మా డిపార్ట్మెంట్ లో పిహెచ్.డి. పరిశోధన చేస్తున్న బట్టు విజయకుమార్ తాజాగా సింగిడి పువ్వు మినీ కవితాసంపుటిని ప్రచురించుకున్నానని 31.10.2023 వ తేదీనసంతోషంగా నాకు తెచ్చి ఇస్తున్న దృశ్యం. చిత్రంలోఆచార్య పిల్లలమర్రి రాములు గారు కూడా ఉన్నారు.
శుభాకాంక్షలు మిత్రమా...
........
( ఈ పుస్తకానికి నేను రాసిన అభిప్రాయం)
సాహితీ లోకానికి స్వాగతం
మా విద్యార్థి మిత్రుడు బట్టు విజయ్ కుమార్ మంచి భావుకత ఉన్న పద్యకవి. ఛందోబద్ధమైన పద్యాలతో పాటు వచకకవిత్వం కూడా రాస్తుంటాడు. ఈమధ్య సింగిడి పువ్వు (బాలచక్రి పదాలు) పేరుతో ఆరుద్ర కూనలమ్మ పదాలాంటి మినీ కవితా రూపాలతో ఒక పుస్తకం తీసుకొస్తున్నాడు.
బాల చక్రి పదాల్లో నాలుగు పాదాలు ఉండడం, వాటిలో చివరి పాదం మకుటం 'ఓ బాలచక్రి ' మిగతా పై మూడు పాదాల్లో మొదటి దాంట్లో ఒక అంశాన్ని ప్రతిపాదించి దాన్ని చమత్కారంతో ముగించటం మిగతా రెండు పాదాల్లోనూ ఉండే అభివ్యక్తి విశేషం. దీంతోపాటు ఈ బాలచక్రి పదాలలో మూడు పాదాలు సాధ్యమైనంతవరకు అంత్యాను ప్రాసతో ముగిస్తాడు.
మనం నిత్యం వాడుకునే సెల్ ఫోన్ గురించి చమత్కారంగా ఎలా చెప్పాడో చూడండి. ''చెవికి సోకిన సెల్లు
జేబు కాయను చిల్లు
బిల్లు చూచిన ఝల్లు
ఓ బాల చక్రి''
ఇలా కొన్ని సరదాగా చెప్పినవి ఉన్నాయి. మరికొన్ని సమాజంలోని వివిధ అంశాలకు సంబంధించినవి ఉన్నాయి. రైతుల గురించి వర్ణించిన కొన్ని బాలచక్రి పదాలు భారతదేశంలో రైతుల స్థితిగతులను తెలియజేస్తున్నాయి.
''పారపెట్టిన వాడు
ఫలము కోరనివాడు
రైతు మహిమ మొనగాడు
ఓ బాల చక్రి''
''రైతు తడిపిన నేల
రాలు కన్నెల కన్నుల హేల
బతుకు పండిన వేళ
ఓ బాల చక్రి''
కొన్ని నీతిని చెప్పి పదాలు కూడా ఉన్నాయి. మన చుట్టూ ఎంతోమంది మనుషులు ఉంటారు. కానీ, అందరూ నిజమైన మనుషులేనా అని కొంతమందిని చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అలాగే, మన చుట్టూ అనేక వర్షపు చినుకులు కురుస్తూ ఉంటాయి. కానీ, అన్ని వర్షం చినుకులు ముత్యాలుగా మారవు. పగడంలో పడిన వర్షపు చినుకు మాత్రమే ముత్యమవుతుందని పెద్దలు చెపుతుంటారు. అలాగే, 'పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య' అన్నట్లు అందరూ మానవ సంబంధాలను పరిమళింప చేయలేరు. ఎవరైతే ఆ ప్రేమానురాగాల్ని కొనసాగించగలరో వాళ్లే ముత్యాల్లాంటి వారనే భావంతో ఒక చక్కని పదాన్ని వర్ణించాడు కవి.
''మంచి వాడను పేరు
మమత ముత్యపు పేరు
మనుషులందున వేరు
ఓ బాల చక్రి''
ఇది చిన్న పుస్తకమే కావచ్చు. చిన్ని చిన్ని పాదాలలో చెప్పే మినీ కవితా రూపాలే కావచ్చు. కానీ, విజయ్ లోని భావుకతను మన ముందుంచే చక్కని కవితా సంపుటి.
ఓకే ఇదే పద్ధతిలో తన కవిత్వ సాధనను కొనసాగిస్తే విజయ్ కుమార్ కి సాహితీ లోకంలో ఒక చక్కని గుర్తింపు లభిస్తుంది. అతనికి కవిగా గొప్ప భవిష్యత్తు ఉందని ఈ బాలచక్ర పదాలు వాగ్దానం చేస్తున్నాయి. మిత్రమా! నీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
మీ
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
తెలుగు శాఖ అధ్యక్షులు
స్కూల్ ఆఫ్ హ్యూమానిటిస్
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
హైదరాబాద్ -500 046
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి