"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

03 August, 2022

ఆచార్య దార్ల ఆత్మకథ (నెమలి కన్నులు) -5 వ భాగం(భూమిపుత్ర దినపత్రిక, 3.8.2022 సౌజన్యంతో

 ఆచార్య దార్ల ఆత్మకథ -5

'నీకు తృప్తిగా తినిపించాలనుంది నాన్నా'

నాన్న రోజూ అనేక పనులు చేయడం చూసి నాకు ఆశ్చర్యం వేసేది. 

అవన్నీ ఎవరు నేర్పారనిపించేది. 

తెల్లవారితే ఒకరోజు పొలం పనికెళ్ళేవాడు. 

ఇంకోరోజు కొబ్బరికాయలు దింపుతీసేవాడు.

మరోరోజు తాటాకులు కొట్టడానికెళ్ళేవాడు. 

రోజు రోజుకీ కొత్తకొత్త పనుల్ని చేసేవాడు.

నాగలి దున్నేవాడు.

మూటలు మోసేవాడు.

చేపలు పట్టేవాడు.

చేపల వలను అల్లేవాడు. 

చేపల బుట్టల్ని కూడా తాటాకులతో తానే అల్లేవాడు. 

ఒక తాటాకు చెట్టుమీద నుండే ఆ చుట్టూ ఉండే రెండుమూడు చెట్లకున్న ఆకులన్నీ కొట్టేవాడు.

 కాసేపు భూమ్మీదే నిలబడలేకపోతున్నాం కదా.. 

నువ్వేంటి నాన్నాతాటిచెట్టుకి కాళ్ళు తన్నిబెట్టి కత్తిన స్వారీ తిప్పినట్లుఅక్కడే మాక్కావాల్సిన ముంజికాయల్ని కోసి కిందికి చక్కని నైపుణ్యంతో వేస్తున్నావనిపించేది.

 ముంజుకాయకొట్టడంలోను, దాన్ని కిందున్నమాకు అందించడంలోను ఎంతో నైపుణ్యాన్ని ప్రదర్శించేవాడు.

 నాన్న అక్కడ చెట్టుకిందున్నవాళ్ళందరికీ  చెట్టు మీద నుండే కిందికి ఆ తాటాకుల మీద పడేటట్లు వేస్తుంటే నాతో పాటు అందరూ ఆశ్చర్య పోయేవారు…..

 ‘‘అబ్బాయి...నీ దగ్గరున్నరహస్యమేంటో చెప్పు’’ అనేవారు.  నాన్నను మా ఊరిలో అంతా అబ్బాయనే పిలుస్తారు.

అంతేకాదు, కొబ్బరి చెట్లు అప్పుడప్పుడూ  తెగుళ్ళుసోకి చచ్చిపోతుంటాయి. వాటిని బాగుచేసేవాడు. చెట్టుపైకెక్కి మొవ్వు దగ్గర బాగా కోసేసి అక్కడేదే మందుపెట్టేవాడు. అంతే మళ్ళీ ఆ కొబ్బరి చెట్టు బ్రతికేసేది. 

ఇంకా నాన్న చేసే పనుల గురించి నేనొకసారిలా రాసుకున్నాను.

''నాన్నా...

సాయంత్రం చేపల బుట్ట పట్టుకొని నీవెనకాలే వచ్చేవాణ్ణి

నువ్వు గబగబా నడుస్తుంటే

నువ్వు గమనించేవాడివో లేదో గానీ

ఆ రంగరాజుకోడు కాల్వంతా నీ అడుగుల్తో పరవశించేది

ఆ కాల్వలో ప్రవహించే నీరు కూడా

 నీ స్పర్శతో పవిత్రమయ్యేది

ఆ గట్టునుండే ముళ్లన్నీ 

నీ అడుగుల కింద మెత్తని పువ్వుల్లా మారిపోయేవి

నువ్వేమీ వాటిని గమనించేవాడివి కాదు

ఆ తెల్లని పువ్వుల బుగ్గలప్పుడప్పుడూ సిగ్గుతో ఎర్రబడేవి

చేదిపరిగలు, కొర్రమేనులు, కట్టిచేపలు, మీసం మెలేసే పెద్దరొయ్యలు...

విషం ముళ్ళతో గుచ్చాలనుకునే ఇంగిలాలు

నీ చేతుల్లోపడేసరికే దొందుల్లాగో, బొమ్మిడాల్లోగో మారిపోయేవి.

నాన్నా…

ఆ గుర్రపుడెక్కవెనకాలే కట్లపాములు, జెర్రికట్లు కాసుక్కుర్చున్నా

నీ ముందవన్నీ బురదపాములయ్యేవి కదా...

నీ వల్లో పడీ 

బయటకిరాలేక 

చేతిని కాటేయాలని చూసే గొరకలు, జెల్లలూ

ఇన్నిరకాలు... ఎన్నెన్ని రకాలు... 

ఇవన్నీ ఒక్కటీ కనిపించడం లేదు నాన్నా

చేలల్లో మందులు కొట్టడం వల్లనేమో 

అన్నీ హరించిపోయాయి.

నాన్నా...

వరదలు, తుఫానులు వస్తుంటే టీ.వీ.దగ్గరుండి భయపడుతున్న నేనేనా

నీ దగ్గర కేరింతలు కొడుతూ

నీ వల్లో పడిన శిలావతుల్ని,

బొచ్చుల్ని ఏరింది నేనేనా అనిపిస్తుంది నాన్నా...

కొద్దిపాటి వర్షానికే మాకిప్పుడు గొడుగులు...

నాన్నా… 

నీమీద వర్షం పడినా ఏమనిపించేది కాదా

గోనెసంచినో, ప్లాస్టిక్ కవర్నో తలకి చుట్టుకుని...

అవున్నాయో లేదో తెలియకుండానే

రంగరాజు వంతెన కాల్వ దగ్గర ఎగిసిపడే ఆ కెరటాల్లోకి

ఒక సవాలు విసిరినట్లు నువ్వు వలవిసిరేవాడివి కదా

నాన్నా 

నాకిప్పుడు నువ్వు వలేసి పట్టిన ఆ తాజా చేపల్ని

అమ్మ ఆ వర్షంలోనే అమ్మేది కదా

దాన్నిప్పుడు వండి నీకు తృప్తిగా తినిపించాలనుంది నాన్నా’’

మంచి చేపలు పడితే వాటిని అమ్మేసేది. చిన్నచిన్న చేపల్ని మనం తిందామని అమ్మ అనేది. నాకేమో ఆ పెద్దచేపలు మనమే ఎందుకు వండుకోకూడదనిపించేది. కానీ, అవి అమ్మితే డబ్బులు వస్తాయని, చిన్నచేపలయితే తక్కువ డబ్బులు వస్తాయని చెప్పేది. అయినా సరే మనమే మంచివి తిందామని మారాం చేసేవాణ్ణి. 



అందరికీ వర్షం వస్తే ఇంటిలో ఉండొచ్చు. కానీ మాకు వర్షం వస్తే, వరదలొస్తే ఆ నీళ్ళలో చేపలు బాగా దొరుకుతాయనే ఆశ. కాబట్టి. మేమా నీళ్ళలోనే తడిసేవాళ్ళం. హోరున వర్షం కురుస్తుంటే నాన్న ప్లాస్టిక్ సంచిని తలకు చుట్టుకొని కాల్వలో వలేసి చేపలు పట్టుకొనేవాడు. నాకు లేదా మా అన్నయ్య, తమ్ముడు ... ఎవరు నాన్న కూడా వచ్చినా మేము గోనెసంచులు తలమీద వేసుకొని వలలో పడే చేపలు మా బట్టలో వేసుకొనేవాళ్ళం. అలా నాన్నతో పాటు మేము కూడా తడిసిపోయేవాళ్ళం. అలా తడుస్తూనే కొన్ని గంటలపాటు ఆ చేపలు కోసం ఎదురుచూసేవాళ్ళం. ఒక్కోసారి నాన్న కాళ్ళు బాగా మెత్తబడిపోయి, తెల్లగా అయిపోయి, ఏదైనా గుచ్చుకుంటే తెలిసేదే కాదు. అంత కష్టమైనా నాకెందుకో నాన్నతో ఉండి ఆ వలలో పడిన చేపల్ని, అలా ఎగిరెగిరి పడుతున్న చేపల్ని బుట్టలోనో, తట్టలోనో వేయాలని తెగ సరదాగా అనిపించేది. రాత్రికి జలుబు, జ్వరం వచ్చేస్తే అమ్మా నాన్న పసుపు వేసి వేణ్ణీళ్ళతో ఆవిరిపట్టేవారు. అప్పుడు తలకు ముసుగువేస్తే, దానిలో దూరాలని కూడా బలే ఆరాటపడేవాణ్ణి. పిల్లోడు బాగా తడిసిపోయాడు. జలుబు చేసేస్తుంది. తల బాగా నిమురని  గుడ్డతో తల నుసుముతుంటే, నాకు జలుబు మాటెలాగున్నాగాని, అమ్మా, నాన్న మాకోసం చూపిస్తున్న అనురాగానికి మురిసిపోతూ ’నాకేమీ కాదమ్మా... మీరున్నారు కదా’ అనేవాణ్ణి. అంతే మా అమ్మా, నాన్న కళ్ళల్లో కన్నీళ్ళు. అమాంతంగా ఒళ్ళోకి దగ్గరకు తీసేసుకొనేవారు. అప్పుడు నాకు బలే సంతోషం అనిపించేది. అమ్మా, నాన్న ముఖంలో అది ఆనందమో, దు:ఖమో, విషాదమో అన్నీ ముప్పేటగా అనిపించేవి.

(సశేషం)

--ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, తెలుగుశాఖ అధ్యక్షులు, సెంట్రల్ యూనివర్సిటి, హైదరాబాద్. 

 

 

 


No comments: