"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

04 October, 2022

శ్రీ దార్ల అబ్బాయి మెమోరియల్ ట్రస్ట్ ఇంటర్వ్యూ ( భూమిపుత్ర దినపత్రిక, 04.10.2022 సౌజన్యంతో)

 


ప్రతిభావంతుల్ని ప్రోత్సహించడమే

శ్రీ దార్ల అబ్బాయి మెమోరియల్ ట్రస్ట్ ప్రధాన లక్ష్యం

 


‘‘ప్రపంచంలోని అనేక దేశాల వారు వచ్చి భారతీయులతోను, భారతదేశంలోని అనేక రాష్ట్రాలవారితోనూ కలిసి చదువుకునే ఒక ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి. దీనిలో చదువుకున్నవారు నేడు ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థల్లో పనిచేస్తున్నారు. ముందుగానే ప్రకటించిన విద్యాకార్యక్రమాలన్నీ అకడమిక్ కాలెండర్ ప్రకారమే జరగడం ఈ యూనివర్సిటి ప్రత్యేకత. ఒకప్పుడు నగరానికి దూరంగా ఉండే ఈ విశ్వవిద్యాలయం నేడు నగరం పెరగడంతో పాటు అనేక గ్రామీణ ప్రాంతాల్ని కలుపుకుంటూ హైదరాబాదు నగరం ఎంతో విస్తరించింది. దీనితో ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటి నగరానికి మధ్యలో విద్యాకుసుమంలా చదువుల రాణికి కిరీటంలా మెరుస్తుంది.అటువంటి ఈసెంట్రల్ యూనవర్సిటిలో డిగ్రీలతో పాటు అనేకమంది గోల్డ్ మెడల్స్ కూడా అందుకుంటారు. ఆ గోల్డ్ మెడల్స్ లో శ్రీ దార్ల అబ్బాయి మెమోరియల్ గోల్డ్ మెడల్ ఒకటి‘‘. దీని చరిత్ర, నేపథ్యాల గురించి ఈ ఇంటర్వ్యూలో  తెలుసుకుందాం. (పూర్తి ఇంటర్వ్యూ వివరాలు ఇక్కడ భూమి పుత్ర దినపత్రిక, 4.10.2022 వారి సౌజన్యంతో ప్రచురిస్తున్నాను... ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

సాధారణంగా ప్రతి యేడాదీ అక్టోబరు 1 వ తేదీన సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ వారు స్నాతకోత్సవం నిర్వహిస్తారు. అయితే గత రెండేళ్ళుగా కొనసాగిన కరోనా మహమ్మారి వల్ల రెండేళ్ళపాటు స్నాతకోత్సవం నిర్వహించలేదు. ఆ రెండేళ్లలో ప్రదానం చేయాల్సిన డిగ్రీలతో పాటు ఈ యేడాది వాటితో కలిపితే సుమారు 4800 మందికి  డిగ్రీలను ప్రదానం చేశారు. దీనిలో సుమారు 573 మంది డాక్టరేట్ డిగ్రీలు ఉన్నాయి. అందుకు గాను అక్టోబర్, 1 వ తేదీన బ్రహ్మకుమారి శాంతి సరోవర్, గచ్చిబౌలిలో అంగరంగవైభవంగా 22వ స్నాతకోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకతా శాఖామంత్రి (Hon’ble Minister of Education and Skill Development & Entrepreneurship, Government of India) శ్రీ ధర్మేంద్ర ప్రదాన్, తెలంగాణ రాష్ట్ర గవర్నర్, యూనివర్సిటి చీఫ్ రెక్టార్ డా. తమిళసై సౌందర్యరాజన్, యూనివర్సిటి ఛాన్సలర్ జస్టీస్ ఎల్. నరసింహారెడ్డి, హెచ్ సి యు వైస్ ఛాన్సలర్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ ఆచార్య  బసుత్కర్ జగదీశ్వర్ రావు (బి.జె.రావు)  అతిథులుగా పాల్గొన్నారు. యూనివర్సిటీ గోల్డ్ మెడల్స్ తో పాటు వివిధ వ్యక్తుల పేరుతో ఇచ్చే గోల్డ్ మెడల్స్ ని కూడా ప్రదానం చేశారు. ఈ విభాగంలో తెలుగు శాఖ అధ్యక్షులు, శ్రీ దార్ల అబ్బాయి మెమోరియల్ ట్రస్ట్, రాజమహేంద్రవరం చైర్మన్ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారి నాన్నగారు శ్రీ దార్ల అబ్బాయి పేరుతో ప్రతి యేడాదీ ఒక గోల్డ్ మెడల్ ని ప్రదానం చేస్తారు. ఇది ఎం.ఏ, తెలుగులో సాహిత్య విమర్శ, భారతీయ కావ్యశాస్త్రం ప్రత్యేక అంశాలుగా చదివి, ఆ రెండు సబ్జెక్టులలో అత్యధిక మార్కులు సాధించిన వారికి ఈ గోల్డ్ మెడల్ ని ప్రదానం చేస్తారు. ఈ సారి జరిగిన స్నాతకోత్సవంలో ముగ్గురు ప్రతిభావంతులైన విద్యార్థినీ విద్యార్థులు గవర్నర్ చేతులు మీదుగా శ్రీ దార్ల అబ్బాయి మెమోరియల్ గోల్డ్ మెడల్ ని అందుకున్నారు.

శ్రీ దార్ల అబ్బాయి గారు 

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ తో పాటు, తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సంగారెడ్డి, తెలంగాణ రాష్ట్రంలోను, జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల, చెయ్యేరు, తూర్పు గోదావరి జిల్లా (ఉమ్మడి జిల్లా) లోను శ్రీ దార్ల అబ్బాయి మెమోరియల్ గోల్డ్ మెడల్/ నగదు పురస్కారం, ప్రతిభ ధ్రువీకరణ ప్రశంసాపత్రం వంటివి ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఆ ట్రస్ట్ చైర్మన్ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుగారితో భూమిపుత్ర దినపత్రిక ప్రధాన సంపాదకులు శ్రీ సాకే శ్రీహరిమూర్తిగారు చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు:

భూమిపుత్ర ప్రధాన సంపాదకులు శ్రీసాకే శ్రీహరి మూర్తి: ముందుగా మీ నాన్నగారి పేరు మీదుగా గోల్డ్ మెడల్, నగదు పురస్కారాలు ఇస్తున్నందుకు మా శుభాకాంక్షలు.

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు: ధన్యవాదాలండీ...

శ్రీసాకే శ్రీహరి మూర్తి: మీరు ఎప్పటి నుండి శ్రీ దార్ల అబ్బాయి మెమోరియల్ మెడల్స్ ఇస్తున్నారు?

ఆచార్య దార్ల: 2018-19 విద్యాసంవత్సరం నుండి ఈ గోల్డ్ మెడల్ బహూకరించేలా ఏర్పాటు చేశాం. ముందుగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (సెంట్రల్ యూనివర్సిటి)లో  ఎం.ఏ. తెలుగులో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు  ప్రతి యేడాదీ ఒక గోల్డ్ మెడల్, ప్రశంసాపత్రాన్ని ఇచ్చేటట్లుగా హైదరాబాదు విశ్వవిద్యాలయం  తమ 79 వ అకడమిక్ కౌన్సిల్ ఒక ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించింది. దీన్ని యూనివర్సిటి వారు అధికారికంగా  గోల్డ్ మెడల్స్ జాబితా, సీరియల్ నెంబరు: 46 గా ప్రకటించారు.

శ్రీసాకే శ్రీహరి మూర్తి: శ్రీ దార్ల అబ్బాయి మెమోరియల్  తొలి గోల్డ్ మెడల్ ని ఎవరు అందుకున్నారు?

ఆచార్య దార్ల: ఎం.ఏ.తెలుగులో విద్యార్ధిని శాంతకుమారి మా నాన్నగారి పేరుతో ఏర్పాటు చేసిన తొలి మెమోరియల్ గోల్డ్ మెడల్ ని అందుకున్నారు. ఈ అమ్మాయి ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ (చిత్తూరు జిల్లా) ప్రాంతానికి చెందిన ఒక ప్రతిభావంతురాలు. ఈ గోల్డ్ మెడల్ తో పాటు ఆమెకు మరో నాలుగు గోల్డ్ మెడల్స్ వచ్చాయి. 1అక్టోబర్ 2018 న జరిగిన 20 వ స్నాతకోత్సవంలో మొట్టమొదటి శ్రీ దార్ల అబ్బాయి మెమోరియల్ గోల్డ్ మెడల్ ని నీతి అయోగ్ సభ్యుడు డాక్టర్ విజయకుమార్ సారస్వత్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ ఛాన్సలర్ అప్పారావు పొదిలె గార్ల నుండి కుమారి శాంతకుమారి అందుకున్నారు.

1అక్టోబర్ 2018 న జరిగిన 20 వ స్నాతకోత్సవంలో మొట్టమొదటి శ్రీ దార్ల అబ్బాయి మెమోరియల్ గోల్డ్ మెడల్ ను నీతి అయోగ్ సభ్యుడు డాక్టర్ విజయకుమార్ సారస్వత్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ ఛాన్సలర్ ఆచార్య అప్పారావు పొదిలె గార్ల నుండి స్వీకరిస్తున్న ఎం.ఏ.తెలుగు విద్యార్ధిని శాంతకుమారి.

శాంతకుమారిని అభినందిస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, డా.మంజుశ్రీ

శ్రీసాకే శ్రీహరి మూర్తి: శ్రీ దార్ల అబ్బాయి మెమోరియల్ ట్రస్ట్ పేరుతో సెంట్రల్ యూనివర్సిటీ తో పాటు ఇంకా ఎక్కెడెక్కడ ఏయే పనులు చేస్తున్నారో వివరిస్తారా?

ఆచార్య దార్ల: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం, చెయ్యేరు అగ్రహారంలో జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన వారికి నగదు పురస్కారంతో పాటు ప్రశంసాపత్రాన్ని ఇస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కూడా ఇస్తున్నాం.

 శ్రీసాకే శ్రీహరి మూర్తి: ఈ విద్యాసంస్థల్లోనే ఇవ్వడానికేమైనా ప్రత్యేక కారణాలున్నాయా? అలాగే తెలుగు ఎం.ఏ. చేసిన వారికే ఇవ్వడానికి కూడా గల కారణాల్ని చెప్తారా?

ఆచార్య దార్ల: ముందుగా మా కుటుంబ సభ్యులు చదువుకున్న లేదా మేము ఉద్యోగాలు చేస్తున్న విద్యాసంస్థల్లోనే మా నాన్నగారి పేరుతో మాకు తోచినంతగా మేము వివిధ కార్యక్రమాలు చేస్తున్నాం. దీనిలో భాగంగానే మెడల్స్, నగదు పురస్కారాలు ఇస్తున్నాం. నేను, మా తమ్ముడు, మా పెద్దన్నయ్యగారి అబ్బాయి ...మేమంతా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోనే చదివుకున్నాం. మా ఇంట్లో ఇద్దరం  అంటే- నాతో పాటు, మా తుమ్మడు రవికుమార్ కూడా డాక్టరేట్ డిగ్రీలు తీసుకున్నాం. అవి కూడా తెలుగు నుండే తీసుకున్నాం. ఇక్కడే చదివి నేను ఇక్కడే ఇదే శాఖలో పనిచేస్తున్నాను. అందువల్ల మేము ముందుగా సెంట్రల్ యూనివర్సిటీనే ఎన్నుకున్నాం. తర్వాత నేను చదవకపోయినా ( నాకు సీటు రాకుండా కొంతమంది కుట్ర చేశారు.) మా తమ్ముడు, మా చెల్లీ, మా అన్నయ్యగారి పిల్లలూ చెయ్యేరులో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోనే చదువుకున్నారు. అంతే కాదు, మా చెల్లి అదే స్కూల్లో తెలుగు పండిట్ గా పనిచేసింది. మా కుటుంబంలో నేను, తమ్ముడు, చెల్లి... ముగ్గురమూ ఎం.ఏ. తెలుగే ప్రధాన సబ్జెక్టుగా చదువుకున్నాం.  ఆ తెలుగు సబ్జెక్టు మాకు గొప్ప సంస్కారాన్నిచ్చింది.  ఆ తెలుగు మాకు ఉన్నతమైన జీవితాన్నిచ్చింది. ఈ కారణాల వల్ల ఆ విద్యాసంస్థల్లో మా రుణాన్ని కొంతైనా తీర్చుకోవాలనుకున్నాం.

శ్రీసాకే శ్రీహరి మూర్తి: మరి మీనాన్నగారి పేరుమీదుగానే ఈ మెడల్స్ ఇవ్వాలనుకోవడంలోని మీ ఆంతర్యం?

ఆచార్య దార్ల: చాలా మంచి ప్రశ్న వేశారు. మాకు ఈ లోకాన్ని చూపించిందే మా తల్లిదండ్రులు. పైగా మానాన్న నాకెప్పుడూ గొప్ప ఫిలాసఫర్ గా కనిపించేవారు. నిరంతరం పనిచేసేవారు. ఆయన చాలా తక్కుగా మాట్లాడేవారు. కానీ మాట్లాడిన ప్రతి మాటా ఒక ప్రవక్త మాటలా అనిపించేది. ఏవేవో కారణాల వల్ల మా నాన్నగారు చదువుకోలేకపోయారు. కానీ, మమ్మల్ని అందర్నీ చదివించారు. ఉన్నతమైన స్థానాల్లో ఉండేలా మాలో క్రమశిక్షణను, పట్టుదలను నేర్పారు. మనం తీసుకోవడమే కాదు – ఇవ్వడంలోని సంతృప్తిని కూడా అనుభవించాలనేవారు. మనకి ప్రజలు, ప్రభుత్వం ఎంతో ఇచ్చింది. మీరు మరలా వాళ్ళకివ్వడం కూడా నేర్చుకోవాలనేవారు. ఆయన మాటల్నే కార్యరూపంలో మాకు తెలిసినట్లు కార్యరూపంలో పెడుతున్నాం. ఇది చాలా చిన్నది. అన్నీ సహకరిస్తే ఇంకా చాలా చాలా చేయాలనుకుంటున్నాం.

శ్రీ దార్ల అబ్బాయి మెమోరియల్ గోల్డ్ మెడల్ ని గవర్నర్ చేతుల మీదుగా అందుకుంటున్న కుమారి గుత్తా ధన్యశ్రీ

 

శ్రీ దార్ల అబ్బాయి మెమోరియల్ గోల్డ్ మెడల్ ని గవర్నర్ చేతుల మీదుగా అందుకున్న కుమారి గుత్తా ధన్యశ్రీ ని అభినందిస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

శ్రీసాకే శ్రీహరి మూర్తి: మీ ట్రస్ట్ ఆశయాలు, లక్ష్యాలేమిటి?

ఆచార్య దార్ల: ఇప్పుడిప్పుడే శ్రీ దార్ల అబ్బాయి మెమోరియల్ ట్రస్ట్ పేరుతో చిన్న చిన్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. మా నాన్నగారి ఆశాయాలే మా ట్రస్ట్ లక్ష్యాలు. ఆయన తన చిన్నతనంలో అంబేద్కర్ ని చూశారట. డా.బి.ఆర్. అంబేద్కర్ కాకినాడ వచ్చినప్పుడు మా నాన్నగారిది చాలా చిన్నవయసు. చాలామంది కాకినాడ వెళ్తుంటే, వాళ్ళతో పాటు ట్రాక్టర్ లో ఎక్కి వెళ్ళారట. ఆయనను చాలా దూరం నుండే చూడగలిగాననీ, ఆయన్ని అంతమంది అభిమానించడానికి కారణామేమిటని అక్కడికి వచ్చినవాళ్ళని అడగారట.  అక్కడ వాళ్ళు అంబేద్కర్ పేదలకు, దళితులకు, స్త్రీలకు, దేశానికీ చేసిన మంచిపనుల్ని వివరించారు. ఆయన వల్లనే నేడు దళితులు,  దళితులే కాకుండా అనేక పేదవర్గాలు ఎంతో అభివృద్ధి పథంలో నడుస్తున్నారు, అందుకనే ఆయన విగ్రహాలు ప్రతి వీధిలోనూ వేసుకుంటున్నారనీ చెప్పారట. ఆ నాటి నుండీ అంబేద్కర్ సభలు  ఎక్కడ జరిగినా మా నాన్నగారు అక్కడకు వెళ్ళేవారు. అక్కడ వక్తలు చెప్పే మాటలు శ్రద్ధగా వినేవారు.ముఖ్యంగా కోనసీమలో అంబేద్కర్ చైతన్యం ఎక్కువ. అందువల్ల నిత్యం ఏదొక చోట అంబేద్కర్ సభలు జరుగుతుండేవి. అవన్నీ విన్నప్పుడల్లా ఆయన ఆశయాలే తన ఆలోచనలు కూడా అని మాకు చెప్పేవారు. ‘‘అలా చెప్తే చాలామంది నవ్వుకోవచ్చు. కానీ ప్రతి దళితుడికీ అంబేద్కర్ ఆశయాలే ఉండాలి. అలా ఉండేవాళ్ళెంతోమంది ఉన్నారు కూడా’’ అనేవారు. ఈ నేపథ్యంలోనే మేము  ముందుగా విద్యాలయాల్లో ప్రతిభావంతులను ప్రోత్సహించే పనులు చేస్తున్నాం. క్రమేపీ వీటిని నిరక్షరాస్యత నిర్మూలనతో పాటు, మద్యపాన నిషేధం, సాహితీ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం.

శ్రీ దార్ల అబ్బాయి మెమోరియల్ గోల్డ్ మెడల్ ని గవర్నర్ చేతుల మీదుగా అందుకుంటున్న కుమారి నడింపల్లి నీరజ

శ్రీ దార్ల అబ్బాయి మెమోరియల్ గోల్డ్ మెడల్ ని గవర్నర్ చేతుల మీదుగా అందుకు కున్నమారి నడింపల్లి నీరజ ను అభినందిస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

శ్రీసాకే శ్రీహరి మూర్తి: ఇంత వరకూ ఎంతమందికి మీ నాన్నగారి పేరుతో సెంట్రల్ వర్సిటీలో గోల్డ్ మెడల్స్ ఇచ్చారు?

ఆచార్య దార్ల: 2018-19 విద్యా సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఐదుగురు అందుకున్నారు. వాళ్ళు కుమారి శాంతకుమారి, భూమయ్య, త్రిపురాంజనేయులు, కుమారి ధన్యశ్రీ, కుమారి నీరజలకు మెడల్స్ వచ్చాయి. వీరిలో ఒక్క త్రిపురాంజనేయులు తప్ప మిగతావాళ్ళంతా  వివిధ స్నాతకోత్సవాల్లో తీసుకున్నారు. త్రిపురాంజనేయులు మాత్రమే స్నాతకోత్సవంలో తీసుకోలేకపోయాడు. అతనికి అదేరోజు యూజిసి ఫెలోషిప్ ప్రవేశ పరీక్ష కోసం స్నాతకోత్సవానికి రాలేకపోయాడు. అతనికి మా నాన్నగారి గోల్డ్ మెడల్ తో పాటు మరో మూడు గోల్డ్ మెడల్స్ వచ్చాయి. అయినప్పటికీ యూజిసి ఫెలోషిప్ పరీక్ష కావడం వల్ల స్నాతకోత్సవానికి హాజరు కాలేకపోయాడు. అయినా వాటిని తర్వాత యూనివర్సిటీ ఆఫీసులో తీసుకోవచ్చు.

ఆచార్య అశుతోష్ శర్మగారి నుండి గోల్డ్ మెడల్ అందుకుంటున్న భూమయ్య


భూమయ్యను అభినందిస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 

శ్రీ సాకే శ్రీహరిమూర్తి: మీ సంస్థ సభ్యులు, వారి వివరాలు చెప్పండి?

ఆచార్య దార్ల: ఈ ట్రస్ట్ కి నేను చైర్మన్ గాను, మా తమ్ముడు డా. దార్ల రవికుమార్ ప్రధానకార్యదర్శిగాను, ఇతర కార్య వర్గంగా మా కుటుంబసబ్యులు దార్ల సామ్యూల్, దార్ల సత్యనారాయణ, దార్ల విజయకుమారి, దార్ల సుధీర్ కుమార్, దార్ల మురళీమనోహర్, డా.దార్ల మంజుశ్రీ తదితరులంతా సభ్యులుగానే ఉన్నారు.

ఆచార్య దార్ల: మా నాన్నగారు 2009లో మరణించారు. ఆయన మరణించిన తర్వాత మా యూనివర్సిటిలో ఆయన పేరుతో ఏదైనా చేయాలనిపించింది. ఆ విధంగా  అప్పటి వైస్ ఛాన్సలర్ ఆచార్య అప్పారావు పొదిలె గారి సహకారంతో మా నాన్నగారి పేరుతో ఒక గోల్డ్ మెడల్ పెట్టారు.  

 శ్రీసాకే శ్రీహరి మూర్తి: మీ సంస్థ ప్రభుత్వశాఖలతో కూడా పనిచేసే ఆలోచన ఏమైనా ఉందా?

మేము వ్యక్తిగతంగా ఏవీ చెయ్యడం లేదు. మా ఆలోచనల్ని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సెంట్రల్ యూనివర్సిటి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలోని  జిల్లా ప్రజా పరిషత్ ఉన్నతపాఠశాల, తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ డిగ్రీకళాశాలల్లోనే ఈ మెడల్స్, నగదు బహుమతులు ఇస్తున్నాం. కానీ, మేము ప్రభుత్వం నుండి ఒక్కపైసా కూడా ఆశించడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాకు విద్య నిచ్చాయి. ఉద్యోగాలు ఇచ్చాయి. మాకు గొప్ప జీవితాల్నిచ్చాయి. అందువల్ల మా నాన్నగారనే వారు. ‘‘ తీసుకోవడమే కాదు, ఇవ్వడం కూడా నేర్చుకోవాలి. దానిలోని తృప్తిని రుచి చూడాలి. మనం ఇస్తుంటే, మనకేమి కావాలో అన్నీ వస్తాయి. ఇవ్వాలంటే అంత ధనవంతులవ్వాలనేమీ లేదు. ఎంత చెట్టుకి అంతగాలి.’’ అనేవారు. అందుకే మానాన్న నాకొక ఫిలాసఫర్ గా కనిపిస్తుంటారంటాను.  మా నాన్నగారి ఆశయమే, మా ఆశయం కూడా. మాకీ జీవితాన్నిచ్చినందుకు మేము కూడా మా నాన్నగారి పేరుతో ఏదొకటి చేయాలనుకున్నాం.  మేమిప్పు చేసేది ఉడతాభక్తి సహాయం లాంటిది. భవిష్యత్తులో అన్నీ సవ్యంగా సహకరిస్తే అనేకకార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం.

ఇంటర్వ్యూ: శ్రీసాకే శ్రీహరిమూర్తి, ప్రధాన సంపాదకులు, భూమిపుత్ర దినపత్రిక

ప్రచురణ పొందిన తేది: 04.10.2022, పుట:2

 

శ్రీదార్ల అబ్బాయి మెమోరియల్ గోల్డ్ మెడల్ విజేతల అభిప్రాయాలు.

శ్రీ దార్ల అబ్బాయి మెమోరియల్ గోల్డ్ మెడల్ పొందిన వారు భూమిపుత్ర దినపత్రికతో మాట్లాడుతూ తమ అభిప్రాయాన్నిలా తెలిపారు.


యు.త్రిపురాంజనేయులు అభిప్రాయం

‘‘యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో చదవడం చాలా మంది విద్యార్ధుల కల. ఆ కలను సాకారం చేసుకోవడానికి ఎక్కడో మారు మూల గ్రామంలో పుట్టి మాతృశ్రీ ఓరియంటల్ కాలేజ్ లో డిగ్రీ పూర్తి చేసి,రాజమండ్రి ట్రైనింగ్ కళాశాలలో ట్రైనింగ్ పూర్తి చేసి,తరువాత యూనివర్సిటీ వాళ్ళు నిర్వహించే పి.జీ.ఎంట్రెన్స్ పరీక్షలో "రెండవ ర్యాంక్ "తో నా ప్రతిభ కనబరిచి పీ. జీ లో చేరాను. అక్కడ మా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ సూచనలతో, సలహాలతో,నా మనస్సుకు బాగా దగ్గరైనా మా గురువు గారు ప్రొఫెసర్ దార్ల. వెంకటేశ్వర రావు గారి నిరంతర ప్రోత్సాహంతో ఎం.ఏ లో కూడా యూనివర్సిటీ టాపర్ గా(9.7 CGPA) నిలిచాను. నాలాంటి ఎందరో విద్యార్ధులను తీర్చి దిద్దుతూ,యూనివర్సిటీ టాపర్ గా నిలిచిన విద్యార్థులకు తన తండ్రి పేరు మీద ప్రతి సవంత్సరం "శ్రీ దార్ల అబ్బాయి మెమోరియల్ గోల్డ్ మెడల్" బహుమతి ప్రదానం చేస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారి కృషి అమోఘం,అనిర్వచనీయం. ఆ గోల్డ్ మెడల్ 2019-2021 సంవత్సరానికి నాకు రావటం జరిగింది. ఆ గోల్డ్ మెడల్ అందుకున్న నేను నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ఆ గోల్డ్ మెడల్ వచ్చి నా బాధ్యతను మరింతగా పెంచింది. ఎవరికి దక్కని అదృష్టం నాకు దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నాకు పదవ తరగతి నుండి, పీజీ వరకు విద్యా బుద్ధులు నేర్పిన గురువులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చిన్నతనం నుంచి నన్ను చదువుకునేందుకు ప్రోత్సహిస్తున్న నా "తల్లిదండ్రులకు "ఈ శుభ సందర్బంగా నా నమస్సుమాంజలి’’ -యు.త్రిపురాంజనేయులు

................................................................................................................................................... 

గుత్తా ధన్యశ్రీ అభిప్రాయం:

‘గోల్డ్ మెడల్స్ సాధించాలి అనే కలని నేడు నిజం చేసుకున్నాను... చాలా ఆనందంగా ఉంది. ఈ మెడల్స్ ని డొనేట్ చేసిన వారికి కృత్ఞతలు తెలుపుతున్నాను... హైదరాబాద్ విశ్వవిద్యాలయం లో చదవడం నాకు  ఎంతో అదృష్టం. అందులో గోల్డ్ మెడల్స్ సాధించడం వల్ల మరింత సంతోషిస్తున్నాను.  గోల్డ్ మెడల్స్ వచ్చిన తర్వాత నేను మరింత బాధ్యతగా ఉండాలని కూడా అనిపిస్తుంది.  ఈ సందర్భంగా ఉత్తమ విద్యా బోధనలను అందించిన మా ఆచార్యులకు నేను ఎల్లప్పుడూ ఋణపడి ఉంటాను. నేను కూడా భవిష్యత్తులో ఇలాగే గోల్డ్ మెడల్స్ ఇచ్చే స్థాయికి ఎదగాలని ఆకాంక్షింస్తున్నాను‘‘....

                                                                                                                                                                        గుత్తా ధన్యశ్రీ

...................................................................................................................................................

                                                                     నడింపల్లి నీరజ అభిప్రాయం

‘‘నాకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, తెలుగు శాఖ తరపున అలంకార శాస్త్రం మరియు సాహిత్య విమర్శ కోర్స్ లో భాగంగా "శ్రీ దార్ల వారి అబ్బాయి మెమోరియల్ మెడల్ "వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ మెడల్ ఇచ్చినందుకు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారికి మరియు తెలుగు శాఖ అధ్యాపక బృందానికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు.‘‘ - నడింపల్లి నీరజ

 ...................................................................................................................................................

 








No comments: