విశ్వైక భావనకు ప్రేరణే తులనాత్మక సాహిత్య అధ్యయనం
తులనాత్మక సాహిత్య అధ్యయనం వల్ల భిన్న భాషలలో గల సంస్కృతీ సంప్రదాయాలు తెలుస్తాయని, జీవన విధానంలోని నిమ్న, ఉన్నతులనేవి మనం సృష్టించుకున్నవే తప్ప శ్రేష్టత్వం ఒక ప్రాంతానికి లేదా ఒక దేశానికి చెందినది మాత్రమే కాదని గుర్తించి మనుషుల మధ్య విశ్వైక భావనకు దారితీస్తుందని హెచ్ సియు తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. గురువారం (5.10.2023) మౌలానా ఆజాద్ జాతీయ విశ్వవిద్యాలయం (మాను), గచ్చిబౌలిలో అధ్యాపకులకు జరుగుతున్న తులనాత్మక సాహిత్యం పునశ్చరణ తరగతులకు రిసోర్స్ పర్సన్ గా అంతర్జాలం ద్వారా ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ప్రసంగించారు. దేశవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు చెందిన అధ్యాపకులు ఈ తరగతులకు హాజరైన వారిని ఉద్దేశించి ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 'తులనాత్మక సాహిత్యం- తెలుగు సాహిత్య విమర్శ' అనే అంశంపై ప్రసంగించారు.స్థల, కాలాలకు అనుగుణంగా వివిధ సంస్కృతులు, సంప్రదాయాలు పుట్టుకొస్తాయని, దేన్నీ తక్కువగా చూడకూడదనే అవగాహన కలగడం కూడా తులనాత్మక అధ్యయన ప్రధాన కారణమని ఆచార్య దార్ల విశ్లేషించారు. భారతీయ సాహిత్యంలో వాల్మీకి రామాయణం, వ్యాసుని మహాభారతం, భాగవతం వంటివన్నీ భారతీయ భాషలలో అనుసృజన జరగడం ద్వారా వివిధ సంస్కృతుల మధ్య భిన్నత్వంలో ఏకత్వాన్ని గుర్తించగలిగే అవకాశం తులనాత్మక అధ్యయనం ద్వారానే సాధ్యమవుతుందని, జాతి సమగ్రతకు, జాతీయ సమైక్యతకు ఎంతగానో తోడ్పడుతుందని ఆయన అన్నారు. అలాగే, ప్రపంచవ్యాప్తంగా వచ్చిన అనేక సాహిత్య ప్రక్రియలైన కథానిక, నవల, వ్యాసం, కవిత్వంలో భిన్న రూపాలు, వస్తు, శిల్పాల్లో ఎంతో వైవిధ్యం భారతీయ భాషల్లో రావడానికి గాని కారణం ఈ తులనాత్మక అధ్యయనమే ప్రధాన కారణమని, అనువాదం, పారిభాషిక నిఘంటువుల రూపకల్పన తులనాత్మక అధ్యయనంలో ప్రముఖ పాత్రను నిర్వహిస్తాయని అన్నారు. తులనాత్మక అధ్యయనం ద్వారానే లోతుగా పరిశీలిస్తే ఒకరినొకరు పోల్చుకోవడం నుండి మొదలై రాష్ట్రాలు, దేశాల మధ్య అనేక విషయాల్లో పోల్చుకోవడం జరుగుతుందని, అలా పోల్చుకోవడం ద్వారానే అభివృద్ధి కి పునాది ఏర్పడుతుందని తులనాత్మక అధ్యయనం వల్ల తెలుస్తుందన్నారు.
ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా ఆచార్య కె.నగేంద్రవ్యవహరించగా, డా.నిర్మల, డా.శ్రీనివాస్, లెఫ్టినెంట్ డా.షమీర్ బాబు తదితరులు చర్చలో పాల్గొన్నారు. ప్రముఖ కవి రచయిత డా.పొదిలి నాగరాజు సమీక్షతో వందన సమర్పణ చేశారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి