నూతన పద్ధతుల్లో జానపద అధ్యయనం నేటి ఆవశ్యకత’
జానపద సాహిత్య అధ్యయనం గత 70 సంవత్సరాల కాలంలో అనేక మలుపులు తీసుకుందని దానిని నేడు కొత్త పద్ధతుల్లో అధ్యయనం చేయడం ద్వారా మరిన్ని విశేషాలు వెలుగులోకి వస్తాయని ద్రవిడ విశ్వవిద్యాలయం జానపద అధ్యయన శాఖ పూర్వ పీఠాధిపతి ఆచార్య పులికొండ సుబ్బాచారి పేర్కొన్నారు. ఆచార్య బిరుదురాజు రామరాజు శతజయంతి ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో తెలుగు శాఖ హైదరాబాద్ విశ్వవిద్యాలయం వారు మంగళవారం నాడు బిరుదురాజు రామరాజు సాహిత్య పరిశోధన కృషిపై సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య పిల్లలమర్రి రాములు అధ్యక్షత వహించి,జానపద సాహిత్య అధ్యయనానికి బిరుదురాజు రామరాజు పరిశోధనా కృషి యే పునాది అని పేర్కొన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ నామోజు బాలాచారి సమావేశాన్ని ప్రారంభిస్తూ దాశరథి, బిరుదురాజు రామరాజుల శతజయంతి ఉత్సవాలు జరపడం ఎంతో ఆనందదాయకమని, వారి జీవితాలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవడానికి ఈ కార్యక్రమాలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ రిజిస్ట్రార్ ఆచార్య టి. గౌరీ శంకర్ మాట్లాడుతూ అనేకమంది పరిశోధకులను ప్రోత్సహించిన ఉదాత్త వ్యక్తిత్వం రామరాజు గారిదని ప్రశంసించారు.
కార్యక్రమంలో తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు బిరుదురాజు రామరాజు రచించిన ఆంధ్రయోగులు గురించి మాట్లాడారు. భారతీయ ఆధ్యాత్మిక కృషిని ఆ గ్రంథంలో వివరించారని ఆయన సోదాహరణంగా పేర్కొన్నారు. బిరుదురాజు రామరాజు జానపద గేయాల్లోని విశేషాలను ఆచార్య గోనా నాయక్ రాగయుక్తంగా తన ప్రసంగంలో వివరించారు. బిరుదురాజు రామరాజు గారి తెలుగులో జానపద గేయ సాహిత్యంలోని వివిధ అంశాలను డాక్టర్ డి. విజయకుమారి తన పత్ర సమర్పణలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిథిగా పాల్గొన్న రాష్ట్రపతి పురస్కార గ్రహీత, శాస్త్రవేత్త డాక్టర్ రూప్ కుమార్ డబ్బీకార్ రామరాజు గారి సాహిత్యంలోని విశేషాలను వివరించారు. ఆచార్య డి.విజయలక్ష్మి అతిథులను స్వాగతించగా, ప్రముఖ సాహితీవేత్త తిరుపాల్ వందన సమర్పణ చేశారు.
తెలుగు శాఖ ఆచార్యులు ఆచార్య పమ్మి పవన్ కుమార్ , ఆచార్య వారిజారాణి,ఆచార్య వంగరి త్రివేణి, డాక్టర్ భూక్య తిరుపతి, డాక్టర్ భుజంగ రెడ్డి డాక్టర్ విజయ కుమార్, పరిశోధక,సాహితీ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి