ఆ వెఱ్ఱి గొఱ్ఱెలకొక నివాళి
వాళ్ళంతా కలిసినట్లుంటూనే
కలవనివ్వని ఆధిపత్యమై
వాళ్ళంతా ఏకమవుతూ
చాపకింద నీరులా ప్రవహిస్తారు
వాళ్ళ పెదాలు మాత్రం
దేశభక్తిని రగుల్గొల్పుతాయి
ఆ దేశభక్తుల్లో
ఆ దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళలో
వాళ్ళు మాత్రమే
జెండాలై రెపరెపలాడుతుంటారు
వాళ్ళు జాతీయతను
నరనరాల్లోనూ ప్రసంగాలతో
మత్తుపూతలు పూస్తూ
నొప్పి తెలియకుండా ఎక్కిస్తారు
వశీకరణకు గురైన జంతువుల్లా
తమనే బలితీసుకోబోతున్న వాళ్ళతోనే
ఒక ఉన్మాదంతో
వాళ్ళు పన్నిన వలలన్నీ విసురుతూ
గ్రూపులు గ్రూపులుగా ఫార్వార్డవుతుంటారు
విషాదమేమిటంటే
రేపు పార్లమెంటులో బహిరంగంగా
నిన్నూ, నీ అస్తిత్వాన్నీ సమాధి చేయబోతున్నాడని చెప్పినా విననంతగా
ఈ గొఱ్ఱెలన్నీ వశమై'పోతాయి'
ఏ గ్రూపులోనైనా నాకు
ఆ వెఱ్ఱి మొహాలు తగిలించుకొని
వల్లించే చిలుకపలుకుల్ని వింటున్నప్పుడు
దేవుడా!
ఆ ముసుగు తొలగించగలిగే శక్తిని
నాకు ప్రసాదించమని అడగాలనిపిస్తుంది!
ఒంటరిగానే ఉంటూ
తనవెంటెవరో ఉన్నారనుకనే
స్వీయ సాంస్కృతిక విధ్వంసంతో ఎదురయ్యే ఆ గొఱ్ఱెల్ని చదువుతున్నప్పుడల్లా
దేవా! వీళ్ళేమిచేస్తున్నారో వీళ్ళకు తెలియదు
వీళ్ళ అమాయకత్వాన్ని క్షమించి
వీళ్ళకు కాస్తంత వెర్రికి బదులు
కాస్తంత వివేకాన్నివ్వమని అడగాలనిపిస్తుంది!
దార్ల వెంకటేశ్వరరావు
918268523
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి