"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

30 మార్చి, 2026

తండ్రీ కొడుకుల బంధం.. పద్యాలు

 తండ్రీ కొడుకుల బంధం.. పద్యాలు 


చిగురు కొమ్మకు నంటిన చెలువు పోల్కి

యెండ కాపున నీడయై యిరవు జేర్చు

మనసు రెండైన నొక్కటై మమత నిలుపు

దండ్రి కొడుకుల కపురూప బంధమదియె.

(లేత చిగురు కొమ్మకు, ఆ కొమ్మకు అంటిపెట్టుకుని ఉండే అందానికి (లేదా ఆ చిగురుకు అతుక్కుని ఉండే మొగ్గకు) మధ్య ఎంతటి విడదీయలేని సంబంధం ఉంటుందో, తండ్రీకొడుకుల బంధం కూడా అంతటి పవిత్రమైనది. ఎండలో నడిచే బాటసారికి చల్లని నీడ ఎలాగైతే సేదదీరుస్తుందో, తండ్రి తన కొడుకుకు కష్టకాలంలో అండగా నిలిచి ఆశ్రయాన్ని ఇస్తాడు. వారిద్దరి శరీరాలు వేరైనా, మనసులు మాత్రం ఒక్కటిగా కలిసిపోయి మమతానురాగాలను పంచుకుంటాయి. తండ్రీకొడుకుల మధ్య ఉండే అటువంటి అపురూపమైన అనుబంధం వర్ణనాతీతమైనది.)

కడుపున బెరిగి విడిపోయి కాలమందు

గలిసి నడచెడి త్రోవలో కలిపియుంచు

కడలి నురుగుల పగిదిని గానబడదు

దండ్రి కొడుకుల కపురూప బంధమదియె!

(తల్లి కడుపున పుట్టి కాలక్రమంలో స్వతంత్రులుగా విడిపోయినట్లు కనిపించినా, జీవిత ప్రయాణంలో తండ్రీకొడుకులు ఎప్పుడూ ఒకరికొకరు తోడై, కలిసి నడుస్తారు. సముద్రపు అలల మీద వచ్చే నురుగు పైకి విడిగా కనిపిస్తుంది కానీ, అది సముద్రంలోనే పుట్టి సముద్రంలోనే కలిసిపోతుంది. అలాగే, తండ్రీకొడుకుల మధ్య ఉండే అనుబంధం కూడా బయటికి విడివిడిగా కనిపించినా, అంతర్గతంగా అది విడదీయలేనిది. ఆ అపురూపమైన బంధం కంటికి కనిపించని ఆత్మీయతతో ముడిపడి ఉంటుంది.)

వేరు లేనిది మ్రాకును వెలుగు లేదు

తీరు లేనిది నదికి సంతృప్తి లేదు

ఆదు లేనిది గృహమున కాన తెలియ

కుటు మమున లేని మనువున కొసగు లేదు.


వేరు లేనిదె మ్రాకుకు వెలుగు లేదు

తీరు లేనిదె నదికిని తృప్తి లేదు

ఆది లేనిదె గృహమున కందముండదు

కలత లేనిదె మనువున కొసగు లేదు!

(వేరు లేనిదే చెట్టుకు మనుగడ లేదు, అది పెరిగి వెలుగు చూడలేదు. ఒక క్రమమైన తీరు లేనిదే నదికి ప్రవాహ సంతృప్తి ఉండదు. పునాది లేదా ఆధారం లేనిదే ఇల్లు నిలబడదు, వెలగదు. అలాగే, కుటుంబం యొక్క అండదండలు లేని వివాహ బంధంతో సంపూర్ణమైన ఆనందం లేదా ఫలప్రదం ఉండదు.)

వేరులు లేని మ్రాకునకు వృద్ధియు లేదు గదా ధరాతలిన్

తీరును లేని యా నదికి తృప్తియు లేదు గదా జలార్శులన్

జేరిన నాథు లేనియెడ నేరదు సౌఖ్యము నీయ నిల్వగన్

మారుగ గూడి యున్నయదె మానవ కాంతిని నిచ్చు నెప్పుడున్!

(వేరు లేని చెట్టు ఈ భూమి మీద పెరగదు. గట్టు అనే క్రమశిక్షణ లేని నదికి ప్రవాహ సంతృప్తి ఉండదు. యజమాని లేని ఇంట్లో ఆనందం నిలవదు. అలాగే, పరస్పర అనురాగంతో కూడిన వివాహ బంధమే మనిషి జీవితానికి నిజమైన వెలుగును, సుఖాన్ని ఇస్తుంది.)

నీరము లేనిదౌ నదికి నిశ్చల తృప్తియు లేదు చూడగా

ధారుణి వేరు లేనిదగు తల్వరు వృద్ధియు లేదు నిక్కమున్

జేరిన నాథు లేనియెడ నేరదు సౌఖ్యము నీయ నిల్వగన్

సారము తోడ గూడియును సర్వ కుటుంబమె కాంతి నిచ్చెడిన్!

(నీరు లేని నదికి ప్రవాహ సంతృప్తి ఉండదు. వేరు లేని చెట్టు భూమిపై వృద్ధి చెందదు. ఆధారం లేని ఇంట్లో సుఖం ఉండదు. అలాగే, అందరూ కలిసికట్టుగా, విలువలతో ఉండే కుటుంబమే జీవితానికి నిజమైన వెలుగును ప్రసాదిస్తుంది.)

చిగురు కొమ్మను నంటిన చెలువు పోల్కి

కొమ్మ చిగురును రక్షించు రెమ్మ వలెనె

తండ్రి సుతులకు నిజమైన బంధమదియె!

శుభము గలుగును మీకు నీ శుభ దినమున!

 (లేత చిగురు కొమ్మకు, ఆ కొమ్మకు అంటిపెట్టుకుని ఉండే అందానికి (లేదా ఆ చిగురుకు అతుక్కుని ఉండే మొగ్గకు) మధ్య ఎంతటి విడదీయలేని సంబంధం ఉంటుందో, తండ్రీకొడుకుల బంధం కూడా అంతటి పవిత్రమైనది. ఎండలో నడిచే బాటసారికి చల్లని నీడ ఎలాగైతే సేదదీరుస్తుందో, తండ్రి తన కొడుకుకు కష్టకాలంలో అండగా నిలిచి ఆశ్రయాన్ని ఇస్తాడు. వారిద్దరి శరీరాలు వేరైనా, మనసులు మాత్రం ఒక్కటిగా కలిసిపోయి మమతానురాగాలను పంచుకుంటాయి. తండ్రీకొడుకుల మధ్య ఉండే అటువంటి అపురూపమైన అనుబంధం వర్ణనాతీతమైనది.)

- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 30.3.2026



కామెంట్‌లు లేవు: