ఆచార్య దార్ల ఆత్మకథ ( నెమలికన్నులు) 13వ భాగం
నేనూ– మా నారింజచెట్టు
మా ఊరిలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఐదవతరగతి వరకే ఉంది. అది మా ఇంటి వెనుకనే ఉండడం వల్ల నాకెంతో అనుకూలంగా ఉండేది. నాకూ మా ప్రాథమిక పాఠశాలకు విడదీయరానంత అనుబంధం ఉంది. ఇక్కడ నాతో పాటే అంబటి సత్యనారాయణ సుబ్రహ్మణ్యశాస్త్రి (ఎ.ఎస్.ఎస్.ఎన్.శాస్త్రి), గిడ్డి శ్రీరాములు, గిడ్డి చంటిబాబు, దంగేటి రామకృష్ణ మొదలైన వాళ్ళు నా బాల్యమిత్రులు.
మాకు మా తాతగారింటి ముందు ఒక నారింజ చెట్టు ఉండేది. దాని వళ్ళంతా కళ్ళన్నట్లు గుత్తులు గుత్తులుగా కాయలు కాసేవి. దాని కాయలు నేను కోసుకొని బడికి పట్టుకొని వెళ్ళేవాడిని.మా మిత్రులకు వాటినిస్తుండేవాణ్ణి. వీళ్ళతో పాటు ఇంకా కొంతమంది ఉండేవారు. ఇంటర్వెల్ సమయంలోను, స్కూలు అయిపోయిన తర్వాత మా ఇంటికొచ్చి వాటిని కోసుకొని వెళ్ళేవారు. చాలా తియ్యగా ఉండేవా నారింజపండ్లు. ఒక్కొక్కరూ ఒక్కో రకం పండ్లు అప్పుడప్పుడూ తెచ్చేవారు. వాటిని పంచుకొని మేమంతా తినేవాళ్ళం.
ఎ.ఎస్.ఎస్.ఎన్.శాస్త్రి దళితుడే. కానీ అతను ఎర్రగా ఉండడం వల్ల శాస్త్రి అని పేరుపెట్టారు. అతడూ నేనూ మంచి ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళం. అలాగే మిగతావాళ్ళతో కూడా ఉండేవాణ్ణి. శాస్త్రి కెప్పుడైనా నారింజపండ్లు తినాలనిపిస్తే ‘‘నాకే గనుక ఒక చెట్టుంటే, నేను కావలసినన్ని కోసుకోమనేవాణ్ణి’’ అనేవాడు. వాళ్ళకు బొప్బాయి చెట్లు, ఒక మామిడ చెట్టు ఉండేవి. అలా అన్నప్పుడల్లా ఆ కోయలు కోసుకొని ఉప్పు, కారం పెట్టుకుని తింటుంటే ఆ రుచే వేరు.. ఇద్దరం బాగా కలిసిమెలిసి ఉండేవాళ్ళం. అతను బాగా చదివేవాడు.
ఆ నారింజ చెట్టుతో నాకు, మా ఫ్రెండ్స్ కి ఎంతో అనుబంధం ఉంది. ఆ నారింజపండ్లు కోసం వాళ్ళంతా మా ఇంటికొస్తుంటే నాకెంతో సంతోషంగా ఉండేది.
ఒకసారి మా ఇంటి దగ్గర పక్కనే ఉండే లంక నాగేశ్వరరావు కూతురు మరియమ్మ కాయలు కోసుకోవడానికి చెట్టు ఎక్కింది. నేను స్కూలు అవుతుండగానే ఇంటికొచ్చాను. అప్పటికే ఆమె చెట్టు ఎక్కేసి ఉంది. నన్ను చూసి దిగితే తెలిసిపోతుందని అలాగే ఉండిపోయింది. నేనేమో ఆ చెట్టుకిందే మా చెల్లితో పాటు ఆడుకొంటూ ఉండిపోయాను. చీకటి పడిపోయింది. అమ్మా, నాన్నా ఇంకా రాలేదు. అందువల్ల ఆ చెట్టుకిందే ఆడుకుంటూ ఉండిపోయాం. అంతే ఒకేసారి చెట్టుమీద నుండి కిందకి పడిపోయిన శబ్దం. ఎవరని చూస్తే మరియమ్మ. ఒకటే ఏడుపు. తర్వాత కొన్నాళ్ళక చెప్పింది. మేము రావడంతో ఆ చెట్టుపైనే ఉండిపోయి, కిందికి దిగకుండా చాలా సేపు ఉండి, నిద్రవచ్చి కిందపడిపోయానని చెప్పింది. మేమంతా ఒకటే నవ్వు.
మా మిత్రుడు రామకృష్ణ చెల్లెలు కూడా ఆ స్కూల్ లోనే చదివేది. మా చెల్లి కూడా నాతోపాటే వచ్చి చదువుకొనేది.ఆ విధంగా వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు.
ఆ రోజుల్లో క్రిస్టియన్స్ కి విదేశాల నుండి మంచి బట్టలు వచ్చేవి. ఆ బట్టలు చర్చికి వెళ్ళేవారికీ, వాళ్ళకు తెలిసిన వాళ్ళకీ ఫాస్టర్ గారు ఇచ్చేవారు. అలా మా చెల్లికి చాలా ఖరీదైన ఒక స్కర్ట్స్ ఇచ్చారు. ఫాస్టర్ గారు మాకు బంధువు అవుతారు. అందువల్ల మంచి డ్రెస్ ఇచ్చారేమో.
అది మోకాళ్ళవరకు ఉంటుంది. దాన్ని వేసుకొని స్కూల్ కి వచ్చింది. మా ఫ్రెండ్ రామకృష్ణ చెల్లి , మా చెల్లి డ్రెస్ ని కామెంట్ చేసిందని ఏడుస్తూ నాదగ్గరకు వచ్చింది. నాకు ఆమె ఏడుపు చూసి తట్టుకోలేకపోయాను. వెంటనే వెళ్ళి ఆ పిల్ల చెంపమీద కొట్టేశాను.తర్వాత ఏమవుతుందని నేను ఆలోచించలేదు.
వాళ్ళన్నయ్య రామకృష్ణ అక్కడే ఉన్నాడు. చూసి, నన్నేమీ అనకుండా, వాళ్ళ చెల్లిని దగ్గరకు తీసుకొని నావైపు కోపంగా చూస్తూ ఓదార్చి ఇంటికి తీసుకొని వెళ్ళిపోయాడు. కాసేపటికి వాళ్ళ నాన్నను తీసుకొచ్చాడు.
వాళ్ళ నాన్న మాస్టారికి నేను కొట్టిన చెంపదెబ్బకు పడిన నా చేతివేళ్లముద్రలతో కమిలిపోయిన ముఖాన్ని చూపించాడు. నన్ను మాస్టారు పిలిచి గట్టిగానే కొట్టారు. జాతి బుద్దులెలా పోతాయనేదో తిట్టుకూడా తిట్టారు.
మా చెల్లి డ్రెస్ ని చూసి హేళన చేసిందని, దాని గురించి కూడా అడగమన్నాను. కానీ, దానికి ఆయనేమీ అనలేదని ఆయనపై నాకు చాలా కోపం వచ్చింది.
మాచెల్లిని తీసుకొని ఇంటికొచ్చేసి, నన్ను కొట్టినందుకు మాస్టారుపై ఎలాగైనా పగతీర్చుకోవాలనిపించింది. వెంటనే ఏడుస్తూ ఇంటికొచ్చేశాను. మా చెల్లిని మా తమ్ముడికి ఒప్పజెప్పి, నాకు పనుందని చెప్పి, మానాన్న కత్తి తీసుకొని, మాస్టారు వచ్చే దారిలో ఒక ఇంటి దగ్గర దాక్కున్నాను.
నేను అలా దాక్కోవడాన్ని ఆ ఇంటి మనిషి బూసమ్మ గమనించింది. చేతిలో కత్తి ఉందని పెద్దపెద్ద కేకలేసుకొంటూ మా ఇంటికెళ్ళి, కొంతమంది పెద్దోళ్ళను తీసుకొచ్చేసింది.
నేనేమో మాస్టారెప్పుడు వస్తారా? ఆయనపై నా పగ ఎలాతీర్చుకోవాలా? అని ఎదురు చూస్తున్నాను.
నేను కత్తిపట్టుకొని ఎదురు చూస్తున్న అరగంటలోపే నన్ను వెతుక్కొంటూ మా పేటలోని పెద్దోళ్ళ కొంతమంది వచ్చేశారు. నన్ను పట్టుకున్నారు.
విషయమడిగారు.
చెప్పాను.
ఎవరో నా చెంపమీద ఒకటివ్వడం, కత్తి మరొకరెవరో లాక్కోవడం క్షణాల్లో జరిగిపోయాయి.
ఈ విషయం మా ఇంటిలో చెప్పారు.
మా నాన్న ఊరుకుంటాడా? ఆ రోజు నన్ను చాలా గట్టిగానే కొడతాడని నాకు తెలుసు. మా నాన్నకు కోపం వస్తే మామూలుగా ఉండదు. అందువల్ల ఆ దెబ్బలెలా తప్పించుకోవాలి?
మా గాదిలో కొంతసేపు దాకున్నాను.
అది వెతికితారనిపించి మళ్ళీ మా నారింజచెట్టు ఎక్కి కూర్చున్నాను. చాలా సేపు అలాగే కూర్చుండిపోయాను. దాహం వేస్తుంది. ఆకలి వేస్తుంది. ఏమి చెయ్యాలి?
నీరసం వచ్చేసింది.అప్పుడక్కడముళ్ళున్నాయనే సంగతే మర్చిపోయాను. గుబురుగా ఉన్న ఆకులు కొమ్మలపై అలాగే పడుకున్నాను. గుచ్చుకుంటున్న ముళ్ళకంటే గుండెల్లో గుచ్చుకున్న బాధే ఎక్కువగా నొప్పి అనిపిస్తుంది.
మా నాన్న, అమ్మాఇంటికొచ్చాక, విషయం తెలుసుకొని నన్ను వెతికారు. వాళ్ళంటున్న మాటలన్నీ నేను చెట్టుపైనుండే వింటున్నాను.
శరీరమంతా వణుకుపోతుంది. ఏమి చెయ్యాలో తెలియడం లేదు. చీకటి పడిపోయింది. మా అమ్మ పిల్లోడెక్కడికి వెళ్ళిపోయాడోనని ఒకటే ఏడుపు.
అర్ధరాత్రి అయిపోయింది. ఊరంతా వెతికారు. మా అమ్మ గట్టిగా ఏడుస్తుంది. ఆ ఏడుపు చూసి చెట్టు దిగి రావాలనిపించేసింది. కొడితే కొట్టారు. కానీ మా అమ్మ ఏడుపు తట్టుకోలేకపోయాను. చెట్టుదిగి వచ్చేశాను.
అమ్మ దగ్గరకు తీసుకుంది. ెందుకలా చేశావు. మాకు చెప్పొచ్చుకదా… అంటూ దగ్గరకు తీసుకుంది.
కానీ, నాన్న ఊరుకోలేదు. గుదితో కొట్టాడు. తునగాలు కూడా తీసి కొట్టబోయాడు. మా అమ్మా, మా అన్నయ్యవాళ్ళు ఆపారు. మేము చెప్తాంలే అని సముదాయించారు.
ఆ క్షణంలో మా నాన్న నా కళ్ళకు యముడిలా కనిపించాడు. ఆ రాత్రి నిద్రపోవాలంటే భయమేసింది. భయం భయంగానే ఆ రాత్రి గడిసిపోయింది.
మర్నాడు బడిలోకి వెళ్ళాలనిపించలేదు. నన్ను మాస్టారు కొట్టినందుకు బాధనిపించలేదు. నన్ను తిడుతూ నా కులాన్ని కూడా తిట్టారు. ఆ మాట నన్నెవరో నిలబెట్టి నిలువునా రంపంతో కోసినట్లనిపించింది.
హెడ్మాస్టర్ త్రినాథరావుగారు గానీ, వెంకటరెడ్డిగారుగానీ, రామలక్ష్మి మేడమ్ గారు గానీ అయితే నన్నే కాదు, ఎవ్వరినైనా కొట్టినా, తిట్టినా కులాన్నంతటినీ తిట్టినట్లు నాకు గుర్తులేదు. ఈయనది మా ఊరే. ఎప్పుడూ చిరాకు పడుతుండేవాడు. నా పట్లే కాదు, అందరి పట్లా అలాగే ఉండేవాడు.
ఆ రోజు బడికి వెళ్లిన మా చెల్లీ, రామకృష్ణగారి చెల్లీ మళ్ళీ నవ్వుకుంటూ ఆడుకొంటూ కనిపించారు. నాకు వాళ్ళని చూసి చాలా ఆశ్చర్యమేసింది.కానీ, మనసులో ‘పోనీలే కలిసి అడుకుంటున్నారనిపించింది. రామకృష్ట దగ్గరు వెళ్ళాను. సారీ చెప్పాను. ‘‘నేనే అనవసరంగా దీన్ని పెద్దది చేశాను. మా నాన్నకు చెప్పకుండా ఉండాల్సిందేమో’’ పర్లేదులే… అంటూ నాతో చెయ్యి కలిపాడు.
చివరి రోజున ఐదో తరగతి ఫలితాలు ప్రకటిస్తుంటే నా గుండె లబ్ లబ్ మంటూ ఎంత స్పీడ్ గా కొట్టుకుందో నాకే తెలుసు. ఆ పసివయసులో ఫలితాల కోసం ఎదురుచూస్తూ ప్రొమోటెడ్ అనే పదం వినాలని నా చెవుల్ని మాస్టార్ల పెదవుల దగ్గర ఎలా పెట్టుకున్నానో నాకే తెలుసు.
నా గురించెవరైనా ఏమైనా చెప్తే నన్ను పాస్ చెయ్యకుండా ఆపేస్తారేమో నని నేనెంత భయపడ్డానో…
నా పేరు పిలిచి ‘ప్రొమోటెడ్’ అన్నారు. హమ్మయ్య అనుకున్నాను. ఇంకే పేర్లూ నాకు వినపడలేదు. తొందరగా ఇంటికెళ్ళి నేను పాసయ్యానని చెప్పాలనిపించింది.
ఐదో తరగతి ఉత్తీర్ణుడనయ్యాను. ఒక్కసారిగా కళ్ళన్నీ ఆనందంతో తడిసిపోయాయి. ఆ విషయం ఇంటికొచ్చి చెప్పాను. మా కుటుంబ సభ్యులంతా అదేమి పెద్ద విషయమే కాదన్నట్లు చూశారు. పెద్దన్నయ్య మాత్రం సంతోషపడ్డాడు. అమ్మకూడా కొద్ది గా సంతోషపడింది. వీళ్ళందరి కంటే మా మేనత్త ఎగిరి గంతేసినట్లు సంతోషపడింది. మా పేట వాళ్లు సంతోషపడ్డారు. ఉత్తరాలు ఇంకా బాగా రాస్తాడనీ, ఉత్తరాలు చదివిపెడతాడనీ, ప్రామిసరీ నోట్లు చదివి వినిపిస్తాడనీ …వాళ్ళంతా సంతోషపడ్డారు.
బాల్యం కొంతమందికి ఆటల పల్లకీ. బాల్యం కొంతమందికి పూలపరిమళం. కానీ నా బాల్యం అలా సాగలేదు. ఒక్కోసారి నిప్పుల కుంపటి. ఒక్కోసారి ముళ్ళకిరీటం. కనురెప్పల చప్పుడులా ఎప్పుడేమి వచ్చిపడుతుందో అన్నంత మెలకువగా మసలవలసినట్లు కొనసాగింది. కొన్నేవో తీపిజ్ఞాపకాలు ఉన్నా, వాటన్నింటినీ మించిన బాధల గాథలున్నాయి.
ఐదో తరగతి పూర్తయ్యింది. చివరిరోజున ఇంక్ పెన్నులో జిల్లేడు పాలు వేసి, ఇంకా రకరకాల పాలు దానిలో కలిపేవారు. ఆ ఇంక్ బట్లల మీద చల్లుకుంటూ ఎవరింటికి వాళ్ళు వచ్చేశాం. ఆ ఇంక్ పడిన మచ్చలు బట్టలమీద ఎంత ఉతికినా పోవు. ఆ రోజుని అలా గుర్తుంచుకోవడానికి ఇంక్ చల్లుకొనేవాళ్లం.
ఐదో తరగతి పాసైన తర్వాత ఆరవతరగతిలో చేరాలి. మాకు ఒకటి రెండు కిలోమీటర్ల దూరంలో చెయ్యేరు గ్రామం ఉంది. అక్కడ ఏడవ తరగతి వరకు ఒక పాఠశాల ఉంది. అక్కడ ఇంచుమించు ఆ పరిసర గ్రామాల్లో ఐదోతరగతి పూర్తి చేసిన వాళ్ళందరికీ సీటు ఇస్తారు.
మా పెద్దన్నయ్యకు మాత్రం సీటివ్వలేదు. మా ఉపకులంలో మొట్టమొదటసారిగా చదువుకుంటున్నది మాకుటుంబంలోనే.
మా పెద్దన్నయ్యతో పాటు చదువుకున్న మా దళితుల్లోని ఒక ఉపకులానికి చెందిన వాళ్ళందరికీ మాత్రం సీటిచ్చారు. కానీ, మా అన్నయ్యకు సీటులేదన్నారు. అందువల్ల ఇంకో రెండు కిలో మీటర్ల దూరంలో ఉన్న భీమనపల్లి హైస్కూల్ లో చేరవలసి వచ్చింది.
మా అన్నయ్యను ఎవరు చేర్పించారో నాకు తెలియదు.
నేను ఐదో తరగతి పాసయ్యాను. నాకు సీటు వస్తుందో లేదోనని అన్నయ్య అనుమానం వ్యక్తం చేశాడు. నాతో పాటు చదివిన మా దళితుల్లోని ఇతర ఉపకులానికి చెందిన వాళ్లకు సీటిచ్చారు. నాకు కూడా అన్నయ్యకు ఇవ్వలేనట్లే నాకూ సీటు లేదన్నారు.
నాతో పాటు చదువుకున్న మా దళిత ఉపకులాలకు చెందిన మిత్రులు ‘‘ నీకు సీటివ్వరని చెప్పాం కదా… రాదంతే ’’ అన్నారు.
‘‘నీ కెలా తెలుసు?’’ అన్నాను.
‘‘మా అన్నయ్య వాళ్ళు వాళ్ల ఫ్రెండ్స్ తో కలిసి నవ్వుకుంటూ ముందే చెప్పారు’’ అన్నాడు.
నేనేమీ అనకూడదనుకుంటూనే .‘‘మీ అన్నయ్య, మీ నాన్న, మీ బంధువులంతా చదువుకున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. మీ వాళ్ళు పంచాయితీ మెంబర్లుగా కూడా ఉన్నారు. అందుకే మీకు సీటు వచ్చిందేమో… పోనీలే.. నేను ఇంకోచోట చదువుకుంటాను’’ అన్నాను బాధపడుతూనే.
నన్ను మా ఊరుకి ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉన్న కాట్రేనికోన హైస్కూల్ లో చేర్పించారు. అక్కడ సీటు దొరికింది.
మా కుటుంబంలో వాళ్ళు నేను ఐదోతరగతి పాసయ్యానని చెప్పినా వాళ్ళెందుకు సంతోషపడలేదో నాకప్పుడు కొద్దిగా అర్ధమవ్వసాగింది. దళితుల్లోని ఒక ఉపకులంపై మరొక ఉపకులం ఒక పథకం ప్రకారం అప్రకటిత నిషేధాలు విధిస్తున్న సంగతి మా పెద్దన్నయ్యకు, నాకూ ఆరో తరగతిలో సీటు దొరక్కపోవడమే నిదరర్శనమనిపించింది.
. మా దళిల్లోని ఒక ఉపకులం అప్పటికే తొలితరం వాళ్ళు చదువుకొని, రెండవతరం వాళ్ళు చదువుకోవడం ప్రారంభించారు. మేము అప్పుడే బడిలోకి వెళ్ళడం మొదలు పెట్టిన తొలితరం వాళ్ళం. నా తర్వాత మా తమ్ముడు, చెల్లికి కూడా ఆరో తరగతిలో సీటులేదన్నారు. నేను, మా పెద్దన్నయ్య మా పంచాయితీ ప్రెసిడెంట్ రాంబాబుగారు (రాజుగారు) గారి దగ్గరకు వెళ్లాం. హెడ్మాస్టార్ని పిలిచారు. విషయమడిగారు. ఏదో నసుగుతూ చెప్పబోయారు. ఏం జరుగుతుందని గట్టిగా అడిగారు. వాళ్ళని ఎవరెవరు ప్రభావితం చేస్తున్నారో చెప్పారు. ఇకపై అలా చెయ్యొద్దనీ, ఈ ఊరు వాళ్ళకి ఈ ఊరులో సీటివ్వకపోతే పక్కఊరు వాళ్ళెందుకిస్తారు. ముందు వాళ్ళకు సీటివ్వమన్నారు. ఇంకెప్పుడూ ఇలా జరగకూడదని హెచ్చిరించారు. ఆవిధంగా మా తమ్ముడు, చెల్లికి ఆరో తరగతిలో సీట్లు సాధించాం.
నాకు ఐదో తరగతి పూర్తవ్వగానే మా నారింజచెట్టు కూలిపోయింది. ఆ చెట్టు బోదిగట్టుకి దగ్గరలో ఉండేది. ఆబోది తవ్వగా తవ్వగా వేళ్ళు బోదిలోకి వచ్చేసి, వేగంగా వెళ్ళే ఆ నీళ్ళు ఉన్న కాస్త మట్టీ కొట్టుకుపోయేలా చేసింది. మా నారింజ చెెట్టు, దానితో ముడిపడిన నా జ్ఞాపకాలు, మా మిత్రల్లాగే ఒంటరిగా ఉండలేక కూలిపోయిందేమో అనుకున్నాను.
ఆ చెట్టు కూలిపడిపోయినప్పుడు నేనే కూలబడిపోయినట్లనిపించింది. దానికి పచ్చగా ఉన్న ఆకులు వడిలిపోతుంటే, నాలోని ఆశలు ఆవిరై నలిగిపోతున్నట్లనిపించింది.
ఇప్పటికీ నేను మా ఊరు వెళ్ళినప్పుడల్లా ఆ నారింజ చెట్టు ఉండే చోటులో కాసైపైనా నిలబడానిపిస్తుందెందుకో…!
(సశేషం)
– ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,
తెలుగు శాఖ అధ్యక్షులు,
యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్ – 500 0046
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి