ఆచార్య ఎన్.ఈశ్వరరెడ్డిగారి ‘సమాజహితం- సాహిత్య మతం’, ‘నిత్యబాలింత’ పుస్తకాల ఆవిష్కరణ.
డా.ఎన్ఈ.శ్వర రెడ్డి గారి పుస్తకాలను ఆవిష్కరిస్తున్న అతిథులుసిపి బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం ముందు ఫోటో దిగిన ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ఆచార్య ఎన్ ఈశ్వర్ రెడ్డి ఆచార్య ఎల్వి కృష్ణారెడ్డి డాక్టర్ భూతం స్వామి
ప్రముఖ కవి, రచయిత, సాహిత్య విమర్శకుడు, యోగి వేమన విశ్వవిద్యాలయం, తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు ఆచార్య ఎన్. ఈశ్వరరెడ్డిగారి సాహిత్య విమర్శ సంపుటి ‘సమాజహితం- సాహిత్య మతం’, కవితా సంపుటి ‘నిత్యబాలింత’ పుస్తకాలను ఆదివారం (10.8.2025 వ తేదీన) కడపలోని సి.పి.బ్రౌన్ గ్రంథాలయంలో ఆవిష్కరించారు. ఈ సమావేశానికి డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, హైదరాబాద్ రిజిస్ట్రార్ ఆచార్య ఎల్.వి.కె.రెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా యోగివేమన విశ్వవిద్యాలయం, కడప రిజిస్ట్రార్ ఆచార్య పి. పద్మ, ఆత్మీయ అతిథులుగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, తెలుగు భాషాభివృద్ధి సంస్థ, రాజమహేంద్రవరం అధ్యక్షులు డా.గూటం స్వామి, ఇంటాక్ కేంద్ర పాలకమండలి సభ్యులు, కడప చాప్టర్ కన్వీనర్ లయన్ కె.చిన్నపరెడ్డి, వైయస్సార్ కడపజిల్లా రచయితల సంఘం అధ్యక్షులు ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి పాల్గొన్నారు. సాహిత్య విమర్శ సంపుటి ‘సమాజహితం- సాహిత్య మతం’ గ్రంథాన్ని సి.పి.బ్రౌన్ పరిశోధన గ్రంథం పరిశోధకులు డాక్టర్ సి.శివారెడ్డి, కవితా సంపుటి ‘నిత్యబాలింత’ ను ప్రాచ్య పరిశోధన సంస్థ, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి డైరెక్టర్ ఆచార్య పి.సి.వేంకటేశ్వర్లు సమీక్ష చేశారు. సూర్య చారిటబుల్ సంస్థ, ఎన్.ఆర్.ఐ (జపాన్) కు చెందిన శ్రీ గోర్ల సూర్య నారాయణ కృతులను స్వీకరించారు. అరసం కడప జిల్లా ఉపాధ్యక్షులు డా.ఎస్.రాజగోపాల్ రెడ్డి సభా సమన్వయం చేయగా, సూర్య చారిటబుల్ ట్రస్టు అధ్యక్షులు డా.ఎమ్.ప్రభాకర్ సభ నిర్వహణ పర్యవేక్షించారు. సమావేశానికి అరసం కడప జిల్లా ప్రధాన కార్యదర్శి డా.టి.సురేశ్ బాబు వందన సమర్పణ చేశారు. ఈ సాహిత్య సమావేశానికి సాహితీవేత్తలు అత్యధిక సంఖ్యలో విచ్చేశారు.
సాహిత్య సమావేశం ఒక పండుగ వాతావరణాన్ని తలపించింది.
ఉదయం పదిన్నరకు ప్రారంభమైన సమావేశం మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగింది. సభలో పాల్గొన్న వారెవరూ కదలకుండా సభ పూర్తయ్యే వరకూ ఓపిగ్గా ఉన్నారు. సమీక్షకులు పుస్తకాలను ఆద్యంతం ఆసక్తికరంగా సమీక్షించారు. రెండు సమీక్షలూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆచార్య ఎన్.ఈశ్వర రెడ్డి గారి పరిశోధనా దృక్పథాన్ని, విమర్శనా దృష్టినీ, సామాజిక బాధ్యతను వక్తలు వివిధ పార్శ్వాలలో విశ్లేషించారు. ఆత్మీయ అతిథులు ఆచార్య ఈశ్వర రెడ్డిగారిలోని సహృదయ సంబంధాలను, సాహిత్య కృషిని, ఆచరణాత్మకతను స్వీయానుభవాలతో వివరించారు. అధ్యక్షులు సభను సమర్థవంతంగా సమయపాలన పాటించేలా చేస్తూనే, ఆచార్య ఈశ్వర రెడ్డిగారి వ్యక్తిత్వం, సాహిత్యం, అందుకున్న పురస్కారాలు, ఆయన రచనలపై జరుగుతున్న పరిశోధనలు, పాఠ్యాంశాలుగా మారిన రచనలనూ సమయానుకూలంగా, సందర్భోచితంగా పేర్కొన్నారు. ఆచార్య ఈశ్వర రెడ్డి గారి అభిమానులు ఆయన్ని ఘనంగా సత్కరించారు. అలాగే, వచ్చిన అతిథులను సముచిత రీతిలో దుశ్శాలువా, మెమెంటోలతో గౌరవించారు. సభానంతరం అందరికీ రుచికరమైన భోజనాలు ఏర్పాటు చేశారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి