విశాలభారతి దినపత్రిక, 10.8.2024 సౌజన్యంతో
పీడిత వర్గ చైతన్యం, దళిత్ ఈస్తటిక్స్, బహుజన దృక్పథం, సామాజిక ఉద్యమ తాత్వికత నిండిన కవిత్వం కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత పల్లిపట్టు నాగరాజు రచించిన ‘యాలై పూడ్సింది’ కవితా సంపుటిలో ఉందని హెచ్ సి యు తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాలల విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ‘టాక్ ఆఫ్ ది బుక్’ కార్యక్రమంలో శుక్రవారం మధ్యాహ్నం హెచ్ సియు నుండి అంతర్జాలం ద్వారా ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ప్రత్యేక ప్రసంగం చేశారు. ఈ ప్రసంగం ఆ రాష్ట్రంలోని అన్ని డిగ్రీ కళాశాలలోనూ విద్యార్థులకు ప్రత్యక్ష ప్రసారం చేశారు. విద్యార్థులలో సృజనాత్మక శక్తి, సమకాలీన సాహిత్యం పట్ల అనురక్తి పెంపొందించడానికి ‘టాక్ ది బుక్’ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని దార్ల వెంకటేశ్వరరావు అన్నారు. ఏభై రెండు వచన కవితలతో వెలువడిన ఈ పుస్తకానికి 2022లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది, రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో జన్మించి, అత్యంత పేదరికం నుండి వచ్చిన నాగరాజు ఒకవైపు చదువుకుంటూనే తెలుగు ఉపాధ్యాయుడిగా ఎంపికై, పరిశోధన కూడా చేస్తూ, సామాజిక పరిస్థితుల పట్ల స్పందిస్తూ ఉత్తమ కవిత్వం రాసి ఎంతోమందికి ఆదర్శనీయంగా నిలిచాడని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వివరించారు. తన ప్రాంతానికి చెందిన భాషను అదే నేటివిటీతో కవిత్వం రాయడంతో పాటు వివిధ సామాజిక వృత్తులను గౌరవించాలనే దృక్పథంతో ఇంచుమించు అన్ని వృత్తుల వారి గురించి కవిత్వం రాసాడని వాటిని సోదాహరణంగా ఆచార్యదార్ల వివరించారు. ఈ కవిత్వాన్ని చదవడం ద్వారా మన చుట్టూ ఉండే మనుషుల మధ్య ప్రేమాభిమానాలు పెరగడంతో పాటు అన్ని వృత్తుల వారి పట్ల గౌరవం పెంపొందుతుందని, అంతేకాకుండా పుట్టిన ఊరు, గ్రామం, ఆ పరిసరాలను ప్రేమించడం, దానితో గల ఆత్మీయతలు ప్రతిఒక్కరికీ తెలుస్తాయని అటువంటి కవితలు రాసిన కవి నాగరాజుని ఆచార్య దార్ల అభినందించారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి, అకాడమిక్ అధికారి, శ్రీమ్యాత్యూ శ్రీరంగం వ్యవహరించారు.
నమస్తే న్యూస్ దినపత్రిక, 10.8.2024 సౌజన్యంతో
తెలుగులోకం దినపత్రిక, 10.8.2024 సౌజన్యంతో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి