ఆచార్య దార్ల ఆత్మకథ ( నెమలికన్నులు)24వ భాగం.
భూమి పుత్ర దినపత్రిక, సంచిక: 279, సంపుటి: 4, తేది 11.1.2023 సౌజన్యంతో
అమ్మ దైవభక్తి- నాన్న కారుణ్యం
సంక్రాంతి
మొదలవుతుందనగా నెల రోజుల ముందు నుండే మా ఊరిలోకి, మా పేటలోకి హరిదాసులు 'శ్రీమద్రమారమణ
గోవిందో హరీ…హరిలో రంగ హరి…'అని సంకీర్తనలు పాడుకొంటూ ఇంటింటికీ వచ్చేవారు.
ఆయనకి బియ్యం
వెయ్యాలని మేమంతా సరదాపడేవాళ్ళం.
ఆయన ఒక ఎడమ
కాలు కిందికి వంచి, కుడికాలు మడిచి పెట్టుకొని మనిషి సగం వంగి తలపై ఇత్తడితో చేసిన ఒక అక్షయపాత్రను
పెట్టుకొని భిక్షాటన గ్రహించేవాడు.
ఎవరైనా భిక్షం
వెయ్యకపోయినా బాధపడేవాడు కాదు. నవ్వుతూనే దీవిస్తూ కీర్తనలు పాడుకొంటూ, చేతిలో చిరుతలు
వాయించుకొంటూ వెళ్ళిపోయేవాడు.
ఆ సమయంలో ఆయన
ఎవరితోను మాట్లాడేవాడు కాదు. ఏదైనా అడిగినా చేతితోనో, కళ్ళుతోనో సైగలు చేసి చెప్పేవాడు. కానీ, ఆ కీర్తనలు
మాత్రం ఆపేవాడు కాదు.
చివరిరోజున
మాత్రం అక్షయపాత్రను తలమీద నుండి తీసేసుకొని, మామూలు వస్త్రాలతో, ఒక మనిషిని
వెంటపెట్టుకొని ఒక పెద్ద సంచి పట్టుకొని వచ్చి, బిక్షం వెయ్యాలని అడిగేవాడు. ఏ రోజూ వెయ్యకపోయినా, ఆ రోజు మాత్రం
అందరూ వెయ్యాల్సిందేననేవాడు.
అమ్మ ప్రతిరోజూ
మాకు ఉన్నంతలోనే బియ్యమో, డబ్బులో ఆ పాత్రలో వేసేది.
అమ్మ చేతితో
పాటు మేము కూడా ఆ పాత్రలో వేసేవాళ్ళం.
''
అమ్మా…మనకే తినడానికి బియ్యం సరిపోవు. వీటిలోనే మరలా
ఇంకొకళ్ళకి బిక్షం వెయ్యాలా?'' అని అడిగాను ఓసారి.
''నిజమేరా…మనమెప్పుడూ ఎవరెవరొకరి దగ్గర తీసుకొంటూనే
ఉంటాం. మనమెవరికైనా ఇద్దామంటే మనకి అంత ఉండవు. ఉన్నదాన్లోనే పెడదామంటే
తీసుకొనేవాళ్ళుండరు. అందుకే ఆ భగవంతుడే మన ఇళ్ళకి ఇలాంటి రూపాల్లో వస్తుంటారు. మనల్ని పరీక్షిస్తుంటారు. మనకున్నదాన్లోనే మనుషులకీ, పక్షులకీ, జంతువులకీ పెట్టాలి. ఏ రూపంలో దేవుడు వచ్చి మనల్ని పరీక్షిస్తాడో
ఎవరికి తెలుసు? అయినా మనం తెలిసో తెలియకో ఏదొక పాపం చేస్తాం. దాన్ని పోగొట్టుకోవడానికి కూడా
ఆ పాత్రలో మనం ఏదొకటి వెయ్యాలి'' అంటూ పెద్దపెద్ద
విషయాలేవో చెప్తున్నట్లనిపించేది.
అప్పటి నుండీ
ఆయన్ని చూస్తుంటే దేవుడిలాాగే అనిపించేది.
హరిదాసు రూపం
ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ముఖానికి చక్కగా తిలకం దిద్దుకుంటాడు.మెరుస్తున్న
పట్టు దోవతి, తెల్లని పంచకట్టు, పట్టు కండువా నడుముకు కట్టుకొనేవాడు.
ఒకచేతిలో రెండు చిరతలు పట్టుకొని వాటిని వాయిస్తూ, భుజమ్మీద తుంబురు
వేసుకుని దాని తీగల్ని మీటుతూ, నోటితో కీర్తనలు పాడుతూ, మరో చేత్తో భిక్షం స్వీకరిస్తుంటాడు.
కాలికి గజ్జెలు
కట్టుకుంటాడు. అవి ఆయన వస్తున్నాడని చెప్పకనే చెప్తుంటాయి. అలా వస్తుంటే, చిన్నికృష్ణుడెవరో
మనింటికి వస్తున్నట్లు అనిపించేది. మెడలో ఒక పూల హారం ధరించేవాడు. కృష్ణుడికీ, శ్రీవేంకటేశ్వరునికీ
మెడలో పూలదండ ధరించినట్లు అతను ధరించి వచ్చేవాడు.
ఆ పూలదండ గురించి
మా అమ్మ అకేక పురాణ కథల్ని చెప్పేది.
‘‘విష్ణుమూర్తి మెడలో
వైజయంతీమాల ఉంటుంది.
శ్రీవేంకటేశ్వరస్వామి మెడలో తన తల్లి వకుళామాతను దండగా చేసుకున్నాడు. దాన్ని చెప్పడానికే హరిదాసు
మెడలో దండవేసుకుంటాడు’’ అని చెప్పేది మాయమ్మ. ఆ పూల దండల్ని మనిష్టం వచ్చిన
పువ్వులతో చెయ్యకూడదని కూడా చెప్పేది.
ఆ మాటలు విన్న
తర్వాత హరిదాసుని బాగా పరిశీలించి చూసేవాణ్ణి.
‘‘నీకివన్నీ ఎలా
తెలుసమ్మా’’ అని అడిగితే
‘‘ఆ దేవుడే చెప్తాడు… హరికథలు, బుర్రకథలు, వింటే మనకి తెలుస్తాయి కదా. అవన్నీ వాళ్ళ రూపంలో మనకి చెప్తాడు. రోజూ దేవుడి దగ్గర దణ్ణం పెట్టుకుంటే మీకింకా ఎన్నో తెలుస్తాయి’’ అనేది.
అలా మాకు దేవుడికి
దణ్ణం పెట్టుకోవాలని నేర్పేది. అది మాలో ఒక క్రమశిక్షణను నేర్పిందని తర్వాత అర్ధమయ్యింది.
''బహుశా అందుకేనేమో
మా పేటవాళ్లంతా మా అమ్మ చెయ్యి ఎంతో మంచిదనీ, ఏ కార్యక్రమం జరిగినా అమ్మని
పిలిచి, మొదటి అమ్మ చేతనే ఆ పని మొదలు పెట్టేంచేవారని అనిపించేది.
గోదావరి జిల్లాల్లో పాపభీతి, ఆధ్యాత్మిక చింతన చాలా ఎక్కువ. సంక్రాంతి పండుగ నెలపెట్టారంటే హరిదాసు చిడతలు పట్టుకొని, కాళ్ళకు గజ్జలు, మెడలో పూలదండ, పట్టుదట్టి ఇవన్నీంటినీ అలంకరించకున్న విధానాన్ని తన ఆత్మకథలో రచయిత ఆచార్య దార్లవెంకటేశ్వరావు గారు చక్కగా వర్ణించారు. 'హరిలోరంగ హరి' అని దైవనామ స్మరణ చేసుకుంటూ హరిదాసు వీధి, వీధికీ వస్తుంటే పిల్లా, పెద్దా పట్టుపావడాలు వేసుకున్న యువతులు గౌరవప్రదంగా ప్లేట్లతో తమకు కలిగిందాన్ని హరిదాసుకు దానంగా ఇచ్చి, ఆయనకు దండం పెట్టి, దీవెనలు తీసుకొనేవారు. అంతే కాకుండా రచయిత కు ఓ అనుమానం వచ్చింది. అదే తడవుగా ఆ నుమానాన్ని అమ్మనడిగారు.
''మనకే తినడానికి ఉండదు. మనమే మన బంధువులు కాడ అక్కన - పక్కన బదుళ్ళు తెచ్చుకుంటుంటాం. మనమెలా ధర్మం చేయగలం?'' అనే ప్రశ్నకు అమ్మ చక్కని జవాబు ఇచ్చారు. మనకు ఉన్నదాంట్లోనే మనకంటే పేదవారికి ధర్మం చెయ్యాలనే గొప్ప మెసేజ్ ని అద్భుతంగా వివరించారు రచయిత. అమ్మ పాతాళ భైరవి సినిమాలో కథానాయిక కంటే చక్కగా ఉండేవారని బందువులుఅనడం రచయితకు అమ్మమీద ఎంతప్రేమ ఉందో దీనిని బట్టి మనకు అర్థమవుతుంది.
బాల్యం అనేది పుస్తకంలో దాచుకున్న నెమలికన్ను అని పాఠకులందరికీ గుర్తు చేశారు రచయిత. నిజమే, పకీరు సాయిబుగారు ఇంటిముందుకొచ్చినప్పుడు ఆయనకు బియ్యం పెట్టి, ఓ నెమలీక అడిగి తీసుకొని పుస్తకంలో పెట్టిన సన్నివేశంతో నన్ను మరలా బాల్యంలోకి తీసుకెళ్ళారు. అసలు ఆత్మకథంటే ఇదికదా ! అన్నట్టు రచయిత ముందుకు తీసుకెళుతూ అందులో పాఠకలోకాన్ని మమేకం చేయడం ఎంతైన ఆశ్చర్యమే కదా.
ఈ భాగంలో చివర రచయిత మిళ మిళా మెరుస్తున్న పాముపిల్లను చీపురుతో కొట్టడంతో అది చనిపోయిందని భావించడం, అది చనిపోతే కొట్టిన కాడే ఉండాలి కదా. అది లేదు. అంటే అది చనిపోలేదు. ఆ దెబ్బలకు తాళలేక మరలా అది శపిస్తుందేమోననే ఓ ఆధ్యాత్మికమైన భయం రచయితలో మెదిలినట్టు వర్ణించారు. ఇది ఎవరికైనా అనిపించడం సహజమే. ఇంకా, రచయిత అనేక సంఘటనలతో అలరిస్తూ, ఆలోచింపజేస్తూ వారం వారం తమవిలువైన ఆత్మకథను పాఠకలోకానికి అందిస్తున్న ఆచార్య దార్లవెంకటేశ్వరావు గారికి, ఇంతటి విలువైన ఆత్మకథను పాఠకులకు అందిస్తున్న డా: భూమిపుత్ర శ్రీహరి మూర్తి గారికి నా హృదయపూర్వక అభినందనలు.''
-దుగ్గినపల్లి ఎజ్రా శాస్త్రి, కవి, రచయిత
ఎవరన్నా ప్రసవించినా, ఎవరికన్నా
పేరు పెట్టినా, పెళ్ళి పనులు మొదలు పెట్టినా, పెళ్ళి చేసినా మా అమ్మని పిలిచి మొదట మా అమ్మ చేతనే
ఆ పని మొదలు పెట్టించేవారు.
మా పేట వాళ్ళంతా మా అమ్మని‘‘ మా పెద్దకోడలు’’ అని గౌరవించేవారు.
అందరూ నోరు
తిరక్క ‘‘నాగమ్మ’’ అని పిలిచేవారనీ, అసలు ఆమెకు పేరు పెట్టినట్లే ‘‘ నాగరత్నం’’ మా రత్నంలాంటిదే
అని అనేవారు.
మా అమ్మ అప్పుడప్పుడు
తనకి వాళ్ళ నాన్న ఆ పేరే పెట్టారని కూడా చెప్పేది.
మా పేటలో చాలామంది
నాగమ్మ అనే పేరున్నవాళ్ళుండడం వల్ల, ‘పెదనాగమ్మ’ అని పిలిచేవారనీ, ఆ రోజుల్లో
పాతాళభైరవి సినిమాలో బాలనాగమ్మ ఎంత అందంగా ఉండేదో, మా అమ్మ అంతకంటే అందగా ఉండేదనీ, అందుకనే ‘నాగమ్మ’ అని పిలుస్తున్నామని
చెప్పేవారట.
అమ్మని అందరూ
గౌరవించడానికి అమ్మకున్న దైవగుణమే ప్రధానకారణమని నమ్మేవాణ్ణి. అమ్మ పూజ చేస్తూ, దేవుణ్ణి ఎలా
కోరుకోవాలో మాకు చెప్పేది.
‘‘దేవుణ్ణి మనం కోరుకునేటప్పుడు మనకోసమే మనం దేవుణ్ణి
అడక్కూడదు. మన చుట్టుప్రక్కల వాళ్ళంతా బాగుండాలి, అందరితో మనం బాగా ఉండేమనస్తత్వాన్ని
మనకివ్వాలి. మనకి చెడ్డ ఆలోచనలు రాకుండా, చెడ్డ పనులు చెయ్యకుండా మనల్ని మనం నియంత్రించుకునే
శక్తినివ్వాలి. మనతో పాటు సమస్త జీవుల్ని వాటి వాటి అవసరాల్ని బట్టి జీవించగలిగే అవకాశాల్నివ్వాలి. మనల్ని దేనికోసం
పుట్టించాడో ఆ పనిని సక్రమంగా చెయ్యడానికి మనల్ని ఒక సాధనంగా ఉపయోగించుకో స్వామీ. నన్ను మంచి
పనుల్ని చేయడానికే పుట్టించావనే అనుకుంటున్నాను. ఆ పనుల్ని చేసేశక్తిని ప్రసాదించు. మా తల్లిదండ్రుల్ని, గురువుల్నీ, పెద్దవాళ్ళందరినీ
గౌరవించే వినయాన్నివ్వు. అందర్నీ ప్రేమించే మనసునివ్వు స్వామీ’’ అని ప్రార్థించుకోవాలని చెప్పేది.
ఇలాగే చెప్పకోలేకపోయినా, నాకు బాగా
చదువురావాలనీ, అది ప్రజలకు ఉపయోగపడాలనీ దేవుడి దగ్గర దణ్ణం పెట్టుకునేవాణ్ణి.
ఇవన్నీ నాకు
ఆ హరిదాసుని చూస్తుంటే గుర్తొచ్చేసేవి.
అందుకే నేను
కూడా బిక్షం వేస్తాననేవాణ్ణి.
అన్నం తినేటప్పుడు
కుక్కలకు వేస్తే, తినే దానిలోనే ఒకటో రెండు ముద్దల్ని వేసే వాణ్ణి. మేము ఒక కుక్కని పెంచుకునే వాళ్ళం. దానితో పాటు
కోళ్ళు నీ పెంచుకునే వాళ్ళం. వాటితో పాటు కాకులైతే చాలా వచ్చేవి.
ఒక్కో మెతుకు
విసురుతుంటే అవి ఆ మెతుకుల్ని గమ్మత్తుగా అందుకునేవి. అందుకున్నప్పుడల్లా ''టక్…టక్''మనే శబ్దాలు
వినిపించేవి. వాటిని వినడానికీ, ఆ కాకులు అలా అందుకుంటుంటే పదేపదే చూడ్డానికీ ఒక్కో
మెతుకు విసురుతూ ఎంతో సంతోష పడేవాణ్ణి.
మా ఇంట్లోవాళ్లు
కూడా కుక్కలకీ, కోళ్ళుకీ ఎంతో కొంత పెట్టేవారు.
మా నాన్న పిచ్చుకలు
కోసం పొలం నుండి వారి వెన్నుల్ని తెచ్చి, ఇంటి సూరుకి కట్టేవాడు. ఎన్నో పిచ్చుకలు గుంపులు గుంపులుగా
వచ్చేవి. వాటి కిచకిచమనే శబ్దాలు ఇళ్ళంతా అమ్మ దేవుడి పటం దగ్గర పూజ పూర్తయిన తర్వాత
కొట్టే మంగళధ్వనుల్లా వినిపించేవి.
మరి అవెక్కడ
పడుకుంటాయని అడిగితే, వాటికి గూళ్ళుంటాయని చెప్పేది మా అమ్మ.
మా నాన్నని
ఆ పిచ్చుకగూళ్ళు తెచ్చి, ఆ వరివెన్నెలు కడుతున్న పక్కనే కట్టమనేవాణ్ణి.
అడగ్గా అడగ్గా
నిజంగానే పిచ్చుక గూళ్ళు తెచ్చి మా ఇంటి చూరుకి కట్టేవాడు. ఇంట్లో పెంచిన కోళ్ళుని కూరుకు
కొయ్యనిచ్చేవాడు కాదు.
ఒక వేళ తప్పనిసరిగా
వండుకోవాల్సి వచ్చినా ఆరోజు నాన్న తినేవాడు కాదు.
మాకున్న పశువుల్లో
ఏవైనా చనిపోయినా, మా ఇంటిలో పెరిగిన కుక్క చనిపోయినా నాన్న ఎంతో దుఃఖించేవాడు. వాటిని గొయ్యి
తీసి పాతి పెట్టేవాడు.
పిచ్చుకలకు
ఇంట్లో గూళ్ళు కట్టాక రోజూ కొన్ని పిచ్చుకలు వచ్చేవి. రాత్రి పూట కూడా ఒక్కోసారి వాటిని
చూస్తూ ఆడుకొనేవాళ్ళం.
మాయమ్మ తెల్లవాకుండానే
లేచి వాకిలి తుడిచి, కళ్ళాపు వేసి, ముగ్గుపెట్టేసేది. సంక్రాంతి
రోజుల్లో రోజుకో ముగ్గు చొప్పున వేసేది. ఒక్కోరోజు రథం ముగ్గు వేసేది. కొన్ని చుక్కలు
పెట్టి వాటిని కలుపుతూ ఒకరకమైన ముగ్గులు, ఆ చుక్కలు మధ్యలో వచ్చేలా మరికొన్ని ముగ్గులు పెట్టేది. వాకిలంతా రకరకాల
ముగ్గులతో అందంగా మార్చేసేది.
అందువల్ల ఎవరైనా
ఆ ముగ్గులు తొక్కుకొంటూ వెళ్ళాలంటే మొహమాటపడేవారు.
'మా నాగమ్మ ఎన్ని మంచి ముగ్గలేస్తాదో. తొక్కితే మనపనైపోతాదిసుమా' అని నవ్వుతూ వెళ్ళిపోయేవారు.
పండుగ రోజుల్లో
మేము కూడా కలర్లు తెచ్చి ముగ్గులు పెట్టేవాళ్ళం.
హరిదాసు వచ్చేసమయానికే
మా అమ్మ స్నానం చేసేసి బొట్టుపెట్టుకొని బియ్యం వెయ్యడానికి గుప్పుడైనా సిద్దంగా పెట్టేది.
అప్పుడప్పుడూ
నేను కూడా ఆ బియ్యం వేసేవాణ్ణి.
అమ్మతో పాటు
నన్ను కూడా హరిదాసు దీవించి వెళ్ళిపోయేవాడు.
అలాగే జంగాలు, కాటికాపర్లు, బుడబుక్కల
వాళ్ళు కూడా వచ్చేవారు.
వాళ్ళలో కోయదొర
తన తలపై నిండుగా నెమలీకలు కట్టుకొని ఒళ్ళంతా దిగబోసుకొని వచ్చేవాడు.అతనికి పెద్దపెద్ద
మీసాలు ఉండేవి. కళ్ళకు కాటుక పెట్టుకొని,పెద్ద బొట్టు పెట్టుకొని చేతిలో నెమలీకలతో చేసిన
ఒక పెద్ద చీపురు లాంటిది పెట్టుకొనేవాడు. ఎడమవైపు సంకలో సంచి తగ్గించుకొనే వాడు. భిక్షం వేసిన
వాళ్ళను ఆ చేతిలోని నెమలీకల చీపురుతో దీవించేవాడు.
అతన్ని చూస్తే
భయమేసేది కూడా. అతను పిల్లల్ని తీసుకొని పోతాడని మాయలు, మంత్రాలు వేస్తాడని ఇంట్లో చెప్పేవారు.
దానికి తోడు
అతను కొన్ని రక్షరేకుల్ని ఇచ్చేవాడు. ఇళ్ళచూసి దోషాలుంటే చెప్పి, దాని పరిష్కారాన్ని కూడా చెప్పేవాడు.
తన దగ్గర రక్షరేకులు
ఉన్నాయని, వాటిని కట్టుకుంటే ఆ దోషాలు పోతాయని చెప్పేవాడు. అంతేకాకుండా కొంతమందిని చూసి
వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా చెప్పేవాడు.
కొంతమంది భవిష్యత్తు
బాగాలేదని దానికి కొంత శాంతి కలిగించడానికి పూజలు చేయాలని, ఆ పూజలు తాను చేస్తానని, దానికి కొంత
డబ్బు అవుతుందని చెప్పేవాడు. డబ్బులతో పాటు బియ్యం లేదా ధాన్యం, కూరగాయలు, కోళ్లు కూడా తీసుకునేవాడు.
దానితో అతన్ని
చూస్తే చాలామంది భయపడేవారు. అతని దగ్గరికి పిల్లల్ని వెళ్ళనిచ్చేవారు కాదు. మరీ ముఖ్యంగా
ఆడపిల్లల్ని, వయసులో ఉన్నటువంటి వాళ్ళనీ కూడా దూరంగా
పెట్టేవారు. అతని దగ్గరికి వెళ్లనిచ్చేవారు కాదు. అతనికి కనపడకుండా చేసేవారు.
మేము అతని
దగ్గరికి వెళ్లి నెమ్మదిగా ఆ నెమలికలని లాక్కునేవాళ్ళం. అతను ఏమీ తెలియనట్లుగా కళ్ళు
మూసుకుని ఉండేవాడు.
తర్వాత ఇక్కడ
ఎవరో తన నెమలీకలను ముట్టుకున్నారని, కొంతమంది తెంపుకున్నారని, అవి వాళ్ళు తీసినందుకు కొన్ని
ప్రమాదాలకు లోనవుతారని భయపెట్టేవాడు.
అందువల్ల అతన్నే
అడిగి తీసుకొని, వాటిని పుస్తకాల్లో పెడితే మరలా కొత్త నెమలీకలు పుడతాయని భావించడం వల్ల రోజూ
ఆ పుస్తకాన్ని చూసేవాళ్ళం.
మేము పెట్టుకున్న
నెమలీక మరలా మర్నాడుకి పిల్లలను పెట్టిందో లేదో అని ఎంతో ఆతృతంగా చూసేవాళ్ళం. ఏం పెట్టిన
నెమలిక విరిగిపోవడం వలన రెండుగానో మూడు గానో కనిపించేవి. నెమలి లేక పిల్లలు పెట్టిందని
సంతోషంతో గంతులేసే వాళ్ళం.
నేను అలాగే
బియ్యం వేస్తూ అతని దగ్గరకు వెళ్లి నెమలీకలు ఇవ్వమని అడిగేవాణ్ణి.
ఒకసారి అతను
నన్ను చూసి మా అమ్మతో ఈ అబ్బాయికి సర్కారు సొమ్ము తినే యోగం ఉందనీ, అతనికి మహా
రాజయోగం ఉందనీ చెప్పాడు. ఈ అబ్బాయిని అందరూ గౌరవించే జాతకం ఉందని, మహా గొప్ప
జాతకుడు అని చెప్పాడు.
అమ్మ ఆ మాటకు
పైకి సంతోషించినట్లు అనిపించినా, లోన మాత్రం ఎందుకో భయపడింది. మర్నాడు నుండి అటువంటి వాళ్ళు వస్తే, వాళ్ళు దగ్గరకు వెళ్ళవద్దని మా అందరికీ పదేపదే చెప్పేది.
ఇదిజరిగిన
కొన్నాళ్ళకు నాకు మరిచిపోలేని ఒక సంఘటన జరిగింది.
ఆ రోజు నేను
పొద్దున్నే లేచి, నేను చేయాల్సిన పనుల్నీచేసేసి తలంటు స్నానం చేసి, తల నిమురుకుంటూ ఎండలో ఉన్నాను. అంతలో దూరంగా
ఒకటేదో మెదులుతున్నట్లనిపిస్తే చూశాను. అది చిన్నపాము. ఎండకి మెరుస్తుంది. నావైపుకి వచ్చేస్తుందేమో అన్నంత ఆందోళనకు గురయ్యాను.
ఆసమయంలో పక్కనే
అందుబాటులో ఉన్న చీపురు తీసుకొని దాన్ని కొట్టేశాను. అది చనిపోయిందనుకున్నాను. దాన్ని కొట్టేసి
వెళ్ళి ఇంట్లో వాళ్ళకి చెప్పాను. వాళ్ళు చూడ్డానికి వచ్చారు. పాముని కొట్టిన చోటే పడి ఉండాలి. కానీ, అది అక్కడ
లేదు. నేను ఈను పుల్లలతో కొట్టిన దెబ్బలకు చనిపోయిందనుకున్నాను. తీరాచూస్తే
అది కాసేపు ఆ దెబ్బలకు తాళలేక చనిపోయినట్లు పడిపోయినా, మళ్ళీ తేరుకొని వెళ్ళి పోయిందని
అర్థమయ్యింది.
ఆ పాముని పూర్తిగా
చంపలేదు కాబట్టి శపిస్తుందని అన్నారు. నాకు ఆ భయం అలాగే ఉండిపోయింది.
కొన్నాళ్ళ
తర్వాత నేను మధ్యాహ్నం పరీక్షలకు హడావిడిగా సైకిలు తొక్కుకుంటూ వెళ్తున్నాను. నాకు అప్పుడు
సీటుమీద తొక్కడం రాదు.ఫెడల్ మీద తొక్కుకుంటూ వెళ్ళాలి. అలా వెళ్ళేటప్పుడు
గొరగనమూడి దగ్గరలో ఒక రోడ్డు మలుపు ఉంటుంది. ఎదురుగా ఏదో వెహికల్ వస్తుందని హడావిడిలో నా సైకిల్
కుడి బ్రేక్ వేశాను. అక్కడే ఆ రోడ్డుమీద పేడమీదకెళ్ళేసరికి బ్రేక్ వెయ్యడం, ముందరి చక్రం
సడన్ గా ఆగేసరికి వెనుక చక్రం ప్రక్కకి వెళ్ళిపోయి పడిపోయాను. సైకిల్ మీద నుండి నేను కిందికి
పడిపోయాను. నామీద సైకిల్ పడిపోయింది. నా ఎడమచేయి మీద సైకిల్ ఫ్రేమ్ పడింది. అది ఇనుముతో
బలంగా ఉంటుంది. అది నా లేత చేతిపై పడేసరికి అక్కడ విరిగిపోయింది.
ఎదురుగా వస్తున్న
ట్రాక్టరు కింద పడకుండా, నామీద సైకిల్ పడ్డంతో చాలా ప్రమాదం తప్పిందనుకున్నాను.
ఎలాగోలా ఆ
బాధతోనే నా సైకిల్ కి రోడ్డు ప్రక్కకి లాక్కొని కూర్చొని ఏడుస్తున్నాను.
అంతలో ఆ దారిలో
నుండే సైకిల్ మీద నాకు వరసకు చిన్నాన్న అయ్యే వెంకటరెడ్డి వచ్చాడు. వెంటనే నన్ను
ఎత్తుకొని, తన సైకిల్ పై కూర్చోపెట్టుకొని ఇంటికి తీసుకొచ్చేశాడు.
ఈ సంఘటన మధ్యాహ్నం
జరిగింది. అమ్మా, నాన్నా వచ్చేవరకు ఆగితే బాధ తట్టుకోలేడని, నన్ను మా చిన్నాన్న కాట్రేనికోనలోని
ఒక హాస్పటల్ కి తీసుకెళ్ళాడు. అది డా. రామకృష్ణంరాజుగారి ఆసుపత్రి. ఎక్సరే తీసి
ఒక చెయ్యి విరిగిందని చెప్పారు. దానికి సిమెంటు కట్టు వేయాలన్నారు.
నాకు దెబ్బతగిలిందన్న
వార్త ఎలా తెలిసిందో నేను హాస్పిటల్ కి వెళ్ళిన అరగంటలో మా నాన్న తన సైకిల్ మీద వచ్చేశాడు. నాన్నను చూసి
మరింతగా ఏడ్చేశాను.
సిమెంటు కట్టు
కట్టాలి. ఈ లోగా బాధ తట్టుకోవడానికి ఇంజెక్షన్, బిళ్ళలు ఇచ్చారు.
తన పేషెంట్స్
ని చూసుకొని రాత్రికి సిమెంటు కట్టు కట్టారు. నా చేతికి కట్టు కట్టేటప్పడు
ఇద్దరు నర్సులు ఏదో విషయంలో గొడవ పడ్డం, దాన్ని డాక్టరుగారు సర్ధి చెప్తూ కట్టు కట్టారు.
తర్వాత ఇంటికి
పంపేశారు.
‘‘పిల్లోడికి ఎవరి దిష్టి తగిలేసిందో… అందుకే అందరి
దగ్గరకు వెళ్ళొద్దని చెప్పాను. ఇదిగో ఇప్పుడు ఇలా చెయ్యి విరిగిపోయింది’’ అని ఏడుస్తూ
ఏదేదో అంటుంది మా అమ్మ.
తర్వాత రోజు
యునైటెడ్ నర్సింగ్ హోమ్ అని అమలాపురంలో ఒక పెద్ద హాస్పిటల్
ఉండేది.
నాకు కట్టు సరిగ్గా కట్టారో
లేదో తెలుసుకోవడానికి మా నాన్న అక్కడికి నన్ను తీసుకెళ్ళాడు. వాళ్ళు ఎక్సరే తీసి, మళ్ళీ కట్టు
కట్టాలన్నారు. సరేనని కట్టు కట్టించాడు మా నాన్న.
కొన్నాళ్ళ
తర్వాత నా కట్టు విప్పారు. నాకు నా చేయి మళ్ళీ ఇంతకుముందున్నట్లు నా ఎముక అతుక్కోలేదు. నా చేయి వంకరగా
వచ్చింది. నడుస్తుంటే ఎడమ చెయ్యి ప్రక్కకి వచ్చేస్తుంటుంది. నేను నడిచేటప్పుడు ఎవరైనా నా
చేతుల్ని చూస్తుంటే ‘వీడెంత గర్వంగా నడుస్తున్నాడో చూడు’ అన్నట్లు అనిపిస్తుంది.
ఆ కోయ దొర
చెప్పినట్లు రాజయోగం పట్టడం మాటెలాగున్నా, రాజుగారు నాకు సిమెంటు కట్టు కట్టడం మాత్రం నిజమైందనిపించింది.
ఒక్కోసారి
మనం తలిచేదొకటి కావచ్చు. . ఒక్కోసారి మనకి జరిగేది వేరొకటి కావచ్చు.
జీవితం సుఖదుఃఖాల
దోబూచులాట!
పరుచుకున్న
మంచుతెరల్ని తొలగించుకొంటూ
దారుల్ని సరిచేసుకుంటూ
అలా నడవాల్సిందే!
గమ్యాన్ని
వెతుక్కుంటూపోతే
ఎత్తుపల్లాలేకాదు
తెలిసినట్లనిపించే
తెలియని ఊబిలెన్నో
చేయాల్సిన
జీవన సమరాలెన్నో
అయినా అన్నింటినీ
ఎదుర్కోవాల్సిందే
నడుస్తూ నడుస్తూ
పోతుంటే
కాళ్ళకు తగిలే
గాయాలేకాదు,
ఆత్మీయమైన
తీగలూ చుట్టుకోవచ్చు
నడుస్తూ నడుస్తూ
పోతే
గుండెను హత్తుకునే
వెచ్చని ఆలింగనాలెన్నో
ఇంకా…ఇంకా… ఇలాంటివి ఎన్నెన్నో…
అవన్నీతెలియకుండానే
హృదయాన్ని
చీల్చేసే దట్టమైన చీకటి కౌగిళ్ళవుతాయో
ఏమో…ఎవరికి తెలుసు!
(సశేషం)
-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,
తెలుగు శాఖ అధ్యక్షులు,
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
హైదరాబాద్
ఫోన్:
9182685231
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి