ఈరోజు (4.2.2023) సాయంత్రం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదులో డా. జిలకర శ్రీనివాస్ కథల సంపుటి బైండ్ల సెంద్రయ్య కథలు పుస్తకంపై సాహితీ గోష్ఠి జరిగింది. శాతవాహన విశ్వవిద్యాలయం సోషల్ సైన్సెస్ డీన్, ఆచార్య సూరేపల్లి సుజాత, ప్రముఖ సాహిత్య విమర్శకులు డా. ఏ. కే. ప్రభాకర్, కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీత డా.గడ్డం మోహనరావు, పుస్తక రచయిత డా.జిలుకర శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బైండ్ల కులస్తులను మాదిగలకు ఆశ్రిత కులాలని అనాలా? మాదిగలకు ఉప కులాలు అనాలా? ఉత్పత్తి కులాలు అనడం సమంజసమేనా? జిలుకర శ్రీనివాస్ తను చెప్పిన కొన్ని భావాలు తనకు తానే ఖండించుకున్నట్లు కొన్ని చోట్ల కనిపించడం లేదా? బైండ్ల చంద్రయ్య త్రాచుపామును కూడా నిలబెట్టి దాన్ని తన చూపులతో, మాటలతో వెనుకకు పంపగలిగిన శక్తి కలిగిన వాడని చెప్తూనే ఒక స్త్రీ విషయంలో అక్రమ సంబంధానికి ఎలా లొంగిపోయాడు? బైండ్ల వాళ్లు పూజలు చేసేటప్పుడు స్త్రీల ఎదపై పసుపు చల్లడం ఎక్కడైనా జరుగుతుందా? ఈ కథలలో స్త్రీలకు తగిన ప్రాధాన్యత లభించిందా? ఈ బైండ్ల చంద్రయ్యే జిలుకర శ్రీనివాస్ అవుతాడా? లేక మరొక ఏదైనా పాత్ర ఉంటే ఆ పాత్రకు సంబంధించిన చైతన్యాన్ని ఈ రచయిత బైండ్ల చంద్రయ్యగా మనముందుంచాడా? అసలు ఇవి రాసిన కథలా? చెప్పిన కథలా? ఇలా ఈ కథలపై లోతైన చర్చ చేశారు. వీటికి తమకు తోచిన కొన్ని సమాధానాలతో సభాధ్యక్షుడు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, చర్చలో పాల్గొని ఈ కథలను ఎలా చదవాలో శాస్త్రీయంగా వివరించే ప్రయత్నం చేసిన డాక్టర్ ఏకే ప్రభాకర్ ఈ కథల్లోని కొన్ని కోణాలను చర్చించారు. చివరిలో వీటి నేపథ్యాన్ని అంతటినీ జిలకర శ్రీనివాస్ చక్కగా వివరించాడు.
ఈ కార్యక్రమాన్ని దళిత విద్యార్థి సంఘం వారు నిర్వహించారు. వెంకటాద్రి, సందీప్ కార్యక్రమాన్ని చక్కగా సమన్వయం చేశారు. ఇతర సభ్యులు కార్యక్రమం విజయవంతం కావడానికి బాగా కృషి చేశారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి