అర్థశతాబ్ది సమాజ ప్రతిఫలనమే
ఆచార్య తుమ్మల రచనలు
ఆచార్య తుమ్మల రామకృష్ణ రచనల్లో ఒక అర్థశతాబ్ది సమాజం ప్రతిఫలిస్తుందని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షులు ఆచార్య ఎస్వీ సత్యనారాయణ వ్యాఖ్యానించారు. హెచ్ సి యు లో పనిచేసి పదవీవిరమణ చేసి, ప్రస్తుతం ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పంలో ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్న ఆచార్య తుమ్మల రామకృష్ణ పదవీవిరమణ సందర్భంగా మంగళవారం నాడు (1.11.2022) పరిశోధక విద్యార్థులు చేసిన సన్మానసభకు తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సభలో ఆచార్య ఎస్వీ సత్యనారాయణ ప్రధాన వక్తగా పాల్గొని మాట్లాడారు. తుమ్మల జీవితం, సాహిత్యం, వ్యక్తిత్వం వేర్వేరుగా కనిపించవని, అవన్నీ విడదీయరానివిగా కనిపిస్తాయని ఆచార్య ఎస్వీ పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న హెచ్ సి యు ప్రో.వైస్ ఛాన్సలర్ ఆచార్య ఆర్. ఎస్. సర్రాజు మాట్లాడుతూ ఇప్పటికే విశ్వవిద్యాలయం వారు జరిపిన సన్మాన సభలో తుమ్మల పదవీవిరమణ సందర్భంగా మాట్లాడానని, అయినప్పటికీ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొంటూ, ఆయన రష్యావెళ్ళి తెలుగు సాహిత్య వైశిష్యం గురించి ఆయన చేసిన కృషిని ప్రస్తావించారు. పదవీవిరమణ పొందినప్పటికీ ద్రావిడ విశ్వవిద్యాలయంలో ఇంకా వైస్ ఛాన్సలర్ గా ఆయన కొనసాగుతారనీ, రచయితగా ఆయనకు రిటైర్మెంటు ఉండదనీ అన్నారు. గౌరవ అతిథిగా పాల్గొన్న స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ డీన్ ఆచార్య వి.కృష్ణ మాట్లాడుతూ సుదీర్ఘకాలంపాటు విశ్వవిద్యాలయానికి, తెలుగుశాఖకు ఆచార్యతుమ్మల రామకృష్ణ అందించిన సేవలను కొనియాడారు. ఆచార్య తుమ్మల రాసిన అడపం, తెల్లకాకులు, మహావిద్వాంసుడు, మట్టిపొయ్యి వంటి రచనలతో పాటు, తెలుగు సాహిత్యంలో వృత్తికథలకు సంబందించి పుస్తకం తీసుకొచ్చారని ఆచార్య పిల్లలమర్రి రాములు వివరించారు. తర్వాత పరిశోధక విద్యార్థులు ఆచార్య తుమ్మల రామకృష్ణను ఘనంగా సత్కరించి, జ్ఞాపికను బహూకరించారు. తనకు జరిగిన సన్మానానికి ఆచార్య తుమ్మల రామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో ద్రావిడ విశ్వవిద్యాలయం నుండి ఆచార్య దొరస్వామినాయుడు, ఆచార్య నారాయణప్ప, ఆచార్య వేణుగోపాలరెడ్డి, ఆచార్య ఫళని, పరిశోధక విద్యార్థులు శ్రీధర్, ప్రవీణ్, సునీల్ కుమార్, గోపి, డా. వెంకటరమణ, డా.ఝాన్సీ, డా.రాంబాబు, విద్యార్థినీ విద్యార్థులు, కుటుంబసభ్యులు, బంధువులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
ఈరోజు (1.11.2022) హెచ్ సి యు తెలుగు శాఖ ఆధ్వర్యంలో పరిశోధక విద్యార్థులు ఆచార్య తుమ్మల రామకృష్ణ, వైస్ -ఛాన్సలర్, ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం వారికి సన్మానం చేసినప్పటి దృశ్యం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి