"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

04 మే, 2025

కృత్రిమ మేధ (AI ) ని శాసించే స్థాయికి భాషా సాహిత్యాల పరిశోధనలు చేరుకోవాలి ( ఆచార్య దార్ల ఇంటర్వ్యూ, నడుస్తున్న తెలంగాణ)

 

కృత్రిమ మేధ (AI ) ని శాసించే స్థాయికి భాషా సాహిత్యాల పరిశోధనలు చేరుకోవాలి ( ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ఇంటర్వ్యూ)

 కృత్రిమ మేధ (AI ) ని శాసించే స్థాయికి భాషా సాహిత్యాల పరిశోధనలు చేరుకోవాలి ( ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ఇంటర్వ్యూ)

మిత్రులందరికీ శుభోదయం. ఈ సంచిక ( ఏప్రిల్, 2025) నడుస్తున్న తెలంగాణ మాసపత్రికలో నా ఇంటర్వ్యూ ప్రచురించారు. ఇది ప్రధానంగా పరిశోధనకు సంబంధించిన విషయాలతో కూడిన ఇంటర్వ్యూ. ఆసక్తి గలవారు దీన్ని చదవి, ఏవైనా సూచనలు ఉంటే నాతో వ్యక్తిగతంగా పంచుకోవలసిందిగా కోరుతున్నాను. 

దీన్ని ప్రచురించిన నడుస్తున్న తెలంగాణ పత్రిక యాజమాన్యానికి, ఇంటర్వ్యూ నిర్వహించిన డా.జి.ఆదినారాయణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. 

మీ

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 

4.5.2025

https://nadustunnatelangana.com/%E0%B0%A8%E0%B0%A1%E0%B1%81%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%81%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%A3-%E0%B0%8F%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0/

ఆచార్య దార్ల వెంకటేశ్వర రావు గారితో ముఖాముఖి

- డా. గిన్నారపు ఆదినారాయణ

నమస్కారం సార్,

‘‘అక్షరం ఒకవైపు / అన్నం ఒకవైపు పెడితే/ నేను అక్షరాన్నే హత్తుకుంటాను ఆబగా!’’ అని అక్షరాన్ని హత్తుకున్న ఆచార్యులు దార్ల వెంకటేశ్వరరావు గారు. కవిత్వం, విమర్శ పరిశోధన వ్యాసాలతో తెలుగు, ఆంధ్రేతర ప్రాంతాలకు కూడా ఎంతో సుపరిచితమైన పేరు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా, పరిశోధకుడిగా,  ప్రొఫెసర్ గా, తెలుగుశాఖ పూర్వ అధ్యక్షులుగా ఉంటూ గత 25 సంవత్సరాల నుండి తెలుగు బోధన, పరిశోధన, విమర్శ, సృజనాత్మక సాహిత్యరంగంలో విశేష కృషి చేస్తున్నారు. సమకాలీన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తెలుగు భాషా సాహిత్యాలలో నూతన ప్రయోగాలను చేస్తూ,  ఆ ఫలాలను విద్యార్థులకు, పరిశోధకులకు అందిస్తుంటారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ఆధునిక సమాజానికి కావాల్సిన కొన్ని కొత్త కోర్సులను కూడా రూపొందించారు. దళిత సాహిత్యం, డయాస్పోరా సాహిత్యం, సృజనాత్మక సాహిత్యం, ఎం.ఏ. స్థాయిలోనే విద్యార్థులు పరిశోధన పట్ల ఆసక్తి కలిగించే విధంగా డిసర్టేషన్ రైటింగ్,  మీ జీవితం, సాహిత్య ప్రస్తానం ఎలా కొనసాగిందనేది మీ నోట వినాలనుకొంటున్నాం.

  • 1.మీరు ఎప్పుడు, ఎక్కడ జన్మించారు. మీ కుటుంబ నేపథ్యం ఏమిటి?  

ఆచార్య దార్ల: సంతోషం డాక్టర్ ఆదినారాయణ. ముందుగా ఈ ఇంటర్వ్యూ ప్రచురిస్తున్న మన తెలంగాణ పత్రిక సంపాదక మండలికి, యాజమాన్యానికి నా కృతజ్ఞతలు. 

 సమైక్య ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం, చెయ్యేరు అగ్రహారంలో పుట్టాను. నిజానికి నా నిజమైన పుట్టిన తేదీ నాకు తెలియదు. ఒకవేళ ఇదే నా నిజమైన పుట్టిన తేది కూడా నాకు అనుమానమే. నాకు నేనుగా స్కూల్ లోకి వెళ్లి చేరిన తర్వాత ఆ ఉపాధ్యాయులు వేసిన పుట్టిన తేదీ 5 సెప్టెంబర్. అంటే నన్ను మా వాళ్ళు అంటే మా అమ్మా, నాన్న మా కుటుంబసభ్యులు నన్ను ప్రత్యేకించి పాఠశాలలో చేర్పించలేదు. మా చెల్లిని ఎత్తుకొని ఉండవలసి వచ్చేది. అమ్మానాన్న కూలి పనికి వెళ్లేవారు. ఆ సమయంలో మా చెల్లినీ, తమ్ముడినీ చూసుకోవలసిన బాధ్యత నాపై ఉండేది. నాకంటే  ఇద్దరు పెద్దవాళ్ళు ఉన్నారు అందులో పెద్దన్నయ్య చదువుకునే వాడు. చిన్నన్నయ్య అమ్మ నాన్నతో కలిసి పనికి వెళ్లేవాడు. అందువల్ల అనివార్యంగా మా చెల్లెల్ని తమ్ముడిని చూసుకోవాల్సిన బాధ్యత నాపై పడేది. సాధారణంగా తమ్ముడు నాన్నకి కూడా వెళ్ళిపోయేవాడు. చెల్లిని మాత్రం నేనే చూడవలసి వచ్చేది. 

   మేము కౌలుకు చేస్తున్న పొలం ప్రాథమిక పాఠశాలకు ఆనుకునే ఉంటుంది.  ఆ పొలంలో వేరుశెనగ ఎండేసిన వాటిని  చూస్తూ మా చెల్లిని కూడా నేను చూసుకోవాలి. చాలామంది స్కూలుకు వెళుతూ ఆడుకుంటూ ఉంటే నాకు వాళ్లతో పాటు నేను కూడా ఆడుకోవాలనీ, బడికి వెళ్లాలనీ అనిపించేది. అలా మా చెల్లిని తీసుకుని నేను స్కూల్ కి వెళ్ళిపోయాను. ఈలోగా ఆ పొలంలో ఎండేసిన వేరుశనగలు  ఒకరిద్దరు తస్కరించటం… ఆ తర్వాత ఇది తెలిసి ఇంట్లో నన్ను తిట్టడం, బాధపడడం అన్నీ జరిగిపోయాయి! కానీ, మళ్ళీ బడి మాత్రం మానిపించలేదు.

మా కుటుంబం నేపథ్యం చూస్తే మా నాన్న కొబ్బరి చెట్లు ఎక్కి కొబ్బరికాయలు తీయడం, తాటాకు కొట్టడం, కల్లు గీయడం వంటి పనులు చేసేవాడు. ఆ పనులు అయిపోయిన తర్వాత ఆయనకి వచ్చిన అన్ని పనులు చేసేవాడు. అంటే వ్యవసాయ పనులు,  ఇతరమైన చేపలు పట్టడం వంటి పనులు. 

అమ్మ మా కుటుంబాన్ని చూసుకుంటూనే వ్యవసాయ కూలీగా ఉండేది. మా తాత కొంచెం చదువుకున్నాడని చెప్తారు. ఆయన కవ్వమ్మ,  బాలనాగమ్మ కథలు చదివేవాడు., భారత, రామాయణాలు వంటివి చదివేవాడు. పెద్ద చదువులు చదవలేదు. మా తాత కూడా కొబ్బరి దింపులు తీయడం, తాటాకు కొట్టడం, కల్లు గీయడం అనేది వృత్తిగా ఉండేది. 

ఆ విధంగా మా అన్నదమ్ముల నుండే చదువుకున్న తొలి తరంగా చెప్పుకోవాలి. నా బాల్యం గురించి నా ఆత్మకథ ‘నెమలి కన్నులు’ మొదటి భాగంలో సవివరంగా చెప్పాను.  

  • మీ విద్యాభ్యాసం విశేషాలను వివరించండి?

ఐదో తరగతి వరకు మా స్వగ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జరిగింది. ఉన్నత పాఠశాల విద్య మాత్రం మా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న హైస్కూల్లో నాకు రాకుండా చేయడం వల్ల, మండల కేంద్రం కాట్రేనికోన లో చదవాల్సి వచ్చింది. కళాశాల విద్యను శ్రీ కోనసీమ బానోజీ రామర్స్ కళాశాల అమలాపురంలో అంటే తాలూకా కేంద్రంలో చదివాను.  

  • మీ గ్రామంలో మీరు చదువుకోకుండగా కుట్ర చేయడానికి గల కారణాలు?

దళితుల్లో ఉప కులాలకు సంబంధించిన ఒక సమస్య ఉంది. మా గ్రామంలో దళిల్లోని ఒక ఉప కులం వారు అప్పటికే బాగా విద్యావంతులు. మరొక ఉపకులం ( మాదిగ ) అప్పుడప్పుడే చదువు కోసం ప్రాథమిక పాఠశాల మెట్లు ఎక్కింది. వీళ్ళని ఉన్నత పాఠశాలలో చదువుకోకుండా రకరకాల రాజకీయాలు చేసి ఆపేసేవారు. ముఖ్యంగా కొంచెం తెలివైనవాడు అయితే గనక వాడిని తొక్కేయడానికి ప్రయత్నం చేసేవారు. అలా నేను మా గ్రామపంచాయతీలో ఉన్న ఉన్నత పాఠశాలలో సీటు కోల్పోయాను. 

  • ఆ పరిస్థితులు నేటికి అలాగే కొనసాగుతున్నాయా? 

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వచ్చిన తర్వాత దళితుల్లోని అన్ని ఉపకులాల్లోని చైతన్యం వచ్చింది. 

ఒక ఉపకులం మరొక ఉపకులాన్ని సమస్యల్లో పెట్టడానికి రకరకాల వ్యూహాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కొన్ని కనిపిస్తాయి.మరి కొన్ని కనిపించవు. 

  • ఈ పరిస్థితుల్లో ఉన్నత విద్యను ఎలా పూర్తి చేశారు? 

నన్ను మా గ్రామ పంచాయతీ హైస్కూల్లో చదవకుండా చేయడం వల్ల మండల కేంద్రంలోకి వెళ్లడం… అక్కడ అక్కడ పడిన బీజాలు ఉన్నత విద్యను చదవాలనే ప్రేరణనిచ్చాయి. ఆ తర్వాత తాలూకా కేంద్రంలో చదవడం వల్ల కూడా డిగ్రీ చదవాలని, అది ఎలా చదవాలో కూడా తెలిసింది. అమలాపురంలోని ఎస్.కె.బి.ఆర్ కళాశాల చాలా పెద్దది. అక్కడున్న అధ్యాపకులు ఉన్నత విద్య గురించి దానివల్ల వచ్చే అవకాశాల గురించి చెప్పేవారు. వాళ్ళ మాటలు నాకు ఉన్నత విద్యను అభ్యసించడానికి గొప్ప ఆత్మవిశ్వాసాన్ని కలిగించాయి. 

  • మీ సాహిత్య పయనం ఎలా మొదలైంది?


ఉన్నత పాఠశాలలో చదివేటప్పుడు తెలుగు పండిట్  శ్రీకంఠమూర్తి, లక్ష్మణరావు గారు అని లెక్చరర్స్ ప్రభావం నాపై ఉండేది. దీంతో పాటు అమలాపురం కళాశాలలో చదువుకోవడం వల్ల కూడా సాహిత్య వైపు రావాలని పించింది.  అక్కడున్న దళిత ఫ్యాకల్టీ తో పాటు ఇతరులు కూడా నన్ను బాగా ఇష్టపడేవారు. నిజానికి నాకు అప్పుడు వాళ్ళు బ్రాహ్మణులని నాకు తెలియదు. నన్ను దగ్గరకు తీసుకొన్న తర్వాత వాళ్ళుబ్రాహ్మణులని తెలిసినా, నేను దళితుడినని వాళ్ళకు తెలిసినా నన్ను అదే ప్రేమతో ప్రోత్సహించారు. అక్కడ రాజేష్,  వెస్లీ అనే దళిత అధ్యాపకులు దళితులకు బాగా సపోర్టుగా ఉండేవారు. నేను వ్యాసరచన, వక్తృత్వం వంటి పోటీలలో పాల్గొనడం, వాటిలో అన్ని కులాల అధ్యాపకులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించేవారు, దళిత విద్యార్థులు దాంట్లో ఎక్కువగా పాల్గొనక పోయేవారు. నన్ను చూసి లలిత అధ్యాపకులు చాలా సంతోషపడేవారు. కానీ ఆ న్యాయ నిర్ణయంలో మాత్రం నిస్పాక్షితంగా వ్యవహరించేవారు. వ్యాసరచన, సృజనాత్మక రచన వంటి వాటిని,  పోటీలో పాల్గొన్న వారి పేర్లు ఎవరో తెలియకుండా కోడింగ్ చేసి వ్యాల్యూ చేసేవారు. దానిలో నేను పాల్గొంటూ ఉండేవాడిని. దానికోసం నేను పత్రికలు చదివేవాడిని. అలవాటు హైస్కూల్లో ఉండగా అలవడింది.  సోషల్ సైన్స్ టీచర్ లక్ష్మణ్ రావు గారు నా అ అలవాటుకి కారణం. పత్రికలలోని వార్తలను నోటీసు బోర్డు మీద రాయించేవారు రాసిన వారి పేర్లు కూడా చెప్పేవారు. అలా నేను కూడా చాలా న్యూస్ సేకరించేవాడిని. దానికోసం లైబ్రరీకి వెళ్లేవాడిని. ఆ అలవాటు కాలేజీలోకి వచ్చిన తర్వాత పెరిగిందే తప్ప, తగ్గలేదు. దీనికి తోడు కళాశాలలో డాక్టర్ ద్వా. నా.శాస్త్రి, డాక్టర్ వాడవల్లి చక్రపాణిరావు, డాక్టర్ బి.వి రమణమూర్తి (మార్గశీర్ష), డాక్టర్ పైడిపాల, డాక్టర్ కస్తూరి హనుమంతరావు తదితర అధ్యాపకులు మా తెలుగు పాఠాలు బోధించేవారు. వీరి రచనలు పత్రికల్లో వస్తుండేవి. వాటిని చదివే ఆ వ్యక్తులే మాకు పాఠం చెబుతున్నారంటే నాకు ఒక అద్భుతంగా అనిపించేది. వీరితో పాటు డాక్టర్ సి.వి. సర్వేశ్వర శర్మ అని ఒక సైన్స్ లెక్చరర్ సైన్స్ గురించి ఎప్పటికప్పుడు పత్రికల్లో రాస్తుండేవారు. వీళ్ళందర్నీ చూస్తు, ఆ రచనలు చదువుతూ నేను ఎంతో ప్రేరణ పొందాను. నా పేరు కూడా పత్రికల్లో చూసుకోవాలనుకునేవాడిని. స్థానిక సమస్యల గురించి ఉత్తరాన రాసేవాడిని. తర్వాత సమకాలీన రాజకీయాలు మీద ఆంధ్రప్రభ, ఆంధ్ర భూమి, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక ఇలా రకరకాల పత్రికల్లో సంపాదకీయం పేజీలో రాసేవాణ్ణి. అందులో ఉత్తరాలుగా, చిన్న చిన్న వ్యాసాలుగా నా పేరు మా ఊరు తో ప్రచురించడాన్ని చూసి ఎంతో మురిసిపోయేవాడిని. ఆ విధంగా చిన్నచిన్న కవితలు, కథలు, చిన్న చిన్న జోకులతో నా సాహిత్య ప్రవేశం మొదలైంది. 

  • మీ పరిశోధన విశేషాలు తెల్పండి?

డిగ్రీ అయిపోయిన తర్వాత ఎం.ఏ.తెలుగు కోసం రెండు చోట్ల ఎంట్రెన్స్ రాశాను. అవి,  ఆంధ్రా యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ. రెండింటిలోనూ సీట్లు వచ్చాయి. సెంట్రల్ యూనివర్సిటీలో చేరాను. సెంట్రల్ యూనివర్సిటీలో విద్యాబోధన పరిశోధనలను ప్రేరేపించేలా ఉంటుంది. దానితో ఎం.ఫిల్., పిహెచ్.డి. కూడా అక్కడే పూర్తి చేశాను. డాక్టర్ ఎస్ టి జ్ఞానానందకవి గారి ఆమ్రపాలి కావ్యం పై ఎం.ఫిల్, ఆరుద్ర గారి రచనలపై ముఖ్యంగా ‘పరిశోధకుడుగా ఆరుద్ర’ గారి అంశంపై పిహెచ్.డి.చేశాను. నాకు పర్యవేక్షకులుగా ఉన్న ఆచార్య ఎస్.శరత్ జ్యోత్స్నారాణి గారు మరలా వాళ్ళ నాన్నగారి గురించే పీహెచ్డీ కూడా కొనసాగించమన్నారు. అప్పటికే ఆయన‌ సాహిత్యంపై కొంతమంది పరిశోధనలు చేశారు. ఈ పరిస్థితుల్లో కొంత సందిగ్దానికి లోనయ్యాను. నా అభిరుచికి అనుగుణంగా పరిశోధనాంశాన్ని ఎంపిక చేసుకోవాలనుకున్నాను. ఆచార్య కేకే రంగనాథాచార్యగారంటే నాకు ఎంతో అభిమానం. ఎంతో ఆధునిక భావాలతో ఉండేవారు. అన్ని వర్గాల వారిని దగ్గరికి తీసుకునేవారు. నేను పత్రికల్లో కవిత్వం, వ్యాసాలు రాస్తుంటే ఆ విషయాలను మా క్లాసులోనే చెప్పి ఉత్సాహపరిచేవారు. ఆయన అభిప్రాయాన్ని తీసుకున్నాను. ఆచార్య కేకే రంగనాథాచార్యులుగారు పరిశోధన చేసే ముందు నన్ను ‘’నువ్వు ఏ రంగంలో స్థిరపడాలని కోరుకుంటున్నావు?’’ అని అడిగారు. టీచింగ్ ఫీల్డ్ లో ఉండాలనుకుంటున్నానని చెప్పాను. అప్పుడు అన్ని సాహిత్య చరిత్రలు అధ్యయనం చేయడంతో పాటు, సాహిత్యాన్ని లోతుగా అధ్యయనం చేయడానికి అవకాశం ఉండేలా ఆరుద్ర పై పరిశోధన చేయమని సూచించారు. నా పర్యవేక్షకురాలు

నా పరిశోధన అంశం ఎంపికలో ఆటంకాలు కలిగించలేదు! 

ఆమ్రపాలి కావ్యం ఒక బౌద్ధ ఇతివృత్తాంతానికి సంబంధించింది. దీనివల్ల బౌద్ధం గురించి అధ్యయనం చేయటం తప్పనిసరి అయింది. నాకు ఎంతో ఉపయోగపడింది. మరొకవైపు ఆ కావ్య సౌందర్యాన్ని వివరించడానికి అలంకార శాస్త్రాన్ని కూడా అధ్యయనం చేయవలసిన అవసరం ఏర్పడింది. ఆరుద్ర పై పరిశోధన చేయడం వలన అనేక రచనలు, సాహిత్య చరిత్రలు, విమర్శ గ్రంథాలు విస్తృతంగా చదవాల్సిన అవసరం ఏర్పడింది. అప్పుడే నాకు పరిశోధనలో అనేకమైన గ్యాప్స్ కనిపించాయి. ముఖ్యంగా దళితసాహిత్యం, బహుజన సాహిత్యం,  సౌందర్య శాస్త్రలోని అనేక అంశాలతో పాటు సాహిత్య విమర్శలు పునర్మూల్యాంకనం చేయవలసిన అంశాలు పున్నాగ అనిపించింది.  ఒకవైపు పరిశోధన చేస్తూనే మరొకవైపు పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావడం, పోటీ పరీక్షలకు రిపేర్ అయ్యే వాళ్ళకి పాఠాలు చెప్పడం కూడా చేసేవాడిని. ఆకాశవాణి లో అప్పుడప్పుడు కొన్ని కార్యక్రమాలు ఇవ్వడంతోపాటు, క్యాంపెరర్ గా      (ఒక రకంగా ఎనౌన్సర్ వంటి పనే)  చేసేవాడిని. గొప్ప గొప్ప వ్యక్తులను కలవడంతో పాటు,‌నాతో పాటు పనిచేసేవాళ్లలో గొప్ప ప్రతిభవంతులను చూస్తూ నిరంతరం ఎంతగా శ్రమించాలో తెలిసేది. 

  • మీరు ఏయే  ఉద్యోగాలు పొందారు, వాటిని సాధించడంలో మీరు ఎలాంటి వ్యూహాల్ని పాటించారు? 

నిరంతరం అధ్యయనం చేయడం, చదువేలోకంగా అనుకోవడం, అలా బాగా చదువుకునే వారితో స్నేహంగా ఉండడం, వారి నుండి కూడా నేను అనేక విషయాలు ఎప్పటికప్పుడు నేర్చుకోవడం, ఉద్యోగ ప్రకటనలు అన్నింటికి దరఖాస్తు చేసి మనం ఆ పోటీల్లో విజయం సాధిస్తామనే  నమ్మకం వచ్చినప్పుడు వాటికి హాజరు కావడం మంచివన్నీ నేను పాటించిన వ్యూహాలు. అది కేవలం ఉద్యోగానికే కాదు, చదువుకి కూడా వర్తిస్తుందని నమ్మాను. నాకు రిజర్వేషన్ ఉందనీ,  దాని వల్లనే ఏదోలా ఉద్యోగం వస్తుందని ఏనాడూ అనుకునేవాడిని కాదు. అలాగని అవి నాకు ఉపయోగపడవని కూడా అనుకునేవాడిని కాదు. చదువుకునేటప్పుడు నేను మెరిట్ లో కూడా సీట్లు సాధించాను. నా విధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా జూనియర్ లెక్చరర్ గా ఎంపికయ్యాను. తర్వాత ఎయిడెడ్ కళాశాలలో డిగ్రీ లెక్చరర్ గా సెలెక్ట్ అయ్యాను. డిగ్రీ కళాశాలగా చేరాను. ఆ తర్వాత శ్రీనివాసరావు హైదరాబాదులో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు ప్రకటన వెలవడ్డం, దానికి దరఖాస్తు చేయడం, ఎంపిక కావడం జరిగిపోయాయి. నాకు తెలిసి నా ఉద్యోగాలన్నీ నిజాయితీగా జరిగాయి. రికమండేషన్ తావు లేకుండా జరిగాయి. నిజాయితీగా ఇంటర్వ్యూలో ప్రశ్నలకు సమాధానం చెప్పడం, ఈ పరీక్షల్లో బాగా మార్కులు వచ్చేలా ప్రయత్నించడం ఇవే నా వ్యూహాలు. 


  • మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసిన రచనలు ఏవి?

అలెక్స్ హెలీ రచించిన ‘ఏడుతరాలు’, ఉన్నవ వారి ‘మాలపల్లి, గోపీచంద్ ‘అసమర్థుని జీవయాత్ర’, బుచ్చిబాబు ‘చివరికి మిగిలేది’, అంపశయ్య నవీన్ ‘అంపశయ్య’, చిలుకకూరి దేవపుత్ర ‘పంచమం.’ వంటి నవలలు, గుర్రం జాషువ ‘గబ్బిలం’, శ్రీ శ్రీ మహా ప్రస్థానం, కృష్ణశాస్త్రి ‘కృష్ణపక్షం’, గురజాడ ‘కన్యాశుల్కం’ నాటకం, మాక్సిమ్ గోర్కీ ‘అమ్మ’ నవల...ఇలా చాలా ఉన్నాయి. 

  • మీ మొదటి రచన దళిత తాత్త్వికుడు కవితా సంపుటి నేపథ్యం ఏమిటి?

సెంట్రల్ యూనివర్సిటీలో చేరిన తర్వాత దళిత సాహిత్యం పట్ల ఒక అవగాహన కలుగుతున్న నేపథ్యంలో నిన్ను రాసిన కవితల సమాహారం. దళితులకు కావలసిందేమిటనే ప్రశ్నకు సమాధానం గా దళిత తాత్వికుడు కవితలు ఉంటాయి. 

  • దళిత ఉద్యమానికి దళిత సాహిత్య ఉద్యమానికి గల తాత్విక భూమిక ఏమిటి? దళిత సాహిత్య లక్ష్యం ఆశయం ఏమిటి? 

నాకున్న అవగాహనలో సాహు మహారాజ్ ఇవి రామస్వామి మహాత్మా జ్యోతిరావు పూలే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాన్షీరామ్…భావజాలమే దళిత ఉద్యమానికి దళిత సాహిత్య ఉద్యమానికి తాత్విక భూమిక అని నేను భావిస్తాను. 

దళిత సాహిత్య లక్ష్యం కొంతమంది దృష్టిలో రాజ్యాధికారానికి సాహిత్యం చైతన్యాన్ని కలిగించడం. మరి కొంతమంది అభిప్రాయంలో ప్రధాన జీవన స్రవంతిలో దళితులను కూడా నడిపించగలిగే చైతన్యాన్ని పెంపొందించడం. అభిప్రాయంలో ఈ రెండవది సాహిత్యం చేసే పని. మొదటిది దళిత సామాజిక ఉద్యమాలు చేయాల్సిన పని. అయితే, దీనికి కావలసిన ప్రేరణ  సాహిత్యం అందిస్తుంది. సాహిత్యం కళాత్మకమైన అనుభూతి ద్వారా సామాజిక వాస్తవికతను అందిస్తుంది. 

  • హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం కేంద్రంగా మాదిగ సాహిత్య వేదిక ఏర్పడడంలో మీరు కూడా కీలకం అని చెప్తారు. ఈ వేదిక ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది.


హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నేను ఎమ్మెస్ చేరే నాటికి విస్ఫోటన సంస్థ ఉండేది తర్వాత అంబేద్కర్ అసోసియేషన్ ఏర్పడింది. మార్క్సిస్టు భావజాలం ఉన్నవారు విస్ఫోటనలో ఉండేవారు. అంబేద్కర్ భావజాలం ఉండేవారు అంబేద్కర్ అసోసియేషన్ లో ఉండేవారు. దళితుల్లో మాల, మాదిగ భేదాలు బయటికి అంతగా కనిపించక పోయినా ఉండేవి. అంబేద్కర్ అసోసియేషన్ స్థాపించింది మాలా మాదిగ విద్యార్థులు అయినప్పటికీ ఆ సంస్థలో మాలలకు లభించినంత ప్రాధాన్యం మాదిగలకు లభించేది కాదు. కీలకమైన పదవుల్లో మాదిగలకు అవకాశం ఇచ్చేవారు కాదు. అందువల్ల విధాన నిర్ణయాల్లో మాదిగలకు చేదు అనుభవాలు మిగిలేవి. సీట్లు సాధించేటప్పుడు మాదిగ విద్యార్థులకు ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు. ఇవన్నీ గమనించిన నాగప్ప గారి సుందరరాజు మాదిగలకు ప్రత్యేకమైన ఒక విద్యార్థి సంఘం ఉండాలని దానికి అనుబంధంగా సాహిత్య వేదిక కూడా ఉండాలని ప్రతిపాదించాడు. దళిత విద్యార్థి సంఘం పేరుతో ఒక విద్యార్థి సంఘాన్ని ఏర్పాటు చేసి కృష్ణ మాదిగల పిలిచి ఆ సంఘాన్ని ప్రారంభించాం. ఆ సంఘ వ్యవస్థాపక సభ్యులలో నేను సంయుక్త కార్యదర్శిగా ఉండేవాణ్ణి. ప్రధానంగా సాహిత్యానికి సంబంధించిన విభాగానికి నేను పర్యవేక్షణ వహించే వాడిని. నేను అప్పటికి ఇంకా ఎం ఏ లోనే ఉండడం వలన అప్పటికే పరిశోధన చేస్తున్న వాళ్లకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని ఉద్దేశంతో వాళ్లని ప్రెసిడెంట్, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి వంటి పదవుల్లో పెట్టేవాళ్ళం. సాహిత్యాన్ని ప్రచురించేటప్పుడు కూడా ప్రధాన సంపాదకుడు సంపాదకుడు సంపాదక వర్గం అని అందరికీ ప్రాధాన్య ఇచ్చేలా  చేసేవాళ్ళం. నాగప్ప గారి సుందర్రాజు నాకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవాడు. కలిసి బాగా పనిచేసేవాళ్ళు. అన్ని విషయాలు నాతో చర్చించేవాడు. వాటి విధి విధానాలు రూపకల్పంలో అతని ఆయనకి నేను బాగా సహకరించే వాడిని. మాతో పాటు ఎంతోమంది ముందుకు వచ్చారు.  మార్క్సిస్టు  భావజాలంలో సాహిత్య శిబిరాలు సంఘాలు ఎంతో శక్తివంతమైన పాత్రను పోషిస్తున్నాయి. అదేవిధంగా దళిత సామాజిక ఉద్యమాలు సంఘాలకు  సమాంతరంగా సాహిత్యాన్ని కూడా మరొక మార్గంలో నిర్వహించుకుంటూ పోవాలి. ఆ ఉద్దేశంతోనే   అంబేద్కర్ అసోసియేషన్ లో సాహిత్యాన్ని ప్రోత్సహించటం కోసం దళిత సాహిత్య వేదిక ఉన్నట్లుగానే మాదిగలకు కూడా ఒక వేదిక ఉండాలని భావించాం. ఆ విధంగా దళిత విద్యార్థి సంఘం (డి ఎస్ యు) మాదిగ సాహిత్య వేదిక ఏర్పడ్డాయి. ఆ రోజుల్లో మాదిగ అనే పేరుతో విద్యార్థి సంఘం పెట్టడానికి గాని సాహిత్య వేదికలకు పెట్టడం గాని చేస్తే ఎవరు ఆ సంఘంలో చేరడానికి ఇష్టపడేవారు కాదు. కానీ, నాగప్పగారి సుందర రాజు నేనూ ఆ పేరు ఉండడం మంచిదని, దళిత ముసుగు కంటే ప్రత్యక్షంగా మన అస్తిత్వంతోనే ముందుకు వెళ్లడమే మంచిది అని భావించే వాళ్ళం. పరిస్థితుల్లో మాదిగ జీవితాలను ప్రతిపలిచే కవిత్వాన్ని ఆహ్వానిస్తూ ఒక ప్రకటన విడుదల చేసాం. నా పేరు తోనే విడుదల చేసాం. పత్రికా ప్రకటనను చూసి ఎంతోమంది బయట నుండి ఫోన్లు చేసి అభినందించారు. ఒకసారి అన్వేషి సంస్కారం ఒక ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు అక్కడ ఈ ప్రకటనను కూడా ఆ ఎగ్జిబిషన్లో ప్రదర్శించడం చూసి నేను ఎంతో సంతోషపడ్డాను. ఆ రచనలు వచ్చిన తర్వాత ఆ కవితలను ఇంచుమించు నేనే ఎడిటింగ్ చేశాను. అదంతా తెలిసిన సుందర రాజు నన్నే ఎడిటర్ గా ఉండమని చెప్పాడు. పెద్దవాళ్ళను గౌరవించడం, వాళ్ళని కలుపుకుపోవాలనే ఉద్దేశంతో వాళ్లని సంపాదక మండలంలో వేశాం. మాదిగ సాహిత్య వేదిక ఏర్పడ్డం, అది తీసుకొచ్చిన రచనలు, ఆ రచనలు రావడంలో నేను కూడా కీలకమైన పాత్ర నిర్వహించాలని చెప్పడానికి గర్వంగా ఉంది. 


  • విశ్వవిద్యాలయ స్థాయిలో దళిత, బహుజన సాహిత్యాన్ని పాఠ్యాంశంగా పెట్టడంలో మీ కృషి ఏమిటి?

మానవవనరులను పెంపొందించడంలో విశ్వవిద్యాలయాలు సమాజానికి ఆదర్శంగా ఉండాలి. అందరి గురించీ నిస్పాక్షికంగా సత్యాన్వేషణ జరగాలి. మానవుడిని ఉత్తమ పౌరుడుగా తీర్చిదిద్దటమే కాకుండా నాయకత్వ లక్షణాలను పెంపొందించడం కూడా విశ్వవిద్యాలయాల పని. ప్రభుత్వం మేధావి వర్గానికి కావలసిన అవకాశాలను అందిస్తుంది వాటిని అందుకొని సమాజానికి కావలసిన నూతన ఆవిష్కరణలను విశ్వవిద్యాలయాలు చేయాలి. సాహిత్యం ఫిలాసఫీ సామాజిక శాస్త్రాలు సమాజానికి సంబంధించిన బాధ్యతతో వ్యవహరించాలి. సమకాలీన అంశాలతో పాటు భవిష్యత్తును, ఆ అవసరాలను దర్శనం చేయగలగాలి. అందువలన సమాజంలో జరుగుతున్న ప్రతి అంశం పైనా విద్యార్థుల అధ్యయనం జరగాలి. కానీ, కొన్ని వర్గాలు కొన్ని వర్ణాల వారి భాషా సాహిత్యాల అధ్యయనానికి ఇంకా దూరంగానే ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు సాహిత్యంలో కొన్ని ఆధిపత్యం కులాల వారి సాహిత్యం సంస్కృతి చరిత్రలోనే అధ్యయనం చేస్తున్నారు. దీన్ని గమనించిన తర్వాత దళిత బహుజన సాహిత్య అధ్యయనం విశ్వవిద్యాలయ స్థాయిలో శాస్త్రీయంగా జరగవలసిన అవసరం ఉందని భావించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖలో ఎం.ఏ.స్థాయిలోనే దళిత సాహిత్యం ఒక ప్రత్యేకమైన ఆప్షనల్ కోర్సుగా ప్రతిపాదించాను. అప్పటివరకు తెలుగుశాఖలో దళిత సాహిత్యం పై ప్రత్యేకమైన అధ్యయనం లేదు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు, తెలుగు శాఖలో దళిత సాహిత్యం ఒక ఆప్షనల్ కోర్సుగా పెట్టిన తర్వాతనే సోషల్ సైన్సెస్ లో ఇంక్లూసివ్ అండ్  ఎక్స్ క్లూజివ్ సెంటర్,‌ అంబేద్కర్ స్టడీ సెంటర్ వంటివి వచ్చాయి. 

  • ప్రస్తుతం తెలుగుసాహిత్యంలో మీరొక సద్విమర్శకుడిగా గుర్తింపు ఉంది. మీరు విమర్శ రంగంలో ఎంచుకోవడానికి కారణం ఏమై ఉండవచ్చు?

అసలు విమర్శ అంటేనే గుణ దోషాలు సమీక్ష చేసి సమాజానికి సాహిత్యానికి ఏది మంచిది సూచించే పని చేయడం. కానీ జన వ్యవహారంలో విమర్శ అనగానే ఎత్తి పొడవడం నిందించడం వంటి అర్థాలలో ప్రాచుర్యం చెందుతోంది. సాహిత్య పరిభాషలో మాత్రం విమర్శ అంటే చాలు. అయినప్పటికీ విమర్శలను భిన్న కోణాలు భిన్న దృక్పథాలతో కొనసాగడం వలన సద్విమర్శకుడు అనే పదం కూడా ఉంది. పాండిత్యం ఉండి, సహృదయతతో చేసి విమర్శ నిజానికి సద్విమర్శ. విమర్శగా చలామణి అవుతున్న ప్రశంస కూడా ఉంది. 

సాహిత్య ప్రయోజనాన్ని ప్రజల దగ్గరికి తీసుకు వెళ్ళేదీ, సాహిత్యాన్ని విశ్లేషించేదీ విమర్శ రంగమే. ఎన్ని రచనలు వచ్చాయనే దాని కంటే వచ్చిన రచనల్లో ఎన్ని రచనలు మంచివి అనేది చెప్పాలంటే విమర్శ ఉండాలి. జ్ఞానాన్ని అన్వేషించడంలో,‌ మార్గదర్శనం చేయడంలో సాహిత్య విమర్శ పాత్ర ఎంతో ముఖ్యమైంది. డాక్టర్ ద్వా.నా. శాస్త్రి గారి దగ్గర బిఏ స్పెషల్ తెలుగు చదువుకునే రోజుల్లోనే సాహిత్య విమర్శ గురించి కూడా చదువుకున్నాను. కవి కంటే విమర్శకుడు సాహిత్య సిద్ధాంతవేత్త ఎంత గొప్పవారు ఆయన చెప్తుండేవారు. ఆ తరువాత సెంట్రల్ యూనివర్సిటీలో ఆచార్య కె.కె.రంగనాథాచార్యులు, ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య, ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం గారి పాఠాలు విన్నాను.  సాహిత్య విమర్శకు మహోన్నతమైన స్థానం ఉందనిపించేటట్లు వారి పాఠాలు కొనసాగేవి. ఒక పద్యం ఒక నవల ఒక కథ ఒక నాటకం సామాన్య పాఠకుడు చదువుకోవడం కంటే, విమర్శకుడు దాన్ని విశ్లేషించి చెప్పడం వేరు. వీరితో పాటు చాలామంది సాహిత్య విమర్శలను చదువుకున్నాను. అవన్నీ సాహిత్యాన్ని దీప్తివంతం చేస్తున్నాయనిపించింది. నేను కూడా ఒక ఉత్తమ విమర్శకుడుగా కృషి చేయాలనిపించింది. సృజనాత్మక రచనలు చదువుతూ, చిన్నచిన్న ఉత్తరాలుగా, సమీక్షలుగా, వ్యాసాలుగా, సిద్ధాంత గ్రంథాలుగా,  వివిధ పరిణామాలలో పయనిస్తున్న నన్ను కూడా ఒక విమర్శకుడిగా గుర్తించటం సంతోషంగా ఉంది. 

  • మీకు నచ్చిన కొంతమంది సాహిత్య విమర్శకుల గురించి చెప్పండి! 

ఇది నిజానికి ప్రతి జాబితా చెప్పవలసిన సమాధానం. అయినప్పటికీ కొంతమంది ముఖ్యమైనటువంటి వాళ్ళు చెప్తాను. నేను ప్రభావితమైన విమర్శకులతో పాటు,  ఆచార్య పింగళి లక్ష్మీకాంతం, శ్రీశ్రీ, ఆరుద్ర, కె.వి.రమణారెడ్డి, వల్లంపాటి వేంకట సుబ్బయ్య, ఎస్వీ రామారావు, రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి, చేరా, బేతవోలు రామబ్రహ్మం, వడలి మందేశ్వరరావు, ఆచార్య కోవెల సంపత్కుమారాచార్య, అద్దేపల్లి రామమోహనరావు, త్రిపురనేని మధుసూదనరావు, పాపినేని శివశంకర్, వరవరరావు, ఆచార్య కాత్యాయనీ విద్మహే, సి.మృణాళిని, ఆచార్య కొలకలూరి ఇనాక్,  జి.లక్ష్మీనరసయ్య, అంపశయ్య నవీన్, ముదిగంటి సుజాత రెడ్డి, ఆడెపు లక్ష్మీపతి,  ఆచార్య బన్న ఐలయ్య, కత్తి పద్మారావు,  సీతారాం, అఫ్సర్, బి.తిరుపతిరావు, చింతకింది కాశీమ్, ఎ.కె.ప్రభాకర్, కాసుల ప్రతాపరెడ్డి, యాకూబ్,‌ సంగిశెట్టి శ్రీనివాస్, కోయి కోటేశ్వరరావు, సిహెచ్.లక్ష్మణచక్రవర్తి వరకూ ఇలా ఎంతోమంది ఉన్నారు. భాషా శాస్త్రంలో విశేషమైన కృషి చేసిన ఆచార్య పరిమి రామనరసింహంగారు శైలీశాస్త్ర విమర్శ మీద రాసిన వ్యాసం విమర్శ రంగంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. భారతీయ ఆలంకారిక సిద్ధాంతాలతో పాటు పాశ్చాత్య సాహిత్య సిద్ధాంతాలను సమన్వయం చేసుకుంటూ ఒక నూతన ఆలోచనా విధానాన్ని కలిగించేలా ఆ విమర్శ కొనసాగింది. నా వారిని కూడా నాకు నచ్చిన విమర్శకులుగానే భావిస్తాను.

  • సాహిత్య పరిశోధనలో ముఖ్యమైన అంశాలపైన సిద్ధాంతం, విమర్శ, చరిత్ర వంటి వాటిపై శాస్త్రీయ అన్వయం ఎలా ఉండాలి?

తెలుగులో కూడా ప్రక్రియల పట్ల ప్రత్యేక అధ్యయనాలు కొనసాగుతున్నాయి. ఒకప్పుడు పరిశోధనలో విమర్శ, విమర్శలో పరిశోధన, సాహిత్య చరిత్రలో పరిశోధన, విమర్శ మిళితమై కొనసాగాయి. ఆ పరిస్థితిని నేటికీ  కొంతమంది కొనసాగిస్తున్నారు. అలా కొనసాగినప్పుడు వాటిని పరిశోధనాత్మక విమర్శలని విమర్శనాత్మక పరిశోధనలనీ ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం వంటి వారు వింగడించే ప్రయత్నం చేశారు. సిద్ధాంతీకరించడం అనేది ప్రధానంగా పరిశోధనకు సంబంధించింది.గుణ దోష సమీక్ష చేయడం విమర్శలో ముఖ్యం. సాహిత్య పరిణామాల్ని, ఆ వివిధ దశలను కాలానుక్రమంగా గుర్తించటం సాహిత్య చరిత్ర పని. వీటి మౌలిక స్వభావాన్ని ముందుగా అర్థం చేసుకుంటే వాటిని శాస్త్రీయంగా సమన్వయించుకోవడం సులభం అవుతుంది. తొలి దశలో వచ్చిన కవుల చరిత్ర,  సాహిత్య చరిత్ర, వికాస చరిత్రలలో ఈ మూడు అంశాలు పెనవేసుకొని కొనసాగాయి. ప్రస్తుతం ఏ దృష్టితో పరిశోధనలు జరగవలసిన అవసరం ఎంతైనా ఉంది. 

  • తెలుగు సాహిత్యంలో ఇలాంటి ప్రక్రియాపరమైన అధ్యయనం, పరిశోధనల స్థితిగతులు ఎలా ఉన్నాయి?

ఇప్పుడిప్పుడే వీటిపై అధ్యయనంలోనూ పరిశోధనలలోనూ  దృష్టి కేంద్రీకరిస్తున్నారు. పింగళి వారి సాహిత్య శిల్పసమీక్ష, డాక్టర్ సి.నారాయణరెడ్డి గారి ఆధునిక ఆంధ్ర కవిత్వం సంప్రదాయం ప్రయోగాలు అనే సిద్ధాంత గ్రంథం, జీవి సుబ్రహ్మణ్యం గారి సాహిత్యంలో చర్చనీయాంశాలు, వడలి మందేశ్వరరావుగారి అనుశీలన, సిహెచ్. లక్ష్మణ్ చక్రవర్తి గారి సంపాదకత్వంలో వచ్చిన తెలుగు సాహిత్య విమర్శ సర్వస్వం, నళిని గారి సాహిత్య విమర్శ పదాల డిక్షనరీ వంటివి ప్రక్రియ ల స్వరూప స్వభావాన్ని అవగాహన చేసుకోవడానికి వాటిని అనుశీలించే శాస్త్రీయ విధానానికి ఉపయోగపడే కొన్ని గ్రంథాలు. 


  • తెలుగు భాషా సాహిత్యాల పరిశోధనల్లో పరిశోధన లక్ష్యం, పరిశోధన సమస్యలను ఎలా అవగాహన చేసుకోవాలి?



ఏ పరిశోధనకైనా ఆ పరిశోధనకు మొట్టమొదట తెలియజేయవలసింది పరిశోధన లక్ష్యం. 

పరిశోధన లక్ష్యం అనేది పరిశోధన ప్రక్రియలో అత్యంత ముఖ్యమైన భాగం. ఇది సత్యాన్వేషణ చేసే పరిశోధకుడు తాను చేయబోయే అధ్యయనానికి దారిదీపంగా మారుతుంది.పరిశోధన లక్ష్యం (Research Objective) అనేది శోధకుడు పరిశోధనలో సాధించదలచిన స్పష్టమైన, కొలిచగలిగే,తాను చేరుకోవడానికి సాధ్యమైన గమ్యం.దీనికి కొన్ని ముఖ్య లక్షణాలను చెప్పుకోవచ్చు. అ).స్పష్టత (Clarity): ఏమి తెలుసుకోవాలనుకుంటున్నామో తేటతెల్లంగా ఉండాలి. ఆ).కొలవగలగడం (Measurability): గమనించగలిగే, విశ్లేషించగలిగే సమాచారం ఉండాలి. ఇ). సాధ్యత్వం (Feasibility): ఇవ్వబడిన కాల పరిమితి, వనరులు, పరిధిలో సాధించదగిన లక్ష్యం కావాలి. ఈ). ప్రయోజనకత్వం (Relevance): పరిశోధన సమస్యకు సంబంధించినదిగా ఉండాలి.

సాహిత్య పరిశోధనలో "ఆధునిక తెలుగు కవిత్వంలో బహుజన దృక్కోణాన్ని విశ్లేషించడం." తన లక్ష్యంగా చెప్పొచ్చు. ఏమి తెలుసుకోవాలి అన్నదే పరిశోధన సమస్య (Research Problem). దాన్ని తెలుసుకోవడానికి ఎలా ముందుకెళ్లాలి అన్న దానికిగల దిశ పరిశోధన లక్ష్యం (Research Objective) అవుతుంది.


  • పరిశోధనలో పరిధి, ఊహా పరికల్పనల పాత్ర ఏమిటి?


పరిశోధనలో పరిధి (Scope) మరియు ఊహా పరికల్పనలు (Hypotheses) రెండూ కీలక పాత్ర వహించే అంశాలు. ఇవి శోధనను సరైన దిశలో నడిపించేందుకు అవసరమైన బలమైన పునాది వంటివి.

పరిశోధన పరిధి (Scope of the Research) అనేది పరిశోధకుడు పరిశీలించబోయే అంశాల పరిమితిని, కాలాన్ని, ప్రాంతాన్ని, పరిశోధన చేసే పరిమిత గడిపిన విషయాలను ముందుగానే స్పష్టంగా సూచిస్తుంది. అంతే కాదుపరిశోధన పరిమితులను స్పష్టతగా నిర్వచిస్తుంది కూడా.

తన పరిశోధనలో గమనించదగిన అంశాలపై దృష్టిని కేంద్రీకరించడంలో సహాయపడుతుంది.

పరిశోధన వ్యాసం/థీసిస్ వ్యాప్తిని నియంత్రిస్తుంది. తన పరిశోధన మరి విస్తృతంగా కాకుండా కేంద్రీకృతంగా పయనించేటట్లు సహాయపడుతుంది 

పరిశోధన గమ్యం స్పష్టంగా ఉండేందుకు దోహదపడుతుంది. ఉదాహరణ:"ఈ పరిశోధన 2000 నుండి 2020 మధ్య వెలువడిన తెలంగాణ ప్రాంతానికి చెందిన దళిత కవుల కవిత్వాన్ని మాత్రమే విశ్లేషిస్తుంది." చెప్పడం ద్వారా తన పరిశోధన పరిధి స్పష్టంగా తెలియజేసినట్లు అవుతుంది. ఉన్న పరిశోధన వేగవంతంగా పూర్తి కావడమే కాకుండా సమగ్రంగా పరిశోధనను పూర్తి చేయవచ్చు.

        ఊహా పరికల్పనలు (Hypotheses) అనేది పరిశోధకుడు ముందుగా ఊహించిన, పరీక్షించదగిన తాత్త్విక ప్రతిపాదన. ఇది పరీక్షించదగినట్లు ఉండాలి. దీనివల్ల పరిశోధనకు ఒక దిశను సూచిస్తుంది. పరిశీలనకు, డేటా సేకరణకు ఒక ఆధారం ఇస్తుంది. తాత్త్వికంగా సాధ్యమైన సంబంధాలను పరీక్షించగల అవకాశం కలిగిస్తుంది. పరిశోధన ఫలితాల విశ్లేషణకు పునాది వేస్తుంది. ఉదాహరణకు "తెలుగు సాహిత్యంలో ఆధునికత అనేది సామాజిక రాజకీయ పరిణామాలతో సన్నిహిత సంబంధం కలిగి ఉంటుంది." అని తన ఊహాపరికల్పనను ముందుగానే చెప్పవచ్చు. ఈ రెండూ కలిసి పరిశోధనకు సరిహద్దులను వివిధ దిశలను నిర్దేశిస్తాయి. 


  • ఊహ పరికల్పనలను ముందుగా వివరించే విషయంలో తెలుగు సాహిత్య పరిశోధన గ్రంథాల పరిస్థితి ఎలా ఉంది? 


తెలుగు సాహిత్య పరిశోధనలలో ఊహపరికల్పనను పరికణాన్ని తీసుకుని సిద్ధాంత గ్రంథాలను పరిశీలిస్తే అతి కొద్ది సంఖ్యలోనే ఉంటున్నాయి. దీని మీద చాలామందికి అవగాహనే ఉండట్లేదు. దీనికి కారణం చాలా విశ్వవిద్యాలయాల్లో రీసెర్చ్ మెథడాలజీ ( Research Methodology) అనేది ఒక పాఠ్యాంశంగా లేకపోవడం,  జీరో చాప్టర్ (Zero Chapter) లేదా పరిశోధన నేపథ్యానికి ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇవ్వకుండా సాహిత్య పరిశోధన సిద్థాంత గ్రంథాలు తయారైపోతున్నాయి. దీనివల్ల చాలామంది పరిశోధనలకు లక్ష్యం, ఆశయాలు పరిధి,  ఊహా పరికల్పన, ఒక మెదడాలజీ వంటివి ఉండట్లేదు.  

  • పరిశోధన విధానాన్ని శాస్త్రీయంగా తెలుసుకోవడానికి తెలుగులో ఎలాంటి కృషీ జరగట్లేదని అంటారా?


జరగట్లేదని కాదు కానీ, అది నిర్బంధంగా జరగాలి. పరిశోధన విధానాన్ని అధ్యయనం  చేసే బోధనా సిబ్బంది ఉండాలి. ప్రతి విశ్వవిద్యాలయం ఇంచుమించు పరిశోధనలు, విధానాలపై సదస్సులు నిర్వహిస్తుంది. కానీ, మరలా ఆ విశ్వవిద్యాలయం ఆ సదస్సులో సమర్పించిన పత్రాలను గ్రంథరూపంలో ఎంతమంది తీసుకొస్తున్నారు? తీసుకొచ్చిన వాటిని ప్రజలకు అందుబాటులో పెట్టగలుగుతున్నారా? సాధారణంగా అటువంటి సదస్సులన్నీ పరిశోధన వికాసాలను తెలుసుకునేటట్లే అత్యధికంగా కొనసాగాయి. అంటే విధానాని కంటే విషయానికి అధిక ప్రాధాన్యాన్ని ఇచ్చాయి. 

    మన తెలుగు వాళ్ళు మొదటి నుండీ తమకంటూ కొన్ని ప్రత్యేక పద్ధతులతో పరిశోధనలు కొనసాగించారు. ఒకరిద్దరు ముఖ్యంగా భాషా శాస్త్రం పరిశోధనాల్లోను, పాశ్చాత్య, ఆధునిక పరిశోధన విధానాలు తెలిసిన వారు శైలీపత్రాలను.   (Style Sheet) స్టైల్ షీట్లని అనుసరించారు.  పాశ్చాత్య సాహిత్య పద్ధతులు విశ్వవ్యాప్తం కావడానికి  శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వచ్చిన మార్పుల వల్ల తెలుగు పరిశోధన రంగంలో కూడా మౌలికమైన మార్పులు కనిపిస్తున్నాయి. మన తొలితరం పరిశోధనలలో పరిశోధన విధానాన్ని కంటే పరిశోధన అన్వేషణకి ప్రాధాన్యం ఇచ్చారు. కానీ దాన్ని వివరించి విధానంలో కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయి.  ఆ పద్ధతులే కొనసాగితే భావచౌర్యం పెరిగిపోతుంది. ఎవరి అభిప్రాయాలు ఏమిటో స్పష్టంగా తెలియదు.  

        అందువల్ల కొత్తగా ప్రవేశించిన అధ్యాపకులు తమ విశ్వవిద్యాలయాలలో కొంతమంది తొలితరం వారు పరిశోధనకు శాస్త్రీయ మార్గం చూపించిన వాటిని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. ఆచార్య గ్రంథం అప్పారావు, ఆచార్య ఆర్ వి ఎస్ సుందరం,  ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి,  బ్రహ్మానందం, ఆచార్య కులశేఖర రావు, కుసుమారెడ్డి, డా.ఎస్. జయ ప్రకాష్, ఆచార్య పులికొండ సుబ్బాచారి, ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ మొదలైన వాళ్ళు సాహిత్య పరిశోధనలను శాస్త్రీయంగా చేయడానికి కొన్ని పద్ధతులను వివరించే గ్రంథాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. 

  ఆచార్య నిత్యానందరావుగారు విశ్వ విద్యాలయంలో తెలుగు పరిశోధనలో కూడా పరిశోధన విధానం, పరిశోధన తీరుతెన్నులను అవగాహన చేసుకోవడానికి అనేక అంశాలను ఆ గ్రంథంలో చేర్చారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్య ఎన్.గోపి, డా వాసిలి వసంత కుమార్, ఆచార్య ననుమాస స్వామి గార్ల ఆధ్వర్యంలో కొన్ని పరిశోధన పత్రికలు వెలువడ్డాయి. అలాగే కాకతీయ విశ్వవిద్యాలయంలో శ్రీవేంకటేశ్వర విద్యాలయంలో కూడా పరిశోధన విధానాన్ని తెలుసుకోవడానికి కొన్ని సంచికలు వెలువడ్డాయి. అభ్యుదయ పరిశోధనల మీద ఒక ప్రత్యేక సంచిక వేసింది. యువ భారతి ఒక రజతోత్సవ సంచికను తీసుకువచ్చింది.

 వీటితో పాటు మరికొన్ని ఆంగ్ల గ్రంథాలను ఆధారంగా చేసుకుని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోను, ఆచార్య కాశీమ్ పరిశోధక బృందం వారు ఉస్మానియా యూనివర్సిటీలోను, ఆచార్య మాడభూషి సంపత్ కుమార్, ఆచార్య విస్తాలి శంకర్ రావు ఆధ్వర్యంలో మద్రాస్ విశ్వవిద్యాలయం వారు, ఆచార్య రామనాథం నాయుడు ఆధ్వర్యంలో కర్ణాటక సార్వత్రిక విశ్వవిద్యాలయం, మైసూర్ లోను  తెలుగు పరిశోధనలలో పరిశోధన విధానానికి సంబంధించిన కొన్ని ప్రత్యేక తరగతులను ఉపన్యాసాలను ఏర్పాటు చేశారు. వీటితో పాటు నెల్లూరులోని దొడ్ల కౌసల్యమ్మ ప్రభుత్వ మహిళా కళాశాల, తెలుగు శాఖ వారు, అలీగడ్ ముస్లిం యూనివర్సిటీ లాంగ్వేజ్ డిపార్ట్మెంట్ తదితర కొన్ని సంస్థలు పరిశోధన విధానాన్ని నేర్పడానికి కొన్ని శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దీని ఫలితంగా ప్రస్తుతం వస్తున్న తెలుగు పరిశోధన గ్రంథాలలో పరిశోధకులు తమ పరిశోధన నేపథ్యం, పరిశోధన విధానం, పరిశోధన లక్ష్యాలు, ఆశయాలు, పరిధి, ఊహాపరికల్పన వంటి అంశాలను వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అయినా ఇంకా మరింత స్పష్టత రావలసిన అవసరం ఉంది. పరిశోధన విధానం అనేది శాస్త్ర సాంకేతిక రంగాలలో వస్తున్న మార్పులు,  ఆధునిక జీవితంలో వస్తున్న స్లంక్లిష్ట పరిస్థితులను శాస్త్రీయంగా అందించడానికి ఎప్పటికప్పుడు అప్డేట్ కావలసిన అవసరం ఉంటుంది. 


  •  పరిశోధనకు రూపం(పుటల పరంగా) ఉండాలి అనే నియమం ఉంటుందా? పరిశోధనకు అసలు రూపం ముఖ్యమా, సారం ముఖ్యమా?


పరిశోధనకు రూపం (పుటల పరంగా) లేదా పరిమాణం విషయంలో సాధారణంగా ఖచ్చితమైన నియమం అనేది సందర్భాన్ని బట్టి మారుతుంది.  ఆ యా విశ్వవిద్యాయాలు, పరిశోధన సంస్థలు, జర్నల్స్, లేదా గ్రాంట్ సంస్థలు తమ నిర్దిష్ట మార్గదర్శకాలను అనుసరించి పరిశోధన పత్రం యొక్క పరిమాణం (పుటలు, పదాల సంఖ్య) లేదా రూపం (ఫార్మాట్) గురించి నియమాలు విధించవచ్చు. ఉదాహరణకు:ఒక పీహెచ్‌డీ థీసిస్‌కు 100-300 పుటలు లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చు, సంస్థ మార్గదర్శకాల ఆధారంగా జర్నల్ ఆర్టికల్స్ సాధారణంగా 10-30 పుటల మధ్య లేదా 3,000-8,000 పదాల మధ్య ఉండాలని నిర్దేశిస్తాయి.కాన్ఫరెన్స్ పేపర్లు లేదా షార్ట్ కమ్యూనికేషన్స్‌కు 4-10 పుటలు లేదా 1,500-3,000 పదాలు అని పరిమితి ఉండవచ్చు.


స్పష్టత  సంస్థాగత లక్షణంగా గుర్తించాలి. పరిశోధన పత్రం ఒక నిర్దిష్ట నిర్మాణం (పరిచయం, సాహిత్య సమీక్ష, పద్ధతి, ఫలితాలు, చర్చ, ముగింపు)ను కలిగి ఉండాలి. ఈ రూపం పాఠకులకు సమాచారాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. జర్నల్స్ లేదా కాన్ఫరెన్స్‌లు నిర్దిష్ట పరిమాణం, ఫార్మాట్‌ను డిమాండ్ చేస్తాయి, ఎందుకంటే ఇది వారి ప్రచురణ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. పరిశోధన పత్రం చాలా పొడవుగా ఉంటే, పాఠకులు దానిని పూర్తిగా చదవడానికి సమయం కేటాయించకపోవచ్చు. అదే సమయంలో, చాలా చిన్నగా ఉంటే, అవసరమైన వివరాలు లోపించవచ్చు.

ఒక సమర్థవంతమైన రూపం (ఫార్మాట్, సైటేషన్స్, రిఫరెన్స్‌లు) పరిశోధన యొక్క విశ్వసనీయతను, వృత్తిపరమైన స్వభావాన్ని పెంచుతుంది. పరిశోధన యొక్క సారం దాని కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు,  జ్ఞానానికి జోడించే విలువలో ఉంటుంది. ఒక పరిశోధన పత్రం ఎంత చక్కగా రూపొందించినా, దాని సారం బలహీనంగా ఉంటే దాని ప్రభావం తక్కువగా ఉంటుంది. పరిశోధన ఒక నిర్దిష్ట ప్రశ్న లేదా సమస్యను పరిష్కరించాలి. ఈ సమస్యను స్పష్టంగా గుర్తించి, దానికి సమర్థవంతమైన జవాబును అందించడం సారం యొక్క లక్ష్యం.

   సాధారణంగా పరిశోధన సారం దాని డేటా, విశ్లేషణ, మరియు ఆధారాల బలంపై ఆధారపడి ఉంటుంది. ఇవి లేని పరిశోధన ఖాళీగా ఉంటుంది. సారం బలంగా ఉంటే, అది ఆ రంగంలో కొత్త చర్చలను రేకెత్తించవచ్చు, విధానాలను ప్రభావితం చేయవచ్చు, లేదా ఆచరణాత్మక పరిష్కారాలను అందించవచ్చు.చివరికి, సారం ఎక్కువ ముఖ్యమైనది. ఒక పరిశోధన పత్రం చిన్నదైనా లేదా నిర్మాణంలో స్వల్ప లోపాలు ఉన్నా, దాని సారం బలంగా ఉంటే అది గుర్తింపు పొందుతుంది. ఉదాహరణకు, చరిత్రలో కొన్ని మహత్తరమైన శాస్త్రీయ పత్రాలు (ఐన్‌స్టీన్ యొక్క రిలేటివిటీ పేపర్ వంటివి) చిన్నవి అయినప్పటికీ, వాటి సారం వల్ల గొప్ప ప్రభావం చూపాయి. అయితే, రూపం సారాన్ని సమర్థవంతంగా అందించడంలో కీలకంగా పనిచేస్తుంది. సారం ఎంత గొప్పగా ఉన్నా, అది అస్తవ్యస్తంగా లేదా అస్పష్టంగా అందించబడితే, పాఠకులు దానిని అర్థం చేసుకోలేరు లేదా దాని విలువను తక్కువగా అంచనా వేయవచ్చు. అకడమిక్ సందర్భంలో, రూపం (ఫార్మాట్, పుటలు, సైటేషన్స్) తప్పనిసరిగా అనుసరించాల్సిన నియమాలు కావచ్చు, ఎందుకంటే ఇవి పరిశోధన యొక్క విశ్వసనీయతను నిర్ధారిస్తాయి. కానీ సృజనాత్మక లేదా స్వతంత్ర పరిశోధనలో, రూపం కంటే సారం ఎక్కువ ప్రాధాన్యత పొందవచ్చు. 

పరిశోధనకు రూపం (పుటల పరంగా) అనేది సంస్థాగత మార్గదర్శకాలు లేదా ప్రచురణ అవసరాల ఆధారంగా నిర్ణయించబడుతుంది, కానీ సారం ఎల్లప్పుడూ పరిశోధన యొక్క ఆత్మ. రూపం సారాన్ని సమర్థవంతంగా అందించడానికి ఒక సాధనంగా పనిచేస్తుంది. అందువల్ల, రెండూ ముఖ్యమైనవి అయినప్పటికీ, సారం లేని రూపం ఖాళీగా ఉంటుంది, కానీ రూపం లేని సారం తన పూర్తి సామర్థ్యాన్ని చేరుకోలేకపోవచ్చు. పరిశోధకుడు సందర్భాన్ని బట్టి రెండింటి మధ్య సమతుల్యతను సాధించాలి.


  • విశ్వవిద్యాలయాలలో ఒకప్పుడు ఎం.ఫిల్ ఉండేది. దానివల్ల పరిశోధన విధానం, పద్ధతులు, పరిశోధన మీద అవగాహన ఏర్పడేది. ఈ పరిస్థితులను ఎలా అధిగమించాలి? 

          భారతీయ విశ్వ విద్యాలయాల్లో ఇటీవల ఎం.ఫిల్ అవసరం లేదని చెప్పారు. అయితే, దానికి ప్రత్యామ్నాయంగా ప్రాజెక్టులు పెట్టుకోవచ్చని కూడా సూచించారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయం,  తెలుగు శాఖలో ఈ నూతన విధానాలు రాకముందు నుండే ఎం.ఏ. స్థాయిలో పరిశోధన/సిద్ధాంత గ్రంథ రచనానైపుణ్యాలను అవగాహన కలిగించే విధంగా Techniques of Writing a Dissertation అనే ఒక కోర్సు పెట్టాం.  ఇలాంటి కోర్సులు పెట్టుకోవడం వల్ల పరిశోధన పట్ల ఒక అవగాహన కలిగించవచ్చు. 


  • ఎం.ఏ., చివరి సెమిస్టర్ లో విద్యార్థులకు పరిశోధనలో భాగంగా మీరు ప్రాజెక్టును పెట్టారు. అలాగే, దానితో పాటు కొన్ని సబ్జెక్టులు కూడా కొనసాగుతున్నాయి. పరిశోధనకు కావాల్సిన మెళకువలు ఇంత తక్కువ సమయంలో నేర్చుకునే అవకాశం ఉంటుందంటారా? 


మన విశ్వవిద్యాలయాల్లో కూడా సెమిస్టర్ సిస్టం అందుబాటులోకి వచ్చేసింది. ఆరు నెలల్లో ఎంతో నేర్చుకోవచ్చు. అందుకని ఒక సెమిస్టర్ లో థియరీ పూర్తిగా ఉంటుంది. మరొక సెమిస్టర్ లో డిజిర్టేషన్ రైటింగ్ ఉండేలా మరలా మార్పులు చేసాం. ఈ కోర్సు చదివిన తర్వాత చాలామంది ఎంతో ఉత్సాహంగా పరిశోధన పత్రాలు రాయడం, చదవడం చేస్తున్నారు. కేవలం పీహెచ్డీ పరిశోధన చేయడానికి మాత్రమే కాకుండా, పీజీ తర్వాత కొన్ని అనివార్య కారణాల వలన పరిశోధన కొనసాగించలేకపోవచ్చు. వారు తమ ఉద్యోగం చేసుకుంటూనే అభిరుచి మేరకు పరిశోధన చర్చలలో పాల్గొనవచ్చు.  ఇంటి దగ్గర ఉంటూ  కూడా పరిశోధన చేయడానికి పరిశోధన చేయడానికి, పరిశోధనలలో భాగస్వామ్యం కావడానికి ఈ కోర్సు ఉపయోగపడుతుంది. 


  • నేడు టెక్నాలజి అందరికి విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది. మారుతున్న పరిస్థితుల కేంద్రంగా రిసెర్చ్ మెథడాలజి ఎలా కొనసాగుతుంది? 


అందరికీ అందుబాటులో రావడం మంచిదే కదా. ఒకప్పుడు విద్యాభ్యాసం కొందరికి మాత్రమే  అందుబాటులో ఉండేది. దానివల్ల వాళ్ళు చెప్పిందే వేదం. నిజంగా ఆసక్తి ఉండి, సామర్థ్యం ఉండి,  నేర్చుకోవావనుకొనే కొన్ని వర్గాలకు ఆ విద్యావకాశాలు అందుబాటులో ఉండేవి కాదు. సాధ్యమైనంతవరకు ఇప్పుడు అందరూ చదువుకోడానికి విజ్ఞాన వాకిళ్ళను తెరిచారు. ప్రజాస్వామిక దేశాలలో ఇది సాధ్యమవుతుంది. అయినప్పటికీ కార్పోరేటు, ఇంటర్నేషనల్, కాన్వెంట్ ప్రభుత్వ పాఠశాల అనే విభాగాలు విజ్ఞానాన్ని దూరం చేసే పరిస్థితిలు కూడా ఏర్పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో శాస్త్ర సాంకేతిక రంగం అందరికీ అందుబాటులో రావడం మంచిదే. అయితే దాన్ని అందుకోవడంలో మరలా నైపుణ్యం కావాలి. కృత్రిమ మేధ (Artificial Intelligence) ప్రపంచాన్ని ఇప్పటికే శాసించటం మొదలుపెట్టింది. దీన్ని కూడా శాసించగలిగే స్థాయికి మనం చేరుకోవాలి. దీన్ని మనకి అనుగుణంగా మలుచుకోవాలి. విద్యా వైద్య రంగం అతలాకుతలం అయ్యే పరిస్థితి ఉంది. ముఖ్యంగా బోధనా రంగంలో నిరంతరం అధ్యయనం చేయడం,  కొత్తగా ఆలోచించటం,  ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం చేయకపోతే కృత్రిమ మేధ ముందు అటువంటి వాళ్ళు ఎందుకూ పనికి రాకుండా పోయే అవకాశం ఉంది. అందువల్ల రీసెర్చ్ మెథడాలజీలో ఇవన్నీ అధ్యయనాంశాలు కావాలి. ఇప్పటికే రీసెర్చ్ మెథడాలజీని బోధించే వాళ్ళు అప్డేటెడ్ స్టైల్ షీట్లు,‌ ఇన్నోవేటివ్ టెక్నిక్స్ ని ఉపయోగించమని చెప్తున్నాం. 

 

  • ప్యూర్ సైన్స్ (ప్రయోగశాలల్లో), సోషల్ సైన్స్, హ్యూమానిటిస్ వంటి పరిశోధనల్లో తేడాలను మనం ఎలా అర్థం చేసుకోవాలి?

ప్యూర్ సైన్స్ సార్వత్రిక నియమాలను కనుగొనడంపై దృష్టి పెడుతుంది, అయితే సోషల్ సైన్స్ మానవ సంక్లిష్టతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది,  హ్యూమానిటీస్ మానవ అనుభవాలను లోతుగా వివరిస్తుంది.ఈ మూడూ పరస్పరం పూరకంగా ఉంటాయి; ఉదాహరణకు, సాంకేతిక ఆవిష్కరణలు (ప్యూర్ సైన్స్) సామాజిక ప్రభావాలను (సోషల్ సైన్స్)  సాంస్కృతిక అంశాలను (హ్యూమానిటీస్) పరిశీలిస్తే విషయం మనకి బోధపడుతుంది.

ప్యూర్ సైన్స్ (Pure Sciences) లక్ష్యం ప్రకృతి యొక్క భౌతిక, జీవ దృగ్విషయాలను అర్థం చేసుకోవడం, సిద్ధాంతాలు  నియమాలను రూపొందించడం జరుగుతుంది. ఉదా., ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. వీటి పరిశోధనలు ప్రధానంగా ప్రయోగశాలల్లో వివిధ పద్ధతుల్లో జరుగుతుంటాయి. గణిత గణనలు, పరిశీలనల ఆధారంగా సమాచారాన్ని సేకరిస్తుంటారు. ఉదాహరణకు, ఒక రసాయన ప్రతిచర్య యొక్క ఫలితాలను పరీక్షించడాన్ని చెప్పుకోవచ్చు.పరిమాణాత్మకం (Quantitative) పద్థతులను ఉపయోగిస్తుంటారు. సార్వత్రిక సత్యాలను కనుగొనడంపై దృష్టిపెడతారు.

సోషల్ సైన్స్ (Social Sciences) పరిశోధనల్లో మానవ సమాజం, ప్రవర్తన, మరియు సంస్థలను అధ్యయనం చేయడం (ఉదా., సైకాలజీ, సోషియాలజీ, ఎకనామిక్స్). సర్వేలు, ఇంటర్వ్యూలు, కేస్ స్టడీలు, గణాంక విశ్లేషణలు, కొన్నిసార్లు ప్రయోగాత్మక పద్ధతులను ఉపయోగిస్తారు. ఉదాహరణకు, ఒక సమాజంలో ఆర్థిక అసమానతల ప్రభావాన్ని అధ్యయనం చేయడం.

హ్యూమానిటీస్ (Humanities)లో మానవ సంస్కృతి, చరిత్ర, తత్వశాస్త్రం, సాహిత్యం,  కళలను అర్థం చేసుకోవడం విశ్లేషించడం .పద్ధత

విమర్శనాత్మక విశ్లేషణ, వ్యాఖ్యానం, చారిత్రక పరిశోధన, ఆలంకారిక పద్ధతులతో గుణాత్మక అధ్యయనం చేస్తారు. ఉదాహరణకు, ఒక సాహిత్య రచనలోని ఇతివృత్తాలను విశ్లేషించడం గానీ, ఛందస్సు, అలంకారం, శిల్ప వైవిధ్యం ..ఇలా కొనసాగుతుంది. ఫలితాలు తరచూ వివాదాస్పదంగా లేదా బహువిధంగా వ్యాఖ్యానించబడతాయి.


  • పరిశోధనలో శాస్త్రీయమైన పద్ధతి అంటారు కదా… అది అన్ని పరిశోధనల్లోనూ ఒకేలా ఉంటుందా? 

శాస్త్రీయ పద్ధతి అనేది పరిశోధనలో వ్యవస్థీకృత  తార్కిక విధానం. ఇది సమస్యను గుర్తించడం, ఊహాపరికల్పన రూపొందించడం, ప్రయోగాలు లేదా పరిశీలనల ద్వారా సమాచారాన్ని సేకరించడం, విశ్లేషించడం, సిద్దాంతాన్ని సమన్వయం చేయడం, నూతన సిద్ధాంతాలను రూపొందించడం వంటి దశలను కలిగి ఉంటుంది. అయితే, ఈ పద్ధతి అన్ని పరిశోధనల్లో ఒకేలా ఉండదు; పరిశోధన రంగాన్ని బట్టి దాని అధ్యయన లక్ష్యాల ఆధారంగా  అమలు మారుతుంది. 

  • సాహిత్య పరిశోధనలో సాహిత్య పరిశోధనలు పద్ధతి అంటే ఏమిటి? 

శాస్త్రీయ పద్ధతి యొక్క ప్రాథమిక సూత్రాలు (సమస్య గుర్తించడం, డేటా సేకరణ, విశ్లేషణ, తీర్మానం) అన్ని రంగాల్లో ఉన్నప్పటికీ, దాని అన్వయించే శాస్త్రాన్ని బట్టి మారుతుంది.  సాహిత్య ప్రక్రియలను విమర్శనాత్మకంగా, సైద్ధాంతికంగా, సందర్భాన్ని ఆధారం చేసుకుని  విశ్లేషించడానికి ఉపయోగించే గుణాత్మక  వివరణాత్మక విధానాలను పాటించడమే శాస్త్రీయ పద్థతి. 

   రచనలోని భాష, చిహ్నాలు, అలంకారాలు,  నిర్మాణాన్ని లోతుగా పరిశీలించడానికి గారికి ఆలంకారిక, / గ్రంథ పరిష్కరణ పరిశోధన పద్ధతిని పాటించడం శాస్త్రీయ పద్ధతి అవుతుంది. 

   సాహిత్య సిద్ధాంతాలను పరిశోధన చేసేటప్పుడు ఆ సిద్ధాంతాలను ఆధారంగా చేసుకుని విశ్లేషించాలి. ఉదాహరణకు ధ్వని, ఔచిత్యం, Marxism,  Formalism, Structuralism, Postcolonialism, Psychoanalysis  ఆధారంగా విశ్లేషణ.

      రెండు లేదా అంతకంటే ఎక్కువ రచనలను లేదా రచయితలను పోల్చేటప్పుడు త్రినాత్మక అధ్యయన పద్ధతిని పాటించాలి. రచన యొక్క చారిత్రక సందర్భం లేదా సాంస్కృతిక ప్రభావాన్ని అన్వేషించడానికి చారిత్రక అధ్యయన పద్ధతిని ఉపయోగించాలి. రచయిత జీవితం మరియు రచన మధ్య సంబంధాన్ని పరిశీలించడానికి కవి జీవిత కావ్య సమన్వయ పరిశోధన పద్ధతి… ఇలా మనం పరిశోధన చేసే అంశాన్ని బట్టి ఆ పద్ధతిని ఎంపిక చేసుకోవడమే శాస్త్రీయమైన విధానం. 

ప్యూర్ సైన్స్‌లో  పరిమాణాత్మకంగా, ప్రయోగాత్మకంగా కనిపిస్తుంది. అయితే సాహిత్య పరిశోధన పద్ధతి గుణాత్మక, విషయాత్మక,  వివరణాత్మకంగా ఉంటుంది. సాహిత్య పరిశోధనలో పరికల్పనలు స్పష్టంగా రూపొందించబడవు;  అన్వేషణాత్మక ప్రశ్నలు రేకెత్తుతుటాయి. జీవిత అనుభవాలు, అనుభూతులలో తేడాలు ఉన్నట్లే ఫలితాలు కూడా సార్వత్రిక సత్యాల కంటే బహువిధ వ్యాఖ్యానాలపై ఆధారపడతాయి.

  • ఓపిగ్గా అనేక ప్రశ్నలకు మీ అభిప్రాయాలను, విశ్లేషణాత్మక సమాధానాలను అందించినందుకు కృతజ్ఞతలు.

నా అభిప్రాయాలను ఈ పత్రిక ద్వారా విద్యార్థులతో పంచుకోవడానికి అవకాశం కలిగించినందుకు పత్రిక యాజమాన్యానికి, మీకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. 


కామెంట్‌లు లేవు: