"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

08 ఆగస్టు, 2024

సంచిక పత్రికలో ఆచార్య దార్ల ఇంటర్వ్యూ

 

https://sanchika.com/interview-with-dr-darla-venkateswara-rao-dr-klvp/ సంచిక అంతర్జాల మాసపత్రికలో డాక్టర్ కె. ఎల్. వి .ప్రసాద్ గారు చేసిన ఇంటర్వ్యూని ఆ పత్రిక సౌజన్యంతో నా బ్లాగులో ప్రచురిస్తున్నాను. సంచిక అంతర్జాల పత్రిక సంపాదక వర్గానికి యాజమాన్యానికి నా ధన్యవాదాలు)

ప్రొఫెసర్ దార్లవెంకటేశ్వరరావుగారితో 

ముఖాముఖి !!




*ప్రొఫెసర్ వెంకటేశ్వరరావుగారికి ‘సంచిక’ అంతర్జాల మాసపత్రిక పక్షానస్వాగతం. నమస్తే… సర్ !


దార్ల: నమస్కారమండీ. తెలుగు సాహిత్యాన్ని ప్రచురించడంలో ‘సంచిక’ అంతర్జాల మాసపత్రిక నిర్మాణాత్మక పాత్రను పోషిస్తుంది. ఎన్నో విలువైన రచనలను ఈ పత్రికలో చదివాను. అటువంటి పత్రికలో నన్ను పరిచయం చేస్తూ ఇంటర్వ్యూ చేయడానికి ముందుకొచ్చినందుకు మీకు, పత్రిక యాజమాన్యానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. 

*వెంకటేశ్వరరావుగారూ, సుప్రసిద్ధ సెంట్రల్ యూనివర్సిటీలో మీరు ప్రొఫెసర్ గా వున్నారుకదా ! అక్కడ తెలుగు విభాగానికి, ఇతర విభాగాలకు తేడా ఏమైనా ఉందా?

దార్ల: సాధారణంగా ప్రతి విశ్వవిద్యాలయం, ఆ విశ్వవిద్యాలయ వివిధ విభాగాలకు ఏదొక ప్రత్యేకత ఉంటుంది. అలాగే,  మా యూనివర్సిటీకి కూడా ఒక ప్రత్యేకత ఉంది. యూనివర్సిటీ అసలు పేరు  ‘యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్’.

 1973లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరు సూత్రాల పథకంలో భాగంగా ఒక సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీనిలో భాగంగానే మా యూనివర్సిటీ ఏర్పడింది. ఇది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వయం ప్రతిపత్తి గల విశ్వవిద్యాలయం. ప్రజలు వ్యవహారంలో దీన్ని సెంట్రల్ యూనివర్సిటీ అనీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అని పిలుస్తుంటారు. 

   మా యూనివర్సిటీ లో గల తెలుగు విభాగానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. వివిధ రంగాలలో నిష్ణాతులైన ఆచార్యులు మా తెలుగు శాఖలో ఉన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు విభాగాలలో లేనంత మంది అధ్యాపకులు మా తెలుగు శాఖలో ఉండడం ఒక ప్రత్యేకత. వీరంతా ఒక్కొక్కరూ  ఒక్కొక్క అంశంలో ప్రత్యేకమైన పరిశోధనలు చేసిన వారు. అధ్యాపకులు ఎవరైనా పదవీవిరమణ చేసినట్లైతే వెంటనే కొత్త అధ్యాపకుల భర్తీ ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటుంది. ఒకవేళ వివిధాంశాలలో ప్రత్యేక నైపుణ్యం ఉన్న అధ్యాపకులు లేకపోతే ఆ యా రంగాలలో నిష్ణాతులైన వారిని పిలిచి ఉపన్యాసాలు ఇప్పించడం/ తరగతులు చెప్పించడం లేదా గెస్ట్ ఫ్యాకల్టీగా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది.  భాషా సాహిత్యాలలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు అధ్యయనంలో భాగంగా తెలుగు శాఖ సిలబస్ ని రూపొందిస్తుంటాం. మా పాఠ్యాంశాలను మేమే నిర్ణయించుకుని విశ్వవిద్యాలయ  అధికారుల ఆమోదాన్ని పొందుతాం. కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ సిలబస్ నిర్మాణంలో జోక్యం చేసుకోదు. అందువలన పాఠ్యాంశాల ఎంపికలు మాకు స్వేచ్ఛ ఉంటుంది. దీనివల్ల ఇతర శాఖలలో తెలుగు విద్యార్థులకంటే ఇక్కడ వారు అప్డేట్ లో ఉంటారు.  అందువల్ల ఇక్కడ సీటు దొరకాలంటే చాలా కష్టం. 

మా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకు చెందిన వారు,  ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం,  ఆచార్య రవ్వా శ్రీహరి, ఆచార్య తుమ్మల రామకృష్ణ మొదలైన వాళ్లంతా వివిధ విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ కూడా వెళ్లారు. ఆ విధంగా కూడా మా తెలుగు విభాగానికీ, యూనివర్సిటీకి ఒక ప్రత్యేకత ఉంది.

*అక్కడ బోధనా పరంగా ఏమైనా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారా ?

 దార్ల: నిజానికి మా తెలుగు శాఖలో పాఠం చెప్పడం అంటే నిత్యం కొత్త విషయాన్ని చెప్పాలి. ఉభయ రాష్ట్రాలలో ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులు మా విశ్వవిద్యాలయంలో చేరుతారు. అందుచేత వాళ్లకు పాఠం చెప్పేటప్పుడు ప్రిపేర్ అయ్యి చెప్పడం ప్రతీ అధ్యాపకుడు చేస్తుంటారు. అలా పాఠాలు చెప్పేటప్పుడు ఇబ్బంది అనేకంటే కూడా మేము నిత్యం తెలుసుకుంటూ తెలియజేస్తూ ఉంటాం. నాకైతే వ్యక్తిగతంగా ఇటువంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. నేను ఇంటర్మీడియట్ నుండి స్పెషల్ తెలుగునే చదువుకోవడం వల్ల ఇక్కడే ఎం.ఏ., ఎం.ఫిల్, పిహెచ్.డి లు పూర్తి చేయడం వల్ల నాకు ఇక్కడ వాతావరణం బాగా తెలుసు. కాబట్టి నాకు ఎటువంటి ఇబ్బంది ఎదురు కాలేదు. 


* వృత్తిపరంగా మీరు ‘తెలుగు బోధన’ను, మీరు ఇష్టమైన అంశంగా ఎన్నుకోవడం  యాదృచ్ఛికమా? లేక ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా ?వివరించండి . 

దార్ల: చిన్నప్పటినుండీ ఒక టీచర్ గానో, ఒక లెక్చరర్ గానో  అవ్వాలని కోరిక ఉండేది.  మా అన్నయ్య సివిల్స్ రాయాలనీ, గ్రూప్-1 పరీక్షలు రాయాలని అంటుండేవాడు. కానీ, నాకేమో ఒక లెక్చరర్ గా అయితే సమాజానికి కావలసిన మంచి పౌరులను తయారు చేయడానికి అవకాశం ఉంటుందని అనుకుంటుండేవాడిని. 

 కనీసం డిగ్రీ లెక్చరర్ గా నా జీవితాన్ని ప్రారంభించాలనుకున్నాను. నాకు అలాగే అలాగే అవకాశం వచ్చింది. ఏకకాలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనూ, గవర్నమెంట్ ఎయిడెడ్ కళాశాలలోనూ తెలుగు లెక్చరర్ గా ఉద్యోగాలు వచ్చాయి. డిగ్రీ లెక్చరర్ గా చేరాను. ఆ తర్వాత నా డాక్టరేట్ డిగ్రీ పూర్తి చేసుకున్న వెంటనే మా యూనివర్సిటీలో నోటిఫికేషన్ పడడం, నేను దరఖాస్తు చేయడం, సెలెక్ట్ కావడం, ఒకదాని తర్వాత ఒకటి వేగవంతంగా జరిగిపోయాయి. 

*మీ డాక్టరేట్ డిగ్రీ కోసం ఏం అంశంపై పరిశోధన చేశారు?

దార్ల:ఆరుద్ర రచనలపై పరిశోధన చేశాను. నా పరిశోధనాంశం ‘పరిశోధకుడుగా ఆరుద్ర’ ఇది డాక్టరేట్ కోసం చేసిన పరిశోధన. దీనిపై పరిశోధన చేయడం వల్ల అప్పటికి వచ్చిన అన్ని సాహిత్య చరిత్రలను చదివే అవకాశం ఉంటుంది. అది భవిష్యత్తులో నాకు ఉపయోగపడుతుందని ముందుగానే వేసుకున్న ఒక ప్రణాళిక అది. నా ఎంఫిల్ కోసం జ్ఞానానందకవిగారి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన ఆమ్రపాలి అనే బౌద్ధ కావ్యం పై పరిశోధన చేశాను. 

*ఆరుద్ర ‘సమగ్ర ఆంధ్ర సాహిత్యం’ సమగ్రమేనా?

దార్ల:  ఆరుద్ర గారు నెలకి ఒక సంపుటి చొప్పున 12 సంపుటాలు పూర్తి చేశారు. 13 వ సంపుటి మాత్రం అనుకున్న దాని ప్రకారం ఇవ్వలేకపోయారు. కానీ, తర్వాత కాలంలో దాన్ని పూర్తి చేశారు. తొలి సంపుటి 1965 ఏప్రిల్ లోను, 12వ సంపుటి 1968 ఫిబ్రవరిలో వెలువడ్డాయి. 13 వ సంపుటి 1991 సెప్టెంబర్ నాటికి పూర్తి చేశారు. తెలుగు సాహిత్య చరిత్ర, వివాదాలను ఆనాటికి అన్ని సంపుటాలుగా రాయడం, అంత విపులంగా రాయడం సామాన్యమైన విషయం కాదు. ‘సమగ్ర’ అంటే అప్పటికి ఉన్న సాహిత్యాన్నంతటినీ, కావ్యాల్ని అన్నింటినీ పూర్తిగా వివరించడం అని కాదు. ఆనాటి వరకు వచ్చిన రచనలను, వాటి స్వరూప స్వభావాలను వివరించడం. Comprehensiveగా చెప్పడం. ఆ దృష్టితో చూసినప్పుడు ‘సమగ్ర ఆంధ్ర సాహిత్యం’ చాలా వరకు సమగ్రతను సాధించినట్లే. అయితే, ఆ గ్రంథం రాయడంలో ఒక చరిత్రకారుడుగా నిస్పాక్షికంగా ఆనాటి వరకు ఉన్న భావజాలాలను, ప్రక్రియలను, వాదాలను, ధోరణులను, దృక్పథాలను చెప్పడానికి బదులు, తన భావజాలానికి కట్టుబడి, అభ్యుదయ సాహిత్యం వరకూ మాత్రమే పరిమితం చేసి  13వ సంపుటితో ముగించేశారు. 

* సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో అలా పరిమితం చేసిన కొన్ని ముఖ్యాంశాలేమిటి? 

దార్ల: ఆరుద్ర గారు 13వ సంపుటి పూర్తిచేసే నాటికి స్త్రీవాదం, దళితవాదం వంటి సాహిత్య ఉద్యమాలు వచ్చేశాయి. కానీ వాటిని ఎక్కడా ప్రస్తావించకుండా తన అభ్యుదయ భావజాలానికి మాత్రమే పరిమితమై, వాటిని విస్మరించినట్లుగా ముగించేశారు.గుర్రంజాషువాను అంచనా వేయడంలో కూడా కవికోకిలగానే వ్యాఖ్యానించారు తప్ప, ఆయన  ఆర్తినీ, దళిత వేదననూ సరైన దృష్టితో వ్యాఖ్యానించలేదు. 

*అలా అయితే, ఆరుద్ర తర్వాత వచ్చిన సాహిత్య చరిత్రకారులు సమకాలీన సాహిత్యాన్ని అంతటినీ  పట్టించుకున్నారా? 

దార్ల: గుర్తించవలసిన స్థాయిలో పట్టించుకోకపోయినా వాటి ప్రస్తావన చేశారు. వాటిలో ముఖ్యమైంది ఆచార్య ముదిగంటి సుజాత రెడ్డి గారి  ‘చారిత్రక సామాజిక నేపథ్యంలో తెలుగు సాహిత్యచరిత్ర’(1996). డాక్టర్ ద్వా.నా.శాస్త్రి గారి తెలుగు సాహిత్య చరిత్ర (1998) ఆధునిక సాహిత్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. 

*సాధారణంగా సాహిత్య చరిత్రల్లో ఎలాంటి వివాదాలకు అవకాశం ఉంటుంది? ఒకటి రెండింటిని ప్రస్తావించండి.

దార్ల: సాధారణంగా సాహిత్య చరిత్రకారులకు  నిష్పాక్షికమైన దృష్టి ఉండాలి. కానీ, ఇంతవరకు వచ్చిన సాహిత్య చరిత్రలలో ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారి ‘ఆంధ్ర సాహిత్య చరిత్ర’ తప్ప మిగతావన్నీ ఇంచుమించు భావజాలపరంగానూ, వైయక్తికమైనటువంటి అభిరుచులపరంగానూ ఎన్నో లోపాలు ఉన్నాయి. కవుల చరిత్ర, సాహిత్య చరిత్ర, సాహిత్య వికాస చరిత్రలపై ప్రత్యేకమైన ఇంటర్వ్యూ చేస్తే అదొక పెద్ద సముద్రం లాంటిదే అవుతుంది. 

*మీ విద్యార్థిదశలో మీకు సాహిత్యంపట్ల అభిరుచి ఎప్పుడు కలిగింది? అది ఎలా జరిగింది ?

దార్ల:చదువుకున్నవాళ్ళలో తొలితరానికి చెందిన వాణ్ణి. నాపై మొట్టమొదటిసారిగా మాకు ఉన్నత పాఠశాలలో తెలుగు పాఠాలు చెప్పిన శ్రీకంఠం లక్ష్మణమూర్తిగారు, సాంఘిక శాస్త్రం బోధించే ఆతుకూరి లక్ష్మణరావుగార్ల ప్రభావం వల్ల తెలుగు సాహిత్యం చదవడం పట్లా, రాయడం పట్లా నాకు  అభిరుచి కలిగింది.  ఆ తర్వాత శ్రీ కోనసీమ భానోజీ రామర్స్ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పనిచేస్తున్న డాక్టర్ ద్వా.నా.శాస్త్రిగారి రచనలు, పేరు పత్రికల్లో చూస్తుండేవాడిని. ఆయనతో పోటు డాక్టర్ సి.వి.సర్వేశ్వర శర్మ గారి పేరు కూడా చూస్తుంటే ఆయన కూడా అదే కళాశాలలో సైన్స్ లెక్చరర్.  వారిలా నేను కూడా పత్రికల్లో పేరు చూసుకోవాలనుకొనేవాణ్ణి. ఇంటర్మీడియట్ స్పెషల్ తెలుగులో ఆ కళాశాలలోనే చేరాను.అక్కడే బి.ఎ.స్పెషల్ తెలుగు కూడా చదివాను. డాక్టరేట్ డిగ్రీలు తీసుకున్న అధ్యాపకులు మాకు పాఠాలు చెప్పేవారు. డాక్టర్ ద్వా.నా. శాస్త్రి, డాక్టర్ వాడవల్లి చక్రపాణిరావు, డాక్టర్ బి.వి.రమణమూర్తి,డాక్టర్ కస్తూరి హనుమంతరావు, డాక్టర్ పైడిపాల, డాక్టర్ మంతెన సూర్యనారాయణ తదితరులు అక్కడ  మాకు పాఠాలు చెప్పేవారు. ఇంచుమించు అందరూ ప్రసిద్ధులైన కవులు, రచయితలు.వీరిలో డాక్టర్ ద్వా.నా.శాస్త్రిగారు విద్యార్థులను బాగా ప్రోత్సహించేవారు. కళాశాలలో ఒక మ్యాగజైన్ ప్రచురించేవారు. దానికి ఇంటర్మీడియట్, డిగ్రీల నుండి విద్యార్థులు కూడా సంపాదకులుగా  ఉండే వారు. వ్యాసరచన, వక్తృత్వ పోటీలు పెట్టి ఆ విద్యార్థి సంపాదకులను ఎంపికను చేసేవారు. నేను ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలోనే ఎడిటర్ గా సెలెక్ట్ అయ్యాను. దానితో డాక్టర్ ద్వారా శాస్త్రి గారు ఇతర అధ్యాపకులతో సన్నిహితంగా మెలగడానికి బాగా అవకాశం ఏర్పడింది. అప్పటినుండి నాకు సాహిత్యం పట్ల అభిరుచి కలిగింది. 

*రచనా వ్యాసంగం వైపు మీమనసు ఎప్పుడు మళ్లింది? అది ఎలా జరిగింది? దీని ద్వారా మీరు సాధించిన విజయాలు ఏమిటీ? అవి ఎలా సాధ్యమయ్యాయి ?

దార్ల: నేను ఉన్నత పాఠశాలలో ఉన్నప్పుడే మా సోషల్ టీచర్ ప్రోత్సాహంతో చిన్న చిన్న కవితలు, జోకులు, స్థానిక సమస్యల గురించి రాస్తుండేవాడిని. ఆయన ప్రతిరోజు వార్తాపత్రికలు చదివించి దానిలోని ముఖ్యాంశాలను బ్లాక్ బోర్డుపై రాయించేవారు. అలా పత్రికలు చదవడం, దాన్లో మనం ఎందుకు రాయకూడదనిపించడంతో నా సాహిత్య రచన మొదలైంది. 

*తెలుగు సాహిత్యంలో అనేక ప్రక్రియలు వున్నాయికదా ! అందులో మీరు  ఏ ప్రక్రియ  అంటే ఎక్కువ మక్కువ చూపుతారు ? ఎందుచేత

దార్ల: అన్ని ప్రక్రియలు ఇష్టమే. కానీ, కవిత్వం అంటే బాగా ఇష్టపడతాను. జ్ఞానపరంగా చూసినప్పుడు వ్యాసాన్ని అత్యధికంగా చదువుతాను, ఇష్టపడతాను. కవిత్వం అనేది హృదయానుభూతికి సంబంధించింది. నిజమైన కవిత్వం సాధారణీకరించబడి సార్వకాలికంగా ఉంటుంది. మనసును కదిలిస్తుంది. ఒక తీయని బాధనేదో అందిస్తుంది. అది పాఠకుడికి  తన కోసమే రాశారేమోనని అనిపించేటట్లు ఉంటుంది. పదేపదే చదివినప్పుడు కొత్త అర్థాలు స్ఫురించేటట్లు ఉంటుంది. అటువంటి కవితకు మరణం లేదు. అందువల్ల కవిత్వం అంటే ఇష్టపడతాను. కానీ, జ్ఞానదృష్ణతో చూస్తే మాత్రం, వ్యాసానికి ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. జ్ఞానం అందరికీ చేరడానికి ఉన్న ఏకైక మార్గం వచనం, వ్యాసం. ఆ వ్యాసంలో ఒక భాగమే సాహిత్య విమర్శ. అది సాహిత్యాన్ని సరైన దారిలో పయనించేటట్లు చేస్తుంది. అందువల్ల సాహిత్య విమర్శ అంటే కూడా నాకు ఇష్టమైన ప్రక్రియ. 

* తెలుగు సాహిత్యంలో ‘విమర్శ’ ఒక ప్రత్యేకత సంతరించుకున్న అంశం. మీ దృష్టిలో విమర్శ అంటే ఎలావుండాలి? ప్రస్తుత పరిస్థితులలో మీరు ఊహించిన స్థాయిలో విమర్శ ఉందని మీరు భావిస్తున్నారా ?ఎందుచేత ?

 దార్ల: తొలి దశలో అలంకార శాస్త్రాలు కావ్యం ఎలా ఉండాలో, రచన ఎలా ఉండాలో లేదా సాహిత్యం ఎలా ఉండాలో కొన్ని భావనలు సిద్ధాంతాలతో  చెప్పాయి. తర్వాత కాలంలో సాహిత్య ప్రయోజనం గురించి విస్తృతంగా ఆలోచించడం మొదలుపెట్టారు. కాలమాన పరిస్థితులను బట్టి, ఆ సమాజ ఆచార సంప్రదాయాలను బట్టి సాహిత్యం అనేది వెలువడుతూ ఉంటుంది. సాహిత్య విమర్శ అనేది ఒక బాధ్యతతో కూడిన పని. మన శరీరాన్ని బాగు చేయడానికి వైద్యుడు ఎటువంటి పాత్రను నిర్వహిస్తాడో, సాహిత్యాన్ని సరియైన మార్గంలో పెట్టడానికి విమర్శకుడు కూడా అటువంటి పాత్రనే నిర్వహిస్తాడు. పండితుడొ, సహృదయుడైనవాడు మాత్రమే విమర్శను సరైన రీతిలో నడిపించగలుగుతాడు. 

నా దృష్టిలో కూడా విమర్శ అనేది కేవలం ప్రశంసా కాదు, అలాగని ఆ రచన చేసిన కవి లేదా రచయితను మరలా కలం పట్టకుండా దూషించడమూ కాదు. ఆ రచన వెలువడిన కాలాన్నీ, ఆ పరిస్థితులనూ దృష్టిలో పెట్టుకుని, ఆ రచనకు ఉన్న అస్తిత్వాన్ని సరియైన స్థితిలో అంచనా వేయగలగాలి. అటువంటి సహృదయ సాహిత్య విమర్శకులు మన తెలుగు సాహిత్యంలో ఉన్నారు. ఒక సమీక్షో, ఒక సుదీర్ఘమైన వ్యాసమో రాసినంత మాత్రాన ప్రతీ వాళ్ళనీ విమర్శకులు అని అనలేం. తాను ప్రతిపాదించిన ప్రకటన రాగద్వేషాలకు అతీతంగాను, రచన కేంద్రంగానూ, ఆ సమాజ కేంద్రం గానూ మాత్రమే దృష్టిలో పెట్టుకొని నిస్పాక్షకంగా సహృదయదృష్టితో విశ్లేషణ చేయగలిగితే అది ఉత్తమ విమర్శ అవుతుంది.

*సుదీర్ఘ కాలం పాటు విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా సాహిత్య విమర్శను బోధిస్తున్నారు. మరొకవైపు సాహిత్య విమర్శకు సంబంధించిన రచనలు చేస్తున్నారు కదా. ఈ పరిస్థితుల్లో మీరు గమనించిన తెలుగు సాహిత్య విమర్శ తీరుతెన్నుల గురించి వివరిస్తారా?

దార్ల: తెలుగులో సాహిత్య విమర్శ విస్తృతంగానే వస్తుంది. అయితే విమర్శ కంటే సాహిత్య ప్రశంసే అధికంగా వస్తుంది. 

*సాహిత్య విమర్శలో ప్రశంసే అధికంగా ఉండడానికి కారణం ఏమయ్యుంటుంది?

దార్ల: సాహిత్య విమర్శలో రెండు రకాల సాహితీవేత్తలు కనిపిస్తుంటారు. సృజన సాహిత్యాన్ని చదివి, శాస్త్ర విషయాలను అనువర్తిస్తూ సాహితీ విలువలు నిర్ణయించే విమర్శకులు ఒకరకం. తాము సృజన సాహిత్యాన్ని రాస్తూనే, దానితో పాటు తమ మిత్రులకు సంబంధించిన రచనలపై విమర్శ వ్యాసాలు రాస్తుంటారు. ఇది రెండవ రకం సాహిత్య విమర్శ. మొదటి దానిలో కొంత కాఠిన్యం,రెండవ దానిలో కొంత మృదుత్వం ఉండే అవకాశం ఉంది. మృదుత్వం వల్ల ప్రశంస అధికంగా కనిపిస్తుంది. అయితే రెండింట్లోనూ ఒకటి విస్మరించకూడదు. అదే సహృదయత. ఒక దానిలో సహృదయత కొంత లోపిస్తుంది మరొక దానిలో సహృదయత మోతాదు మించిపోతుంది.

చాలామంది సృజనకారులు సాహిత్య విమర్శను ఆహ్వానించలేరు. తాము రాసినటువంటి అంశాలను విమర్శకుడు సరిగ్గా పట్టించుకోలేదని అభిప్రాయపడుతుంటారు. తాము రాసిన లక్ష్యాన్ని కూడా గుర్తించకుండా తమ ఇష్టం వచ్చినట్లు సిద్ధాంతాలు చేస్తున్నారని కూడా బాధపడుతుంటారు. తన రచన ఆశయం, లక్ష్యం కూడా ఆ విమర్శకునికి అర్థం కాలేదని కూడా వాపోతుంటారు.


*వేదికల మీద తెలుగు సాహిత్యం గురించి ఉపన్యసించే కొందరు పెద్దలు ఎప్పటికీ పాత తరం రచయితలను, వారి రచనలను మాత్రమే ఉటంకిస్తుంటారు. అంటే ఆధునిక రచయితల నుండి అసలు మంచి సాహిత్యం రాలేదని వారి ఉద్దేశ్యమా? వివరించండి. 

దార్ల: సుమారు 1500 సంవత్సరాల సాహిత్య చరిత్ర గల  ఆ వారసత్వాన్ని ప్రస్తావించుకోవడంగా ఒక రకంగా వారిని చెప్పుకోవచ్చు. మరొక కోణంలో కొంతమందికి మీరు అన్నట్లుగానే ఆధునిక సాహిత్యాన్నీ,ఆధునిక సాహితీవేత్తలను గుర్తించలేని సహజసిద్ధమైన స్వభావం ఉండొచ్చు. అభ్యుదయ, విప్లవ, స్త్రీవాద, దళిత, మైనారిటీ సాహిత్య ఉద్యమాలను అభిమానించే పెద్దలు ఎవరైనా ప్రాచీన కవులను ప్రస్తావిస్తే అది సాధారణంగా తమ భావజాలానికి వ్యతిరేకంగా ఉందని చెప్పే సందర్భం కావచ్చు. కానీ, కొంతమంది సంప్రదాయ సాహితీవేత్తలు మాత్రం మీరన్నట్లుగానే ‘గతకాలము మేలు, వచ్చు కాలముకంటెన్’ అరే రీతిలోనే వ్యవహరిస్తుంటారు. 

* విశ్వవిద్యాలయాల్లో ముఖ్యంగా తెలుగు సాహిత్య పరిశోధనలకు సంబంధించి అన్నీ మూసపరిశోధనలు జరుగుతున్నాయనే అభియోగం వుంది. దీనిపై మీ స్పందన తెలియజేయండి . 

దార్ల: విశ్వవిద్యాలయాల నుంచి వచ్చే పరిశోధనల గురించి విశ్వవిద్యాలయంలో పనిచేయని వాళ్ళు విమర్శించడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. పరిశోధన అనగానే కొన్ని పద్ధతులు పాటించాలి. ఏదైనా ఒక విషయాన్ని ప్రతిపాదించాలన్నా, సిద్ధాంతీకరించాలన్నా, నూతన సమన్వయం చేయాలన్నా, తప్పనిసరిగా కొన్ని పద్ధతులను పాటించాలి. మానవులంతా నిర్మాణం రీత్యా చూడ్డానికి ఒకేలా కనిపిస్తుంటారు.  కానీ, వాళ్ళ స్వభావాలు భిన్నంగా ఉంటాయి; వాళ్ళ ఆలోచనలు భిన్నంగా ఉంటాయి; వాళ్ల స్పందనలు భిన్నంగా ఉంటాయి. మానవులంతా నిర్మాణ రీత్యా ఒకే విధంగా మూసగా ఉన్నారని మరొక లాగా ఉండాలని కోరుకుంటారా? వాళ్ళ ఆలోచనలు ఒకే మూసలో ఉండవు. అలాగే, సాహిత్య పరిశోధనల్లో కొన్ని పాటించవలసిన పరిశోధన పద్ధతుల రీత్యా కొన్ని పరిశోధనలు ఒకేలా కనిపించవచ్చు. కానీ, ఫలితంశాలు భిన్నంగా ఉంటాయి. ఇటువంటి సమస్యలు క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ అనే రెండు మెథడ్స్ లోనూ కనిపిస్తాయి. 

*విశ్వవిద్యాలయాల్లో  భాషకు సంబంధించి        ‘అనువాద ప్రక్రియ’ అనే అంశానికి (సాహిత్యం ఒక భాష నుండి మరోభాష లోకి అనువదించడం) ఎంతవరకూ న్యాయం జరుగుతున్నది ? ఏమి చేస్తే మరింత మెరుగైన ప్రగతిని ఇందులో సాధించే అవకాశం వుంది ?

దార్ల: విశ్వవిద్యాలయాలు అనువాదం చేయడం ఎలాగ అనేది నేర్పిస్తుంది. కానీ అనువాదం చేయించడం విశ్వవిద్యాలయాలే చేసే పని అని నేను అనుకోవట్లేదు. అయినప్పటికీ కొన్ని విశ్వవిద్యాలయాలలో అనువాదం చేస్తున్నారు. కానీ అనువాదం చేసిన తర్వాత అనువాదంలో వచ్చే సమస్యలు అధ్యయనం చేస్తారు. అనువాదాన్ని సులభతరం తీసే మార్గాలను అన్వేషిస్తారు. ప్రపంచంలో ఉన్న అన్ని భాషలను ఒక భాషనుండి మరొక భాష లోకి అనువదించడం అనేది ఏ విశ్వవిద్యాలయం ఏ సంస్థా కూడా నూటికి నూరు శాతం చేయలేదు. అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ అనువాదానికి సంబంధించిన విభాగాలు ఏర్పడాలి. ఆ రంగంలో నిష్ణాతులను అధ్యాపకులుగా నియమించాలి. నిజానికి అనువాదానికి సంబంధించి భారత ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన సంస్థనే ఏర్పాటు చేసింది. దాని పేరు నేషనల్ ట్రాన్సలేషన్ మిషన్. వీటితో పాటు ప్రభుత్వం అనువాద రంగానికి సంబంధించి రకరకాలైన సంస్థల ద్వారా ప్రోత్సాహకాన్ని అందిస్తుంది. వాటిని వినియోగించుకోవాలి. అన్నీ విశ్వవిద్యాలయాలే చేయాలని అనుకోకూడదు. మనం గమనించాల్సిందేమిటంటే సృజనాత్మక సాహిత్యం వచ్చినంత వేగంగా అనువాదం చేయలేం. మిషన్ ట్రాన్స్లేషన్ లో కూడా దీని గురించి విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నారు. అయినా పలుకుబడులు, జాతీయాలు, మాండలికాలను అది సమర్థవంతంగా అనువాదం చేయలేకపోతోంది. ఇప్పుడు మనకి అందుబాటులోకి వస్తున్న కృత్రిమ మేధ (AI)  కూడా పని చేయలేదు. అందువల్ల విశ్వవిద్యాలయాలు ఆ రంగంలో నిష్ణాతుల్ని తయారు చేయడం, శాస్త్ర సాంకేతికతను రూపొందించడం వంటివాటిని చేస్తాయి. 


* ‘పాలేరు’ అనే నాటకం, ‘కొల్లాయి గట్టితేనేమి?’  అనే నవల  మీ దృష్టిలోకి వచ్చేవుంటాయి. వీటిలో మీకు నచ్చిన రచన ఏది ?ఎందుచేత ?

దార్ల: రెండు రచనలు కూడా గొప్పవే. అయితే బోయి భీమన్నగారి ‘పాలేరు’ నాటకం దళితుల జీవితాన్ని ఎంతో చైతన్యవంతంగా చిత్రించింది. మహీధర రామ్మోహనరావు గారి ‘కొల్లాయిగట్టితేనేమి?’ జాతీయోద్యమాన్ని చిత్రిస్తూనే తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఉద్యమాలను కేంద్రీకరిస్తుంది. రెండు రచనలూ కోనసీమ ప్రాంతం నుండి వచ్చినవే. సహజంగానే మన జీవితం ఏ రచనలో కనిపిస్తుందో ఆ రచన మనకు అత్యంత ఆత్మీయమవుతుంది. ఆ విధంగా నాకు పాలేరు నాటకం నేటికీ నచ్చుతుంది. 

* కవిత్వంలో, పద్య రచనకు ప్రాధాన్యత తగ్గిపోతున్న భావన కొందరు పెద్దలు వెలిబుస్తుంటారు. దీని గురించి వివరంగా స్పందించండి.

దార్లః  ఛందోబద్ధమైన పద్యరచనకు ప్రాధాన్యం తగ్గిపోతున్నమాట నిజమే. కాలానుగుణమైన మార్పుల్లో కవిత్వ రూపంలో కూడా అనేక మార్పులు వస్తుంటాయి. పద్యరచనను తరువాత తరం వాళ్లకి అందించవలసిన బాధ్యత కూడా ఆ పెద్దలకే ఉంది. మరి నిజంగా అది వాళ్ళు ఎందుకు చేయలేదు? నేటికీ ఛందోబద్ధమైన పద్యాన్ని కొంతమంది తమ సొత్తుగానే భావిస్తుంటారు. ఒక వెయ్యి సంవత్సరాల సాహిత్యం అంతా కూడా పద్యంలోనే కొనసాగింది. ఆ పద్య సాహిత్యంలో అందించిన భావజాలాన్ని మనం చూడాలి. నేటికీ మా తెలుగు వాళ్ళ వారసత్వ సంపద అని మురిసిపోతూ పద్యాన్ని రాస్తుంటే, దాన్ని ఆ వర్గం వాళ్లు ప్రోత్సహించే పరిస్థితి లేదు. ప్రజలకు అవసరమైన సాహిత్యం నిలబడుతుంది. ప్రజలు ఆదరించిన ప్రక్రియ నిలబడుతుంది. ప్రజలకు అవసరమైన కవితా రూపం నిలబడుతుంది. ఛందోబద్ధమైన పద్యం పరిస్థితి కూడా ఈ పరీక్షలను ఎదుర్కోవాల్సిందే. 

* తెలుగు సాహిత్యం ఇప్పుడు కులాలవారీగా, మతాలవారీగా, ప్రాంతాలవారీగా, విడిపోతున్న విషయం మీకు తెలిసిందే! దీనిని మీరు ఎలా పరిగణిస్తారు ?

దార్ల: నిజానికి మన తెలుగు సాహిత్యం కొన్ని వందల సంవత్సరాల పాటు కొన్ని కులాలను కేంద్రంగా చేసుకొని వచ్చింది. మరికొన్ని కులాల చేత సేవ చేయించుకోవడం ఎలాగో నేర్పడం కోసం వచ్చింది. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే సాహిత్యం ప్రజాస్వామ్యీకరించబడుతుంది. ఇప్పుడు తెలుగు సాహిత్యం అధిపత్యాలను బద్ధలు చేస్తుంది. దీన్ని తట్టుకోలేని వారు సాహిత్యం పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ కులాలు, మతాలు, ప్రాంతాల వారీగా విడిపోతుందని తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే, అదే సందర్భంలో తెలుగు సాహితీవేత్తలు గుర్తించవలసిందొకటి ఉంది. తమ కులం, తమ మతం, తమ ప్రాంతం వంటి వాటి గొప్పతనాన్ని దానిలో కలిగే కష్టనష్టాలను వివరించుకుంటే ఎవరికీ ఇబ్బంది ఉండదు. ఇతరులను ద్వేషించడం కోసమే ఈ సాహిత్యం ఉత్పత్తి అవుతుంటే మాత్రం, దాన్ని సహించలేని పరిస్థితి ఏర్పడుతుంది. సాహిత్యంలో సాధారణీకరించడం, వైయక్తికంగా లక్ష్యం చేసుకొని రాయడం అనే రెండు మార్గాలు ఉంటాయి. వీటిలో సాధారణీకరించుకోవడం ఉత్తమ సాహిత్యానికి బాటలు వేస్తుంది. 

*మీ రచనల గురించి అందులో మీకు చాలా ఇష్టమైన రచన గురించి వివరంగా చెప్పండి.


దార్ల: దళిత తాత్వికుడు,  నెమలి కన్నులు పేరుతో రెండు వచన కవితా సంపుటుల్ని తీసుకొచ్చాను. ఆ తర్వాత అధ్యాపనంలో భాగంగా పరిశోధన, వ్యాసాలు విమర్శ వ్యాసాలపై దృష్టి పెట్టాను. సృజనాత్మక రచనలు చేయడం ఎలా? వీచిక, పునర్మూల్యాంకనం, బహుజన సాహిత్య దృక్పథం, దళిత సాహిత్యం - మాదిగ దృక్పథం, సాహితీసౌగంధి, ఒక మాదిగ స్మృతి (నాగప్ప గారి సుందర్రాజు పరిచయం) మొదలైన వ్యాస సంపుటాలను ప్రచురించాను. వివిధ ప్రత్యేక సంచికలు దిన, వార,మాస, త్రైమాసిక పత్రికలలోనూ కవితలు వ్యాసాలు రాసాను. వీటితోపాటు ఛందోబద్ధంగా ‘దార్ల మాట శతకం’ కూడా రాశాను. ఇంచుమించు అన్ని ప్రముఖ పత్రికల్లోనూ నా కవితలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. యుజిసి కేర్ జర్నల్స్ లోను, పరిశోధన, విమర్శ పత్రికలు, ప్రత్యేక సంచికలలోనూ నా వ్యాసాలు వచ్చాయి.  నావన్నీ నాకు ఇష్టమైనవే. అయినప్పటికీ కవిత్వంలో నెమలి కన్నులు, వ్యాసాలలో వీచిక, బహుజన సాహిత్య దృక్పథం నాకు బాగా నచ్చిన రచనలు. వీటన్నింటితో పాటు ఆత్మకథను ‘నెమలి కన్నులు’ పేరుతో వచనలోనే రాసినప్పటికీ, వచనం + వచన కవితాత్మకంగా ఉండేట్లు కొనసాగించాను. ఇది తొలి భాగం. నాకు ఎంతగానో సంతృప్తి కలిగించిన రచన. 

*కవితల సంపుటికీ, ఆత్మకథకు ‘నెమలికన్నులు’ అని ఒకే పేరెందుకు పెట్టారు? 

దార్ల: రెండు పుస్తకాలలోనూ నా వ్యక్తిగతమైన జీవితానికి సంబంధించిన జ్ఞాపకాలు ఉన్నాయి. నా వయసులో ఉన్న వాళ్ళ అనుభూతులు ఉన్నాయి.  నాకు తెలిసినంతవరకు సాహిత్యంలో చాలామంది తమ పుస్తకాలకు వేరువేరు పేర్లు పెడతారు. కానీ, రెండు పుస్తకాలకు ఒకే పేరు పెట్టరనుకుంటాను. అందుకని కావాలనే నేను ఆ పేరు పెట్టాను. 

*మీరు తెలుగు అధ్యాపకుడిగా చేరిన తర్వాత నుండి నేటి వరకు పాఠ్యంశాలలో అనేక మార్పులు గమనించి ఉంటారు. మీరు ఏమైనా నూతన పాఠ్యప్రణాళికను రూపొందించారా?

దార్ల: నేను డాక్టరేట్ చేస్తూ ఉన్నప్పుడే ప్రభుత్వ జూనియర్ కళాశాల,  ప్రభుత్వ ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా  ఎంపికయ్యాను. ఆ తర్వాత నా డాక్టరేట్ పూర్తయ్యిన వెంటనే  హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం వచ్చింది. డిగ్రీ వరకు ఉండే సిలబస్ ని ఇంచుమించు ఆ వయస్సును బట్టి రాష్ట్రస్థాయిలో నిపుణులైన బృందం వారు పాఠ్యాంశాలను నిర్ణయిస్తుంటారు. అప్పుడు కొత్త పాఠ్యాంశాల రూపకల్పనకు పెద్దగా అవకాశం ఉండదు. కానీ, విశ్వవిద్యాలయాల స్థాయికి వచ్చేసరికి  విశ్వవిద్యాలయాల్లో సమాజ అవసరాలను బట్టి కొత్త కొత్త పాఠ్య ప్రణాళికను రూపొందించుకునే అవకాశం ఉంది. నిజంగా నేను దళిత సాహిత్యం,  సృజనాత్మక సాహిత్యం, డయాస్పోరా సాహిత్యం వంటి వాటిని రూపొందించాను. జాతీయ విద్యా విధానం (NEP-2020) రాకముందే పీజీ స్థాయిలో విద్యార్థికి  పరిశోధన పట్ల అవగాహన కలగాలనే ఉద్దేశం Techniques of Writing a Dissertation/Thesis అనే కోర్స్ ని రూపొందించాను. ఇప్పుడు జాతీయ విద్యా విధానంలో అందరికీ పరిశోధన పట్ల అవగాహన ఉండాలని దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలల్లోను అటువంటి సబ్జెక్ట్ ని కంపల్సరీ చేశారు. 

* మీ సాహిత్య జీవితంలో మీరు అందుకున్న అవార్డులు, సన్మానాల గురించి చెప్పండి. 

దార్ల: ఆంధ్రవిశ్వవిద్యాలయం పరిధిలో గల అన్ని కళాశాలలో బి.ఏ., స్పెషల్‌ తెలుగు ఫస్ట్‌ర్యాంకు సాధించిన వారికిచ్చే కళాప్రపూర్ణ జయంతి రామయ్య పంతులు స్మారక బహుమతిని, కందుకూరి వీరేశలింగం-శ్రీమతి రాజ్యలక్ష్మి స్మారక బహుమతుల్ని అందుకున్నాను. వీటితో పాటు శ్రీ కోనసీమ భానోజీరామర్స్‌ కళాశాల వారు బి.ఏ.స్పెషల్ తెలుగులో కాలేజీ ఫస్ట్‌ వారికిచ్చే నండూరి వేంకటరామయ్య, కుటుంబలక్ష్మి స్మారక బహుమతుల్ని సాధించాను. ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో భారతీయ సాహిత్య పరిషత్, రాజమండ్రి సభల సందర్భంగా వ్యాస రచనలో  ప్రథమ బహుమతిని సాధించాను. ఒక సాహితీవేత్తగా సాహిత్య విమర్శకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ‘కీర్తి’ పురస్కారం అందుకున్నాను. మా యూనివర్సిటీలో నలభై సంవత్సరాలు నిండని అధ్యాపకులకు వారి బోధన, పరిశోధన, రచనలను పరిశీలించి పరిశోధన చేసుకోవడానికి ఒక లక్ష రూపాయల ప్రత్యేక గ్రాంట్ తో కూడిన ఛాన్సలర్ అవార్డు అని ఏడాదికి మొత్తం యూనివర్సిటీలో ఒక ఐదుగురికి ఛాన్సలర్ అవార్డు అని ఇస్తారు. ఆ అవార్డుని నేను పొందాను. భారతీయ సాహిత్య అకాడమీ, న్యూఢిల్లీ వారి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్  నేషనల్ ఫెలోషిప్ తో పాటు, దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి జాతీయ పురస్కారం, గుర్రం జాషువా పురస్కారాలను అందుకున్నాను. వీటన్నింటికంటే నేను ఎం. ఏ., పాఠాలు వింటున్నప్పుడే నా కవితల గురించి మా తరగతి గదిలో మా ప్రొఫెసర్స్  చెప్పడం అన్ని అవార్డులు కంటే మించిన గొప్ప పురస్కారం. నిజానికి అది ప్రోత్సాహకరంగా చెప్పిన మాటలే కూడా కావచ్చు. కానీ, అలా ప్రస్తావించటం సామాన్యమైన విషయం కాదు. నా రచనలు వివిధ విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా, రిఫరెన్స్ బుక్స్ గా ఉండడం కూడా నాకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తాను. ఒకప్పుడు బహూమతులు, పురస్కారాల కోసం ఎదురుచూసే నేను, ఇప్పుడు అనేక సందర్భాల్లో ఒక న్యాయనిర్ణేతగా ఉండే స్థాయికి రావడం అన్నింటికంటే గొప్ప గౌరవం. తీసుకోవడమే కాదు,  మా నాన్నగారు శ్రీ దార్ల లంకయ్యను మా గ్రామస్థులంతా ‘అబ్బాయి’ అని ప్రేమతో పిలిచేవారు. అందువల్ల శ్రీ దార్ల అబ్బాయి మెమోరియల్ గోల్డ్ మెడల్ పేరుతో మా యూనివర్సిటీ తెలుగు శాఖలో ఒక గోల్డ్ మెడల్ ఏర్పాటు చేశాను. అది నాకు ఇష్టమైన భారతీయ అలంకార శాస్త్రం,  సాహిత్య విమర్శలో అత్యధిక మార్కులు వచ్చిన వారికి యూనివర్సిటీ వాళ్ళే అధికారికంగా ఇచ్చేటట్లు ఏర్పాటు చేశాను. యూనివర్సిటీతోపాటు మా తమ్ముడు డా. రవికుమార్, మా చెల్లి విజయకుమారి చదువుకున్న పాఠశాలలో  కూడా మా నాన్న గారి పేరుతో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందిస్తున్నాం. ఇంకా మరికొన్నిచోట్ల కూడా మా నాన్న గారి పేరుతో బహుమతులు అందజేస్తున్నాం.


*కొత్తతరం రచయితలకు / కవులకు, రచనా వ్యాసంగానికి సంబంధించి ఎలాంటి సూచనలు చేస్తారు ?

దార్ల:  ఆత్మీయతాముద్రతో సాధారణీకరించి మంచి రచనలను చేయాలంటే సమకాలీన సాహిత్యాన్ని బాగా చదవాలి. ఇప్పుడు విస్తృతంగా సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి రావడం వల్ల, తామేమి  రాసినా, దాన్ని వెంటనే  పోస్ట్ చేస్తున్నారు. కొంతమంది తమ రాసుకున్న దాన్ని ఒకసారి చదివి పోస్ట్ చేసుకుందామని ఆలోచన కూడా లేదు. పాఠకులకు పంపించే ముందు రచనను ఒకటికి రెండుసార్లు  బాగా చదివి, సరి చేసుకోవాలి.  భిన్న భావిజాలాలు ఉన్నప్పటికీ ప్రాచీన, ఆధునిక సాహిత్యాలు రెండింటినీ లోతుగా అధ్యయనం చేయాలి. అన్ని ప్రక్రియలను రాసే ప్రయత్నం చేయాలి. కానీ, తనకు ఏ ప్రక్రియ బాగా అలవడుతుందో దానిలోని ఎక్కువ రచనలు చేయడం మంచిది. పాఠకులకు ఒక భావాన్ని చెప్పాలనుకున్నప్పుడు అది తన హృదయంలో నుండి సృజనాత్మకం కావాలి. ఆ మౌలికతతో పాటు భావుకత అత్యంత ముఖ్యం. ఏవో కొన్ని ఛమత్కారాలతో చేసే భాషా విన్యాసాలు ఎంతో కాలం ఆదరణకు నోచుకోవు. అలాగే, పత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో తమ పేరుని పదేపదే చూసుకోవాలనే యావను తగ్గించుకోవాలి. తాను చెప్పేది చదవడం కోసం పాఠకులు ఎదురు చూడాలి. ఈ మధ్యకాలంలో ఒకటి రెండు రచనలు చేసిన వెంటనే సన్మానాలు, సత్కారాలు, పురస్కారాల కోసం వెంపర్లాడుతున్నారు. వెంటనే పాఠ్యాంశాల్లో చేరిపోవాలనుకుంటున్నారు. యువకుల్ని ప్రోత్సహించాలని కొన్ని ఏవో కొన్ని పురస్కారాలు ఇస్తుంటారు. వాటిని అందుకున్న తర్వాత మరింత బాధ్యతగా రచనలను చేయాలి. అయినా, ఎవరు ఎన్ని చెప్పినా అనుభవాన్ని మించిన పాఠం లేదు. రచనలు చేసే ప్రతి ఒక్కరూ తొలి దశలో ఒక కెరటంలా ఎగిసి పడటం సహజం. మహాసముద్రం అయ్యేనాటికే ఆ ప్రశాంతత వస్తుంది. 

నా అభిప్రాయాలను తెలియజేయడానికి ఒక అవకాశం ఇచ్చినందుకు మీకూ, పత్రిక యాజమాన్యం వారికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 

                                        ***



కామెంట్‌లు లేవు: