ఆ రహస్యమేమిటో తెలిసిపోయిందా?
మా బడి ఎదురుగా ఒక ఇంట్లో మిఠాయి తయారు చేసేవారు.
మేము పాఠాలు వింటున్నా, అక్కడ తయారు చేసే రకరకాల మిఠాయిల నుండి మాకు తీయని వాసనలు వస్తుండేవి.
ఆ బడికి కుడివైపున ఒక కమ్మరికొలుముంది. దానిలో నుండి ఆ ఇనుమును కాల్చి దానిపై సుత్తితో కొట్టే శబ్దాలు మా చెవుల్లో గులుముని ఎప్పటికప్పుడు బయటకొచ్చేసేలా చేసేవి.
ఇంటర్వెల్ బెల్ కొట్టారంటే చాలు మాలో చాలా మంది పిల్లలమంతా పూల నుండి తేనెను గ్రోలడానికి పరుగుపెట్టే తుమ్మెదల్లా ఆ మిఠాయి బడ్డీ దగ్గరకెళ్ళేవాళ్ళం.
అక్కడ జీళ్ళు, జిలేబీలు, జంతికలు, గవ్వలు, లడ్డూలు, మైసూరు పాక్ ముక్కలు, కారపు బొంది, కొబ్బిరి లౌజు ఉండలు, బెల్లంకొమ్ములు ఇలా రకరకాల మిఠాయిలు తయారు చేసేవారు.
నాకు జీళ్ళు, కొబ్బరి లౌజు ఉండలంటే ఎంతో ఇష్టపడే వాణ్ణి. అప్పుడు ఒక పావలా పెడితే నాలుగైదు జీళ్ళు వచ్చేవి. ఒకటి నోట్లో వేసుకుంటే చాలు చాలా సేపు దాన్ని చీకుతూ, నములుతూ, ఊరించుకుంటూ ఆ తీయదనాన్ని ఎంతసేపో ఆస్వాదించవచ్చు.
మిగతావన్నీ ఒకటో రెండో మా స్నేహితులకిచ్చి, మిగతా వాటిని జేబులో వేసుకొనేవాణ్ణి.
క్లాస్ జరుగుతున్నా నెమ్మదిగా మాస్టార్లకు తెలియకుండా నోటిలో వేసుకొని, దాని రసం నోట్లో కొద్ది కొద్దిగా ఊరుతుంటే 'ప్రపంచంలో దీనికంటే తియ్యనైనదేమైనా ఉంటుందా!' అనుకొంటూ ఆస్వాదిస్తుండేవాణ్ణి.
ఒక్కోసారి నా తన్మయత్వాన్ని గమనించి, పాఠం చెప్తూనే మధ్యలో మాస్టారు నన్నో ప్రశ్న వేసే వారు. నా పరిస్థితిని ఏమని చెప్పను?
బుగ్గ పక్కని పెట్టుకుందామనుకుంటే తెలిసిపోతుంది. తెలియకుండా మింగేద్దామంటే గొంతులో దిగదు. పాలుతాగడానికొచ్చిన పిల్లి నాలుగు గోడల మధ్య ఇరుక్కుపోయినట్లనిపించేది.
బిక్కమొహంతో నోట్లో పెట్టుకొనే నిలబడి, ఏమీ మాట్లాడకుండా మౌనముద్ర వహించే వాణ్ణి. ''క్లాస్ అయ్యే దాకా కూడా ఆగలేకపోతున్నావ్రా వెధవ…బయిటికెళ్ళు…తినేసి రా..'' అనో, బెత్తంతో ఒక్కటిచ్చుకోవడమో చేసేవారు. నవ్వుకుంటూ బయటకెళ్ళి దాన్ని తినేసి, మళ్ళీ ముసిముసి నవ్వులతో వచ్చి కూర్చొనేవాణ్ణి.
అప్పుడు ''నేను చెప్పనాండీ?'' అనేవాణ్ణి విప్పారిన ముఖంతో అమాయకంగా…ఆనందం ఎగిసిపడే కెరటంలా...
''వద్దులే కూచో'' అనేవారు మాస్టార్లు.
క్లాసులో మిగితా వాళ్ళంతా వాళ్ళలో వాళ్ళే బయటకు కనపడనీయని నవ్వుల్ని వాళ్ళ కళ్ళల్లో మెరిపించే వారు.
నాలాగే చాలామంది చేసేవారు. మేమంతా ఆ రోజుల్లో కుందేలు పిల్లల్లా భయపడుతూనే చెంగు చెంగున గంతులేకుకొంటూ అల్లరి చిల్లరి పనులతో హాయిగా గడిపేసేవాళ్ళం.
ఆడపిల్లలు, మగపిల్లలు, వాళ్ళ కులాలతో సంబంధం లేకుండా కాకి ఎంగిలి చేసుకుంటూ జీళ్ళని ముక్కల్ని చేసుకుని తినేవాళ్ళం. మగపిల్లలైతే చొక్కా కింద జీడిని పెట్టి నోటిలో పన్నుతో కొరికి ముక్కలు చేసుకొనే వాళ్ళం. ఆడపిల్లలు కొరికేటప్పుడైతే పరికిణీ గుడ్డకింద పెట్టి కొరికిచ్చేవారు. అలా గుడ్డకింద ఆ పదార్ధాన్ని పెట్టి నోటితో కొరివ్వడం వల్ల ఎక్కువగా ఎంగిలి కాదు. ఇలా ఆ పదార్థాన్ని కొరికి, ముక్కలుచేసి పంచుకోవడాన్నే కాకి ఎంగిలి అంటారు.
కాకి ముక్కు పొడవుగా ఉంటుంది. అది ఏదైనా పదార్ధాన్ని ముట్టుకున్నా, ఒకటి కంటే ఎక్కువ సార్లు లోనికి అనుకోవాలి. అప్పుడు మాత్రమే ఆ పదార్ధం లోనికి, అంటే నోటిలోకి వెళ్తుంది. కాబట్టి కాకి ఏదైనా ముక్కని పట్టుకున్నా దాని ఎంగిలి వెంటనే పట్టదు. పట్టినా చాలా తక్కువగానే పడుతుంది. కాకి అంటే అల్పం అని కూడా అర్ధం చెప్తారు. గుడ్డను పూర్తిగా కప్పి దాన్ని కొరికిచ్చేదాన్ని కాకి ఎంగిలిగా ప్రాచుర్యంలోకి వచ్చిందేమో.
ఈ అర్ధ తాత్పర్యాలు నాకు ఆనాడేమీ తెలియవు. కానీ, కాకి ఎంగిలితో మాత్రం నాకు పరిచయం ఉంది.
రోజూ డబ్బులివ్వడమంటే మా అమ్మా నాన్నలకు కష్టం. నాకేమో జీళ్ళంటే ప్రాణం. నాకు చిన్నప్పుడు, ప్రాథమిక పాఠశాలలో చదువుకునేటప్పుడు ఇంచుమించు ప్రతీరోజూ జీళ్ళే కలలోకి వచ్చేవి.
''నేను పడుకున్నాను.
ఒక అర్ధరాత్రి అమాంతంగా మా ఇంటి కొప్పు పెద్ద రంధ్రం పడిపోయింది.
జీసస్ పుట్టిన పశువుల పాకలోకి రెక్కలున్న తెల్లని వస్త్రాలు ధరించిన దేవతలు…
వాళ్ళు వచ్చే ముందు పెద్ద కాంతి కిరణాలు…
అలాగే వెదజల్లుకుంటూ వచ్చినట్లు మా ఇంటి పై కప్పు నుండి ఒక పెద్ద వెలుగు వచ్చింది.
గాఢంగా నిద్ర పోతున్న నాపై ఆ వెలుగు పడగానే మెలకువ వచ్చేసింది.
ఒక్కసారిగా భయమేసి గట్టిగా కేకలేయబోయాను. నా నోటినెవరో మూసేస్తూ 'నీకోసమే నేస్తం…నీకు కావలసిన జీళ్ళెన్నో తీసుకొచ్చా' మని తియ్యగా చెప్పినట్లనిపించింది.
అంతే నాకెలాంటి మాటలూ రాలేదు.
నాకళ్ళన్నీ ఆ జీళ్ళెక్కడనే వెతుకుతున్నాయి.
అంతే ఒక్కసారిగా ఒకటి, రెండు, మూడు, …
వర్షంలా కురుస్తున్నాయి.
నా మంచమ్మీద…
మా ఇంటిలో…
ఎక్కడ చూసినా జీళ్ళే…
బెల్లం జీళ్ళు…
నువ్వుల జీళ్ళు..
చిన్న చిన్న వీ…పెద్ద పెద్దవీ…
క్రిస్మస్ తాత వచ్చి మనకేమి కావాలో వాటినిచ్చి వెళ్ళినట్లు…
చేతులూపుకుంటూ…
జీసస్ లా
మళ్ళీ ఆకాశంలోకి వెళ్ళిపోయారు.
మా ఇంటి రంధ్రం మూసిపోయింది. ''
నాకు మెలకువ వచ్చేసింది.
మంచమ్మీద చూశాను.
మంచం కింద చూశాను.
మంచం చుట్టూ చూశాను.
ఒళ్ళంతా వెతికాను.
ఒక్క జీడు కూడా లేదు.
ఏడుపొచ్చేసింది.
తొందరగా తెల్లవారి పోతే బావుణ్ణు.
కానూరు వాళ్ళింటి కెళ్ళి కొన్ని జీళ్ళు తెచ్చుకోవచ్చ''నుకున్నాను.
ఇంక నిద్ర పట్టలేదారాత్రి.
ఇలాంటి కలల రాత్రులెన్నో …
ఆ కలల్లో నన్ను నిలువెల్లా ఘుమఘుమలాడుతూ తడిపిన జీళ్ళెన్నో!
ఒక్కోసారి ఆ జీళ్ళు కొనుక్కుందామంటే నాకు డబ్బులు ఉండేవి కాదు.
నా ఫ్రెండ్సేమో జీళ్ళు కొనుక్కునే వారు.
నాకూ కాకి ఎంగిలి చేసి ఒక్కో ముక్క ఇచ్చేవారు.
ఒక్కముక్కేమి సరిపోతుంది. ఒక్కజీడైనా తినాలనిపించేది.
అలాంటప్పుడు ఒక్కోసారి మిఠాయిలు చేసేవాళ్ళ ఇంటికెళ్ళి ఆ జీళ్ళు చేస్తుంటే చూస్తూ నిలబడి చూస్తుండిపోయేవాణ్ణి.
ఆ చేసే విధానం చాలా బాగుంటుంది.
బెల్లాన్ని ముక్కలు చేసి, కొద్దిగా నీళ్ళుపోసి పాకం వచ్చేదాకా వండుతారు.
కానూరు వాళ్ళకి పెద్ద ఊకపొయ్యి ఉండేది. ధాన్యాన్ని మిల్లులో ఆడించగా బియ్యం నుండి దాని పొట్టు వేరేగా వచ్చేస్తుంది. దాన్నే ఊక అంటారు. దాన్ని పొయ్యిలో కి, ఇటుక కాల్చె ఆమల్లోకి వాడతారు. ఆ ఊక అంటుకొని మండేదాకా ఒకటో రెండో కట్టెలు పెట్టి మండించేవారు. ఆ పొగ బయటకు వెళ్ళిపోవడానికి ఇటుకలతో పెద్ద ఎత్తున గొట్టంలా కట్టేవారు.
ఒక ఊస తీసుకొని కాలిన ఊకను అటూ ఇటూ కదిలించే వారు.
ఆ ఊక కాలిపోయిన వెంట వెంటనే ఊక పొయ్యిలోకి వేస్తుండాలి.
ఒకవైపు పొయ్యి దగ్గర కూర్చొని వండుతూ, ఊక అయిపోతుందనగానే గబగబా దిగి ఊసని పొయ్యి రేకు రంధ్రాల్లో పెట్టి అటూఇటూ ఊపి కాలిపోయిన బూడిదదను కిందికి వెళ్ళేలా చేసి, పైనున్న ఊక కొద్దికొద్దిగా కిందికొచ్చేలా చేసి, మళ్ళీ ఒక డబ్బా ఊక పొయ్యిలో వేసి, మళ్ళీ గబగబా పొయ్యి పైకి రావాలి.
అలా చేయడం నిజానికి చాలా ఓపిక ఉండాలి. అలాంటప్పుడు ఆయనకి విపరీతంగా చెమట పట్టేసేది. అదో పెద్ద ఎక్సర్సైజ్ లా అనిపించేది.
ఇవన్నీ గమనించే వాణ్ణి.
కానూరి వాళ్ళది పెద్ద కుటుంబం. అబ్బాయిలు, అమ్మాయిలు ఆ ఇంట్లో చాలా మందే ఉండేవారు. వాళ్ళలో ఒకతను మాతోనే చదువుకొనే వాడు కూడా. ఆ స్నేహంతో కూడా వాళ్ళింటికెళ్ళి ఆ మిఠాయిలు చేయడం చూస్తుండేవాణ్ణి.
నాకు ఆ ఇతర పిండి వంటలెలా ఉన్నా గానీ, ఆ జీళ్ళు చేసేటప్పుడు మాత్రం బాగా చూడాలనిపించేది.
ఆ బెల్లం ఉడికించేటప్పుడు, అది పాకమైన తర్వాత ఒక స్తంభానికి ఒక పెద్ద మేకు వేసి దానిపై పాకాన్ని లాగుతుంటే వచ్చే వాసన కమ్మగా అనిపించేది. ఆ పాకాన్ని బాగా లాగగా లాగగా పొడవుగా సాగేది. అప్పుడు దాన్ని చూడాలీ…
బంగారంలా మెరిసిపోతుంది. దాన్ని పొడవుగా సన్నగా ఒక రూళ్ళకర్రంత సన్నగా
పొట్లకాయంత పొడవున కనికలుగా చేస్తారు.
అప్పుడు ఒకరు ఆ ముదురు పాకాన్ని గబగబా ఆ బలమైన పొడవైన ఇనుప మేకుకి వేసి కిందికీ పైకీ లాగుతుంటారు.
వాటితో చివరి గా కొన్ని కొన్ని సైజుల్లో చిన్న చిన్న కనికలుగా చేస్తారు. వాటిని మరొకరికిస్తారు. వాటిపై కొద్దిగా పిండి చల్లి ఒక కట్టెపై పెట్టి పదునైన చాకు లాంటి కత్తితో ముక్కలు ముక్కలుగా చేస్తారు.
కొన్నింటిపై కొద్దిగా, మరికొన్నింటిపై ఇంకొంచెం ఎక్కువగా ఆ పిండిని చల్లుతారు. మరికొన్నింటిపై వేపిన నువ్వులు చల్లుతారు. జీళ్ళు గట్టిగా ఉండాలంటే ఒకస్థాయిలోను, త్వరగా మెత్తబడి కొరికితే సోంపాపిడిలా పంటి కింద పడగానే మెత్తగా నలిగిపోయేటట్లు రకరకాలుగా వాటిని తయారు చేస్తుంటారు. ఆ జీళ్ళ కనికలను కొట్టేటప్పుడు అన్నీ ఒకేసైజులో కట్ చేస్తుంటారు.అలా ఒకే సైజులో కట్ చేయాలంటే ఎంతో ఏకాగ్రత, నైపుణ్యం కావాలి. ఏదైనా ఒక్కటైనా పెద్దదో చిన్నదో వస్తాదేమో కనిపెట్టాలని ఆ కట్ చేసేటప్పుడు నేను కూడా దాన్నొక అద్భుతంగా, ఏకాగ్రతతో దాన్నే చూస్తుంటే వాణ్ణి. ఎప్పుడైనా ఎవరితోనైనా మాట్లాడుతూ తన ఏకాగ్రత కొద్దిగా కోల్పోయినా, ఆ ముక్క చిన్నగానో, పెద్దగానో కట్టయ్యేది. ''అదిగో పట్టేశాను… ఆ తేడాని'' అనాలనిపించి పెద్దగా నవ్వేస్తుంటే, నాకళ్ళల్లో పెద్దపెద్ద దీపాలేవో వెలుగుతున్నట్లనిపించేది. అప్పుడు ఆ జీళ్ళు కట్ చేసే ఆయన ముఖంలో దీపాలన్నీ ఆగిపోయినట్లు కమ్ముకొనే చీకటిలా మాడిపోయేదా ముఖం. ఆయన ఓడిపోయి నన్ను చూస్తున్నట్లు అనిపించేది. అలా కనికి ముక్కలు ముక్కలుగా చేస్తే చివరిలో చిన్న చిన్న ముక్కలు మిగిలిపోతుంటాయి. వాటిని అక్కడకొచ్చే పిల్లలకు గానీ, పనిచేసే వాళ్ళకు గానీ ఇచ్చేస్తుంటారు. నేను చూడ్డానికి వెళ్ళినప్పుడు అలాంటి వాటిని నా చేతిలోనూ పెట్టాలనుకునేవారు. కానీ, నేను తీసుకొనేవాణ్ణి కాదు.
తింటే మంచి జీడే తినాలి. తినకపోయినా ఫర్లేదు. కానీ అటూ ఇటూ కానీ ఆ పిసరు ముక్కలు నాకెందుకనిపించేది. అలా మిఠాయిలు తయారుచేసే విధానాన్ని
నేను దగ్గరగా గమనించే వాణ్ణి.
ఆ మిఠాయిలకు కావలసిన పిండిపదార్ధాలు, పాకం, జిలేబీ…ఇవన్నీ వండేటప్పుడు పొయ్యి దగ్గర అప్పుడప్పుడూ ఊక అయిపోయేది. అంటే వేగంగా కాలిపోయేది. అది పూర్తిగా అయిపోతే పొయ్యి ఆరి పోతుంది.
వాళ్ళెంతమంది ఉన్నా వాళ్ళంతా రకరకాల పనుల్లో నిమగ్నమవ్వాల్సిందే.
అలాంటప్పుడు ఆ ఊక అయిపోవడం చూసి నేను ఆ డబ్బాతో గానీ, ఆ చిన్న తట్టతోగానీ, ఆ పెద్ద రేకు చేటతోగాని ఊకను తెచ్చి పొయ్యిలో వేసేవాణ్ణి. వాళ్ళడగపోయినా ఊక అయిపోతుందనగానే నేను పట్టుకొని వెళ్ళీ వేస్తూ, అక్కడే నిలబడి వాటినెలా చేస్తున్నారో చూస్తుండే వాణ్ణి.
సాధారణంగా ఆ మిఠాయిలు చేసేటప్పుడు బయటివాళ్ళను చూడనివ్వరు. నన్ను మాత్రం వెళ్ళిపొమ్మేవారు కాదు.
పైగా అలా సాయం చేస్తున్నందుకు నన్ను మెచ్చుకుంటూ డబ్బులివ్వబోయేవారు.
నేను డబ్బులు తీసుకొనేవాణ్ణి కాదు.
జీళ్ళివ్వమనేవాణ్ణి! అవి కూడా, చాలా సేపు నోట్లో ఉండి సాగే వాటినే ఇవ్వమనేవాణ్ణి. అలా తాజాగా తయారైన జీళ్ళు తినడమెలాగో తెలిసిపోయింది.
అంతే, ఇక ఇంటి దగ్గర అమ్మా, నాన్నా డబ్బులిచ్చినా, ఇవ్వకపోయినా నా జీళ్ళెలా సంపాదించుకోవాలో నాకు ఆ రహస్యం తెలిసిపోయింది.
ఒక్కోసారి ఇంటర్వెల్ సమయంలోను…
బడి అయిపోయాక…
సెలవుల్లోనూ …
పొయ్యిలో ఊక పొయ్యడం…
నాకు కావాల్సిన జీళ్ళు సంపాదించుకొని తినడం…
ఇలా సాగిపోయేది నా ప్రాథమిక పాఠశాల బాల్యమంతా!.
అయినా నేను ఏనాడూ నా పాఠాల్ని సరిగ్గా చదవని రోజు లేదు.
ఇంట్లో చేయాల్సిన పనులేనాడూ మాననూలేదు.
కానీ, నేనిలా చేయడాన్ని మా నాన్నొకరోజు గమనించాడు. అప్పుడు నన్నేమీ అనలేదు. వాళ్ళనీ ఏమీ అనలేదు. ఇంటి దగ్గర పనుందని వాళ్ళకి చెప్పి నన్ను తీసుకొచ్చేశాడు.
''మీకోసమే కదా నేను పని చేస్తున్నాను…
మీకేమి కావాలో నన్నడగండి…
ఇంకెప్పుడూ అలా చెయ్యొద్దు…' ఇంకా ఏవో చెప్పాల్సిన మాటలున్నా, మధ్యలోనే వాటిని ఆపేసినట్లనిపించింది. తన తలకి చుట్టుకొని ఉన్న తువ్వాలు తీసి ముఖం తుడుచుకున్నాడు.
నాన్న తన ముఖాన్ని పక్కకు తిప్పుకొని
అలా చెమే తుడుసుకున్నాడో,
కన్నీళ్ళే తుడుసుకున్నాడో
ఆదృశ్యాన్నిప్పటికీ మర్చిపోలేకపోతున్నాను!
( సశేషం)
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
తెలుగు శాఖ అధ్యక్షులు,
సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్
ఫోన్: 9182685231
(ఈ రెడ్ కలర్... పత్రికలో వచ్చిన దానికి చేసిన చిన్న చిన్న మార్పులు గా గమనించాలని మనవి)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి