"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

30 మార్చి, 2026

దార్ల మాట తేటగీతి శతకం ఆచార్య ఎన్. ఈశ్వరరెడ్డి ముందుమాట.

 

సందేశాత్మక ఆధునిక శతకం దార్ల మాట

-       ఆచార్య ఎన్.ఈశ్వర రెడ్డి



        కష్టే ఫలి అని నమ్మినవాడు, అడ్డొచ్చిన అవమానాలను తొక్కుకుంటూ ముందుకు నడిచిన వాడు, విజయ పతాకం చేతబట్టి మార్గదర్శనం చేస్తున్న వాడు, ఆచార్యుడిగా, విమర్శకుడిగా, కవిగా, స్వీయ చరిత్రకారుడిగా తనకంటూ ఒక ప్రత్యేకతను సాధించుకున్న మనిషి ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో పనిచేస్తూ ఎంతో మంది విద్యార్థులకు దారి దీపంలో నిలుస్తున్నవాడు, మరెంతో మందికి నీడనిచ్చే ఒక విద్యా వృక్షమై ఆప్యాయతను పంచుతున్నవాడు. మంచి చెడుల వివేచనను నేర్పుతున్న వాడు, కష్టసుఖాల స్వభావాలను అక్షరాలుగా మారుస్తున్న వాడు దార్ల వెంకటేశ్వరరావు. నిరంతర పోరాటంలో అంది వచ్చిన అనేక అనుభవాలను అస్త్రాలుగా చేసుకున్న వాడు, ఎదురొచ్చే ఆటంకాల చీకట్లను చీల్చి చెండాడే వాడు దార్ల. కలిమిలేముల కాలాలపై కవాతు చేసినవాడు, సామాజిక ఎత్తు పల్లాలపై నడిచొచ్చినవాడు దార్ల. కామందుల దురహంకారాన్ని నిలువునా విరిచిన వాడు, ఆత్మవిశ్వాసాన్ని విల్లుగా చేసి యుద్ధం చేసినవాడు దార్ల.

      అక్షరాలను రెక్కలుగా చేసుకుని విజ్ఞాన విహాయస యాత్ర చేస్తున్న దార్ల తనకు అందిన జ్ఞానాన్ని అనుభవ పాఠాన్ని తిరిగి అక్షరాలుగా మార్చి అందిస్తున్నాడు. తన అక్షరానికి దార్ల మాటగా నామకరణం చేసుకున్నాడు. తను పొందిన జ్ఞానానుభవాన్ని శతాధిక పద్యమాలగా మార్చి భావితరాలకు అందివ్వాలని నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయానికి ప్రతిఫలంగా వచ్చిందే మీ చేతిలో ఉన్న ఈ "దార్ల మాట" శతకం.

       తెలుగు సాహిత్య ప్రక్రియల్లో శతక సాహిత్యం ఒక ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించుకుంది. జీవన విలువలను, నైతిక సందేశాలను, సామాజిక బాధ్యతలను సరళమైన పద్యరూపంలో ప్రజల హృదయాల్లో నాటే శక్తి శతకాలకు ఉంది. ఈ సాహిత్య పరంపరలో ఆవిష్కృతమైన దార్ల మాట” తేటగీతి ఛందస్సులో ఆధునిక భావజాలాన్ని సమన్వయ పరుచుకున్న సార్ధక కృతి.

       సహజంగా శతకాలు ముక్తకాలుగా ఉంటాయి. ఏ పద్యానికి ఆపద్యమే అర్ధవంతంగా ముగిసిపోతుంది. ఒక పద్యానికి పైనున్న పద్యం లేదా కిందనున్న పద్యానికి అనుసంధానం ఉండదు. ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్రంగా ఒక భావాన్ని అందిస్తుంది. దార్ల మాట శతకంలో కూడా అలాంటి లక్షణాలు ఉన్నప్పటికీ, ఆ పద్య క్రమాన్ని చూస్తే ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటుంది. తల్లి తండ్రి గురువు దైవము అని మనం వరుసక్రమాన్ని చెప్తూ ఉంటాం. దార్ల మాట శతకంలో దైవం, తల్లి, తండ్రి, గురువు, స్నేహితులు ఇలా ఒక క్రమంలో కనిపిస్తారు.             

        తల్లిదండ్రులను గురువు దైవాలను గౌరవించే ఒక భారతీయ సంప్రదాయ ప్రేమికుడు దార్ల. ఒకవైపు అస్తిత్వ ఉద్యమానికి చేయూతనిస్తూ దళిత కవిత్వం రాస్తున్న ఈయన మరోవైపు సంప్రదాయ విలువలని కాపాడుకొంటూ రావడం అనేది ఈయనలో ఉన్న వైవిధ్యం. చాలామంది ‘మేము ఆధునికులం’ అని చెప్పుకుంటున్న వారు పునాదులను మరిచిపోయి, పైకప్పుల చర్చలు చేస్తుంటారు. నిలబడ్డ భూమిని వదిలి, గాలి దుమారంలో తేలిపోతూ ఎగసిపడుతుంటారు. మార్పు కోసం మాట్లాడడం అటుంచి తీర్పులు చెప్పేస్తుంటారు. మాటలకు ఈటెలు తగిలించి అవతలి వారిని గాయపరుస్తుంటారు. వర్గాల పేరుతో, వర్ణాల పేరుతో పురాణ సంఘటనలకు ముడిపెట్టి తీవ్ర పదజాలంతో పేట్రేగిపోతుంటారు. బహుశా గుర్తింపు కోసం కొంతమంది  కూడా అలా చేస్తూ ఉండొచ్చు. దార్ల దీనికి విభిన్నమైన వ్యక్తి. కుల మతాలకతీతంగా, వర్ణ వర్గాలకు దూరంగా తను చెప్పదలుచుకున్న నాలుగు మాటలను నిజాయితీగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు.      

     "గురువు నేర్పిన విద్యను మరువకెప్పుడు/ జ్ఞాన దీపము వెలిగించు నవని యందు/ నిత్య విద్యార్జన పరుడు నిశ్చయముగా/ దారిచూ...  దార్ల మాట," "పాఠశాలలు చూపించు బ్రతుకు బాట/ మస్తకమును పెంపొందించు పుస్తకములు/ వినయ విధేయతలు నున్న విజ్ఞతడు/.... దారి చూపించునట్టిది దార్ల మాట". ఈ రెండు పద్యాలు ఒకే అంశానికి సంబంధించినవి. అయితే రెండవ పద్యంలో వినయ విధేయతలు ఉన్న విజ్ఞుడు ఎవరో తెలియాలంటే ఆ ముందు పద్యం చదివి రావాల్సిందే. అలా ఒక కొత్త ప్రయోగం కనిపిస్తుంది. 

 

 

 ఈ శతకంలో ప్రధానంగా కనిపించే అంశాలు

        నైతిక – మానవతా విలువలు: ‘కష్టపడుకున్న ఫలితము కలుగ దెపుడు తప్పకుండగ సోమరితనము వీడి, కంకణము దాల్చి ముందుకు కదల వలెను’. జీవులు అత్యాశపరులై అక్రమార్జన కొరకు అడుగులిడుట తప్పు అంటాడు. కష్టపడకుంటే ఫలితం ఉండదని,సోమరితనం వదిలి శ్రమించాలని పిలుపునిస్తాడు. మాట తప్పని వాడికి మన్నన దొరుకుతుందని చెప్తాడు.

       తల్లిదండ్రుల పట్ల గౌరవం: ‘పెద్ద నాగమ్మ మాతృత్వ ప్రేమ పంచి ఆదరమ్మను దీవెన లందజేసి నమ్మకమ్మను నీడలో నడుపు చుండు దారి చూపించు నట్టిది దార్ల మాట’. ‘నాదు జనకుడు లంకయ్యనామునెపుడు నాద రంబున నబ్బాయి యనుచు పిలిచి దీవెనలు పొందు చుందును దిగులుమాన్ప దారి చూపించు నట్టిది దార్ల మాట’.

       గురుభక్తి : గురువు నేర్పిన విద్య మరవకూడదని,జ్ఞాన దీపం వెలిగించే వ్యక్తిగురువు ఒక్కడేనని,వినయ విధేయతలతో మెలిగి విజ్ఞుడవ్వాలని సూచిస్తాడు.

       సత్యనిష్ఠ: సత్య వాక్కును సజ్జనుడు మరువడని,ధర్మమే నిలిచి గెలుస్తుందని ‘ఆశ పెరిగిన ధర్మమ్మునడుగు నంటూ సత్యమార్గమ్మువీడక సాగవలయు’,‘వంశ గౌరవ మన్నది వాక్కు తోడ సత్యమెప్పుడు వీడక సాగవలెను మాట తప్పని వానికి మన్ననబ్బు’ నంటాడు. నీతి నియమాలను పాటిస్తూ, నమ్మకము అనే కొమ్మను నరక కుండా చూడమంటాడు.

       స్నేహబంధం: ‘ఆప్త మిత్రులైనిలిచిరి యనుదినమ్ము వారు చలపతి రావును పార్వతీశ శర్మ గారలన్ నిరతముసంస్తుతింతు’, ‘సూర్యుడుదయించుకమునుపు నార్యయనుచు పలుక రించు మిత్రుండు గోవర్ధనుండు మిత్ర భావము తోడను మేలుగూర్చు’నని గుర్తు పెట్టుకుంటాడు. ఇవి వ్యక్తిగత జీవిత నిర్మాణానికి అవసరమైన మూలాధారాలుగా కవి ప్రతిపాదించారు. ఆపదలు ఎదురైనప్పుడు ఆదుకునే మిత్రులను ఎప్పటికీ మనసులో దాచుకోవాలని చెప్తాడు.

       సమాజిక బాధ్యత: వ్యర్థాలను సృష్టించే ప్లాస్టిక్ వాడకూడదని, ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి ఎంతో ముప్పు కలుగుతుందని బోధిస్తాడు, దాన్ని నిర్మూలించే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలంటాడు. దాన గుణం కలిగిన వారు దాచుకోకుండా నిరుపేదలకు పంచిపెడతారని, విత్తమార్జన కోసం సత్య న్యాయ ధర్మాలను బుద్దివంతులు వీడరని పేర్కొంటాడు. ‘కులము మతబేధములపేరా కుటిల మెపుడు నెంచ వలదయ్య ప్రజలలో నెవ్వరైన, లోక హితము కోరాలి ప్రాకటముగ’ అంటాడు.  అంతేగాక, నీతి, న్యాయం పట్ల కట్టుబాటు, మితవ్యయం, ఆత్మనిగ్రహం వంటి అంశాలను పద్య రత్నాలుగా మార్చారు.

       బాలల వ్యక్తిత్వ వికాసం: పిల్లలు అక్షరాభ్యాసం నుండి విద్య నేర్పిన గురువులను గౌరవంగా చూడమనడం, మాతృభాష పట్ల అభిమానం లిగి ఉండడం, చెప్పిన మాట తప్పక వినాలని చెప్పడం, సోమరిగా ఉండకూడదని చెప్పడం, దేశ భక్తిని కలిగి ఉండడం, సహజ గుణ శీలాలతో గౌరవం పొందమని చెప్పడం, మేలు చేసిన వారికి మేలే చేయమని చెప్పడం, మిత్ర భావాన్ని కాపాడుకోమని చెప్పడం, దీనుల పట్ల దయ జాలి కలిగి ఉండమని చెప్పడం వంటి బుద్ధులను సూక్తులుగా చెప్తాడు. ఇవి పిల్లలకే కాదు పెద్దలకు కూడా చెప్పవలసిన మాటలు.

       బౌద్ధ తత్వం: అంతం లేని కోరికలే దుఃఖానికి మూలమని, తృప్తే సంతోషానికి ద్వారమని, వ్యాధులకు, వృద్ధాప్య వలయానికి చిక్కి ఆల్లాడి పోతారని బుద్ధుడి కోణం లోంచి  హితవు పలుకుతాడు. కులమత బేధాలు వీడి, మూఢ నమ్మకాలను వదిలి, కారుణ్య భావంతో మెలిగితే లోక కల్యాణం జరుగుతుందని సూచిస్తాడు. మంచి నడవడిక, శాంతి సహనాలు, దాన ధర్మాలు మానవ సమాజాన్నిఉన్నతంగా నిలబెడతాయని బౌద్ధ సందేశాన్ని అందిస్తాడు. 

పర్యావరణ చింతన (Eco-consciousness)

ఈ శతకంలో అత్యంత ప్రాధాన్యమైన అంశం ప్రకృతి సంరక్షణ.

 చలువ నిచ్చును గాదె వృక్షమ్ము లెపుడు, ప్రాణ వాయువు నందించి బ్రతుక జేయు,చెట్లు నరికిన ప్రాణికీ చేటు చేయు’.వృక్ష సంపద నెలకొన్న విరివిగాను,కురియుచుండును వర్షాలు విరివి గాను,నరులు నమ్మాలి ప్రకృతిని మరువకెపుడు’ అనడంలోనే పర్యావరణంలో చెట్లు ఎంత ప్రాధాన్యం కలిగిం ఉన్నాయో అర్థం అవుతుంది.

       చెట్ల నరికివేతపై ఆందోళన

       నీటి విలువ

       కాలుష్య సమస్య

       భూమి, గాలి, నీటి పరిరక్షణ మొదలైన విషయాల పట్ల చైతన్యం కలిగిస్తుంది ఈ శతకం.

      సాంప్రదాయ శతకాలలో అరుదుగా కనిపించే ఈ పర్యావరణ దృక్పథం, ఈ  కృతికి ఆధునికతను తెచ్చింది. ప్రత్యేకంగా పర్యావరణ పరిరక్షణపై రచయిత వ్యక్తపరచిన ఆందోళన ఈ కృతికి సమకాలీన ప్రాముఖ్యతను తెచ్చింది. చెట్ల సంరక్షణ, నీటి విలువ, కాలుష్య నియంత్రణ వంటి అంశాలు కేవలం ఉపదేశాత్మకంగా కాక, హృదయాన్ని తాకే విధంగా పద్యరూపంలో ఆవిష్కరించబడ్డాయి. ఈ విధంగా శతకం ఒక నైతిక శాస్త్రగ్రంథంలా, జీవన సూత్రాల సంకలనంలా నిలుస్తుంది.

  

          సరళమైన భాష. లయబద్ధత, వ్యవహార పదప్రయోగం, ఉపదేశ ధోరణి కలిగి, ప్రతి పద్యం ఒక సూక్తిలా ఉంటుంది. భావస్పష్టత, సమకాలీన సమస్యల ప్రతిఫలనాలు, శతక నిర్మాణ నిబద్ధత, మానవ విలువల ప్రచారం దార్ల మాట శతకానికి వన్నెతెచ్చాయి.



            ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు విద్యావేత్తగా, పరిశోధకునిగా, కవిగా సమాజం పట్ల తన బాధ్యతను పద్యరూపంలో వ్యక్తపరచడం ప్రశంసనీయం. “దార్ల మాట” అనే మకుటంతో ప్రతి పద్యం ఒక జీవన సందేశంగా, మార్గదర్శక వాక్యంగా రూపుదిద్దుకుంది. తల్లిదండ్రుల పట్ల గౌరవం, గురుభక్తి, సత్యనిష్ఠ, మానవతా విలువలు, స్నేహం, సామాజిక నైతికత వంటి అంశాలతో పాటు ప్రకృతి పరిరక్షణ, పర్యావరణ సంరక్షణ, సమాజ బాధ్యత వంటి ఆధునిక చైతన్య భావనలు కూడా ఈ శతకంలో సుస్పష్టంగా వ్యక్తమయ్యాయి. భాషా సరళత, భావాల స్పష్టత, తేటగీతికి అనుగుణమైన లయ, పద ప్రయోగంలో వైవిధ్యం ఇవి ఈ శతకానికి సాహిత్య విలువను పెంచిన అంశాలు. పాఠకుడు ప్రతి పద్యాన్ని చదువుతూనే ఆత్మపరిశీలన చేసుకునేలా చేయడం ఈ కృతికి ఉన్న ప్రధాన లక్షణం. ఈ శతకం సాహిత్యాభిమానులకు మాత్రమే కాక, విద్యార్థులకు, యువతకు, సమాజంలో విలువల ఆధారిత జీవనాన్ని కోరుకునే ప్రతి ఒక్కరికీ మార్గదర్శకంగా నిలుస్తుందని నమ్ముతున్నాను. రచయితకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఈ కృతి విస్తృత ప్రచారం పొందాలని ఆకాంక్షిస్తున్నాను.

************

 

ఆచార్య ఎన్.ఈశ్వర రెడ్డి

అధ్యక్షులు, పాఠ్య ప్రణాళికా సంఘం

తెలుగు శాఖ

యోగి వేమనవిశ్వ విద్యాలయం

కడప.

కామెంట్‌లు లేవు: