*Pressnote/hcu_telugu/ 7.11.2022*
విద్యార్థులు మానసిక సంఘర్షణలకు ప్రతీక అంపశయ్య
కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు, పరిశోధకుల మానసిక సంఘర్షణలను ప్రతీకాత్మకంగా వర్ణించిన నవల నవీన్ రచించిన అంపశయ్య అనీ, ఈ నవల తర్వాత ఆయన ఇదే ఇంటి పేరుగా కూడా మారిపోయిందని హెచ్ సి యు తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. గత వారం రోజులుగా విద్యార్థులు వివిధ బృందాలుగా ఏర్పడి ఒక్క అంపశయ్య నవల పైనే ఒక్కొక్కరు అనేక కోణాల్లో పత్రాలను సమర్పించే కార్యక్రమం ముగింపు సమావేశం సోమవారంనాడు నిర్వహించారు. 'అంపశయ్య నవల-విద్యార్థి సదస్సు' నుంచి విద్యార్థులే ఒక్కోసమావేశానికీ అధ్యక్షులు, సమావేశ కర్తలు గా వ్యవహరించగా, ప్రతి సమావేశానికీ ముఖ్యఅతిథిగా ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు పాల్గొని, చివరిలో వాటిని సమీక్షించారు. ప్రతి బృందానికీ ఒక్కో సాహితీవేత్త పేరు పెట్టుకున్నారు. మొల్ల, దాశరథి, విశ్వనాథ, గుర్రం జాషువ, కాళోజీ, శ్రీ శ్రీ, చలం, సినారె, రంగనాయకమ్మ, ఓల్గా మొదలైన పేర్లతో ఈ సదస్సు సమావేశాలకు పేర్లు పెట్టుకున్నారు. విద్యార్థుల్లో పఠనాసక్తినీ, వక్తృత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు సమయపాలన, సమిష్టిగా పనిచేయడం వంటి అనేక లక్షణాలు ఈ సదస్సు ద్వారా నేర్చుకున్నామని విద్యార్థులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. జ్ఞాన ప్రగతి, మాధురి, అంబదాస్, శ్యామ్ సుందర్, సాయిసురేశ్, అనిల్ కుమార్, నరేశ్, ప్రశాంత్, నౌషీన్, అరుణ్, సంధ్య, నరునాయక్, గోపి, అఖిల, రఘురాం, శ్రీనివాస్, సరళ, రామకృష్ణ తదితరులు వివిధ సమావేశాలకు అధ్యక్షులు, సమావేశకర్తలుగా వ్యవహరించారు. విద్యార్థులు ఎంతో చురుకుగా ఈ సమావేశాల్లో పాల్గొన్నారు.
నమస్తే తెలుగు దినపత్రిక, 8.11.2022 సౌజన్యంతో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి