"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

16 నవంబర్, 2022

ఆచార్య దార్ల ఆత్మకథ ( నెమలికన్నులు) 16వ భాగం


ఆచార్య దార్ల ఆత్మకథ ( నెమలికన్నులు) 16వ భాగం 

నేనూ ఓ సైకిల్ కి ఓనరైయ్యాను.


నేను స్కూల్ కి నడిచి వెళ్ళినన్నాళ్ళూ రోడ్లు నాతో మాట్లాడేవి. నేను రోడ్లుతో మాట్లాడేవాణ్ణి అన్నట్లు సాగేది నా ప్రయాణం. బడిలో నుండి తెచ్చుకునే సుద్దముక్కలతో రోడ్డుమీద నాకిష్టమైన బొమ్మలేసుకొంటూ నాకు తోచిన రాతలేవో రాసుకుంటూ వచ్చేవాణ్ణి. అలా నడిచి వచ్చేశ్రమనంతా మర్చిపోయేవాణ్ణి. అక్కడక్కడా అలా ఎందుకు రాసేవాణ్ణో నాకే తెలియదు. రాసేవాణ్ణి అంతే... రెండు మూడు రోజుల తర్వాత నాలాగా ఇంకొంతమంది కూడా రాసేవారు. అలా కొంతమంది నడకలో ప్రయాణమిత్రులు దొరికారు. గొరగనమూడి దాటిన తర్వాత సావరం, ఊప్పూడి గ్రామాలకొచ్చేసరికి చాలామంది నడుచుకొంటూ వచ్చేవాళ్ళు కలిసేవారు. అంతవరకు నాతో మాట్లాడిన రోడ్డు ‘మీరూ మీరూ మాట్లాడుకోండిక’ అంటూ మౌనంగా నిద్రపోయేది.

 తురకసావరం అని సావరానికి ఉప్పూడికి మధ్య ఒక చిన్నగ్రామం ఉండేది. అక్కడ నుండి ఇద్దరు అమ్మాయిలు వచ్చేవారు. వాళ్ళు కూడా నడుచుకుంటూనే వచ్చేవారు. ఇద్దరూ నాకంటే పెద్దవాళ్లే. అప్పటికే వాళ్ళలో ఒకరు ఎనిమిదో తరగతీ, ఇంకొకరు పదవతరగతీ చదువుతున్నట్లు గుర్తు. వాళ్ళతో పాటు చాలామంది గుంపులు గుంపులుగా వచ్చేవారు. వాళ్ళెప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండేవారు. వాళ్ళతో మాలాంటి వాళ్ళందరమూ జాయిన్ అయ్యేవాళ్ళం. వచ్చేటప్పుడు నడిచి వస్తున్నట్లే అనిపించేదికాదు. ఆ తర్వాత ఊళ్లవాళ్ళు పెనుమెల్ల, బంటుమిల్లి, గొరగనమూడి ల నుండి స్కూలు కి వచ్చేవారు పెద్దగా ఉండేవారు కాదు. దూరం నుండి వెళ్ళేది నేనే కాబట్టి అక్కడ నుండి మళ్ళీ ఒంటరిగా ఉండడంతో నాతో మళ్ళీ రోడ్డో, రోడ్డుపక్కని చెట్లో, ఆ చెట్లపై ఉండే పక్షులో,  ఆ రోడ్డుకిరువైపులా ఉండే కొబ్బరి చెట్లు, వరిచేలు... ఇలా చాలానే నాతో మాట్లాడేవి.

రోడ్డు పక్కనే చాలా కొబ్బరి చెట్లున్నాయి కదా. ఇవన్నీ ఎవరికి చెందుతాయి? చెట్టునిండా కాయలు. ఆ వైపూ ఈ వైపు రెండు బోదెలు... ఎప్పుడూ ప్రవహించే నీళ్ళు... రోడ్డు పక్కనే పశువులు, మేకలు, గొర్రెలు వేసే పేడ, రెట్టల వల్ల, మనుషుల మల మూత్రాల వంటివన్నీ ఎరువులుగా ఉపయోగపడ్డం వల్ల కొబ్బరిచెట్లు బలంగా కాసేవి. కొబ్బరి గెలలు నిండుగా ఉండేవి. ఇవన్నీ ఎవరికి చెందుతాయి? ఒకవేళ ఒక కొబ్బరికాయో, కొబ్బరి కమ్మో, ఆకులో పడితే మనం తీసుకొని వెళ్లవచ్చా అని ఇంట్లో అడిగితే, అవి కొంతమంది పాటపాడుకుంటారనీ, పాట అంటే యేడాదికోసారి టెండర్ వేసి, ప్రభుత్వానికి కొంత డబ్బు చెల్లిస్తారనీ చెప్పారు.

అలా మనం కూడా పాడుకోవచ్చుకదా అంటే, అదెప్పుడు పాడతారో మనకెవరికీ తెలీదనేవారు. అవన్నీ రాజులో, కాపులో పాడుకునేవారు. బాగా డబ్బున్నవాళ్ళే దాన్ని దక్కించుకునేవారు. చిత్రమేమిటంటే ఒక కొబ్బరి చెట్టు ఏడాదికిచ్చే కొబ్బరికాయల రేటు కూడా సంవత్సరానికి చెల్లించేవారు కాదని నాకు ఊహవచ్చిన తర్వాత తెలిసి ఆశ్చర్యపోవడం నావంతయ్యేది. ఆ విధంగా రోడ్డు ప్రభుత్వానిదే అయినా, రోడ్డుకిరువైపులా కొబ్బరి చెట్లు కూడా ప్రభుత్వానివే అయినా, వాటి కాయలు మాత్రం డబ్బున్నవాళ్ళింటికెళ్ళాల్సిందే. ఒక కాయ కిందపడినా, ఒక ఆకు కిందపడినా వాటిని ఎవ్వరూ ముట్టుకోవడానికి లేదు. నడిచివెళ్లి వచ్చినప్పుడల్లా ఆ కొబ్బరి చెట్లు నాతో ఏవేవో చెప్పుకుంటున్నట్లనిపించేది.

రోజూ బడికి నడిచి వెళ్లలేనంటే, ఇంట్లో పశువులున్నాయి కదా... వాటిని మేపమంటారని భయమేసి, ఆ కష్టాన్నెలాగోలా చెప్పాలనుకునేవాణ్ణి. ఒకసారి ‘‘నేను అంతదూరం బడికి నడిచి వెళ్ళలేను. నాకు సైకిల్ కావాలి’’ అన్నాను. వెంటనే అమ్మో, నాన్నో గానీ ‘‘నువ్వంత కష్టపడ్డమెందుకు... మనకున్న గేదెల్ని మేపు. చిన్న అన్నయ్యలాగే నువ్వూ ఎవరొకరిదగ్గర పాలేరుగా ఉండు. నీకే కష్టం ఉండదు కదా...’’ అన్నారు. ఆ మాటలు గుర్తొచ్చి, నాకేదోలా సైకిల్ కొనిపించుకోవాలి. దాన్ని జాగ్రత్తగా అడగకపోతే మొదటికే మోసం వస్తుందనుకుని, ఆనాటి నుండీ జాగ్రత్తగా దాన్ని సందర్భం చూసుకొని ప్రస్తావించేవాణ్ణి.

అప్పటికే పెద్దన్నయ్య భీమనపల్లి హైస్కూల్ లో చదువుతున్నాడు. పెద్దవాడు. అమ్మానాన్నలకు గారాలపట్టి, కాబట్టి వాణ్ణి పెద్ద కలెక్టర్ చేయాలనేవారు. వాడేమి అడిగినా కాదనేవారుకాదు. కానీ, నేను అడిగితే కోప్పడేవారు.

నాకెలా కొత్తసైకిల్ సాధించుకోవాలో తెలిసేది కాదు. ఆదివారం గానీ, సెలవురోజులుగానీ వస్తే, నేను కూడా పొలం పనికి వెళ్ళేవాడిని. నాకు కూడా కూలిపనికి జీతం ఇచ్చేవారు. నాకు తెలిసి పెద్దన్నయ్య మాత్రం ఎవరికీ పనికి వెళ్ళలేదు. చివరికి సొంత పొలం పనికూడా చేసిన గుర్తులేదు. అయినా వాడంటే అమ్మానాన్నలకు గారాబంగా ఉండేది.

సాధారణంగా ఖరీఫ్ లో పొలం దున్నినప్పుడు నీటితో కూడిన ఆ మట్టి గుట్టలు గుట్టలుగా ఏర్పడుతుంది. దీనివల్ల చేనంతా కొన్ని చోట్ల పల్లంగాను, మరికొన్ని చోట్ల మెరకగాను తయారవుతుంది. అలాంటప్పుడు చేనులో నీళ్ళు సమానంగా ప్రవహించడానికి ఆ గుట్టలుగా ఏర్పడిన మట్టిని సరిచేయాలి. అలా సరిచేయడాన్ని తొరాలు వేయడం అంటారు. బహుశా, నాగలి దున్నినప్పుడుగానీ, ట్రాక్టరుతో దున్నినప్పుడుగాని తొర్రలు ఏర్పడతాయి. అంటే పెద్దపెద్ద ఖాళీలు ఏర్పడతాయి. ఆ స్థలంలోని మట్టి పక్కకో, దూరంగానో తీసుకొనిపోయి చిన్నచిన్న గుట్టలుగా పడిపోతుంది. వాటినే తొరాలు అని వ్యవహరిస్తుంటారు. వాటిని సరిచేయడానికి పెద్దవాళ్లకంటే నావయసున్న వాళ్ళనే ఎక్కువగా పనిలో పెట్టుకోవడానికి రైతులు ఇష్టపడుతుంటారు. అందువల్ల ఆ పనులకు వెళ్ళేవాణ్ణి.

మొదట్లో తొరాలు వేయడం సరదాగా అనిపించేది. గబగబా ఆ తొరాలు సరిచేసేవాణ్ణి. మోకాళ్ళలోతు నీరు, దానిలో దిగబడిన కాళ్ళు లాక్కొంటూ ఆ మట్టి ముద్దల్ని విడదీసి అక్కడ నుండి పల్లంగా ఉన్న చోటులోకి విసిరేయాలి. అలా విసరడానికి కుదరనప్పుడు, దూరంగా ఉన్నప్పుడు ఆ మట్టి ముద్దల్ని విడగొట్టి అక్కడకు పట్టుకెళ్ళి వెయ్యాలి.

ప్రతి రోజూ ఏడు కిలోమీటర్లు నడుచుకొంటూ, మళ్ళీ సాయంత్రం ఏడు కిలోమీటర్లు నడుచుకొంటూ రావడం చాలా కష్టమనిపించేది. ఎందుకొచ్చిన జీవితంరా అనికూడా అనిపించేది. అయినా తప్పదు, సైకిల్ కొనుక్కోవాలి కదా.

అందువల్ల కూలిపనికి వెళ్ళక తప్పదు. కానీ, అలా పనిలోకి వెళ్ళిన తర్వాత గంటకో, రెండుగంటలకో ఉన్నశక్తి నా అంతా అయిపోయేది. ఏదైనా తినడానికి ఉంటే బాగుండుననిపించేది. ఆ సమయంలో తినడానికి సద్దన్నం తెచ్చుకొనేవాళ్లం. కేవలం చేతులు, ముఖం మాత్రమే కడుక్కొని, కాళ్ళుకూడా కడుక్కోకుండానే ఆ గట్టుమీద కూర్చొని గబగబా ఆ సద్ధన్నం తినేసేవాళ్ళం. దానిలో ఒక ఉల్లిపాయో, పచ్చిమిరపకాయో నంజుకుని తింటుంటే దానికి ఏ అమృతమూ సరిపోద’నిపించేది.

 అలా రోజంతా  పనిచేస్తే, సాయంత్రానికి పెద్దవాళ్లకంటే మా వయసులోవాళ్ళకి మాత్రం తక్కువగా కూలి ఇచ్చేవారు. అది కూడా రోజుల తరబడి తిప్పుకొని తిప్పుకొని ఇచ్చేవారు. గట్టిగా అడిగితే, ఈ వయసులో వాళ్ళను కూలికి పెట్టుకోవడమే గొప్ప అన్నట్లు మాట్లాడేవారు. అందువల్ల మాకివ్వవలసిన కూలి డబ్బులు రాబట్టుకోవడానికి కూడా గాజు బొమ్మను అందుకున్నంత జాగ్రత్తగా తీసుకోవలసి వచ్చేది.

తొరాలు వెయ్యడం, పొలంలోకి నీళ్ళు పెట్టే గుళ్ళ తోడటం వంటి వ్యవసాయం పనులతో పాటు, చేను చుట్టూ గట్టి పేరుకుపోతే దాన్ని బాగుచేసి, రంధ్రాలు మూసేయడానికి తెలిసేలా గట్టుకి పారతో లంకలు కొట్టడం, దాని చుట్టూ వరకట్టడం వంటి పనులన్నీ మా పొలంలోనే నేర్చుకున్నాను. దీనితోపాటు ఆకుమడి (నారుమడి)లో నారు జాగ్రత్తగా లాగడం, కట్టలు కట్టడం, వాటిని మోపులు కట్టి, పొలమంతా వేయడం వంటి పనులు కూడా నేర్చుకున్నాను. అప్పుడప్పుడూ సరదాగా ఆడవాళ్ళు మాత్రమే చేసే ఊడుపు ఊడ్చటం (వరినాట్లు వేయడం) కూడా చేసేవాణ్ణి. తర్వాత కలుపుతీయడం, కోతలు కోయడం, పనపట్టికెళ్ళి మోపులు కట్టడం, కుప్పవేయడం, నూర్చడం, ధాన్యం కోసం పనలు కొట్టడం లేదా నూర్చడం వంటి పనులు కూడా నేర్చుకున్నాను. కుప్ప నూర్చాక వచ్చే ధాన్యాన్ని ఎగరబోయడం ( తూర్పారబట్టడం), ధాన్యాన్ని బస్తాల్లోకి వేసి వాటిని బండ్లు, ట్రాక్టర్లకు మోయడం వంటి పనులెన్నో నేర్చుకున్నాను. ఆ విధంగా నా సైకిల్ కొనుక్కోవడానికి నేను కొంత కూలిపనిచేసుకుని సంపాదిస్తున్నాననే నమ్మకం కలిగింది.

అలా కొన్ని పనులు చెయ్యడం, దానికి కొద్దిగా డబ్బులు రావడం వల్ల నాకు సైకిల్ కొనమని అడిగే ధైర్యం వచ్చేది. అమ్మా, నాన్నవాళ్ళుకూడా పెద్దగా వ్యతిరేకతను వ్యక్తం చేసేవారు కాదు. కానీ, ‘‘ఇంకా నీది చిన్నవయసు. దాన్ని తొక్కలేవు. ముందు బాగా నేర్చుకో... తర్వాత కొంటాంలే’’ అనేవారు. నేను గానీ, తమ్ముడుగానీ సైకిల్ నేర్చుకోవాలంటే ఎలా? పెద్దన్నయ్యకు సైకిల్ ఉంది. కానీ దాన్ని ముట్టుకోనిచ్చేవాడు కాదు. దీనితో నాకు సైకిల్ నేర్చుకోవడం ఒక సవాలుగా నిలిచింది.

అప్పటి మా ఫ్రెండ్స్ కొంతమంది స్కూల్లో సైకిల్ వేసుకొని వచ్చేవారు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండేవాణ్ణి. వాళ్ళదగ్గర సైకిల్ నేర్చుకున్నాను. దాన్ని పట్టుకోవడానికే నాకు బలం సరిపోయేది కాదు. ముందు నడిపించమనేవారు. తర్వాత ఫెడల్ పట్టుకొని తొక్కడం నేర్చుకున్నాను. నేను సన్నగా ఉన్నా,  కొంచెం పొడవుగానే ఉండడం వల్ల తొందరగానే నేర్చుకున్నాను.

ఈలోగా మాకు హైస్కూల్ లో తెలుగు పాఠాలు చెప్పే శ్రీకంఠం లక్ష్మణమూర్తిగారు పరిచయమయ్యారు. ఆయన పెనుమెల్ల నుండి కాట్రేనికోన సైకిల్ మీద వచ్చేవారు. వాళ్ళమ్మాయి కూడా మా స్కూల్ లోనే చదుతుండేది. అందువల్ల వాళ్లమ్మాయిని కూడా తన సైకిల్ పై తీసుకొచ్చేవారు. ఆయన పాఠం చెప్తుంటే నాకెంతో సంతోషంగా అనిపించేది. పద్యం చదివినా, పాఠం చెప్పినా నాకు వెంటనే ఆ పద్యాన్ని చదవాలనిపించేది. క్లాసులో ఆయన పాఠం చెప్పి, మళ్ళీ పద్యాల్ని చదివించేవారు. నేనొకసారి ఆయన రాగం తీసినట్లే పద్యాన్ని చదవడం మొదలు పెట్టి, అందరూ నవ్వేస్తే ఆపేసి, మామూలుగా చదివేసే ప్రయత్నం చేశాను. కానీ లక్ష్మణమూర్తిగారు ‘‘నీకు తెలిసినట్లే రాగంతోనే చదవు అన్నారు. నాకేదో గొప్ప ఆత్మవిశ్వాసం మొదలైంది. ఆ క్లాస్ అయిన తర్వాత చాలా మంది మెచ్చుకున్నారు. ఆ విధంగా ఆయనంటే నాకు గౌరవం, ఆయన పాఠమంటే ఇష్టం ఏర్పడింది.  ఆ పద్యం చదివిన తర్వాత నుండీ నేను నడిచి వస్తుంటే, తన కూతురు తన సైకిల్ పై ఉన్నా ఆ అమ్మాయిని ముందుకూర్చోబెట్టుకొని, నన్ను వెనుక కూర్చోబెట్టుకొని స్కూలుకి తీసుకొచ్చేవారు. నన్ను స్కూలు ఆవరణ లోపలివరకూ కూడా అలాగే తీసుకొచ్చేవారు. దానితో నా క్లాస్మేట్స్ అంతా మరింతగా గౌరవించేవారు. ఆయన బ్రాహ్మణుడనీ, అయినా నిన్ను ఎలా సైకిల్ ఎక్కించుకొస్తున్నారని కొంతమంది నన్ను అడిగేవారు. ఏమో నాకు తెలియదనేవాణ్ణి. నాకు మాత్రం ఆయన పట్ల గౌరవం, ఆరాధనా పెరిగింది. ఆయన చదువు చెబుతున్న తెలుగు భాషపట్ల కూడా బాగా ఇష్టం పెరిగింది.

ఆయనతో పాటు మా ఊరికి ఇంకా మూడు కిలోమీటర్ల దూరం నుండి ఆతుకూరు లక్ష్మణరావుగారనే మాస్టారు వచ్చేవారు. ఆయన సోషల్ చెప్పేవారు. ఆయన రోజూ బోర్డు మీద ఆ రోజు ముఖ్యమైన వార్తల్ని రాయించేవారు. స్థానిక సమస్యల్ని పత్రికల్లో రాయడమెలాగో చెప్పేవారు. కొన్ని సామజిక కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించేవారు. స్కూలు ఆవరణమంతా శుభ్రంగా ఉండడానికి ఎన్.ఎస్.ఎస్ కార్యక్రమాల నిర్వహించేవారు. స్వయంగా ఆయన కూడా చిత్తుకాగితాలు ఏరేవారు. ప్లాస్టిక్ వస్తువుల్ని ఏరి డస్ట్ బిన్ లో వేస్తూ, మాకూ నేర్పేవారు. అలాంటి పనులు చేయడం తప్పుకాదనీ, అలాంటి పనులు చేసేవాళ్ళని, ముఖ్యంగా పాకీపని, రోడ్లు ఊడ్వడం వంటి పనులు చేసేవాళ్ళని గౌరవించాలనేవారు. ఆయన కూడా బ్రాహ్మణుడే.కానీ, అందర్నీ దగ్గరకు తీసుకొనేవారాయన. రోజూ పత్రికలు చదవాలనేవారు. లైబ్రరీకి వెళ్ళాలనేవారు. రేడియో వినాలనేవారు. ఆయన పనులు, ఆయన మాటలు నాకు బలే ఉత్సాహాన్నిచ్చేవి. నేను కూడా రోజూ కొంత సమయం కేటాయించుకొని కాట్రేనికోన పంచాయితీ లైబ్రరీలో గడపడం మొదలు పెట్టేవాణ్ణి.

నేను చెయ్యేరు అగ్రహారం నుండి కాట్రేనికోన హైస్కూల్ కి నడిచి వస్తున్నానని ఆయన నన్ను ఒకసారి క్లాసులోనే మెచ్చకున్నారు. అంతే కాకుండా, అప్పుడప్పుడూ ఆయన నన్ను సైకిల్ ఎక్కించుకొని స్కూలుకి తీసుకొచ్చేవారు. అలా వచ్చేటప్పుడు రోడ్లు పాడైపోతున్నాయనీ, వాటి గురించి మనమంతా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనీ, అలాగే ప్రతి గ్రామంలోను మనమంతా గ్రంథాలయం కోసం కూడా ఇంటిపన్ను రూపంలో కొంత సొమ్ము చెల్లిస్తుంటామనీ, ఆ రశీదుని చూడమనీ చెప్పేవారు.అందువల్ల ప్రతిగ్రామంలో ఒక లైబ్రరీ ని పెట్టాలనీ, అది ఆ గ్రామానికి ఉన్న హక్కనీ చెప్పేవారు. అందువల్ల ఆదివారం, సెలవురోజుల్లో నేను మా పంచాయితీ లైబ్రరీకి వెళ్ళి పత్రికలు అడిగేవాణ్ణి. నావయసులో వాళ్ళెవరూ అక్కడకు వచ్చేవారు కాదు. ఒక పంచాయితీ మెంబర్ ఎప్పుడూ అక్కడే ఉండేవాడు. అతని పేరు రామమూర్తి అనుకుంటాను. ఒకసారి నన్ను పలకరించాడు. నాగురించి వివరాలడిగాడు. అప్పుడు లక్ష్మణరావుగారు చెప్పిన ఇంటిపన్నులో గ్రంథాలయం కోసం కూడా కట్టే పన్ను గురించి చెప్పాను. అయితే, నేను ఆయనకి నమస్కారాలు చెప్పానని చెప్పమనీ, ఆ రోజు నుండీ నాకు కూడా ఒక పత్రికను చదువుకోమని ఇచ్చేవాడు.

ఇలా కొన్నాళ్ళు కూలిపనికి వెళ్ళగా వెళ్ళగా అమ్మా, నాన్నా దయచూపారు. ఏడవ తరగతిలో నాకు సైకిల్ కొనిచ్చారు.  నేను సైకిల్ కొనిపించుకోగలిగాను. కానీ, నాకు నేను సైకిల్ తొక్కడానికి ఏడాది పట్టింది. కానీ, మొదటి సంవత్సరం సీటు మీద కూర్చొని తొక్కలేకపోయేవాణ్ణి. ఎడమచేత్తో ఫెడల్ , కుడిచేత్తో సీటు పట్టుకొని తొక్కుకుంటూ వెళ్ళేవాణ్ణి. నేను సైకిల్ తొక్కికెళ్ళుతుంటే రోడ్డుమీద నన్ను వింతగా చూస్తూ, చాలామంది దూరంగా జరిగిపోతూ దారిచ్చేవారు.

ఎలాగైతేనేమీ నేనూ ఓ సైకిల్ కి ఓనరైయ్యాను. నా సొంత సైకిల్ పై నేను స్కూల్ కి వెళ్లగలుగుతున్నానని గర్వంగా ఫీలయ్యాను.

(సశేషం)

 – ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 

తెలుగుశాఖ అధ్యక్షులు, 

యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్,

 హైదరాబాద్ --500 046

ఫోన్ :  9182685231

 (భూమి పుత్ర దినపత్రిక, 16.11.2022 లో ప్రచురితం)

 

 


కామెంట్‌లు లేవు: