*వారం వారం జాషువా సాహిత్యం-1*
గుర్రం జాషువా ‘ముంటాజ్ మహల్’ – కావ్య సౌందర్యం
-ఆచార్య
దార్ల వెంకటేశ్వరరావు,
తెలుగుశాఖ,
అధ్యక్షులు, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్,
యూనివర్సిటి
ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్-500 046
ప్రపంచంలోని ఏడు వింతలలో ఒక వింతగా ఆగ్రాలోని ముంతాజ్ మహల్ గురించి చెప్తారు. దీనిలోని మహా సౌందర్యమే ఇలా గొప్పగా చెప్పుకోవడానికి ప్రధాన
కారణం. మరలా అటువంటి తాజ్ మహల్ మరొకటి నిర్మించలేరని
దాని మాదిరి(replica)గానే వచ్చిన వాటిని చూసినప్పుడు అనిపిస్తుంది. ఔరంగాబాద్ లో కూడా
దీని రెప్లికా తాజ్ మహల్ ఉంది. అగ్రాలో ఉన్న ఒరిజినల్ తాజ్ మహల్ సౌందర్యం దానిలో కనిపించదు. కానీ, అంతే లేదా అంతకంటే ఎక్కువగా తాజ్ మహల్ సౌందర్యాన్ని
‘ముంటాజ్ మహల్’' పేరుతో 1943లో గుర్రం జాషువా 129 పద్యాలతో ఒక ఖండ కావ్యాన్ని వర్ణించారు.
ఈ పద్యాలతో పాటు కృతి శ్రీకర్తకు సంబంధించిన ఆణిముత్యాలు లాంటి మరికొన్ని పద్యాలు కూడా
ఈ కావ్యంలో ఉన్నాయి. దీనితో పాటు ‘తాజ్ మహల్’ పేరుతో జాషువా రచించిన కొన్ని పద్యాలు
విడిగా కూడా దొరుకుతున్నాయి. ముంటాజ్ మహల్ కావ్యాన్ని వర్ణించే ముందు కావ్యా నేపథ్యాన్ని,
అది రాయడానికి గల కారణాలను కవి ఒక 'భూమిక'ను వచనంలో వివరించారు.
షాజహాన్ తన భార్య ముంతాజ్ పేరుతో నిర్మించిన ముంతాజ్
మహల్ సమాధి ప్రపంచంలోనే ఒక గొప్ప కళాఖండమైతే, ఆ దంపతుల హృదయ స్పందనలను, దాంపత్యంలోని
అనురాగాన్ని వినిపించే గొప్ప రసభరిత కావ్యంగా
జాషువా ముంతాజ్ మహల్ కావ్యాన్ని వర్ణించారు. షాజహాన్ నిర్మించిన ముంతాజ్ మహల్
భవనం కదలకుండా అక్కడే ఉంటుంది. అక్కడకు వెళ్ళిన
వారికి మాత్రమే ఆనందాన్ని కలిస్తుంటే, మహాకవి జాషువా వర్ణించిన ముంతాజ్ మహల్ కావ్యం
మాత్రం ప్రతి ఒక్కరినీ ఆ వర్ణనలతో నిత్యం సౌందర్య భరితం చేయగలుగుతుంది. భారతదేశానికి
మరింత కీర్తితెచ్చిన వాటిలో ముంతాజుమహలు ఒకటి. దీన్ని దర్శించిన తర్వాత జాషువా తన అనుభూతిని
రంగరించి రాసిన కావ్యం. ఇది కేవలం షాజహాను-ముంతాజులు మధ్య ఉండే ప్రేమానురాగాలే కాదు,
ప్రతీ భార్యా భర్తా మధ్య ఉండవలసిన అనురాగబంధం తెలిసేలా వర్ణించాడు.
1632లో మొదలై 1653 నాటికి తాజమహల్ నిర్మాణం పూర్తయినట్లుగా
చెప్తారు. దీన్ని 1628 నుండి 1658 వరకు పరిపాలించిన 1631వ సంవత్సరంలో షాజహాన్ చక్రవర్తిగా
ఉన్న కాలంలో మొఘల్ సామ్రాజ్యం గొప్ప సంపదతో ఉండేది. ఆ సమయంలో షాజహాన్ మూడవ భార్య అయిన
ముంతాజ్ మహల్ వారి పధ్నాలుగో సంతానం గౌహరా బేగానికి జన్మనిస్తూ మరణించడంతో షాజహాన్
విచారంతో నిండి పోయాడు. చివరి దశలో ఉన్న ముంతాజ్,
షాజహాన్‌ను ప్రపంచంలో ఎవరూ ఇంతవరకు చూడని అత్యంత సుందరమైన సమాధిని తనకోసం నిర్మించమని
కోరింది. షాజహాన్ తన భార్య కోరిక సమ్మతించి ఆమె మరణించిన ఒక సంవత్సరం తరువాత 1632వ
సంవత్సరంలో తాజ్ మహల్ నిర్మాణాన్ని ప్రారంభించాడు. ఇది చరిత్ర చెబుతున్న విషయం.
జాషువాగారి ‘తాజ్ మహల్’ ఒక ఖండకావ్యం అనుకున్నాం
కదా. ‘ఖండకావ్యం అంటే ఒక చిన్న రస ఖండం. ఒక అమృత గుళిక, రసగుల్లా వంటిద’ని వైతాళికులులో
ముద్దుకృష్ణ అభిప్రాయపడ్డారు. ఈ కావ్యంలోని ప్రతి పద్యమూ అంతే రసగుళికల్లా ఉన్నాయి.
ఈ కావ్యాన్ని తిక్కవరపు రామిరెడ్డిగారి తల్లి శ్రీమతి లింగమాంబగారికి
అంకితం చేశారు జాషువ.
ఆ.వె.
నీవు బ్రతికియుండ నీవాంఛితార్థముల్
దీర్చుశక్తి లేక దిగులు వడితి
వేయి నగలకన్న వెలగల్గు కృతిభూష
నంపుచుంటి స్వీకరింపుమమ్మ! …అని కావ్యాన్ని అంకితం
ఇవ్వడంతో పాటు పరోక్షంగా తన కావ్యం గొప్పతనాన్ని కూడా గుర్రం జాషువా ఈ పద్యంలో తెలిపారు.
తన కృతికి మన సహాయం చేసి ప్రచురించిన కవి, విమర్శకుడు
తిక్కవరపు రామిరెడ్డిగార్ని సహృదయ సాహితీవేత్తగా, విమర్శకుడిగా అభివర్ణిస్తూనే ఆయనను
వేయి సంవత్సరాలు జీవించాలని కవి ఆశీర్వదించారు.
సీ.పలుకులోఁగలుగునిశ్చలతఁజేతలవి
నిర్ధారింపఁజాలు నాదర్శమూర్తి
విశ్వంబుమఱపించు నైశ్వర్యలక్ష్మి చే
విఱ్ఱవీఁగని క్షమావిస్తృతుండు
ఉన్నతోన్నతములై యుజ్వలించెడు
వినూతన భావసత్కళావనధిరాజు
గణనకెక్కిన కావ్య గుణదోషములను
విమర్శించు పాండితీ మండితుండు.
ఆ.వె. స్వీయ దేశహితవిశిష్టాశయంబులు
గలుగు స్వచ్ఛమైన తెలుఁగువాఁడు
దొడ్డగుణములున్న రెడ్డిజమీదారు
ప్రబలుగాత
వేయి వత్సరములు. ఈ పద్యంలో తిక్కవరపు రామిరెడ్డి గారి సాహితీ వ్యక్తిత్వంతో పాటు ఆయన
ఔదార్యం చక్కగా వర్ణితమైయ్యింది. అంకిత పద్యాలలో కవులు సర్వసాధారణంగా అతిశయోక్తులతో
వర్ణించటం సహజమే. కానీ, తిక్కవరపు రామిరెడ్డిగారు గొప్ప సాహితీవేత్త కూడా! ఆ విషయాలను
ఈ పద్యంలో జాషువా ఎంతో సహజంగా వర్ణించారు.
ముంటాజ్ మహల్ ఒక చారిత్రక కావ్యం:
జాషువా తనకు నచ్చిన కొన్ని చారిత్రక అంశాలను తీసుకొని
చిన్నచిన్న ఖండికలుగా రాసిన రచనలు కూడా ఉన్నాయి. వీరాబాయి అనే రూపకాన్నీ, చిన్ననాయుడు
అని నవలను, మరికొన్ని రచనలను చారిత్రకంగా రాసిన రచనలుగానే చెప్పుకోవచ్చు. శివాజీ అనే
పద్య కావ్యాన్ని కూడా జాషువా రచించారు. ఈ మార్గంలోనే ముంటాజ్ మహల్ అనే ఖండ కావ్యం వెలువడింది.
అయితే, చారిత్రక అంశాలను విస్మరించకుండానే కావ్యంలో రసాస్వాదనకు అనుగుణంగా కొన్ని కల్పనలు
చేయడం జాషువా చారిత్రక రచనల్లోని ఒక ప్రత్యేకత.
ముంతాజ్ మహల్ కావ్యాన్ని అయిదు రకాలుగా విశ్లేషించుకోవచ్చు.
1.షాజహాన్ ముంతాజి సౌందర్యానికి మోహితుడు కావడం.
అది బాహ్య సౌందర్యం. కానీ తర్వాత ఆ మోహం ప్రేమగా మారుతుంది.దీన్ని కవి ఎంతో సహజసుందరంగా
వర్ణించాడు.
2. భార్యాభర్తల మధ్య నిజమైన అనురాగానికి ప్రతీకగా
జీవించడమెలాగా ఈ కావ్యంలో వర్ణించాడు.
3. ఆమె మరణించిన తర్వాత భర్త షాజహాన్ మానసిక స్థితిని
కవి హృదయాల్ని కదిలించేలా వర్ణించాడు.
4. చారిత్రక విషయాన్ని కావ్యంగా రచించడంలో కవి నిపుణత.
కల్పన, స్వప్నవృత్తాంతం. ముఖ్యంగా ప్రతిపద్యం భావుకతతో ఔచిత్యమంతంగా వర్ణించడం ఒక ప్రత్యేకత.
5. లౌకికమైన సౌందర్యానికీ, అలౌకిక సౌందర్యానికి మధ్య
గల తాత్విక ఆలోచనలు. ఇక్కడే భారతీయ కావ్య సంప్రదాయాలు, భారతీయుల ఆలోచనలు కవి వ్యక్తీకరణలో
వ్యక్తమయ్యేలా అభివ్యక్తీకరించాడు.
1.కవి వర్ణనలో ముంతాజి సౌందర్యం:
నూర్జహాన్ గా ప్రసిద్ధిపొందిన మెహరున్నీసాకు మేనగోడలు
ముంతాజి. కవి ఈమె రూప సౌందర్యాన్ని దృశ్యాత్మకం చేసిన తీరు అద్భుతం.
"అతివ చక్కదనము నభివర్ణనము సేయ
కలము సాగదెట్టి
కవివరులకు
చేయి యాడదెట్టి చిత్రకారులకును
చెలువ చెలువ మెల్ల జలుకరింప"
కవి ఊహకే
అందనంత సౌందర్యమట ముంతాజిది. అందువలన కవులు అనేక వర్ణాలు చేసి కూడా మరలా ఆ వర్ణన సరిపోదనుకుంటు అలా ముందుకు వెళ్లలేనటువంటి
ఒక సందిగ్ధంలో కవి ఉన్నాడని చెప్పటం ఆమె సౌందర్యాన్ని అక్షరాలలో అందించలేనట్లు కవి
తపన పడుతున్నాడనే సూచన చేస్తున్నాడు జాషువా. ఇటువంటి తడపనే చిత్రకారుడుకి కూడా ఉంటుంది.
అంటే ఆమె సౌందర్యాన్ని బంధించలేనంత సౌందర్యం అనేది ఇక్కడ జాషువా తెలియజేయాలనుకుంటున్న
గొప్ప ఊహ.
2. దంపతుల మధ్య ఉండవలసిన సఖ్యత:
ముద్దులరాణి మాటకు విభుండెదురాడడు, ఱేని యాన క
ముద్దియ మాఱుపల్క దదెపో! సహవాస” మటంచునిత్యమున్
బెద్దలు ప్రస్తుతింప నతివేల సుధాప్రణయైకరాజ్యపుం
ధరలు
గద్దె నలంకరింతురు మొగల్ మగలమ్మహనీయ దంపతుల్
భార్యా భర్తల మధ్య ఉండే అనురాగం:
సీ. ఆ సతీపతులు
గాఢాశ్లేషములనుండి
జారిపోయిన నిమేషంబు లేదు
ఆ దంపతులకు నాహ్లాదంబు గూర్పక
తొలఁగిన వెన్నెల తునకలేదు
ఆ ప్రేమజీవుల యనురాగవృద్ధికై
రుత మొనర్పని పరభృతము లేదు
ఆ శుభాకృతుల నెయ్యంపు ముద్దులచేత
తీపి కెక్కని ద్రాక్షతీఁగ లేదు
ఆ.వె. అవధి లేని వారి యానంద కేళికిఁ
దోడుపడని పూదోట లేదు
వారి కూర్మిపెంపు వలచి వర్ణనజేసి…' అనడం ద్వారా మరి
ఇరువురి మధ్య ఉండే అనురాగాన్ని పద్యంలో అద్భుతంగా వర్ణించ గలిగాడు. ఇది కేవలం ముంతాజి,షాజహాన్
లకు మాత్రమే చెందింది కాదు. ప్రతి భార్యా భర్తల మధ్య ఉండవలసిన అనురాగంగా భావించి చేసిన
వర్ణన.
3. ముంతాజి మరణించిన తర్వాత భర్త షాజహాన్ మానసిక
స్థితి.
ముంతాజి మరణించిన తర్వాత షాజహాన్ పరిపరి విధాలుగా
దు:ఖించిన సన్నివేశాలు తన భార్య దూరమైనప్పుడు భర్త పడేమానసిక వ్యథను హృదయాన్ని కదిలించేలా
వర్ణించాడు కవి. ఈ జీర్ణ అస్థిపంజరాన్ని ఏవిధంగా ఈడ్వగలను? అని బాధ పడ్డంలో జాషువా
ఒక సామాన్య భర్త పడే వేదనకు షాజహాన్ ద్వారా అక్షరరూపమిచ్చాడు. షాజహాన్ జీవితం ఒక నాటకరంగంగా
కనిపిస్తుందనుకుంటాడు. జీవితేశ్వరి ఎడబాటు తీవ్రమైన ఆవేదనను కలిగిస్తుంది. ఈ విశ్వవలయం
అంతా మాయావృతమైందనడంలో భర్తవేదన తారాస్థాయికి తీసుకెళ్ళాడు కవి.
''జీవన
తారవై యమరసీమల నీవు సుముజ్జ్వలింప మా
యావృతమైనవిశ్వవలయంబున,శాశ్వత
శోకమూర్తినై
జీవితమూని,
యీచరమ జీవిత నాటకరంగమెక్కి వా
పోవుచునుంటి
నీవిధుర భూమిక తోడ కిరీటధారినై'' అని వర్ణించాడు.
ఈశ్వరుడు ఏ కారణం వల్లనో త ప్రతిమ అనే అచ్చును నాశనం
చేశాడనీ, తనను శిక్షించడానికో, ప్రపంచానికి వైరాగ్యాన్ని నేర్పే ప్రయత్నమో లేకపోతే
మొగల్ సామ్రాజ్య సింహాస శ్రీలకు ఆయుర్భలం నశించడానికో ముంతాజి నా తన నుండి దూరం చేశాడని
బాధపడతాడు. ఆమె మరణం ప్రపంచమంతటికీ దుఃఖకారణంగా
భావిస్తాడు షాజహాన్. అంతే కాదు- మృత్యువు అనే అర్ణవమునకు ( సముద్రానికి) ఆమెను అవతలి
ఒడ్డుకి చేర్చేశాడనీ, తనని మాత్రం దుఃఖమనే ఒడ్డునే నిలిపేశాడననీ, తమ మాటలు ఒకరికొకరు
వినబడకుండా పోయాయని ఆవేదన చెందుతాడు. ‘నాదు నేత్రయుగళి నాట్యమాడెడు నిన్ను, ఎట్లు దొంగిలించెనీశ్వరుండు’
అనడంలో జాషువా భావుకత శిఖరప్రాయంగా కనిపిస్తుంది. ఎప్పుడూ తన రెండు కళ్ళల్లోనే కదిలే
తన భార్యను దేవుడు దొంగిలించాడట. అందుకనేనేమో మనం మన కళ్ళను ఎప్పటికప్పుడు కనురెప్పు
వేస్తూ ఉంటామనే భావన స్పురించేలా గొప్ప కవిత్వాన్ని ముంతాజ్ మహల్ కావ్యంలో వర్ణించాడు.
4. చారిత్రక విషయాన్ని కావ్యంగా రచించడంలో కవి నిపుణత-
కల్పన:
ముంతాజికి వచ్చిన స్వప్నవృత్తాంతం:
ముంతాజ్ కి 14 మంది సంతానం. వాళ్లలో ఎనిమిది మంది
జన్మించిన తర్వాత బాల్యంలోనే చనిపోయారు. మిగిలిన ఆరుగురు లో నలుగురు మగవాళ్ళు ఇద్దరు
ఆడపిల్లలు. షాజహాన్- ముంతాజులకు పుట్టిన వాడే ఔరంగజేబు. ఔరంగజేబు తన తండ్రిని జైల్లో
పెడతాడనే అంశాన్ని ఒక కల రూపంలో వర్ణించాడు జాషువా. ఆకాశము నుండి ఒక తోకచుక్క భూమిపై పడిందననీ, అది అశుభానికి తార్కరణమనీ వర్ణిస్తాడు జాషువా. ఆ
తర్వాత ఆమె చనిపోయినట్లు వర్ణించాడు.
ఒక పిచ్చివాని పాత్ర:
జగదీశ్వరుడే పిచ్చివాడేమో:
ముంతాజ్ మహల్ కావ్యంలో అన్ని అంశాలనూ చారిత్రక క్రమంలో
చెప్పినప్పటికీ, ఒక పిచ్చివాని పాత్రను ప్రవేశపెట్టడం మాత్రం కవి చేసిన కల్పన. ఆ విషయాన్ని
జాషువా తన కావ్య నేపథ్యంలో కూడా చెప్పుకున్నారు. అది కావ్య సౌందర్యానికి దోహదం చేస్తుందని
భావించినట్లే, షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్
రూపకల్పనకు ఆ పిచ్చివాని రూపంలో ఒక భగవంతుడే వచ్చి, ఆ రూపాన్ని ప్రదర్శించి వెళ్ళిపోయినట్లు
కల్పించాడు కవి.
సుల్తాను పరిపరివిధాల దుఃఖించి చివరికి తన మనోవల్లభకు
స్మారక మందిరాన్ని నిర్మింప నిశ్చయించుకొని 'మచ్చుబొమ్మల' కోసం ఊరూర చాటిస్తాడు. అంతలో
చాలామంది సుల్తానుకు సువర్ణం, రత్నాలు మొదలైన విలువైన వస్తువులను కానుకలుగా సమర్పిస్తారు.
ఆదేశంలోని ఒక మహాదరిద్రుడు తన శిల్పకళా చాతుర్యంతో ఒక మచ్చుబొమ్మను సుల్తాను దగ్గకు
తీసుకొస్తాడు. అది సుల్తాను ఊహ శిల్పానికి సరిపోయింది. ఆ సందర్భంలో, కళలకు కులంతో పనిలేదనీ,
సర్వమానవులను కళానుభవం వరిస్తుందని కళలల్లోని సౌందర్యానుభూతిని సర్వసమానత్వ దృష్టిగా
ప్రశంసించాడు.
ఆ దరిద్రుడును భార్యా వియోగియే. ఆమెకు ఇది ప్రేమ
చిహ్నం కాగ పసిడిరేకులతో కట్టించాలనుకొంటూ, ఊరూర తిరుగుతూ బిక్షమెత్తుకొంటూ ప్రేమోన్మాదియై
తిరుగుతున్నాడు. ఆ మచ్చుబొమ్మ శ్మశానం లోని
భస్మంతో చేయబడిందనడం జాషువా వర్ణనలోని
ఒక విశేషం.
నిండుకొలువులో ఆ పిచ్చివాణ్ని పిలిచి, చక్రవర్తి
సన్మానించి బంగారు, రత్నాలను బహుమతి నిస్తే, వాడు వాటిని తిరస్కరిస్తాడు. 'నావలెనె
వియోగబాధా జీవులైన మీకీ విప్రయోగి కాన్క ముదావహమయి చిత్తశాంతి కనుకూలించు' నని అందరు
ఆశ్చర్యపడేటట్లుగా సభనుండి వెంటనే వెళ్ళిపోతాడు. చక్రవర్తికి అతడు మానవాకృతిలో ఉన్న
జగదీశ్వరునిగనో, పయిగంబరునిగనో తోచాడని కవి వర్ణిస్తాడు. జాషువా ఈ కావ్యంలో అనేక సార్లు
విధిని, దైవాన్నీ స్మరించడం కనిపిస్తుంది.
పాదుషా కడగొట్టు కుమారుడైన ఔరంగజేబుకు సంబంధించిన
వర్ణన కూడా ఈ కావ్యంలో ఉంది. ''ఔరంగజేబు తండ్రిని చెరసాల యందుంచిన తీరు పరోక్షంగా షాజహాను
కళారాధనను, ఔరంగజేబు హింసాకాండను వర్ణించి తాజమహలుకు, షాజహానుకు అపారమైన కీర్తి తెచ్చిపెట్టారు.
నవయుగ కవి చక్రవర్తి జాషువా'' అని డా.జి.వై.ప్రభావతిగారు ఒక వ్యాసంలో వ్యాఖ్యానించారు.
(విశ్వనాథ, జాషువా శతజయంతి ఉత్సవ ప్రసంగాలు, 1994-95., జాషువా ముంతాజ్ మహల్ కావ్య సౌందర్యం
(వ్యాసం), పుట:169-179)
తాజ్ మహల్ కావ్యంలో గుర్రం జాషువా భారతీయ కావ్య రచనా
సంప్రదాయాలను పాటించాడు.
● ఒకపిచ్చివాడి పాత్రను కల్పన చేయడంలో కవి భావుకతకు,
దాన్ని కావ్యంలో ఔచిత్యమంతంగా మలచడానికి చేసిన ప్రయత్నంగా తెలుస్తుంది.
● ఔరంగజేబు పుట్టేటప్పుడు తల్లికి ఒక కల రావడం, అది
ఒక అశుభ శకునంగా కవి వర్ణించాడు. ఇది కావ్య వర్ణనల్లో జరిగే ఒక సంప్రదాయం. కావ్య సౌందర్యానికి
ఇలాంటి కల్పనలు, వర్ణనలు మరింత మెరుగులు పెడతాయి.
● ముంతాజి గొప్పతనాన్ని షాజహాన్ ఎలా భావించాడో వర్ణిస్తూ
కవి ఆమె మరణించడం వల్ల భూదేవికి విలువ పెరిగిందట. ఆమెను తన గర్భంలో దాచుకోవడం వల్ల
మహికి (భూమికి) రత్నగర్భాఖ్య అనే పేరు సార్థకమయ్యిందట. అంటే ముంతాజి ఒక రత్నంలాంటిదని
కవి ఉత్ప్రేక్షిస్తున్నాడు. అంతే కాదు ఆమె తలపై ధరించినందువల్లనే ఒక బొగ్గు కూడా కోహినూరు
వజ్రం కాగలిగిందని వర్ణిస్తాడు కవి. వజ్రాలు కూడా భూమి నుండే వస్తాయి. అవి తొలి దశలో
బొగ్గులుగానే ఉంటాయి. కొన్ని వేల సంవత్సరాలకు అవి వజ్రాలవుతాయని చెప్తారు. ఆమె సాంగత్యం
వల్ల అల్పవస్తువుకి కూడా అనల్పమైన వైభవం సంప్రాప్తిస్తుందని ధ్వని. ఆ పద్యం చూడండి.
'నిన్ను నుదరంబులో దాచుకొన్న మహికి
రత్నగర్భాఖ్య నేఁడు సార్థక్యమయ్యె
నీవు తలమీఁద దాల్చి మన్నించు కతన
వసుధ నొకబొగ్గు కొహినూరు వజ్రమయ్యె'
5. లౌకికమైన సౌందర్యానికీ, అలౌకిక సౌందర్యానికి మధ్య
గల తాత్విక ఆలోచనలు:
రాణి విడిచిపోయె రాజు నొంటిరిఁజేసి
రాజు విడిచిపోయె రాజ్యరమను
రాజ్యరమయు విడిచె రాజులఁబెక్కండ్ర
తాజి విడువలేదు రాజసంబు (ముంటాజ్ మహల్, చివరిపద్యం)
షాజహాను-ముంతాజి ఆదర్శ దంపతులుగా జీవించారు. వారిరువు
ఒకరినొకరు విడిగా మరణించి ఉండొచ్చు. కానీ వారిరువురి కీర్తీ తాజమహల్ లో ఒక్కచోటో వెలుగొందుతుంది.
అది నిత్య నూతన కాంతులతో వెలుగొందుతూనే ఉంది. భార్య పట్ల భర్తకుండే ప్రేమను చాటుతూనే
ఉంది.సామ్రాజ్యాలు అంతరించవచ్చు. ప్రేమసామ్రాజ్యాలు అంతరించకుండా ఎందరిలోనో స్ఫూర్తిదాయకంగా
వెలుగొందుతూనే ఉంటాయని జాషువా ‘ముంటాజ్ మహల్’ కావ్యం ఒక గొప్ప సందేశాన్నిస్తుంది. ఇదే
విషయాన్ని ముంతాజి తన చివరికాలంలో ఇలా అంటుంది.
'ఈ సుఖ దుఃఖ మిశ్రమ మహీవలయం బను సత్రశాలలో
నీ సతినై ముగించితిని నేటికి నాదు ప్రవాసయాత్ర, యో
ధీసముపేత! యిట్టి పరదేశుల చెల్మి తిరంబు గాదు, క్ష్మా
వాస కథావిశేషములు స్వాప్నికముల్, జపలావిలాసముల్'
పై మాటలు ముంతాజి అవసానకాలంలో తన ప్రభువుతో పలికినవి.
ఇహసుఖాలు శాశ్వతాలు కావు. భువిలోని కథావిశేషాలన్ని స్వప్న మాత్రాలు. చంచలములైన విలాసాలు
మాత్రమే- అనే ఒక నగ్నసత్యాన్ని కవి ముంతాజి పాత్ర ముఖంలో వెల్లడించారు. భౌతికమైన తాజ్
మహల్ కి అక్షరరూపమిచ్చి షాజహాన్- ముంతాజిలను మనముందు నిలుపుతుంది.
1 కామెంట్:
గొప్ప విశ్లేషణ సార్
కామెంట్‌ను పోస్ట్ చేయండి