సౌందర్యగవాక్షం
నేను రోజూ చూసే ఆ మనుషులే
నీ అక్షరాల్లో
నాకు కొత్త మనుషుల్లా కనిపిస్తారు
నేను రోజు చూసే ఆ దృశ్యాలే
నీ కళ్ళల్లో
సౌందర్యకేంద్రాలవుతాయి
నేను రోజూ మాట్లాడే ఆ మనుషులే
నీ గొంతులో
కొత్త మానవ సంబంధాలతో పుష్పిస్తారు
నేను రోజూ తీసే ఆ రాగమే
నీ స్వరంలో
ఓ కన్నీటి కెరటమయ్యో
ఓ ఆనంద తరంగమయ్యో
హృదయమంతా పల్లవింపజేస్తుంటావు
నీలా నేనెందుకు చూడలేకపోతున్నాను
నీలా నేనెందుకు వినలేకపోతున్నాను
నీలా నేనెందుకు పాడలేకపోతున్నాను
నా కళ్ళకంటున్ను
ఆ మకిలిపట్టిన కళ్ళజోడుని తీసెయ్యాలి
నా చెవుల్లో నిండిన
ఆ నిర్లక్ష్యపు గులిమినంతా
బయటకు తోసెయ్యాలి
నా గొంతుకున్న
ఆ మదించిన అహంకారన్నంతా కడిగెయ్యాలి
ఇదేమిటిప్పుడు
నా రూపమంతా మారిపోయింది
ఇప్పుడిదేమిటి
ఎటుచూసినా ఈ పంచేంద్రియాల్లో
కొత్త పారవశ్యపు పులకరింతలు
నన్ను వేయిచేతులతో పిలుస్తున్నాయి!
దార్ల వెంకటేశ్వరరావు
హైదరాబాద్, ఫోన్: 9182685231
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి