భూమి పుత్ర దినపత్రిక, సంచిక: 272, సంపుటి: 4, తేది 4.1.2023 సౌజన్యంతో
ఆచార్య దార్ల ఆత్మకథ ( నెమలికన్నులు)23వ భాగం.''తీర్థం చూడ్డానికి డబ్బులెందుకు?''
మా ఇంట్లో నా చిన్నతనంలో మా అమ్మ ఎన్నో పూజలు చేసేది.
రోజూ దేవుడి దగ్గర దండం పెట్టుకొనేది.
మమ్మల్నీ కళ్ళుమూసుకుని దండం పెట్టుకోమని చెప్పేది.
దేవుణ్ణి ఏవేవో కోరికలు కోరేది.
అలా దేవుడి దగ్గర పూజ చేస్తున్నంతసేపూ మేమంతా అక్కడే కూర్చోవాలి.
దేవుడితో మాట్లాడుతున్నట్లే ఏవేవో చెప్పేది.
మా గురించీ, ఇంట్లోవాళ్ల గురించీ, మా చుట్టు ప్రక్కల వాళ్ళ గురించీ…ఏవేవో కోరికలు కోరేది.
అది పూర్తయ్యే దాకా మమ్మల్ని కూడా కళ్ళు మూసుకోమని చెప్పేది.
మేము కళ్ళు మూసుకున్నట్లే మూసుకొని మధ్యమధ్యలో నెమ్మదిగా చూసి, మళ్ళీ చూస్తే కొడుతుందేమోనని భయంతో కళ్ళు మూసుకుని మౌనంగా ఉండేవాళ్ళం.
మా ఇంట్లో ఒక తులసి మొక్క ఉండేది. దాని దగ్గర నిలబడి దండం పెట్టుకునేది. దాని చుట్టూ తిరిగి మందార పువ్వులు దానిమీద వేస్తూ, మనసులోనే ఏదో అనుకుంటూ సూర్యుడు వైపు అంటే తూర్పు వైపుకు తిరిగి దండం పెట్టుకునేది.
వారానికి ఒక రోజైనా ఉపవాసం ఉండేది. మేం అన్ని పండుగలు చేసుకునేవాళ్ళం. వినాయక చవితి, దీపావళి, సంక్రాంతి ఇలా అన్నీ…
సంక్రాంతికి మేమంతా చేసే హడావుడి మామూలుగా ఉండేదికాదు.
పండగ వచ్చిందంటే మా అందరికీ కొత్త బట్టలు కొంటారు.
పండగ వచ్చిందంటే మంచి పిండివంటలు చేసుకుంటాం.
ఇవే మాకు ఎంతో ఆనందాన్ని ఇవ్వడానికి ప్రధాన కారణాలు.
క్రొత్తబట్టలు కొని వాటిని మిషన్ దగ్గర కుట్టించేవారు.
దర్జీవాళ్ళు ఒక్కోసారి ఆ పండక్కి ఇస్తామన్న సమయానికి బట్టలు కుట్టి ఇవ్వలేకపోయేవారు.
మాకు సూర్య నారాయణగారు కుట్టించి ఇచ్చేవారు.
ఆయన దగ్గర చాలా మంది పనిచేసేవారు.
అయినా సమయానికి ఇవ్వలేకపోయేవారు.
అప్పుడు మేము ఎంతగానో ఏడ్చేసే వాళ్ళం.
అందుకని పండగ చాలా రోజులు ఉందనగానే బట్టలు కొనిపించుకొని కుట్టించుకోవాలని, ఆ పండక్కి వేసుకోవాలని ఎంతో ఉబలాటం పడేవాళ్ళం.
నాకూ మా తమ్ముడికీ పోటా పోటీగా ఉండేది.
నేను వేసుకున్నటువంటివే వాడూ కావాలని అడిగేవాడు. వాడేసుకొన్నటువంటివే నేనూ కావాలనేవాణ్ణి.
ఒకోసారి వాడికి మంచి బట్టలు కుట్టించారనీ నాకూ అటువంటివే కావాలని నేనూ, వాడూ అలాగే అడిగేవాడు.
ఈ బాధపడలేక మా అమ్మా, నాన్న సాధారణంగా మా ఇద్దరికీ ఒకే రకం బట్టలు కొనుక్కొచ్చేవారు.
ఆ బట్టలు మిషన్ వాళ్ళకి ఇస్తే మాకు ఒక్కోసారి కురచగా కుట్టేవారు.
బట్ట సరిపోలేదనేవారు.
తీరా తర్వాత ఆ బట్టను కొంచెం తీసి వాళ్లు ఏదో దానికి ఉపయోగించుకునే వారని తెలిసేది.
అలాంటప్పుడు వాళ్లతో గొడవ పెట్టుకోవాలనిపించేది.
ఒక్కోసారి మాకు ఆ బట్టలు పొడవుగానో లూజుగానో, బిగువుగానో పొట్టిగానో కుట్టేవారు.
కాసేపు మాలో మేము గొణుక్కొంటూ, ఏడుస్తూ మిషన్ వాడిని తిట్టుకుంటూ దానితోనే అడ్జస్ట్ అయిపోయే వాళ్ళం.
ఒకోసారి అయితే బటన్లు సరిగ్గా వేసేవారు కాదు. షర్టులకు కాజాలు కూడా సరిగ్గా కుట్టేవారు కాదు.
ఏదేమైనా పండగ వచ్చిందంటే మాకు కొత్త బట్టలు కొంటారు.
అందుకని ఎన్ని పండుగలు ఎక్కువగా వస్తే అన్ని సార్లు కొత్తబట్టలు కొంటారనిపించేది.
అసలు ఈ పండుగల్ని ఎవరి నిర్ణయించారు? అసలు పండుగ అంటే ఏంటి?
ఈ పండగలకే కొత్త బట్టలు ఎందుకు కుట్టించుకోవాలి?
ఈ పండుగలకే మనం పిండి వంటలు ఎందుకు చేసుకోవాలి?
ఈ పండుగలకు మనం తప్పనిసరిగా తలకి స్నానమెందుకు చెయాలి? …
ఆ ప్రశ్నల్ని అప్పుడప్పుడు అమ్మనీ, నాన్ననీ, ఫ్రెండ్స్ నీ అడిగేవాణ్ణి.
రకరకాల సమాధానాలు వచ్చేవి.
అన్నీ శ్రద్ధగా వినే వాణ్ఢి.
కానీ, నాకు ఏవీ అంతగా సంతృప్తినిచ్చేవి కాదు.
మనసులో మాత్రం ఈ పండుగలు అప్పుడప్పుడూ మాత్రమే పేదవాళ్ళకొస్తాయి.
డబ్బున్న వాళ్లకు రోజు పండగే కదా అనిపించేది.
అయినా…ఈ దేవుడు కొంత మందిని పేదవాళ్ళగా ఎందుకు చేశాడో…
ఇంకొంతమందిని ధనవంతులుగా ఎందుకు చేశాడో అనిపించేది.
మా ఊరులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి బాగా జరుపుకునేవారు.
అది గుమ్మడి చెరువు దాటిన తర్వాత వడ్డిపేటకు మధ్యలో మైలుకూలోళ్ళ ఇంటిదగ్గర ఎదురుగా ఉన్న ఒక తోటలో జరిగేది.
రోడ్డు దూరాన్ని గుర్తించడానికి మైలు రాయిలు వేస్తుంటారు కదా… ఆ పని చేసేవాళ్ళ కుటుంబం ఆ రోడ్డుకి ప్రక్కనే ఉండేది. ఆ విధంగా వాళ్ళకి మైలుకూలోళ్ళనే పేరొచ్చింది.
ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి జరిగేచోట
ఒక పెద్ద పాములు పుట్ట…ఆ పుట్టను ఆనుకొనే ఒక రావి చెట్టు ఉండేది.
ఆ తీర్థానికి వచ్చే జనం ఆ పుట్టలో పాలు పోసేవారు.
పుట్టకి పసుపు కుంకుమతో పూజలు చేసేవారు. కొంతమంది కోడిగుడ్లుని ఆ పుట్టలో వేసేవారు. అక్కడే కొబ్బరికాయలు కొట్టి ఒక కుడక అక్కడ పెట్టేవారు. మరొక కుడక ప్రసాదంగా భావించి దాన్ని తీసుకొని వెళ్లేవారు. కొంతమంది అరటిపళ్ళు పెట్టి, వాటికి అగరవత్తులు గుచ్చి పూజలు చేసేవారు.
కొంతమంది ఏ కొబ్బరికాయనీ కొట్టకపోయినా దండం పెట్టుకున్నట్లుగా పెట్టుకొని, అక్కడ ఉన్న కొబ్బరి కుడకల్నీ, అరటి పళ్ళునీ తీసుకుని తింటూ ఎంజాయ్ చేసేవారు.
ఆ సందర్భంగా అక్కడ జరుగుతున్న తీర్థంలో రకరకాలైన వాటిని అమ్మేవారు.
అది ఒక చిన్న పాటి తీర్థమే గాని ప్రజలు బాగా వచ్చేవారు.
నాకు తెలిసి, మా చెయ్యేరు గ్రామ పంచాయతీ పరిధిలో జరిగే పెద్ద తీర్థం ప్రభల తీర్థం.
అది చెయ్యేరు లోని ప్రెసిడెంట్ దంతులూరి రాంబాబు (రాజు) గారి తోటలో జరిగేది. ఆ తోటను ఆనుకొని మరికొంతమంది తోటలు ఉండేవి. ఎటుచూసినా రకరకామిడి చెట్లు, జీడి మామిడి చెట్లు ఉండేవి.
అక్కడికి ఆ గ్రామపంచాయతీలోని ఒక్కొక్క చిన్న చిన్న గ్రామం నుండీ ప్రభలు పట్టుకొని వచ్చి, పెద్ద ఎత్తున ఆ తీర్థాన్ని జరుపుతారు. ఏ గ్రామం నుండి పెద్ద ప్రభ వస్తుందోనని ఆ ప్రభలు చూడడానికి జనం తండోప తండాలుగా వస్తారు.
అక్కడ కోడిపందాల ఆటలతో సహా, రకరకాలైన వినోదాలు, రకరకాలైన దుకాణాలు, పిల్లలకు, పెద్దలకు వినోదాన్ని ఇచ్చే ఆటలు జరుగుతూ ఉంటాయి.
ఫార్ట్యూన్ వీల్, మూడుముక్కలాట, కావాల్సిన వస్తువులపై రింగులు విసిరే ఆటలు…
ఇలా రకరకాలైన ఆటలు, ఆనందాలకు మాకు ఈ రెండు తీర్థాలే కలిగించేవి.
ఈ తీర్థాల్లో మాఊరి ప్రజలు మాత్రమే కాకుండా ప్రక్క ఊరివాళ్ళు కూడా చాలామంది వచ్చేవారు.
అక్కడ షావుకార్లు రకరకాలైన దుకాణాలు పెట్టి అమ్ముతుండేవారు.
వాటితో పాటు బుడగలు, వెదురుతో చేసిన పిల్లంగ్రోవులు, ప్లాస్టిక్ ఈలలు, రంగు కాగితాలతో చేసిన గాలిపటాలు…
రకరకాల ఆటవస్తువులు అమ్మేవారు.
వీటితో పాటు తినడానికి బెల్లంతో చేసిన రకరకాలైన జీళ్లు, కొబ్బరి లౌజు ఉండలు, పంచదార చిలకలు, నువ్వుల ఉండలు, మైసూర్ పాక్ ముక్కలు, జంతికలు, జిలేబీలు, మిఠాయి ఉండలు… ఇలా రకరకాలైన పదార్థాలు కూడా అమ్ముతుండేవారు.
నాకు తెలిసి ఒక పావలా పట్టుకెళ్తే వీటిలో ఒకటో, రెండో కొనుక్కోవచ్చు. నాకు పావలా, పది పైసలు, ఐదు పైసలు కూడా తెలుసు.
ఒక రూపాయి ఉంటే ఆడుకోవడానికి ఆట వస్తువులు కూడా కొనుక్కోవచ్చు.
వాటితో పాటు మనం డబ్బులు పెట్టి ఆడే ఆటలు కూడా ఉండేవి.
''తీర్థం వెళతాం. ఒక పావలా ఇవ్వమ్మా'' అని అడిగితే, మా అమ్మ తీర్థం చూడ్డానికి డబ్బులెందుకని ఎదురు ప్రశ్న వేసేది. ''ఇంట్లోనే ఏవైనా వండుతాను లేతినండి'' అనేది మా అమ్మ.
మా అమ్మకు తెలియకుండా మాత్రం మా నాన్న మాకు ఒక్కో అర్థరూపాయి చొప్పున నాకూ, మా తమ్ముడికీ ఇచ్చేవాడు.
అవి జేబులో ఉంచుకునే మళ్ళీ అమ్మని అడిగేవాళ్ళం. అమ్మేమో తీర్థం చూడాలంటే కావాలంటే చూసి రండని చెప్తేది. అలాగే అంటూ ముసిముసి నవ్వులు నవ్వుకొంటూ మేము వెళ్ళిపోయేవాళ్ళం.
''ఈ వారం తన ఆత్మకథా భాగంలో- రచయిత ఆచార్య దార్లవెంకటేశ్వరావుగారి మాతృమూర్తి తమ కుటుంబం కోసం, బంధుమిత్రుల కోసం, ఇరుగుపొరుగు వారి కోసం, దేవుడికి దండం పెట్టుకొని తమ విన్నపాలు విన్నవించుకోవడం ద్వారా మాతృమూర్తి వ్యక్తిత్వాన్ని సజీవంగా దృశ్యీకరించారు.తమ బిడ్డలకు కూడా ఇహలోక, పరలోక సంబధమైన ఆధ్యాత్మిక చింత బిడ్డలకు నేర్పుతారు.దాని వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసంతో పాటు నిజాయితీ, సత్యంతో కూడిన జీవనవిధానం, క్రమశిక్షణ, ఏకాగ్రతలను పెంపొందించుకొనే మార్గాల్ని అలవర్చారు. ఆచార్య దార్లతో పాటు, తమ అన్నదమ్ములు కళ్ళమూసుకొని అమ్మతోపాటు భక్తిశ్రద్ధలతో దేవుని పూజించి ఆచరించే విధానాన్ని చక్కగా వివరించారు. రచయిత తమతో పాటు తమ చుట్టూ ఉన్నవాళ్ళంతా బాగుండాలనే ఆలోచన కలిగించడంలో తన మాతృమూర్తి పాత్రను పరోక్షంగా సూచించారు.
అదిమాత్రమే కాదు తీర్థానికి ( తిరునాలకు) వెళ్ళడం, నాన్నదగ్గర ఓ అర్థరూపాయి తీసుకొని, దానిలో మరలా కేవలం పావలా మాత్రమే ఖర్చుపెట్టుకొని, మిగతా పావలా మిగిల్చుకోవడంలో రచయిత బాల్యంనుండే ఆర్థికవిషయాల్లో ఏవిధంగా పొదుపు చేయాలనే విషయాన్ని పాఠకులకు వివరించిన తీరు అద్భుతం.
మహాకవి గుఱ్ఱం జాషువాగారు తన పేదిరికం గురించి దేవుడిని అనేక ప్రశ్నలు వేశాడు. దేవుణ్ణి నిలదీశాడు. రచయిత దార్లవెంకటేశ్వరావు కూడా ఓ ప్రశ్నించే తత్వమూ, ఆయనలో నిలదీసే గుణమూ తన బాల్యంనుండే అలవర్చుకున్నారు. అసలు ఆ పండగంటేనే ఉన్నవాళ్ళకు రోజూ పండగే. లేనివాళ్ళకు పండగరోజు మాత్రమే పండగ. అయినా ఈ గొప్పాపేదా అనే తారతమ్యాలు ఏంటి? అనే ప్రశ్న లేవదీస్తాడు రచయిత.
రచయిత తండ్రి పండగ రోజులకు ఇవ్వాలని కొత్తబట్టలు టైలర్ కి ఇస్తారు. వాళ్ళు పండగనాటికి కొత్తబట్టలు అందివ్వరు. ఒకవేళ ఇచ్చినా అవి లూజుగానో, టైట్ గానో ఉంటాయంటారు రచయిత. అయినా పండగ కదా ఏదో రకంగా సర్ధుకుపోక తప్పదు. ఇది అనేకమంది జీవితానుభవాల్లో కనిపించే వాస్తవం.
ఇంత చక్కటి ఆత్మకథను పాఠకులకు అందించిన రచయిత ఆచార్య దార్లవెంకటేశ్వరావు గారికి, చక్కని ఆత్మకథను ప్రచురిస్తున్న భూమిపుత్ర శ్రీహరి మూర్తి గారికి హృదయపూర్వక అభినందనలు... జయహో భూమిపుత్ర.
దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి, కవి, రచయిత
4.1.2023''
నాకు బెల్లం జీళ్ళో, కొబ్బరి లౌజు ఉండలో ఒక పావలాతో సరిపెట్టుకొని కొనుక్కొనే వాణ్ణి.
మిగతా పావళా అలాగే జేబులో వేసుకొని తీర్థం అంతా చూసి వచ్చేయాలని మా తమ్ముడికి చెప్పేవాణ్ణి.
ఒకవేళ వాడేదైనా కొనుక్కున్నా, నేను మాత్రం పావలాకి మించి కొనాలనిపించేదికాదు.
నేనొక్కడినే వెళితే అదీ కొనుక్కొనేవాణ్ణి కాదు. అమ్మ అప్పటికే చేసిన పోకుండలు కొన్ని జేబులో వేసుకొని, ఆ తీర్థంలో తింటూ నిజంగా మా అమ్మ అన్నట్లే అవన్నీ చూసి వచ్చేసేవాణ్ణి.
కొన్ని మిఠాయిలు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరేవి. వాటిని నోట్లోనే మింగేసేవాణ్ఢి.
ఒక్కోసారి మాత్రం ఆ ఫార్ట్యూన్ వీల్ ఆటలో రింగువిసిరి వస్తువుల్ని దక్కించుకొనే ఏదైనా ఆటని ఆడాలనుకొనేవాణ్ణి.
మళ్ళీ డబ్బులు పోతాయేమోనని భయపడి ఆ ఆటలేవీ ఆడకుండానే అవన్నీ చూసి చూసి వచ్చేసేవాణ్ణి.
మన కళ్ళకు అన్ని రంగు రంగుల వస్తువులెందుకు కనిపించాలి?
కళ్ళకు కనిపించేవాటిన్నింటిపైమనసెందుకు పోవాలి ?
ప్రపంచంలో ఎన్నో నచ్చేవే ఉంటాయి.అన్నీ కావాలనిపిస్తే సాధ్యమా! వీటిని నియంత్రించుకోవాలా! నియంత్రించుకోలేక పోతే ఆశలన్నీ శిఖరాల్లా కూలిపోవాల్సిందేనా!
కోరుకున్నవన్నీ కొండల్లా పేరుకుపోతున్నా,
వాటన్నింటినీ అధిరోహించాలనుకోవడం, అప్పుడు పొందే ఆనందాన్ని అనుభూతి చెందడం అందరికీ సాధ్యం కాదు.
అయినా అన్వేషిస్తాం.
గుప్పెటవిప్పి చూడగానే ఎన్నో ఎండమావులే ఎదురౌతుంటాయి. కోరికలు పర్వతాలైతే,
జీవితంలో ఎన్నింటిని అధిరోహించాలో!
పయనించే దారిలో కష్టాలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోతుంటే వాటిలో ఎన్నింటిని తొలిగించుకుంటూ పోవాలో,
ఆ గుట్టల్నే రహదారిలా మార్చుకోవాలో!
జీవితమే అన్నీ నేర్పిస్తుంది.
(సశేషం)
-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,
తెలుగు శాఖ అధ్యక్షులు,
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
హైదరాబాద్
ఫోన్: 9182685231
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి