నూతన సంవత్సరంలో తెలుగు శాఖ శ్రీకారం చుట్టిన పనులు.
కరోనా సమయాన్ని దాటుకుంటూ మరలా సాధారణంగా జరిగే తరగతులకు రావడమనే ఈ సందిగ్ధ కాలాల మధ్య నేను తెలుగు శాఖకు అధ్యక్షత బాధ్యతలు తీసుకున్నాను. దీనితోపాటు నూతన విద్యా విధానం 2020 ప్రకారం కొత్త ప్రణాళికల ప్రకారం సిలబస్ రూపకల్పనలు జరుగుతున్నాయి. ఇది సెంట్రల్ యూనివర్సిటీ కనుక ఉభయ రాష్ట్రాల వారు దీనిపై దృష్టిని కేంద్రీకరించడం సహజం. తెలుగు భాషాసాహిత్యాలను అధ్యయనం చేస్తే లభించే ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునే కోర్సుల రూప కల్పన చేస్తున్నాం. దీనితోపాటు జాతి సంస్కృతీ, వారసత్వం, చరిత్రల సమ్మేళనంగా ముందుకు వెళ్లగలిగే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే కోర్సుల రూపకల్పన కూడా జరుగుతుంది. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ సదస్సులు నిర్వహిస్తున్నాం వాటిని విస్తృతపరిచి విద్యార్థిని విద్యార్థులలో నాయకత్వ లక్షణాలను పెంపొందించే ప్రయత్నం చేయాలనుకుంటున్నాం. ఉత్తమమైన, నాణ్యమైన పరిశోధనలకు తెలుగు శాఖను ఒక కేంద్రంగా చేయాలనే సంకల్పం కూడా ఉంది. ఉభయ రాష్ట్రాలలోని తెలుగు శాఖలలో ఎలా ఉన్నా, మా విశ్వవిద్యాలయం, తెలుగు శాఖలో సీట్లు దొరకడం గగనకుసుమంగానే ఉందని విద్యార్థులు భావిస్తున్నారు. దీనికి కారణం ఇక్కడ ఉన్న పూర్తిస్థాయిలో అధ్యాపకులు ఉండడం, నిరంతరం తరగతులు జరగడం ప్రధాన కారణం. దీని వలన జాతీయ స్థాయిలో వివిధ ఫెలోషిపపులతో పాటు యుజిసి వారి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్పులు మా విద్యార్థులే అత్యధికంగా సాధించడం జరుగుతుంది.
-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, తెలుగు శాఖ అధ్యక్షులు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్
(సాక్షి దినపత్రిక వారు, నూతన సంవత్సరంలో శ్రీకారం చుట్టిన పనుల గురించి మీ అభిప్రాయాలు రాసి పంపించమన్నప్పుడు స్పందించి పంపినవి. వీటి నుండి కొన్ని అభిప్రాయాలు తీసుకొని ది2.1.2023వతేదీ, హైదరాబాద్ ఎడిషన్, శేరిలింగంపల్లి జోన్ పేజీలో ప్రచురించారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. )
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి