"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

02 నవంబర్, 2022

ఆచార్య దార్ల ఆత్మకథ ( నెమలికన్నులు) 15వ భాగం

 

భూమిపుత్ర దినపత్రిక 2.11.2022 సౌజన్యంతో 


జట్టు కటింగ్ – చెంబు ఇస్త్రీ

ఎలిమెంటరీ స్కూల్ వరకూ తల క్రాపింగ్  గురించి నాకెలాంటి ఇబ్బందీ లేదు. 

మా నాన్నే నాకు, మా తమ్ముడికి కూడా గుండు చెయ్యడమో, కటింగ్ చేయడమో జరిగేది. 

అలా మా పట్ల మా నాన్న జాగ్రత్తలు తీసుకొంటున్నాడని గర్వంగా కూడా ఉండేది. 

హైస్కూల్ కి వచ్చిన తర్వాత క్లాసులో కూర్చున్నప్పుడు వెనుక నుండెవరెరో అప్పుడప్పుడూ నా తల వెంట్రుకలు పట్టుకొని లాగేవారు. 

నాకు క్లాస్ వినడానికి చాలా ఇబ్బంది అయ్యేది. 

ఎవరొకరు నా తలవెంట్రుకలు లాగడం…

 నేను కోపంగా, అసహనంతో వెనక్కి చూడ్డం…

 లాగిందెవరో తెలియక బిక్కమొహం పెట్టడం…

క్లాస్ వాళ్ళంతా గొల్లుమని నవ్వడం…

బ్లాక్ బోర్డు మీద రాస్తున్న మాస్టారు వెనక్కి తిరిగి చూడ్డం…

ఆయన కళ్ళకి నేనే ఏదో చేస్తున్నట్లు అనిపించడం…

ఆయన నన్ను తిట్టడం…

అన్నీ నిమిషాల్లో జరిగిపోయేవి. 

ఇంతమందిలో నన్ను మాత్రమే ఎందుకలా ఏడిపిస్తున్నారని కూడా  అనిపించేది. 

ఒక్కోసారి కోపంతో వెనక ఉన్న వాళ్ళు కొట్టేసేవాణ్ణి. 

వాళ్ళు మేముకాదనేవారు.

అయితే లాగిందెవరో చెప్పమనేవాణ్ణి.

 వాళ్ళు ఒక్కోసారి చెప్పడం, కొన్నిసార్లు చెప్పకపోవడం…

ఆ వాతావరణమంతా చాలా చిరాగ్గా అనిపించేది. 

ఈ బాధ తట్టుకోలేక కొన్నిసార్లు చివరి బెంచీలో గోడకి ఆనుకొని  కూర్చునేవాణ్ణి. 

నాకేమో మొదటి బెంచీలో కూర్చోవాలని ఉండేది.

క్లాస్ అయ్యాక నాకు బాగా ఫ్రెండ్స్ లా ఉండే వాళ్ళని వివరాలు అడిగేవాణ్ణి. 

చెప్పడానికి మొహమాటం పడిన వాళ్ళు చెప్పేవారు కాదు. 

కానీ ‘వాళ్లతో గొడవ పెట్టుకోవద్దు. ఏదో సరదాగా అలా  ఆడిస్తున్నారంతే‘ అని సలహా ఇచ్చేవారు. 

ఆ విధంగా ఏడిపించడానికి కారణం నీ తల వెంట్రుకలు పైకి నిలబడి ఉంటున్నాయి. అందుకోసమే ఉంటుందని వివరించినవాళ్ళున్నారు.

ఆ మాటవిన్పప్పటి నుండీ నాకు అనుమానం మొదలైంది. నాన్నే తల కత్తిరింపు చెయ్యడం వల్ల సరిగ్గా చెయ్యట్లేదేమో. అందుకే అలా వేళాకోళం చేస్తున్నారనిపించింది.

మరలా నెలకి కటింగ్ వెయ్యాలనీ, తల వెంట్రుకలు పెరిగిపోయాయని నన్ను మా నాన్న కటింగ్ వెయ్యడానికి రమ్మన్నాడు.

నేను రాననీ, ఈ సారి మంగలితోనే చెయ్యించుకుంటానని అన్నాను.

‘మనకి మంగలాయన కటింగ్ వెయ్యడానికి రారు. అందుకనే నేను మీకు చేస్తున్నాను’ అన్నాడు మా నాన్న.

‘‘మరి మా ఫ్రెండ్స్ కి అందరికీ వాళ్ళ ఊళ్ళో వాళ్ళింటికొచ్చి మరీ కటింగ్ వేస్తారట. మనకెందుకు చెయ్యరు? ’’ అని అడిగాను.

‘అదంతే. మనకి చెయ్యరు. ఎవరైనా మనకి కటింగ్ వేసినట్లు తెలిస్తే ఊరంతా ఆ మంగలిని వెలేస్తారు. అందుకు చెయ్యరు’  

కొంచెం కోపంగానే సమాధానం చెప్పాడు చిరాగ్గా.

ఆ మాట విని కొంచెం భయమేసింది.

మళ్ళీ ఇంకో సందేహం అన్నట్లు ‘‘మనకెందుకు చెయ్యరు?’’  అన్నాను నెమ్మదిగా. 

మనం వాళ్ళని ముట్టుకోకూడదంట. మనం అంటరానివాళ్ళమంట. మనకే కాదు, మన తాత ముత్తాతలకీ వాళ్ళు తల కత్తిరింపు వెయ్యలేదు. మనవాళ్ళే ఆ పనినేర్చుకున్నారు. మనవాళ్ళకి మన వాళ్ళే మంగలిపనీ, వీరణాన్ని వాయించేపనీ వాళ్ళు చేసే పనులన్నీ మనవాళ్ళే చేస్తారు….’’ చెప్పుకుపోతున్నాడు. 

ఆకాశంలో మేఘాలన్నీ వేగంగా కదులుతున్నాయి. సూర్యుడు నడినెత్తుమీదుండి అగ్గి నిప్పులు కురిపిస్తున్నాడు.

నేనేమో అయోమయంగా ఏమర్థం కానట్లు నాన్నవైపే చూస్తున్నాను.

ఇంకా నాన్నే మాట్లాడుతునే ఉన్నాడు.  

‘‘... నువ్వడిగావు కనుక, రేపో, ఎల్లుండో మళ్ళీ దీన్నీ అడుగుతావని  ముందే చెప్తున్నాను. మీకు అమ్మగానీ, నేను గానీ లేదా మీరే గాని బట్టలు ఉతుక్కుంటున్నాం కదా. ఎందుకో తెలుసా? మనకి చాకలివాళ్లు (రజకులు) కూడా బట్టలు ఉతకరు. పోనీ, ఇస్త్రీ చెయ్యమంటీ అదీ చెయ్యరు. అందుకనే అప్పుడప్పుడూ మీకు బట్టలు శుభ్రంగా ఉండాలని చెంబులో నిప్పులు పోసి దానితో ఇస్త్రీ చేసిస్తాం. అది పిసినారితనమని మీరంటున్నారు. మేమెందుకు చేస్తున్నామో మాకే తెలుసు…’’ చెప్పుకుపోతున్నాడు. 

నాన్న ముఖాన్ని చూస్తుంటే,పైన సూర్యుడు మా నాన్న కళ్ళల్లోకి వచ్చినట్లనిపించింది. 

‘‘...అందుకే ఆ పనీ ఈ పనీ అని కాకుండా అన్నీ మనమే చేసుకోవాలి. అందుకే మీరూ చెయ్యమని చెప్తున్నాను…’’

ఆ వేగాన్ని ఆపలేకపోయినా, నాకొచ్చిన అనేక సందేహాల్లో కొన్నింటిని ప్రశ్నలుగా మార్చాను.

‘‘మరి వాళ్ల పొలంలో మనం పనిచేస్తున్నాం. వాళ్ళ తోటలో నువ్వు కొబ్బరి కాయలు దింపుతీస్తున్నావు. వాళ్ళ ఇంటికి తాటాకు కొడుతున్నావు. ఇవన్నీ మనం ముట్టుకోకుండా జరిగిపోతున్నాయా? అలా ముట్టుకునేటప్పుడు మనం అంటరానివాళ్ళమని వాళ్ళకు తెలియదా?‘‘

ఈ సారి నాన్న ముఖంలో ఒక ఆనందం తొంగిచూసినట్లనిపించింది. 

ఈ సారి నాన్న కళ్ళల్లో ఒక మెరుపు మెరిసినట్లయ్యింది. 

వాతావరణమంతా చల్లగా మారిపోయినట్లనిపించింది.

ఒక చిరునవ్వు నవ్వుతూ నాన్న ‘‘నీకివన్నీ తెలిసే రోజులు వస్తాయి. నీకు తెలిసి నువ్వు వాళ్ళని నిలదీసే రోజులు కూడా వస్తాయి. అది నీ ఒక్కడితోనే కాదు, అనేకమందిలో రావాలి. ఆ రోజు త్వరలోనే వస్తుంది. అంతవరకు మనం మన విధిని మనం నిర్వర్తించాలి…రా ముందు నీకు కటింగ్ వేస్తాను’’ అంటూ దగ్గరకు తీసుకున్నాడు. 


 (సశేషం)

  – ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 

తెలుగుశాఖ అధ్యక్షులు, 

యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్,

 హైదరాబాద్ --500 046

ఫోన్ఫ 9182685231



కామెంట్‌లు లేవు: