం సెలెక్ట్ చేసినవాళ్లు కొన్ని సంవత్సరాలపాటు ఆ వ్యవస్థలను తీర్చిదిద్దుతారు. కవులు, రచయితలు  రచనలు రాసినప్పటికీ, వాటిలో ఎలాంటివి పాఠ్యాంశాలుగా ఉండాలని నిర్ణయించడంలో కూడా అధ్యాపకులే ప్రధానమైన పాత్రను నిర్వహిస్తారు. ఇటువంటి వాటిలో భాగస్వామ్యం కావడం వల్ల ఒక ప్రొఫెసర్ గా మీరన్నట్లు గౌరవనీయమైన స్థానం దక్కినందుకు సంతోషంగా ఉంది. 

ఇక, కవి, రచయితగా నా పాత్ర అనేదాన్ని రెండు పార్శ్వాలుగా చూడాలి. నా ప్రధాన వృత్తి పాఠాల్ని బోధించడం, పరిశోధకులు చేయడం, చేయించడంతో పాటు సమాజంలో వారసత్వంగా, చారిత్రకంగా, సాంప్రదాయకంగా కొనసాగుతున్న విజ్ఞానంతో పాటు సమకాలీన సామాజిక వాస్తవికతను, భవిష్యత్తుకి అనుగుణంగా అవసరమయ్యే జ్ఞానాన్ని తెలుగు భాషా, సాహిత్య దృక్పథం నుండి అవగాహన కల్పించాలి. దానికి అనుగుణమైన మేధోపరమైన చర్చల్లో, సమావేశాల్లో, సదస్సుల్లో పాల్గోవాలి. దీనికోసం విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా చేరతాం. ఆ కృషిని బట్టే పదోన్నతులు, పదవులు, గౌరవమర్యాదలు వస్తుంటాయి. ఇలా కృషి చేసే నేపథ్యంలో కూడా భిన్న పార్శ్వాలను జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాలి. కొన్ని మనకి ఇష్టమున్నా లేకపోయినా, నమ్మినా నమ్మక పోయినా బోధించాల్సి వస్తుంది. కానీ, దాన్ని అవగాహన చేసుకొనే బహుళపార్శ్వాలను వివరించి, ఆలోచింపజేయగలగాలి. అక్కడ మన ఆత్మీయతాముద్రకంటే ఆలోచనల విస్పోటనంగానే కొనసాగాలి. చేసే పరిశోధనల్లో, రాసే రచనల్లో శాస్త్రీయంగా మనదైన దృక్పథం ప్రదర్శించు కోవచ్చు. 

  • బహుశా, ఇదంతా పాఠాలు చెప్పే ప్రొఫెసర్ గా, పరిశోధకుడుగా, విమర్శకుడుగా ఉన్న కోణాల్ని వివరించారనుకుంటున్నాను. ప్రొఫెసర్ గా ఉంటూనే సృజనాత్మక రచనలు చేస్తుంటారు కదా! దీని గురించి వివరించండి.

నేను ముందే చెప్పినట్లు, విశ్వవిద్యాలయ అధ్యాపకులలో కొంతమందికి సృజనాత్మక రచనలు చేసే మరోపార్శ్వం కూడా ఉంటుంది. సాధారణంగా ఇటువంటి సృజనాత్మక రచనా నైపుణ్యం భాషా, సాహిత్యాలను బోధించే అధ్యాపకుల్లోనే ఉంటుందనుకుంటారు. కానీ, ఇతర సబ్జెక్టులను బోధించేవారు కూడా మంచి సృజనాత్మక రచనలు చేస్తుంటారు. అయితే, సాహిత్య, భాషా బోధకులకు సృజనాత్మక రచన చేయడం ఒక ప్రత్యేక సౌకర్యం. కవిత్వం, సినిమా పాటలు, సీరియల్స్, కథలు, నవలలు, నాటకాలు… ఇలా రకరకాల ప్రక్రియల్లో రచనలను చేసేవారిని చూస్తే, కేవలం భాషా, సాహిత్య శాస్త్ర బోధకులే కాకపోయినా, అత్యధిక శాతం వాళ్ళే ఉంటారు. ఇతర శాస్త్రాల్లో ఉన్నా విస్తృతమైన అధ్యయనం వాళ్ళను రచయితలుగా మార్చవచ్చు.

సాధారణంగా ఉపాధ్యాయులు, ఉపన్యాసకులు లేదా విశ్వవిద్యాలయ బోధకులు  సృజనాత్మక సాహిత్యాన్ని సృష్టించడం కంటే అప్పటికే ఉన్న ఆ రచనల్లోని విజ్ఞానాన్ని విద్యార్థులకు అందించటం ముఖ్యం. అవి ఏ ప్రక్రియకు చెందుతాయి? ఆ ప్రక్రియకు సంబంధించిన లక్షణాలు ఏమిటి? దానిలో వస్తువంటే ఏమిటి? శిల్పమంటే ఏమిటి? రూపమంటే ఏమిటి? ఒక రచనను సామాజిక, చారిత్రక, ఆర్థిక, సామాజిక, మనోవైజ్ఞానిక దృక్పథాలతో అధ్యయనం చేయడం ఎలాగో నేర్పాలి. ఆ రచనలు సామాజిక వాస్తవికతను, కళాత్మక విలువలను ప్రతిఫలింపజేస్తున్నాయో లేదో, ఆ విశేషాంశాలను వివరించగలగాలి. ముఖ్యంగా ఆ రచనల తత్వాన్ని తెలిసేలా బోధించగలగాలి. 

  • ఇలాంటి పరిస్థితుల్లో సృజనాత్మక రచన గొప్పదంటారా? ఆ రచనలను వివరించే శాస్త్రం గొప్పదంటారా?

జీవితంలో నుండి రచనలు ఉద్భవించాలి. అవి ఉన్నవి ఉన్నట్లుగా వెలువడితే కొన్ని ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల వాటికి కళాత్మకతను జోడించాలి. అప్పుడు అది సృజనాత్మకత రచన అవుతుంది. ఆ సృజనాత్మకతలో భావుకత, ఆదర్శనీయత, రమ్యత, నైతిక విలువలు/నైతికతను ప్రశ్నించే ఆలోచనలు ఉంటాయి. ఆ అంశాలను శాస్త్రీయంగా వివరించేది శాస్త్రం అవుతుంది. శాస్త్రం ఒకరు ఒప్పుకున్నా,  ఒప్పుకోకపోయినా ప్రమాణాలను నిర్దేశిస్తుంది. కానీ, సృజనాత్మక రచన మాత్రం, హృదయ అహ్లాదాన్ని కేంద్రంగా చేసుకుంటుంది. ఆ ఆనందం అన్నివేళలా సమాజానికి మంచిది చేసేదే అయి ఉండాలని ఏమీ ఉండదు. సృజనాత్మక రచయిత నైతిక విలువలు పాటించవచ్చు; పాటించకపోవచ్చు. కానీ శాస్త్రవేత్త మాత్రం ఖచ్చితంగా వాటిని తార్కికంగా చూపిస్తాడు. సృజనాత్మక రచన సంఖ్యాపరంగా అత్యధికమైన ఆనందపరచవచ్చు. కానీ, శాస్త్రాన్ని చదివేది తక్కువ మందే ఉండొచ్చు. సంఖ్యా బలాన్ని బట్టి ఉత్తమత్వాన్ని నిర్ణయించలేం.

  • మీరు ఒక ప్రధాన జీవన స్రవంతిలో ఉండి, ఒక ప్రఖ్యాత విశ్వవిద్యాలయంలో సాహిత్యాన్ని బోధిస్తున్నారు; పరిశోధనలు చేస్తున్నారు.  ప్రధాన జీవన స్రవంతిలోని సాహిత్యానికీ, దళిత సాహిత్యానికి మధ్య గల వ్యత్యాసాన్ని ఎలా గుర్తించాలి?

రెండు రకాల సాహిత్యాలు పైకి ఒకలాగే లేదా కలిసి పయనిస్తున్నట్లే అనిపిస్తాయి. కానీ, ప్రధాన జీవన స్రవంతి సాహిత్యం (Mainstream Literature), దళిత సాహిత్యం (Dalit Literature) మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలంటే కొన్ని ముఖ్యమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఈ రెండు సాహిత్య రూపాలు వాటి లక్ష్యాలు, దృక్పథాలు, ఇతివృత్తాలు, భాష, మరియు సామాజిక సందర్భంలో భిన్నంగా ఉంటాయి. 

ప్రధాన జీవన స్రవంతి సాహిత్యం అందరి సాహిత్యం అంటూ తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేలా ప్రయత్నిస్తుంది. దీన్ని లోతుగా పరిశీలిస్తే తప్ప గుర్తించడం కష్టం. 

ప్రధాన జీవన స్రవంతిలో ఉన్న సాహిత్యం సామాజికంగా ఆధిపత్య వర్గాల అనుభవాలను ఉన్నతీకరించేలా ప్రతిబింబిస్తుంది. సామాజిక మార్పు కంటే వినోదం లేదా సాహిత్య సౌందర్యంపై ఎక్కువ దృష్టి పెడుతుంది. అంతే కాదు, ప్రచురణరంగం తమ అధిపత్యంలోనే ఉండడం వల్ల వాణిజ్యపరంగా కూడా విజయవంతమవుతుంది. అటువంటి సాహిత్యాన్నే విస్తృత పాఠక వర్గాన్ని ఆకర్షిస్తుందని ప్రకటిస్తుంది కూడా! కానీ, ఇలాంటి అవకాశాలు దళిత సాహిత్యానికి చాలా అరుదుగా లభిస్తాయి. తరచుగా చిన్న ప్రచురణ సంస్థలు, స్వతంత్ర ప్రచురణలు, లేదా సామాజిక ఉద్యమాల ద్వారా దళిత సాహిత్యం ప్రచురించబడుతుంది. తాము ప్రచురించిన గ్రంథాలను ప్రధాన విక్రయ సంస్థల్లో పెట్టమని ఇచ్చినప్పటికీ వాటిని ప్రదర్శనలలో ఉంచడానికి ఇష్టపడరు. ఆ కవి లేదా రచయితే అడిగినా, అవి అమ్ముడవడం లేదని పంపేశారనీ, త్వరలోనే అందుతాయనీ చెప్తుంటారు. 


సమకాలీన దళిత సాహిత్యం స్థితి గతులు ఎలా ఉన్నాయి? 

సమకాలీన దళిత సాహిత్యం సామాజిక మార్పు కోసం శక్తివంతమైన సాధనంగా కొనసాగుతోంది. ఇది కొత్త రచయితలు, ఆధునిక మాధ్యమాలు,  విస్తృత అంశాలతో విస్తరిస్తున్నప్పటికీ, దళిత సాహిత్యానికి ప్రధాన స్రవంతి గుర్తింపు తక్కువగా ఉంటుంది. దీనికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. దళితులు నిర్వహించగలిగే పత్రికలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. వాటిని నిర్వహించగలిగే ఆర్థిక శక్తి సరిపోవడం లేదు. దీనికి తోడు ఎస్సీ వర్గీకరణ ఉద్యమం వల్ల దళితులలో ఎవరి గురించి ఎవరు రాయాలనే ఆలోచనలో పడ్డారు. దళిత సాహిత్యం విస్తృతంగా వెలువడ్డడానికి ఇవన్నీ  అడ్డంకులుగా ఉన్నాయి. అయినప్పటికీ వస్తున్న దళిత సాహిత్యంలో లింగ వివక్ష, ఆర్థిక అసమానతలు, గ్లోబలైజేషన్ ప్రభావం వంటివన్నీ  ప్రతిఫలిస్తున్నాయి. సోషల్ మీడియా, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా దళిత రచయితలు తమ రచనలను విస్తృత పాఠకులకు చేరవేసే అవకాశాలు ఉన్నాయి. కానీ, దాన్ని శక్తివంతంగా ఉపయోగించుకొనేవాళ్ళు తక్కువగానే కనిపిస్తున్నారు. తెలుగు దళిత సాహిత్యం ఇతర భాషలలోకి అనువదించబడుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతోంది. కానీ, ఆ అనువాదాలు వ్యక్తిగత ప్రాధాన్యాన్ని బట్టి కొనసాగుతున్నాయి. 

  • దళిత అనే పదం వాడకూడదనే వాదనలు ఉన్నాయి కదా మీరు ఏమంటారు?

 కొన్ని రాష్ట్రాల్లో భారత రాజ్యాంగం గుర్తించిన షెడ్యూల్డు కులాల వారిని ‘దళితులు’ అనే పదంతో ప్రయోగించడం సరైనది కాదనే ఆలోచనలు ఉన్నాయి. కొందరు ఈ పదం సమాజంలో ఉన్న కుల విభజనను మరింత బలపరుస్తుందని, లేదా ఈ పదం వాడకం వల్ల కొన్ని సమూహాలు అవమానకరంగా భావించవచ్చని అంటారు. కానీ, దళిత అనేది ప్రస్తుతం ఒక ఆత్మగౌరవ చైతన్యానికి ప్రతీకగా మారింది. సంప్రదాయ సాహిత్యానికి ప్రత్యామ్నాయ సాహిత్యంగా కూడా ఎదుగుతుంది. షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలకు చెందినవారు తమలో తాము ఆత్మగౌరవ చిహ్నంగా దళితులని పిలుచుకోవడంలో తప్పు లేదని భావిస్తున్నారు. ఇది ఎలాంటిదంటే, షెడ్యూల్డ్ కులాలలోని మాల, మాదిగ వంటి పదాలతో నిందార్థంతో, నీచార్ధంతో పిలిస్తే అది నేరమవుతుంది. అలాగే, ‘దళిత’ అనే పదం కూడా అవమానించడానికీ లేదా  అగౌరవపరచడానికో నిందించడానికో ఉపయోగిస్తే అది నేరమవుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దళిత సాహిత్యం వీళ్ళందర్నీ ఒక ఆలోచన ధారతో పయనించేటట్లు చేస్తుంది.‌ అందువల్ల దళితులు, దళిత సాహిత్యం అని ఆత్మగౌరవ చైతన్యంతో పిలుచుకోవడంలో తప్పులేదు. 

  • నిత్య వ్యవహారంలో ‘చండాల’ వంటి పదాలను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా సినిమాలు, టీవీ సీరియల్స్ లో ఈ పదప్రయోగం ఎక్కువగా కనిపిస్తుంది. ఇలా ఉపయోగించడం పట్ల మీ అభిప్రాయం?

భారత రాజ్యాంగం గుర్తించిన షెడ్యూల్డ్ కులాలలోని ఒక ఉప కులం పేరు చండాల. ఆ కులం పేరుని నీచార్థంలో నిత్య వ్యవహారంలో గాని, సినిమాలు, సీరియల్స్, ఎలాగైనా సరే ఉపయోగిస్తే అది నేరం. అయితే, దీన్ని చట్టపరంగా ఉపయోగించకుండా చేయడానికి ప్రయత్నం చేయాలి. నేను ఇప్పటికే నా ‘బహుజన సాహిత్య దృక్పథం’, ‘పునర్మూల్యాంకనం’ అనే సాహిత్య విమర్శ పుస్తకంలో దళిత, చండాల అనే పద ప్రయోగాల గురించి నా వ్యాసాల్లో పేర్కొన్నాను.  

  • ఎస్సీ వర్గీకరణ ఉద్యమం వల్ల దళితులలో ఎవరి గురించి ఎవరు రాయాలనే ఆలోచనలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో దళిత సాహిత్య భవిష్యత్తు ఎలా ఉంటుంది?

ఎస్సీ వర్గీకరణ ఉద్యమం దళిత సాహిత్యంలో వైవిధ్యాన్ని తీసుకొచ్చింది. దళిత ఉపకులాల్లోని అనేక అంశాలు వీళ్ళందరినీ సమైక్యంగా పోరాడవలసిన అవసరాన్ని తెలుపుతున్నాయి. అందరూ ముఖ్యంగా కుల వివక్షను చెప్పుకోవాలి. దీనితోపాటు ఆర్థికపరమైన వెనుకబాటుతనం కూడా మరొక ప్రధాన కారణం కావడం వల్ల దళితులకు పీడన ఎక్కువగా ఉంటుంది. దీన్ని సమైక్యంగా మాత్రమే ఎదుర్కోగలుగుతారు.  దళిత సమాజం యొక్క సమగ్ర గుర్తింపును బలోపేతం చేసే రచనలపై దృష్టి పెట్టాలి. దళిత సాహిత్య సమావేశాల ద్వారా వివిధ ఉప-కులాల రచయితలను ఒకచోట చేర్చడం ద్వారా సంఘీభావాన్ని పెంపొందించాలి.  ఎవరికి రావాల్సినవి వారు పొందుతూనే కలిసి పోరాడాల్సి అంశాల్ని ఆ సమావేశాల్లో వివరించగలగాలి. ఈలోగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. దళితుల్ల మళ్ళ ఉపకుల అస్తిత్వం, ప్రత్యేక సాహిత్య సృజన పెరుగుతుంది. ఈ సమయంలో సాహిత్య సృజన జరుగుతున్నప్పటికీ ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు, అసత్య ప్రచారాలు జరిగే అవకాశాలు మెండుగా ఉంటాయి. అంతవరకు కేవలం మాల మాదిగల సాహిత్యాన్నే దళిత సాహిత్యంగా భావించేవారు తమ తమ అస్తిత్వాల కోసం, తమ తమ జాతి చైతన్యం కోసం అన్వేషించే ప్రయత్నం చేస్తారు. కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త చారిత్రక ఆధారాలు లభ్యమయ్యే అవకాశం కూడా ఉంది. అంతవరకు దళిత ముసుగు వేసుకొని సాహిత్యాన్ని సృజించేవాళ్లు, మాట్లాడేవాళ్ల అసలు స్వభావం బహిర్గతం అవకాశం ఉంది. దీనికి కారణం - దళిత సాహిత్యంలో భాష తరచుగా స్థానిక, ప్రాంతీయ, దళిత సముదాయాల సామాజిక వాస్తవికతను ప్రతిబింబించేలా ఉంటుంది. శైలి సూటిగా, నిరసనాత్మకంగా, భావోద్వేగం ఆగ్రహ వ్యక్తీకరణలా  ఉంటుంది. ఆత్మకథాత్మక రచనలు, కవిత్వం, స్పోకెన్ వర్డ్ శైలులు సాధారణంగా అనుసరిస్తుంటారు. సాంస్కృతికంగా ఆధిపత్య భాషా నిర్మాణాలను సవాలు చేస్తూ, దళిత సాంస్కృతిక భాషను ఉపయోగిస్తుంది. ప్రధాన జీవన స్రవంతి సాహిత్యాన్ని చదవడానికి అలవాటు పడే వారికి ఇవన్నీ ఇష్టపడడం చాలా కష్టం. అందుకే దళిత, బహుజన, మైనార్టీ వర్గాలకు సంబంధించిన ప్రత్యేక అధ్యయనాలు కావాలని మేధావులు కోరుతున్నారు. 

  • దళిత సాహిత్యాన్ని  ఎం.ఏ. స్థాయిలో ప్రత్యేకంగా ఒక ఆప్షనల్ కోర్సుగా పెట్టడానికి ఇలాంటివే కారణాలు అంటారా? 

 అవును,ఇటువంటివి కూడా కారణమే. మనం చదువుతున్న ఆరో తరగతి నుండి.పి.జి.వరకు ఉన్న పాఠాల్ని మరింత లోతుగా, విశ్లేషణత్మంగా చదవాలనే ఆలోచనతో  పై తరగతుల్లోనూ అవే పాఠాలు  కొనసాగుతూ ఉంటాయి. సాధారణంగా దళితులకు సంబంధించిన పాఠాల్ని పాఠ్య పుస్తకానికి చివర్లో పెడతారు. ఒకవేళ మధ్యలో గానీ మొదట్లో పెట్టినా, చాలామంది వాటిని చెప్పకుండా ముందు అందరికీ ఉపయోగపడే ముఖ్యమైన పాఠాలంటూ కొన్నింటినే  చెప్తుంటారు.  అలాంటప్పుడు దళిత కవులు, రచనల వంటి పాఠాలు చెప్పకుండా ‘మీరు చదువుకోండి’ అని వదిలేస్తుంటారు. చాలా మంది ఉన్నత విద్యలో కూడా ఆధునిక సాహిత్యం పేరుతో ప్రత్యేకంగా ఒక కోర్సు ఉన్నప్పటికీ దానిలో  దళిత, బహుజన, మైనారిటీ సాహిత్యాలను నామమాత్రంగా ప్రస్తావిస్తుంటారు. అంతే. అలాంటప్పుడు ఆ సాహిత్య ధోరణులపై తగినంత అవగాహన కల్పించరు. పాఠాలే కాదు, తెలుగు సాహిత్య చరిత్రల్లో కూడా అలాగే ఆ అంశాలను కొద్దిగా ప్రస్తావించి వదిలేస్తుంటారు. అందుకనే ప్రత్యేకించి డా.పిల్లి జాన్సన్ దళిత సాహిత్య చరిత్రను రచించారు. ఆ తర్వాత చాలామంది ఆ బాటలోనే పయనించారు. 

  • దళిత సాహిత్యాన్ని ఒక ప్రత్యేక ఆప్షనల్ కోర్సుగా పెట్టాలని ప్రతిపాదించినప్పుడు మీరు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది? 

నేను ఎం.ఏ.తెలుగులో 2005 నుండి దళిత సాహిత్యం ఒక ఆప్షనల్ గా పెట్టేటట్లు చేశాను. నేను 2004 లో సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖలో అధ్యాపకుడుగా చేరాను. ఆ సంవత్సరమే బోర్డు ఆఫ్ స్టడీస్ లో అప్పటి శాఖాధ్యక్షులు ఆచార్య పరిమి రామనరసింహంగారి సహకారంతో దళిత సాహిత్యం ఒక కోర్సుగా ప్రతిపాదించాను. విచిత్రం ఏమిటంటే ఆనాడు ఉన్న దళితేతర ప్రొఫెసర్లు ఎవరూ  ఆ కోర్సు పెట్టడానికి వ్యతిరేకించలేదు. కానీ ఒక దళిత ప్రొఫెసర్ మాత్రం ఆధునిక సాహిత్యం అంతర్భాగంగా చెబుతున్నప్పుడు ప్రత్యేకించి  అవసరం లేదని వాదించారు. అప్పటికే ఆంధ్ర విశ్వవిద్యాలయం, వాల్తేరులో దళిత సాహిత్యం ఒక కోర్సుగా ప్రత్యేకించి చెప్తున్నారని నాకు తెలుసు. ఆ విషయాన్నే ఆ సమావేశంలో చెప్పాను. అంతేకాకుండా దళిత సాహిత్యం ప్రధాన జీవన స్రవంతిలోగల  సాహిత్యానికి మధ్య గల తేడాలను వివరంగా చెప్పాను. ఆ దళిత ప్రొఫెసర్ తప్ప మిగతా వాళ్ళంతా  ఆమోదించారు. ఆ తర్వాత దళిత సాహిత్యం పై ప్రత్యేక పరిశోధనలు విస్తృతమయ్యాయి. 

  • దళితులను చైతన్యం చేసి దళితులను, ఆ సాహిత్యాన్ని ప్రధాన జీవన స్రవంతిలోకి తీసుకొని రావాలంటే ఏం చేయాలి? 

ముందు దళితులను చైతన్యవంతం చేయాలి. ఆ తర్వాత దళిత సాహిత్యం కూడా చైతన్యవంతం అవుతుంది. దళిత విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఉచిత విద్య,  ఉన్నత విద్యా సంస్థల్లో రిజర్వేషన్ల ద్వారా విద్యా అవకాశాలను విస్తరించడానికి గల మార్గాలన్నింటినీ ఉపయోగించుకోవాలి. 

దళితుల్లోని త్యాగశీలతను, కరుణార్ద్రహృదయాన్ని తెలియజేసే రచనలను విస్తృతంగా చేయాలి. ఆ దళిత చరిత్ర,  అంబేద్కర్ సిద్ధాంతాలు,  సామాజిక న్యాయం గురించి పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశపెట్టాలి. వివిధ విద్యా కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ప్రజలను చైతన్య పరచాలి.  ఉపాధి అవకాశాలను పెంచేందుకు సమాజానికి సత్వరం కావాల్సిన వృత్తి నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను అందించాలి. 

దళితులకు ప్రభుత్వ,  ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ అవకాశాలను పెంచడానికి చట్టపరంగా ఉండే రిజర్వేషన్లను సమర్థవంతంగా అమలు చేయడానికి మేధావులు కృషి చేయాలి. 

   దళిత పారిశ్రామికవేత్తలకు స్టార్టప్‌ల కోసం రుణాలు, గ్రాంట్‌లు,  శిక్షణ కార్యక్రమాలను అందించాలి. ఆర్థిక సాక్షరత కార్యక్రమాల ద్వారా దళిత గ్రూపులకు బ్యాంకింగ్, పొదుపు,  పెట్టుబడి గురించి అవగాహన కల్పించాలి. దళిత సాహిత్యాన్ని పాఠశాలలు, కళాశాలలు,  సామాజిక వేదికలలో ప్రోత్సహించడం ద్వారా దళిత గ్రూపుల్లో ఆత్మగౌరవం కలిగించే కథనాలను, స్ఫూర్తిదాయకమైన రచనలను, విజయగాథలను ప్రచారం చేస్తూ చైతన్యం పెంపొందించాలి. 

కేవలం దళిత రాజకీయాలు,  దళిత సాహిత్యం మాత్రమే సరిపోదు. బహుజన భావజాలంతో పయనించాలి. అంబేద్కర్ భావజాలాన్ని వీడకుండా అవసరమైనంతమేరకు మార్క్సిస్టు సంస్థలతో కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది. 

దళితుల సమస్యలను సానుకూల దృక్పథంతో చిత్రీకరించేందుకు సినిమాలు, డాక్యుమెంటరీలు,  డిజిటల్ కంటెంట్‌ను ప్రోత్సహించాలి. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో దళిత అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేయడం ద్వారా యువతను చైతన్యవంతం చేయవచ్చు. దళితులకు రాజకీయంగా ఎక్కువ అవకాశాలు కల్పించుకోవాలి, స్థానిక స్వపరిపాలన నుండి జాతీయ స్థాయి వరకు వారి ప్రాతినిధ్యాన్ని పెంచుకోగలగాలి.

దళితులను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి విద్య, ఆర్థిక సాధికారత, సామాజిక చైతన్యం,  రాజకీయ భాగస్వామ్యం పెరగాలి. ఈ ప్రక్రియలో ప్రభుత్వం, సముదాయ సంస్థలు, మరియు సమాజం మొత్తం సమన్వయంతో పనిచేయడం కీలకమని గుర్తించాలి. 

  • తెలంగాణాలో కొన్నాళ్ళ పాటు కొనసాగిన దళిత బంధు పథకం పై మీ అభిప్రాయం? 

దళితుల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన ఏ పథకాన్ని అయినా దాన్ని ఉపయోగించుకునే పద్ధతిలోనే దాని ప్రయోజనం ఉంటుంది. దళితబంధు అనేది కొన్ని గ్రామాలకు, ఆ గ్రామాల్లో కొంతమందికే పరిమితమైనప్పటికీ ఆ డబ్బుతో దళితులందరికీ ఉపయోగపడే పని చేయడం ద్వారా ఆ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. దురదృష్టవశాత్తు అది అనుకున్న లక్ష్యాలకు చేరలేదు. దళితులు పారిశ్రామికవేత్తలు కావాలనే ఆశయం, దానికొక లక్ష్యం లేకపోతే అటువంటి పథకాలు ఎన్ని పెట్టినా ప్రయోజనం ఉండదు.  దళితులు విదేశాలలో  చదువుకోడానికి కొన్ని లక్షల రూపాయలను ఆర్థిక సహాయంగా అందించే పథకాలు కూడా ఉన్నాయి. అయితే వాటిని అందుకున్న లబ్ధిదారులు మరలా దళితులకు సహాయం చేయాలని ఆలోచన ఉండాలి. దళితుల అందరి పేరు చెప్పుకొని పొందే ఆ సహాయం వ్యక్తిగతమైన అభివృద్ధికి లేదా ఒకటి రెండు కుటుంబాల ఉన్నతికి ఉపయోగపడితే ఇలాంటి పథకాలు ఎప్పటికీ దళితుల అందరికీ ఉపయోగపడతాయని చెప్పలేం. అందుకనే ముందుగా ఆ దళిత చైతన్యాన్ని అందుకోవాల్సింది దళితులే. 

  • ప్రైవేటు విద్యాసంస్థలు, కంపెనీలలో దళితులకు రిజర్వేషన్ల పట్ల మీ అభిప్రాయం.

ప్రభుత్వానికి సంబంధించిన అనేక అవకాశాలను ఉపయోగించుకుంటున్న ప్రైవేట్ సంస్థలు కూడా దళితులకు రిజర్వేషన్లు కల్పించాలి. సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది వాళ్లకు కూడా ఉంటుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(5) ప్రైవేటు విద్యాసంస్థలలో (మైనారిటీ సంస్థలు మినహా) SC, ST, మరియు OBCలకు రిజర్వేషన్లను అనుమతిస్తుంది, ఇది సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో 93వ రాజ్యాంగ సవరణ (2005) ప్రైవేటు విద్యాసంస్థలలో రిజర్వేషన్లను చట్టబద్ధం చేసింది. అయినప్పటికీ అవి సరిగ్గా‌ కూడా 

ప్రైవేటు విద్యాసంస్థలు, ముఖ్యంగా IITలు, IIMలు, మరియు ఇతర ప్రముఖ సంస్థలు, ఉన్నత విద్య మరియు ఉపాధి అవకాశాలకు ద్వారాలుగా పనిచేస్తాయి. ఈ సంస్థలలో రిజర్వేషన్లు లేకపోతే, దళితులు ఈ అవకాశాల నుండి మినహాయించబడే ప్రమాదం ఉంది, ఇది సామాజిక అసమానతలను మరింత పెంచుతుంది. దీనివల్ల భవిష్యత్తులో అనేక సామాజిక సమస్యలు ఉత్పన్నమవుతాయి. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల కోసం కూడా రాజకీయ మరియు సామాజిక ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. 

  •  ఉభయ తెలుగు రాష్ట్రాలలో గల పత్రికలు,  వాటిలో దళిత పత్రికల పట్ల మీ అభిప్రాయాలను తెలియజేస్తారా?  

నాకు తెలిసినంతవరకు దళితుల ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రధాన జీవన స్రవంతిలో ఉన్న పత్రికలు లేవనుకుంటున్నాను. కానీ, కొన్ని పత్రికలు దళిత అంశాలపై కేంద్రీకరించి ప్రచురించాలనే ఉద్దేశంతో వెలువడుతున్నాయి. దీనిపై కూడా నా పుస్తకాల్లో ప్రత్యేక వ్యాసం రాశాను. వీటితోపాటు  డిజిటల్ పత్రికలు వస్తున్నాయి. ఈ దిశగా దళితులు బాగా ఆలోచించాలి. 

  • మీ అభిప్రాయంలో మీడియా — ముఖ్యంగా దళిత మీడియా — సామాజిక మార్పును ఎలా ప్రభావితం చేయగలదు?

అక్షరానికి గొప్ప శక్తి ఉంది. అందుకే కాళోజీ అనే మహాకవి ‘అక్షర రూపం దాల్చిన సిరా చుక్క లక్ష మెదళ్ళకు కదలిక’ అన్నాడు. ‘పత్రికొక్కటున్న పదివేల సైన్యము/పత్రికొక్కటున్న మిత్రకోటి/ప్రజలకు రక్షలేదు పత్రిక లేనిచో!!’ అని ప్రముఖ పత్రిక సంపాదకుడు నార్ల వెంకటేశ్వరరావు చెప్పారు. ఇలా ఎంతోమంది పత్రికల ప్రభావం గురించి చెప్పారు. పత్రికలు కూడా మీడియాలో భాగం కాబట్టి మీడియా కూడా అనువర్తించుకోవచ్చు. పత్రికలతో పాటు రేడియో, టీవీ, యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, లింక్డన్ మొదలైన సామాజిక మాధ్యమాలు కూడా మీడియాలో అంతర్భాగమే.  కానీ సాధారణంగా మీడియా అంటే పత్రికలు, టీవీలుగానే ప్రచారంలో ఉన్నాయి. వీటి గురించి మాట్లాడుకున్నా, వీటి ప్రభావం సామాన్యమైనది కాదు. అవి తలచుకుంటే ఏదైనా చేయడానికి సాధ్యమే. 


  •  Dalitha Shakthi మేగజైన్ వంటి ప్రచురణలు యువతను ఎలా ప్రభావితం చేయాలన్నది మీ అభిప్రాయం ఏమిటి?

దళిత శక్తి మ్యాగజైన్ దళిత సమస్యలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లి ప్రజలందరినీ ఆలోచింప చేయడంతో పాటు, ముఖ్యంగా దళితులను  చైతన్యవంతం చేయడానికి కృషి చేస్తుంది. ప్రధాన జీవన స్రవంతిలో ఉన్న పత్రికలు, టీవీలు వంటివన్నీ దళితేతరుల చిన్న విజయాన్ని కూడా అదొక గొప్ప విజయంక ప్రచారం చేస్తూ ఉంటాయ్. దళితులు పెద్ద విజయాన్ని సాధించినప్పటికీ, దేశం కోసం త్యాగం చేస్తూ ప్రాణాలు అర్పించినప్పటికీ వాటిని పెద్దగా పట్టించుకోవు. ఒకవేళ పట్టించుకోవలసి వచ్చిన అది చాలా ప్రాధాన్యం లేని చిన్న వార్తగా మిగిలిపోతుంది. ఇటువంటి పరిస్థితులలో దళిత శక్తి పత్రిక దళితులలో ఉన్న ఆణిముత్యాలు లాంటి వారందరినీ పరిచయం, ప్రశంసించడం, వారి ప్రతిభను ప్రచారం చేయడంలో విప్లవాత్మకమైన పాత్రను పోషిస్తుంది. దళితులు కవర్ పేజీకి కూడా అర్హులని చాటి చెప్తూ ఆ కవర్ పేజీగా కూడా వారి ఫోటోలు ప్రచురిస్తుంది. దళితులతో పాటు వికలాంగులను కూడా ఎంతగానో ప్రోత్సహిస్తుంది. ఇదంతా దళితులు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి మరి ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది. ఇప్పటికే యువకులపై దృష్టి కేంద్రీకరించింది. ఆర్థికంగా కొంచెం నిలబడగలిగితే దళితులలోని సృజనాత్మక శక్తినీ, వారి విజయాలను దళితుల చేతే రాయించగలిగితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు విజయాలు సాధించడమే కాదు వాటిని రాయగలిగినటువంటి శక్తివంతమైన కవులు రచయితలు కూడా ఉన్నారు. ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్న ప్రజా ప్రతినిథులు, దళిత వ్యాపారస్తులు, ఉన్నత ఉద్యోగులు ఇటువంటి పత్రికలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. 


  • అడిగిన ప్రశ్నలన్నింటికీ ఓపిగ్గా సమాధానాలు చెప్పినందుకు ధన్యవాదాలు సర్.

 నా అభిప్రాయాలను వ్యక్తీకరించే అవకాశం కల్పించినందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. 

***




2 కామెంట్‌లు:

J. D. Prabhakar చెప్పారు...

"దళితులు ప్రధాన జీవిన స్రవంతిలోకి రావాలి" అన్న నినాదంతో ముఖాముఖి వ్యాసం ఎంతో లోతైన దళిత పరిశోధనను తెలియజేస్తుంది. నిజానికి, మొత్తం దళితులతో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారు ముఖాముఖి చేసినట్టుగా ఉంది. దళితులలో సామాజిక, రాజకీయ, రాజ్యాంగ చైతన్యం లేక సమాజంలో ప్రధాన జీవన స్రవంతిలోకి రాలేక వెనుకబడిపోతున్న వాస్తవాన్ని కొత్త తరహాగా ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారు వెలుగులోకి తీసుకురావడం దళితులకు ఎంతో చైతన్యాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం దళితులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను లేవనెత్తుతూ వాటికి పరిష్కారాన్ని - సమూహ సంఘాలూ, ప్రభుత్వాల ద్వారా రిజర్వేషన్లతో పాటు, వ్యాపారాలకు ఆర్థిక చేయూత అందించడం ద్వారా వస్తుందని వివరించారు. సమస్యలు ఎదురైనప్పుడు, వాటిని పరిష్కరించుకోవడానికి వివిధ దళిత సంఘాలతో పాటు కమ్యూనిస్టులతో కూడా పనిచేస్తూ లక్ష్యాన్ని సాధించాలని సూచించడం ఎంతో అభినందించదగ్గ విషయం. ఆచార్యులవారు తమ జీవితంలో దళితుడిగా ఎదుర్కొన్న వివక్షను, వాటిని అధిగమిస్తూ హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో ఆచార్యులుగా ఎదగడానికి ఆయన చేసిన కృషి పట్టుదల చదువరులకు స్ఫూర్తినిస్తుంది. దళిత విద్యార్థులకు, వివిధ దళిత సంఘాలలో పనిచేసే నాయకులకు ఈ వ్యాసం వారి లక్ష్యసాధన ప్రయత్నానికి కొత్త దారి చూపిస్తుందని చెప్పవచ్చు.

Darla చెప్పారు...

ధన్యవాదాలు డా. ప్రభాకర్ గారు